all

Thursday, March 21, 2013

తాగునీటితో రోగాలు....

 

డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య
ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌,
హైదరాబాద్‌.
98496 69282


తాగునీటితో దాహం తీరుతుంది కానీ, రోగాలు వస్తాయా? అని అనుకోకండి. ఇలా అనేవారికి, పిచ్చా? చాదస్తమా? అని ముక్కు మీద వేలు వేసు కోకండి. మనకు వచ్చే చాలా రోగాలు మనం తాగే నీటి వల్లనే వస్తాయన్నది చేదు నిజం. మనం తాగే నీళ్ళు బాగున్నాయని మనమందరం అనుకుంటూ ఉంటాం. నిజం చెప్పాలంటే మనం తాగే నీళ్ళు, చాలా సందర్భాల్లో కలుషితమైన నీళ్ళే! ఎండా కాలమే కాక, వానాకాలంలోనూ నీళ్ళు కలుషితం అవుతాయి. ఇవాళ్టికీ మన దేశంలో కేవలం 32 శాతం ఇళ్లకే రక్షిత మంచినీటి వసతి ఉంది. 2011 నాటి జనాభా లెక్కలు ఆ సంగతి చెబుతున్నాయి. సాధారణంగా నీళ్లలో సూక్ష్మజీవులు ఉంటాయి. వీటి ద్వారానే జబ్బులొస్తాయి. అందుకే వీటిని 'వాటర్‌ బోర్న్‌ డిసీజెస్‌' అంటారు. కలరా, టైఫాయిడ్‌, చీము, రక్త విరేచనాలు, నీళ్ల విరేచనాలు, పచ్చ కామెర్లు, పోలియో, అమీబియాసిస్‌, నులి పురుగుల లాంటి వ్యాధులు ఈ సూక్ష్మజీవులతో వస్తాయి. అలాగని, నీటిలో అధికంగా ఫ్లోరిన్‌ ఉండడం వల్ల ఫ్లోరోసిస్‌ వస్తుంది.
ఎండాకాలంలో నీళ్లు కలుషితం కావొచ్చు. ఎందుకంటే, నీటి వనరుల్లో నీళ్ళు ఇంకిపోవడం వల్ల నీ ళ్లు కలుషితం అవుతాయి.
ఇక, వానాకాలం నీటి వనరుల్లోకి మురికి నీరు చేరుతుంది. కాబట్టి అప్పుడూ నీళ్ళు కలుషితం అవుతాయి.
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 32 శాతం ఇళ్లలోనే రక్షిత మంచి నీటి సరఫరా ఉంది.
కలరా, నీళ్ల విరేచనాలు ప్రాణాంతకం కావచ్చు. ఇక, పచ్చ కామెర్లు దీర్ఘకాలం బాధిస్తాయి. పచ్చ కామెర్లు ముదిరితే ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంది. పోలియో వల్ల జీవితాంతం అంగవైకల్యం బాధిస్తుంది. నులి పురుగుల వ్యాధి, అమీబియాసిస్‌ వ్యాధులు మనుషులను బాధపెడతాయి.


నివారణ
తాగునీటితో వచ్చే జబ్బులను నివారించే వీలు ఎంతైనా ఉంది.
ముందుగా మన తాగునీటి వనరులను కాపాడుకోవాలి.
వీటిలో మలమూత్రాలు కలవకుండా జాగ్రత్త పడాలి.
తాగునీటి వనరుల్లో పశువులను కడగకూడదు.
తాగునీటి వనరుల్లో ఆరోగ్య కార్యకర్త, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపేలా చూసుకోవాలి.
గొట్టపుబావి (బోర్‌వెల్‌) ఉంటే, ఆ నీళ్లే తాగడం మంచిది. ఆ బావి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
గుంటల్లోని, చెరువుల్లోని, వాగుల్లోని నీటిని తాగ కూడదు.
తాగునీటి వనరుల్లోని చెత్తా చెదారాన్ని తరచుగా తొలగిస్తూ ఉండాలి.
ఆరోగ్య కార్యకర్త నుంచి క్లోరిన్‌ మాత్రలు తీసుకొని, గృహాల్లోని నీటిని క్లోరినేషన్‌ చేసుకోవాలి.
కాచి చల్లార్చిన నీరు తాగడం అన్నింటి కన్నా ఉత్తమమైన చర్య. నీరు మరిగేటప్పటి నుంచి దాదాపు15 నిమిషాలు కాచాలి. ఏ పాత్రలో వేడి చేస్తామో అదే పాత్రలో చల్లారనీయాలి. స్నానం చేయడానికి సాధారణ నీళ్లను వాడాలి.
మన దేశంలో వ్యాధుల వల్ల ఏటా 7.80 వేల మంది చనిపోతున్నారు. మొత్తం మరణాల్లో 7.5 శాతం మరణాలు మంచినీరు, పారిశుద్ధ్యం లేనందు వల్ల సంభవిస్తున్నవే అంటే ఆశ్చర్యం లేదు.
మన జి.డి.పిలో 6.4 శాతం నిధుల్ని జబ్బులకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
చిన్నపిల్లల మరణాలకు రెండో అతి పెద్ద కారణం - నీళ్ల విరేచనాలు. మిగతా కారణాలే కాక మంచినీళ్ళు కలుషితం అవడమే ప్రధాన కారణం.
అతిసారకు సులభమైన చికిత్స చేయవచ్చు. నోటి ద్వారా ఇచ్చే లవణా లతో చికిత్స చేస్తారు. దీన్నే 'ఓ.ఆర్‌.ఎస్‌ చికిత్స' అంటారు. నీటినీ, లవణాలనూ శరీరం కోల్పోవడం వల్ల మరణాలు జరుగుతాయి. కాబట్టి శరీరానికి నీరు, లవణాలు అందించాలి. ఇది శాస్త్రీయమైన విధానం. దీంతో పాటు సాధారణ ఆహారం ఇవ్వాలి. పాలు తాగే పిల్లలకు తల్లిపాలు పట్టాలి.
వ్యాధుల నివారణలో చేతులను శుభ్రంగా కడుక్కోవడం ఒక మార్గం. సబ్బుతో 30 సెకన్లు కడుక్కోవాలి. ముఖ్యంగా మల, మూత్ర విసర్జన చేశాక ఈ శుభ్రతను మరింత పాటించాలి.
కలరాకు నోటి ద్వారా ఇచ్చే లవణాలతో చికిత్స చేస్తారు.


ఒంట్లో నీటిలేమిని ఎలా తెలుసుకోవాలి?
నీళ్ల విరేచనాల వల్ల ఒంట్లో నీటి లేమి రాకుండా చూసుకో వాలి. జాగ్రత్త తీసుకోవాలి. దీన్ని ఈ లక్షణాల బట్టి కనుక్కోవచ్చు.
నోరంతా ఒకటే ఎండిపోయినట్లు ఉండడం.
కళ్లు లోపలకు పోవడం.
బాగా దాహమేస్తుంది.
చర్మం సాగదీస్తే, వెంటనే ముడుచు కోకుండా చాలాసేపు అలాగే ఉంటుంది.
ఈ లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి, అత్యవసర చికిత్స చేయించాలి.
టైపాయిడ్‌ జ్వరాన్ని వైడాల్‌ పరీక్షతో నిర్ధారిస్తారు. మందులతో చికిత్స చేస్తారు. అమీబియాసిస్‌కు, నులిపురుగులకు ఔషధాలతో చికిత్స చేస్తారు. ,

ఆరోగ్యానికి జామ

 

ఏ సీజన్లో అయినా కనిపించేవి, వెంటనే కొనాలని అనిపించేవి జామకాయలు.
పూర్వం ప్రతి ఇంట్లో ఓ జామచెట్టు తప్పనిసరిగా ఉండేది.
సాధారణంగా ఏ పండ్లూ ఇష్టపడని వాళ్ళు కూడా మరో ఆలోచన లేకుండా ఆరగించేది జామ.
మధుమేహం లాంటి వ్యాధిగ్రస్తులూ నిర్భయంగా తీసుకునేది జామ.
ఎక్కడబడితే అక్కడ దొరుకుతుంది కదా అని దీన్ని తక్కువగా తీసిపారేయాల్సిన పని లేదు.
నిజానికి జామలో ఉన్నన్ని సుగుణాలు మరే పండులోనూ కనిపించవు.
ఇది దోరగా జామ కొరికితే వచ్చే కమ్మదనం అంత నిజం! ఓ రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికీ అందుబాటులో దొరికే పండు కూడా!

జామ పండ్లలో విటమిన్‌ సి బాగా దొరుకుతుంది. నమ్మడానికి కష్టంగా ఉన్నా కమలా ఫలాల కన్నా, జామ పండ్లలో 5 రెట్లు ఎక్కువగా విటమిన్‌ సి ఉంటుందట. అంటే జామను నిమ్మ, ఉసిరి పండ్లకు సాటిగా చెప్పుకోవచ్చు.
కేవలం విటమిన్‌ సి మాత్రమే కాదు, జామలో విటమిన్‌ ఎ, బిలూ వున్నాయి.
క్యాల్షియమ్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ లాంటి పోషకాలకు జామపండ్లు పెట్టింది పేరు.
జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌కు స్థావరం జామ.
అవే కాకుండా స్త్రీలలో సర్వసాధారణంగా ఎదురయ్యే ఋతుస్రావ సమస్యలను దూరం చేస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది.
గుండె పనితనాన్ని మెరుగుపరుస్తుంది.
స్కర్వీవ్యాధిని దూరం చేయడంలో జామ పండ్లు ఎంతో శక్తిమంతమైనది.
కాస్తంత జలుబు వచ్చి, ముక్కు కారుతోందని అనగానే జామ పండ్లు తినరు కొందరు. కానీ, వైద్య శాస్త్ర విషయాలు తెలిసిన ఆహార నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, జలుబుకు విరుగుడుగా జామ సమర్థంగా పనిచేస్తుందిట.
డయేరియా, డిసెంట్రీలకు జామ విరుగుడు అని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.
చర్మ సంరక్షణ పెంపొందించడంలో దీనికి ఇదే సాటి.
స్థూలకాయ బాధితులకు జామ పండ్లు తినడమే మంచి పరిష్కారం. జామకాయ తినడంతో సులువుగా కడుపు నిండి ఎక్కువ తినలేరు.
దానాదీనా చెప్పొచ్చేది ఏమిటంటే, మీ ఆహారంలో జామకూ సముచిత స్థానమివ్వండి. ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోండి.

పరీక్షల ఒత్తిడికి దూరంగా...


 
NewsListandDetails



రేపట్నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. విద్యార్థులందరిలో టెన్షన్‌ మొదలవుతోంది. సంవత్సరమంతా చదివినది ఒక ఎత్తయితే, చదివింది గుర్తుపెట్టుకుని పరీక్షలో మంచిగా రాయడం ఒక ఎత్తు. సరైన సూచనలు లేక చాలా మంది విద్యార్థులు పరీక్షల్లో నిరాశకు గురవుతుంటారు.
అలాంటివి ఎదురుకాకుండా పరీక్షలకు మిమ్మల్ని మీరు సంసిద్ధత చేసుకోవడానికి కొన్ని సూచనలు...






- పరీక్షల రోజుల్లో రాత్రి 2,3 గంటల వరకు చదువవద్దు. చదవాల్సింది ఏమైనా ఉంటే రాత్రి 12గంటలలోపు పడుకుని తెల్లవారుజామున లేచి మిగిలిన భాగం చదువుకోండి. పరీక్ష ముందురోజు రాత్రి తగినంతగా నిద్రపోవాలి. కొంతమంది ఎగ్జామ్‌ హాల్‌కి వెళ్లే వరకూ చదువుతూనే ఉంటారు. దీనివల్ల బ్రెయిన్‌లో కన్‌ఫ్యూజన్‌ ఏర్పడి మేలుకన్నా కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

- పరీక్షకు వెళ్లే ముందు రోజూ మళ్లీ కొత్త అంశాలు చదవకుండా అప్పటిదాకా నేర్చుకున్న వాటిని మననం చేసుకోవాలి. పరీక్షల సమయంలో ఇతర వ్యాపకాలను పక్కనబెట్టి చదువు మీద దృష్టి కేంద్రీకరించాలి. ప్రతీక్షణం విలువైందని భావించి చదవాలి. చదివింది ఏమాత్రం తడబడకుండా అనువైన విధంగా గుర్తుకు తెచ్చుకుని పరీక్ష రాస్తే మంచి మార్కులు సాధించవచ్చు. పరీక్షల విషయంలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సమాచారాన్ని అంతా మెదడులో ఓ క్రమంలో స్టెప్‌ బై స్టెప్‌ సంక్షిప్తం చేయాలి.

- పరీక్షలప్పుడు తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలు తినాలి. జిగురుగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు వంటివి మంచివే. పరీక్షల సమయంలో విద్యార్థులు వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం మంచిది. పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. పరీక్షలో ఎక్కువగా టీలు తీసుకోవడం మంచిది కాదు. కారం, మసాలాలు లేని ఆహారం పరిమితంగా తీసుకోండి. అవసరానికి మించి తినకూడదు. ఆకలితో పరీక్షకు వెళ్లకూడదు.

- పరీక్ష హాలు వరకు పుస్తకాలు తీసుకువెళ్లి చివరి నిముషం వరకు చదివి, కంగారుపడటం మంచిది కాదు. మనసు ప్రశాంతంగా ఉంచుకుని పరీక్ష హాలులోకి ఒక అరగంట ముందే చేరుకోవాలి. హాల్‌టిక్కెట్‌ నెంబర్‌ ప్రకారం ఏ రూమ్‌లో సీటు కేటాయించిందీ ఆవరణలో ఉండే లిస్టులో చూసుకోవాలి. ఆ రూమ్‌లోకి ప్రవేశించే ముందు పరీక్ష రాయటానికి అవసరమైన వస్తువులన్నీ ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. రెండు పెన్నులు, రెండు పెన్సిల్లు, స్కేళ్లు, రబ్బరు, షార్ప్‌నర్లు ఉండేలా చూసుకోవాలి. స్కెచ్‌పెన్‌ సెట్‌, ఒక అడుగు స్కేలు పరీక్షకు తీసుకువెళ్లండి. పరీక్ష హాలులోకి వెళ్లిన తరువాత తనకు కేటాయించిన సీటులో కూర్చొవాలి. సమాధాన పత్రంపై హాల్‌టిక్కెటు నెంబరు సరిగా వేయాలి. వేశాక సరిగా ఉన్నదీ, లేనిదీ చెక్‌ చేసుకోవాలి.

- కొంతమందికి పరీక్ష హాలులోకి ప్రవేశించగానే చెమటలు పడతాయి. వణుకు, గుండెదడ వస్తుంది. ఆ టెన్షన్‌లో జవాబులను మరచిపోతారు. టెన్షన్‌ను భయాన్ని తగ్గించుకుని ధైర్యంగా ఉండండి. పరీక్షలో ఎప్పుడూ కంగారుపడకండి. పేపరు చూడగానే అన్ని ప్రశ్నలు మరచిపోతే భయపడకండి. కొన్ని నిమిషాలు స్థిమితపడితే అన్ని గుర్తుకు వస్తాయి.

- క్వశ్చన్‌ పేపరు ఇవ్వగానే తాపీగా చదివి తర్వాతనే పరీక్ష వ్రాయటానికి ఉపక్రమించండి. ప్రశ్నాపత్రం ఇచ్చిన తరువాత దానిని క్షుణ్ణంగా రెండు లేక మూడుసార్లు చదవాలి. ప్రతి ప్రశ్నను అర్థం చేసుకోవాలి. కొంతమంది ప్రశ్నను పూర్తిగా చదవకుండానే ఒకదానికి బదులు మరోదానికి జవాబు రాస్తారు. ప్రశ్నాపత్రాన్ని సమగ్రంగా చదవినట్లయితే కంగారు తికమక ఉండదు. రాయవలసిన ప్రశ్నలకు టిక్‌ మార్కు పెట్టాలి.

- సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమాధానాలు వ్రాయాలి. ప్రతి ప్రశ్న రాసే ముందు దాని ప్రశ్న నెంబరును సమాధాన పత్రముపై రాయాలి. సమయపాలన పాటిస్తూ ప్రతి ప్రశ్నకు తగిన సమయాన్ని నిర్ణయించుకుని ఆలోగానే సమాధానం రాయడం పూర్తిచేయాలి. ప్రశ్నను అర్థం చేసుకుని దానికనుగుణంగా సమాధానం వ్రాయాలి. ప్రశ్నలకున్న మార్కులను బట్టి సమాధానాలు రాయడం నేర్చుకోవాలి. దీనివల్ల అనవసరంగా సమయం వృధా కాకుండా చూడవచ్చు. సమయానుకూలంగా ముఖ్య విషయాలతో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాస్తే ఫుల్‌మార్కులు సాధించవచ్చు. ఇచ్చిన సమయాన్ని రాయవలసిన ప్రశ్నలకు తగినట్లుగా విభజించుకుని దాని ప్రకారంగా జవాబులు రాయాలి.

- ముందు బాగా వచ్చిన సమాధానాలు రాసి మిగిలినవి తరువాత ప్రయత్నించాలి. ప్రశ్నా పత్రంలో ఎన్ని ప్రశ్నలు రాయమంటే అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి. అదనపు ప్రశ్నలు వ్రాయడం వల్ల సమయం వృధా అవుతుంది కాని మార్కులు పడవు. కష్టమైన ప్రశ్నతో మొదలు పెట్టారంటే మీ మెదడు చురుగ్గా పనిచేయక సమయం వృధా అవుతుంది. ప్రశ్నలకు జవాబులు ఒకే క్రమంలో అంటే ఒకటి, దాని తర్వాత రెండు అలాగా రాయాలని ఏంలేదు. ఏవి బాగా వస్తే వాటిని నెంబరు సరిగా వేసి జవాబులు రాయాలి.

- జవాబుకూ జవాబుకూ మధ్య కొంత ఖాళీ వదలాలి. పదాలు విడివిడిగానూ, లైను దూరందూరంగానూ రాస్తే స్పష్టంగా అర్థమవుతుంది. దిద్దివేతలు, కొట్టివేతలు లేకుండా రాయాలి. సమాధానాలను స్పష్టంగా వేగంగా రాయాలి. సమాధానం పాయింట్ల వారీగా సబ్‌హెడ్డింగ్‌తో రాస్తే స్పష్టంగా అర్థమవుతుంది. వాక్యాలు అర్థమయ్యేలా ఉండాలి. ప్రశ్నను ఎస్సే మాదిరిగా రాయడం కన్నా పాయింట్ల వారీగా రాయడం వల్ల ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది. సాంకేతిక పదాలకూ, ఉదాహరణలకు అండర్‌లైన్‌ వేయండి.

- ప్రతి సెక్షన్‌లోనూ అవసరమైనన్ని ప్రశ్నలకు మాత్రమే జవాబు రాయండి. సెక్షన్‌ వారీగానైనా ఒక క్రమంలో రాసేందుకు ప్రయత్నించండి. పరీక్షల్లో మరి పెద్ద అక్షరాలుగానీ, చాలా చిన్న అక్షరాలుగానీ రాయద్దు. చిన్న అక్షరాలు రాస్తే దిద్దే ఉపాధ్యాయులకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ పేజీలు రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయని అనుకోవద్దు. మీరు రాసిన దానిలో విషయం ఉంటేనే మార్కులు వస్తాయి. ఒక ప్రశ్న జవాబు పూర్తయ్యాక ఒక గీత గీసి, తరువాత ప్రశ్న నెంబరు వేసి దాని జవాబు రాయండి. అవసరమైన కామాలు, ఫుల్‌స్టాప్‌లు పెట్టండి. లైన్‌లైన్‌కు మధ్య గ్యాప్‌ ఉండేలా చూసుకోండి. జవాబులు రాసేటప్పుడు భాషాదోషాలు లేకుండా చక్కటి భాషను ఉపయోగించాలి.

- మార్కులను బట్టి జవాబు రాయాలి. ఐదు మార్కుల ప్రశ్నలకు 20 మార్కులకు రాసేంత జవాబు రాసినా వేసేది ఐదు మార్కులే అని గుర్తుంచుకోండి. అయితే చిన్న జవాబులో ముఖ్యమైన పాయింట్లు చోటుచేసుకోవాలన్న విషయం మర్చిపోకండి. అలాగే పెద్ద జవాబులు రాయవలసిన వాటికి పెద్దగానే రాయండి. ఒకవేళ ఏదైనా ప్రశ్నకు జవాబు రాకపోతే మిగతా అన్ని ప్రశ్నలకూ జవాబులు రాశాక దానివిషయంలో ఆలోచించండి. గుర్తుకు వచ్చినంత మేరకు రాయండి. అంతేగాని పక్కవారిని ముందు వారిని అడగకండి. దానివల్ల మీకు, వారికి కూడా చాలా నష్టం అని గుర్తుంచుకోండి. ఒక్కసారి పరీక్ష రాశాక ఏదో ఒక ప్రశ్నకు రాయవలసిన జవాబులో మరికొన్ని పాయింట్లు గుర్తురావచ్చు. అలాంటి సందర్భాలలో మళ్లీ ఆ ప్రశ్న నెంబరు వేసి, కంటిన్యూయేషన్‌ అని రాసి రాయవచ్చు.

- ప్రతి పేజీలోను కనీసం 20 పంక్తులు రాయండి. పటాలకోసం పెన్నులకు బదులు రంగు పెన్సిళ్లు ఉపయోగించండి. స్వల్ప సమాధాన ప్రశ్నలకు కూడా అవసరమైన చోట పటాలు గీయండి. పటాల్లో భాగాలు సరిగా గుర్తించండి. బొమ్మలను సాధ్యమైనంత నీట్‌గా వేసేందుకు ప్రయత్నించండి.

- తీసుకొన్న ప్రతీ అదనపు సమాధాన పత్రములో, బిట్‌పేపరు, మ్యాపులు, గ్రాఫ్‌ పేపర్లమీద మీ నెంబరు వేయాలి. బిట్‌ పేపరు ఇచ్చిన తరువాత మెయిన్‌ పేపరు ఆపుచెయ్యండి. సులువుగా మార్కులు వచ్చే బిట్‌ పేపరు వెంటనే ప్రారంభించండి. బిట్‌పేపరులో డైరెక్టు ప్రశ్నలకు వెంటనే జవాబులు రాయండి. పరీక్ష పేపరు 5నిమిషాల ముందు ముగించి నెంబర్లు సరిగా వేశారో లేదా పరిశీలించండి. అడిషినల్‌ షీట్లు క్రమంగా అమర్చి, చివరి బిట్‌ పేపర్లు ఉంచి, దారంతో సరిగా కట్టండి. పరీక్ష రాసేటప్పుడు అడిషినల్‌ షీట్లపై వరుస సంఖ్య రాసుకుంటే పరీక్ష చివరి కంగారు లేకుండా వాటికి కట్టవచ్చు.

- జవాబు పత్రం ఇన్విజలేటరుకు ఇచ్చే ముందు జవాబులను ఒకసారి సరిచేసుకోవాలి. అడిషినల్‌ షీట్లను మెయిన్‌ ఆన్సర్‌ బుక్‌లో జతచేసి ముడివేసేటప్పుడు అడిషన్‌ షీట్లు అన్ని వరుస క్రమంలో ఉన్నాయో లేవో సరిచూసు కోవాలి. చివరి ఐదు, పదినిమిషాలు పేపరంతా మరొక్కసారి చదువుకుని, సరిచూసుకోవటానికి వినియోగించాలి.

- ఎక్కడైనా తప్పులు రాస్తే సరిచేసుకునే వీలుంటుంది. పేపర్లను చక్కగా వరుసలో పెట్టి జాగ్రత్తగా ట్యాగ్‌కట్టుట, అడిషినల్‌ షీట్ల మీద నెంబర్‌ సరిగా ఉందీ, లేందీ చూసుకోండి. రాసిన సమాధానాలు సంబంధిత ప్రశ్నలకు రాసినదీ, లేనిదీ ఒకసారి చూసుకోండి. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు ఎగ్జామినేషన్‌ హాల్‌లో ఉండి రాసిన సమాధానములను సరిచేసుకోవాలి. సమాధాన పత్రాన్ని నీట్‌గా ఉంచటం అలవాటు చేసుకోవాలి.

- పరీక్షల్లో ముందురోజు రాసిన పరీక్ష గురించి అనవసరంగా ఆలోచించవద్దు. స్నేహితులతో చర్చిస్తూ సమయం వృధా చేయవద్దు. జరిగిపోయిన పరీక్ష గురించి ఆలోచించకుండా తరువాత పరీక్షకోసం విలువైన సమయం కేటాయించండి. ఆల్‌ ది బెస్ట్‌.
- ఆర్‌.వి.ఎం. సత్యం.

వేసవి చల్లదనానికి...


 
NewsListandDetailsవేసవిలో పుచ్చకాయ, కర్బూజా పండ్లను మార్కెట్లో రాసులుగా పోసి అమ్మటం సర్వసాధారణం.
వాటి ధర కూడా సరసంగానే ఉంటోంది.
ఈ రెండు పండ్ల నుండి తయారయిన షర్బతులు, పానీయాలు వేసవిలో సేదతీర్చటానికి, తాపోపశమానికి బాగా ఉపకరిస్తాయి.
వీటి తయారీ గురించి, ఇంకా పుచ్చకాయ నుండి రసం తీసుకున్న తరువాత మిగిలిపోయే డొప్పలు లేక పెచ్చుల నుండి రుచికరమైన స్వీట్‌ చట్నీ, మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ చట్నీ తయారీ గురించి తెలుసుకుందాం.





పుచ్చకాయ స్క్వాష్‌:- బాగా పక్వానికి వచ్చి లోపల చక్కని ఎరుపు రంగు వచ్చిన పండ్లను ఎంచుకోవాలి.

- పై పెచ్చులు లేక డొప్పల నుండి స్వీట్‌ చట్నీ తయారీకి అనుగుణంగా పండ్లపైన చెక్కును ఆకుపచ్చ రంగు లేనంతవరకు తీసివేయాలి.

- దాన్నుంచి రసం ఉన్న భాగాన్ని వేరుచేయాలి.

- ఆ భాగాన్ని ముక్కలుగా కోసి మిక్సీలో ఆడించి గాని, గిన్నెలో వేసి గరిటెతో గాని పెద్ద చెంచాతో గాని బాగా కుదిపి స్టీలు వైరు జల్లెడలో వేసి రుద్ది రసం పట్టుకోవాలి.

షర్బతు తయారీకి ఈ క్రింది పాళ్లలో అన్ని వస్తువులను సమకూర్చుకోవాలి.
పుచ్చకాయ రసం -3కప్పులు
నిమ్మరసం-ఒక కప్పు
చక్కెర-4 కప్పులు
మంచినీరు-రెండున్నర కప్పులు
నిమ్మ ఉప్పు-5 గ్రా
సోడియం బెంజోయెట్‌(లీటరు షర్బత్‌కు) -ఒక గ్రా.

తయారుచేసే విధానం:
ముందుగా నీటిని మరిగించి చక్కెరను కలిపి తయారయిన పాకాన్ని గుడ్డలో వడగట్టాలి. పాకంలో పుచ్చకాయ-నిమ్మపండ్ల రసాలను బాగా కలగలపాలి. నిమ్మ ఉప్పును, సోడియం బెంజోయేట్‌లను కొద్దిపాటి నీటిలో కరిగించి తయారైన షర్బతులో బాగా కలపాలి. శుభ్రమైన సీసాల్లోకి నింపి బిరడాలను గట్టిగా బిగించి భద్రపరచుకోవాలి. ఇలా తయారయిన షర్బతు ఆరునెలలకు పైగా నిల్వ ఉంటుంది. పుచ్చకాయ షర్బతును ఒక కప్పుకు మూడుకప్పుల చల్లని నీరు కలిపి సేవించవచ్చు.
ఇక కర్బూజాపండ్లు సాధారణంగా తయారుచేసే స్క్వాష్‌ల కంటే ఫ్రూట్‌ నెక్టార్‌ అనే ఒక విశిష్టమయిన ప్రత్యేక పానీయం తయారుచేసుకోవడానికి బాగా అనువ్ఞగా ఉంటుంది.

కర్బూజా పండ్ల నుండి నెక్టార్‌ చేసుకునే విధానం:
బాగా మాగి మంచి సువాసన గల పండ్లను ఎంచుకోవాలి. పండ్ల చెక్కును, గింజలను తీసి మిక్సీలో వేసి గాని, ఇతరత్రా గాని రసాన్ని లేక గుజ్జును తయారుచేసుకోవాలి.
ఈ క్రింది పాళ్లలో చక్కెర, నీరు వగైరాలను కలుపుకోవాలి.
కర్బూజా పండ్ల రసం-మూడు కప్పులు
చక్కెర-ఒకటిన్నర కప్పులు
మంచినీరు-ఐదున్నర కప్పులు
నిమ్మఉప్పు-3గ్రా
సోడియం బెంజోయేట్‌-250మిల్లీగ్రా.

తయారుచేసే విధానం:
బాగా మరిగించిన నీటిలో పంచదార వేసి బాగా కరిగిన తరువాత వడగట్టాలి. పాకాన్ని పండ్ల గుజ్జుతో బాగా కలగలపాలి. ఇలా తయారయిన నెక్టారులో నిమ్మ ఉప్పును, సోడియం బెంజోయేట్‌ను కొద్దిపాటి నీటిలో కరిగించి బాగా కలగలపాలి. పానీయాన్ని బాగా చల్లబర్చి నేరుగా సేవించవచ్చు. నీరు కలిపే పనిలేదు. తయారయిన నెక్టారును శుభ్రమయిన సీసాల్లో నింపి మూతలను గట్టిగా బిగించి ఆరుమాసాలకు పైగా నిల్వ చేసుకోవచ్చు.

పుచ్చ డొప్పల చట్నీకావలసినవి:
పుచ్చకాయ ముక్కలు, గుజ్జు-2.5కిలోలు
చక్కెర-2.5 కిలోలు
ఉప్పు-100గ్రా
అల్లం ముద్ద-12.5గ్రా.
కారం -12.5గ్రా
గ్లేషియల్‌ ఎసిటిక్‌ యాసిడ్‌-2.5 మిల్లీ లీటర్లు
సోడియం బెంజోయేట్‌ -2.5గ్రా
మీకు నచ్చిన మసాలా పొడి-తగినంత

తయారుచేసే విధానం:
ఆకుపచ్చ రంగు లేకుండా చెక్కు తీసిన పుచ్చకాయ డొప్పల నుండి రసం ఉన్న భాగాన్ని వేరు చేసిన తరువాత చిన్నచిన్న ముక్కలుగా చేయాలి. చట్నీకి అనువైన సైజులో ఉండేట్లు ముక్కలను కోసుకోవచ్చు. లేక మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా నల్లగ్గొట్టి వాడొచ్చు. ఇలా తయారుచేసిన పదార్థానికి కిలోకి 100గ్రా. చొప్పున పుచ్చకాయ గుజ్జును చేర్చి స్వీట్‌ చట్నీ తయారుచేస్తే రంగు ఎరుపు తిరిగి కంటికి ఇంపుగా ఉంటుంది. చట్నీకి పాళ్లు ఈవిధంగా కలుపుకుంటే మంచిది. ముందుగా పండ్ల ముక్కలు గుజ్జును బాగా మెత్తగా ఉడికించాలి. మీకు నచ్చినమసాలా పొడిని తగినంత పాళ్లలో కారంతో గూడా కలిపి చట్నీలో వేసి మరికొంత సేపు ఉడికించాలి. ఇంచుమించు హల్వా పాకం వచ్చిన తరువాత గ్లేషియల్‌ ఎసిటిక్‌ యాసిడ్‌ వేసి పొయ్యి మీద దింపాలి.

కొద్దిపాటి నీటిలో సోడియం బెంజోయేట్‌ను కరిగించి చట్నీలో బాగా కలగలపాలి. తయారయిన చట్నీని వెడల్పు మూతగల శుభ్రమైన సీసాల్లో నింపి గట్టిగా మూతలు బిగించి ఆరునెలలకు పైగా నిల్వ ఉంచుకోవచ్చు.
ఈవిధంగా పుచ్చకాయ నుండి రసం గుజ్జు తీసుకున్న తరువాత మిగిలిపోయి పారవేసే డొప్పలు లేక పెచ్చులను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ డొప్పలు కాయ బరువులో సుమారు నాల్గవ వంతు నుండి మూడవ వంతు వరకు అంటే 25 నుండి 33శాతం ఉంటాయన్నది మనం గమనించాల్సిన ముఖ్య విషయం. ఒకవేళ చట్నీ గట్టిపడకుండా జారుగా ఉంటే మీరు కోరుకున్న గట్టిదనం వచ్చేందుకు సరిపడ అరటి లేక వేరే పండ్ల గుజ్జును కలుపుకోవచ్చు. ఈ చట్నీలోనే ఇతర పండ్ల ముక్కలను లేక తురుముగాని, గుజ్జుగాని కలుపుకుని మీకిష్టమైన విధంగా మిక్సెడ్‌ ఫ్రూట్‌ చట్నీని కూడా తయారుచేసుకోవచ్చు. పుచ్చకాయ స్వీట్‌ చట్నీకి సూచించిన ఫార్ములానే దీని తయారీలో కూడా ఉపయోగించవచ్చు. అయితే అన్ని రకాల పండ్ల ముక్కలు లేక గుజ్జును 2.5 కిలోలు ఉండేటట్లు చూసుకోవాలి. ముద్ద ఖర్జూరం, అంజూర, కిస్‌మిస్‌, బాదం, వగైరా పప్పులను చేర్చి మనోరంజకమైన ఇతర రకరకాల కదంబం చట్నీలను కూడా చేసుకుని ఆహ్లాదకరంగా సేవించవచ్చు.

స్థానబలిమి

 

నాగులాపురంలో ఒక పెద్దచెరువు వుండేది. ఆ చెరువులో నీళ్లు ఎంతో శుభ్రంగా, తియ్యగా వుండేవి. అయితే ఆ చెరువులో ఒక మొసలి చేరింది. మొసలి భయంతో ఊరిజనం చెరువులో నీళ్లకోసం రావడం మానుకున్నారు. ఒక సింహం అడవిలో దారి తప్పి ఊళ్లోకి వచ్చి అటుగా వెళుతూ దాహం తీర్చుకోడానికి చెరువులోకి దిగింది.మొసలి ఠక్కున సింహం కాలు దొరకబుచ్చుకుని గట్టిగా కొరకడం ప్రారంభించింది. వదిలించుకోవడం సింహనికి సాధ్యం కాలేదు. ‘‘దయచేసి నన్ను వదిలేయ్యి.

నేను నీ అతిథిని, నీళ్లు తాగడానికి వచ్చాను. అతిథిని చంపడం మహాపాపం’’ అన్నది సింహం. మొసలి విరగబడి నవ్వి ‘‘నా బలం ముందు నువ్వెంత. నువ్వు నా కాలిగోటికి కూడా సరిపోవు. నిన్ను మింగేస్తాను’’ అంటూ ప్రగల్భాలు పలికింది. సింహం ఎలాగో తప్పించుకుని బయటపడింది .కానీ మొసలిమీద ప్రతికారం తీర్చుకోవాలని సింహం గట్టిగా అనుకుంది.

ఒకనాడు సింహం ఆ చెరువు దగ్గరికి వెళ్లి ‘‘మొసలిబావా! పాత విషయాలు మరచిపోదాం! ఈ రోజు నా పుట్టినరోజు. నీకోసం పాయసం, లడ్డూలు తెచ్చాను. గట్టుమీదికి వచ్చి ఇవి తిను’’ అన్నది.

మొసలి తల ఎత్తి చూసింది. సింహం చేతిలో పాయసం గిన్నె, లడ్డూల బుట్ట వున్నాయి. దానికి నోరూరింది.

‘‘నేను గట్టుమీదికి రాను. వాటిని నీళ్లలోకి విసిరెయ్యి’8 అంది మొసలి. ‘‘ఓరి వెర్రిబావా! నీళ్లలో వేస్తే నీటిలోనే కలిసిపోతాయి. ఇక నువ్వేం తింటావ్’’ అంది సింహం.

పాయసం, లడ్డూలు ఘుమఘుమలాడిపోతుండటంతో మొసలి ఆతృతగా గట్టుమీదికి వచ్చింది. అదే అదునుగా సింహం దానిమీదికి దూకబోగా, అటుగా వెళుతున్న ఊరకుక్క ఒకటి మొసలిని దొరకబుచ్చుకుని ఇష్టమొచ్చినట్లుగా కరవసాగింది.

‘‘పొగరుబోతు మొసలీ! నువ్వు నా కంటే బలశాలినని ప్రగల్భాలు పలికావు కదా! నీళ్లలో వున్నంతవరకే నీ బలం. బయటకు వస్తే ఊరకుక్క కూడా నిన్ను తినేస్తుందని అర్థమయింది కదా’’ అంటూ సింహం వెళ్లిపోయింది.

నీతి: స్థానబలిమి చూసుకుని అది తమ బలమే అని గర్వపడరాదు.
 

చెంబునిండా లడ్డూ!

 

ఒక ఊళ్లో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పేరు తగ్గట్టు చాలా ధర్మాత్ముడు. అడిగినవాళ్లకు లేదనుకుండా విరివిగా దానం చేస్తుండేవాడు.ఒకరోజు చంద్రయ్య అనే వ్యక్తి వచ్చి ‘‘నాకు లడ్డూలు తినాలని వుంది. కొంచెం సరుకులు ఇప్పిస్తారా’’ అని అడిగాడు. ధర్మయ్య సరేనని ఒక సంచిలో సరుకులు తెచ్చి ఇచ్చాడు.

చంద్రయ్య ఆ సరుకులు తీసుకువెళ్లి పూటకూళ్ల ముసలమ్మకు ఇచ్చి ‘‘అవ్వా! వీటితో నాకు లడ్డూలు చేసిపెడతావా?’’ అని అడిగాడు. సరేనని ముసలమ్మ సరుకులు తీసుకుని లడ్డూలు తయారు చేసింది. అయితే ఈ వెర్రిబాగుల వాడికి లడ్డూలు ఎందుకులే అని లడ్డూలు దాచి, ఒక చెంబునిండా తియ్యని పానకం కలిపి ఇచ్చింది.

తర్వాత చంద్రయ్య దారంట వెళుతుంటే ధర్మయ్య పిలిచి ‘‘ఏం చంద్రయ్యా! లడ్డూలు తిన్నావా?’’ అని అడిగాడు.

‘‘తినడం ఏమిటి బాబయ్యా! చెంబునిండా తాగాను’’ అన్నాడు చంద్రయ్య అమాయకంగా. చంద్రయ్య ద్వారా విషయం తెలుసుకున్న ధర్మయ్య ఒక సంచిలో సరుకులు తీసుకుని వెళ్లి పూటకూళ్ల ముసలమ్మకు ఇచ్చి లడ్డూలు చేసిపెట్టమని అడిగాడు. ధర్మయ్య మారువేషంలో ఉండటంతో ముసలమ్మ గుర్తుపట్టలేదు.

‘‘ఇంకొక అమాయకుడు దొరికాడు’’ అనుకుని ముసలమ్మ లడ్డూలు చేసి దాచిపెట్టుకుని ఒక చెంబునిండా పానకం కలిపి ధర్మయ్యకు ఇచ్చింది.

వెంటనే ధర్మయ్య మారువేషం తొలగించి ‘‘ఓసి ముసల్దానా! అమాయకులను ఇలా మోసం చేస్తున్నావా?’’ అని గద్దించడంతో ముసలమ్మ భయపడి లడ్డూలు తెచ్చి ధర్మయ్యకు ఇచ్చింది. అంతవరకూ చాటుగా నిలబడివున్న చంద్రయ్య కూడా వచ్చి తన లడ్డూలు తీసుకున్నాడు. అటు తర్వాత ముసలమ్మ ఎవర్నీ మోసం చేయలేదు.
 

మాట - మౌనం..kids story

 

గుణశేఖరుడు అనే గురువు వద్ద అనేకమంది శిష్యులు విద్య అభ్యసిస్తుండేవాళ్లు. శిక్షణ పూర్తయిన తర్వాత గురువు తన శిష్యులకు తగిన వృత్తిని సూచిస్తూండేవాడు. హితేంద్రుడు, జితేంద్రుడు అనే ఇద్దరు శిష్యులు చదువు పూర్తిచేసుకుని వెళ్లిపోతుండగా గురువు హితేంద్రుడిని పిలిచి ‘‘నీవు మాటలను నమ్ముకుంటే పైకి వస్తావు’’ అని చెప్పాడు. జితేంద్రుడితో ‘‘మౌనాన్ని నమ్ముకుంటే పైకి వస్తావు’’ అన్నాడు.

చాలా దూరం వచ్చిన తర్వాత హితేంద్రుడికీ, జితేంద్రుడికీ గురువు ఎవరిని మాటలను నమ్ముకోమన్నారు, ఎవరిని మౌనాన్ని నమ్ముకోమన్నారు అనే విషయంలో తికమక ఏర్పడి ఇద్దరూ వాదులాడుకున్నారు.

చివరికి హితేంద్రుడు మౌనాన్ని, జితేంద్రుడు మాటలను నమ్ముకోవాలని గురువు చెప్పినట్లు భావించి ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు.

హితేంద్రుడు ఒక పాఠశాలలో అధ్యాపకుడుగా చేరాడు. గురువు తనను మౌనాన్ని నమ్ముకోమన్నాడనుకుని అతను విద్యార్థులతో ఎక్కువగా మాట్లాడకపోవడంతో ఇతనికి ఏమీరాదనుకుని ఉద్యోగంలో నుంచి తీసివేశారు.

జితేంద్రుడు ఒక జమీందారు వద్ద లెక్కలు రాయడానికి చేరాడు. గురువు తనను మాటలను నమ్ముకోమని చెప్పాడనుకుని అతను జమీందారుతో, నౌకర్లతో విపరీతంగా మాట్లాడుతుండటంతో లెక్కలన్నీ తప్పులు పోయేవి. దాంతో జమీందారు అతనిని పని నుండి తీసివేశాడు. ఎవరు ఏ పనిచేయాలో తెలియకపోవడం వల్ల ఇద్దరూ ఎదురుదెబ్బ తిన్నారు.
 

పండితుడు-దొంగ ..Kids story

 

కాళి అనే ఒక దొంగ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవిస్తుండేవాడు. అతడు చేసే పనులకు కోపగించుకున్న ఆ గ్రామవాసులు దొంగను తరిమికొట్టడంతో కాళి వేరే ప్రాంతానికి వెళ్లి దొంగతనాలు చేయసాగాడు.

ఒకరోజు దొంగతనం చేస్తుండగా పట్టుబడిన కాళిని న్యాయాధికారి దగ్గరికి తీసుకువెళ్లారు గ్రామస్థులు.

‘‘ఈ ప్రాంతంలో దొంగతనం అతిపెద్ద నేరం. ఇందు కు నీకు మరణశిక్ష విధిస్తున్నాను’’ అని న్యాయాధికారి తీర్పు ఇచ్చాడు. కాళి తనలో తాను ఏదో మాట్లాడుకోవడం చూసి ‘‘ఇతను ఏమంటున్నాడు’’ అని న్యాయాధికారి ప్రశ్నించాడు.

అందుకు ఒక పండితుడు ‘‘ఇతను మన ప్రాంతంవాడు కాదు. ఇతను మాట్లాడుతున్నది కోయ భాష. మీ వంటి ధర్మప్రభువులు ఇలా చేస్తా రా?’’ అని తన భాషలో అంటున్నాడు’’ అని చెప్పాడు.

అంతట న్యాయాధికారి కాళి మరణశిక్ష రద్దు చేసి కారాగార శిక్ష విధిస్తున్నానన్నాడు.
వెంటనే మరొక పండితుడు లేచి ‘‘అయ్యా! అతను మాట్లాడింది కోయదొరల భాష కాదు. కొండదొరల భాష. తన భాషలో మిమల్ని నిందిస్తున్నాడు ’’ అని చెప్పాడు.
అందుకు న్యాయాధికారి మొదటి పండితుడు చెప్పిన అబద్ధం కాళి ప్రాణాలను రక్షిస్తే మీరు చెప్పిన నిజం అతని ప్రాణాలు తీస్తుంది. కాబట్టి అతడిని కారాగారంలోనే ఉంచండి’’ అని చెప్పాడు.

నీతి: ప్రాణాలు తీసే నిజం కన్నా ప్రాణాలు కాపాడే అబద్ధం మిన్న.
 

బాస్మతీ శతకం!

 

వంటలు
ఆకలికి... మెన్యూ అక్కర్లేదు.
నిజమే కానీ -సమ్‌టైమ్స్ కంటికి, పంటికి టేస్ట్ అవసరమౌతుంటుంది!
ఏదో ఇంత రైస్ ఉంది కదాని సరిపెట్టుకోవవి!
అదే రైస్ వంద రంగుల్లో కనబడాలి.
అదే రైస్ వంద రుచులుగా మారాలి.
అందుకే -బాస్మతి రైస్‌తో... ఈవారం పేజీ పట్టినన్ని పులావ్ వెరైటీస్!


చైనా టౌన్ పులావ్

కావలసినవి
బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు, నూనె - 3 టీ స్పూన్లు, మష్రూమ్స్ - 8 (ముక్కలు చేసుకోవాలి), ఎల్లో క్యాప్సికమ్ - 1 (పొడవుగా తరగాలి)
అల్లంతురుము - టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్, లవంగాలు - 2, పచ్చి బఠాణీ - కప్పు, ఉల్లికాడల తరుగు - అర కప్పు, సోయా సాస్ - రెండు టేబుల్ స్పూన్లు, నువ్వులనూనె - టీ స్పూను, బ్రకోలీ - కొద్దిగా, టొమాటో చక్రాలు - నాలుగైదు, బీన్స్ తరుగు - పావు కప్పు

తయారి
బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, ఒక నిముషం పాటు కలపాలి.

మష్రూమ్స్, ఎల్లో క్యాప్సికమ్, పచ్చిబఠాణీ, ఉల్లికాడల తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చి, దగ్గర పడేవరకు సుమారు పది నిముషాలు కలపాలి.

నానబెట్టిన బియ్యం, బఠాణీ, ఉల్లికాడల తరుగు, బీన్స్ తరుగు, సోయాసాస్, నువ్వులనూనె వేసి అన్నీ కలిపి ఉడికించాలి

టొమాటో చక్రాలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.

