all

Thursday, December 6, 2012

ఆయనది ఎన్‌కౌంటర్ కాదు!!

ఎవరి పేరు చెప్తే ఏనుగులు తొండం ముడుచుకుని కూచుంటాయో...
ఎవరి పేరు చెప్తే పండు వెన్నెల్లో కూడా అడవికి నిలువెల్లా చెమట పడుతుందో...
ఎవరి పేరు చెప్తే పోలీసులు పీడకలలతో ఉలిక్కిపడి లేస్తారో...
ఎవరి పేరు చెప్తే గంధపుచెట్లు సువాసనలీనడం మాని బిక్కచస్తాయో...
అతడే వీరప్పన్!!
ఎన్ని కథలు... ఎన్ని గాథలు...
ఎన్ని కల్పితాలు... ఎన్ని కథనాలు...
కాని నిజం ఏంటి?
సాక్షి ప్రతినిధులకు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలుసుకోండి...


కర్నాటక- తమిళనాడు సరిహద్దులోని గోపినత్తం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ‘మునుస్వామి వీరప్పన్’ అనే సాధారణ వ్యక్తి ఆవులు మేపే వృత్తి నుంచి గంధపు చెక్కల స్మగ్లర్‌గా ఎందుకు మారాడు? నేరప్రవృత్తితోనా? కాదు... వ్యవసాయంలో వచ్చే ఆదాయం సరిపోకపోవడం వల్ల... ఇది వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి సమాధానం. వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లింగ్‌తో వందల కోట్లు సంపాదించారనే ప్రచారం వుంది. అదే నిజమైతే ముత్తులక్ష్మి ప్రస్తుత జీవితం ఇంకోలా ఉండాలి. కాని ఆమె ధర్మపురి జిల్లా మేటూరు డ్యామ్‌కు సమీపంలోని గ్రామంలో నెలకు 2 వేల అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. మరి వాస్తవం ఏమిటి?

పెళ్లి ఇలా జరిగింది...

మాది ధర్మపురి జిల్లాలోని సింగాపురంలో మధ్యతరగతి కుటుంబం. 1990లో నాకు పదహారేళ్లప్పుడు వీరప్పన్ ఎక్కడో చూశాడట. పెళ్లి కోసం మా నాన్న అయ్యర్ దగ్గరికి వచ్చి అడిగాడు. అప్పటికి వీరప్పన్ వయస్సు 39. ఆవులు మేపేవాడు. ఐదెకరాల పొలం. వయసు ఎక్కువ వ్యత్యాసం ఉండటం, అతడి నేపథ్యం సరిగా లేకపోవడంతో మానాన్న ఈ పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో వీరప్పన్ మా తాతను మధ్యస్తానికి తెచ్చి నాకు తనతో పెళ్లి జరిపించాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. ఒక దశలో బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో మా నాన్న పెళ్లికి అంగీకరించాడు.

మూడేళ్ల కాపురం...

పెళ్లయిన మూడేళ్లు బాగానే ఉన్నాం. కాని ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో అప్పటికే సత్యమంగళం అడవిలో అణువణువు తెలిసిన ఆయన, అడ్డదారి తొక్కాడు. గంధపు చెక్కలను కొట్టించి అమ్మడం మొదలుపెట్టాడు. ఇలాంటి బతుకు మనకొద్దనీ ఎక్కడికైనా వెళ్లి హాయిగా బతుకుదామని అనేకసార్లు ఒత్తిడి చేశాను. చెక్కలు అమ్మి 10 లక్షలు సంపాదించి అందరం అస్సాంకు వెళ్లి స్థిరపడదామని చెప్పాడు. ఊరు చూసొస్తానని వెళ్లి లక్షల రూపాయల విలువ చేసే గంధపు చెక్కలను నరికించి అడవిలో ఒక చోట డంప్ చేయించాడు.

ఆ సంఘటనే ఆయన్ను స్మగ్లర్‌గా స్థిరపరచింది!

అయితే ఆ విషయం ఫారెస్టోళ్లకు ఎలాగో తెలిసి, సరుకును సీజ్ చేశారు. అడవి దొంగ జీవితానికి స్వస్తి చెప్పాలనుకున్న వీరప్పన్‌ను ఈ సంఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఫారెస్టు ఆఫీసులో ఉన్న గంధపు చెక్కలను తగలబెట్టి రావాలని ఆయన పంపిన టీంలోని ఒక సభ్యుడు, గంధపు చెక్కలకు బదులు ఫారెస్టు బస్సు తగులబెట్టి వచ్చాడు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు వీరప్పన్‌ను వేటాడటానికి ఎస్‌టీఎఫ్ బృందాలను అడవుల్లోకి పంపాయి. దీంతో ఆయనకు అడవుల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వంద మంది గ్యాంగ్‌తో అడవుల్లోనే ఉంటూ అటవీ గ్రామాల ప్రజల సహకారంతో జీవిస్తూ వచ్చాడు.

నా కోసం తొలి కిడ్నాప్...

వీరప్పన్ ఎక్కడున్నాడో చెప్పమంటూ 1993లో ఎస్‌టీఎఫ్ పోలీసులు నన్ను నిర్భంధించారు. కర్నాటక పరిధిలోని బన్నారి అటవీ ప్రాంతంలోని ఎస్‌టీఎఫ్ బేస్ క్యాంపులో ఉంచి చిత్రహింసలు పెట్టారు. 1994లో వీరప్పన్ నన్ను విడుదల చేయించుకోవడానికి కోయంబత్తూరు డీఎస్‌పీని కిడ్నాప్ చేశాడు. నాకు తెలిసినంత వరకు ఆయన చేసిన మొదటి కిడ్నాప్ అదే! నన్ను విడుదల చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాడు. ఈ విషయం తెలిసి మహిళా సంఘటన్ అనే స్వచ్చంద సంస్థ హైకోర్టులో కేసు వేసింది. కోర్టు ఆదేశం మేరకు ఎస్‌టీఎఫ్ పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశ పెట్టారు. తాము ఎలాంటి చిత్ర హింసలు పెట్టలేదని కోర్టులో చెప్పాలనీ, లేకపోతే కుటుంబ సభ్యులందరినీ చిత్రహింసలు పెడతామని పోలీసులు బెదిరించారు. నేనలానే చెప్పడంతో నన్ను విడుదల చేశారు.

వందల మందిని చంపారు!!

రానురాను వీరప్పన్ పోలీసులకు పెద్ద సమస్యగా మారాడు. అతని ఆచూకీ చెప్పాలని పోలీసులు సత్యమంగళం అటవీ గ్రామాల్లో సాగించిన నరమేధం అంతాఇంతా కాదు! సుమారు 200 కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. కానీ ఆయన ఆచూకీ మాత్రం ఎవరూ చెప్పలేదు. ఈ పరిస్థితులకు చలించిపోయిన వీరప్పన్ సినీనటుడు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశాడు. ఆయన్ను విడుదల చేయడానికి, అటవీ గ్రామాల్లో పోలీసులు చంపిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి రూ 10 కోట్లు విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు వీరప్పన్. దీంతో ప్రభుత్వం పోలీసులు చేసిన హత్యల మీద విచారణకోసం సదాశివ కమిషన్‌ను నియమించింది. పోలీసులు అమాయకులను హత్య చేయడమే కాకుండా, మహిళలను కూడా లైంగికంగా వేధించారని కమిషన్ నిర్ధారించింది. పోలీసు అధికారుల మీద చర్యలకు సిఫారసు చేసింది. కానీ ఏ పోలీసు అధికారి మీద చర్యలు తీసుకోకపోగా ప్రభుత్వం వారికి రివార్డులు ఇచ్చింది!

అది ఎన్ కౌంటర్ కాదు!!

వీరప్పన్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించలేదు! కొందరు వ్యక్తుల ద్వారా పోలీసులు వీరప్పన్‌కు అన్నంలో మత్తు మందు కలిపి తినిపించారు. అన్నం తిన్న ఆయన మత్తులో ఉన్నప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చిత్ర హింసలు పెట్టి ఆయన వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకున్నారు. ఆయన్ను చెన్నయ్‌లోనో, బెంగుళూరులోనో కోర్టులో హాజరు పరిచేందుకు ప్రభుత్వాలతో మాట్లాడారు. ఆయన కోర్టుకొచ్చి నోరు విప్పితే అనేకమంది రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయనే భయంతో ఆ రెండు ప్రభుత్వాలు వీరప్పన్‌ను కాల్చి చంపాలని సూచించాయి. దీంతో పోలీసులు ఆయన్ను అక్టోబర్ 18, 2004 కాల్చి చంపారు.

నా మీద కూడా హత్యకేసులు...

నేను వీరప్పన్‌తో కలసి ఐదు హత్యలు చేశానని నా మీద కేసులు పెట్టారు. గూండా యాక్ట్ కింద సెక్షన్లు నమోదు చేసి 2008లో నన్ను మైసూర్ జైల్లో పెట్టారు. ఇవన్నీ తప్పుడు కేసులని రుజువు కావడంతో 2011లో కోర్టు నన్ను నిరపరాధిగా విడుదల చేసింది. వీరప్పన్‌ను చంపి ఎనిమిదేళ్లు గడిచినా నా చుట్టూ ఇంకా పోలీసు నిఘా తీసివేయలేదు. ఇప్పుడు మీరు వచ్చిన విషయం కూడా వాళ్లు పసిగట్టే ఉంటారు. పోలీసుల వేధింపుల వల్ల ఇప్పటికీ నేను మా కుటుంబ సభ్యులతోగాని, బంధువులతోగాని స్వేచ్ఛగా ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. 

డబ్బు ఎక్కడుందీ?

వీరప్పన్ అడవులను కొల్లగొట్టి వందల కోట్లు సంపాదించారని ప్రచారం జరుగుతోందిగానీ ఆయన ఒక్క రూపాయి కూడా మా కుటుంబం కోసం ఇవ్వలేదు! అదే నిజమైతే ఈరోజు నేను, నా పిల్లలు ఊరొదిలి వచ్చి ఇక్కడ అద్దె ఇంట్లో ఉండాల్సిన ఖర్మ లేదు. వీరప్పన్‌కు పిత్రార్జితంగా వచ్చిన 5 ఎకరాల భూమిలో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంతోనే కష్టంగా బతుకు బండి లాగిస్తున్నాం. వీరప్పన్ తన గ్యాంగ్‌కు ఆహారం, బట్టలకు సరిపడేంత డబ్బు మాత్రమే సంపాదించుకునే ప్రయత్నం చేశారు. కాని ఆయన పేరు చెప్పుకుని కర్నాటక, తమిళనాడులోని అనేకమంది రాజకీయ నాయకులు కోట్లు సంపాదించారు. కొంతమంది పోలీసు అధికారులు కూడా కోట్లు దోచుకున్నారు. బయటి ప్రపంచానికి వీరప్పన్ స్మగ్లర్, క్రూరుడు కానీ సత్యమంగళం అటవీ గ్రామాల ప్రజలకు ఆయన ఒక హీరో! వారి బాగోగులు చూసిన దేవుడు! అందుకే ఆ గ్రామాల్లోని చాలా ఇళ్లలో ఇప్పటికీ వీరప్పన్ ఫొటోలు ఉంటాయి. అక్కడి ప్రజలకు ఆయనంటే ఎంత అభిమానమో దాన్నిబట్టే తెలుసుకోవచ్చు.

ఆయన్ను విలన్‌గా, హంతకుడిగానే ఎందుకు చూపుతారు?

వీరప్పన్‌ను విలన్‌గా, హంతకుడిగా చూపుతూ అనేకమంది సినిమాలు తీస్తున్నారు. కన్నడ దర్శకుడు ఎఎం ఆర్ రమేష్ అట్టహాస పేరుతో కన్నడంలోను, వనయుద్ధం పేరుతో తమిళంలోను సినిమా తీశాడు. పోలీసులనే హీరోలుగా చూపిస్తున్న ఆ దర్శకుడు ఆవులు మేపుకునే వీరప్పన్ ఎందుకు అడవులకు పోయాడు, దానికి కారణాలేంటి? ఆయన వల్ల ఎవరు లాభపడ్డారు? ఆయన్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నారు? అనే విషయాలను సినిమాలో చూపలేదు. దాంతో ఆ సినిమాలను నిలిపి వేయాలని కోర్టును ఆశ్రయించాను. ప్రస్తుతం జడ్జిమెంట్ పెండింగ్‌లో ఉంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ వీరప్పన్ గురించి హిందీలో సినిమా తీయడం కోసం ఓసారి నన్ను కలిశారు. వీరప్పన్ జీవితంలోని అన్ని సంఘటలను తెర కెక్కించేందుకు తెలుగులో కూడా ఎవరైనా ముందుకొస్తే వారికి సహకరిస్తాను.

- ఎస్. నగేష్, బ్యూరో ఇన్‌చార్జ్, తిరుపతి
(కుప్పం వెంకటేష్ సహకారంతో....)


పెద్ద కూతురిని మాత్రమే చూశాడు!

మాకు ఇద్దరు కూతుర్లు. ఆయన పెద్ద కూతురు విద్యారాణిని మాత్రమే చూశారు. చిన్న కూతురు ప్రభను చూడనే లేదు. ఆయన మీద పోలీసుల నిఘా ఎక్కువైనప్పటి నుంచి నేను ఆయన్ను తక్కువసార్లే కలిశాను. చూడాలనిపించినప్పుడు నన్ను పిలిపించుకునే వారు. చివరిసారిగా నేను ఆయన్ను 2000 సంవత్సరంలో చూశాను. నాక్కూడా అందరి లాగా భర్త, పిల్లలతో కలసి సరదాగా గడపాలనీ, హాయిగా ఉండాలనే కోరిక ఉండేది. అయితే ఆ దేవుడు నా తలరాత ఇందుకు భిన్నంగా రాశాడు. ఇప్పుడు పెద్దమ్మాయికి పెళ్లయ్యింది. చిన్నమ్మాయి బిఏ చదువుతోంది. నేను నా కూతురు, మానాన్న, మా అన్న, వదిన, వారి పిల్లలు కలసి ఉంటున్నాం.

వీరప్పన్‌ను చంపి ఎనిమిదేళ్లు గడిచినా నా చుట్టూ ఇంకా పోలీసు నిఘా తీసివేయలేదు. వాళ్ల వేధింపుల వల్ల ఇప్పటికీ నేను మా కుటుంబ సభ్యులతోగాని, బంధువులతోగాని స్వేచ్ఛగా ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను.
- ముత్తులక్షి, వీరప్పన్ భార్య
  

No comments: