all

Thursday, December 6, 2012

పిల్లలేప్రతిబింబాలు--) అలా పెంచాం

ప్రతిపక్షాల నోరు మూయించినంత తేలిక కాదు...
పిల్లల పెంపకం!
వన్డేలో సెంచరీ కొట్టినంత తేలిక కాదు...
పిల్లల పెంపకం!
ఫారిన్ కంపెనీతో బిలియన్ డాలర్ల
డీల్ కుదుర్చుకున్నంత తేలిక కాదు..
పిల్లల పెంపకం!
బాలీవుడ్ బాద్‌షా అయినంత తేలిక కాదు..
పిల్లల పెంపకం!
మరి... మన్మోహన్‌సింగ్, సచిన్ టెండూల్కర్,ముఖేష్ అంబానీ, అమితాబ్ బచన్‌లు...
తమ పిల్లల్ని ఎలా పెంచి ఉంటారు?
వారితో పాటు వారి జీవిత సహచరులు...
ఎన్ని కత్తుల మీద సాము చేసి ఉంటారు?
చదవండి... ఈవారం ‘అలా పెంచాం’లో. 


ప్రధాని కూతుళ్లమని చెప్పుకోరు!

దేశాన్ని సంస్కరణల బాటలో నడిపించిన మితభాషి మన్మోహన్‌సింగ్.. పిల్లల పెంపకంలో అనుసరించిన సంస్కరణలు, ఆచరించిన సూత్రాలేమై ఉంటాయి?! ఏం లేదు, పొదుపుగా మాట్లాడడమే ఆయన పాటించిన సూత్రం! అలాగే పుస్తకాలు చదవడం నేర్పించారు. గురుశరణ్ కౌర్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. పెద్దమ్మాయి ఉపీందర్ సింగ్. రెండో అమ్మాయి దామన్‌సింగ్, ఆఖరి అమ్మాయి అమృతాసింగ్. అమెరికా పౌరహక్కుల పరిరక్షణ సంఘంలో ‘స్టాఫ్ ఆటార్నీ’ అయిన అమృత ఏనాడూ తననొక ప్రధాని కూతురిగా ఎవరికీ పరిచయం చేసుకోలేదు. మిగతా ఇద్దరు కూడా ఇంతే. లో ప్రొఫైల్. దామన్ సుప్రసిద్ధ రచయిత్రి, ఉపీందర్ ఢిల్లీ యూనివర్శిటీలో హిస్టరీ ప్రొఫెసర్. అయినాసరే, తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన నిరాడంబరతతో చాలా సింపుల్‌గా ఉంటారు. ఇక కౌర్ సెన్సిబుల్ మాత్రమే కాదు, ప్రాక్టికల్ కూడ. చిన్నతనంలో పిల్లలు ఇంట్లో ఏ పనీ చేయకుండా పుస్తకాల్లో తలలు దూర్చేస్తే ఆమె ఒక్కోసారి కోప్పడేవారు. ఈ తల్లిదండ్రులు ముగ్గురమ్మాయిల్లో ఎవరినీ కొంచెం ఎక్కువగా కానీ, తక్కువగా కానీ చూళ్లేదు. తమ అభిప్రాయాలు, ఆశలు, కోరికలను పిల్లల మీద రుద్దలేదు. అయితే ఏది చేసినా శ్రద్ధగా చేసేటట్లు ప్రభావితం చేశారు.

పేరుకు గొప్పైనా... పిల్లల దగ్గర పేరెంట్సే! 

ప్రపంచ పారిశ్రామికవేత్తలలో పేరెన్నికగన్న వ్యక్తి ముఖాష్‌అంబానీ. అతని భార్య నీతా అంబానీ. వీరికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. సంపన్నవర్గాల పిల్లలు తరతరాలుగా వచ్చే ఆస్తులను అనుభవిస్తూ, ఎంజాయ్ చేస్తుంటారని చాలామంది అనుకుంటుంటారు. కాని ఎంత కలిమి ఉన్నా వీళ్ల పిల్లలూ బాధ్యత తెలిసిన వ్యక్తులుగానే మసలుకుంటుంటారు. ముఖేష్, నీతా కూడా బాధ్యత గల పేరెంట్స్‌గా అన్నింటికన్నా పిల్లలతో గడిపే సమయమే బెస్ట్ అని చెబుతారు. కొన్నిసార్లు అకస్మాత్తుగా పిల్లల ఆనందంలో పాలుపంచుకునే సందర్భాలు వస్తుంటాయని అంటారు. ఎంతమంది పనివాళ్లున్నా పిల్లలకు మాత్రం తానే స్వయంగా వండి, వడ్డించడాన్నే ఆమె ఇష్టపడతారు. పిల్లల ఆనందంలో పాలుపంచుకోవడం వల్లనే తమ తల్లిని బెస్ట్ ఫ్రెండ్‌గా భావిస్తుంటారా పిల్లలు. ముఖేష్ కూడా ఎంత బిజీగా ఉన్నా కుటుంబం కోసం కొంత స్పేస్ ఉంచుకుంటారు. తనకు ఉన్న సమయంలోనే తాను ఆడుతూ, పిల్లలూ పాల్గొనేలా చేస్తారు. ఎదిగే వయసులో పిల్లల శారీరక బలానికి ఆటలు ఎంతో అవసరం కాబట్టి ఆ ప్రోత్సాహం అందిస్తానంటారాయన.

పేరెంట్స్ అడుగుజాడల్లో... 

సచిన్ టెండూల్కర్ ప్రపంచప్రఖ్యాతి చెందిన క్రికెటర్. భార్య అంజలి వృత్తిరీత్యా డాక్టర్. వీరి సంతానం పదిహేనేళ్ల సారా, పదమూడేళ్ల అర్జున్. సారాకి టెన్నిస్ అంటే ఇష్టం. అర్జున్‌కి క్రికెట్ అంటే ప్రాణం. భార్యాభర్తలిద్దరూ వారి వారి రంగాలలో తీరికలేకుండా ఉన్నప్పటికీ ఆ దంపతులు తమ బిడ్డలను ప్రయోజకులయ్యేలా, విలువలను కలిగి ఉండేలా తీర్చిదిద్దడంలో తగినంత శ్రద్ధ తీసుకుంటున్నారు. తాను విశ్వవిఖ్యాత క్రికెటర్ అయినప్పటికీ బిడ్డల విషయానికి వచ్చేసరికి ఓ సాధారణ తండ్రిలా మారిపోతారు సచిన్. వీలుదొరికినప్పుడల్లా క్రికెట్‌కు సంబంధించిన టిప్స్ కొడుక్కి, టెన్నిస్‌కు సంబంధించిన మెళకువలు కూతురుకు చెబుతుంటారాయన. అయితే భవిష్యత్తులో వారు ఏ రంగంలోకి వెళ్లాలన్నది మాత్రం బిడ్డలే స్వేచ్ఛగా నిర్ణయించుకోవాలన్నది ఈ దంపతుల ఉద్దేశం. సాధారణంగా తల్లిదండ్రులనుంచి బిడ్డలు నేర్చుకుంటారు. అయితే తన కూతురి నుంచి సేవాభావాన్ని నేర్చుకున్నట్లు గర్వంగా చెప్పుకుంటారు సచిన్. శాంతంతో విజయాలను, ఓటమి నుంచి పాఠాలను పిల్లలు నేర్చుకునేలా పెద్దలే జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు ఈ పేరెంట్స్.

