all

Thursday, July 11, 2013

దివ్యౌషధం కరక్కాయ


 
NewsListandDetails కరక్కాయలో చలువ చేసే గుణం ఉంది. పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది.

కరక్కాయ ముక్కలను నీళ్లలో నానపెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్లలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.

కరక్కాయ మలబద్దకాన్ని నిరాకరిస్తుంది. వాతాన్ని వారిస్తుంది. కరక్కా యను అరగదీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తలనొప్పి కళ్లమంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకొంటే చిగుళ్లు గట్టిపడి పంటి వ్యాధులు రావు.  పిప్పిపన్పు పోటు తగ్గుతుంది.

పోషకాహారంతో సుఖనిద్ర


NewsListandDetails ప్రపంచ యువతను పట్టిపీడిస్తున్న సమస్యలు రెండే రెండు. ఒకటి కొవ్వు. మరోటి డయాబెటీస్‌. ఈ రెండు సమస్యలు నేటి యువతను తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నాయి. చదువుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారి చదువుకు తగ్గట్టుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు కాళ్ల ముందు వచ్చి వాలుతున్నాయి. ఉద్యోగ శైలి వల్ల ఈ రెండు సమస్యలు చిన్న వయస్సులోనే ఉత్పన్నమవుతున్నాయి.

ఒకప్పుడు వారసత్వంతో సంక్రమించే వ్యాధులు ఇప్పుడు మన జీవన విధానంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వారికి వచ్చేస్తున్నాయి. దీంతో శాస్త్రవేత్తలు ఈ రెండు సమస్యలపై సుదీర్ఘమైన రీసెర్చ్‌ చేసి రెండు అతి సులువైన ఉపాయాలను కనుగొన్నారు.

కొమ్మలున్న కూరగాయలు, పళ్లు లాంటివి తీసుకోవడం వలన అవి శరీరంలోని అధికంగా ఉండే కొవు్వను కరిగిస్తాయట. మొక్కల్లోని ఫైటోస్టెరాల్‌ అనే అణువులు ఇందుకు బాగా దోహదపడతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే రోజుకు మనిషికి 8గంటల నిద్ర అత్యంత అవసరమని పేర్కొంటున్నారు. కానీ ఈ కాలంలో దాని రేషియో 6గంటలకు పడిపోయింది. అయితే వారాంతంలోనైనా తనివితీరా నిద్రపోయి ఈ రెండు గంటలలోటును పూడ్చుకోవాలని వారు సలహా ఇస్తున్నారు.

వారంలో ఆరు రోజుల్లో రోజుకు రెండు గంటల చొప్పున 12గంటల మైనస్‌ నిద్ర ఉంటుంది. ఈ 12 గంటలను పదిరోజుల్లో ఎప్పుడైనా ఫిట్‌ చేసుకోవాల్సిందేనంటున్నారు. అలా చేయడం వల్ల మనం షుగర్‌ వ్యాధి బారినపడే అవకాశమే లేదని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం తినాల్సినవి ప్యాక్‌ చేసుకోండి. హాలీడేస్‌ రోజుల్లో ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి గుర్రుగా నిద్రపోండి.

ఇలా బరువు తగ్గండి...


 
NewsListandDetails అధిక బరువు చాలా మందిని వేధించే సమస్య. అలాంటి వారు ఈ ఎనిమిది సూత్రాలు పాటించండి, శ్రమ లేకుండానే బరువు తగ్గిపోతారు అంటున్నారు పోషకాహార నిపుణులు.

- బరువు తగ్గాలనుకునేవారు వారానికి ఒక రోజు అన్ని పూటలూ భోజనానికి బదులుగా కూరగాయలూ, ఆకుకూరల సలాడ్‌ తీసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు, ఆ పోషకాలూ విటమిన్లతో చర్మానికి నిగారింపూ పెరుగుతుంది.

- తగిన చోటు, సమయం చూసుకుని కూర్చొనే భోంచేయాలి. దాంతో ఆహారాన్ని బాగా నములుతారు. ఫలితంగా  త్వరగా జీర్ణమవుతుంది.

- సాధ్యమైనంత చిన్న సైజు ప్లేటులో భోం చేస్తే మీకు తెలియకుండానే పూటకు కనీసం 250 కేలరీలైనా తగ్గించి తింటారు.

- నిద్రలేచిన గంటలోపే బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తి చేయడం మంచిది. ఆలస్యంగా తినడం వల్ల రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు కరుగుతుంది.

- రోజూ పాల ఉత్పత్తులు ఎంతో కొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్షియం కొవ్వుని కొంతమేరకు తగ్గించగలదు.

- వ్యాయామం చేసిన తర్వాత 30-60 నిమిషాల లోపు భోం చేయడం మేలు. కొత్తగా చేరే క్యాలరీలను శరీరం అలసిపోయినప్పుడు వెంటనే ఉపయోగించుకుంటుంది.

- భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మజాతిపండు తింటే బరువు తగ్గుతారని ఓ పరిశోధనలో వెల్లడైంది.

- వారంలో మూడు రోజులు గ్రుడ్లు, ఒక పూట చేప తినడం కూడా బరువు తగ్గిం చేందుకు ఉపయోగపడుతుంది.

ఆభరణాలే ఆరోగ్యం


 
NewsListandDetails మహిళలు బంగారు నగలు ధరించడం వల్ల కేవలం అందమే కాదు ఆరోగ్యపరంగా ఎంతో పరమార్థమున్నదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. అదేమిటో తెలుసుకుందాం.

వడ్డాణము: గర్భకోశము కదలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది.


ముక్కెర: దీన్ని ధరించటం వల్ల మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెబుతుంది. ముక్కెర ధరించటం వల్ల ముక్కుకొనపై ఏదోవిధంగా దృష్టి ఉంటుంది. అలా దృష్టి ఉండటం ధాన్యంలో ఒకభాగం. చెడు శ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కెర పవిత్రం చేస్తుంది.

కాలికి మెట్టెలు: గర్భకోశంలోనున్న నరాలకూ కాలివేళ్లలో ఉన్న నరాలకు సంబంధం ఉంది. దానితో పాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచుకోవడానికి కాలివేలికి రాపిడి ఉండాలి. నేలను తాకరాదు. కామాన్ని పెంచే నరాలు కుడికాలి వేళ్లలో ఉన్నాయి.

చంద్ర వంక: శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు. ఆ ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు.

కంఠానికి వేసుకునే హారాలు: హృదయంలో పరమాత్ముడున్నాడు. ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించటం. తెలిసీ తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది. బంగారం ధరించటం ద్వారా చెడు కలలు రాకపోవటమే కాదు. గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది. అలంకారానికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటాయి.

ఆలూతో ఆహా!


 
NewsListandDetails కూరగాయల్లో అతి సులువుగా దొరికేది బంగాళాదుంప. దీంతో ఎంచక్కగా అందాన్ని సంరక్షించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
- బంగాళదుంపల్ని ఉడకబెట్టి, చల్లారిన తరువాత మెత్తగా చేసి, కొన్ని స్పూన్ల పచ్చిపాలని కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే చర్మంపైన మృతకణాలు క్రమంగా పోతాయి.
ఈ మాస్క్‌ని వేసుకోవడం వల్ల మొటిమల సమస్య నుంచీ బయటపడొచ్చు. నల్లమచ్చలు బాధిస్తుంటే పచ్చి బంగాళాదుంపని తురిమి మెత్తగా చేసి మచ్చలపై పెట్టండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మచ్చలు మటుమాయమౌతాయి.
- ఒక బంగాళాదుంప ముక్కనీ, అదే సైజులో ఉన్న కీరదోస ముక్కనీ బాగా తురిమి రెంటినీ కలిపేయాలి. అందులో చెంచా వంటసోడా కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇది మంచి క్లెన్సర్‌లా పనిచేస్తుంది.
- బంగాళాదుంపని బాగా తురిమి ఒక వస్త్రంలో కట్టి, చివర్లు పట్టుకుని గట్టిగా శరీరానికి ఒత్తితే బంగాళాదుంప రసం బయటకి వస్తుంది. ఈ రసాన్ని మెడకీ, చేతులకీ రాసుకుంటే చర్మం మృదువుగా మారతాయి.

నేర్పడం కాదు, పిల్లల్నుంచి నేర్చుకోండి!(వివేకం)

 
     
ఒక శిశువు తమ జీవితంలోకి ప్రవేశించగానే, ఇక తాము బోధించే సమయం వచ్చిందని సామాన్యంగా తల్లిదండ్రులందరూ అనుకుంటారు. కాని ఒక పాపో, బాబో కొత్తగా వస్తున్నారంటే, మీరు మరచిపోయిన జీవితాన్ని తిరిగి నేర్చుకునే సమయం వచ్చిందని అర్థం.



ఒక వయసుకొచ్చాక, అంటే పెద్దవాళ్లైపోయాక, అందరూ చెక్కబొమ్మల్లాగా తయారైపోతారు. కానీ ఈ బుజ్జి వరాలమూట ఎప్పుడైతే ఈ భూమ్మీదకు వచ్చిందో, అప్పట్నుంచీ తెలీకుండానే నవ్వటం మొదలుపెడతారు. సోఫాల కింద పాపాయితో పాటు పాకుతారు. పాపాయి వల్లనే మీ జీవితం, జీవితంలాగా ఉంది. అంతేకాని మీ వల్ల కాదు. మిమ్మల్ని, మీ పాపాయిని పోల్చి చూడండి. 24 గంటల్లో, ఎవరు ఎక్కువ ఉల్లాసంగా ఉంటున్నారు? మీ పాపాయి, అవునా? మరి జీవితం గురించి ఎవరిని సంప్రదించాలి? మీ పాపాయిని. కాబట్టి, అది మీరు జీవితాన్ని నేర్చుకునే సమయం. జీవితాన్ని బోధించే సమయం కాదు.


