నా వయసు 26. ఇటీవలే రెండోసారి
గర్భవతిని అయ్యాను. తొలిచూలులో బిడ్డకు సరిపడా పాలు పడలేదు. ఈసారి నాకు పాలు బాగా
ఉండాలంటే ఆయుర్వేదపరంగా తీసుకోవలసిన మందులను, ఆహారవిహారాలను సూచించండి.
-
మీనాక్షి, ఆదిలాబాద్
ఆరోగ్య పరిరక్షణకు మాతృస్తన్యమే గొప్పది. తల్లిపాలవల్ల బిడ్డల్లో రోగనిరోధకశక్తి
పెరగడంతో పాటు వాళ్లు పెద్దయ్యాక వచ్చే అనేకరకాల వ్యాధులు (డీజనరేటివ్ డిసీజెస్)
ఆలస్యం కావడం వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. బిడ్డకు ఏడాది వయసు వచ్చేవరకు స్తన్యం
ఇవ్వాలి. తల్లికి ఏడాదికి పైగా నిరంతరం పాలు పడుతూ ఉండాలంటే ఈ ప్రక్రియలను
ఆచరించండి.
ఆహారం: కాచి చల్లార్చిన నీరు
తాగాలి. రోజూ రెండులీటర్ల పాలు (ఆవుపాలు శ్రేష్ఠం) తాగాలి. ఉల్లి, వెల్లుల్లి,
బెల్లం, నువ్వులనూనె, తెలగపిండి, పచ్చిబొప్పాయి కూర, తాజా ఫలాలు పాలు పడటానికి
ఉపకరిస్తాయి.
విహారం: రాత్రిపూట కనీసం ఆరుగంటల
నిద్ర ఉండాలి. సంతోషంగా, ఉల్లాసంగా ఉండాలి. చింత, శోకం, భయం, నిరాశ వంటి మానసిక
ఉద్వేగాలు స్తన్యాన్ని తగ్గిస్తాయి. సంతోషభరితమైన సన్నివేశాలను, చిత్రాలను చూడటం,
ఆహ్లాదకరమైన సంగీతాన్ని ఆస్వాదించడం శ్రేయస్కరం. తేలికపాటి వ్యాయామం పాలు బాగా
పడటానికి ఉపకరిస్తుంది. ప్రసవమైన ఆరుగంటల తర్వాతనుంచి బిడ్డకు పట్టిస్తూ బిడ్డ
సరిగా పాలు తాగేలా అలవాటు చేయించాలి. దానివల్ల స్తన్యం బాగా ఉత్పత్తి అవుతుంది.
ఔషధం: శతావరీచూర్ణం: చెంచాడు చూర్ణాన్ని
అరకప్పు పాలల్లో శర్కరతో పాటు కలిపి, రెండుపూటలా ఖాళీకడుపున తాగాలి. (దీనిని
స్తన్యవర్థకంగా ప్రాచీనవైద్యులు చెప్పారు). ఇది ఎంతకాలమైనా వాడవచ్చు.
ఆరోగ్యవర్థనీవటి మాత్రలు: ఉదయం ఒకటి, రాత్రి ఒకటి భోజనం
తర్వాత.
దశమూలారిష్ట ద్రావకం: నాలుగు చెంచాల
మందుకు సమానంగా నీళ్లను కలిపి రెండు పూటలా తాగాలి. ఈ మాత్రలు, ద్రావకం బాలింతలందరూ
రెండు నెలలపాటు తప్పనిసరిగా తాగితే ప్రసూత వికారాలేవీ దరిచేరవు. స్తన్యవర్థనానికి
కూడా దోహదపడతాయి. వీలైతే చెంచా ఉసిరి కాయ రసాన్ని తేనెతో రోజుకొకసారి సేవిస్తే
మహిళల్లో అది స్తన్యవర్థకంగా, వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది.
No comments:
Post a Comment