ఆకు కోసమైనా మునగచెట్టెక్కాలి
ఏ కూర ఆకైనా చూడండి.పలుచగా, మృదువుగా, కోమలంగా ఉంటుంది.
లోపల మాత్రం... ఐరన్! ఇనుము!
ప్రతి రెండు మాటల తర్వాత డాక్టర్ చెప్పే మూడోమాట...
ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని.
ఆకులో అంత ఉంది.
మునగాకులో అయితే అంతకు అంతుంది!
కండరాలకు బలం, ఎముకలకు బలం.
రుచికి అమోఘం, ఒంటికి ఔషధం!
పప్పు, ఫ్రై, రసం, కర్రీ విత్ చికెన్... ఎంత టేస్ట్ అంటే...
ముందైతే డ్రమ్‌స్టిక్ ఆకుల్ని దూసుకురండి.
వానజల్లును చూస్తూ వండడం మొదలుపెట్టండి.
మునగాకు - చికెన్ గ్రేవీ కర్రీ
కావలసినవి
చికెన్ - 800 గ్రా., మునగాకు - 200 గ్రా, మసాలా పొడి - టేబుల్ స్పూను
ధనియాల పొడి - టేబుల్ స్పూను
కారం - టీ స్పూను, పచ్చిమిర్చి పేస్ట్ - టేబుల్ స్పూను, పసుపు - కొద్దిగా, ఉప్పు - తగినంత
నూనె - తగినంత, అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు - కొద్దిగా, ఉల్లితరుగు - కప్పు, చికెన్ స్టాక్ - 300 మి.లీ.
తయారి
చికెన్ శుభ్రం చేసి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ జతచేసి సుమారు గంటసేపు మ్యారినేట్ చేయాలి.
బాణలిలో నూనె కాగాక, ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
పచ్చిమిర్చి పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేయించాలి.
మ్యారినేట్ చేసిన చికెన్ జత చేసి బాగా ఉడికించాలి.
గరంమసాలా వేసి ఐదు నిముషాలు ఉడికించాలి.
చికెన్ స్టాక్ వేసి, మంట తగ్గించి, చికెన్ మెత్తగా అయ్యేవరకు అంటే సుమారు 20 నిముషాలు ఉడికించాలి.
మునగాకు జతచేసి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి.
చపాతీలలోకి గాని, అన్నంలోకి గాని రుచిగా ఉంటుంది.
బంగాళదుంప - మునగాకు ఫ్రై
కావలసినవి
బంగాళదుంపలు - 500 గ్రా.
మునగాకు - 500 గ్రా.
పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
పసుపు - చిటికెడు
అల్లం తరుగు - టీ స్పూను
వెల్లుల్లి రేకలు - 6
ఉప్పు - తగినంత
ధనియాలపొడి - టీ స్పూను
నూనె - 3 టేబుల్ స్పూన్లు
తయారి
బంగాళదుంపలను శుభ్రంచేసి పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేయాలి.
బాణలిలో నూనె కాగాక, జీల కర్ర, అల్లం తరుగు, వెల్లుల్లి రేకలు వేసి వేయించాలి.
బంగాళదుంప ముక్కలను జత చేసి మెత్తబడేవరకు వేయిం చాలి.
మసాలాపొడి, మునగాకు జత చేసి బాగా కలపాలి.
ధనియాలపొడి చల్లి బాగా కలిపి దించేయాలి.
మునగాకు రసం
కావలసినవి
కందిపప్పు - 200 గ్రా.
టొమాటో ముక్కలు - పావు కప్పు
చింతపండు - తగినంత, మిరియాలు - 6
ధనియాలు - టీ స్పూను, పచ్చిమిర్చి - 6
వెల్లుల్లి రేకలు - 8, నూనె - రెండు టీ స్పూన్లు
మునగాకు - 200 గ్రా.
రిఫైన్‌డ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి - 8, ఆవాలు - టేబుల్ స్పూను
జీలకర్ర - టేబుల్ స్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు
పసుపు - కొద్దిగా, ఉప్పు - తగినంత
మినప్పప్పు - 100 గ్రా., కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారి
ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, టొమాటో ముక్కలు జతచేసి, కుకర్‌లో మెత్తగా ఉడికించాలి.
చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచుకోవాలి.
మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి.
బాణలిలో నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వరసగా వేసి వేయించాలి.
మునగాకు జతచేసి, ఉడికించిన పప్పు, ఉప్పు, నీరు పోసి మూడు నాలుగు నిముషాలు ఉడికించాలి.
చింతపండు రసం, పసుపు వేసి బాగా మరిగించాలి.
కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి.
మునగాకు ఫ్రై
కావలసినవి
మునగాకు - అర కేజీ
ధనియాల పొడి - టీ స్పూను
వేయించిన పల్లీలు - టీ స్పూను
వేయించిన నువ్వులు - టీ స్పూను
పుట్నాలపప్పు - టీ స్పూను
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
ఉల్లితరుగు - అర కప్పు
ఎండుమిర్చి - 8, ఆవాలు - టేబుల్ స్పూన్
జీలకర్ర - టేబుల్ స్పూన్
మినప్పప్పు - మూడు టేబుల్ స్పూన్లు
శనగపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 6, పసుపు - కొద్దిగా
గరంమసాలా - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
తయారి
పల్లీలు, నువ్వులు, పుట్నాలపప్పు... వీటిని విడివిడిగా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
మునగాకును శుభ్రం చేసి బాగా కడగాలి.
బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి.
గరంమసాలా పొడి, మునగాకులు, పసుపు, వేసి వేయించాలి.
ఉప్పు, కొద్దిగా నీరు చిలకరించి, రెండు నిముషాలు ఉంచాలి.
చివరగా పల్లీలు, నువ్వులు, పుట్నాలపప్పు, ధనియాల... పొడులు వేసి బాగా కలిపి దించేయాలి.
మునగాకు పప్పు
కావలసినవి
పెసరపప్పు - 300 గ్రా.,
మునగాకు - 200 గ్రా.
టొమాటో తరుగు - పావు కప్పు
ఉల్లితరుగు - పావు కప్పు
పసుపు - కొద్దిగా
శనగపప్పు - టీ స్పూను
మినప్పప్పు - టీ స్పూను
ఇంగువ - చిటికెడు
ధనియాలపొడి - టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు
ఎండుమిర్చి - 2
ఆవాలు - టేబుల్ స్పూన్
జీలకర్ర - టేబుల్‌స్పూన్
రిఫైన్‌డ్ ఆయిల్ - 50 మి.లీ.
వెల్లుల్లి రేకలు - 10
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
తయారి
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి, పసుపు జత చేసి, తగినంత నీరు పోసి మెత్తగా ఉడికించాలి.
మునగ ఆకులను శుభ్రం చేసి బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి.
బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, జీలకర్ర కరివేపాకు వేసి వేయించాలి.
వెల్లుల్లి రేకలు, ఉల్లితరుగు, టొమాటో తరుగు, మునగ ఆకులు వేసి కొద్దిగా ఉడికించాలి.
ఉడికించిన పెసరపప్పు జతచేసి, తగినంత ఉప్పు, ధనియాలపొడి వేసి రెండు నిముషాలు ఉంచాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడి అన్నంతో సర్వ్ చేయాలి.
ఇదీ సంగతి...
హిమాలయాల దిగువ ప్రాంతంలో మునగ ఎక్కువగా పెరిగేదట.
అత్యధిక పోషకాలు కలిగిన కాయగూరల్లో మొదటిది మునగ.
మునగను అత్యధికంగా ఉపయోగించే రాష్ట్రం తమిళనాడు. ప్రపంచంలోకెల్లా మునగను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియా.
మునగాకుకి నీటిని పరిశుభ్రం చేసే లక్షణం ఉంది పాము కాటుకి యాంటీసెప్టిక్‌గా వాడతారు. నోరు, గొంతు, చిగుళ్లలో నొప్పిగా ఉన్నప్పుడు మునగాకు రసంతో పుక్కిలిస్తే ఉపశమనంగా ఉంటుంది లేత మునగాకు తో వండిన కూర తింటే, కడుపులోని నులిపురుగు వంటివి నశిస్తాయి
మునగ వేళ్ల రసాన్ని... దెబ్బ తగిలినప్పుడు కలిగే వాపుల మీద పూస్తే, వాపులు తగ్గుతాయి ఫిట్స్, తల తిరగడం, నరాలబలహీనత, అజీర్తి... వంటి వ్యాధులకు మునగ మంచి ఔషధంగా పనిచేస్తుంది.