all

Saturday, March 23, 2013

అమెరిక... అమెరిక... అమెరికా

 

ప్రపంచ దేశాలకు పెద్దన్న... అమెరికా అంటే భూతల స్వర్గం. అక్కడి జీవితం సర్వ సుఖాల మయం. అక్కడికి వెళ్లగలిగితే చాలు! డాలర్ల పంటే!!.
 
'అమెరిక అమెరిక అమెరికా... అందమైన అమ్మాయిలాంటి అమెరికా'.... ఒక తెలుగు సినిమా పాట పల్లవి ఇది. అవును, తెలుగువారికే కాదు, భారతీయులకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అందరినీ అకర్షించే దేశం అమెరికా. ప్రపంచ దేశాలకు పెద్దన్న... అమెరికా అంటే భూతల స్వర్గం. అక్కడి జీవితం సర్వ సుఖాల మయం. అక్కడికి వెళ్లగలిగితే చాలు! డాలర్ల పంటే!!.

అక్కడికి వెడితే జన్మ సార్థకమైనట్టేనని భావిస్తుంటారు. ఈ అభిప్రాయం ఒక్క భారతీయులకే కాదు... ప్రపంచంలోని అనేక దేశాల వారికి ఇదో ఆకర్షణీయ దేశం. వివిధ దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లాలని, అక్కడ స్థిరపడాలని కోరుకునేవారెందరో.. ఇదే విషయం తాజాగా నిర్వహించిన ఓ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. వీరిలో కోటి మంది భారతీయులు సైతం ఉండడం విశేషం.

అమీర్ పేట అంటే తెలియనివారు ఉండవచ్చేమో కానీ... అమెరికా అంటే తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. మూడో తరగతి చదివే పిల్లలు మొదలు మూడు కాళ్ళ ముదుసలివరకూ అందరికీ అమెరికా అంటే విపరీతమైన ఆకర్షణ. ఒక్కసారయినా అక్కడకు వెళితే బాగుండని తెగ కలలు కంటారు. కూర్చున్నా, నిలబడ్డా అదే ఆలోచన. డాలర్లు, పౌండ్లు కళ్ళముందు వర్షిస్తుంటాయి.

అక్కడి అందమైన రోడ్లు, ఆకాశ హర్మాలు, ఆకర్షణీయమైన వస్తువులు నర్తన చేస్తూ కనిపిస్తాయి. ఏదో సందర్భంలో అమెరికాను తల్చుకుంటూ, అక్కడున్న మనవాళ్ళతో కబుర్లాడినప్పుడల్లా 'అబ్బ ఎంత అదృష్టవంతులో!' అని బుగ్గలు నొక్కుకుంటూ, అక్కడికెళ్ళే శుభదినం రావాలని కోటి దేవతలకు మొక్కుకుంటూ, రాబోయే ఆ సుదినం గురించి మధురోహల్లో తేలిపోతూ గడపడం నూటికి తొంభైమందికి అలవాటే. కాదనగలరేమో మీరే తేల్చుకోండి.

ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల మంది(100 మిలియన్లు)కి పైగా ప్రజలు అమెరికాకు వలసవెళ్లి శాశ్వతంగా స్థిరపడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన కొన్ని దేశాల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు అమెరికాకు వెళ్లాలని కోరుకుంటున్నట్టు ‘గ్యాలప్’ పోల్ వెల్లడించింది. చైనాలో కోటీ 90 లక్షలమంది అమెరికాలో స్థిరపడాలని ఉవ్విళ్లూరుతున్నారు.

తరువాతి స్థానంలో నైజీరియా పోటీ పడుతోంది. ఆ దేశం నుంచి కోటీ 30 లక్షల మంది అమెరికాపై మోజు పడుతున్నారు. ఇక భారత్ నుంచి కోటి మంది, బ్రెజిల్, బంగ్లాదేశ్‌ల నుంచి 60 లక్షల మంది చొప్పున అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటున్నారు. అమెరికాలో ఎంత ఆకర్షణ లేకుంటే, అన్ని ఖండాలనుంచి, అనేక దేశాలవారు తమ బ్రతుకుతెరువు కోసం అక్కడకు పరుగులు పెడుతూ అక్కడే సెటిల్ అవటానికి ప్రయత్నిస్తారు?

అమెరికాలో అంతా సజావుగా, సవ్యంగా జరిగిపోయే మాట వాస్తవం. అయితే మనం జీర్ణించుకోలేని అంశాలూ చాలానే ఉన్నాయి. చిన్నారి తప్పు చేసినా సరే దండించడానికి వీల్లేదు. దారి తప్పినా చూస్తూ వుండాలి. బ్రౌన్‌ షుగర్‌ తింటానంటే కన్నపేగు చూస్తూ వూరుకోగలదా? ఓ దెబ్బేస్తే తప్పట..

మరోవైపు ఆ భూతల స్వర్గంలో అన్నమో జీసస్‌ అంటూ అల్లాడే అభాగ్యులు నాలుగున్నర కోట్లమంది వున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది... అభూత కల్పనకాదు. సాక్షాత్తూ అమెరికా వ్యవసాయ శాఖ నివేదిక వెలువరించిన సత్యం. మనకు ఎన్ని చెప్పినా... పొరుగింటి పుల్లకూర మహా రుచిగా వుంటుంది. దూరపు కొండలు యమా నున్నగా వుంటాయి మరి.
 

No comments: