all

Tuesday, March 26, 2013

తను నాకన్నారొమాంటిక్,,,,,,cherry,,,,,,,,,,,,,,,,

 

క్వాలిటీ ఆఫ్ లైఫ్.. క్లారిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ వర్క్.. క్లారిటీ ఆఫ్ వర్క్ రామ్‌చరణ్‌కు బాగా తెలుసు విజయం అంటే తన దృష్టిలో ఇష్టపడి పని చేయడం...
కష్టపడి పని చేయడం..!
జీవితం అంటే తన దృష్టిలో మనసుకి నచ్చింది చేయడం...
మనసులో ఉన్నది మాట్లాడేయడం..!
మెగాస్టార్ చిరంజీవి తనయునిగా, మెగాపవర్‌స్టార్‌గా చరణ్ అందరికీ తెలుసు. కానీ తనకో అదర్‌సైడ్ ఉంది. స్ట్రయిట్ ఫార్వార్డ్‌గా ఉండే చరణ్ అదర్‌సైడ్‌లోకి స్ట్రయిట్‌గా దూసుకుపోండి..


ఏంటీ... మీరీ మధ్య మీడియాక్కూడా దొరకడం లేదు?
చరణ్ : మీడియాను కాసేపు పక్కన పెట్టండి. ముందు మా ఇంట్లోవాళ్లకే నేను దొరకడంలేదు. ‘జంజీర్’ హిందీ సినిమా షూటింగంతా ముంబైలోనే జరగడంతో నేను చాలా రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నాన్నగారు కూడా కేంద్ర మంత్రిగా దేశాలన్నీ తిరుగుతున్నారు. దాంతో మా ఇల్లు మొత్తం బోసిపోయినట్టయిపోయింది. పాపం అమ్మ, ఉపాసన ఇద్దరే ఉంటున్నారు.

పెళ్ళైన కొత్తలోనే ఇలా మీరు షూటింగ్స్ అంటూ అవుడ్డోర్‌లకు వెళ్లిపోతుంటే ఉపాసన ఫీల్ కావడం లేదా?
చరణ్ : ఫీల్ కావడం కామనే కదా. కానీ ఏం చేయలేని పరిస్థితి. ‘జంజీర్’ ముందే కమిట్ కావడం వల్ల సరిగ్గా పెళ్లి తర్వాత షెడ్యూల్స్ పడ్డాయి. మా కోసం వాళ్లని షూటింగ్ వాయిదా వేసుకోమని చెప్పలేం కదా. అందుకే ఇక చేసేదేం లేక దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఆ మధ్య అయితే ఓ నెలరోజులు ముంబైలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఉపాసన తన ఆఫీసు వదిలిపెట్టి నాతో రాలేని పరిస్థితి. వారానికోసారి తనే ముంబయ్ వచ్చి వెళ్ళేది. నేను కూడా ఒకరోజు షూటింగ్ బ్రేక్ దొరికితే వెంటనే హైదరాబాద్‌లో వాలిపోయేవాణ్ణి. అయినా నా పరిస్థితిని ఉపాసన అర్థం చేసుకుంది లేండి. సినిమావాళ్లకి ఇదంతా సహజమని, తనూ ఒకప్పుడు ఇలాంటివే ఫేస్ చేశానని మా అమ్మ తన కోడలికి చెబుతుంటుంది.

ఇంతకూ హనీమూన్‌కైనా వెళ్లారా.. లేదా?
చరణ్ : ఇటలీలోని పారగాన్‌మాల్‌లో మా ఫ్రెండ్‌కి ఓ పెద్ద ఫామ్‌హౌస్ ఉంది. హనీమూన్‌కి అక్కడకి వెళ్లాం. దాన్ని హనీమూన్ ట్రిప్ అంటే ఉపాసన అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే ఎవరైనా వారం, పదిరోజులు ట్రిప్‌కి వెళతారు. మేం కేవలం మూడంటే మూడు రోజులే ఉన్నాం. అందులో ఒకరోజు అప్ అండ్ డౌన్ జర్నీకే సరిపోయింది. అందుకే ‘జంజీర్’, ‘ఎవడు’ సినిమాలు పూర్తి కాగానే ఒక నెల బ్రేక్ తీసుకుని జూన్‌లో ఇద్దరం ఫారిన్ ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాం.

