అన్నట్టు రేపు మండే 
కదా!
‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’కి మండే అంటే ఎందుకంత భయం?
డాక్టరో, ఇంజినీరో 
అవడం ఎవరికైనా క్రేజ్ కదా!
సుందరం మాస్టారు గారబ్బాయి ‘ప్యూన్’ అవ్వాలని ఎందుకు 
అనుకున్నట్టు?
అరటి పండ్లు తింటే బరువు పెరుగుతారు కదా!
ఈ బాడీ ఏమిటి? ఇరవై 
ఏళ్లుగా ఊచలాగే ఉండిపోయింది?
ఇండస్ట్రీలో పెద్దపెద్ద వాళ్లే ‘ప్రభూ’, ‘దేవా’ 
అంటూ టచ్‌లో ఉంటారు కదా!
తనెందుకు ఎవరికీ తెలియని ఓ ముగ్గురికి మాత్రమే టచ్‌లో 
ఉంటారు?
మంచి కొరియో్రగ్రాఫర్, మంచి ఆర్టిస్ట్, మంచి డెరైక్టర్ కదా!
పర్సనల్ 
లైఫ్‌లో ఇన్ని ‘డాన్సులు’, ఇంత నాన్-డెరైక్షన్ ఏమిటి?
ఈ ప్రశ్నలన్నిటికీ 
సమాధానమే... ఇవాళ్టి ‘తారాంతరంగం’. 
కొరియోగ్రఫీ... ఆ తర్వాత యాక్టింగ్... ఇప్పుడేమో డెరైక్షన్... మీలో 
చాలా టాలెంట్లున్నాయే!
ప్రభుదేవా: ఏమో.. మీరంటుంటే నాకూ అదే 
అనిపిస్తుంది. కానీ నిజానికి నాలో ఏం టాలెంట్ ఉందో నాకే తెలీదు. నాకు తెలిసిందల్లా 
ఒక్కటే. హార్డ్‌వర్క్... ఏం చేసినా సిన్సియర్‌గా చేయాలనుకుంటా. అందుకే పాతికేళ్లుగా 
ఈ ప్రయాణం హాయిగా సాగిపోతోంది.
అప్పుడే మీరొచ్చి 
పాతికేళ్లయ్యిందా?
ప్రభుదేవా: ఏం డౌటా? 
మణిరత్నం తీసిన ‘మౌనరాగం’ టైమ్‌లో వచ్చాను. అప్పటినుంచీ ఎక్కడా 
బ్రేకుల్లేవు!
మీ నాన్నగారు సుందరం మాస్టారు ఫేమస్ 
కొరియోగ్రాఫర్ కదా, ఆయన ప్రభావంతోనే ఈ ఫీల్డ్‌లోకి వచ్చారా?
ప్రభుదేవా: నిజం చెప్పమంటారా? అబద్దం చెప్పమంటారా? నాకసలు 
అలాంటి కోరికలు, లక్ష్యాలు లేనే లేవు. నావన్నీ బుల్లి బుల్లి ఆశలు. అందుకే చదువు 
కూడా పెద్దగా వంటబట్టలేదు. ఏదో అనుకోకుండా ఇలా వచ్చేశాను.
చాలా ఆసక్తిగా ఉంది! అయితే ఓసారి కచ్చితంగా మీ బాల్యంలోకి వెళ్లి 
తీరాలి. ముందు మీ ఫ్యామిలీ గురించి, తర్వాత మీ చదువు గురించి కాస్త 
చెప్తారా?
ప్రభుదేవా: మేం ముగ్గురం 
మగపిల్లలం. అన్నయ్య రాజుసుందరం, తమ్ముడు నాగేంద్రప్రసాద్. అల్లరిలో ముగ్గురికీ 
ముగ్గురమే. ఒకటే గొడవలు. కొట్లాటలు. స్నానానికి ఎవరు ముందు వెళ్లాలి అనే దగ్గర 
నుంచి టిఫిన్ తినే విషయం వరకు అన్నిటిలో పోటీనే! ఇక దీపావళి వచ్చిందంటే మా అల్లరి 
శ్రుతిమించేది. టపాసులు పోటీపడి కాల్చేవాళ్లం. ఇన్ని చేసేవాళ్లమా... చదువు దగ్గర 
మాత్రం పోటీ ఉండేది కాదు. నేనైతే యావరేజ్ స్టూడెంట్‌ని. స్కూలుకి కూడా 
వెళ్లానిపించేది కాదు. కానీ అమ్మానాన్న బాధపడతారని భయపడుతూ, బాధపడుతూ 
స్కూలుకెళ్లేవాణ్ణి.
అమ్మానాన్నల్లో ఎవరంటే 
భయం?
ప్రభుదేవా: అమ్మ చాలా ఎఫెక్షనేట్‌గా 
ఉండేవారు. అమ్మ దగ్గర ఎంత అల్లరి చేసినా నాన్న ముందు సెలైంట్! ఆయనంటే భయం. అందుకే 
ఆయన ఎప్పుడు షూటింగ్‌కి వెళతారా అని ఎదురుచూసేవాళ్లం. ఆయన అలా వెళ్లగానే ఇలా ఆటలు 
మొదలుపెట్టేసేవాళ్లం. ఒకవేళ అవుడ్డోర్ షూటింగ్‌కి వెళ్లారనుకోండి.. అప్పుడు పండగే. 
నాన్న ఇంట్లో ఉంటే.. మధ్యాహ్నం నిద్రపోవాల్సిందే. రాత్రి త్వరగా భోజనం చేసి, 
నిద్రపోవాలి. త్వరగా నిద్ర లేవాలి. ఇలా కొన్ని రూల్స్ ఉండేవి. స్ట్రిక్ట్‌గా 
ఉండేవారు కాదు కానీ ఎందుకో ఆయనంటే భయం అనిపించేది. ఇప్పటికీ ఆ భయం అలానే ఉంది. 
ఓకే.. మీ స్నేహితుల గురించి 
చెబుతారా?
ప్రభుదేవా: నా స్కూల్ 
ఫ్రెండ్సే ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నా వయసు 40. నా మూడవ ఏట 
స్నేహితుడు కూడా ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నాడు. అలాగే ఏడో, ఎనిమిదో వయసు నాటి 
స్నేహితులు ఇద్దరు ఇంకా టచ్‌లోనే ఉన్నారు. ఇన్నేళ్ల స్నేహం అంటే ఎలా ఉంటుందో మీరు 
ఊహించుకోవచ్చు. వీరితో స్నేహం బాగుండటంతో ఇక సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ పెద్దగా 
క్లోజ్ కాలేదు. అలాగని ఎవరికీ దూరంగా ఉండేవాణ్ణి కాదు. 
భరతనాట్యం నేర్చుకున్నారట కదా..?
ప్రభుదేవా: ఇద్దరు గురువులు... ధర్మరాజుగారు, ఉడిపి 
లక్ష్మీనారాయణగారి దగ్గర నేర్చుకున్నాను. వాళ్లిద్దరూ నాకు దేవుళ్లు. ఈ రోజున ఈ 
స్థాయిలో ఉన్నానంటే ఆ ఇద్దరే కారణం. డాన్స్‌లో నాకు ఏబీసీ నేర్పించింది ధర్మరాజు 
మాస్టారే. ఉడుపి లక్ష్మీనారాయణగారు అరంగేట్రం చేయించారు. ఆరుగంటలకల్లా మాస్టారు 
వచ్చేవారు. ఐదింటికి నిద్ర లేచి, మాస్టార్ వచ్చేసరికి ముగ్గురం రెడీ అయ్యేవాళ్లం. 
బద్దకం అనిపించినా ఇంట్రస్ట్‌గా నేర్చుకున్నాను. ఇప్పుడదే లైఫ్ 
అయ్యింది.
మీ అరంగేట్రం విశేషాలు?
ప్రభుదేవా: నాన్నగారు పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి... ఆ 
రోజు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు వచ్చారు. నేనో బిట్ చేశాను. 32 
నిమిషాలపాటు అది సాగుతుంది. ‘పిల్లాడు డెలికేట్‌గా ఉన్నాడు. చేయగలుగుతాడా’ అని 
నాన్నని చాలామంది అడిగారట! అప్పుడు నాకు పన్నెండేళ్లు. చాలా ఫాస్ట్‌గా డాన్స్ 
చేయాలి... చేశాను. అందరూ అభినందించారు. అది ఎప్పటికీ మరచిపోలేను.
అందరూ చిన్నప్పుడు ఇంజనీరో, డాక్టరో... ఏదో కావాలనుకుంటారు కదా. 
మీరేమనుకునేవారు?
ప్రభుదేవా: నవ్వనంటే 
చెప్తా! ప్యూన్ అవ్వాలనుకున్నా. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్‌కి అంతకు మించి జాబ్ 
రాదని నా ఫీలింగ్. మనసులో మాత్రం కానిస్టేబుల్ కావాలని ఉండేది. చేతిలో లాఠీ 
పట్టుకుని, నెత్తి మీద టోపీ పెట్టుకుని... అజమాయిషీ చేయొచ్చు కదా.
మరి... డాన్స్ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారు?
ప్రభుదేవా: చదువు రాలేదు కదా. ఏం చేయాలో తెలియలేదు. 
‘నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి’ అన్నారు నాన్న. అప్పుడు ప్లస్ వన్ ఫినిష్ చేశాను. 
చదువు మీద ఇంట్రస్ట్ లేదు. వేరే ఆప్షనే లేదు. అందుకని నాన్నతో పాటు షూటింగ్స్‌కి 
వెళ్లి, ఆయన దగ్గర డాన్స్ అసిస్టెంట్‌గా చేరాను. అంతకుముందు నాన్నతో ఓ కన్నడ, ఓ 
తమిళ సినిమా షూటింగ్‌కి వెళ్లాను. ఆ తమిళ సినిమా పేరు ‘మౌనరాగం’. ఆ సినిమాలోని 
ఫ్లూట్ బిట్‌కి కొరియోగ్రఫీ చేశాను. నాన్నగారి దగ్గర రెండేళ్లు చేసిన తర్వాత డాన్స్ 
డెరైక్టర్ అయ్యాను. 
ఏం చేయాలో తెలియక కొరియోగ్రాఫర్ 
అయ్యారు. మరి.. కెరీర్‌ని ఎంతవరకు సిన్సియర్‌గా తీసుకున్నారు?
ప్రభుదేవా: స్కూల్ లేదు. పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని 
రిలీఫ్ అనిపించింది. ఆదివారం వస్తోందంటే పండగ.. సోమవారం వస్తోందంటే బాధ.. నా స్కూల్ 
డేస్ ఇలానే సాగాయి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆ బాధ లేదు కాబట్టి ఒక్కసారిగా 
టెన్షన్ ఫ్రీ అయ్యాను. దాంతో కెరీర్‌లో ఇన్వాల్వ్ అయ్యాను. మీకో విషయం చెబితే 
నవ్వుతారు. చిన్నప్పుడు పట్టుకున్న సోమవారం ఫోబియో ఇప్పటికీ వదల్లేదు. ఇవాళ సోమవారం 
కదా.. అని అప్పుడప్పుడూ టెన్షన్ పడుతుంటాను.
సౌత్ టు 
నార్త్... కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఎలా అనిపిస్తోంది?
ప్రభుదేవా: ఇండస్ట్రీకి వచ్చిన ఈ ఇరవై అయిదేళ్లల్లో ఎన్నో 
ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. అన్నీ చూసేశాను కాబట్టి జయాపజయాలకు అతీతంగా స్పందించడం 
అలవాటయ్యింది. అందుకని ప్రస్తుత స్థితికి ఏమీ అనిపించచడంలేదు.
సౌత్‌కి దూరమయ్యాననే ఫీలింగ్ ఉందా?
ప్రభుదేవా: నాతోపాటు హిందీ చిత్రాలకు పని చేసే రచయితలు, 
మరో ఇద్దరు సౌత్‌కి చెందినవాళ్లే. నిజంగా చెప్పాలంటే దక్షిణాదిన సినిమాలు 
చేస్తున్నప్పుడు కూడా ఎవరితోనూ పెద్దగా టచ్‌లో ఉండేవాణ్ణి కాదు. నా పనేంటో, నేనేంటో 
అన్నట్లు ఉండేవాణ్ణి. అందుకని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ లేదు.
ఇప్పట్లో దక్షిణాది సినిమాలకు డేట్స్ కేటాయించే పరిస్థితి 
లేదేమో?
ప్రభుదేవా: ఇక్కడ నాకన్నా గొప్ప 
గొప్ప దర్శకులు చాలామంది ఉన్నారు. 
బాలీవుడ్‌లో కూడా 
గొప్ప దర్శకులున్నారు కదా?
 ప్రభుదేవా:
 ప్రభుదేవా: అయినా నన్ను పిలుస్తున్నారు. బాలీవుడ్‌లోనూ 
నాకన్నా బెస్ట్ డెరైక్టర్స్ ఉన్నారు. అయితే ఏం.. నా పని నాదే. ఒకవేళ ఇక్కడ్నుంచి 
ఏదైనా ఆఫర్ వచ్చిందనుకోండి డేట్స్ ఉంటే తప్పకుండా ఒప్పుకుంటా.
కొరియోగ్రాఫర్‌గా ఒకప్పుడు చక్రం తిప్పి, నటుడిగా, తర్వాత 
దర్శకుడిగా మారారు. వీటిలో మీకేది ఇష్టం?
ప్రభుదేవా: డాన్స్ అంటేనే చాలా ఇష్టం. ఇప్పటి 
డాన్సర్స్‌ని చూస్తుంటే భలే అనిపిస్తోంది. 25ఏళ్ల క్రితం డాన్సర్ అయ్యి మంచి పని 
చేశామనిపిస్తోంది. ఇప్పుడు కనుక కొరియోగ్రాఫర్ అయ్యుంటే వందమందిలో నేనూ ఒకణ్ణిగా 
మిగిలిపోయి ఉండేవాణ్ణి. అప్పట్లో ఇంత పోటీ లేదు కాబట్టి ప్రేక్షకులు ‘ఇండియన్ 
మైఖేల్ జాక్సన్’ అని బిరుదు ఇచ్చారు. అదే ఈ జనరేషన్‌తో పాటు నేనూ డాన్సర్ అయ్యుంటే 
ఆ బిరుదుని వందమందికి ఇచ్చి ఉండేవాళ్లు. టీవీల్లో డాన్సులు చూస్తుంటే మతిపోతోంది. 
అంత అద్భుతంగా చేస్తున్నారు. 
మీరు స్టార్ హీరోలను 
సైతం కమాండ్ చేసే రేంజ్‌లో ఉండేవారు. ఇప్పటి కొరియోగ్రాఫర్స్‌కి ఆ పరిస్థితి 
ఉందంటారా?
ప్రభుదేవా: నేనెవర్నీ కమాండ్ 
చేసింది లేదు. చెప్పిన స్టెప్స్‌ని ఇష్టపడి వాళ్లే చేసేవాళ్లు. అందుకని నా పని ఈజీ 
అయ్యేది. ఒక పాట హిట్ అయ్యిందంటే.. ఆ తర్వాతి పాటకు ఏం స్టెప్స్ తయారు చేయాలా? అనే 
ఆలోచించేవాణ్ణి తప్ప వేటి గురించీ ఆలోచించేవాణ్ణి కాదు. అందరూ బాగా చూసుకునేవాళ్లు. 
త్రివిక్రమరావుగారని ఓ నిర్మాత ఉండేవారు. మీకు తెలిసే ఉంటుంది. ఆయనైతే చాక్లెట్లు 
ఇచ్చేవారు. నేను అరటిపండ్లు బాగా తినేవాణ్ణి. అందుకని నిర్మాతలు అవి ఎక్కువగా 
ఇచ్చేవాళ్లు. అరటిపండ్లు తింటే బరువు పెరుగుతామంటారు. కానీ ఇన్నేళ్లుగా డాన్స్ 
చేస్తున్నాను కాబట్టి ఇలా సన్నగా ఉన్నానేమో.
చిన్నప్పుడు మిడిల్ క్లాస్.. ఇప్పుడు హై క్లాస్ లైఫ్ కదా. మరి... 
లైఫ్‌స్టయిల్‌లో మార్పొచ్చిందా?
ప్రభుదేవా: ఇప్పటికీ నేను మధ్యతరగతి కుటుంబానికి 
చెందినవాడిగానే ఫీలవుతా. చాలా సింపుల్‌లైఫ్. డ్రెస్‌ల విషయంలో కూడా కేర్ తీసుకోను. 
ముంబయ్ వెళ్లిన తర్వాత, డ్రెస్ డిజైనర్స్ ‘ఇలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి’ అంటూ 
డిజైన్స్ చేసి ఇస్తుంటారు. ఆర్టిస్ట్‌గా చేసినప్పుడు డిజైనర్స్ ఇచ్చిన డ్రెస్‌లు 
వేసుకున్నట్లు.. ఇప్పుడు కూడా షూటింగ్‌కి వెళుతున్నట్లుగా ఫీలై, ఆ డ్రెస్‌లు 
వేసుకుంటున్నాను.
మీ నాన్నగారంటే ఇప్పటికీ భయం అన్నారు 
కదా.. మరి అప్పట్లో రమలత్‌తో మీ ప్రేమ విషయాన్ని ఆయన దగ్గర ఎలా చెప్పారు? ఏమైనా 
ప్రిపేర్ అయ్యారా?
ప్రభుదేవా: సినిమాల్లో 
ఎలా జరుగుతుందో అచ్చం అలానే అన్నమాట (నవ్వుతూ). ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే నా 
అంతట అస్సలు నేను చెప్పలేదు. నేను చెప్పేముందే ఇంట్లో తెలిసిపోయింది. ఒకటే 
ట్విస్టులు, టర్న్స్.
ఆ మలుపుల గురించి 
చెబుతారా?
ప్రభుదేవా: అది పెద్ద కథ. చాలా 
సమయం పడుతుందేమో.
ఫర్వాలేదు.. ఇంట్రస్టింగ్‌గా 
ఉంటుంది.
ప్రభుదేవా: నార్మల్‌గా నా 
వ్యక్తిగత విషయాల గురించి బయటికి చెప్పను. నాకిష్టం ఉండదు.
ఓకె.. మీరనుకున్నట్లుగానే ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. 
ముగ్గురుబిడ్డలకు తండ్రయ్యారు.. జీవితం చాలా హ్యాపీగా సాగుతుందనుకున్నప్పుడు మీ 
అబ్బాయి చనిపోవడం..?
ప్రభుదేవా: దాని 
గురించి మాట్లాడలేను. నా వల్ల కాదు. నా జీవితంలో జరిగిన పెద్ద ట్రాజెడీ అది! 
అందులోంచి ఎప్పటికీ బయటికి రాలేను. అసలు మర్చిపోలేను కూడా (చెమర్చిన 
కళ్లతో).
సారీ ఫర్ దట్.. ఇంకో విషయం ఏంటంటే.. ఆ బాబు 
చనిపోవడంవల్లే మీకు, మీ భార్యకు మనస్పర్థలు వచ్చాయనే టాక్ 
వచ్చింది...
ప్రభుదేవా: ఆ బాబుకి 
సంబంధించినది ఏదీ నేను మాట్లాడలేను. నా చేతుల్లో ఏమీ లేదు. ఘోరం జరిగిపోయింది. ఆ 
తర్వాత జీవితంలో వచ్చిన మార్పు గురించి కూడా మాట్లాడను!
ఓకే.. ప్రస్తుతం మీ ఇద్దరబ్బాయిలకు తగిన సమయం 
కేటాయించగలుగుతున్నారా?
ప్రభుదేవా: 
ప్రస్తుతం నా లైఫ్‌లో ఉన్న కొరత అదే. నా పిల్లలకు ఎక్కువ సమయం 
కేటాయించలేకపోతున్నాను. నేను ముంబయ్‌లో ఉంటున్నాను. పిల్లలు చెన్నయ్‌లో ఉంటారు. 
హిందీ సినిమాలు చేస్తున్నాను. మీకు తెలిసిందే. షూటింగ్స్‌కి ఏమాత్రం గ్యాప్ వచ్చినా 
పిల్లలను కలుస్తుంటాను. మొన్నా మధ్య ఆస్ట్రేలియా తీసుకెళ్లాను. పదిహేను రోజులు 
పిల్లలతో గడిపాను. ముంబయ్‌లో ఉన్నప్పుడు పిల్లలను అక్కడికి రమ్మంటాను. ఉదయం నుంచి 
రాత్రి నిద్రపోయేవరకు వాళ్లని అంటిపెట్టుకునే ఉంటాను. వాళ్లు చెన్నయ్ వెళ్లిపోయిన 
తర్వాత.. పెండింగ్‌లో ఉన్న వర్క్‌ని కంప్లీట్ చేయడానికి రోజుకి 20 నుంచి 22 గంటలు 
పని చేస్తాను.
మీ మాజీ భార్య రమలత్‌తో ఇప్పుడు మీ 
అనుబంధం?
ప్రభుదేవా: విడాకులు 
తీసేసుకున్నాం. మా పిల్లలతో మాత్రమే నా అనుబంధం సాగుతోంది.
నయనతారతో ప్రేమ, విడిపోవడం.. అసలెందుకలా జరిగిందని ఎప్పుడైనా 
అనుకున్నారా?
ప్రభుదేవా: అస్సలు 
అనుకోలేదు. జరిగిందంతా కరెక్టే. ఏం జరిగినా అది మంచికే జరుగుతుందని నా ఫీలింగ్. 
మనకు కావాల్సివన్నీ జరిగితే అవి మన ఇష్టప్రకారం జరిగినట్లే. కానీ మనకు ఇష్టం కానిది 
జరిగినప్పుడు అది ఆ భగవంతుడి నిర్ణయం అనుకుంటాను. నేను భగవంతుడ్ని నమ్ముతాను 
కాబట్టి.. ఆయన నిర్ణయాన్ని అంగీకరిస్తాను.
మీ ఇద్దరిలో 
ఎవరు ముందు ప్రపోజ్ చేశారు?
ప్రభుదేవా: 
ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం అనవసరం.
ఒకవేళ ఈ 
ఇంటర్వ్యూలో మీరు క్లారిటీగా సమాధానం చెప్పేస్తే.. టోటల్‌గా అందరూ ఈ చాప్టర్‌ని 
క్లోజ్ చేసేస్తారు. లేకపోతే ఈ ప్రశ్నలు మిమ్మల్ని భవిష్యత్తులో కూడా 
వెంటాడతాయి?
ప్రభుదేవా: దీని గురించి 
క్లారిటీ ఇవ్వడానికి ఏమీ లేదనుకుంటున్నాను.
అంటే.. ఈ 
విషయంలో మీరు మోసం చేశారనే ఒపీనియన్ చాలామందికి ఉంది. ఆ ఇమేజ్‌ని అలా క్యారీ 
చేయదల్చుకున్నారా?
ప్రభుదేవా: ఆ 
అభిప్రాయం ఉండి ఉండొచ్చు. కానీ ఎవరికో సమాధానం చెప్పడం కోసం నా వ్యక్తిగత విషయాలను 
బయటపెట్టడం ఇష్టం లేదు. సెలబ్రిటీ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి 
ఉంటుంది. అది నాకర్థమవుతోంది. కానీ సెలబ్రిటీలకు కూడా పర్సనల్ స్పేస్ 
ఇవ్వాలి.
అప్పట్లో మీరు పెద్దవాళ్లని ఎదిరించి మరీ 
పెళ్లి చేసుకున్నారు. విడాకులు తీసుకున్నారు. మళ్ళీ ప్రేమించారు, విడిపోయారు. ఇక 
ప్రేమ, పెళ్లికి ఏం విలువ ఉంటుంది?
ప్రభుదేవా: ప్రేమ అంటే నాకు మంచి అభిప్రాయమే ఉంది. 
పెళ్లన్నా సదభిప్రాయమే. కానీ జరిగిన సంఘటనలంటారా? దీనికి ఏం సమాధానం చెప్పాలో 
తెలియడంలేదు.
 ఇక ఇలా ఒంటరిగా మిగిలిపోతారా? పెళ్లి చేసుకునే ఆలోచన 
ఉందా?
ప్రభుదేవా:
 ఇక ఇలా ఒంటరిగా మిగిలిపోతారా? పెళ్లి చేసుకునే ఆలోచన 
ఉందా?
ప్రభుదేవా: మీ ఇంట్లో ఎవరైనా 
మంచమ్మాయి ఉంటే చెప్పండి.. చేసుకుంటాను (నవ్వుతూ). ప్రస్తుతం నా దృష్టి పని మీద 
తప్ప వేరే దేని మీదా లేదు. గంటలు లెక్కన పని చేస్తున్నాను. నా దగ్గరకు ఎవరొచ్చినా 
సినిమాల గురించి మానేసి, పెళ్లి గురించే అడుగుతున్నారు. అది అభిమానమో ఏమో కానీ ఇలా 
అడుగుతున్నందుకు మాత్రం ఆనందంగానే ఉంది.
గంటల లెక్కన 
పని చేస్తున్నానంటున్నారు... బోర్ అనిపించదా?
ప్రభుదేవా: ఇంత బిజీగా ఉండటం ఆ దేవుడిచ్చిన వరం. ఈ మధ్య 
ఒకరోజు మధ్యాహ్నం వరకు ‘రాంబో రాజ్‌కుమార్’ షూటింగ్ చేశాను. ఆ తర్వాత రెండు గంటలు 
ఇంటర్వ్యూ ఇచ్చాను. అది పూర్తవ్వగానే ‘రామయ్యా వస్తావయ్యా’ ప్రమోషనల్ 
కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత వేరే ప్రోగ్రామ్ చేశాను. ఏమాత్రం అలసట 
అనిపించలేదు. నిజం చెప్పాలంటే ఖాళీగా ఉంటేనే అలసిపోతాను.
మీ సక్సెస్‌ని చూసి మీ అమ్మానాన్నలు ఏమంటారు? 
ప్రభుదేవా: సక్సెస్, ఫెయిల్యూర్ గురించి అమ్మ 
పట్టించుకోదు. టైమ్‌కి తిన్నావా.. వేళకు నిద్రపోతున్నావా అని మాత్రం అడుగుతుంది. 
ఆవిడకి ఆ రెండే ముఖ్యం. నా ఆరోగ్యం గురించి చాలా పట్టించుకుంటుంది. నాన్న కూడా 
సక్సెస్ గురించి మాట్లాడరు. ‘ఆరోగ్యం జాగ్రత్తరా’ అంటారు.
మీ ముగ్గురు అన్నదమ్ముల్లో మీరు సక్సెస్ అయినంతగా మీ అన్నయ్య 
రాజుసుందరం, తమ్ముడు నాగేంద్ర అవ్వలేదు. కారణం...
ప్రభుదేవా: రాజుసుందరం సౌత్, నార్త్‌లో మంచి 
కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నాడు. 
మన చేతిలో ఉన్న అయిదు వేళ్లే ఒకలా ఉండవు. ఇక అందరి కెరీర్ ఒకే విధంగా ఉండాలంటే ఎలా 
కుదురుతుంది? కెరీర్‌ని పక్కన పెడితే వ్యక్తిగతంగా మేం ముగ్గురం చాలా 
బాగుంటాం.
ఫైనల్‌గా... తెలుగు ప్రేక్షకులకు మీరేం 
చెప్పదల్చుకున్నారు?
ప్రభుదేవా: 
తమిళంలోకన్నా నేను తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాను. బాలీవుడ్ వరకూ నా ప్రయాణం 
సాగడానికి ప్రధాన కారణం తెలుగు పరిశ్రమే. అందుకే తెలుగు పరిశ్రమ, ప్రేక్షకులంటే 
నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ ఇంటర్వ్యూ రూపంలో ఇక్కడివారిని పలకరించడం చాలా 
ఆనందంగా ఉంది!
- సంభాషణ: డి.జి. 
భవాని
నా పిల్లలు నాలా కాదు!
ఎప్పుడూ 
వంటగది జోలికి వెళ్లలేదు. అందుకే గరిటె తిప్పడం తెలియదు.
ముంబయ్‌లో మైఖేల్ 
జాక్సన్‌ని కలిసిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. 
ఇండియన్ మైఖేల్ జాక్సన్ 
అనిపించుకోవడం ఆనందంగా ఉంది.
హీరో అవాలని అనుకోలేదు. మొదటిసారి కెమెరా 
ముందుకొచ్చినప్పుడు చాలా భయపడ్డాను.
టైమ్ ఎక్కువ ఉందనిపిస్తే.. షూటింగ్‌కి 
వెళ్లే ముందు దారిలో గుడి ఉంటే కంపల్సరీగా వెళతాను.
షూటింగ్స్ లేనప్పుడు 
సినిమాలు బాగా చూస్తుంటాను.
నా పిల్లలు నాలా కాదు. చక్కగా స్కూల్‌కెళతారు. 
హాయిగా ఆడుకుంటారు. స్కూల్ అంటే వాళ్లకి చాలా ఇష్టం.
********** 
ఔనూ.. మీ అసలు పేరు శంకుపాణి సుందరం అట?
ప్రభుదేవా: అయ్యయ్యో.. అలా అని ఎవరు చెప్పారు. ఈ పేరు వినడం ఇదే 
మొదటిసారి! 
వికిపీడియాలో అలా ఉంది..
ప్రభుదేవా: ఔనా.. అయితే క్లారిఫై చేయాల్సిందే. మా అమ్మానాన్న 
పెట్టిన పేరు ప్రభుదేవానే!
మీరు పుట్టింది 
కర్నాటకలోనా?
ప్రభుదేవా: లేదే. చెన్నయ్‌లో 
పుట్టి, పెరిగాను. ఏం వికీలో కర్ణాటక అని ఉందా? అయితే కచ్చితంగా 
మార్చాల్సిందే!