all

Thursday, December 6, 2012

అబార్షన్లు... నివారణ

పండంటి బిడ్డ పుట్టాలన్నది గర్భం ధరించిన ప్రతి మహిళ కల. కానీ అది ఒక్కోసారి కల్ల అవుతుంది. గర్భస్రావం రూపంలో కల నెరవేరకపోవడం దురదృష్టం. చాలా సందర్భాల్లో నెలతప్పిన పది రోజులకే... అది గర్భం అని తెలిసేలోపే రుతుస్రావంలో రక్తస్రావం ఎక్కువగా జరగడం ద్వారా (బ్లీడింగ్ రూపంలో) గర్భస్రావం అయిపోతుంటుంది. ఇలాంటి అవాంఛిత పరిస్థికి కారణాలు, చేయించాల్సిన పరీక్షలు, తీసుకోవాల్సిన చికిత్సలు, గర్భస్రావం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సలహాలు, సూచనల సమాహారమే ఈ కథనం. 

మహిళల్లో రుతుస్రావం మొదలైన నాటి నుంచి లెక్కకడితే 11వ రోజు నుంచి 16వ రోజు లోపల అండం విడుదలవుతుంది. ఆ సమయంలో కలయిక జరిగినప్పుడు పురుషుని నుంచి విడుదలయ్యే వీర్యకణాలు, మహిళ గర్భాశయం ద్వారా ఫెలోపియన్ ట్యూబ్‌లోకి ప్రవేశించి, అక్కడ అండం లోపలకు చేరి ఫలదీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. అలా ఫలదీకరణం చెందిన అండం అనేక కణాలుగా విభజన చెందుతూ, ఆరురోజుల తర్వాత హార్మోన్ల ప్రభావంతో గర్భాశయం లోపలిపొరల్లోకి ప్రవేశించి, అక్కడ పిండంగా రూపాంతరం చెంది, తొమ్మిది నెలల పాటు పెరుగుతుంది.

సాధారణంగా తొమ్మిది నెలలు నిండాక ప్రసూతి జరిగి పండంటి బిడ్డ పుట్టాలి. ఏ కారణంగానైనా ఏడో నెల కంటే ముందుగానే గర్భం నుంచి పిండం బయటపడితే గర్భస్రావం (అబార్షన్) అంటారు. ఇలాంటి సందర్భాల్లో శిశువు సాధారణంగా మృతిచెంది బయటపడటమో లేదా బయటపడి మృతిచెందడమో జరుగుతుంటుంది. (ఒకవేళ ఏడో నెలలో పిండం బయటపడ్డా శిశువు బతికే ఉంటే దాన్ని గర్భస్రావంగా పేర్కొనరు. అప్పుడు దాన్ని ప్రీ-మెచ్యూర్ డెలివరీ అంటారు).

కారణాలు: గర్భస్రావం కావడానికి అనేక కారణాలుంటాయి. సంక్షిప్తంగా...

జన్యుపరమైనవి: చాలా సందర్భాల్లో జన్యుపరమైన కారణాలే గర్భస్రావానికి దోహదపడతాయి. పిండం సరిగా ఏర్పడకపోవడం, ఒకవేళ ఏర్పడితే అది సరిగా ఎదగలేక చనిపోవడం సాధారణం. అండం లేదా వీర్యకణం లేదా పిండంలోని జన్యువు (క్రోమోజోము)ల్లో లోపాల కారణంగా ఇలా జరుగుతుంది. ఇది తొలిచూలు గర్భంలోనే కావచ్చు లేదా వరసగా ఇలాగే జరుగుతుండవచ్చు. తల్లి వయసు 35 ఏళ్లు దాటేకొద్దీ జన్యుపరమైన కారణాల వల్ల అబార్షన్లు ఎక్కువవుతాయి. సరిగా ఎదగలేని, లోపాలు ఉన్న పిండాన్ని ప్రకృతి సహజంగానే మొదట్లోనే బయటకు నెట్టేస్తుంది. తత్ఫలితంగా గర్భస్రావం జరుగుతుంది. జన్యుపరమైన కారణాల వల్ల అయ్యే గర్భస్రావాలకు ఏ చికిత్సా పనిచేయదు.

తల్లికి ఉండే వ్యాధులు: కాబోయే తల్లికి... అదుపులో లేని మధుమేహవ్యాధి, మూత్రపిండాల వ్యాధి, రక్తహీనత వంటి కండిషన్‌లు.