Photo


ఉపాసనతో మీ పరిచయం, ప్రణయం, పరిణయం గురించి కొంచెం వివరంగా చెబుతారా?
చరణ్ : (నవ్వేస్తూ) మాదేమీ సినిమాటిక్ లవ్‌స్టోరీ కాదు. ఇద్దరం ఒకరికొకరు ఎనిమిదేళ్లుగా తెలుసు. బాల్య స్నేహితులమని, క్లాస్‌మేట్స్ అని మీడియాలో రాశారు. కానీ, అది నిజం కాదు. కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరం పరిచయమయ్యాం. చాలా తక్కువ సమయంలోనే ఇద్దరం క్లోజ్ అయిపోయాం. నా ముక్కుసూటితనం తనకు నచ్చింది. తన నిక్కచ్చితనం, ధైర్యం నన్ను ఆకట్టుకున్నాయి. తను గొప్పింటమ్మాయి అయినా ఎక్కడా గర్వం కనబడదు. అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. ఈ జనరేషన్‌లో ఇలాంటి నేచర్ చాలా తక్కువమందికి మాత్రమే ఉంటుంది. ఆ నేచర్‌కే నే పడిపోయా. ఆ తర్వాత జరిగిన కథ మీకు తెలిసిందేగా.

మీలో ఎవరు ముందు లవ్ ప్రపోజ్ చేశారు?
చరణ్ :అమ్మాయిలు అంత తొందరగా బయటపడతారా... చెప్పండి. వాళ్ల ఇబ్బందులు వాళ్లకుంటాయి. ముందు నేనే లవ్ ప్రపోజ్ చేశా. తనక్కూడా నేనంటే చాలా ఇష్టం. అందుకే వెంటనే ఓకే అంది. అయితే వాళ్లింట్లో ఏమంటారో అని కొన్నాళ్లు తటపటాయించింది.




మీ ఇంట్లో వాళ్లు ఈ లవ్ గురించి తెలిసి ఏమన్నారు?
చరణ్ : ఉపాసనకైతే ఈజీగా చెప్పేశాను కానీ, ఇంట్లో నాన్నగారికి విషయం చెప్పడానికి చాలా భయపడ్డాను. అసలు ఆయనకు ఈ విషయం ఎలా చేరవేయాలో కూడా అర్థంకాలేదు. చివరకు అమ్మను ఆశ్రయించా. తనే అన్నీ చూసుకుంది. నాన్నగారికి కూడా వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ బాగా క్లోజ్. చాలామంచి సంబంధం అని నాన్నగారు కూడా ఒప్పుకున్నారు.

మీరేమో సినిమాస్టార్. ఉపాసన బిజినెస్ ఉమెన్. ఇద్దరికీ ఎలా మ్యాచ్ కుదురుతుందని ఏమైనా సందేహపడ్డారా?
చరణ్ : మా పెళ్లికి అడ్డంకి ఏదైనా ఉంటే అదొక్కటే అనుకున్నాం. వాళ్లకు సినిమాల గురించి అస్సలు తెలీదు. మాకేమో ఆ బిజినెస్ ఫీల్డ్ కొత్త. అయినా మనసులు కలవాలి గానీ రంగాలు కలవాలంటారా. ఇన్నాళ్లూ ఉపాసన బయటి ప్రపంచానికి సరిగ్గా తెలీదు. ఇప్పుడేమో చిరంజీవిగారి కోడలిగా, చరణ్ భార్యగా ఓ స్టార్‌డమ్ వచ్చేసింది.

ఈ కొత్త హోదాను ఉపాసన ఎంజాయ్ చేస్తున్నారా?
చరణ్ : ఎంచక్కా చేస్తోంది. ఇన్నాళ్లూ ఎక్కడికైనా తనే ఒంటరిగా వెళ్లేది. షాపింగ్‌లు, రెస్టారెంట్లు అన్నీ హాయిగా వెళ్లిపోయేది. అయితే మునుపటి ఫ్రీడమ్ లేదు తనకు. అందరూ తననే చూస్తుంటారు. అభిమానులైతే మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంటారు. కొంచెం ఇబ్బంది అనిపించినా, తను ఈ పొజిషన్‌ని బాగా ఎంజాయ్ చేస్తోంది.

ఉపాసన మీ ఇంట్లో వాళ్లతో బాగానే కలిసిపోయారా?
చరణ్ : మీకోవిషయం చెప్పనా. మా అమ్మ, తను ఇప్పుడు బెస్ట్‌ఫ్రెండ్స్. అత్తాకోడళ్లలాగా అస్సలు కనబడరు. నాన్నగారికి కూడా ఉపాసన అంటే చాలా ఇష్టం. మిగతావాళ్లు నాన్నగారి దగ్గర కొంచెం భయం భయంగా ఉంటుంటారు. తనేమో చాలా చొరవగా నాన్నగారితో మాట్లాడేస్తుంది. ఆ చొరవే నాన్నగారికి నచ్చింది. ఇంట్లో అందరితో కూడా తను చనువుగా ఉంటుంది. లేవగానే ఆఫీసుకి వెళ్లిపోవాలని హడావిడి చేయకుండా, ఇంట్లో అందరితో కాసేపు గడిపి అప్పుడు ఆఫీసుకి వెళ్తుంది.

మీరు షూటింగ్స్‌తో బిజీ. తను ఆఫీసుతో బిజీ. ఇద్దరూ టైమ్ ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు?
చరణ్ : సాయంత్రం ఆరు దాటాక నేను షూటింగ్ చేయను. తను కూడా అంతే. ఆరు దాటగానే ఆఫీస్ క్లోజ్. సిక్స్ తర్వాత టైమ్ అంతా మా ఇద్దరికే సొంతం. ఒక్కోసారి ఆదివారాలు కూడా షూటింగ్ మానేసి తనతోనే టైమ్ స్పెండ్ చేస్తున్నాను.

ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్తుంటారా?
చరణ్ : బయటి థియేటర్స్‌కు వెళ్లి చూడం కానీ, ఇంట్లోనే హోమ్ థియేటర్‌లో చూస్తుంటాం. తను యాష్‌చోప్రా సినిమాలకు అభిమాని. తను నాకన్నా రొమాంటిక్. స్వీట్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను ఆసక్తిగా చూస్తుంది. నన్ను కూడా అలాంటి రొమాంటిక్ సినిమాలు చేయమని అడుగుతోంది. యాక్షన్ తనకు అస్సలు పడదు. అయితే నాతో పెళ్లయ్యాక మాత్రం యాక్షన్ సినిమాలు చూస్తోంది.

సినిమా పరంగా మీకు ఉపాసన సలహాలిస్తుంటారా?
చరణ్ : తనకు ఈ ఫీల్డ్ గురించి అస్సలు అవగాహన లేదు. వాళ్లది కంప్లీట్‌గా బిజినెస్ ఫ్యామిలీ. బిజినెస్ మీద, మార్కెటింగ్ మీద తనకు మంచి నైపుణ్యం ఉంది.




ఇద్దరూ గుళ్లకూ గోపురాలకూ వెళుతుంటారా?
చరణ్ : అబ్బో... ఇప్పటికే చాలా వెళ్లాం. మేం ఇద్దరం ఎక్కువ కలిసి వెళ్లింది టెంపుల్స్‌కే. తిరుపతి, చిలుకూరు, వారణాసి, గురువాయూర్... ఇలా చాలా టెంపుల్స్‌ని దర్శించుకున్నాం.

ఇద్దరికీ బాగా దైవభక్తి ఎక్కువన్నమాట?
చరణ్ : నాకు కొంచెం తక్కువే కానీ, తనకు దైవభక్తి ఎక్కువ. వాళ్ల ఫ్యామిలీలో ఎప్పుడూ ఏదో ఒక పూజలు, హోమాలు చేస్తూనే ఉంటారు. వాళ్లకు నిజామాబాద్ జిల్లాలో ఓ పెద్ద కోట ఉంది. అందులో 600 ఏళ్ల క్రితం నాటి పురాతన శివాలయం ఉంది. అక్కడ శివలింగం స్వయంభువు. నీలిరంగులో ఉంటుంది. ఉపాసన ప్రతి నెలా ఆ గుడికి వెళ్లి తనే స్వయంగా శుభ్రం చేసి వస్తుంది.

మీ ఫేవరెట్ గేమ్ ఏంటి?
చరణ్ : పోలో, బ్యాడ్మింటన్ ఇష్టం. అలాగే క్రికెట్ కూడా. హైదరాబాద్ అండర్-14 టీమ్‌లో కొన్నాళ్లు ఆడాను. ఆ తర్వాత టచ్ పోయింది. సీసీఎల్ కోసం మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాను.

మీరు పోలో టీమ్‌ని స్పాన్సర్ చేస్తున్నట్టున్నారు?
చరణ్ : అవును. చాలా మంచి టీమ్ మాది. ‘పోలో’ మనకంత పాపులర్ కాదు. కానీ ఎప్పటికైనా దాన్ని పాపులర్ చేయాలని ఉంది.

గుర్రపుస్వారీ నేర్చుకోవాలని ఎందుకనిపించింది?
చరణ్ : నాకు మొదటినుంచీ జంతువులన్నా, పక్షులన్నా ఇష్టం. ముఖ్యంగా గుర్రాలంటే మహాపిచ్చి. ఆరేళ్ల వయసులో చెన్నైలో గుర్రపుస్వారీ నేర్చుకోవడం మొదలుపెట్టా.

Photo: good morning fans



అందుకేనా ‘మగధీర’లో గుర్రపుస్వారీ సన్నివేశాలు బాగా పండించగలిగారు...
చరణ్ : నిజానికి ‘మగధీర’లో మొదట గుర్రం ఎపిసోడ్ లేదు. నాకు గుర్రపుస్వారీ బాగా వచ్చని తెలిసే రాజమౌళిగారు గుర్రం చుట్టూ ఓ ఎపిసోడ్ క్రియేట్ చేశారు. అది సినిమాకు చాలా పెద్ద ప్లస్సయ్యింది.

దర్శకుడు వీవీ వినాయక్ మీ పెళ్లికి ఓ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు కదా!
చరణ్ : అది నా ఫేవరెట్ గుర్రం. నేను ఊహించని బహుమతి అది. మా ఇంట్లో మెహందీ పార్టీ జరుగుతుంటే, వినాయక్ బయట నుంచి ఫోన్ చేసి కిందికి రమ్మన్నారు. వచ్చి చూస్తే గేటు దగ్గర ఓ బ్లాక్ హార్స్. అచ్చం ‘మగధీర’ గుర్రంలానే ఉంది. నేను షాకయ్యా. చాలా బ్యూటిఫుల్ హార్స్ అది. మా ఫామ్‌హౌస్‌లో ఉంది. మా దగ్గర ఇంకా 9 గుర్రాలున్నాయి.

ఇప్పటికీ గుర్రపుస్వారీ కంటిన్యూ చేస్తున్నారా?
చరణ్ : వారానికోసారి ఫామ్‌హౌస్‌కి వెళ్లి కాసేపు గుర్రాలతో గడిపి, ఇంకాసేపు స్వారీ చేసి వస్తుంటాను.

గుర్రపుస్వారీ అంటే అందరికీ జానపదాలు గుర్తొస్తాయి. మీకేమైనా ఆసక్తి ఉందా?
చరణ్ : మంచి కథ, దర్శకుడు దొరికితే చేస్తాను. నాక్కూడా వ్యక్తిగతంగా జానపదాలంటే ఇష్టం.

ఎలాగూ సినిమాల ప్రస్తావన వచ్చింది కాబట్టి, కాసేపు మీ హిందీ సినిమా ‘జంజీర్’ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ అవకాశం మీకెలా వచ్చింది?
చరణ్ : దర్శకుడు అపూర్వ లఖియా ‘జంజీర్’ని ఎవరైనా కొత్త హీరోతో రీమేక్ చేద్దామనుకున్నాడట. ఆ సమయంలోనే నా ‘మగధీర’ చూసి బాగా ఇంప్రెసయ్యాడు. వెంటనే నన్ను అప్రోచ్ అయ్యాడు. నాకేమో ఇప్పటికిప్పుడు హిందీకి వెళ్లాలని లేదు. అది కూడా ‘జంజీర్’ లాంటి రీమేక్‌తో వెళ్లడం ఎంత వరకూ కరెక్టా అనిపించింది. అందుకే నేను ఓకే చెప్పలేదు. అయినా వాళ్లు వదిలిపెట్టలేదు. చివరకు బాగా ఆలోచించుకుని 8 నెలల తర్వాత ఓకే చెప్పా.

ప్రియాంక చోప్రా మీకన్నా సీనియర్ కదా. తనతో పని చేయడం ఎలా అనిపించింది?
చరణ్ : క్రమశిక్షణ, ఇన్‌వాల్వ్‌మెంట్ విషయంలో ప్రియాంక చాలా సూపర్. ఇద్దరం షూటింగ్‌కి ఒక గంట ముందే వచ్చేసి డైలాగ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్లం.

మీకు హిందీ బాగానే వచ్చా?
చరణ్ : వచ్చుకానీ, అంత ధారాళంగా కాదు. ఆ విషయంలో ప్రియాంక చాలా హెల్ప్ చేసేది. అలాగే తెలుగు వెర్షన్ షూటింగ్ విషయంలో నేను తనకు సహకరించేవాణ్ని. ‘జంజీర్’కి నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా కూడా.

సల్మాన్‌ఖాన్ రోజూ మీకు క్యారేజ్ పంపేవారట?
చరణ్ : పదేళ్ల క్రితం నాన్నగారితో కలిసి సల్మాన్‌ఖాన్ ‘థమ్సప్’ యాడ్ చేశారు. అప్పటినుంచీ ఆయన మా ఫ్యామిలీకి క్లోజ్ అయిపోయారు. నేను ముంబైలో ‘జంజీర్’ షూటింగ్ చేస్తున్నాననే వార్త తెలియగానే ఫోన్ చేశారు. ‘‘మా సిటీకొచ్చి నాకు ఫోన్ చేయవా?’’ అని కోప్పడ్డారు. తర్వాత రోజు లంచ్‌కి తన ఇంటి నుంచే క్యారేజ్ పంపించారు. నేను అక్కడ ఉన్నన్నాళ్లూ క్యారేజ్ వచ్చేది. నేను ఎంత వద్దన్నా వినేవారు కాదు. ముంబై శివార్లలో షూటింగ్ అయినా సరే క్యారేజ్ పంపించేసేవారు. నన్ను చాలా బాగా చూసుకున్నారాయన. అప్పుడప్పుడూ కలుసుకునేవాళ్లం. నాకు మంచి మంచి సలహాలు కూడా ఇస్తుండేవారు.

ముంబైలో మీరు ఇల్లు తీసుకోవడానికి సల్మాన్‌ఖానే సహకరించారట?
చరణ్ : ఇంకా అక్కడ నేను ఇల్లు తీసుకోలేదు. ఈ నెలలో తీసుకునే అవకాశం ఉంది. ఆ విషయంలో సల్మాన్ చాలా హెల్ప్ చేస్తున్నారు. నాకు ముంబై సెకండ్ సిటీలాంటిది. సినిమాల కోసమో, యాడ్ ఫిలిమ్స్ కోసమో నేను తరచు ముంబై వెళ్లాల్సి ఉంటుంది. హోటల్స్‌కన్నా మనకంటూ ఓ సొంత ఇల్లు ఉంటే బావుంటుందని తీసుకోబోతున్నా.

ఒకవేళ వరుసగా భారీ హిందీ ఆఫర్లు వచ్చేస్తే అక్కడే స్థిరపడిపోతారా?
చరణ్ : ఎన్ని ఆఫర్లు వచ్చినా, కచ్చితంగా ఏడాదికి రెండు తెలుగు సినిమాలు మాత్రం చేస్తా. సమయం చిక్కితే ఏడాదికో హిందీ సినిమా చేయాలనుకుంటున్నా.

జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసే ఈ వయసులో ఈ స్టార్‌డమ్, ఈ బిజీ లైఫ్ ఎలా అనిపిస్తోంది?
చరణ్ : నాకిది కొత్తేమీ కాదు. నా చిన్నతనం నుంచీ నాన్నగారిని చూస్తున్నాను కదా. అందుకే నాకేం పెద్ద తేడా అనిపించడంలేదు. ఒత్తిడి కూడా లేదు. అలాగని నేను కోల్పోయింది కూడా ఏమీ లేదు. అందరిలాగా బైక్‌ల మీద తిరగలేకపోయుండొచ్చు. అలాంటి కోరికలన్నీ ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు తీర్చుకునేవాణ్ణి.

బేసిక్‌గా మీదెలాంటి పర్సనాల్టీ?
చరణ్ : నేను చాలా రిలాక్స్‌డ్ పర్సన్‌ని. దేనికీ ఎక్కువ ఎగ్జైట్ కాను. ఇమ్మీడియట్‌గా రియాక్ట్ కాను. కోపం కూడా తక్కువే. ఏ విషయంలోనైనా చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉంటా. ఒకవేళ అలా లేకపోతే మాత్రం ఆ రాత్రి అస్సలు నిద్రపట్టదు. మొదట్లో నా మనసులో మాటలు చెప్పుకోలేక కొంచెం ఇబ్బందిపడేవాణ్ణి. రాన్రానూ జీవితం నేర్పిన అనుభవంతో రాటుదేలా. ఈ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌నెస్సే కరెక్ట్ అనిపించింది. దానివల్ల కొంత ఇబ్బంది ఉన్నా, మనం మాత్రం ప్లెజెంట్‌గా ఉంటాం.

‘నాయక్’ ఆడియో ఫంక్షన్‌లో మీరు చాలా తీవ్రంగా రియాక్టయ్యారు. మీడియా గురించి ఎందుకంత ఘాటుగా స్పందించారు?
చరణ్ : అదేదో కోపంతోనో, ఆవేశంతోనో మాట్లాడింది కాదు. దాని వెనుక రెండేళ్ల పెయిన్ ఉంది. మా ఫ్యామిలీలో కలతలున్నాయని రెండేళ్ల నుంచి మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కళ్యాణ్ బాబాయ్ ఆడియో ఫంక్షన్‌కి నేను వెళ్లకపోయినా, నా ఆడియో ఫంక్షన్‌కి ఆయన రాకపోయినా అదేదో ఘోరంలాగా, నేరంలాగా, ఏదో జరిగిపోయిందన్నట్టుగా మీడియాలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఓ అబద్ధాన్ని పదే పదే చెబితే జనం అదే నిజం అనుకుంటారు. మా విషయంలోనూ అలాంటి అపోహ రాకూడదనే నేనలా మాట్లాడాల్సి వచ్చింది. నాన్నగారు, కళ్యాణ్ బాబాయ్ అలాంటివాటికి రియాక్ట్ కావడం వేస్ట్ అంటారు. కానీ అభిమానుల మనసుల్లో ముసురుకున్న సందేహాలను తొలగించే ప్రయత్నం చేయాలి కదా. అందుకే అభిమానుల ముందు ఆ రోజు అంతలా రియాక్టయ్యా. అంతేకానీ మీడియాను తక్కువ చేయాలని కాదు. ఫంక్షన్‌కు రానంత మాత్రాన ఫ్యామిలీలో గొడవలున్నాయనుకోవడం తప్పు కదా! మాపై అలా చెడు ప్రచారం చేసేవాళ్లను ఉద్దేశించే ఆ మాట అనాల్సి వచ్చింది. .

పవన్‌కల్యాణ్‌తో మీ అనుబంధం గురించి చెప్పండి?
చరణ్ : మాది కొంచెం డిఫరెంట్ రిలేషన్. కాసేపు ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఇంకాసేపు తండ్రీకొడుకుల్లా ఉంటాం. అప్పట్లో నాన్న చాలా బిజీగా ఉండేవారు. అప్పుడు నేను ఏది షేర్ చేసుకోవాలన్నా బాబాయ్‌తోనే. మేమిద్దరం ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. డాడీకి ఏది కన్వే చేయాలన్నా బాబాయ్ ద్వారానే చేసేవాణ్ణి.

ఇప్పటికీ తరచుగా కలుస్తుంటారా?
చరణ్ : ఎందుకు కలుసుకోం. ఈ నెలలోనే కలుసుకోలేదు ‘జంజీర్’ గురించి చెబితే చాలా మంచి నిర్ణయం తీసుకున్నావని మెచ్చుకున్నారు కూడా.

మరి నాగబాబుతో మీ సాన్నిహిత్యం?
చరణ్ : ఆయన చాలా సరదామనిషి. పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. ఆయనంత సరదా మనిషిని మీరెప్పుడూ చూసి ఉండరు.

మీ ఫ్యామిలీ నుంచి ఇంకా ముగ్గురు హీరోలొస్తున్నారు కదా...
చరణ్ : సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్, అల్లు శిరీష్ బాగా శిక్షణ పొంది వస్తున్నారు. ఎప్పటినుంచో సినిమా ఫీల్డ్‌ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య ‘రేయ్’ క్లిప్పింగ్స్ చూశా. సాయిధరమ్ తేజ్ చాలా బాగా చేశాడు. ‘ఐ విష్ హిమ్ ఆల్‌ది బెస్ట్.

మీ మేనమామ అల్లు అరవింద్ ప్రభావం మీపై ఎంతవరకూ ఉంది?
చరణ్ : మా ఇంట్లో ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా, మాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చే వ్యక్తి ఆయనే. ఎప్పుడైనా మేం ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతామేమో కానీ, ఆయన అస్సలు అలా రియాక్ట్ కారు. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలన్న ఆలోచనే తప్ప, తన రియాక్షన్ బయటికి కనబడదు. మా ఫ్యామిలీలో అందరికీ ఆయనే పెద్ద అండ. ఓ న్యూట్రల్ మైండ్‌తో ఆలోచిస్తారాయన. చిన్నప్పుడు నాకేది కావాలన్నా మామ ద్వారానే రికమెండేషన్ చేయించుకునేవాణ్ణి.




మీకు బావమరిది ఉన్నారా?
చరణ్ : ఉన్నాడు. యూఎస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తనకు సినిమా ఇంట్రస్ట్‌లేమీ లేవు.

అటు కేంద్రమంత్రిగా మీ నాన్నగారు బిజీ. ఇటు హిందీ, తెలుగు సినిమాలతో మీరు బిజీ. ఇద్దరూ ఒకరికొకరు మిస్ అవుతున్నట్లనిపిస్తోందా?
చరణ్ : ఎందుకుండదండీ. అయినా, ఎంత దూరాన ఉన్నా నాన్నతో రోజూ రాత్రిళ్ళు మాట్లాడుతుంటా. నా సినిమాల గురించి, నా గురించి అప్‌డేట్స్ ఇస్తుంటా.

మీ సినిమాల ఫైనల్ అవుట్‌పుట్ చిరంజీవిగారు తప్పనిసరిగా చూస్తారా?
చరణ్ : కచ్చితంగా చూస్తారు. ఆయనకన్నా బిగ్ స్కూల్ ఎవరుంటారు చెప్పండి. ఆయన చెప్పే సలహాలు కచ్చితంగా పాటిస్తాను. ఆయనకు తెలియకుండా నేను ఒక్క స్టెప్ కూడా వేయను.

చిరంజీవిగారు సుమారు రెండు దశాబ్దాలకు పైగా నంబర్‌వన్‌గా ఉన్నారు. ఇప్పుడా స్థానం కోసం హోరా హోరీ పోటీ ఉంది. దాని గురించి మీరేమంటారు?
చరణ్ : ఆయన సినిమా ఫీల్డ్‌లో లేని లోటు అయితే అందరికీ ఉంది. ఆ లోటుని ఎవరు తీరుస్తారనేది మా చేతుల్లో కూడా లేదు. ప్రేక్షకుల చేతిలోనే ఉంది. మా చేతిలో ఉన్నదల్లా కష్టపడడం, వాళ్లకు నచ్చిన సినిమాలు ఇవ్వడం.

మీకు వంట చేయడం వచ్చా?
చరణ్ : వచ్చంటే వచ్చు. రాదంటే రాదు. నాన్న బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు వంట తనే చేసుకునేవారట. ఆ విషయాలన్నీ తెలిసి నేను కూడా కొన్నిసార్లు ప్రయత్నించా. అయినా అమ్మ బాగా వంట చేస్తుంది. ఇక మా ఇంట్లో వంటమాస్టర్ శీను సూపర్‌గా వండుతాడు. తన చేతివంట తిన్నాక మేం ఏం చేసినా వేస్టే.

మీ ఫేవరేట్ ఫుడ్ ఐటమ్?
చరణ్ : నాకు ఆంధ్రా వెజిటేరియన్ ఫుడ్ అంటే ఇష్టం. నాన్‌వెజ్‌పై పెద్ద ఆసక్తి లేదు. అయితే బాడీ ఫిట్‌నెస్ కోసం నాన్‌వెజ్ తినక తప్పడం లేదు. నాకు పర్టిక్యులర్‌గా బెల్లంతో చేసిన కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టం. ఏ ఫుడ్ ఐటమ్‌లోనైనా కొంచెం బెల్లం తగిలిస్తే ఇష్టంగా తింటా.

ఇండస్ట్రీలో మీ బెస్ట్‌ఫ్రెండ్స్ ఎవరు?
చరణ్ : రానా, శర్వానంద్... వీళ్ళిద్దరూ నేను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే ఫ్రెండ్స్. రానా, నేను స్కూల్లో బెంచ్‌మేట్స్‌మి కూడా.

మీ సమకాలిక హీరోల్లో క్లోజ్ ఎవరు?
చరణ్ : అందరూ నాకు క్లోజే.

ఎన్టీఆర్, మీరూ ‘బావా, బావా’ అని పిలుచుకుంటుంటారట?
చరణ్ : అలా ఏం లేదే! మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. లాస్ట్ ఇయర్ దీపావళికి తను మా ఇంట్లోనే ఉన్నాడు. ఆ మధ్య వాళ్లింట్లో హోమ్ థియేటర్లో కూర్చుని ఇద్దరం ‘నాయక్’ సినిమా చూశాం. తన ‘బాద్‌షా’ ఓపెనింగ్‌కి కూడా వెళ్ళాను.


Photo


మరి బయటేమో అభిమానులు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటుంటారు?
చరణ్ : నేను అదే వద్దని చెబుతున్నా. మేమిక్కడ బాగానే ఉంటాం. వాళ్లూ అలానే ఉండాలి. ఈ క్యాంప్‌లు, గ్రూపులు ఎందుకు?

ఈ బుధవారం మీ పుట్టినరోజు కదా.. ఇప్పటివరకూ మర్చిపోలేని పుట్టినరోజు?
చరణ్ : నా ఐదో పుట్టినరోజుని ఎప్పటికీ మర్చిపోలేను. మా ఫామ్‌హౌస్‌లో చాలా గ్రాండ్‌గా చేసారు. చాలామంది సినీ ప్రముఖులు వచ్చారు. నాకు ఊహ తెలిసాక జరిగిన పుట్టినరోజు కాబట్టి బాగా గుర్తుండిపోయింది.

మరి.. ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటి?
చరణ్ : పుట్టినరోజు అయ్యాక కలవండి. చెబుతాను.. బై.

సంభాషణ: పులగం చిన్నారాయణ

నా ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి. ఆవిడలాగా డిసిప్లిన్ ఉన్న హీరోయిన్లు ఈ జనరేషన్‌లో ఎవ్వరూ లేరేమో.

ఎక్కువగా యానిమల్, డిస్కవరీ చానల్స్ చూస్తుంటాను.

ఈ మధ్య ‘మిర్చి’ చూశా. నాకు బాగా నచ్చింది. ప్రభాస్ చాలా బావున్నాడు.

రాజకీయాలపై ప్రత్యేకమైన ఆసక్తి లేదు. కానీ, అవగాహన ఉండాలి కాబట్టి తెలుసుకుంటుంటాను.

ఫేస్‌బుక్, ట్విట్టర్ ఫాలో అయ్యేది చాలా తక్కువ. ఒకప్పుడు ట్విట్టర్ ఉండేది. ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ చేసేశా. ఏదైనా సరే గుప్పిట్లో ఉంటేనే ఓ క్యూరియాసిటీ ఉంటుంది. ఇలా ప్రతిక్షణం అప్‌డేట్స్ ఇస్తుంటే, వాళ్లకేం ఆసక్తి ఉంటుంది?

గాసిప్స్, రూమర్స్‌ని అస్సలు పట్టించుకోను. వాటిని ఆపలేం కూడా. ఓ యాక్టర్‌గా ఉన్నప్పుడు ఇవన్నీ కామనే. అయితే వ్యక్తిగతంగా బాధపెట్టే గాసిప్స్ రాయకూడదు.

మంచి కథ దొరికితే మల్టీస్టారర్స్ కచ్చితంగా చేస్తా.

ఆంధ్రాలో పల్లెటూళ్లని, అక్కడి కల్చర్‌ని నేను చాలా మిస్సయిపోయా. ఈసారి సంక్రాంతికి నిడదవోలు, పాలకొల్లులాంటి ఊళ్లకు వెళ్లాలనుకుంటున్నా.

సిక్స్ ప్యాక్ చేసే ఆసక్తి లేదు. అందరూ చేశారని నేనెందుకు చేయాలి?

నేను రైస్ మానను...
ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అస్సలు పాటించను. నాకేది నచ్చితే అది తినేస్తా. నేను లంచ్, డిన్నర్‌లో కూడా రైస్ తీసుకుంటా. చాలామంది రైస్ తింటే లావైపోతామని మానేస్తారు. డైనింగ్ టేబుల్ దగ్గర ఎలాంటి నిబంధనలు పెట్టుకోకూడదు. ఎంత తిన్నా ఇంకో గంట ఎక్కువ కష్టపడి జిమ్ చేసి తగ్గించేసుకోవచ్చు. ఈ మధ్య అంతా డైటింగుల పేరు చెప్పి ఫుడ్ మానేస్తున్నారు. సరైన వయసులో సరిగ్గా తినకపోవడం వల్లనే పౌష్టికాహార లోపం ఏర్పడి 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులు, ఇతరత్రా వ్యాధులు చుట్టుముట్టేస్తున్నాయి. అందుకే అందరూ న్యూట్రిషన్ ఫుడ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. శరీరానికి కావాల్సిన మినరల్స్ దొరికే ఫుడ్‌ని కంపల్సరీగా తినాలి.