all

Saturday, March 23, 2013

ఉప్పుతో ముప్పు

 

ఉప్పుని అధికంగా వాడటం వల్ల 2010లో దాదాపు 23 లక్షల మంది మృతి చెందారు. ఉప్పుతోపాటే ముప్పు పొంచి ఉందని అర్థమవుతోంది.

 

ఉప్పు మనకు ఎంత మేలు చేస్తుందో అంత హానీ కూడా చేస్తుందని ప్రపంచవ్యాప్తంగా చేసిన ఒక అధ్యయనంలో తెలిసింది. ఉప్పుని ఎక్కవ పరిణామంలో తీసుకోవడం వల్ల ముప్పు పొంచి ఉందని తేలింది. ‘2010 గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ స్టడీ’ ప్రకారం అధిక ఉప్పు వినియోగించిన కారణంగా వచ్చే సమస్యల వల్ల 2010లో ప్రపంచవ్యాప్తంగా 23 లక్షల మంది మరణించారు. అమెరికాకు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త గీతాంజలి సింగ్‌తోపాటు పలువురు శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. ఈ అధ్యయనం వివరాలను ఇటీవల ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ సమావేశంలో వెళ్లడించారు. ఉప్పును అధికంగా వాడటం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తి ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మృత్యువాత పడుతున్నారు. వివిధ దేశాల్లో 1990-2010 మధ్యకాలంలో నిర్వహించిన 247 సర్వేలను విశ్లేషిస్తూ 50 దేశాల్లోని 303 సంస్థలకు చెందిన 488 మంది పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఒక రోజుకు తీసుకోవలసిన దాని కంటే (ఒక గ్రాము) ఎక్కువ పరిమాణంలో ఉప్పు తీసుకున్నవారిలో కలుగుతున్న దుష్ర్పభావాలను వీరు పరిశీలించారు.

ఈ అధ్యయనం ప్రకారం ఉప్పు ఎక్కువగా తినడంవల్ల 2010లో ఉక్రెయిన్‌లో అత్యధికమంది మృతి చెందారు. ప్రతి పదిలక్షల మందిలో 2109 మంది మరణించారు. రష్యాలో 1803 మంది, ఈజిస్టులో 836 మంది, యూఏఈలో 134 మంది, ఖతార్‌లో 73 మంది కెన్యాలో 78 మంది మరణించారు. దేశం, వయసు ఆధారంగా స్త్రీ, పురుషులలో ఉప్పు వాడకం వల్ల వచ్చే మార్పులను పరిశోధన చేశారు. అధిక ఉప్పు వినియోగం వల్ల గుండెకు ఎంత చేటో గుర్తించారు. రక్తపోటు, హృద్రోగాలతో మరణించిన పది లక్షల మంది రికార్డులను పరిశీలించారు. వీరిలో 84 శాతం మంది ఉప్పును అధికంగా తీసుకోవడం వల్లే మరణించినట్లు నిర్ధారించారు. సంపన్న దేశాలకంటే పేద, అభివృద్ధి చెందుతున్నదేశాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని గుర్తించారు. పెద్దలే కాకుండా పిల్లలు కూడా ఎక్కువగా తినే ఆహారం (బేబీ ఫుడ్) లోని ఉప్పు ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తేల్చింది.

శరీరంలో నీటికంటే ఉప్పు ఎక్కువ ఉన్నపుడు మనం ఎక్కవగా నీరు తాగుతాం. అయితే ఉప్పు శాతం అధికంగా ఉంటే అధికంగా ఉన్న నీటి మొత్తాన్ని మూత్రపిండాలు విసర్జింప చేయలేక పోతాయి. అప్పుడు శరీరంలోని రక్త పరిమాణం పెరుగుతుంది. ద్రవపరిమాణం పెరిగి ద్రవాన్ని ఇముడ్చుకొనే ఖాళీ పెరగకపోవటంతో లోపలవత్తిడి అధికమవుతుంది. ఈ పెరిగిన వత్తిడినే మనం హైపర్ టెన్షన్ (బీపీ) అంటున్నాము. ఉప్పుకు ఎక్కువ తీసుకోకూడదని తెలిసినా కూడా చాలామంది 15 గ్రాముల వరకు తీసుకుంటారు. ఇటువంటి సందర్భాలలో శరీరంలో చేరిన అదనపు ఉప్పను మూత్రపిండాలు మూత్రం ద్వారా విసర్జించి సమతుల్యతను కాపాడుతాయి. బీపీ ఉన్నవాళ్లు కొందరు ఉప్పను అసలు తీసుకోరు. అలా చేయడం కూడా తప్పే. ఎంత హైవర్ టెన్షన్ ఉన్నవాళ్లు కూడా ఉప్పును తీసుకోవడం పూర్తిగా మానివేయ కూడదు. ఒక పరిమితిలో తక్కువగా తీసుకోవాలి. ఫాస్టు ఫుడ్స్ ఎక్కువగా తినేవారు ఉప్పుని చాలా తక్కువగా తినాలని చెబుతున్నారు.

ఉప్పుతో ఆరోగ్యానికి పెద్ద ముప్పే పొంచి ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. మన జాతీయ పోషకాహార సంస్థ రోజుకు ఒక వ్యక్తి 6 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోకూడదని పేర్కొంది. అంతకు మించి ఉప్పు తీసుకుంటే ప్రమాదం పొంచి ఉన్నట్లే భావించాలి. ఉప్పు ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, కడుపులో క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మనం ఉదయం లెగిసిన దగ్గర నుంచి ఉప్పులేకుండా ఏదీ తినలేం. ఉదయం ఇడ్లీతో మొదలు పెడితే పడుకునే వరకు మనం తినే ఆహారం కూరలు, చారు, పచ్చడి, పెరుగు, పండ్లు.... ఇతర ఆహార పదార్ధాలు అన్నింటిలోనూ ఉప్పు ఉంటుంది. ఈ ఉప్పు వెనుక ఇంత ముప్పు పొంచి ఉన్నందున ఇక నుంచైనా మనం ఉప్పు వినియోగంలో జాగ్రత్తపడటం మంచిది.
 

No comments: