all

Friday, July 5, 2013

వాగ్దానం - వాస్తవం

 
     
చిట్టి కథ
గౌరీపురంలో హేమంతుడు అనే ధనికుడు ఉండేవాడు. అతనికి పెద్ద భవంతి, డబ్బు, బంగారం, వస్తువులు, వాహనాలు లెక్కలేనన్ని ఉండేవి. అయితే దానధర్మాల విషయంలో మాత్రం అతను పరమ పిసినారి. ఎవరైనా ఏదైనా సహాయం అడగటానికి వస్తే ఏవో సాకులు చెప్పి తర్వాత రమ్మనేవాడు. తర్వాత వెళితే మళ్లీ ఇంకేదో కారణం చెప్పేవాడు. అంతేగానీ పైసా కూడా ఇచ్చేవాడు కాదు. ఆ విధంగా హేమంతుడికి ఊర్లో చెడ్డపేరు వచ్చింది.

అదే ఊరిలో ప్రసన్నుడు అనే మరొక వ్యక్తి ఉండేవాడు. అతడు ధనవంతుడు కాకపోయినా ఉన్నంతలో ఇతరులకు తనకు తోచిన సాయం చేస్తుండేవాడు. అడిగినవారికి లేదనకుండా తృణమోపణమో ఇస్తుండటంతో ప్రసన్నుడిని అందరూ మెచ్చుకునేవారు. ఇదిచూసి హేమంతుడికి ఈర్ష్య కలిగింది. హేమంతుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ‘‘కొంతకాలం ఆగండి. నేను నా ఆస్తి మొత్తాన్నీ ఈ ఊళ్లో బడి, గుడి కట్టించడానికి, దానధర్మాలకు ఇచ్చేస్తాను’’ అని అందరినీ పిలిచి చెప్పడం ప్రారంభించాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు.

ప్రసన్నుడు మాత్రం ఎప్పటిలాగానే అందరికీ సాయం చేస్తూ బడికి వెళ్లే పేదపిల్లలకు పలకలు, బలపాలు ఉచితంగా ఇవ్వసాగాడు. అలాగే గుడికివెళ్లే భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంచిపెట్టసాగాడు. ఒకరోజు ప్రసన్నుడికి ఊర్లో ఘనసన్మానం జరిగింది. ‘‘నా ఆస్తిని బడికి, గుడికి ఇస్తానంటే నాకు గాక ఇతనికి సన్మానం చేస్తారా?’’ అని హేమంతుడు అందరినీ అడిగాడు. ‘‘మీరు ఎప్పుడో ఇస్తానంటున్నారు. ఆయన ఇప్పుడే ఇస్తున్నారు. అదీ తేడా’’ అన్నారు ప్రజలు. దాంతో తన తప్పు తెలుసుకుని అప్పటి నుంచి ఉదారంగా ఉండ సాగాడు ప్రసన్నుడు.
  

చిట్కాలు

 
     
ఈ కాలం ఇంటా బయట తేమ ఎక్కువగా ఉండటం తో క్రిములు పెరిగి, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. గంధంపొడి, శనగపిండి, పసుపులో సూక్ష్మక్రిములను నశింపజేసే లక్షణాలు ఉన్నాయి. వీటి వాడకం వల్ల చర్మంపై వాపు, మంట, దురద.. తగ్గడం తో పాటు మొటిమలనూ నివారిస్తాయి. చర్మకాంతిని పెంచుతాయి.


పచ్చి పసుపు కొమ్ము ను అరగదీసి దాంట్లో చిటికెడు గంధంపొడి, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసి, ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ చర్మానికి మృదుత్వాన్ని, కాంతిని తీసుకువస్తుంది.


నారింజ లేదా కమలా తొక్కలను ఎండబెట్టి, పొడిచేసి శనగపిండి, పాలు కలిపి ప్యాక్ వేసుకుంటే ముఖంపై యాక్నె, నల్లమచ్చలు, చర్మం ముడతలు పడటం వంటివి తగ్గి, మేనికాంతి పెరుగుతుంది.

బెడ్‌రూమ్‌లోనూ బీ లైక్ ఎ మ్యాన్ (దక్షిణం)

 
     
మామిడి తింటే కార్బైడ్, కూరగాయలు తిందామంటే పెస్టిసైడ్స్, అన్నం తిందామంటే ప్రొటీన్ లెస్... నీళ్లు తాగుదామంటే పొల్యూషన్. చివరకు మంచి గాలి కూడా పీల్చే పరిస్థితి లేదు. ఇలాంటి వాతావరణంలో మగాడు మగాడులా ఉండాలంటే ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా వస్తువు పాడవుతున్న కొద్దీ జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, మన దేహ పోషణకు ఇంతటి నాసిరకం ఆహారం అందిస్తున్నపుడు ఇతర మార్గాల్లో మన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చాలా అవసరం. అలాంటి వాటిలో మొదట దృష్టి సారించాల్సింది... దాంపత్యంలో అతి ముఖ్యమైన శృంగారసామర్థ్యం పైనే. మన ప్రతి జీవనశైలి దానిమీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అంటే ఆహారపు అలవాట్లు, మన శారీరక శ్రమ, ఇంట్లో ఆఫీసులో ఎదురయ్యే ఒత్తిళ్లు, భవిష్యత్తు గురించి ఆందోళన, జీవన భద్రత... ఇలా ప్రతి అంశం దానిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీటిని చాలావరకు నివారించవచ్చు. వాటికి మీ సమయం తప్ప ఏం ఖర్చు చేయక్కర్లేదు. ఆ సూచనలు కొన్ని.


వ్యాయామం:
పురుషుల శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి ఇది రెండు మూడు విధాలుగా సహకరిస్తుంది. దేహానికి సరైన శ్రమ అందిస్తుంది. తద్వారా శృంగార హార్మోన్ టెస్టోస్టిరాన్ విడుదల పెరుగుతుంది. వెయిట్‌లిఫ్టింగ్‌తో పాటు పుషప్స్, సిటప్స్, క్రంచెస్ (వెల్లకిలా పడుకుని చేసే వ్యాయామం) చేయడం పటుత్వం పెరుగుతుంది. ఇవి భుజాలు, చాతీ, పొట్ట భాగంలో దృఢత్వం పెంచి అలసటను దూరం చేస్తాయి. అదనంగా చక్కటి శరీర సౌష్టవం కలిగి ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
యోగ: పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని యోగ రెట్టింపు చేస్తుంది. ఇందులో ధనురాసనం, మయూరాసనం, షోల్డర్ స్టాండ్ పోజ్ శృంగార వ్యవధిని పొడిగిస్తాయి.


నడక:
ఊరికే నడవడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. వేగంగా నడవాలి. ఇది రక్తసరఫరాను మెరుగుపరిచి విషపూరిత పదార్థాలను బయటకు పంపిస్తుంది. అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్కలన సమస్యలకు ఇది ఒక దీర్ఘకాలిక మందు. అప్పుడప్పుడు వ్యాయామంలో భాగంగా పరుగెత్తడం కూడా అవసరం.
ఈత: మీరు నగరాల్లో ఉంటే కాస్త ఖర్చయినా పర్లేదు. వారానికి రెండుమూడు రోజులైనా స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లడం చాలామంచిది.


అమ్మాయిలకి మెసేజ్ పెడుతున్నారా...


మాట కంటే అక్షరం చాలా ఆనందాన్ని ఇస్తుంది. మంచి మూడ్‌లో ఉన్నపుడు కాల్ కంటే మెసేజ్‌లతో కలిగే అనుభూతి బాగుంటుంది. అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడాలనుకున్నపుడు, ఏ సబ్జెక్టూ లేదనుకున్నపుడు ఎస్‌ఎంఎస్ అయితే బెటర్. దీనికీ కొన్ని పద్ధతులున్నాయి.
వర్కమూడ్‌లో ఉన్నపుడు చాట్ మొదలుపెట్టొద్దు. చురుగ్గా స్పందించలేరు. అలాగని మెసేజ్‌కు రిప్లై ఇవ్వకుండా ఉండొద్దు. అవసరమైనపుడు గాంభీర్యం కూడా చూపాలి. మీరు బిజీ అనీ తెలియాలి.

అమ్మాయిలకు ఒకటి రెండు పదాల రిప్లైలు నచ్చవు. అది మీ అనాసక్తిని తెలుపుతుందట. జెంటిల్మన్ కూడా అపుడపుడు చిలిపిగా మారాలి. మీ పదాల్లో క్రియేటివిటీ కనపడాలి.
ఇద్దరు అమ్మాయిలతో ఒకేసారి చాట్‌చేస్తే దొరికిపోయే అవకాశాలు 90 శాతం ఉంటాయి.
డేంజర్: దురుద్దేశాలు మెసెజ్‌లో పంపొద్దు. వారి గురించి తెలుసుకోకుండా రొమాంటిక్ మెసేజ్‌లు పంపొద్దు. సోదరి/భార్యకు తప్ప చాటింగ్‌లో చనువు కనిపించకూడదు. అవతలివారు ఏ స్థితిలో ఉన్నారో తెలియదు కదా.
  

ప్రేమ వివాహాలు కుటుంబ బాంధవ్యాలను దెబ్బతీస్తాయా? (స్పందనం)

 
     
ప్రస్తుతం వివాహాలే కుటుంబ బాంధవ్యాలను దెబ్బతీస్తున్నాయి. ఇక ప్రేమ వివాహాలు కుటుంబాలను దెబ్బతీయడంలో వింతేముంది. ప్రేమికులు వేర్వేరు కులాలు, మతాలు, అంతస్తులకు చెందినపుడు ఇరువైపులా ఇబ్బందులు సృష్టిస్తారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న పిల్లలు ఒకరినొకరు అర్థంచేసుకోలేక, సర్దుబాటు కాలేక బంధాలనే కాదు, జీవితాలనే పాడు చేసుకుంటారు.

పరిపక్వత, నిజాయితీ లేని చిన్నపిల్లల ప్రేమలు, ప్రేమ వివాహాలు కుటుంబ బంధాలను తప్పక దెబ్బతీస్తాయి. కానీ ప్రేమలో పరిణతి చెందిన వారైతే పెద్దలు కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలుంటాయి. ప్రేమ వివాహాలేమీ నిషిద్ధం కాదు, అయితే అవి రెండు కుటుంబాలను దగ్గర చేసేలా ఉండాలి.

ప్రేమించడం, ప్రేమించబడటం మానవసహజం. సెటిలయ్యాక పెళ్లాడితే ఇరుకుటుంబాలకు ఇబ్బందులుండవు. కాలేజీ ప్రేమల వల్ల తల్లిదండ్రుల్లో పిల్లల భవిష్యత్తుపై భయం పట్టుకుంటుంది. దీంతో వారు తిరస్కరిస్తారు. అయినా పిల్లలు మొండిపట్టుదలతో ముందుకెళ్లి కుటుంబాలకు దూరమవుతున్నారు.

కులమతాల తారతమ్యం, ఆస్తి తేడాలు, వారి చదువు తేడాలతో ఒక్కటైన ప్రేమ జంటలు రక్తసంబంధాలకు దూరమైన సందర్భాలు కోకొల్లలు. పరిణతి లేకుండా ఏకమైన జంటలు చాలా చిన్నకారణాలతో విడిపోతున్నారు. ఆలోచనాసహితమైన ప్రేమ.. ఇరువైపులా ఇంట్లో ఒప్పించి జరిగిన ప్రేమ పెళ్లి అయితేనే బంధాలను కాపాడగలదు.

నిజమైన ప్రేమ వివాహాలు అన్ని బంధాలనూ పెంచుతాయి. ఆనందాన్నిస్తాయి. క్షణికాకర్షణ వల్ల పుట్టిన ప్రేమలు-వివాహాలు, డబ్బును చూసి పుట్టిన ప్రేమలు... బంధాలనే కాదు బతుకులను కూడా కాలరాస్తాయి. ఈనాటి ఈతరం వీటి గురించి ఆలోచించి అడుగేయాలి. మంచీ చెడూ బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి.

ప్రేమ పెళ్లిళ్లు బంధాలను తుంచవు. పెంచుతాయి. ఎందుకంటే ప్రేమ అనేది చాలా విలువైనది. ఆ విలువ తెలుసుకుని ఒక్కటైన వారికి బంధాల విలువ బాగానే తెలుస్తుంది. అలా హృదయపూర్వకంగా ప్రేమించి ఒక్కటైన వారు కుటుంబాలను కలుపుతారు తప్ప విచ్ఛిన్నం చేయరు. అందుకే ప్రేమ కారణంగా కుటుంబాలు దెబ్బ తింటాయనడం సరికాదు. అంతే కాదు, పిల్లల ప్రేమను అర్థం చేసుకుని పెద్దలు అండగా ఉంటే, అసలు ఏ సమస్యలూ రావని నేనంటాను.

ఐదేళ్లలోపు పిల్లలను బడిలో చేర్పించడం సమంజసమేనా?

క్రిస్పీ ఆనియన్ రింగ్స్



కావలసినవి:
ఉల్లిపాయలు:3, మైదాపిండి: అరకప్పు, కోడిగుడ్డు:1, పాలు:అరకప్పు, మిరియాల పొడి:1 చెంచా, ఉప్పు, నూనె:తగినంత


తయారీ:
ఉల్లిపాయలను సన్నని చక్రాలుగా తరిగి, ఏ పొరకా పొర రింగుల్లాగా తీసుకోవాలి. ఓ బౌల్‌లో మైదాపిండి, ఉప్పు, మిరియాల పొడి, గుడ్డు సొన, పాలు వేసి జారుడుగా కలుపుకోవాలి. ఉల్లి రింగ్స్‌ని ఈ పిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.

భయపెట్టకండి... భరోసా ఇవ్వండి! (ఉత్తరం)

 
     
‘‘ఏరా... ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చి మూడు రోజులయ్యిందట. ఇంతవరకూ చూపించలేదే’’... అరిచినట్టే అంది సునంద. ఉలిక్కిపడ్డాడు రవి. మ్యాథ్స్‌లో తక్కువ మార్కులొచ్చాయి. అమ్మ తిడుతుందని భయంతో కార్డు చూపించలేదు. అదే చెప్పాడు. రవి చెప్పింది విని కోపం ముంచుకొచ్చింది సునందకి. ‘‘మార్కులు తక్కువెందుకొచ్చాయి? ఇప్పట్నుంచే వెనకబడితే టెన్త్ ఎగ్జామ్స్‌లో మంచి పర్సంటేజీ ఎలా వస్తుంది’’ అంటూ కేకలేసింది. ఆమె కోపాన్ని చూసి బిక్క చచ్చిపోయాడు రవి.

‘‘దేనికో భయపడుతోంది. అందుకే జ్వరం వచ్చింది, అదేంటో తెలుసుకుని ధైర్యం చెప్పండి తగ్గిపోతుంది’’... చెప్పాడు డాక్టర్ జాహ్నవితో. దీపని ఇంటికి తీసుకొచ్చి మెల్లగా అడిగింది ఏం జరిగిందని. ‘‘నువ్వు ఎక్స్‌కర్షన్ కోసమని ఇచ్చిన డబ్బులు పోయాయమ్మా. నీకు చెబుదామంటే భయమేసింది’’... అప్పటికీ దీప గొంతు వణుకుతూనే ఉంది. జాలేసింది జాహ్నవికి. కూతురిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది. ‘‘విషయం నాకో నాన్నకో చెప్పాలి కదరా, ఇలా నీకు నువ్వే భయపడి జ్వరం తెచ్చుకుంటే ఎలా’’ అంటూ సముదాయించింది. ‘‘ఇంకెపుడూ అజాగ్రత్తగా ఉండనమ్మా’’ అంటూ తల్లి ఒడిలో ఒదిగిపోయింది దీప.

ఈ రెండు సంఘటనలు కొన్ని విషయాలని చెబుతున్నాయి మనకి. మార్కులు బాగా తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి పైనా ఉంది. అలాగని వారిని విద్యార్థులుగానే చూస్తూ, మన పిల్లలన్న విషయం మర్చిపోతే ఎలా! చదవమని చెప్పడం తప్పు కాదు. ఒకవేళ చదవలేకపోతే మండిపడటం తప్పు. ఒక్క చదువు అనే కాదు, ఏ విషయంలోనైనా తిట్టి చెప్పకూడదు. పిల్లలకు కొన్ని బలహీనతలుంటాయి. వాటిని అధిగమించేలా చేయాలంటే మంచి మాటలతోనే సాధ్యం.

తిట్టడం, దండించడం మొదలుపెడితే వాళ్లు భయపడతారు. తమ బలహీనతల్ని, తప్పుల్ని దాచిపెడతారు. రవి, దీపల విషయంలో అదే జరిగింది. సునంద, జాహ్నవి మంచి తల్లులు. అయితే వారికి తెలియదు... తల్లి మంచి స్నేహితురాలిగా కూడా మెలగాలని. అందుకే వారు పిల్లల మన సుల్లోకి ఎప్పుడూ జొరబడలేదు. వాళ్ల చిట్టి మనసులు ఎలా ఆలోచిస్తాయో తెలుసుకోలేదు. అల్లరి చేస్తే తిడతారు. చదవకపోయినా, ఏదైనా తప్పు చేసినా చేయి చేసుకుంటారు కూడా. అందుకే ఆ పిల్లలో భయం పేరుకుపోయింది. తప్పు చేశామని చెబితే దండన తప్పదన్న భయంతో నిజాల్ని దాచిపెట్టేశారు. అదే, వాళ్లిద్దరూ పిల్లలతో స్నేహంగా ఉండివుంటే, మీరెలా ఉన్నా ఏం చేసినా మేం స్వీకరిస్తామన్న ధైర్యాన్ని కలిగించివుంటే, ఆ చిన్నారులకు నిజాల్ని దాచడం అలవాటయ్యేది కాదు. ఆ విషయం సునందకి అప్పటికీ అర్థం కాలేదు. కానీ జాహ్నవి ఆలోచించింది. వెంటనే తన పద్ధతికి స్వస్తి చెప్పింది.

అందరు తల్లిదండ్రులూ చేయాల్సింది ఇదే. పిల్లలతో స్నేహం చేయండి. మీరేం చెప్పినా మేం అర్థం చేసుకుంటామన్న భరోసా ఇవ్వండి. అది వారికి ధైర్యాన్నిస్తుంది. అలాగని పిల్లల తప్పుల్ని పట్టించుకోవద్దని కాదు... పిల్లలన్నాక పొరపాట్లు చేస్తారు. భయం ఉంటే దాచేస్తారు. అదే మీరు ధైర్యాన్నిచ్చారనుకోండి, మీతో చెప్పేస్తారు. దాని వల్ల చేయిదాటిపోక ముందే మీరు వాళ్లని సరిదిద్దుకోవచ్చు!

రాబిన్ లీ... చైనా కుబేరుడి కథ! (విజయం)

 
     
అందరి కడుపు నింపడమే కష్టమైతే ఇక చదువెక్కడ? కానీ చిన్నప్పటి నుంచి లీకి చదువంటే ఇష్టం. చురుకైన కుర్రాడు కూడా. తల్లి కూడా అతన్ని పెద్ద చదువులు చదివించాలని అనుకునేది. చిన్నప్పుడే అతనికీ విషయం నూరిపోసింది. మన బతుకులు మారాలంటే చదువొక్కటే మార్గమని చెప్పింది. అసలే చదువంటే పడిచచ్చే లీకి అమ్మ మాటలు బాగా వంటబట్టాయి. కష్టపడి చదివాడు. ప్రతిభా వంతుడిగా పేరు తెచ్చుకున్నాడు.

అమెరికాలో గూగుల్.. ఆస్ట్రేలియాకు వెళ్తే గూగుల్.. ఆఫ్రికాలోనూ గూగులే.. ఇండియాకు వచ్చినా గూగులే. మరి చైనాలో...? అక్కడ మాత్రం గూగుల్ కాదు.. ప్రపంచాన్నంతా జయించిన గూగుల్.. చైనాలో మాత్రం ‘బైదు’కు తలవంచింది. అక్కడ ‘బైదు’నే నెంబర్‌వన్ సెర్చ్ ఇంజిన్. చైనాలో 80 శాతం మార్కెట్ కలిగిన ఈ సెర్చ్ ఇంజిన్ కు అధిపతి రాబిన్ లీ. ఇప్పుడితనే చైనాలో అత్యంత ధనవంతుడు. అలాగని అతను పుట్టుకతో కుబేరుడు కాడు. ఓ పేద కుటుంబంలో పుట్టాడు. తిండికి, చదువుకు కష్టపడిన ఆ కుర్రాడు.. కుబేరుడిగా ఎలా ఎదిగాడో తెలుసుకుందాం రండి!

రాబిన్ లీ తల్లిదండ్రులు ఓ ఫ్యాక్టరీలో కూలీలుగా పనిచేసేవాళ్లు. ఐదుగురు సంతానంలో ఒకడు లీ. మిగతా నలుగురూ అమ్మాయిలే. అందరి కడుపు నింపడమే కష్టమైతే ఇక చదువెక్కడ? కానీ చిన్నప్పటి నుంచి లీకి చదువంటే ఇష్టం. చురుకైన కుర్రాడు కూడా. తల్లి కూడా అతన్ని పెద్ద చదువులు చదివించాలని అనుకునేది. చిన్నప్పుడే అతనికీ విషయం నూరిపోసింది. మన బతుకులు మారాలంటే చదువొక్కటే మార్గమని చెప్పింది. అసలే చదువంటే పడిచచ్చే లీకి అమ్మ మాటలు బాగా వంటబట్టాయి. పట్టుదలతో చదివాడు. స్కూల్లో ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడే అతని మనసు ఓ వస్తువుపైకి మళ్లింది. అదే కంప్యూటర్. స్కూల్లో ఎక్కువ సమయం దానిపైనే గడిపాడు. అనేక విషయాలు నేర్చుకున్నాడు. స్కూలు చదువు పూర్తయ్యాక చైనా ఉన్నత విద్య ప్రవేశ పరీక్ష రాసిన రాబిన్.. అన్ని పరీక్షల్లోనూ టాపర్‌గా నిలిచాడు. తర్వాత పెకింగ్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ డిగ్రీలో చేరాడు. ఈ చదువులన్నిటికీ డబ్బెక్కడిదనేగా... చైనాలో చదువులు మనంత ఖరీదు కాదు లెండి.

