ప్రపంచ దేశాలకు పెద్దన్న... అమెరికా అంటే భూతల స్వర్గం. అక్కడి జీవితం సర్వ సుఖాల మయం. అక్కడికి వెళ్లగలిగితే చాలు! డాలర్ల పంటే!!.
'అమెరిక అమెరిక అమెరికా... అందమైన అమ్మాయిలాంటి అమెరికా'.... ఒక తెలుగు సినిమా పాట పల్లవి ఇది. అవును, తెలుగువారికే కాదు, భారతీయులకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అందరినీ అకర్షించే దేశం అమెరికా. ప్రపంచ దేశాలకు పెద్దన్న... అమెరికా అంటే భూతల స్వర్గం. అక్కడి జీవితం సర్వ సుఖాల మయం. అక్కడికి వెళ్లగలిగితే చాలు! డాలర్ల పంటే!!.
అమీర్ పేట అంటే తెలియనివారు ఉండవచ్చేమో కానీ... అమెరికా అంటే తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. మూడో తరగతి చదివే పిల్లలు మొదలు మూడు కాళ్ళ ముదుసలివరకూ అందరికీ అమెరికా అంటే విపరీతమైన ఆకర్షణ. ఒక్కసారయినా అక్కడకు వెళితే బాగుండని తెగ కలలు కంటారు. కూర్చున్నా, నిలబడ్డా అదే ఆలోచన. డాలర్లు, పౌండ్లు కళ్ళముందు వర్షిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల మంది(100 మిలియన్లు)కి పైగా ప్రజలు అమెరికాకు వలసవెళ్లి శాశ్వతంగా స్థిరపడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన కొన్ని దేశాల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు అమెరికాకు వెళ్లాలని కోరుకుంటున్నట్టు ‘గ్యాలప్’ పోల్ వెల్లడించింది. చైనాలో కోటీ 90 లక్షలమంది అమెరికాలో స్థిరపడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అమెరికాలో అంతా సజావుగా, సవ్యంగా జరిగిపోయే మాట వాస్తవం. అయితే మనం జీర్ణించుకోలేని అంశాలూ చాలానే ఉన్నాయి. చిన్నారి తప్పు చేసినా సరే దండించడానికి వీల్లేదు. దారి తప్పినా చూస్తూ వుండాలి. బ్రౌన్ షుగర్ తింటానంటే కన్నపేగు చూస్తూ వూరుకోగలదా? ఓ దెబ్బేస్తే తప్పట.. మరోవైపు ఆ భూతల స్వర్గంలో అన్నమో జీసస్ అంటూ అల్లాడే అభాగ్యులు నాలుగున్నర కోట్లమంది వున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది... అభూత కల్పనకాదు. సాక్షాత్తూ అమెరికా వ్యవసాయ శాఖ నివేదిక వెలువరించిన సత్యం. మనకు ఎన్ని చెప్పినా... పొరుగింటి పుల్లకూర మహా రుచిగా వుంటుంది. దూరపు కొండలు యమా నున్నగా వుంటాయి మరి. |