మీ శిశువును మీరు పెంచే అవసరం లేదు. వారు తమంత తాముగా ఆనందపు మూటలు. మీ ప్రభావం మీ పిల్లల మీద పెద్దగా ఉండకూడదు. ఇది మాత్రం కచ్చితంగా చూసుకోండి. అలా అయితేనే వారు హాయిగా ఉంటారు. మీ పిల్లవాని చుట్టూ, ఒక ప్రేమపూర్వకమైన, సహాయపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించండి. ఇక వారు చక్కగా పెరుగుతారు. ఇది మీ తోటలో ఒక మొక్కను పెంచటం వంటిదే. వాతావరణం సరిగ్గా ఉండేటట్లు మీరు చూసుకుంటే చాలు. మొక్క తన సంపూర్ణ సామర్థ్యంతో పెరుగుతుంది. ప్రతిరోజూ, అదే పనిగా మీరు దాని జోలికి పోతూ ఉంటే గనుక, అది ఎదగనే ఎదగదు.


మీ పిల్లల్ని చక్కగా పెంచాలనుకుంటే, మీరు గుర్తించాల్సిన మొదటి విషయం, మీరు ఆనందంగా ఉండి తీరాలి. ప్రస్తుతం మీకే ఎలా ఆనందంగా ఉండాలో తెలియదు. ప్రతిరోజూ మీ ఇంట్లో ఆందోళన, కోపం, భయం, ఆదుర్దా, అసూయ ప్రదర్శన జరుగుతూ ఉంటే, పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. మీ పిల్లవాణ్ని చక్కగా పెంచాలనే ఉద్దేశం, మీకు నిజంగా ఉంటే, ముందు మీరు మీ తీరును మార్చుకోవాలి.

పిల్లవాణ్ని ప్రేమపూర్వకంగా పెంచటం అంటే, వాడికి ‘అడిగినదల్లా ఇవ్వటమే’ అని చాలామంది అనుకుంటారు. మీ పిల్లవాణ్ని బాగా గమనిస్తే, అడిగిందల్లా తెచ్చి ఇవ్వటం మూర్ఖత్వమే అని మీకు తెలుస్తుంది. మీరు చేయవలసిందంతా, ఇంట్లో ప్రేమపూర్వకమైన, సహాయ పూర్వకమైన వాతావరణాన్ని కల్పించటమే. అదొక్కటే మీ పని. ఈ ఒక్కటి కచ్చితంగా చూసుకోండి.

కోపంగా ఉండటం అంటే ఏమిటో, దీనంగా ఉండటం అంటే ఏమిటో, బాధపడటం అంటే ఏమిటో, మీ పిల్లలు ఎప్పటికీ చూడకూడదు. ఇల్లు ప్రేమతో, ఉల్లాసంతో నిండి ఉండేలా చూడండి. ఇక వారు మనోహరంగా పెరుగుతారు. ఆ వాతావరణాన్ని కల్పించటమే మీ పని. మీ అనవసరపు సోదినంతా వాళ్లకు బోధించటం కాదు. మీరు వాళ్ల జోలికి వెళ్లకుండా ఉండేలా కచ్చితంగా చూసుకుంటే చాలు. వాళ్లు చక్కగా ఉంటారు. ఎటువంటి పరిస్థితిలోనైనా వాళ్లు ఉల్లాసవంతంగా జీవించగలగాలి. ఆ రకంగా వాళ్లను పెంచండి. వాళ్లు పెరగవలసిన తీరు అదే. కాదా?

సమస్య - పరిష్కారం

పిల్లల్ని కనడం ఎంతో బాధ్యతాయుతమైన ప్రక్రియ అనిపిస్తోంది. నేను దానికి యోగ్యుడనేనా? ఎలా తెలుసుకోవడం?
- ఆర్.ప్రసాద్, కరీంనగర్

సద్గురు: పిల్లల్ని కనడం అంటే అది మీకూ, మీ భాగస్వామికీ సంబంధించిన విషయం మాత్రమే కాదు. మీరు తరువాతి తరం వ్యక్తులను తయారుచేస్తున్నట్లు కూడా. కాబట్టి అదో మహత్తరమైన బాధ్యత. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందనేది మీరు ఈ రోజు కంటున్న పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల కనడం అనేది యథాలాపంగానో, ప్రేమ లేకుండానో కాకూడదు.

పిల్లల్ని కనడమంటే అది మీకు కనీసం 20 ఏళ్ల ప్రణాళిక అని అర్థం చేసుకోవాలి. అంటే పిల్లలు బాగా రాణిస్తే 20 ఏళ్లు, లేకపోతే జీవితాంతపు ప్రణాళిక. మీరు 20 ఏళ్ల ప్రణాళిక స్వీకరించాలంటే కనీసం అంత సమయం దానికి కేటాయించాలి. కాలం గడుస్తున్నకొద్దీ మన ఆలోచనలూ, అభిప్రాయాలూ మారవచ్చు. అనేక అభిప్రాయబేధాలు, వ్యతిరేకతలూ, కష్టాలూ రావచ్చు. కాని మీరు ప్రణాళిక స్వీకరించారు కాబట్టి, దానికి బద్ధులై ఉండాలి.

పిల్లలు కావాలనుకున్నారు కాబట్టి ఈ మాత్రం పరిపక్వతా, నిబద్ధతా కలిగి ఉండాలి. ఎవరితోనో దెబ్బలాడి వెళ్లిపోయేవారైతే, ఎవరితోనో సరిపడక ఇల్లు వదిలి వెళ్లిపోయే రకం మీరైతే, మీరింకా చిన్నపిల్లలనే అర్థం. ఆ పరిస్థితులలో గనక మీరు ఉంటే మీరు పిల్లలు కావాలనుకోకూడదు. ఒక పిల్లవాడిని మరో పిల్లకాయను కనమనడం సబబు కాదు.
  

నాకే కనుక అంత శక్తి వస్తేనా..!(మనోగళం),,... బాబూమోహన్‌

 
     


ఇతరుల్లో మీకు నచ్చేది?
సహాయగుణం, అబద్ధాలు ఆడని తత్వం.

ఎదుటివారిలో నచ్చనిది?
స్వార్థపూరిత గుణం, ఎదుటివారి సొమ్ము కోసం ఆశపడే లక్షణం. అలాంటి వారు నాకు పురుగుల్లా కనిపిస్తారు.

మీలో మీకు నచ్చేది?
నా అన్న ఆలోచనను మనసులోకి రానివ్వను. వీలైనంతవరకూ నొప్పింపక తానొవ్వక అన్నట్టుగానే మెలుగుతాను.

మీలో మీకు నచ్చనిది?
ముక్కుసూటితనం. ఏం చెప్పాలన్నా నిర్మొహమాటంగా చెప్పేస్తాను. అలా అనకుండా ఉండాల్సిందే అని తర్వాత బాధపడతాను.

మీ ఊతపదం?
ప్రత్యేకంగా ఊతపదమంటూ ఏమీ లేదు. కానీ చిన్నవాళ్లు కనిపిస్తే తమ్ముడూ అని, పెద్దవాళ్లయితే అన్నా అని ఠక్కున అనేస్తాను. సార్ అన డం అస్సలు అలవాటు లేదు నాకు.

మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి?
ఎన్టీఆర్. చాలా సినిమాల్లో ఆయన పేదవాడికి న్యాయం చేయడం కోసం పోరాడే వ్యక్తిగానే నటించారు. అలాంటి వాటిని పనిగట్టుకుని ఎంచుకునేవారు. రాజకీయ నాయకుడిగా కూడా పేదల గురించే ఆలోచించారు.

ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా?
తలచుకుని బాధపడేంత తప్పులు నేనేమీ చేయలేదు.

అత్యంత సంతోషపడిన సందర్భం?
సత్య సాయిబాబాను, ఎన్టీఆర్‌ని కలవడం నా జీవితంలో నాకు ఎంతో సంతోషాన్నిచ్చిన సందర్భాలు. అయితే అంతకన్నా సంతోషాన్నిచ్చింది ఒకటుంది. మా కుటుంబంలో మగపిల్లలే ఎక్కువ. అన్నదమ్ములందరికీ మగపిల్లలే. కానీ ఈ మధ్యే ఒకరికి ఆడపిల్ల కలిగింది. ఇంటికి ఏదో కొత్త కాంతి వచ్చింది. అది నాకు చాలా చాలా సంతోషాన్నిచ్చింది.

మీ హృదయం గాయపడిన సందర్భం?
చిన్ననాడు నా తల్లి మరణించింది. జీవితంలో బాగా స్థిరపడి, పేరు తెచ్చుకుని, అంతా ప్రశాంతంగా ఉంది అనుకునే సమయంలో నా పెద్ద కొడుకు వెళ్లిపోయాడు. అమ్మ లేని వెలితికి కొన్నాళ్ల తర్వాత అలవాటు పడ్డాను. కానీ నా కొడుకు చనిపోయాక, ఈ జీవితమే ఇక వద్దనుకున్నాను.

ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి?
నా అభిమానులకి. ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్లినప్పుడు... ‘చక్కగా నవ్వించేవాడివి కదయ్యా, సినిమాలు ఎందుకు మానేశావ్, రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లావ్’ అని కొందరు అడుగుతుంటారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలు చేయకూడదని సినిమాలు మానేశాను. దానికి నా అభిమానులందరికీ క్షమాపణ చెప్పాలి.

మీ గురించి ఎదుటివాళ్లు తప్పుగా అనుకునేది?
నా రూపం చూడగానే నేనేంటో ఎవరికీ తెలియదు. కాస్త తక్కువగానే చూస్తారు. నా సినిమాలు చూసినవాళ్లు నన్ను కమెడియన్‌లానే భావిస్తారు. కానీ అసలు బాబూమోహన్ ఏంటనేది చాలామందికి తెలియాలి. నన్ను అత్యంత దగ్గరగా చూస్తేనే అది తెలుస్తుంది.

మిమ్మల్ని భయపెట్టే విషయం ఏదైనా ఉందా?
ప్రతి మనిషీ అబద్ధాలు చెబుతాడు. రాజకీయాల్లోకి వచ్చినవాళ్లు ఇంకా ఎక్కువ చెబుతారు. కానీ నేనెప్పుడూ చెప్పలేదు. చెప్పడానికి ఇష్టపడను కూడా. ఏ రోజయినా పొరపాటున అబద్ధం చెప్పాల్సి వస్తుందేమో అని భయపడుతుంటాను. నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుతుందేమోనని కూడా కాస్త భయపడతాను. జాగ్రత్తగా మెలుగుతాను.

మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి?
ఉన్నన్నాళ్లూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. అవసరంలో ఉన్నవాడికి కాస్తయినా సాయపడాలి.

దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు?
ఈ భూమి మీద పేదరికమే లేకుండా చేస్తాను. సమాజాన్ని పెడతోవ పట్టిస్తోన్న చీడ పురుగుల్ని ఏరిపారేస్తాను.

ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది...?

ఈ సమాజంలో మూడు రకాల మనుషులున్నారు. ఎంత డబ్బయినా ఖర్చుపెట్టి కోరుకున్నది సంపాదించుకునేవారు మొదటిరకం, పలుకుబడిని ఉపయోగించి, రికమెండేషన్లు చేయించుకుని పని పూర్తి చేసుకునేవాళ్లు రెండో రకం. అటు డబ్బూ ఖర్చుపెట్టలేక, ఇటు రికమెండేషన్ చేయించుకోలేక, ఇలాంటి రెండు రకాల వ్యక్తుల మధ్య నలిగిపోయే మూడో రకం మనుషుల కోసం ఏదైనా చేయాలి. నేను పాలిటిక్స్‌లోకి వచ్చిందే అందుకు. అది చేసినరోజునే నాకు మనశ్శాంతి!

మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు?
చక్కని సంగీతం వింటాను. ఊపిరి ఆగిపోయేలోపు ఎంతమందికి సాయపడగలనో అంతా పడతాను.

ఎలాంటి ముగింపును కోరుకుంటారు?
రోగాలూ రొష్టులూ లేకుండా, ఎవరికీ భారం కాకుండా, చిటికె వేసినంత తేలికగా నా ప్రాణం పోవాలి.

అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు?
సినిమాలకు సంబంధించి మంచి నటుడిగా, రాజకీయాలకు సంబంధించి మంచి సేవకుడిగా, వ్యక్తిగత జీవితానికి సంబంధించి మంచి బాబూమోహన్‌గా గుర్తుండిపోవాలి.
మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు?

బాబూమోహన్‌లాగే! నాకు నేను నచ్చుతాను. ఇక వేరేవారిలా పుట్టాలని ఎందుకు కోరుకుంటాను!

సమీర నేలపూడి
  

తమ్ముడి మాటే కరుకు... మనసు కాదు!(రిలేషణం)

 
     
కష్టాల్ని ఎదుర్కునేవాడు ధీరుడు.
రాత్రిని చీల్చుకొచ్చేవాడు సూర్యుడు.
పోసాని కృష్ణమురళి....
దగ్గర నుంచి చూసిన వాళ్లకు ధీరుడు.
దూరం నుంచి గమనించేవాళ్లకు సూర్యుడు.
ఆయన మాటలు కొందరికి మంట పుట్టిస్తే
ఆ ఆవేశం మరికొందరికి చెమట పట్టిస్తుంది.
కానీ ఆ మండే సూర్యుడి ఆగ్రహం వెనుక
చల్లని వెన్నెలపంచే చంద్రుడు ఉన్నాడంటారు
అక్క రాజ్యలక్ష్మి. ప్రతి ఒక్కరి కష్టం తన కష్టమనుకుని ముందుకొచ్చే కృష్ణమురళి అసలు హృదయాన్ని ఆయన అక్క మాటల్లోంచి పట్టి చూపే ప్రయత్నమే ఇది.

మురళి ఎప్పుడూ నాతో ఓమాట అంటూ ఉంటాడు. ‘అక్కా మనం పడాల్సిన కష్టాలన్నీ చిన్నప్పుడే పడ్డాం. అందుకే ఇప్పుడు చాలా సుఖంగా ఉన్నాం. అప్పుడు కాబట్టి అవన్నీ ధైర్యంగా ఎదుర్కున్నాం. ఇప్పుడైతే తట్టు కోలేమేమో’ అని. నిజంగా మా బాల్యపు అనుభవాలు జ్ఞాపకం వస్తే ఇప్పటికీ మనసులో ఏమూలో కొంచెం బాధ, భయం!

చిన్నతనంలో మా ప్రపంచం పెదకాకాని. మా తాతలు, అమ్మమ్మలు, బంధువులు అంతా ఉండేది అక్కడే. మేం నలుగురు పిల్లలం. నాన్నగారు హేమలతా టెక్స్‌టైల్స్‌లో ఫిట్టర్. ఎత్తుగా, ధృడంగా, గంభీరంగా ఉండే నాన్నను చూస్తే మేం చాలా భయపడేవాళ్లం. సాయంత్రం మూడున్నరకు మోగే ఫ్యాక్టరీ సైరన్, నాన్నొస్తాడని సిగ్నల్ మాకు. వెంటనే ఎక్కడివాళ్లమక్కడే గప్‌చిప్. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది. మరోవైపు అమ్మ అనారోగ్యం. దాంతో ఐదవ తరగతి తరువాత చదువు మానేశాను. అప్పటినుంచీ ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలన్నీ నాచేతి మీదుగానే జరిగేవి. మగపిల్లలిద్దరినీ బాగా చదివించి పెద్ద హోదాలో చూడాలని నాన్నగారి ఆశ. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాన్న మాకే లోటూ చేసేవారు కాదు. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే మురళి బాగా చదివేవాడు. పొద్దున్నే చద్దన్నం తిని బడికి వెళ్లేవాడు. సాయంత్రం మా మేనమామ దగ్గరికి వెళ్లి పాఠాలు చెప్పించుకునేవాడు.

నాకూ మురళికి రెండేళ్లు తేడా. దాంతో మా మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. పక్కింట్లో పాలకు వెళ్లాలన్నా, ఊళ్లోనే ఉన్న అమ్మమ్మ ఇంటికెళ్లాలన్నా కలిసే వెళ్లేవాళ్లం. తోటలో మామిడి పండ్లు కొట్టేయడం, సగ్గుబియ్యం తెచ్చుకుని పరమాన్నంలా వండుకుని తినడం, రాత్రిళ్లు పక్కన పడుకుని కబుర్లాడుకోవడం... ఇలా కష్టాల మధ్య చిన్న చిన్న ఊరడింపులు! మురళిని ముద్దుగా జింబో అని పిలిచేవాళ్లం. ఆ పేరు రావడానికి కారణం, ఓ సినిమా! మా చిన్నతనంలో జింబో అనే సినిమా వచ్చింది. దాంట్లో ఓ పిల్లవాడు మురళిలాగా ఉన్నాడని తాతయ్య వాణ్ని జింబో అనేవారు. ఇప్పటికీ పెదకాకానిలో కృష్ణమురళి అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. జింబో అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. మేం ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువగా చూసేవాళ్లం. పదేళ్ల వయసు నుంచీ మురళికి సినిమాల ఆసక్తి పెరిగింది. అలా అని ఊహాలోకాల్లో తేలిపోలేదు. ఒక పక్క చదువుతూనే, చిన్న చిన్న పనులు చేసి ఇంట్లో అవసరాలకు సహాయపడేవాడు.

ఆర్థిక ఇబ్బందులతో నాన్న ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏడ్చీఏడ్చీ అమ్మ మాట పడిపోయింది. మురళి కూడా కుంగిపోయాడు. తరువాత కష్టపడి చదువుకుని నాగార్జున యూనివర్శిటీలో సీటు సంపాదించాడు. ఆ తరువాత సినిమాల్లోకి వెళ్లాడు. ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ తిన్నాడో, ఎన్ని పూటలు పస్తులు ఉన్నాడో మాకు ఏనాడూ చెప్పలేదు. మమ్మల్ని ఏదీ అడిగేవాడు కాదు. కానీ ఎవరికైనా కష్టమొస్తే మాత్రం తను కాచుకుంటాడు. చిన్నప్పుడు తెలిసినవాళ్లు ఇంటికొచ్చి ఏదైనా అడిగితే మాకున్న పరిస్ధితుల కారణంగా కొంచెం తటపటాయించేవాళ్లం. మురళి వెంటనే ‘ఉంచుకుని ఎందుకలా అబద్దం చెబుతారు’ అనేవాడు. ఇప్పటికీ అంతే. అవసరమొస్తే ఎంత సహాయానికైనా వెనుకాడడు. మా అబ్బాయికి యాక్మిడెంట్ జరిగితే కన్నతండ్రి కంటే ఎక్కువ బాధపడ్డాడు. మా అమ్మాయి పెళ్లికి, మా తమ్ముడి పిల్లల పెళ్లిళ్లకు అన్నీ తనే చూసుకున్నాడు. ఇంట్లో వాళ్లకే కాదు, చాలా మందికి చదువులు చెప్పించాడు. పెళ్లిళ్లు చేశాడు. నేనెప్పుడన్నా ‘పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు, కొంచెం వెనకాముందూ చూసుకో’ అంటే ‘అక్కయ్యా, ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం. మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్లు కూడా మనతో పాటే ఆనందంగా ఉంటారు కదా’ అంటాడు. మా మరదలు శోభ కూడా అంతే. బంగారు తల్లి!
మా ఇద్దరికీ పోలికలు ఎక్కువగా ఉండడంతో నున్ను చూస్తే మురళిని చూసినట్టే ఉంటుందంటారంతా. హైదరాబాద్ వస్తే మా అమ్మాయి వాళ్లింట్లోకంటే మురళి దగ్గరే ఎక్కువ గడుపుతాను. ఇంతవరకు మా కుటుంబం వేరుపడలేదు. మనుషులం వేరుగా ఉన్నా మేమంతా ఒకటే!
- కె.క్రాంతికుమార్‌రెడ్డి


చిన్నతనంలో నేను అక్క ఫాలోవర్‌ని. తను ఎక్కడికి వెళితే నేను అక్కడికి వెళ్లేవాణ్ని. నాకు ఊహ తెలిసాక మా అక్క మమ్మల్ని ఏనాడు కోప్పడలేదు. మా బాగోగులన్నీ అక్కే చూసేది. అన్నీ తానై చక్కబెట్టేది. అక్కను చూస్తే నాకు మా అమ్మలాగే ఉంటుంది.
- పోసాని కృష్ణమురళి
  

అనంతశుభాలలో ఓలలాడాలంటే......సన్మార్గం

 
     
 
ఈ పవిత్రమాసం శుభాలను పూర్తిస్థాయిలో పొందడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలి. దైవంతో సంబంధం పటిష్ట పరచుకోవాలి. దైవప్రవక్త వారి ప్రతి సున్నత్‌నూ ఆచరించడానికి ప్రయత్నించాలి. నియ మబద్ధంగా రోజా వ్రతాన్ని పాటిస్తూ, ఐదుపూటల నమాజు, తరావీహ్, జిక్ ్ర, దురూద్, దు ఆ ల్లో నిమగ్నం కావాలి.

‘రమజాన్’ అత్యంతశుభప్రదమైన, పుణ్యప్రదమైన మహామాసం. ఈ పవిత్ర మాసం కొన్నిరోజులు ఉందనగానే మమతలమూర్తి ముహమ్మద్ ప్రవక్త (స) విశ్వాసుల సమాజాన్ని మానసికంగా సమాయత్తపరిచేవారు. ఈ పవిత్ర మాసం శుభాలను పూర్తిగా పొందగలిగే వాతావరణాన్ని సృష్టించేవారు. సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి రమజాన్ ఔన్నత్యాన్ని, ప్రత్యేకతను ప్రజలకు బోధపరిచేవారు.

ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) షాబాన్ మాసం చివరితేదీన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ, ‘‘ప్రజలారా! ఒక మహత్తరమైన, శుభప్రదమైన పవిత్రమాసం తన ఛాయను మీపై కప్పబోతోంది. ఆ పవిత్రమాసంలోని ఒక రాత్రి వెయ్యి మాసాల కన్నా శ్రేష్ఠమైనది. ఆ మాసం ఉపవాసాలను అల్లాహ్ మీకు విధిగా చేశారు. ఆ రాత్రుల్లో అల్లాహ్ సన్నిధిలో ఆరాధన (తరావీహ్ నమాజు) చేయడం సఫిల్‌గా నిర్ణయించాడు. ఎవరైతే ఆ మాసంలో దైవప్రసన్నత, ఆయన సామీప్యం పొందడానికి విధి కానటువంటి ఒక ఆరాధన, అంటే సున్నత్‌గానీ, సఫిల్‌గానీ చేసినట్లయితే, అది ఇతరదినాల్లో విధిగా చెయ్యవలసిన ఆరాధనతో సమానంగా పుణ్యఫలం లభిస్తుంది.

అలాగే ఈ మాసంలో ఒక విధిని నెరవేరిస్తే ఇతరకాలంలో 70 విధులు నిర్వహించిన దానితో సమానం. సహనానికి ప్రతిఫలంగా స్వర్గం లభిస్తుంది. ఇది సానుభూతి చూపవలసిన మాసం. ఈమాసంలో విశ్వాసుల ఉపాధి వృద్ధి చేయబడుతుంది. ఎవరైనా ఈ మాసంలో దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తే అతని పాపాలు క్షమించబడతాయి. నరకాగ్ని నుండి విముక్తి లభిస్తుంది. అతనికి ఉపవాసం ఉన్నవారితో సమానంగా పుణ్యం కూడా లభిస్తుంది. అయితే ఉపవాసం పాటించే వ్యక్తి పుణ్యఫలంలో ఏమాత్రం కొరత కలగదు.’’

అపుడు ప్రజలు ‘దైవప్రవక్తా! మాలో ప్రతిఒక్కరికీ ఇఫ్తార్ చేయించేంత స్థోమత లేకపోతేనో?’ (పేదలు ఇంత గొప్ప పుణ్యానికి దూరమైపోతారు గదా!) అని ప్రశ్నించారు.

అప్పుడు ప్రవక్త మహనీయులు ‘కొద్ది మజ్జిగతో లేక గుక్కెడు మంచినీటితో ఇఫ్తార్ చేయించినా, దైవం అతనికి కూడా అదే పుణ్యం ప్రసాదిస్తాడు. ఎవరైనా ఒక రోజెదారుకు (ఉపవాసి)కి కడుపునిండా భోజనం పెడితే, అతనికి అల్లాహ్ నా హౌజు (కౌసర్ కొలను) నుండి తనివితీరా తాపిస్తాడు. తరువాత ఇక అతనికి ఎప్పటికీ దాహం వేయదు. చివరికతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ మాసంలోని మొదటి భాగం కారుణ్యం, మధ్యభాగం క్షమాపణ (మన్నింపు) చివరిభాగం నరకాగ్ని నుండి విముక్తి. ఎవరైతే ఈ మాసంలో తమ సేవకుల పనిభారాన్ని తగ్గిస్తారో, అల్లాహ్ వారిని క్షమిస్తాడు. వారికి నరకాగ్ని నుండి విముక్తి ప్రసాదిస్తాడు (బైహఖీ- ఈమాన్ అధ్యాయం).

ఇవీ పవిత్ర రమజాన్‌కు సంబంధించి కారుణ్యమూర్తి ముహమ్మద్ (స) మనకు బోధించిన అమృత ప్రవచనాలు. అందుకే ఈ పవిత్రమాసంలో శుభాలను పూర్తిస్థాయిలో పొందడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలి. దైవంతో సంబంధం పటిష్ట పరచుకోవాలి. దైవప్రవక్త వారి ప్రతి సున్నత్‌నూ ఆచరించడానికి ప్రయత్నించాలి. నియమబద్ధంగా రోజా వ్రతాన్ని పాటిస్తూ, ఐదుపూటలా నమాజు, తరావీహ్, జిక్,్ర దురూద్, దు ఆ ల్లో నిమగ్నం కావాలి. ఆర్థిక స్థోమతను బట్టి దానధర్మాలు అధికంగా చేస్తూ ఉండాలి. సమాజంలోని అభాగ్యులను ఏమాత్రం విస్మరించకూడదు. సత్కార్యం ఆచరించే ఏ చిన్న అవకాశం ఇచ్చినా దాన్ని జారవిడుచుకోకూడదు. అన్నిరకాల దుష్కార్యాలకు, దురాలోచనలకు దూరంగా ఉండాలి. రోజా(ఉపవాసం)పాటిస్తూ అబద్ధం పలికితే, అనవసరంగా కడుపు మాడ్చుకొని పస్తు ఉండటమే తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు ప్రవక్త మహనీయులు.

అనునిత్యం నాలుకపై అల్లాహ్ పవిత్రనామం నర్తిస్తూ ఉండాలి. ఈమాసంలో ప్రత్యేకంగా నాలుగు విషయాలను శ్రద్ధగా ఆచరించమని ప్రవక్త మహనీయులు సూచించారు.

ఒకటి: ‘లాయిలా హ ఇల్లల్లాహ్’ వచనాన్ని అధికంగా స్మరించాలి.
రెండు: అపరాధాల మన్నింపుకోసం ఎక్కువగా దైవాన్ని వేడుకోవాలి.
మూడు: స్వర్గాన్ని ప్రసాదించమని అర్థించాలి.
నాలుగు: నరకాగ్ని నుండి విముక్తికోసం అల్లాహ్ శరణు వేడుకోవాలి.

‘లా యిలా హ ఇల్లల్లహ్, వస్తగ్ ఫిరుల్లాహ్, అస్ అలుకల్ జన్నత, వ అవుజు బికమినన్నార్’... అంటూ పఠిస్తూ, వీటికనుగుణంగా జీవితం గడిపితే నిస్సందేహంగా అల్లాహ్‌కృపకు పాత్రులయ్యే అవకాశం ఉంది’’ అని ప్రవక్త మహనీయులు సెలవిచ్చారు. అల్లాహ్ అందరికీ రమజాన్ శుభాలతో పునీతులయ్యే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం.

అందమె ఆనందం

 
     
నాలుగు టీ స్పూన్ల నిమ్మరసంలో రెండు టీ స్పూన్‌ల కొబ్బరిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తరవాత తలస్నానం చేయాలి. పదిహేను రోజులకోసారి ఇలా చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడతాయి.