ఇతరుల్లో
మీకు నచ్చేది?
సహాయగుణం, అబద్ధాలు ఆడని తత్వం.
ఎదుటివారిలో
నచ్చనిది?
స్వార్థపూరిత గుణం, ఎదుటివారి సొమ్ము కోసం ఆశపడే లక్షణం. అలాంటి వారు
నాకు పురుగుల్లా కనిపిస్తారు.
మీలో మీకు నచ్చేది?
నా అన్న ఆలోచనను
మనసులోకి రానివ్వను. వీలైనంతవరకూ నొప్పింపక తానొవ్వక అన్నట్టుగానే
మెలుగుతాను.
మీలో మీకు నచ్చనిది?
ముక్కుసూటితనం. ఏం చెప్పాలన్నా
నిర్మొహమాటంగా చెప్పేస్తాను. అలా అనకుండా ఉండాల్సిందే అని తర్వాత
బాధపడతాను.
మీ ఊతపదం?
ప్రత్యేకంగా ఊతపదమంటూ ఏమీ లేదు. కానీ చిన్నవాళ్లు
కనిపిస్తే తమ్ముడూ అని, పెద్దవాళ్లయితే అన్నా అని ఠక్కున అనేస్తాను. సార్ అన డం
అస్సలు అలవాటు లేదు నాకు.
మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన
వ్యక్తి?
ఎన్టీఆర్. చాలా సినిమాల్లో ఆయన పేదవాడికి న్యాయం చేయడం కోసం పోరాడే
వ్యక్తిగానే నటించారు. అలాంటి వాటిని పనిగట్టుకుని ఎంచుకునేవారు. రాజకీయ నాయకుడిగా
కూడా పేదల గురించే ఆలోచించారు.
ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా
ఉందా?
తలచుకుని బాధపడేంత తప్పులు నేనేమీ చేయలేదు.
అత్యంత సంతోషపడిన
సందర్భం?
సత్య సాయిబాబాను, ఎన్టీఆర్‌ని కలవడం నా జీవితంలో నాకు ఎంతో
సంతోషాన్నిచ్చిన సందర్భాలు. అయితే అంతకన్నా సంతోషాన్నిచ్చింది ఒకటుంది. మా
కుటుంబంలో మగపిల్లలే ఎక్కువ. అన్నదమ్ములందరికీ మగపిల్లలే. కానీ ఈ మధ్యే ఒకరికి
ఆడపిల్ల కలిగింది. ఇంటికి ఏదో కొత్త కాంతి వచ్చింది. అది నాకు చాలా చాలా
సంతోషాన్నిచ్చింది.
మీ హృదయం గాయపడిన సందర్భం?
చిన్ననాడు నా తల్లి
మరణించింది. జీవితంలో బాగా స్థిరపడి, పేరు తెచ్చుకుని, అంతా ప్రశాంతంగా ఉంది
అనుకునే సమయంలో నా పెద్ద కొడుకు వెళ్లిపోయాడు. అమ్మ లేని వెలితికి కొన్నాళ్ల తర్వాత
అలవాటు పడ్డాను. కానీ నా కొడుకు చనిపోయాక, ఈ జీవితమే ఇక వద్దనుకున్నాను.
ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి?
నా అభిమానులకి.
ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్లినప్పుడు... ‘చక్కగా నవ్వించేవాడివి కదయ్యా, సినిమాలు
ఎందుకు మానేశావ్, రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లావ్’ అని కొందరు అడుగుతుంటారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలు చేయకూడదని సినిమాలు మానేశాను. దానికి నా
అభిమానులందరికీ క్షమాపణ చెప్పాలి.
మీ గురించి ఎదుటివాళ్లు తప్పుగా
అనుకునేది?
నా రూపం చూడగానే నేనేంటో ఎవరికీ తెలియదు. కాస్త తక్కువగానే చూస్తారు.
నా సినిమాలు చూసినవాళ్లు నన్ను కమెడియన్‌లానే భావిస్తారు. కానీ అసలు బాబూమోహన్
ఏంటనేది చాలామందికి తెలియాలి. నన్ను అత్యంత దగ్గరగా చూస్తేనే అది
తెలుస్తుంది.
మిమ్మల్ని భయపెట్టే విషయం ఏదైనా ఉందా?
ప్రతి మనిషీ అబద్ధాలు
చెబుతాడు. రాజకీయాల్లోకి వచ్చినవాళ్లు ఇంకా ఎక్కువ చెబుతారు. కానీ నేనెప్పుడూ
చెప్పలేదు. చెప్పడానికి ఇష్టపడను కూడా. ఏ రోజయినా పొరపాటున అబద్ధం చెప్పాల్సి
వస్తుందేమో అని భయపడుతుంటాను. నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుతుందేమోనని కూడా కాస్త
భయపడతాను. జాగ్రత్తగా మెలుగుతాను.
మీరు నమ్మే సిద్ధాంతం
ఏమిటి?
ఉన్నన్నాళ్లూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. అవసరంలో ఉన్నవాడికి కాస్తయినా
సాయపడాలి.
దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం
చేస్తారు?
ఈ భూమి మీద పేదరికమే లేకుండా చేస్తాను. సమాజాన్ని పెడతోవ పట్టిస్తోన్న
చీడ పురుగుల్ని ఏరిపారేస్తాను.
ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది...?
ఈ
సమాజంలో మూడు రకాల మనుషులున్నారు. ఎంత డబ్బయినా ఖర్చుపెట్టి కోరుకున్నది
సంపాదించుకునేవారు మొదటిరకం, పలుకుబడిని ఉపయోగించి, రికమెండేషన్లు చేయించుకుని పని
పూర్తి చేసుకునేవాళ్లు రెండో రకం. అటు డబ్బూ ఖర్చుపెట్టలేక, ఇటు రికమెండేషన్
చేయించుకోలేక, ఇలాంటి రెండు రకాల వ్యక్తుల మధ్య నలిగిపోయే మూడో రకం మనుషుల కోసం
ఏదైనా చేయాలి. నేను పాలిటిక్స్‌లోకి వచ్చిందే అందుకు. అది చేసినరోజునే నాకు
మనశ్శాంతి!
మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును
ఎలా గడుపుతారు?
చక్కని సంగీతం వింటాను. ఊపిరి ఆగిపోయేలోపు ఎంతమందికి సాయపడగలనో
అంతా పడతాను.
ఎలాంటి ముగింపును కోరుకుంటారు?
రోగాలూ రొష్టులూ లేకుండా,
ఎవరికీ భారం కాకుండా, చిటికె వేసినంత తేలికగా నా ప్రాణం పోవాలి.
అందరికీ ఎలా
గుర్తుండిపోవాలనుకుంటారు?
సినిమాలకు సంబంధించి మంచి నటుడిగా, రాజకీయాలకు
సంబంధించి మంచి సేవకుడిగా, వ్యక్తిగత జీవితానికి సంబంధించి మంచి బాబూమోహన్‌గా
గుర్తుండిపోవాలి.
మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా
పుట్టాలనుకుంటారు?
బాబూమోహన్‌లాగే! నాకు నేను నచ్చుతాను. ఇక వేరేవారిలా
పుట్టాలని ఎందుకు కోరుకుంటాను!
సమీర నేలపూడి
No comments:
Post a Comment