వ్యక్తిత్వాన్ని మించిన సంపద లేదు

అమితాబ్ సూపర్‌స్టార్. జయ మరో సూపర్‌స్టార్. వీరి పిల్లలంటే గోల్డెన్ స్పూన్‌తో పెరిగి ఉంటారని అనుకుంటాం. కాని అమితాబ్ దంపతులు.. అభిషేక్, శ్వేతలను సెలబ్రిటీ హోదాకు దూరంగా పెంచారు. ‘‘పిల్లల్లో తాము సెలబ్రిటీల పిల్లలం అనే భావన రాకూడదు’’ అంటారు అమితాబ్. చిన్నప్పుడు తను ఇల్లంతా నీరు పోస్తే తన చేతనే తుడిపించిందట అమితాబ్ వాళ్ల అమ్మ. ‘‘చిన్న పిల్లాడి చేత ఈ పనులు చేయిస్తావా?!’’ అని అమితాబ్ తండ్రి నొచ్చుకుంటే అందుకు ఆమె ‘‘తన పొరపాటును తానే సరిదిద్దుకోవాలని తెలిసేది ఇలాంటప్పుడే’’ అన్నారట. ‘‘ఈ విషయం నాకూ గుర్తు లేదు, నాన్న జీవిత చరిత్ర చదివినప్పుడు తెలిసింది’’ అంటారు అమితాబ్. ఆ మాట ఆయన్ని ఎప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉండేదట. ‘‘వారసత్వపు ఆస్తిని బంధువులు కాజేసినప్పుడు వ్యక్తిత్వం ముందు ఏ సంపదా ఎక్కువ కాదని తరచు అనేవారు నాన్న. ఇలాంటివే నేను నా పిల్లలకు చెప్పాను’’ అంటారు అమితాబ్. జయ మరింత కచ్చితంగా ఉంటారు. ఇంటికి అతిథులు వస్తే వాళ్లకు టీ, బిస్కట్‌లు పిల్లలే ఇచ్చేవాళ్లు. బంధువుల దగ్గర డాబు వద్దని ఆమె అభిప్రాయం. వాళ్ల అభిప్రాయాలు, ఉన్నత వ్యక్తిత్వాలకు అనుగుణంగానే పెరిగారు అభిషేక్, శ్వేత. 

వెలుగుల పందిరి-ఫ్యాషన్

శ్రీరస్తూ, శుభమస్తూ...
అంటూ పెళ్లిపందిరి కళ్యాణకాంతులకు సిద్ధమయ్యే శుభముహూర్తాన మగువల మేనిపై సరికొత్తగా సింగారాలు ఒలకబోసేవి ముచ్చటైన కంచిపట్టుచీరలు.
అపరంజి బొమ్మ నుదుటన బాసికం కట్టే సమయాన నునుసిగ్గుల మెరుపులు అద్దుకొని పారాణి పాదాలపై రెపరెపలాడేవి కంచిపట్టుచీరలు.
అనురాగాల బంధానికి ఆహ్వానం పలుకుతూకోటికలల జీవితానికి బంగారపు సొబగులు అద్దే కంచిపట్టు చీరలు ఈవారం...


1- ఆకాశానికి వంగపండు రంగు అంచును జత చేసినట్టు తలపిస్తోంది ఈ స్వచ్ఛమైన కంచిపట్టుచీర. తారకలను పోలిన కుందన్స్, మెరుపులను జరీగా చేసి అల్లిన జర్దోసీ వర్క్ ఈ చీర కు వినూత్నమైన కళను తీసుకువచ్చాయి. ఈ చీర సింగారం వేడుకలకే వేల కాంతులను తీసుకువస్తుంది.

2- ఆకుపచ్చ, వంగపండు రంగుల కాంబినేషన్‌తో బ్రైట్‌గా వెలిగిపోతోంది ఈ స్వచ్ఛమైన కంచి పట్టు. చీరంతా జరీ కాంతులతో కనువిందు చేస్తోంది. సెల్ఫ్ బ్రొకేడ్, పువ్వుల డిజైన్, ఆకుపచ్చని అంచు, పల్లూ ఈ చీరను ప్రత్యేకంగా చూపుతున్నాయి.

3- గుమ్మడి పువ్వులాంటి అమ్మడి కన్నుల్లో కళ్యాణకాంతులను విరజిమ్ముతోంది ఈ లేత గులాబీ రంగు కంచిపట్టు చీర. అదే రంగు అంచు మరింత వన్నెలను అద్దింది. ఆ అంచుమీద కుందన్స్ మెరుపులు, బంగారు తీగెలతో అల్లినట్టున్న మామిడిపిందెల డిజైన్ పెళ్లి పందిరికి కోటికాంతులను మోసుకొస్తుంది. 

4- పసుపు, కుంకుమ, ఆకుపచ్చ రంగులతో అలరారుతున్న కంచిపట్టు చీర ఇది. సెల్ఫ్ జకార్డ్ డిజైన్‌తో ఈ చీర రిచ్‌గా కనిపిస్తోంది. విశాలమైన బార్డర్, పల్లూ ఈ చీర ప్రత్యేకతలు.
  

అందమె ఆనందం

కీరా ముక్కను గుజ్జు చేసి, పల్చని క్లాత్‌తో రసాన్ని వడకట్టాలి. ఆ మిశ్రమాన్ని దూదితో అద్దుకొని కంటి చుట్టూ తుడవాలి. తర్వాత ఆ దూదిని కనురెప్పల మీద పెట్టుకొని పది నిమిషాలు విశ్రాంతి పొందాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి.

గుడ్ లుకింగ్

మాది విజయనగరం. విశాఖపట్నంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తున్నాను. రోజూ అప్ అండ్ డౌన్ ప్రయాణించాలి. మొదట్లో నా జుట్టు చాలా బాగుండేది. ఈ మధ్య బాగా డ్రై అవడమే కాకుండా, విపరీతంగా ఊడిపోతోంది. ఈ సమస్యకు ఇంట్లోనే చేసుకోదగ్గ పరిష్కారం సూచించగలరు.
- రేవతి, ఈమెయిల్


ముందుగా మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. ఎక్కువగా ప్రయాణిస్తుంటాను అని మీరే చెప్పారు. ప్రయాణం చేసే సమయంలో దుమ్ము, ధూళి, ఎండ బారినపడకుండా జుట్టును క్యాప్‌తో లేదా మఫ్లర్‌తో కవర్ చేసుకోండి. తలంటుకోవడానికి ముందురోజు రాత్రి గోరువెచ్చని నూనెను జుట్టుకు పట్టించి మర్దనా చేసుకోండి. మంచి కండిషనర్ షాంఫూను ఉప యోగించండి. అలాగే షాంపూ చేసుకున్న తర్వాత కండిషనర్‌ను వాడండి. రోజూ పోషకాహారం మీద దృష్టిపెట్టండి. వారానికి ఒకసారైనా పెరుగు లేదా గుడ్డుతో తలకు ప్యాక్ వేసుకోండి. టెన్షన్లు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అయినా సమస్య అలాగే ఉంటే వైద్యుని సంప్రదించి హార్మోన్ టెస్ట్ చేయించుకొని, వారి సూచనలు పాటించండి.

నాది పొడి చర్మం. మూతి చుట్టూ నల్లగా అయ్యింది. అది పోవడానికి ట్యాన్ క్లీనర్‌ని ఉపయోగిస్తున్నాను. కాని ఫలితం లేదు. సరైన సలహా ఇవ్వగలరు.
- సౌజి, ఈమెయిల్


రోజులో చాలాసార్లు మనకు తెలియకుండా చేతులతో ముఖాన్ని రుద్దేస్తుంటాం. దీనివల్ల చర్మం పొడిబారడమే కాదు, నల్లబడుతుంది. చర్మం పై రబ్ చేయాలంటే టిష్యూ పేపర్‌ని ఉపయోగించాలి. రాత్రి పడుకునేముందు మూతి చుట్టూ బ్రైట్‌నింగ్ సీరమ్ రాస్తే నలుపు తగ్గుతుంది.

నా వయసు 22. నా తలలో చుండ్రు ఎక్కువగా ఉంది. దీనివల్ల జుట్టు కూడా రాలుతోంది. మొటిమలు ఎక్కువగా వస్తున్నాయి. యాంటీ డాండ్రఫ్ షాంపూలనే వాడుతున్నాను. అయినా ఫలితం లేదు. చుండ్రు, మొటిమలు తగ్గే ఉపాయం చెప్పగలరు.
- శ్రీ, రామ్‌నగర్


చుండ్రు సమస్య నివారణకు ఎన్నో యాంటీ డాండ్రఫ్ షాంపూలు వచ్చాయి. అయినా సమస్యలో ఏ విధమైన మార్పూ లేదు. మీరు బయోడిగ్రేడబుల్ షాంపూని వాడి చూడండి. అయినప్పటికీ చుండ్రుసమస్య అలాగే ఉంటే ఒకసారి డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. మొటిమల నివారణకు ఉప్పు నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండండి. అలాగే బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఫేస్‌వాష్‌తో ముఖాన్ని కడగండి.

నాది జిడ్డుచర్మం. ముక్కు మీద మొటిమల తాలూకు నల్లమచ్చలు ఉన్నాయి. ఇంకా పెదవులు, మెడ చుట్టూ నల్లగా ఉంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడ్డాయి. వీటివల్ల ఉన్న వయసు కన్నా ఎక్కువగా కనిపిస్తున్నాను. పరిష్కారం చెప్పగలరు.
- అనన్య, మహబూబ్‌నగర్


మొటిమల తాలూకు నల్లమచ్చలు తగ్గాలంటే మంచి బ్రాండెడ్ కంపెనీ యాస్ట్రిజెంట్‌తో రోజుకు మూడుసార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. అలాగే పాలపొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి, ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి ముందు ముఖానికి ప్యాక్‌లా వేసుకోండి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోండి. 

నిజమైన జ్ఞానం


ఒక ఊరిలో ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు. వారిలో ఒకరు సన్యాసిగా మారారు. రెండోవాడు ధనికుడు అయ్యాడు. చాలాకాలం తర్వాత ధనికుడు తన స్నేహితుడిని చూశాడు. స్నేహితుడు జ్ఞానం పొంది ప్రశాంత జీవనం సాగించడాన్ని చూసి సంతోషించాడు. తన ఇంటికి ఒక పూట భోజనానికి రావలసిందిగా కోరాడు. అతను సన్యాసి గనుక ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండాలని వీధి గేటు దగ్గరే తివాచీలు పరచమని ఆజ్ఞాపించాడు.

రెండురోజుల తర్వాత సన్యాసి వెళ్లాడు. ప్రధానద్వారం దగ్గరకి రాగానే సేవకుడు ఆపి ‘‘అయ్యా! మీ స్నేహితుడు మిమ్మల్ని చిన్నచూపు చూడ్డానికే పెద్దఎత్తున ఏర్పాట్లు చేశాడేగాని మీ మీద అభిమానంతో కాదు’’ అని హెచ్చరించాడు. సన్యాసికి కోపం వచ్చింది. పరుగున వెనక్కి వెళ్లి బురద నీళ్లలో కాళ్లు ముంచి మరీ వచ్చాడు. మురికి అయిందని తన సేవకుల్ని తిట్టాడు ధనికుడు.

‘‘వాళ్లని తిట్టకు. ఆ మురికి నా వల్లనే అయింది. నీకంటే ఎంతో గొప్పవాడిని. నీవు ధనికుడివి మాత్రమే. నేను ఎంతో జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను సాధించాను’’ అంటూ తన గర్వాన్ని ప్రదర్శించాడు సన్యాసి. ధనికుడు ఆశ్చర్యపోయాడు. ‘‘నువ్వు సన్యాసం స్వీకరించి ఎంతో ఉన్నతుడవయ్యావని, ఎంతో జ్ఞానం సంపాదించావని, ప్రశాంత జీవనం సాగిస్తున్నావని నేను ఈర్ష్యపడ్డాను. నీకు, నాకు మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని గ్రహించాను.

నాకు ధనార్జన వ్యామోహం, నీకు సన్యాసి అనిపించుకోవాలని వ్యామోహం. నువ్వు సాధించినదంతా కోల్పోయావు. అహం కారంతో ఎక్కువకాలం ఉండలేవు. ఎవరు ఏది సాధించినా, పొందినా అది దేవుని అనుగ్రహమే అనుకోవాలి. కానీ ‘నేను’ అనేదే భయంకరమైన శత్రువు. దాన్ని నువ్వింకా వదులుకోలేదు’’ అన్నాడు. సన్యాసి స్నేహితుడు మారుమాట్లాడకుండా వెళ్లిపోయాడు.

విజయ రహస్యం


జింగో అనే కుర్రాడు కారు ప్రమాదంలో తన ఎడమచేతిని పోగొట్టుకున్నాడు. కానీ అతనికి జూడో నేర్చుకోవాలన్న పట్టుదల ఉండేది. ఇంట్లోవారు, గురువు ఎంత కాదన్నా మొండికేశాడు. తప్పని పరిస్థితిలో గురువు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించాడు.

గురువు దగ్గరికి వెళ్లిన జింగో ఏడాదిపాటు శిక్షణ తీసుకున్నాడు. కానీ చిత్రంగా తన గురువు ఒకే పట్టు నేర్పించాడు. అందులోనే గట్టివాడిని చేశాడు. ఒకరోజు ఉండబట్టలేక ఆ సంగతి అడిగాడు. గురువు నవ్వి, ‘‘నీకు చాలా తెలుసు, ఇదొక్కటే తెలీదు. అందుకనే ఈ పట్టే శ్రద్ధగా నేర్పాల్సి వచ్చింది’’ అన్నాడు. రెండు మాసాల తర్వాత పోటీకి గురువుతో వెళ్లాడు. మొదటి రెండు రౌండ్లలో ప్రత్యర్థులను సునాయాసంగా ఓడించాడు. జింగో ఆశ్చర్యపోయాడు. సెమీస్‌లో కాస్తంత కష్టపడాల్సి వచ్చింది. చివరగా జింగోనే గెలిచాడు.

ఇక టోర్నీ ఫైనల్ ఉన్న ప్రత్యర్థి బలశాలి, వయసులోనూ పెద్దవాడు. అతన్ని చూడగానే ఎలా గెలవగలననుకున్నాడు. కాస్తంత భయపడి రిఫరీతో, పోటీ అతనే గెలిచాడని ప్రకటించమన్నాడు. ఈలోగా రింగ్‌లోకి అతని గురువు వచ్చి పోటీ జరిపించమని పట్టుపట్టాడు. మొత్తానికి పోటీ ప్రారంభమైంది.

ప్రత్యర్థి మొదటి రెండు రౌండ్లలో జింగోను అధిగమించాడు. తర్వాత రెండురౌండ్లలో అనూహ్యంగా జింగో అతడిని చిత్తుచేసి గెలిచాడు. జింగోను టోర్నీ విజేతగా ప్రకటించారు. ఇలా గెలవడానికి కారణమేమిటని గురువును అడిగాడు.‘‘జూడోలో అతి క్లిష్టమైన పట్టులో నువ్వు ఆరితేరావు. ఆ పట్టులోంచి ప్రత్యర్థి బయటపడాలంటే అతడు నీ ఎడమ చేతిని ఒడిసి పట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు!’’ అని నవ్వాడు గురువు.

పోలీస్ లడ్లు!


  

కూల్ హెల్త్

చక్కటి ఆరోగ్యం కోసం..చల్లటి పండు

పుచ్చకాయను చాలామంది వేసవిలో మాత్రమే తినాల్సిన పండుగా పొరబడుతుంటారు. వేసవిలో అది తాపం తీర్చడంతో పాటు మిగతా సీజన్‌లలో ఆరోగ్యాన్నీ పంచుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీళ్లే ఉన్నందున అది దాహం తీర్చుతుంది. మిగతా ఎనిమిది శాతం పదార్థాల్లో ఆరోగ్యాన్నిచ్చే అనేక అంశాలు కూరి కూరి ఉన్నాయి. టొమాటోలో ఉండే లైకోపిన్ ఇందులోనూ పుష్కలంగా ఉంటుంది. లైకోపిన్ ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తుల, పెద్దపేగుల క్యాన్సర్లను హరిస్తుంది. అందుకే దీన్ని ఎల్లవేళలా తింటుండటం మంచిది.

శరీరంలోని విషపదార్థాలను హరించే గుణం ఉండటం వల్ల డయాలసిస్ ప్రక్రియను కనుగొనకముందర దీన్నే శరీరంలోని ప్రమాదకరమైన రసాయనాలను తొలగించడానికి కిడ్నీ రోగులకు ఇచ్చేవారు. ఇందులో పొటాషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తపోటు రోగులకూ మంచిదే. ఇక ఆస్తమా, అథెరోస్క్లీరోసిస్, డయాబెటిస్, ఆర్థరైటిస్ రోగులకు ఇది వరప్రసాదిని అనుకోవచ్చు. పుచ్చకాయ గుండెకూ మేలు చేస్తుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంది. ఇన్ని లాభాలు ఉన్నందున దీన్ని వేసవికే పరిమితం చేయకుండా అన్ని సీజన్‌లలోనూ తినడం మంచిదే.

డబుల్ హెల్త్ బెనిఫిట్స్!

ఇళ్లు, ఆఫీసులను చల్లబరిచే ఏసీ వంటి యంత్రాలు వాతావరణంలోని స్ట్రాటోస్ఫియర్ పొరను దెబ్బతీసి పర్యావరణ అసమతౌల్యానికి దారితీస్తుంది. ఏసీ వాడకాన్ని నియంత్రించుకుంటే పర్యావరణ ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

ఇటీవల మనలో చాలామందికి ఆరోగ్య స్పృహ పెరిగింది. అలాగే పర్యావరణ స్పృహ కూడా. దాంతో ఒకే చర్యతో అటు మనిషి ఆరోగ్యం, ఇటు పర్యావరణ ఆరోగ్యం... ఈ రెండు ఆరోగ్యాలూ సమకూరితే... అంతకన్నా కావాల్సిందేముంది? అందుకే అటు మనుషులకూ, ఇటు వాతావరణానికీ ఈ రెండు విధాలైన ఆరోగ్య ప్రయోజనాలూ సమకూరే కొన్ని పనులను కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అవి...

మీ రవాణాకు సైకిల్ లేదా నడకే బెస్ట్ 

మనదేశంలో ఇటీవల దగ్గరి దూరాలకు సైతం మోటార్ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకస్థాయి వ్యక్తులు సైకిల్ ఉపయోగించడాన్ని స్థాయికి తగనిపనిగా పరిగణిస్తున్నారు. ఇది పర్యావరణానికి మేలు చేసే అంశమని విస్తృత ప్రచారం చేస్తే, అటు వ్యక్తులకూ, ఇటు పర్యావరణానికీ మేలు జరుగుతుంది. వ్యాయామానికి తీరిక లేనివారు తమ రవాణా కోసం సైకిల్ లేదా నడకను ఎంచుకుంటే మంచిది. మోటారు వాహనాన్ని ఉపయోగించకపోవడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది. కర్బన కాలుష్యాల నివారణ వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

త్వరగా నిద్రకు ఉపక్రమించండి 

గతంలో మనం ఎనిమిది లేదా తొమ్మిది గంటల లోపే నిద్రకు ఉపక్రమించేవారం. పదిగంటల వరకు మేల్కొని ఉన్నారంటే అది చాలా ఆలస్యంగా నిద్రపోవడంగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు రాత్రి ఒంటిగంటకు నిద్రపోవడం అన్నది సాధారణంగా మారిపోయింది. దీనివల్ల ఆరోగ్యంపై కలిగే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. వ్యక్తుల ఆరోగ్యంతో పాటు పర్యావరణం సైతం దెబ్బతింటోంది. ఒంటిగంట లేదా రెండు వరకూ మేల్కొని ఉండటం వల్ల విద్యుత్ వినియోగం అధికమవుతుంది. ఫలితంగా ఆ విద్యుత్తుకు ప్రధాన వనరులైన బొగ్గు, గ్యాస్ వినియోగం పెరగడం, దాంతో పర్యావరణంపై భారం కూడా సాధారణమే.

నిద్రగంటలు తగ్గడం స్థూలకాయానికి దారితీస్తోంది. ఫలితంగా కీళ్లనొప్పులు, రక్తపోటు, డయాబెటిస్ వంటి అనేక అనారోగ్యాలకు కారణమవుతోంది. నిద్రగంటలు తగ్గడం వల్ల మెదడులో స్రవించే లెప్టిన్ వంటి హార్మోన్లస్థాయి తగ్గుతుంది. లెప్టిన్ అనే హార్మోన్ మనకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తిలో వినియోగించే సామర్థ్యం ఎంత, ఆకలి నియంత్రణ, అనేక జీవక్రియల నిర్వహణకు ఉపయోగపడుతుంది. దాంతో జీవక్రియల్లో సమతౌల్యం దెబ్బతింటుంది. ఇక ఘ్రెలిన్ అనే మరో హార్మోన్ స్రావం పెరుగుతుంది. ఇది ఆకలిని పుట్టిస్తుంది. నిద్రపోయే గంటలు తగ్గినప్పుడు ఆకలి పెరిగి అనవసరమైన చెత్త తింటూంటాం. దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే త్వరగా నిద్రపోవడం వల్ల వ్యక్తుల ఆరోగ్యాన్ని, పర్యావరణ ఆరోగ్యాన్ని... రెంటినీ కాపాడినట్లే.

ఎయిర్ కండిషన్ వినియోగాన్ని తగ్గించండి 

రక్తం వేడిగా ఉండే క్షీరదాలైన మిగతా అన్ని జీవుల్లాగే... మనిషికీ ఒక స్థిరమైన శరీర ఉష్ణోగ్రత ఉంటుంది. వ్యక్తులలో జరిగే జీవక్రియలు, పరిసరాలను బట్టి దాన్ని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడమనేది మనిషికి స్వాభావికంగానే ఉంటుంది. ఉదాహరణకు పరిసరాలు బాగా చల్లగా ఉన్నప్పుడు జీవక్రియలను వేగవంతం చేసి శరీరాన్ని వెచ్చబరుచుకునే గుణం, పరిసరాలు వేడిగా ఉన్నప్పుడు చెమటలు పుట్టించి శరీరాన్ని చల్లబరుచుకునే గుణం ప్రకృతి మనకు ఇచ్చిన వరం. అయితే మనం ఒక స్థిరమైన ఉష్ణోగ్రత దగ్గర దీర్ఘకాలం పాటు ఉంటున్నామనుకుందాం. దానివల్ల పరిసరాలకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతను మార్పు చేసుకునే ఆ స్వాభావిక శక్తి మనలో క్షీణిస్తుంది. నిత్యం ఏసీలో ఉండే వారికి విటమిన్-డి లోపం కారణంగా అనేక న్యూరలాజికల్ సమస్యలు వస్తున్నాయి. ఎక్కువసేపు ఏసీల్లో ఉండేవారు మందకొడిగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల స్థూలకాయం వంటి ఆరోగ్యసమస్యలు వచ్చి, ఇతర అనారోగ్యాలకు దారితీస్తున్నాయి.

అబార్షన్లు... నివారణ

పండంటి బిడ్డ పుట్టాలన్నది గర్భం ధరించిన ప్రతి మహిళ కల. కానీ అది ఒక్కోసారి కల్ల అవుతుంది. గర్భస్రావం రూపంలో కల నెరవేరకపోవడం దురదృష్టం. చాలా సందర్భాల్లో నెలతప్పిన పది రోజులకే... అది గర్భం అని తెలిసేలోపే రుతుస్రావంలో రక్తస్రావం ఎక్కువగా జరగడం ద్వారా (బ్లీడింగ్ రూపంలో) గర్భస్రావం అయిపోతుంటుంది. ఇలాంటి అవాంఛిత పరిస్థికి కారణాలు, చేయించాల్సిన పరీక్షలు, తీసుకోవాల్సిన చికిత్సలు, గర్భస్రావం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సలహాలు, సూచనల సమాహారమే ఈ కథనం. 

మహిళల్లో రుతుస్రావం మొదలైన నాటి నుంచి లెక్కకడితే 11వ రోజు నుంచి 16వ రోజు లోపల అండం విడుదలవుతుంది. ఆ సమయంలో కలయిక జరిగినప్పుడు పురుషుని నుంచి విడుదలయ్యే వీర్యకణాలు, మహిళ గర్భాశయం ద్వారా ఫెలోపియన్ ట్యూబ్‌లోకి ప్రవేశించి, అక్కడ అండం లోపలకు చేరి ఫలదీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. అలా ఫలదీకరణం చెందిన అండం అనేక కణాలుగా విభజన చెందుతూ, ఆరురోజుల తర్వాత హార్మోన్ల ప్రభావంతో గర్భాశయం లోపలిపొరల్లోకి ప్రవేశించి, అక్కడ పిండంగా రూపాంతరం చెంది, తొమ్మిది నెలల పాటు పెరుగుతుంది.

సాధారణంగా తొమ్మిది నెలలు నిండాక ప్రసూతి జరిగి పండంటి బిడ్డ పుట్టాలి. ఏ కారణంగానైనా ఏడో నెల కంటే ముందుగానే గర్భం నుంచి పిండం బయటపడితే గర్భస్రావం (అబార్షన్) అంటారు. ఇలాంటి సందర్భాల్లో శిశువు సాధారణంగా మృతిచెంది బయటపడటమో లేదా బయటపడి మృతిచెందడమో జరుగుతుంటుంది. (ఒకవేళ ఏడో నెలలో పిండం బయటపడ్డా శిశువు బతికే ఉంటే దాన్ని గర్భస్రావంగా పేర్కొనరు. అప్పుడు దాన్ని ప్రీ-మెచ్యూర్ డెలివరీ అంటారు).

కారణాలు: గర్భస్రావం కావడానికి అనేక కారణాలుంటాయి. సంక్షిప్తంగా...

జన్యుపరమైనవి: చాలా సందర్భాల్లో జన్యుపరమైన కారణాలే గర్భస్రావానికి దోహదపడతాయి. పిండం సరిగా ఏర్పడకపోవడం, ఒకవేళ ఏర్పడితే అది సరిగా ఎదగలేక చనిపోవడం సాధారణం. అండం లేదా వీర్యకణం లేదా పిండంలోని జన్యువు (క్రోమోజోము)ల్లో లోపాల కారణంగా ఇలా జరుగుతుంది. ఇది తొలిచూలు గర్భంలోనే కావచ్చు లేదా వరసగా ఇలాగే జరుగుతుండవచ్చు. తల్లి వయసు 35 ఏళ్లు దాటేకొద్దీ జన్యుపరమైన కారణాల వల్ల అబార్షన్లు ఎక్కువవుతాయి. సరిగా ఎదగలేని, లోపాలు ఉన్న పిండాన్ని ప్రకృతి సహజంగానే మొదట్లోనే బయటకు నెట్టేస్తుంది. తత్ఫలితంగా గర్భస్రావం జరుగుతుంది. జన్యుపరమైన కారణాల వల్ల అయ్యే గర్భస్రావాలకు ఏ చికిత్సా పనిచేయదు.

తల్లికి ఉండే వ్యాధులు: కాబోయే తల్లికి... అదుపులో లేని మధుమేహవ్యాధి, మూత్రపిండాల వ్యాధి, రక్తహీనత వంటి కండిషన్‌లు.

హార్మోన్ల సమస్య: అదుపులో లేని థైరాయిడ్ సమస్య, ప్రొజెస్టెరాన్ హార్మోన్ లోపం, పాలీసిస్టిక్ అండాశయాల వల్ల, హార్మోన్ సమస్యలతో

ఇన్ఫెక్షన్లు: హెర్పిస్, రుబెల్లా, వైరస్, టాక్సోప్లాస్మా, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లతో తీవ్రమైన జ్వరం తీవ్రమైన మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ పోషకాహార లోపాలు కొన్నిరకాల మందుల వాడకం వల్ల... గర్భస్రావాలు జరుగుతాయి.

గర్భాశయంలో లోపాలు: తరచుగా కనపడే లోపం గర్భాశయ కంఠం (సర్విక్స్) వదులుగా అవ్వడం లేదా సర్విక్స్ పొడవు తక్కువగా ఉండటం. దీనివల్ల పెరిగే శిశువు తాలూకు బరువును మోయలేక, 4-7 నెలల మధ్య సర్విక్స్ తెరచుకుని పెద్దగా నొప్పి లేకుండానే శిశువు బయటకు జారిపోతుంది.

కొంతమందిలో పుట్టుకతోనే గర్భాశయంలో లోపాలు అంటే గర్భాశయం మధ్యలో చీలడం లేదా ఆకృతిలో తేడాల వల్ల గర్భాశయం లోపలి పొరల్లో కణుతులు (ఫైబ్రాయిడ్స్, పాలిప్స్) గర్భధారణ తర్వాత కవలలు ఏర్పడటం వల్ల (కొంతమందిలో మాత్రమే) గర్భధారణ తర్వాత తల్లి శరీరం శిశువును తిరస్కరించకుండా ఉంటేనే అది గర్భాశయంలో పెరుగుతుంది. అయితే కొంతమంది శరీరాల్లో ఉండే యాంటీ ఫాస్ఫోలిపిడ్ వంటి యాంటీబాడీల కారణంగా తల్లి శరీరం పిండాన్ని తిరస్కరించడం వల్ల, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన పదార్థాలు లోపించడం వల్ల వరసగా గర్భస్రావాలు జరుగుతుంటాయి తల్లిలో లేదా తండ్రిలో లేదా ఇరువురిలో ఎవరికైనా జన్యుపరమైన లోపాలు ఉన్నా కూడా పిండం సరిగా పెరగకుండా గర్భస్రావాలకు దారితీయవచ్చు.

పరీక్షలు: ఒకటి రెండుసార్లు అబార్షన్లు అయిన వారందరికీ పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అబార్షన్లు రెండు, మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు వరుసగా జరిగితే (అవి ఏ నెలలో అయ్యాయనే అంశాన్ని బట్టి) కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కొందరిలో ఎన్ని పరీక్షలు చేసినా ఎలాంటి లోపం కనిపించకపోవచ్చు కూడా. కారణం తెలుసుకోడానికి చేయించాల్సిన పరీక్షలివి...

కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) బ్లడ్‌గ్రూప్ అండ్ టైప్ షుగర్ టెస్ట్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ల పరీక్ష యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ పరీక్ష అల్ట్రాసౌండ్ హిస్టెరోస్పాలింగోగ్రామ్ (హెచ్‌ఎస్‌జీ) తల్లిదండ్రులకు జన్యుపరీక్షలు (కారియోటైపింగ్) తల్లిలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయేమో తెలుసుకోడానికి చేసే రక్తపరీక్షలు (ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ టెస్ట్స్) గర్భస్రావంలో బయటపడ్డ ముక్కలను జన్యుపరీక్షకు పంపడం వంటివి చేస్తారు.

చికిత్స: కారణాలను బట్టి చికిత్సను నిర్ణయించాల్సి ఉంటుంది జన్యుపరమైన కారణాలతో అయ్యే అబార్షన్లకు ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదు పౌష్టికాహారం, ఫోలిక్ యాసిడ్ వాడటం హార్మోన్ల అస మతౌల్యత ఉంటే... ప్రోజెస్టెరాన్ హార్మోన్‌ను ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్స్ రూపంలోనూ, హెచ్‌సీజీ ఇంజెక్షన్లు అవసరాన్ని బట్టి మొదటి మూడునెలలు తీసుకోవాల్సి ఉంటుంది థైరాయిడ్ సమస్య ఉంటే దాన్ని నియంత్రణలో ఉంచుకోడానికి అవసరమైన మందులు తప్పనిసరిగా తీసుకోవాలి సర్విక్స్ (గర్భాశయ కంఠం) వదులుగా ఉంటే... గర్భస్రావాన్ని నివారించడం కోసం గర్భధారణ జరిగాక 4 - 6 నెలల మధ్య సర్విక్స్‌కు కుట్లు వేయాలి యాంటీబాడీలు ఉంటే ఎకోస్ప్రిన్, హెపారిన్ వంటి మందులు వాడాలి.

మాతృత్వం అనే వరానికి అడ్డుపడే అబార్షన్లను నిలువరించడానికి, నివారించడానికి... డాక్టర్ సూచనలు, సలహాలు పాటించడం, వారు రాసిన మందులను క్రమం తప్పకుండా వాడటం, వారు చెప్పిన జాగ్రత్తలను అనుసరిస్తూ ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

సూచనలు 
గర్భవతిని మానసికంగా ప్రశాంతంగా ఉంచడం ...

గర్భధారణ తర్వాత మొదటి మూడునెలలూ దాంపత్య జీవితానికి దూరంగా ఉండటం వీలైనంతవరకు దూరపు ప్రయాణాలు చేయకపోవడం

అబార్షన్ అయిన కారణాన్ని బట్టి విశ్రాంతి తీసుకోవడం

వీలైనంతవరకు బరువైన పనులు చేయకపోవడం

కారణం తెలియకుండా అబార్షన్లు అవుతుంటే అలాంటి మహిళలకు అన్నిసార్లూ అబార్షన్లు అవ్వదంటూ భరోసా ఇచ్చి, వారికి ధైర్యం చెప్పడం... వంటి సూచనలు పాటించాలి.

అబార్షన్లలో రకాలు 

మిస్‌డ్ అబార్షన్: గర్భాశయంలో పిండం ఏర్పడి, గుండె కొట్టుకోకపోవడంతో లేదా కొన్ని రోజులు పిండం పెరిగాక గుండె కొట్టుకోవడం ఆగిపోవడం వల్ల జరిగే గర్భస్రావాన్ని ‘మిస్‌డ్ అబార్షన్’ అంటారు. ఇలాంటి సందర్భంలో తల్లికి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఇది కేవలం స్కానింగ్ తర్వాతే బయటపడుతుంది. కొందరిలో కొద్దిగా బ్లీడింగ్ లేదా స్పాటింగ్ లేదా నల్లగా మారిన రక్తస్రావం కావచ్చు. కొంతమందిలో పిండం ఏర్పడదు. దీన్ని ‘బ్లైటెడ్ ఓవమ్’ అంటారు.

ఇన్‌ఎవిటబుల్ అబార్షన్: దీనిలో పొత్తికడుపులో నొప్పి, బ్లీడింగ్ ఉండి, సర్విక్స్ తెరచుకుని, పిండం కిందికి జారుతుంది. ఈ కండిషన్‌లో ఏ చికిత్స చేసినప్పటికీ గర్భం నిలవదు.

ఇన్‌కంప్లీట్ అబార్షన్: ఇందులో బ్లీడింగ్ ముక్కలు ముక్కలుగా విపరీతంగా అవుతూ, కడుపునొప్పి ఉండి, గర్భం మొత్తం పూర్తిగా విడిపడకుండా, గర్భాశయంలోనే ముక్కలు ఉండిపోతా యి. దీనివల్ల ఒక్కోసారి విపరీతమైన రక్తస్రావమై ప్రాణాపాయస్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది.

కంప్లీట్ అబార్షన్: కొంతమందిలో పొత్తికడుపులో నొప్పితో పాటు గర్భం మొత్తం బ్లీడింగ్‌లా ముద్దలా బయటపడిపోయి తర్వాత బ్లీడింగ్, నొప్పి తగ్గిపోతాయి.

సెప్టిక్ అబార్షన్: కొంతమందిలో అబార్షన్ సరిగా చేయించుకోకపోవడం, రక్తహీనత, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు రోగక్రిములు గర్భాశయంలోకి చేరి తద్వారా ఇన్ఫెక్షన్ వచ్చి, రక్తం ద్వారా అది శరీరమంతా వ్యాప్తి చెంది, ప్రమాదస్థితిలోకి వెళ్లడం జరుగుతుంది.

రికరెంట్ అబార్షన్: వరసగా మూడుసార్లు గర్భస్రావమైతే, వాటిని రికరెంట్ అబార్షన్స్‌గా చెప్పవచ్చు. ఇందులో 50 శాతం వాటికి కారణం తెలియదు. మూడునెలల లోపు అయ్యేవాటిలో చాలావరకు పిండంలో జన్యు లోపాలు కారణం కావచ్చు. మూడు నెలలు దాటాక అయ్యేవాటిలో తల్లికి సంబంధించిన సమస్యలు కారణం కావచ్చు.
 

అందమె ఆనందం

కప్పు నీళ్లలో పది గులాబీ రేకలు వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడపోసి, టీ స్పూన్ రోజ్ వాటర్ కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయం, సాయంత్రం ఈ నీటిలో దూదిని ముంచి దానిని ముఖానికి, చేతులకు అద్దుకొని, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల మలినాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

ఆయనది ఎన్‌కౌంటర్ కాదు!!

ఎవరి పేరు చెప్తే ఏనుగులు తొండం ముడుచుకుని కూచుంటాయో...
ఎవరి పేరు చెప్తే పండు వెన్నెల్లో కూడా అడవికి నిలువెల్లా చెమట పడుతుందో...
ఎవరి పేరు చెప్తే పోలీసులు పీడకలలతో ఉలిక్కిపడి లేస్తారో...
ఎవరి పేరు చెప్తే గంధపుచెట్లు సువాసనలీనడం మాని బిక్కచస్తాయో...
అతడే వీరప్పన్!!
ఎన్ని కథలు... ఎన్ని గాథలు...
ఎన్ని కల్పితాలు... ఎన్ని కథనాలు...
కాని నిజం ఏంటి?
సాక్షి ప్రతినిధులకు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలుసుకోండి...


కర్నాటక- తమిళనాడు సరిహద్దులోని గోపినత్తం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ‘మునుస్వామి వీరప్పన్’ అనే సాధారణ వ్యక్తి ఆవులు మేపే వృత్తి నుంచి గంధపు చెక్కల స్మగ్లర్‌గా ఎందుకు మారాడు? నేరప్రవృత్తితోనా? కాదు... వ్యవసాయంలో వచ్చే ఆదాయం సరిపోకపోవడం వల్ల... ఇది వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి సమాధానం. వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లింగ్‌తో వందల కోట్లు సంపాదించారనే ప్రచారం వుంది. అదే నిజమైతే ముత్తులక్ష్మి ప్రస్తుత జీవితం ఇంకోలా ఉండాలి. కాని ఆమె ధర్మపురి జిల్లా మేటూరు డ్యామ్‌కు సమీపంలోని గ్రామంలో నెలకు 2 వేల అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. మరి వాస్తవం ఏమిటి?

పెళ్లి ఇలా జరిగింది...

మాది ధర్మపురి జిల్లాలోని సింగాపురంలో మధ్యతరగతి కుటుంబం. 1990లో నాకు పదహారేళ్లప్పుడు వీరప్పన్ ఎక్కడో చూశాడట. పెళ్లి కోసం మా నాన్న అయ్యర్ దగ్గరికి వచ్చి అడిగాడు. అప్పటికి వీరప్పన్ వయస్సు 39. ఆవులు మేపేవాడు. ఐదెకరాల పొలం. వయసు ఎక్కువ వ్యత్యాసం ఉండటం, అతడి నేపథ్యం సరిగా లేకపోవడంతో మానాన్న ఈ పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో వీరప్పన్ మా తాతను మధ్యస్తానికి తెచ్చి నాకు తనతో పెళ్లి జరిపించాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. ఒక దశలో బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో మా నాన్న పెళ్లికి అంగీకరించాడు.

మూడేళ్ల కాపురం...

పెళ్లయిన మూడేళ్లు బాగానే ఉన్నాం. కాని ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో అప్పటికే సత్యమంగళం అడవిలో అణువణువు తెలిసిన ఆయన, అడ్డదారి తొక్కాడు. గంధపు చెక్కలను కొట్టించి అమ్మడం మొదలుపెట్టాడు. ఇలాంటి బతుకు మనకొద్దనీ ఎక్కడికైనా వెళ్లి హాయిగా బతుకుదామని అనేకసార్లు ఒత్తిడి చేశాను. చెక్కలు అమ్మి 10 లక్షలు సంపాదించి అందరం అస్సాంకు వెళ్లి స్థిరపడదామని చెప్పాడు. ఊరు చూసొస్తానని వెళ్లి లక్షల రూపాయల విలువ చేసే గంధపు చెక్కలను నరికించి అడవిలో ఒక చోట డంప్ చేయించాడు.

ఆ సంఘటనే ఆయన్ను స్మగ్లర్‌గా స్థిరపరచింది!

అయితే ఆ విషయం ఫారెస్టోళ్లకు ఎలాగో తెలిసి, సరుకును సీజ్ చేశారు. అడవి దొంగ జీవితానికి స్వస్తి చెప్పాలనుకున్న వీరప్పన్‌ను ఈ సంఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఫారెస్టు ఆఫీసులో ఉన్న గంధపు చెక్కలను తగలబెట్టి రావాలని ఆయన పంపిన టీంలోని ఒక సభ్యుడు, గంధపు చెక్కలకు బదులు ఫారెస్టు బస్సు తగులబెట్టి వచ్చాడు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు వీరప్పన్‌ను వేటాడటానికి ఎస్‌టీఎఫ్ బృందాలను అడవుల్లోకి పంపాయి. దీంతో ఆయనకు అడవుల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వంద మంది గ్యాంగ్‌తో అడవుల్లోనే ఉంటూ అటవీ గ్రామాల ప్రజల సహకారంతో జీవిస్తూ వచ్చాడు.

నా కోసం తొలి కిడ్నాప్...

వీరప్పన్ ఎక్కడున్నాడో చెప్పమంటూ 1993లో ఎస్‌టీఎఫ్ పోలీసులు నన్ను నిర్భంధించారు. కర్నాటక పరిధిలోని బన్నారి అటవీ ప్రాంతంలోని ఎస్‌టీఎఫ్ బేస్ క్యాంపులో ఉంచి చిత్రహింసలు పెట్టారు. 1994లో వీరప్పన్ నన్ను విడుదల చేయించుకోవడానికి కోయంబత్తూరు డీఎస్‌పీని కిడ్నాప్ చేశాడు. నాకు తెలిసినంత వరకు ఆయన చేసిన మొదటి కిడ్నాప్ అదే! నన్ను విడుదల చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాడు. ఈ విషయం తెలిసి మహిళా సంఘటన్ అనే స్వచ్చంద సంస్థ హైకోర్టులో కేసు వేసింది. కోర్టు ఆదేశం మేరకు ఎస్‌టీఎఫ్ పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశ పెట్టారు. తాము ఎలాంటి చిత్ర హింసలు పెట్టలేదని కోర్టులో చెప్పాలనీ, లేకపోతే కుటుంబ సభ్యులందరినీ చిత్రహింసలు పెడతామని పోలీసులు బెదిరించారు. నేనలానే చెప్పడంతో నన్ను విడుదల చేశారు.

వందల మందిని చంపారు!!

రానురాను వీరప్పన్ పోలీసులకు పెద్ద సమస్యగా మారాడు. అతని ఆచూకీ చెప్పాలని పోలీసులు సత్యమంగళం అటవీ గ్రామాల్లో సాగించిన నరమేధం అంతాఇంతా కాదు! సుమారు 200 కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. కానీ ఆయన ఆచూకీ మాత్రం ఎవరూ చెప్పలేదు. ఈ పరిస్థితులకు చలించిపోయిన వీరప్పన్ సినీనటుడు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశాడు. ఆయన్ను విడుదల చేయడానికి, అటవీ గ్రామాల్లో పోలీసులు చంపిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి రూ 10 కోట్లు విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు వీరప్పన్. దీంతో ప్రభుత్వం పోలీసులు చేసిన హత్యల మీద విచారణకోసం సదాశివ కమిషన్‌ను నియమించింది. పోలీసులు అమాయకులను హత్య చేయడమే కాకుండా, మహిళలను కూడా లైంగికంగా వేధించారని కమిషన్ నిర్ధారించింది. పోలీసు అధికారుల మీద చర్యలకు సిఫారసు చేసింది. కానీ ఏ పోలీసు అధికారి మీద చర్యలు తీసుకోకపోగా ప్రభుత్వం వారికి రివార్డులు ఇచ్చింది!

అది ఎన్ కౌంటర్ కాదు!!

వీరప్పన్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించలేదు! కొందరు వ్యక్తుల ద్వారా పోలీసులు వీరప్పన్‌కు అన్నంలో మత్తు మందు కలిపి తినిపించారు. అన్నం తిన్న ఆయన మత్తులో ఉన్నప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చిత్ర హింసలు పెట్టి ఆయన వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకున్నారు. ఆయన్ను చెన్నయ్‌లోనో, బెంగుళూరులోనో కోర్టులో హాజరు పరిచేందుకు ప్రభుత్వాలతో మాట్లాడారు. ఆయన కోర్టుకొచ్చి నోరు విప్పితే అనేకమంది రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయనే భయంతో ఆ రెండు ప్రభుత్వాలు వీరప్పన్‌ను కాల్చి చంపాలని సూచించాయి. దీంతో పోలీసులు ఆయన్ను అక్టోబర్ 18, 2004 కాల్చి చంపారు.

నా మీద కూడా హత్యకేసులు...

నేను వీరప్పన్‌తో కలసి ఐదు హత్యలు చేశానని నా మీద కేసులు పెట్టారు. గూండా యాక్ట్ కింద సెక్షన్లు నమోదు చేసి 2008లో నన్ను మైసూర్ జైల్లో పెట్టారు. ఇవన్నీ తప్పుడు కేసులని రుజువు కావడంతో 2011లో కోర్టు నన్ను నిరపరాధిగా విడుదల చేసింది. వీరప్పన్‌ను చంపి ఎనిమిదేళ్లు గడిచినా నా చుట్టూ ఇంకా పోలీసు నిఘా తీసివేయలేదు. ఇప్పుడు మీరు వచ్చిన విషయం కూడా వాళ్లు పసిగట్టే ఉంటారు. పోలీసుల వేధింపుల వల్ల ఇప్పటికీ నేను మా కుటుంబ సభ్యులతోగాని, బంధువులతోగాని స్వేచ్ఛగా ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. 

డబ్బు ఎక్కడుందీ?

వీరప్పన్ అడవులను కొల్లగొట్టి వందల కోట్లు సంపాదించారని ప్రచారం జరుగుతోందిగానీ ఆయన ఒక్క రూపాయి కూడా మా కుటుంబం కోసం ఇవ్వలేదు! అదే నిజమైతే ఈరోజు నేను, నా పిల్లలు ఊరొదిలి వచ్చి ఇక్కడ అద్దె ఇంట్లో ఉండాల్సిన ఖర్మ లేదు. వీరప్పన్‌కు పిత్రార్జితంగా వచ్చిన 5 ఎకరాల భూమిలో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంతోనే కష్టంగా బతుకు బండి లాగిస్తున్నాం. వీరప్పన్ తన గ్యాంగ్‌కు ఆహారం, బట్టలకు సరిపడేంత డబ్బు మాత్రమే సంపాదించుకునే ప్రయత్నం చేశారు. కాని ఆయన పేరు చెప్పుకుని కర్నాటక, తమిళనాడులోని అనేకమంది రాజకీయ నాయకులు కోట్లు సంపాదించారు. కొంతమంది పోలీసు అధికారులు కూడా కోట్లు దోచుకున్నారు. బయటి ప్రపంచానికి వీరప్పన్ స్మగ్లర్, క్రూరుడు కానీ సత్యమంగళం అటవీ గ్రామాల ప్రజలకు ఆయన ఒక హీరో! వారి బాగోగులు చూసిన దేవుడు! అందుకే ఆ గ్రామాల్లోని చాలా ఇళ్లలో ఇప్పటికీ వీరప్పన్ ఫొటోలు ఉంటాయి. అక్కడి ప్రజలకు ఆయనంటే ఎంత అభిమానమో దాన్నిబట్టే తెలుసుకోవచ్చు.

ఆయన్ను విలన్‌గా, హంతకుడిగానే ఎందుకు చూపుతారు?

వీరప్పన్‌ను విలన్‌గా, హంతకుడిగా చూపుతూ అనేకమంది సినిమాలు తీస్తున్నారు. కన్నడ దర్శకుడు ఎఎం ఆర్ రమేష్ అట్టహాస పేరుతో కన్నడంలోను, వనయుద్ధం పేరుతో తమిళంలోను సినిమా తీశాడు. పోలీసులనే హీరోలుగా చూపిస్తున్న ఆ దర్శకుడు ఆవులు మేపుకునే వీరప్పన్ ఎందుకు అడవులకు పోయాడు, దానికి కారణాలేంటి? ఆయన వల్ల ఎవరు లాభపడ్డారు? ఆయన్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నారు? అనే విషయాలను సినిమాలో చూపలేదు. దాంతో ఆ సినిమాలను నిలిపి వేయాలని కోర్టును ఆశ్రయించాను. ప్రస్తుతం జడ్జిమెంట్ పెండింగ్‌లో ఉంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ వీరప్పన్ గురించి హిందీలో సినిమా తీయడం కోసం ఓసారి నన్ను కలిశారు. వీరప్పన్ జీవితంలోని అన్ని సంఘటలను తెర కెక్కించేందుకు తెలుగులో కూడా ఎవరైనా ముందుకొస్తే వారికి సహకరిస్తాను.

- ఎస్. నగేష్, బ్యూరో ఇన్‌చార్జ్, తిరుపతి
(కుప్పం వెంకటేష్ సహకారంతో....)


పెద్ద కూతురిని మాత్రమే చూశాడు!

మాకు ఇద్దరు కూతుర్లు. ఆయన పెద్ద కూతురు విద్యారాణిని మాత్రమే చూశారు. చిన్న కూతురు ప్రభను చూడనే లేదు. ఆయన మీద పోలీసుల నిఘా ఎక్కువైనప్పటి నుంచి నేను ఆయన్ను తక్కువసార్లే కలిశాను. చూడాలనిపించినప్పుడు నన్ను పిలిపించుకునే వారు. చివరిసారిగా నేను ఆయన్ను 2000 సంవత్సరంలో చూశాను. నాక్కూడా అందరి లాగా భర్త, పిల్లలతో కలసి సరదాగా గడపాలనీ, హాయిగా ఉండాలనే కోరిక ఉండేది. అయితే ఆ దేవుడు నా తలరాత ఇందుకు భిన్నంగా రాశాడు. ఇప్పుడు పెద్దమ్మాయికి పెళ్లయ్యింది. చిన్నమ్మాయి బిఏ చదువుతోంది. నేను నా కూతురు, మానాన్న, మా అన్న, వదిన, వారి పిల్లలు కలసి ఉంటున్నాం.

వీరప్పన్‌ను చంపి ఎనిమిదేళ్లు గడిచినా నా చుట్టూ ఇంకా పోలీసు నిఘా తీసివేయలేదు. వాళ్ల వేధింపుల వల్ల ఇప్పటికీ నేను మా కుటుంబ సభ్యులతోగాని, బంధువులతోగాని స్వేచ్ఛగా ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను.
- ముత్తులక్షి, వీరప్పన్ భార్య