దాదాపు ఉచితమే. డిగ్రీ నుంచి అతని జీవితం మలుపు తిరిగింది. తన గమనం, గమ్యం ఐటీనే అని నిర్ణయించుకున్న లీ.. తర్వాత స్కాలర్‌షిప్‌పై అమెరికా వెళ్లి ఓ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ డాక్టరల్ డిగ్రీ సంపాదించాడు. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాడు. డౌజోన్స్‌లో ఉద్యోగం దొరికింది. అక్కడ చేరిన కొన్నాళ్లకే వాల్ స్ట్రీట్ జర్నల్ ఆన్ లైన్ ఎడిషన్‌కు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసి అందరి మన్ననలందుకున్నాడు. అది రాబిన్ లీ ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. ఆ ఉత్సాహంలో మరో రెండేళ్లకే రాంక్‌డెక్స్ అనే సెర్చ్ ఇంజిన్‌కు తోడ్పాటునందించే సైట్ స్కోరింగ్ అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశాడు. దీనికి యూఎస్ పేటెంట్ కూడా లభించింది. ఆ తర్వాత లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఇక తాను ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదని అతనికి అర్థమైపోయింది. ఉద్యోగం మానేసి సొంతంగా సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. అలా మొదలైందే ‘బైదు’. తాను పేటెంట్ సాధించిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి బైదు సెర్చ్ ఇంజిన్‌ను డెవలప్ చేసిన లీ.. మరో మిత్రుడితో కలిసి సంస్థను నెలకొల్పాడు.

2000లో ఆరంభమైన బైదు కొన్నేళ్లలోనే చైనాలో అద్భుత విజయం సాధించింది. సెర్చ్ ఇంజిన్ అంటే గూగులేనని మనమనుకున్నట్లు చైనా అంతటా ‘బైదు’నే కనిపించడం ఆరంభమైంది. అది చైనాలో ఫేమస్ సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు, ప్రస్తుతం ప్రపంచంలోని వెబ్‌సైట్లలో దానిది ఐదో స్థానం. చైనాలో అదే నెంబర్‌వన్. రోజుకు 25 కోట్ల మంది ఈ సెర్చ్ ఇంజిన్‌ను వినియోగిస్తారని అంచనా. 20 వేల మందికి పైగా ఉపాధినిస్తున్న బైదు వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. చైనాలో బైదు.కామ్ మార్కెట్ వాటా 62 శాతం. బైదు.కామ్ సీఈఓగా ఉన్న రాబిన్ లీ సంపద తాజా లెక్కల ప్రకారం 10.2 బిలియన్ యూఎస్ డాలర్లు. ఇటీవల ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాను ప్రకటించిన ఫోర్బ్స్.. రాబిన్ లీ చైనాలో అత్యంత ధనవంతుడిగా గుర్తించింది. అతని వయసు ప్రస్తుతం 44 ఏళ్లే. సాధారణంగా ఈ ధనవంతుల జాబితాలో ఉన్న వారిలో సింహభాగం వారసత్వంగా వ్యాపారాలు నడుపుతున్న వారే. కానీ ఒక పేద కుటుంబంలో పుట్టి, కేవలం తన సామర్థ్యాన్ని నమ్ముకుని, భవిష్యత్తును ముందే ఊహించి, వినూత్నమైన ఆలోచనతో వ్యాపారవేత్తగా మారిన రాబిన్ లీకి వారెవ్వరూ సాటిరారు. ఎందుకంటే అతనిది స్వంత సామ్రాజ్యం. లీ నాయకత్వాన్ని మెచ్చుకున్న అవార్డులు రాస్తే ఈ పేజీ సరిపోదు.
- ప్రకాష్ చిమ్మల