ఒక ఊరిలో ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు. వారిలో ఒకరు సన్యాసిగా మారారు. రెండోవాడు ధనికుడు అయ్యాడు. చాలాకాలం తర్వాత ధనికుడు తన స్నేహితుడిని చూశాడు. స్నేహితుడు జ్ఞానం పొంది ప్రశాంత జీవనం సాగించడాన్ని చూసి సంతోషించాడు. తన ఇంటికి ఒక పూట భోజనానికి రావలసిందిగా కోరాడు. అతను సన్యాసి గనుక ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండాలని వీధి గేటు దగ్గరే తివాచీలు పరచమని ఆజ్ఞాపించాడు.
రెండురోజుల తర్వాత సన్యాసి వెళ్లాడు. ప్రధానద్వారం దగ్గరకి రాగానే సేవకుడు ఆపి ‘‘అయ్యా! మీ స్నేహితుడు మిమ్మల్ని చిన్నచూపు చూడ్డానికే పెద్దఎత్తున ఏర్పాట్లు చేశాడేగాని మీ మీద అభిమానంతో కాదు’’ అని హెచ్చరించాడు. సన్యాసికి కోపం వచ్చింది. పరుగున వెనక్కి వెళ్లి బురద నీళ్లలో కాళ్లు ముంచి మరీ వచ్చాడు. మురికి అయిందని తన సేవకుల్ని తిట్టాడు ధనికుడు.
‘‘వాళ్లని తిట్టకు. ఆ మురికి నా వల్లనే అయింది. నీకంటే ఎంతో గొప్పవాడిని. నీవు ధనికుడివి మాత్రమే. నేను ఎంతో జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను సాధించాను’’ అంటూ తన గర్వాన్ని ప్రదర్శించాడు సన్యాసి. ధనికుడు ఆశ్చర్యపోయాడు. ‘‘నువ్వు సన్యాసం స్వీకరించి ఎంతో ఉన్నతుడవయ్యావని, ఎంతో జ్ఞానం సంపాదించావని, ప్రశాంత జీవనం సాగిస్తున్నావని నేను ఈర్ష్యపడ్డాను. నీకు, నాకు మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని గ్రహించాను.
నాకు ధనార్జన వ్యామోహం, నీకు సన్యాసి అనిపించుకోవాలని వ్యామోహం. నువ్వు సాధించినదంతా కోల్పోయావు. అహం కారంతో ఎక్కువకాలం ఉండలేవు. ఎవరు ఏది సాధించినా, పొందినా అది దేవుని అనుగ్రహమే అనుకోవాలి. కానీ ‘నేను’ అనేదే భయంకరమైన శత్రువు. దాన్ని నువ్వింకా వదులుకోలేదు’’ అన్నాడు. సన్యాసి స్నేహితుడు మారుమాట్లాడకుండా వెళ్లిపోయాడు.
No comments:
Post a Comment