హార్మోన్ల సమస్య: అదుపులో లేని థైరాయిడ్ సమస్య, ప్రొజెస్టెరాన్ హార్మోన్ లోపం, పాలీసిస్టిక్ అండాశయాల వల్ల, హార్మోన్ సమస్యలతో

ఇన్ఫెక్షన్లు: హెర్పిస్, రుబెల్లా, వైరస్, టాక్సోప్లాస్మా, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లతో తీవ్రమైన జ్వరం తీవ్రమైన మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ పోషకాహార లోపాలు కొన్నిరకాల మందుల వాడకం వల్ల... గర్భస్రావాలు జరుగుతాయి.

గర్భాశయంలో లోపాలు: తరచుగా కనపడే లోపం గర్భాశయ కంఠం (సర్విక్స్) వదులుగా అవ్వడం లేదా సర్విక్స్ పొడవు తక్కువగా ఉండటం. దీనివల్ల పెరిగే శిశువు తాలూకు బరువును మోయలేక, 4-7 నెలల మధ్య సర్విక్స్ తెరచుకుని పెద్దగా నొప్పి లేకుండానే శిశువు బయటకు జారిపోతుంది.

కొంతమందిలో పుట్టుకతోనే గర్భాశయంలో లోపాలు అంటే గర్భాశయం మధ్యలో చీలడం లేదా ఆకృతిలో తేడాల వల్ల గర్భాశయం లోపలి పొరల్లో కణుతులు (ఫైబ్రాయిడ్స్, పాలిప్స్) గర్భధారణ తర్వాత కవలలు ఏర్పడటం వల్ల (కొంతమందిలో మాత్రమే) గర్భధారణ తర్వాత తల్లి శరీరం శిశువును తిరస్కరించకుండా ఉంటేనే అది గర్భాశయంలో పెరుగుతుంది. అయితే కొంతమంది శరీరాల్లో ఉండే యాంటీ ఫాస్ఫోలిపిడ్ వంటి యాంటీబాడీల కారణంగా తల్లి శరీరం పిండాన్ని తిరస్కరించడం వల్ల, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన పదార్థాలు లోపించడం వల్ల వరసగా గర్భస్రావాలు జరుగుతుంటాయి తల్లిలో లేదా తండ్రిలో లేదా ఇరువురిలో ఎవరికైనా జన్యుపరమైన లోపాలు ఉన్నా కూడా పిండం సరిగా పెరగకుండా గర్భస్రావాలకు దారితీయవచ్చు.

పరీక్షలు: ఒకటి రెండుసార్లు అబార్షన్లు అయిన వారందరికీ పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అబార్షన్లు రెండు, మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు వరుసగా జరిగితే (అవి ఏ నెలలో అయ్యాయనే అంశాన్ని బట్టి) కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కొందరిలో ఎన్ని పరీక్షలు చేసినా ఎలాంటి లోపం కనిపించకపోవచ్చు కూడా. కారణం తెలుసుకోడానికి చేయించాల్సిన పరీక్షలివి...

కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) బ్లడ్‌గ్రూప్ అండ్ టైప్ షుగర్ టెస్ట్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ల పరీక్ష యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ పరీక్ష అల్ట్రాసౌండ్ హిస్టెరోస్పాలింగోగ్రామ్ (హెచ్‌ఎస్‌జీ) తల్లిదండ్రులకు జన్యుపరీక్షలు (కారియోటైపింగ్) తల్లిలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయేమో తెలుసుకోడానికి చేసే రక్తపరీక్షలు (ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ టెస్ట్స్) గర్భస్రావంలో బయటపడ్డ ముక్కలను జన్యుపరీక్షకు పంపడం వంటివి చేస్తారు.

చికిత్స: కారణాలను బట్టి చికిత్సను నిర్ణయించాల్సి ఉంటుంది జన్యుపరమైన కారణాలతో అయ్యే అబార్షన్లకు ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదు పౌష్టికాహారం, ఫోలిక్ యాసిడ్ వాడటం హార్మోన్ల అస మతౌల్యత ఉంటే... ప్రోజెస్టెరాన్ హార్మోన్‌ను ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్స్ రూపంలోనూ, హెచ్‌సీజీ ఇంజెక్షన్లు అవసరాన్ని బట్టి మొదటి మూడునెలలు తీసుకోవాల్సి ఉంటుంది థైరాయిడ్ సమస్య ఉంటే దాన్ని నియంత్రణలో ఉంచుకోడానికి అవసరమైన మందులు తప్పనిసరిగా తీసుకోవాలి సర్విక్స్ (గర్భాశయ కంఠం) వదులుగా ఉంటే... గర్భస్రావాన్ని నివారించడం కోసం గర్భధారణ జరిగాక 4 - 6 నెలల మధ్య సర్విక్స్‌కు కుట్లు వేయాలి యాంటీబాడీలు ఉంటే ఎకోస్ప్రిన్, హెపారిన్ వంటి మందులు వాడాలి.

మాతృత్వం అనే వరానికి అడ్డుపడే అబార్షన్లను నిలువరించడానికి, నివారించడానికి... డాక్టర్ సూచనలు, సలహాలు పాటించడం, వారు రాసిన మందులను క్రమం తప్పకుండా వాడటం, వారు చెప్పిన జాగ్రత్తలను అనుసరిస్తూ ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

సూచనలు 
గర్భవతిని మానసికంగా ప్రశాంతంగా ఉంచడం ...

గర్భధారణ తర్వాత మొదటి మూడునెలలూ దాంపత్య జీవితానికి దూరంగా ఉండటం వీలైనంతవరకు దూరపు ప్రయాణాలు చేయకపోవడం

అబార్షన్ అయిన కారణాన్ని బట్టి విశ్రాంతి తీసుకోవడం

వీలైనంతవరకు బరువైన పనులు చేయకపోవడం

కారణం తెలియకుండా అబార్షన్లు అవుతుంటే అలాంటి మహిళలకు అన్నిసార్లూ అబార్షన్లు అవ్వదంటూ భరోసా ఇచ్చి, వారికి ధైర్యం చెప్పడం... వంటి సూచనలు పాటించాలి.

అబార్షన్లలో రకాలు 

మిస్‌డ్ అబార్షన్: గర్భాశయంలో పిండం ఏర్పడి, గుండె కొట్టుకోకపోవడంతో లేదా కొన్ని రోజులు పిండం పెరిగాక గుండె కొట్టుకోవడం ఆగిపోవడం వల్ల జరిగే గర్భస్రావాన్ని ‘మిస్‌డ్ అబార్షన్’ అంటారు. ఇలాంటి సందర్భంలో తల్లికి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఇది కేవలం స్కానింగ్ తర్వాతే బయటపడుతుంది. కొందరిలో కొద్దిగా బ్లీడింగ్ లేదా స్పాటింగ్ లేదా నల్లగా మారిన రక్తస్రావం కావచ్చు. కొంతమందిలో పిండం ఏర్పడదు. దీన్ని ‘బ్లైటెడ్ ఓవమ్’ అంటారు.

ఇన్‌ఎవిటబుల్ అబార్షన్: దీనిలో పొత్తికడుపులో నొప్పి, బ్లీడింగ్ ఉండి, సర్విక్స్ తెరచుకుని, పిండం కిందికి జారుతుంది. ఈ కండిషన్‌లో ఏ చికిత్స చేసినప్పటికీ గర్భం నిలవదు.

ఇన్‌కంప్లీట్ అబార్షన్: ఇందులో బ్లీడింగ్ ముక్కలు ముక్కలుగా విపరీతంగా అవుతూ, కడుపునొప్పి ఉండి, గర్భం మొత్తం పూర్తిగా విడిపడకుండా, గర్భాశయంలోనే ముక్కలు ఉండిపోతా యి. దీనివల్ల ఒక్కోసారి విపరీతమైన రక్తస్రావమై ప్రాణాపాయస్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది.

కంప్లీట్ అబార్షన్: కొంతమందిలో పొత్తికడుపులో నొప్పితో పాటు గర్భం మొత్తం బ్లీడింగ్‌లా ముద్దలా బయటపడిపోయి తర్వాత బ్లీడింగ్, నొప్పి తగ్గిపోతాయి.

సెప్టిక్ అబార్షన్: కొంతమందిలో అబార్షన్ సరిగా చేయించుకోకపోవడం, రక్తహీనత, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు రోగక్రిములు గర్భాశయంలోకి చేరి తద్వారా ఇన్ఫెక్షన్ వచ్చి, రక్తం ద్వారా అది శరీరమంతా వ్యాప్తి చెంది, ప్రమాదస్థితిలోకి వెళ్లడం జరుగుతుంది.

రికరెంట్ అబార్షన్: వరసగా మూడుసార్లు గర్భస్రావమైతే, వాటిని రికరెంట్ అబార్షన్స్‌గా చెప్పవచ్చు. ఇందులో 50 శాతం వాటికి కారణం తెలియదు. మూడునెలల లోపు అయ్యేవాటిలో చాలావరకు పిండంలో జన్యు లోపాలు కారణం కావచ్చు. మూడు నెలలు దాటాక అయ్యేవాటిలో తల్లికి సంబంధించిన సమస్యలు కారణం కావచ్చు.
 

No comments: