all

Friday, December 28, 2012

పెద్దబాలశిక్షకు పెద్దచరిత్రే ఉంది!---సందర్భం - ప్రపంచ తెలుగు మహాసభలు

 
 
సాంప్రదాయమైన తెలుగు విద్యాభ్యాసంలో ‘పెద్దబాలశిక్ష’ ఆది గ్రంథంలాంటిది. మహాభారతంలాగానే పెద్దబాలశిక్షను కూడా పద్దెనిమిది పర్వాలుగా విభజించారు. అందుకే దీనిని ‘బాలల విజ్ఞానసర్వస్వం’గా భావిస్తారు. పూర్వం ఆంధ్రదేశంలోని ప్రతి విద్యార్థి పెద్దబాలశిక్షతోనే చదువు ప్రారంభించేవారు. ఐదవ తరగతి పూర్తయ్యేసరికి పెద్దబాలశిక్ష కంఠపాఠమవ్వాలి. ఆంగ్లేయుల కాలంలో ఆంధ్రదేశంలోని అన్ని పాఠశాలల్లోను పెద్దబాలశిక్ష పాఠ్యాంశంగా ఉండేది.

నేపథ్యం...
ఆంగ్లేయుల దగ్గర రెవెన్యూ శాఖలో పనిచేస్తూన్న స్థానికుల కోసం, 1832లో ‘మేస్తర్ క్లూలో’ అనే తెల్లదొర ‘పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి’ అనే పండితుడి చేత ‘బాలశిక్ష’గ్రంథాన్ని రచింపచేశాడు. పిల్లలకు తేలికగా అర్థమవ్వాలనే లక్ష్యంతో ఈ పుస్తక రూపకల్పన జరిగింది. ఇది 1856 నాటికి 78 పుటలతో పుస్తక రూపంగా వెలువడింది. ఇటువంటి పుస్తకం కోసం ఎదురుచూస్తున్న తెలుగువారు దీనిని మనసారా అక్కున చేర్చుకున్నారు.

1865లో వెలువడిన 90 పుటల బాలశిక్షలో, పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలు, ఛందస్సు సంస్కృత శ్లోకాలు, భౌగోళిక విషయాలను చేర్చి, ‘‘బాలవివేక కల్పతరువు’’ గా రూపొందించారు. అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలో ఉన్న పుస్తకం పెద్దబాలశిక్షగా కొత్తపేరును సంతరించుకుంది. ఇందులో భాష, సంస్కృతులకు కావలసిన భాషా విషయాలు, అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, సరళమైన పదాలు, రెండుమూడు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు, నీతి వాక్యాలు, ప్రాసవాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ అందరూ తెలుసుకోదగ్గవీ, అప్పటివరకు తెలిసి ఉన్న చారిత్రక భౌగోళిక విజ్ఞాన సంబంధ విషయాలు... వీటన్నిటినీ ఈ పుస్తకం లో పుదూరువారు పొందుపరిచారు.

పుదూరి వారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916 లో వచ్చిన వావిళ్ల వారిది. భాషోద్ధారకులు వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి 1949 పరిష్కరణలో... ‘‘భారతదేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి, ఇట్టి (బాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను’’ అని చెప్పారు.

కొన్ని మార్పులు, చేర్పులతో ఎందరో ప్రచురణకర్తలు, ఎన్నో పండిత పరిష్కరణలతో నేటికీ వెలువడుతూనే ఉంది. పిల్లలకే కాకుండా పెద్దలకు సైతం తెలుగుదనాన్ని నేర్పి, చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్థ్యం పెద్దబాలశిక్షకు ఉంది. 1983లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడ చేర్చింది. పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్దబాలశిక్షను ‘గుణశీల పేటిక’ గా అభివర్ణించారు. నాటి నుంచి నేటివరకు పెద్ద బాలశిక్షను తెలుగువారంతా తమ మానసపుత్రికగా కాపాడుకుంటూనే ఉన్నారు. ఇంటింటా ఈ పుస్తకం ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నారు. తెలుగు సంవత్సరాలు, నక్షత్రాలు, రాశులు, చుట్టరికాలు, తిథులు, మాసాలు, ఋతువులు, వారాలు, అధిపతులు, సప్తద్వీపాలు, దశావతారాలు...వంటి అంశాలు ఇందులో ఉంటాయి.

ప్రస్తుతం తెలుగునాట పన్నెండు రకాలకు పైనే పెద్దబాలశిక్షలు లభిస్తున్నాయి. బుడ్డిగ సుబ్బరాయన్ రూపొదించిన ‘సురభి’ గాజుల సత్యనారాయణ ‘తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష’ విరివిగా లభిస్తున్నాయి. ఈనాటికీ ‘పెద్దబాలశిక్ష’ పేరుకు ఎంతో గౌరవం, ఆదరణ ఉన్నాయి. ‘పెద్దబాలశిక్ష’ వంటి పుస్తకం తెలుగువారి సొంతం. ఇది తెలుగుభాష గొప్పదనం, తెలుగుజాతి నిండుదనం, తెలుగువారి అదృష్టంగా భావించాలి. ప్రస్తుత ఈ పుస్తకం మూడు సంవత్సరాలలోపే 36 సార్లు ముద్రణ పొంది, రెండున్నర లక్షల ప్రతులు చెల్లాయి. పెద్దబాలశిక్ష పేరు చిరస్థాయిగా నిలిచితీరుతుంది.

- డా.పురాణపండ వైజయంతి

No comments: