all

Friday, December 28, 2012

అందమె ఆనందం

 
కప్పుడు కొబ్బరినూనె , టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు... ఈ మూడింటినీ కలిపి బియ్యం ముదురు గోధుమరంగులోకి వచ్చేవరకు మరిగించి, దించి, చల్లారనివ్వాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెను వేడి చేసి, తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మృదువుగా అవడమే కాకుండా, రాలడం సమస్య తగ్గుతుంది

గతంలో చేసిన తప్పులను దిద్దుకునేందుకు భగవంతుడు ఇచ్చే మరో అవకాశమే భవిష్యత్తు.


తరచూ కళ్లు తిరుగుతున్నాయి..?----డాక్టర్‌ని అడగండి - ఇ.ఎన్.టి.

 
 
నా వయసు 46. నాకు మాటిమాటికీ కళ్లు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు కింద పడిపోతున్నాను. పక్కకు వంగినప్పుడు లేదా తల పైకి ఎత్తినప్పుడు ఇలా జరుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. అన్నీ బాగానే ఉన్నాయన్నారు. అప్పుడప్పుడూ తల కూడా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పవలసిందిగా కోరుతున్నాను.
- వి.మధు, ఏలూరు


మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవి లోపలిభాగంలో వినికిడిని, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో ఓటోలిత్ అనే కణాలు, హెయిర్‌సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన, క్లినికల్ పరీక్షలు చేయించుకోండి.

కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్‌టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్నిరకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది.

నా వయసు 24. నేను మాట్లాడుతుంటే నత్తి వస్తోంది. వేగంగా మాట్లాడటం కష్టమవుతోంది. మా నాన్నకు కూడా ఈ సమస్య ఉంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక బాధపడుతున్నాను. నా సమస్యకు తగిన సలహా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.
- కె.ప్రకాష్, నిజామాబాద్


మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. దీనికి గల ముఖ్య కారణాల్లో జన్యుపరమైన అంశం ప్రధానమైనది. మీరు మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోవడానికి మొదట అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించవలసి ఉంటుంది. అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది.

మీరు దీని గురించి మానసికంగా బాధపడితే ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషించండి. స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల నుంచి కౌన్సెలింగ్ తీసుకుని వారు చెప్పినట్లుగా ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు.

డాక్టర్ ఇ.సి. వినయకుమార్
సీనియర్ ఇఎన్‌టి నిపుణులు, సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్
ఇంపెయిర్డ్ (సాహి), అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్

పెద్దబాలశిక్షకు పెద్దచరిత్రే ఉంది!---సందర్భం - ప్రపంచ తెలుగు మహాసభలు

 
 
సాంప్రదాయమైన తెలుగు విద్యాభ్యాసంలో ‘పెద్దబాలశిక్ష’ ఆది గ్రంథంలాంటిది. మహాభారతంలాగానే పెద్దబాలశిక్షను కూడా పద్దెనిమిది పర్వాలుగా విభజించారు. అందుకే దీనిని ‘బాలల విజ్ఞానసర్వస్వం’గా భావిస్తారు. పూర్వం ఆంధ్రదేశంలోని ప్రతి విద్యార్థి పెద్దబాలశిక్షతోనే చదువు ప్రారంభించేవారు. ఐదవ తరగతి పూర్తయ్యేసరికి పెద్దబాలశిక్ష కంఠపాఠమవ్వాలి. ఆంగ్లేయుల కాలంలో ఆంధ్రదేశంలోని అన్ని పాఠశాలల్లోను పెద్దబాలశిక్ష పాఠ్యాంశంగా ఉండేది.

నేపథ్యం...
ఆంగ్లేయుల దగ్గర రెవెన్యూ శాఖలో పనిచేస్తూన్న స్థానికుల కోసం, 1832లో ‘మేస్తర్ క్లూలో’ అనే తెల్లదొర ‘పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి’ అనే పండితుడి చేత ‘బాలశిక్ష’గ్రంథాన్ని రచింపచేశాడు. పిల్లలకు తేలికగా అర్థమవ్వాలనే లక్ష్యంతో ఈ పుస్తక రూపకల్పన జరిగింది. ఇది 1856 నాటికి 78 పుటలతో పుస్తక రూపంగా వెలువడింది. ఇటువంటి పుస్తకం కోసం ఎదురుచూస్తున్న తెలుగువారు దీనిని మనసారా అక్కున చేర్చుకున్నారు.

1865లో వెలువడిన 90 పుటల బాలశిక్షలో, పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలు, ఛందస్సు సంస్కృత శ్లోకాలు, భౌగోళిక విషయాలను చేర్చి, ‘‘బాలవివేక కల్పతరువు’’ గా రూపొందించారు. అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలో ఉన్న పుస్తకం పెద్దబాలశిక్షగా కొత్తపేరును సంతరించుకుంది. ఇందులో భాష, సంస్కృతులకు కావలసిన భాషా విషయాలు, అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, సరళమైన పదాలు, రెండుమూడు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు, నీతి వాక్యాలు, ప్రాసవాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ అందరూ తెలుసుకోదగ్గవీ, అప్పటివరకు తెలిసి ఉన్న చారిత్రక భౌగోళిక విజ్ఞాన సంబంధ విషయాలు... వీటన్నిటినీ ఈ పుస్తకం లో పుదూరువారు పొందుపరిచారు.

పుదూరి వారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916 లో వచ్చిన వావిళ్ల వారిది. భాషోద్ధారకులు వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి 1949 పరిష్కరణలో... ‘‘భారతదేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి, ఇట్టి (బాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను’’ అని చెప్పారు.

కొన్ని మార్పులు, చేర్పులతో ఎందరో ప్రచురణకర్తలు, ఎన్నో పండిత పరిష్కరణలతో నేటికీ వెలువడుతూనే ఉంది. పిల్లలకే కాకుండా పెద్దలకు సైతం తెలుగుదనాన్ని నేర్పి, చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్థ్యం పెద్దబాలశిక్షకు ఉంది. 1983లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడ చేర్చింది. పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్దబాలశిక్షను ‘గుణశీల పేటిక’ గా అభివర్ణించారు. నాటి నుంచి నేటివరకు పెద్ద బాలశిక్షను తెలుగువారంతా తమ మానసపుత్రికగా కాపాడుకుంటూనే ఉన్నారు. ఇంటింటా ఈ పుస్తకం ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నారు. తెలుగు సంవత్సరాలు, నక్షత్రాలు, రాశులు, చుట్టరికాలు, తిథులు, మాసాలు, ఋతువులు, వారాలు, అధిపతులు, సప్తద్వీపాలు, దశావతారాలు...వంటి అంశాలు ఇందులో ఉంటాయి.

ప్రస్తుతం తెలుగునాట పన్నెండు రకాలకు పైనే పెద్దబాలశిక్షలు లభిస్తున్నాయి. బుడ్డిగ సుబ్బరాయన్ రూపొదించిన ‘సురభి’ గాజుల సత్యనారాయణ ‘తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష’ విరివిగా లభిస్తున్నాయి. ఈనాటికీ ‘పెద్దబాలశిక్ష’ పేరుకు ఎంతో గౌరవం, ఆదరణ ఉన్నాయి. ‘పెద్దబాలశిక్ష’ వంటి పుస్తకం తెలుగువారి సొంతం. ఇది తెలుగుభాష గొప్పదనం, తెలుగుజాతి నిండుదనం, తెలుగువారి అదృష్టంగా భావించాలి. ప్రస్తుత ఈ పుస్తకం మూడు సంవత్సరాలలోపే 36 సార్లు ముద్రణ పొంది, రెండున్నర లక్షల ప్రతులు చెల్లాయి. పెద్దబాలశిక్ష పేరు చిరస్థాయిగా నిలిచితీరుతుంది.

- డా.పురాణపండ వైజయంతి

చాకోలైట్స్

 
మొదటి చూపులోనే మోము విప్పారుతుంది.
నాలుక ఆ రుచికి లొట్టలేస్తుంది.
రేపర్ విప్పుతుంటే... నాసికకు తగిలే ఆ స్మెల్ పెదవులపై స్మైల్‌ని అద్దుతుంది.
నోట్లో వేసుకోగానే...
కనులు అరమోడ్పులవుతాయి.
చల్లగా, తియ్యగా... కరిగిపోతూ చాకొలెట్...
జీవితం ఎంత అర్థవంతమైనదో చెప్పకనే చెబుతుంది.
నూతన సంవత్సరం వేడుకలలో చాకొలెట్స్ పంచుకోండి.
ఆ నవ్వుల వెలుగుల్లో ప్రేమలు పెంచుకోండి.


చాకొలెట్ వాల్‌నట్ పుడ్డింగ్

కావలసినవి
చాకొలెట్ చిప్స్ - కప్పు
కోకో పౌడర్ - 6 టేబుల్ స్పూన్లు
వాల్‌నట్స్ (తరగాలి) - అర కప్పు
మ్యారీ బిస్కెట్లు - 400 గ్రా.
పాలు - కప్పు
కండెన్స్‌డ్ మిల్క్ (మార్కెట్లో దొరుకుతుంది) - 250 ఎం.ఎల్
బటర్ - 100 గ్రా.
తేనె - 2 టేబుల్ స్పూన్లు

తయారి

బిస్కెట్లను చిన్న చిన్న ముక్కలు చేసి, ఒక గిన్నెలో వేయాలి. ఇందులో పాలు పోసి కలపాలి.

మరొక గిన్నెలో కండెన్స్‌డ్ మిల్క్, బటర్, తేనె, కోకో పౌడర్ వేసి కలపాలి. మందపాటి గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి, సాస్‌లా అయ్యేలా ఉడికించి, దించి, చల్లారనివ్వాలి. దీంట్లో బిస్కెట్‌మిశ్రమం, వాల్‌నట్స్ తరుగు, చాకొలెట్ చిప్స్, చాకొలెట్ సాస్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని కరిగించిన బటర్ లేదా నెయ్యి రాసిన కప్పుల్లో పోసి, పైన చాక్లెట్ ముక్కలు, వాల్‌నట్స్, కోన్‌లతో గార్నిష్ చేయాలి. ఇలా తయారుచేసుకున్న కప్పులను ఫ్రిజ్‌లో ఉంచాలి. మిశ్రమం గట్టిపడ్డాక బయటకు తీసి, సర్వ్ చేయాలి.

చాకో-ఆరెంజ్ టెర్నీ

కావలసినవి
కమలాపండ్లు (ఆరెంజ్) - 5 (చిన్నవి)
ఫ్రెష్ క్రీమ్ - కప్పు
డార్క్ లేదా మిల్క్ చాకొలెట్ - 500 గ్రా. (తరగాలి)
బాదంపప్పు - 100 గ్రా.

తయారి
సాస్‌పాన్‌లో క్రీమ్ వేసి వేడిచేసి, దించేయాలి. దీంట్లో చాకొలెట్ తరుగు వేసి కరిగించాలి. మిశ్రమం మృదువుగా అయ్యాక బాదంపప్పు పలుకులు వేసి, ప్లేట్‌లో ఆరెంజ్‌లను అమర్చి వాటిపైన స్పూన్‌తో నెమ్మదిగా పోయాలి. వీటిని గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి, సర్వ్ చేసుకోవాలి.

అంబ్రెల్లా చాకొలెట్

కావలసినవి
పాలపొడి, కోకో పౌడర్, బటర్, నట్స్

తయారి
పంచదార, పాలపొడి, కోకో పౌడర్ సమపాళ్లలో తీసుకోవాలి పాల పొడి, కోకోపౌడర్‌లను కలిపి జల్లించాలి.

వెడల్పాటి ప్లేట్‌కి తగినంత బటర్ రాయాలి.

ఫ్రైయింగ్ పాన్‌లో తగినన్ని నీళ్లు, పంచదార వేసి, లేత పాకం పట్టాలి. దీంట్లో పాలపొడి, కోకోపౌడర్ వేసి కలపాలి. దీంట్లో కొద్దిగా బటర్ వేసి, సువాసన వచ్చేదాకా ఉంచాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, స్టౌ ఆర్పేయాలి. బటర్ రాసిన ప్లేట్‌లో ఈ మిశ్రమం పోసి, నట్స్ వేసి, స్పూన్‌తో కలపాలి. కోన్‌షేప్ అచ్చుల లోపల బటర్ రాసి, కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని కూరి, చివర్లో వంకీలున్న ప్లాస్టిక్ పుల్లలను గుచ్చాలి. అన్నింటినీ ఇలా చేసుకున్న తర్వాత, ఫ్రిజ్‌లో పెట్టాలి. మిశ్రమం గట్టిపడ్డాక, అచ్చుల నుంచి చాకొలెట్‌లను బయటకు తీయాలి. వీటికి రంగు రంగుల ఫాయిల్ పేపర్స్ చుట్టి, అలంకరించాలి.

నట్ చాకొలెట్

కావలసినవి
పాలపొడి - 250 గ్రా, కోకో పౌడర్ - 250 గ్రా., బటర్ - తగినంత, నట్స్ - తగినన్ని

తయారి
పంచదార, పాల పొడి, కోకో పౌడర్‌లను సమపాళ్లలో తీసుకోవాలి పాల పొడి, కోకోపౌడర్‌లను కలిపి జల్లించాలి వెడల్పాటి ప్లేట్‌కి తగినంత బటర్ రాయాలి ఫ్రైయింగ్ పాన్‌లో తగినన్ని నీళ్లు, పంచదార వేసి వేడిచేయాలి. పంచదార కరిగి లేతపాకం వచ్చాక అందులో పాలపొడి, కోకోపౌడర్ వేసి కలపాలి. దీంట్లో కొద్దిగా బటర్ వేసి, సువాసన వచ్చేదాకా ఉంచాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, మంట తీసేయాలి. బటర్ రాసిన ప్లేట్‌లోకి ఈ మిశ్రమం పోసి, నట్స్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బటర్ రాసిన రకరకాల అచ్చుల్లో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. మిశ్రమం గట్టిపడ్డాక బయటకు తీయాలి. ఇలా చేసుకున్న చాకొలెట్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

చాకొలెట్ బాల్స్

కావలసినవి
డ్రై ఆప్రికాట్స్ - 125 గ్రా. (తరగాలి)
ఎండుద్రాక్ష (రైజిన్స్)- 1/3 కప్పు (తరగాలి)
ఎండుద్రాక్ష (సుల్తానాస్) - 1/3 కప్పు (తరగాలి)
నారింజ తొక్క తరుగు - 2 టీ స్పూన్లు
డార్క్ చాకొలెట్ తరుగు - 74 గ్రా.
డార్క్ చాకొలెట్ (అదనంగా) - 200, బటర్ - 75 గ్రా.

తయారి
ఒక గిన్నెలో ఆప్రికాట్, ఎండుద్రాక్ష (రైజిన్స్, సుల్తానాస్), నారింజ తొక్క తరుగు, డార్క్ చాకొలెట్ తరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని టీస్పూన్ పరిమాణంలో తీసుకొని బాల్స్‌లా చేయాలి. వీటిని డీప్ ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచాలి. అదనంగా తీసుకున్న 200 గ్రా.ల చాకొలెట్‌ను ముక్కలుగా చేయాలి. ఒక గిన్నెలో బటర్, చాకొలెట్ ముక్కలు వేయాలి. పాన్‌లో నీళ్లు పోసి, మరిగించి, ఆ నీటిలో ఈ గిన్నె ఉంచి బటర్‌ని కరిగించాలి. మిశ్రమం మృదువుగా అయ్యాక దించాలి. ఫ్రిజ్ నుంచి తీసిన ఫ్రూట్ బాల్స్‌ని చాకొలెట్ మిశ్రమంలో ముంచి, తీయాలి. ఆరాక సిల్వర్ ఫాయిల్‌తో ఒక్కో చాకొలెట్ బాల్‌ని చుట్టి, గాలి తగలని కంటెయినర్‌లో వేసి, ఫ్రిజ్‌లో పెట్టాలి. అవసరమైనప్పుడు చల్లగా సర్వ్ చేసుకోవాలి.

చాకొలెట్ చిట్కాలు...

పంచదార లేనివి, పంచదార తక్కువ ఉన్నవి, మధ్యస్తంగా ఉన్నవి, ఎక్కువ పంచదార ఉన్న వి... ఇలా చాకొలెట్స్‌లో 4 రకాలు ఉంటాయి.

రంపంలాంటి కత్తిని ఉపయోగిస్తే చాకొలెట్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరగడం సులువు.

చాక్లెట్ అంచు దగ్గర పైభాగంలో కత్తి పదునైన భాగాన్ని ఉంచి, మెల్లగా కిందకు అదుముతూ కట్ చేస్తే సమానంగా కట్ అవుతుంది.

చాకొలెట్ గిన్నెను స్టౌ మీద నేరుగా పెట్టకుండా, మరిగేనీళ్లలో పెట్టి కరిగించాలి. చాకొ లెట్‌ను కరిగించే గిన్నె తడిగా ఉండకూడదు.

చాకొలెట్‌ను ఫ్రిజ్ వంటి చల్లని, పొడి ప్రదేశంలో భద్రపరుచుకోవాలి.

కర్టెసీ: డా. స్వజన్,
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐటీటీఎమ్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, హైదరాబాద్


సేకరణ: నిర్మలారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి