కష్టాల్ని ఎదుర్కునేవాడు ధీరుడు.
రాత్రిని
చీల్చుకొచ్చేవాడు సూర్యుడు.
పోసాని కృష్ణమురళి....
దగ్గర నుంచి చూసిన వాళ్లకు
ధీరుడు.
దూరం నుంచి గమనించేవాళ్లకు సూర్యుడు.
ఆయన మాటలు కొందరికి మంట
పుట్టిస్తే
ఆ ఆవేశం మరికొందరికి చెమట పట్టిస్తుంది.
కానీ ఆ మండే సూర్యుడి
ఆగ్రహం వెనుక
చల్లని వెన్నెలపంచే చంద్రుడు ఉన్నాడంటారు
అక్క రాజ్యలక్ష్మి.
ప్రతి ఒక్కరి కష్టం తన కష్టమనుకుని ముందుకొచ్చే కృష్ణమురళి అసలు హృదయాన్ని ఆయన అక్క
మాటల్లోంచి పట్టి చూపే ప్రయత్నమే ఇది.
మురళి ఎప్పుడూ
నాతో ఓమాట అంటూ ఉంటాడు. ‘అక్కా మనం పడాల్సిన కష్టాలన్నీ చిన్నప్పుడే పడ్డాం. అందుకే
ఇప్పుడు చాలా సుఖంగా ఉన్నాం. అప్పుడు కాబట్టి అవన్నీ ధైర్యంగా ఎదుర్కున్నాం.
ఇప్పుడైతే తట్టు కోలేమేమో’ అని. నిజంగా మా బాల్యపు అనుభవాలు జ్ఞాపకం వస్తే ఇప్పటికీ
మనసులో ఏమూలో కొంచెం బాధ, భయం!
చిన్నతనంలో మా ప్రపంచం పెదకాకాని. మా తాతలు,
అమ్మమ్మలు, బంధువులు అంతా ఉండేది అక్కడే. మేం నలుగురు పిల్లలం. నాన్నగారు హేమలతా
టెక్స్‌టైల్స్‌లో ఫిట్టర్. ఎత్తుగా, ధృడంగా, గంభీరంగా ఉండే నాన్నను చూస్తే మేం చాలా
భయపడేవాళ్లం. సాయంత్రం మూడున్నరకు మోగే ఫ్యాక్టరీ సైరన్, నాన్నొస్తాడని సిగ్నల్
మాకు. వెంటనే ఎక్కడివాళ్లమక్కడే గప్‌చిప్. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా
ఉండేది. మరోవైపు అమ్మ అనారోగ్యం. దాంతో ఐదవ తరగతి తరువాత చదువు మానేశాను.
అప్పటినుంచీ ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలన్నీ నాచేతి మీదుగానే జరిగేవి.
మగపిల్లలిద్దరినీ బాగా చదివించి పెద్ద హోదాలో చూడాలని నాన్నగారి ఆశ. ఎన్ని
ఇబ్బందులు ఉన్నా నాన్న మాకే లోటూ చేసేవారు కాదు. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే మురళి
బాగా చదివేవాడు. పొద్దున్నే చద్దన్నం తిని బడికి వెళ్లేవాడు. సాయంత్రం మా మేనమామ
దగ్గరికి వెళ్లి పాఠాలు చెప్పించుకునేవాడు.
నాకూ మురళికి రెండేళ్లు తేడా.
దాంతో మా మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. పక్కింట్లో పాలకు వెళ్లాలన్నా,
ఊళ్లోనే ఉన్న అమ్మమ్మ ఇంటికెళ్లాలన్నా కలిసే వెళ్లేవాళ్లం. తోటలో మామిడి పండ్లు
కొట్టేయడం, సగ్గుబియ్యం తెచ్చుకుని పరమాన్నంలా వండుకుని తినడం, రాత్రిళ్లు పక్కన
పడుకుని కబుర్లాడుకోవడం... ఇలా కష్టాల మధ్య చిన్న చిన్న ఊరడింపులు! మురళిని
ముద్దుగా జింబో అని పిలిచేవాళ్లం. ఆ పేరు రావడానికి కారణం, ఓ సినిమా! మా చిన్నతనంలో
జింబో అనే సినిమా వచ్చింది. దాంట్లో ఓ పిల్లవాడు మురళిలాగా ఉన్నాడని తాతయ్య వాణ్ని
జింబో అనేవారు. ఇప్పటికీ పెదకాకానిలో కృష్ణమురళి అంటే ఎవరికీ పెద్దగా తెలియదు.
జింబో అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. మేం ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువగా చూసేవాళ్లం.
పదేళ్ల వయసు నుంచీ మురళికి సినిమాల ఆసక్తి పెరిగింది. అలా అని ఊహాలోకాల్లో
తేలిపోలేదు. ఒక పక్క చదువుతూనే, చిన్న చిన్న పనులు చేసి ఇంట్లో అవసరాలకు
సహాయపడేవాడు.
ఆర్థిక ఇబ్బందులతో నాన్న ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏడ్చీఏడ్చీ
అమ్మ మాట పడిపోయింది. మురళి కూడా కుంగిపోయాడు. తరువాత కష్టపడి చదువుకుని నాగార్జున
యూనివర్శిటీలో సీటు సంపాదించాడు. ఆ తరువాత సినిమాల్లోకి వెళ్లాడు. ఎక్కడ ఉన్నాడో,
ఎక్కడ తిన్నాడో, ఎన్ని పూటలు పస్తులు ఉన్నాడో మాకు ఏనాడూ చెప్పలేదు. మమ్మల్ని ఏదీ
అడిగేవాడు కాదు. కానీ ఎవరికైనా కష్టమొస్తే మాత్రం తను కాచుకుంటాడు. చిన్నప్పుడు
తెలిసినవాళ్లు ఇంటికొచ్చి ఏదైనా అడిగితే మాకున్న పరిస్ధితుల కారణంగా కొంచెం
తటపటాయించేవాళ్లం. మురళి వెంటనే ‘ఉంచుకుని ఎందుకలా అబద్దం చెబుతారు’ అనేవాడు.
ఇప్పటికీ అంతే. అవసరమొస్తే ఎంత సహాయానికైనా వెనుకాడడు. మా అబ్బాయికి యాక్మిడెంట్
జరిగితే కన్నతండ్రి కంటే ఎక్కువ బాధపడ్డాడు. మా అమ్మాయి పెళ్లికి, మా తమ్ముడి
పిల్లల పెళ్లిళ్లకు అన్నీ తనే చూసుకున్నాడు. ఇంట్లో వాళ్లకే కాదు, చాలా మందికి
చదువులు చెప్పించాడు. పెళ్లిళ్లు చేశాడు. నేనెప్పుడన్నా ‘పిల్లలు
పెద్దవాళ్లవుతున్నారు, కొంచెం వెనకాముందూ చూసుకో’ అంటే ‘అక్కయ్యా, ఇప్పుడు మనం
సంతోషంగా ఉన్నాం. మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్లు కూడా మనతో పాటే ఆనందంగా ఉంటారు
కదా’ అంటాడు. మా మరదలు శోభ కూడా అంతే. బంగారు తల్లి!
మా ఇద్దరికీ పోలికలు
ఎక్కువగా ఉండడంతో నున్ను చూస్తే మురళిని చూసినట్టే ఉంటుందంటారంతా. హైదరాబాద్ వస్తే
మా అమ్మాయి వాళ్లింట్లోకంటే మురళి దగ్గరే ఎక్కువ గడుపుతాను. ఇంతవరకు మా కుటుంబం
వేరుపడలేదు. మనుషులం వేరుగా ఉన్నా మేమంతా ఒకటే!
-
కె.క్రాంతికుమార్‌రెడ్డి
చిన్నతనంలో నేను
అక్క ఫాలోవర్‌ని. తను ఎక్కడికి వెళితే నేను అక్కడికి వెళ్లేవాణ్ని. నాకు ఊహ తెలిసాక
మా అక్క మమ్మల్ని ఏనాడు కోప్పడలేదు. మా బాగోగులన్నీ అక్కే చూసేది. అన్నీ తానై
చక్కబెట్టేది. అక్కను చూస్తే నాకు మా అమ్మలాగే ఉంటుంది.
- పోసాని
కృష్ణమురళి
No comments:
Post a Comment