ఉలవచారు పులావ్

కావలసినవి
బాస్మతి బియ్యం - కేజీ
పెరుగు - 200 గ్రా.
ఉలవచారు - 200 గ్రా.
గరంమసాలా - 20 గ్రా.
పచ్చిమిర్చి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు
పుదీనా - రెండు కట్టలు
ఏలకులపొడి - టీ స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 20 గ్రా.
పైనాపిల్ పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు
మిరప్పొడి - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లితరుగు - 250 గ్రా.(డీప్ ఫ్రై చేయాలి),
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు - తగినంత
బిరియానీ ఆకులు - 3
నెయ్యి - 150 గ్రా.

తయారి
బాణలిలో నెయ్యి వేసి కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లితరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చిపేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి.

చిన్న పాత్రలో కొద్దిగా నూనె వేసి కాగాక అందులో గరంమసాలా, ఏలకులపొడి వేసి వేయించి, నిమ్మరసం, ఉలవచారు వేసి కలపాలి.

పెద్దపాత్రలో రెండు లీటర్ల నీళ్లు పోసి మరిగించాలి.

బిరియానీ ఆకులు, పచ్చిమిర్చిపేస్ట్, ఉలవచారు మిశ్రమం, నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసి గరిటెతో కలిపి ఉడికించాలి.

అన్నం సగం ఉడికిన తర్వాత, నెయ్యి కరిగించి అన్నం మీద వేసి కలపాలి.

మూత పెట్టి సుమారు 20 నిముషాలు ఉడికించాలి.

పుదీనా ఆకులు, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.

సిమ్లా పులావ్

కావలసినవి
బాస్మతిబియ్యం - పావు కేజీ
ఎల్లో క్యాప్సికమ్ - 1, రెడ్‌క్యాప్సికమ్ - 1
గ్రీన్ క్యాప్సికమ్ - 1, స్వీట్‌కార్న్‌గింజలు - కొద్దిగా
మిరియాలపొడి - టీ స్పూన్
ఉప్పు - తగినంత, పచ్చిబఠాణీ - కొద్దిగా
నూనె - 4 టీ స్పూన్లు
బటర్ - 2 టీ స్పూన్లు
అజినమోటో - చిటికెడు

తయారి
బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టాలి.

బాణలిలో బటర్ వేసి కాగాక తరిగి ఉంచుకున్న కూరగాయముక్కలు వేసి వేయించాలి.

మిరియాలపొడి, ఉప్పు వేసి కొద్దిగా వేగిన తరువాత అజినమోటో వేసి కలపాలి.

ఉడికించిన అన్నాన్ని ఒక పెద్ద పాత్రలో వేసి దాని మీద వేయించి ఉంచుకున్న కూరముక్కలు, మిరియాలపొడి మిశ్రమం వేసి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి.

నూర్‌మహల్ పులావ్

కావలసినవి
బాస్మతి బియ్యం - 2 కప్పులు
గరంమసాలా - టీ స్పూను
నూనె - 4 టేబుల్ స్పూన్లు
బిరియానీ ఆకు - 1
ఉప్పు - తగినంత
దాల్చినచెక్క - చిన్న ముక్క
చీజ్ - అరకప్పు, లవంగాలు - 6 క్రీమ్ - 3 స్పూన్లు
జీలకర్ర - టీ స్పూను
కుంకుమపువ్వు - కొద్దిగా
ఏలకులు - 8
పాలకూర రసం - 2 టేబుల్ స్పూన్లు
బటర్ - 2 టేబుల్ స్పూన్లు ఉల్లితరుగు - పావుకప్పు
వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీరతరుగు - 2 టేబుల్ స్పూన్లు

తయారి
బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టాలి.

బాణలిలో నూనె వేసి కాగాక బిరియానీ ఆకు, దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, ఏలకులు వేసి సన్నని మంట మీద వేయించాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ , గరంమసాలా వేసి కొద్దిగా వేయించాలి.

నానబెట్టుకున్న బియ్యం వేసి నాలుగైదు నిముషాలు కలిపి, అందులో నీరు, ఉప్పు వేసి సన్ననిమంట మీద ఉడికించాలి.

ఒక చిన్న బౌల్‌లో చీజ్‌తురుము, క్రీమ్, ఉప్పు వేసి కలపాలి. దీనిని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పాలు, కుంకుమపువ్వు ఉన్న బౌల్‌లో వేయాలి. ఒక భాగం పాలకూర రసంలో వేయాలి.

మూడవ భాగాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి నూనెలో వేయించాలి. (వీటినే నూర్ మహల్ అంటారు)

ఒక పెద్దపాత్రలో అన్నం ఉడకగానే చీజ్ బాల్స్ లేదా నూర్‌మహల్ వేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

షత్రంజీ పులావ్

కావలసినవి
బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పులు
ఎల్లో క్యాప్సికమ్ - ఒకటి
కుంకుమపువ్వు - కొద్దిగా
నూనె - తగినంత
ఉల్లితరుగు - పావుకప్పు
ఏలకులు - 3
బిరియానీ ఆకులు - 2
లవంగాలు - 3
దాల్చినచెక్క - చిన్న ముక్క
అల్లం తురుము - అర టీ స్పూను
సోంపు - టీ స్పూను,
నెయ్యి - 3 టీ స్పూన్లు
జీలకర్ర - టీ స్పూను
కిస్‌మిస్ - 10
జీడిపప్పు పలుకులు - 10
టొమాటో ముక్కలు - పావు కప్పు
ఉప్పు - తగినంత

తయారి
మూడు కప్పుల నీటిలో బియ్యాన్ని గంటసేపు నానబెట్టాలి.

నీరు వడకట్టాలి.

రెండు టీ స్పూన్ల నీటిలో కుంకుమపువ్వును నానబెట్టాలి.

బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.

ఒక పెద్ద పాత్రలో రెండున్నర కప్పుల నీరు, బిరియానీ ఆకు, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, అల్లం తురుము, ఉప్పు, సోంపు వేసి స్టౌ మీద ఉంచి మరిగాక, దింపి నీటిని వడకట్టి, పక్కన ఉంచుకోవాలి.

బాణలిలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర, ఏలకులు వేసి వేగాక, నానబెట్టిన బియ్యం, వడకట్టి ఉంచుకున్న నీరు వేసి సన్నని మంట మీద ఉడికించాలి.

ఉడకడం పూర్తవుతున్న సమయంలో జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ వేసి ఐదు నిముషాలుంచి దించేయాలి.

వేయించి ఉంచుకున్న ఉల్లితరుగు, టొమాటో, కుంకుమపువ్వులతో గార్నిష్ చేయాలి.

చెఫ్: ప్రసాద్‌బాబు
కర్టెసీ: హోటల్ వన్ ప్లేస్
కూకట్‌పల్లి, హెదరాబాద్


సేకరణ: డా. వైజయంతి

ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్