మా ఇంటికి వచ్చిన పాలతన్ని మావయ్య అని పిలిచే వాళ్లం. నాకు పెద్దయ్యే వరకు ఆయన పేరే తెలియదు. పాల మావయ్య వచ్చాడనే అనేవాళ్లం. అతనే కాదు... ఊళ్లో అందరినీ ఏదో వరుసతో ఆప్యాయంగా పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు చాలా దగ్గర బంధువులు కూడా మనకు పెద్దయ్యాకే పరిచయం అవుతున్నారు. పిల్లలెప్పుడూ పరీక్షల గురించి వారి టెన్షన్ల గురించి ఆలోచిస్తున్నారు. దీంతో పిల్లల్లో టెన్షన్స్ తప్ప ఎమోషన్స్ లేవు. బంధువులను కలవడం అరుదై పోయింది. అందరూ ఒకచోట కలవాలంటే పెళ్లి వంటి పెద్ద శుభ కార్యమేదో జరగాలి. ఇక చీటికీ మాటికీ వచ్చే పరీక్షలు ఆ పెళ్లిళ్లకెళ్లేందుకు ఎప్పుడూ అడ్డుగానే ఉంటాయి. పొరపాటున వేడకలకు వెళ్లినా అక్కడ పిల్లలకు ఎవరు ఎవరనేది చెప్పాలి. ఇంతకంటే దుర్భరం ఏమైనా ఉంటుందా! బంధువుల గురించి, బంధాల గురించి జీవితాల గురించి పిల్లలతో చర్చించాలి. పురాణాలు, ఇతిహాసాలు మనకు చదువు కోవడం ద్వారా తెలియలేదు. ఒక తరం నుంచి ఒక తరానికి చెప్పుకోవడం వల్ల తెలిశాయి. ఇప్పుడు తల్లిదండ్రులు- పిల్లలు ఎవరు బిజీలో వారున్నారు. చదువులు జీవితంలో భాగంగా లేవు. అవే జీవితం అయిపోయాయి. విచిత్రం ఏంటంటే.. పిల్లలకు- తల్లిదండ్రులకు మధ్య ఇంతకుముందు భయంతో కూడిన దూరం ఉండేది. ఇప్పుడా స్థానంలో ప్రేమ వచ్చింది. ఇది మంచి పరిణామం. కానీ, వారు తల్లిదండ్రులను డిక్టేట్ చేయడానికి, డిమాండ్ చేయడానికి ఆ ప్రేమను ఉపయోగిస్తున్నారు. స్వేచ్ఛ ఇవ్వడమంటే వారేం చెప్పినా వినడం, వారేం చేసినా ఊరుకోవడం కాదు. వారు జీవితమంటే ఏంటో తెలుసుకుంటూ పెరిగేలా చూడటం, తప్పొప్పుల తేడా అర్థం చేసు కుంటూ స్వయంనియంత్రణ అలవాటు చేసుకునేలా చూడటం. ఇప్పుడెంతమంది బామ్మ, తాతయ్యలు మన ఇంట్లోనే ఉంటున్నారు? ఎంతమంది వాళ్ల కళ్ల ముందే పెరిగి పెద్దవుతున్నారు? పల్లెను వదిలేయడం, పట్టణాలకు పోవడం వల్ల సంస్కృతెప్పుడూ నాశనం కాదు. పట్నం రంగు మనం పూసుకోవడం వల్ల మనలో పల్లెతనం, సంస్కృతి పాడవుతుంది. వార సత్వంగా వచ్చిన కట్టూబొట్టును దూరం పెడుతున్నాం. కొత్తదాని మీద మోజు సహజం. కానీ పాతదాని మీద రోత ఎందుకు? ఇంట్లో తల్లిదండ్రులే పిల్లలకు మొట్టమొదటి గురువులు, రోల్‌మోడల్స్. కానీ, వాళ్లేం నేర్పుతున్నారు? పిల్లలను స్కూలుకి, ట్యూషన్లకని తెల్లారుజామున ఐదారు గంటలకే లేపి పంపుతున్నారు. వీళ్లేమో తొమ్మిది గంటలకు నోట్లో బ్రష్ పెడుతున్నారు. మా నాన్నగారు తొంభై రెండేళ్ల వయసులో ఈమధ్యనే పోయారు. నేను ఆయనలా బతకలేకపోయాను. ఏ కాలమైనా సరే, తెల్లవారుజామునే నిద్ర లేచి చన్నీటితో స్నానం చేసి లాల్చీపంచె కట్టుకుని దేవుడికి నమస్కారం చేసుకునే వారాయన. ఆ తర్వాత బయట కూర్చుని పేపరు చదువుకునే వారు. ఆయనలో ఏనాడూ బద్ధకం చూడలేదు. మొక్క నిటారుగా పెరగడానికి కర్రను ఊతంగా కడతాం. ఇంట్లో తల్లి దండ్రులు, స్కూల్లో టీచరు, కాలేజీలో లెక్చరరు పిల్లల జీవితం క్రమశిక్షణగా ఎదగడానికి ఊతంగా ఉండాలి. అంతేగాని, ఎవరు పని వారు యంత్రాల్లా చేసుకుంటూ పోతే సరిపోదు. ఈ మార్పు బంధాల్లోనే కాదు, అన్నింట్లో వచ్చింది. తినే తిండిలో, కాలక్షేపంలో, వ్యాపకాల్లో, డ్రెస్సులో... మా సినిమాల్లో కూడా! ఒకప్పుడు డెరైక్టరు కీలకం. ఇప్పుడు హీరో కీలకం. అప్పట్లో ఒక్క అవకాశం కోసం స్టూడియోలు, నిర్మాతలు- దర్శకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగేవాళ్లం. అదృష్టం ఉంటే, వారి కంట్లో మనం పడితే, వారి సినిమాలో మనకు సరిపోయే పాత్ర ఉంటే ఎప్పటికో అవకాశం దక్కేది. ఇప్పుడు అందరూ సినిమాలు తీసేస్తు న్నారు. పదిమంది మిత్రులు కలిసి ఓ 5డి కెమెరా కొనుక్కునో, అద్దెకు తీసుకునో... ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా తీసేస్తున్నారు. అవకాశాల కోసం స్ట్రగుల్ లేదు. ఇదీ టెక్నాలజీ పుణ్యమే! ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు డబ్బులు సంపాదించడం పెద్ద విషయం కాదు, విలువలతో బతకడం, ప్రశాంతంగా బతకడం, మన మనుషుల మధ్య బతకడమే పెద్ద విషయం!! -సంభాషణ: ప్రకాష్ చిమ్మల |
Pages
▼
No comments:
Post a Comment