‘‘ఏరా... ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చి మూడు
రోజులయ్యిందట. ఇంతవరకూ చూపించలేదే’’... అరిచినట్టే అంది సునంద. ఉలిక్కిపడ్డాడు రవి.
మ్యాథ్స్‌లో తక్కువ మార్కులొచ్చాయి. అమ్మ తిడుతుందని భయంతో కార్డు చూపించలేదు. అదే
చెప్పాడు. రవి చెప్పింది విని కోపం ముంచుకొచ్చింది సునందకి. ‘‘మార్కులు
తక్కువెందుకొచ్చాయి? ఇప్పట్నుంచే వెనకబడితే టెన్త్ ఎగ్జామ్స్‌లో మంచి పర్సంటేజీ ఎలా
వస్తుంది’’ అంటూ కేకలేసింది. ఆమె కోపాన్ని చూసి బిక్క చచ్చిపోయాడు రవి.
‘‘దేనికో భయపడుతోంది. అందుకే జ్వరం వచ్చింది, అదేంటో తెలుసుకుని ధైర్యం చెప్పండి
తగ్గిపోతుంది’’... చెప్పాడు డాక్టర్ జాహ్నవితో. దీపని ఇంటికి తీసుకొచ్చి మెల్లగా
అడిగింది ఏం జరిగిందని. ‘‘నువ్వు ఎక్స్‌కర్షన్ కోసమని ఇచ్చిన డబ్బులు పోయాయమ్మా.
నీకు చెబుదామంటే భయమేసింది’’... అప్పటికీ దీప గొంతు వణుకుతూనే ఉంది. జాలేసింది
జాహ్నవికి. కూతురిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది. ‘‘విషయం నాకో నాన్నకో
చెప్పాలి కదరా, ఇలా నీకు నువ్వే భయపడి జ్వరం తెచ్చుకుంటే ఎలా’’ అంటూ సముదాయించింది.
‘‘ఇంకెపుడూ అజాగ్రత్తగా ఉండనమ్మా’’ అంటూ తల్లి ఒడిలో ఒదిగిపోయింది దీప.
ఈ
రెండు సంఘటనలు కొన్ని విషయాలని చెబుతున్నాయి మనకి. మార్కులు బాగా తెచ్చుకోవాల్సిన
బాధ్యత ప్రతి విద్యార్థి పైనా ఉంది. అలాగని వారిని విద్యార్థులుగానే చూస్తూ, మన
పిల్లలన్న విషయం మర్చిపోతే ఎలా! చదవమని చెప్పడం తప్పు కాదు. ఒకవేళ చదవలేకపోతే
మండిపడటం తప్పు. ఒక్క చదువు అనే కాదు, ఏ విషయంలోనైనా తిట్టి చెప్పకూడదు. పిల్లలకు
కొన్ని బలహీనతలుంటాయి. వాటిని అధిగమించేలా చేయాలంటే మంచి మాటలతోనే సాధ్యం.
తిట్టడం, దండించడం మొదలుపెడితే వాళ్లు భయపడతారు. తమ బలహీనతల్ని, తప్పుల్ని
దాచిపెడతారు. రవి, దీపల విషయంలో అదే జరిగింది. సునంద, జాహ్నవి మంచి తల్లులు. అయితే
వారికి తెలియదు... తల్లి మంచి స్నేహితురాలిగా కూడా మెలగాలని. అందుకే వారు పిల్లల మన
సుల్లోకి ఎప్పుడూ జొరబడలేదు. వాళ్ల చిట్టి మనసులు ఎలా ఆలోచిస్తాయో తెలుసుకోలేదు.
అల్లరి చేస్తే తిడతారు. చదవకపోయినా, ఏదైనా తప్పు చేసినా చేయి చేసుకుంటారు కూడా.
అందుకే ఆ పిల్లలో భయం పేరుకుపోయింది. తప్పు చేశామని చెబితే దండన తప్పదన్న భయంతో
నిజాల్ని దాచిపెట్టేశారు. అదే, వాళ్లిద్దరూ పిల్లలతో స్నేహంగా ఉండివుంటే, మీరెలా
ఉన్నా ఏం చేసినా మేం స్వీకరిస్తామన్న ధైర్యాన్ని కలిగించివుంటే, ఆ చిన్నారులకు
నిజాల్ని దాచడం అలవాటయ్యేది కాదు. ఆ విషయం సునందకి అప్పటికీ అర్థం కాలేదు. కానీ
జాహ్నవి ఆలోచించింది. వెంటనే తన పద్ధతికి స్వస్తి చెప్పింది.
అందరు
తల్లిదండ్రులూ చేయాల్సింది ఇదే. పిల్లలతో స్నేహం చేయండి. మీరేం చెప్పినా మేం అర్థం
చేసుకుంటామన్న భరోసా ఇవ్వండి. అది వారికి ధైర్యాన్నిస్తుంది. అలాగని పిల్లల
తప్పుల్ని పట్టించుకోవద్దని కాదు... పిల్లలన్నాక పొరపాట్లు చేస్తారు. భయం ఉంటే
దాచేస్తారు. అదే మీరు ధైర్యాన్నిచ్చారనుకోండి, మీతో చెప్పేస్తారు. దాని వల్ల
చేయిదాటిపోక ముందే మీరు వాళ్లని సరిదిద్దుకోవచ్చు!
No comments:
Post a Comment