ఒకసారి పూలమొక్కలన్నీ కొబ్బరిచెట్టును చూస్తూ, ‘‘ఎంత పెద్ద చెట్టు! ఆకాశానికి నిచ్చెనలా ఉంది. తన కాయల తోటి అందరి దాహాన్నీ తీరుస్తుంది. అందుకేనేమో, మన యజమాని దృష్టంతా ఆ చెట్టు మీదే ఉంటుంది’’ అని చర్చించుకోసాగాయి. కొబ్బరిచెట్టు ఆ మాటలు విన్నది. వెంటనే వాటితో, ‘‘అదేమీ లేదు మిత్రులారా! మీరు కూడా తక్కువేమీ కాదు. చిన్నవయసులోనే మంచి పుష్పాలను ఇస్తున్నారు. మీ పువ్వుల పరిమళం నాకే కాదు, ఈ లోకానికే ఎంతో ఆనందాన్నిస్తుంది’’ అన్నది ఎంతో ఆప్యాయంగా. ఆ మాటలు వాటికి సంతృప్తినివ్వలేదు. ఇంతలో ఆ ఇంటి ఇల్లాలు గుడికి వెళ్లటానికి ఒక పళ్లెంలో కొబ్బరికాయ, కర్పూరం మొదలైనవాటిని తీసుకొని పెరట్లోకి వచ్చింది. కొన్ని పూలను కోసుకుని, గుడికి వెళ్లిపోయింది. అప్పుడు కొబ్బరిచెట్టు, ‘‘చూశారా, ఆ ఇల్లాలు గుడికెళుతూ నా కాయని, మీ పువ్వులను తీసుకుపోయింది. గమనించారా?’’ అని అడిగింది. పూలమొక్కలు ముఖాలు చూసుకున్నాయి. ‘‘అవును సుమా! మేమిప్పుడే గ్రహించాం. ఈ లోకంలో ఎవరి ప్రాముఖ్యం వారికి. ఎవరూ తక్కువ కాదు’’ అంటూ ఆనందపడ్డాయి. వాటికి విషయం అర్థమైనందుకు కొబ్బరిచెట్టు కూడా ఎంతో సంతోషపడింది. నీతి: ఈ సృష్టిలో చిన్నా పెద్దా, ఎక్కువా తక్కువా అనే భేదం లేదు. ఎవరి ప్రాముఖ్యత వారిదే. ఎవరి గొప్పతనం వారిదే. - కొరబండి శ్రీనివాసరావు |
Pages
▼
No comments:
Post a Comment