 బీమప్ప 
తాతకి జెరం. పనికి రాలేదు. పాలు పోసే పని నాది. నాకు తోక మా తమ్ముడు. ఉళేనూరులో 
ఓటల్‌కీ, ఇంకా కొందరి ఇళ్ళకీ పాలు పొయ్యాలి. బెన్నూరులో అయినోరి (అయ్యవారు)కీ, 
మరికొందరికీ పొయ్యాలి. ఉళేనూరులో పాలు పోసే పని నాకూ, బెన్నూరు బాధ్యత మా ఇంట్లో 
పనిచేసే బాబన్నకీ చెప్పింది అమ్మ. కానీ, నాకు బెన్నూరు అంటేనే ఇష్టం.
 బీమప్ప 
తాతకి జెరం. పనికి రాలేదు. పాలు పోసే పని నాది. నాకు తోక మా తమ్ముడు. ఉళేనూరులో 
ఓటల్‌కీ, ఇంకా కొందరి ఇళ్ళకీ పాలు పొయ్యాలి. బెన్నూరులో అయినోరి (అయ్యవారు)కీ, 
మరికొందరికీ పొయ్యాలి. ఉళేనూరులో పాలు పోసే పని నాకూ, బెన్నూరు బాధ్యత మా ఇంట్లో 
పనిచేసే బాబన్నకీ చెప్పింది అమ్మ. కానీ, నాకు బెన్నూరు అంటేనే ఇష్టం.
"అమా, మా.. 
నేనూ తమ్ముడు బెన్నూరు ఎలతాం. పంపవా. నడుచుకుంటా ఎల్లి వచ్చేటప్పుడు బస్సులో 
వత్తాం. పంపించమ్మా. 
పంపించమ్మా'' అన్నా.
"పాలక్యానులు మొయ్యలేరు వద్దు'' 
అంది అమ్మ. "నేను మొయ్యగలను. తమ్ముడు చిన్న క్యాను పట్టుకుంటాడు. 
నేను పెద్ద పాల క్యానూ, పెరుగు క్యానూ పట్టుకుంటా''అని పట్టుబట్టా. 
అమ్మ తల 
అడ్డంగా ఊపినా నేను వదల్లా.
"మరి.. నువ్వు అయిద్రాబాదుకి పొయ్యినపుడు ఎవురమ్మా 
బెన్నూరుకి పాల క్యానులు ఎత్తుకుని పొయ్యింది?''
అయిష్టంగానే ఒప్పుకుంది 
అమ్మ.
"సరే ఎల్లండి, కానీ వాగులోనూ, సేకరప్ప తాత వంక దగ్గరా ఆగి పిట్టలెనకాలా, 
పావురాళ్ళెనకాలా పడి తొందరగా రాలేదో.. రేపు చచ్చినా పంపను. ఏడున్నరకల్లా 
ఇక్కడుండాలి. మళ్ళీ బడికి ఎల్లాలి''.
అమ్మయ్య ఎల్లమంది సాలు. ఇంక ఇల్లు 
దాటితే మనిష్టం. అయినోరు తాత దగ్గరికి ఎల్లటం అంటే బలే ఇష్టం నాకూ,మా తమ్ముడికీ. 
తాత బలే ఉంటాడు ఎఱ గా. పొద్దున్నే కట్టేమీద (అరుగు) కూచుని వచ్చేపోయే వాళ్ళకి 
శాత్రం చెప్తాడు. నాలుగింటికే స్నానం చేసి అడ్డనామాలు పెట్టుకుని మెడలో లింగకాయి 
వెండిది జందెంతో ఏసుకుని, ఎండు కొబ్బరి చిప్పలు రెండూ, ఓ గెడ్డ నల్లబెల్లం ఇనప రోలు 
లాంటి దాంటో కొట్టుకుని తింటా ఉంటాడు. అదే తాతకి పొద్దున టిఫిను. పాలూ, పెరుగూ ఎవరు 
పంపినా తాగడు. మా ఇంట్లో నించి ఎల్లిన ఆవుపాలు మాత్రం రోజూ పొద్దన్నే ఓ గ్లాసుడు 
పచ్చివి తాగతాడు. అయినోరు తాతావాళ్ళు వీరశైవులు. ఆ తాత దేవుడితో సమానం. తాతకి 
అన్నీ తెలుసంట. తాత శివాలయంలో పూజ కూడా చేస్తాడు. బెన్నూరులో ఒక 
అలవాటుంది.
వంట పూర్తవగానే ప్రెతి ఇంట్లో కొంచెం అన్నం, కొంచెం రొట్టెలు 
తీసి విడిగా ఒక గిన్నెలో ఏసి పెడతారు. తాత చేతికింద ఉండే మనుషులు తెల్లటి పంచగుడ్డ 
కప్పిన ఒక వెదురు బుట్టలో ఇంటింటికీ ఎల్లి ఆ అన్నం రొట్టెలు తెత్తారు. ప్రెశ్నలు 
అడగటానికి ఇంటికొచ్చిన వాళ్ళందరికీ భోజనం తాత ఇంటోనే. ఇంటో చేసిన వంటా, ఇదీ కలిపి 
వాళ్ళకి భోజనం పెడతారు. ఏ రోజు చూసినా తాత ఇంటి ముందు జనం గుంపులు గుంపులుగానే 
ఉంటారు. కర్ణాటకలో చాలా ఊళ్ళ నించీ వస్తారు తాత కోసం. అంత నమ్మకం వాళ్ళకి. పనులు 
మొదలు పెట్టేవాళ్ళూ, పిల్లలు లేని వాళ్ళూ, గేదలు తప్పిపోయిన వాళ్ళూ తెగ వచ్చే 
వాళ్ళు. అదేం చిత్రమో ఎంత మందొచ్చినా తాత వాళ్ళింటో ఎప్పుడూ ఒక్కళ్ళకి కూడా అన్నం 
తక్కువ కాలేదంట. ఆ తాత పేరు మంత్రయ్య. ఆయనకి కూడా నాన్న మందులు ఇచ్చేవాడు. 
ఆయనతోపాటు నాన్న మాత్రమే కుర్చీలో కూచ్చునేవాడు.
అయినోరు తాత దగ్గరికి 
ఎల్లటం అంటే నాకు ఎందుకిష్టం అంటే, ఎల్లంగానే తాత మాకు చాక్లెట్లు ఇచ్చేవాడు. అదీ 
ఎట్టా అనుకున్నారు. మంత్రం ఏసి మాయ జేసి రప్పించేవాడు. ముందేమో చేతిలో ఒక చాక్లెట్ 
చూపిిచ్చేవాడు. చేతిని గిరాగిరా తిప్పి పిడికిలి ఇప్పితే, నాలుగు చాక్లెట్లు 
ఉండేయి. నాకూ తమ్ముడికీ సంబరం. నేనయితే తాత ఒళ్ళోనే కూచునే దాన్ని. ఆయన దగ్గర గంట 
పెన్ను ఒకటి ఉండేది. గంధం చెక్కతో చేసింది. పెన్ను చివర గంట ఉండేది. అది బలే 
నచ్చేది నాకు. దాంతో ఒక్క పిచ్చి గీతయినా గీసి కానీ వచ్చేదాన్ని కాదు. తాత పక్కన 
ఉన్నవాళ్ళు నన్ను చూడ ంగానే పెన్ను దాచేసేవాళ్ళు. "ఒక్కసారి పెన్నీ తాతా.. '' అంటా 
నేను పెంకిపెట్టే దాన్ని. ఇత్తే దాన్ని రెండు చేతులతో మజ్జిగ కవ్వంలాగా తిప్పి 
ఆడేదాన్ని.
"తాతా ఈ పేనా నాకిత్తావా'' అంటే, "ఇలాంటి పెన్నులు ఎన్నో అరగ 
రాత్తావు ముందు ముందు'' అన్నాడు ఒకసారి.
ఆ సంగతి అమ్మకి చెపితే, "అవును మరి 
రోజుకో పెన్నూ, పెన్సిలూ పారేసి, డబ్బుల్ని అరగదియ్యటానికీ, కరగదియ్యటానికే కదా 
నువ్వు పుట్టింది'' అంది.
అయినోరు తాత దగ్గరికి ఎల్లటమంటే, ఆ దారంతా మాకు 
ఆటలే. ఆ రోజు కూడా ఎగురుకుంటా బయల్దేరాము. క్యాంపు మలుపు దాటి, వాగివతల ఉండే 
శివరావప్ప కూతుర్ని మాట్టాడిచ్చి వాగులోకి వంగి చూసి 'కూ..కూ..కూ..' అని అరిచాము. ఆ 
శబ్దానికి తూముల్లో పూలుకింద, పిల్లర్ల సందుల్లో ఉండే పావురాలన్నీ ఎగిరి పోయినయ్యి. 
బుర్లిపిట్టలూ, జెముడు కాకులూ, కొంగలూ గలగల, టపటప రెక్కలు కొట్టుకుని 'పొద్దున్నే ఈ 
పిల్లమంద ఎవరు?' అన్నట్టుగా మమ్మల్నిచూసి లేచెల్లిపోయినయ్యి. వాగు చప్టాలకిందకి దిగబోయి , అమ్మ గుర్తొచ్చి చప్పున నడక 
మొదలు పెట్టాం. వాగు దాటంగానే రోడ్డుకి అటూ ఇటూ మంత్రియ్య తాత పొలం. ఆ పొలంలో కాయలు 
ఎవరూ దొంగతనం చెయ్యరు. కావాలంటే కూరకి ఒకటి రెండు కోసుకోవచ్చు. 
అత్యాసకి 
ఎల్లి ఎక్కువ కోసుకుంటే తాతకి ఎట్టాగో తెలిసి పోద్ది. అది దాటి ఓ పర్లాంగు నడిత్తే 
సేకరప్ప తాత చేనుకెల్లే వంక. దాని మీద నాలుగు పెద్ద పైపులేసి చిన్న చప్టా కట్టారు. 
అక్కడి నించీ కొద్దిగా లోపలికెలితే ఒక్కటే ఇల్లు. ఆ ఇంట్లో ఇద్దరు ముసలాళ్ళు. ఆయన 
పేరు మైనేని వెంకటేశ్వరరావు. ఆవిడ పేరు బసూలమ్మ. లోపలికి ఎల్లకుండా తిన్నగా ఎలితే 
నాన్న స్నేహితుడు డీఎస్పీ రామిరెడ్డి ఇల్లు. అది దాటి కొద్దిగా లోపలికి ఎలితే 
ఘమాఘమా వాసన వచ్చే ఒన్నూర ఓటలు. ఒన్నూర అంటే ఆ హోటలాయన పేరు. ఒగ్గాణి, మిరపకాయి 
బజ్జీలకి పేరు మోసింది. దాన్ని తప్పుకుని లోనకెలితే , అక్కడుంటద్ది అయినోరు తాత 
ఇల్లు. తెల్ల సున్నం కొట్టి ఎఱ మట్టితో గీతలు గీసి బలే ఉంటుంది ఆ ఇల్లు. అరుగుల మీద 
కాసేపు ఆటలాడుకుంటాం.
పాలు పోసేసి ఆడుకుంటా పాడుకుంటా ఇంటికొచ్చేశాం నేనూ, 
తమ్ముడూ.

 మా అద్రుట్టం 
కొద్దీ రెండో రోజు కూడా బీమప్పకి జొరం తగ్గలేదు. తగ్గేదాకా తాతకి పాలు ఇచ్చే పని 
మాదే. దారంతా తమ్ముడూ నేనూ ఆటలే ఆటలు. అలిసిపోతే కూచ్చోటం, పిట్టలతో మాట్లాట్టం. 
గుండ్రటి గోలీల్లాంటి రాళ్ళు ఏరుకోటం. అబ్బో రోడ్డంతా మాదే. దారిలో రాలిన రేగి 
పళ్ళు ఏరి క్యానులో పోసుకు వచ్చేవాళ్ళం. బాట మీన్నుంచే మైనేని ఎంకటేశ్వర్రావు 
తాతనీ, బసూలమ్మ మామ్మనీ పలకరించే వాళ్ళం. ఒక్కో సారి లోని కెళ్ళి ఆళ్ళతో కాసేపు ఇయీ 
అయీ మాటాడేవాళ్ళం. ఆళ్ళింటికి పెద్దగా ఎవురూ ఎల్లేవాళ్ళు కాదు, ఎందుకో. ఆళ్ళకి 
ఇద్దరు అమ్మాయిలు. ఒక కూతురు చచ్చిపొయిందంట. ఇంకొక కూతురు ఏరే ఊళ్ళో ఉంటందంట. గేదలు 
అవి కూడా లేవు. మామ్మకి గుండెల మీద చిన్న ముడిలాంటి కాయి ఉండేది.
"ఏంటి'' 
అంటే, "ఆపరేషన్ అయ్యింది. గుండె జబ్బు'' అంది.
తాతకి ఎవసాయం చేసే ఓపిక లేదు. 
తేలు మందూ, పాము మందూ వేసేవాడు. డబ్బులు ఇత్తే తీసుకునేవాడు. పెద్దగా ఇంటో సామానూ 
సరుకులూ కూడా ఉండేయి కాదు. చిన్న పూరిల్లు. ఒకసారి మేము రెండు రోజులు ఎల్లలా. మూడో 
రోజు ఎలితే, అలికిడే లేదు. తాతా,మామ్మా ఏమయ్యారు? అనుకుంటా ఇంటి దగ్గరకెళ్ళాం. 
పూరింటో చెరో మంచం మీనా పడుకుని మూలుగుతున్నారు ఇద్దరూ. బయటనించీ పిలిత్తే, లెగవలా. 
లోనికెళ్ళి పలకరించాం. రెండు రోజుల నించీ జెరం అంట. చూత్తే అన్నం గిన్నిలు కూడా 
ఖాళీగా ఉన్నయ్యి. వండుకోటంలా. గబగబా నేనూ తమ్ముడూ వంకలోకి ఎల్లి రెండు కడవల నీళ్ళు 
తెచ్చిచ్చాం. పట్టుకుని లెగిసి మొహాలు కడుక్కున్నారు. ఎమ్మటే నాకో ఆలోచన వచ్చింది. 
"అమ్మమ్మా నేను టీ పెడతా. పొయ్యి ఎట్టా ఎలిగియ్యాలో, టీ పొడి, పంచదారా ఎక్కడుండయ్యో 
చెప్పు'' అన్నా.
రెండు నిమషాల్లో రిజరు పుల్లలతో పొయ్యి ఎలిగిచ్చి గిన్నెలో 
రెండు కప్పుల నీళ్ళు, టీపొడి, పంచదార ఏశా. క్యానులోంచి గ్లాసెడు పాలు వంచి గిన్నెలో 
పోసి నాకు వచ్చినట్టు టీపెట్టి గుడ్డలో వడపోసి రెండు గ్లాసుల్లో పోసి తాతకీ, 
మామ్మకీ ఇచ్చా. క్యానులోంచి కొద్దిగా పెరుగు కూడా ఆల్చిప్పతో తీసి గిన్నెలో ఏసి 
ఇచ్చా.
"అమ్మ కొట్టుద్దేమోనమ్మా, ఎందుకే చచ్చేవాళ్ళమీద ఇంత ప్రేమ'' అంది 
బసూలమ్మమ్మ.
"తిట్టకుం డా ఒకటి చేస్తా లే'' అంటా రెండు గ్లాసుల నీళ్ళు క్యానులో 
పోశా. ఇంక రోజూ అంతే, బసూలమ్మమ్మ వాళ్ళింటి దగ్గర ఆగటం, రెండు గ్లాసుల పాలూ, ఇంత 
పెరుగూ వంచి ఇయ్యటం. వంకలోంచి నీళ్ళు కలిపి ఏమెరగనట్టు ఎల్లిపోవటం.
అట్టా నీళ్ళు 
కలిపిన పాలే రోజూ అయినోరు తాతకి ఇచ్చేవాళ్ళం. ఒక రోజు కల కూడా వచ్చింది. మేం 
క్యానులో నీళ్ళు కలిపిన సంగతి తాతకి తెలిసిపోయిందని. అమ్మ మమ్మల్ని ఇరగకొట్టిందని. 
కానీ మామ్మనీ, తాతనీ తలుచుకుంటే ఏడుపొచ్చేది. ఆళ్ళకి ఎవరూ లేరు కదా మరి! అట్టా ఓ వారం గడిసింది. బడికి లేటవుద్దని ఆ తర్వాత అమ్మ 
మమ్మల్ని మానిపించి నాన్నతో పాలు పంపింది.
పాల క్యాన్లతో పోతున్న నాన్నని 
రోడ్డుకి అడ్డంగా వచ్చి ఒకరోజు బసూలమ్మమ్మ ఆపిందంట "పిల్లలు రాటల్లేదా అయ్యా'' 
అంటా. "ఎందుకమ్మా''అంటే, "ముసలాయన మూసిన కన్ను తెరవటం లేదు. జెరం తిరగబెట్టింది, 
పిల్లలు వంకలో నీళ్ళు కాసిని తెచ్చి పెట్టేవాళ్ళు, టీకి పాలూ, మజ్జిక్కి కాసింత 
పెరుగూ ఏసేవాళ్ళు. ఆళ్ళు వత్తే చిన్ని దేవుళ్ళు వచ్చినట్టుంటది. ఆ మాటా ఈ మాటా 
చెప్తారు. ఆళ్ళురాక మమ్మల్ని పలకరిచ్చే వాళ్ళే లేరు'' అందంట కళ్ళ నీళ్ళు 
పెట్టుకుని.
ఎంటనే నాన్న ఎల్లి తాతని చూసి మందులు ఇచ్చి ఇంజెక్షన్లు 
చేశాడంట.
తరవాత అయినోరు తాత దగ్గరికిపొయ్యి జరిగిన విషయమంతా చె ప్పేశాడంట. 
పాలల్లో నీళ్ళు కలిపినందుకు పిల్లల తరుపున క్షమించమన్నాడంట. మజ్జానం బడి నుంచి 
బోయినానికి ఇంటికొచ్చినప్పుడే ఇదంతా తెలిసిపొయ్యింది మాకు. "సాయంత్రం మీ నాన్న 
రానీయ్యండి.. మీ సంగతి తేలుద్ది'' అని అమ్మ బెదిరించింది. భయం భయంగా సాయంత్రం 
ఇంటికొచ్చాం. నాన్న వాకిట్లోనే ఉన్నాడు. "పాలల్లో నీళ్ళు కలిపి తాతకి పోత్తన్నారంట. 
మంత్రియ్య తాతకే మస్కా కొడతారా?'' అన్నాడు.
అంతే తమ్ముడికీ, నాకూ గుండెలు 
తడారిపోయినయ్యి. "జరిగింది చెపదామనే అనుకున్నాము. అమ్మ కొట్టుద్దేమో అనే భయంతో 
నీళ్ళు కలిపాము. ఇంకెపుడూ చెయ్యం'' అంటా వా..వా అని ఒకటే ఏడుపు.
"రేపట్నించీ 
పాలు మీరే పట్టుకెల్లండి. కానీ మైనేని ఎంకటేశ్వర్రావు తాతయ్యోళ్ళ కోసం అరలీటరు 
ఎక్కువ తీసుకెల్లి పొయ్యండి. పెద్దాళ్ళకి సాయం చెయ్యాలి కానీ అబద్దం చెప్పకూడదు'' 
అని మందలించాడు.
బతికిపొయ్యాం దేవుడా అనుకున్నాం నేనూ, తమ్ముడూ. లేకుంటే 
చింతబరికలు యిరిగుండేయే మా ఈపుల మీద.
కానీ నాన్నకీ, అయినోరు తాతకీ తెలియని ఇంకో 
నిజం ఇంకోటుంది. అదేంటంటే, ఒన్నూర ఓటల్ దగ్గర రెండు ప్లేట్లు ఒగ్గాణి, మిర్చి బజ్జీ 
కొనుక్కుని తమ్ముడూ నేను బాగా లాగిచ్చి ఓటల్ ఆళ్ళకి మరో అర లీటరు పాలు ఎగస్ట్రా 
పోసి, క్యానులో వచ్చిన ఆ ఖాళీని మళ్ళీ నీళ్ళతో నింపేవాళ్ళం. ఒన్నూర ఓటలు ఎనకమాల ఒక 
మఱి చెట్టు ఉండేది. దాని మొదట్టో కూచుని ఈ కార్యక్రమం అంతా కానిచ్చేవాళ్ళం. ఈ 
సంగతి, మీరు కూడా మా నాన్నకి గానీ, అయినోరుతాతకి గానీ చెప్పకండి.
- మన్నం 
సింధు మాధురి
సెల్: 08790906686