all

Friday, July 5, 2013

పెళ్లి చేసుకుని, తల్లయ్యాక కూడా సినిమాలను వదలను

 
     
‘ఏ... గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా...’
ఈ అబ్బాయిలకేం పన్లేదు, అమ్మాయి కనిపిస్తే చాలు...
గబ్బర్‌సింగ్‌లా రెచ్చిపోయి సాంగ్ ఎత్తుకుంటారు.
జున్నులాంటి పిల్లకు గన్నులాంటి కళ్లు లేకపోతే...
ఆ మాత్రమైనా ఆగుతారా?!
శ్రుతిహాసన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి స్వీట్ డిలైట్.
మొన్న గబ్బర్‌సింగ్‌లో ఆమే, ఇవాళ ‘బలుపు’లో ఆమే...
రేపు ‘ఎవడు’, ‘రామయ్యా వస్తావయ్యా’లో కూడా ఆమే!
కమల్ కూతురు అనే ట్యాగ్ సడన్‌గా ఎక్కడో రాలిపోయి...
సక్సెస్‌ఫుల్ యాక్ట్రెస్‌గా మెరిసిపోతున్నారు శ్రుతిహాసన్.
స్క్రీన్ మీద ఇంతవరకు ‘గన్ను’లాంటి ఆమె కళ్లనే చూశాం.
అవి పేల్చే బులెట్‌లాంటి వ్యూస్‌ని ఇవాళ చదవబోతున్నాం.
మరి జున్నో?!!
మీ దగ్గర ఏ థియేటర్‌లోనైనా దొరుకుతుంది బాస్.
ఇవాళ్టి ‘తారాంతరంగం’ మాత్రం సాక్షికి... స్పెషల్ !


మీ పేరెంట్స్ ఇద్దరూ (కమల్‌హాసన్, సారిక) సెలబ్రిటీస్.. గొప్ప బ్యాక్‌గ్రౌండ్... మరి మీ బాల్యం ఎలా గడిచింది?
శ్రుతిహాసన్: అమ్మానాన్నలు చిన్నప్పట్నుంచీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏది అడిగినా కాదనేవారు కాదు. నేను, చెల్లి బాగా అల్లరి చేసేవాళ్లం. పిల్లలు కదా అని వదిలేసేవాళ్లు. ఆడింది ఆట పాడింది పాటగానే నా బాల్యం హ్యాపీగా సాగింది.

ఎప్పుడైనా మీ నాన్నగారితో కలిసి షూటింగ్స్‌కి వెళ్లారా?
శ్రుతిహాసన్: చాలాసార్లు వెళ్లాను. ఫస్ట్ టైమ్ ఆయనతో షూటింగ్‌కి వెళ్లింది ‘విచిత్ర సోదరులు’ టైమ్‌లో. ఆ చిత్రంలో నాన్న సింహాలు, పులులతో కలిసి నటించారు. అది చూసి ‘అమ్మో’ అనుకున్నాను. నాన్న చాలా ‘డేరింగ్’ అనిపించింది.

మీరు చిన్నప్పుడే ‘దేవర్ మగన్’ (తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’) సినిమాలో పాట పాడారు కదా?
శ్రుతిహాసన్: అవును.. అప్పుడు నాకు ఆరేళ్లు అనుకుంటా. ఇళయరాజాగారి కంపోజిషన్‌లో పాడాను. పాట పూర్తవ్వగానే అందరూ అప్రిషియేట్ చేశారు.

ఇళయరాజా దగ్గర కాంప్లిమెంట్ అందుకోవడం ఎలా అనిపించింది?
శ్రుతిహాసన్: ‘దేవర్‌మగన్’లో పాడక మునుపే ఓసారి నాన్న నన్ను రికార్డింగ్ థియేటర్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఇళయరాజాగారు ఉన్నారు. నేను ఓ పక్కన కూర్చుని, ఎప్పుడో నాన్న నేర్పించిన ఓ దేశభక్తి గీతాన్ని మెల్లిగా హమ్ చేయడం మొదలుపెట్టాను. అది విని, ‘మీ అమ్మాయి గొప్ప సింగర్ అవుతుంది. పేరు కూడా శ్రుతి అని భలే పెట్టారే’ అని ఇళయరాజాగారు అన్నారు. చిన్న వయసులో ఆ కాంప్లిమెంట్స్ విలువ నాకంతగా తెలియలేదు. కానీ ఇప్పుడా సంఘటన ఎప్పుడు గుర్తొచ్చినా.. ‘ఇళయరాజాగారిలాంటి గొప్ప వ్యక్తి అభినందనలు అందుకున్నాను’ అని ఆనందపడిపోతుంటా!

బహుశా మ్యూజిక్ నేర్చుకోవాలనే ఆకాంక్ష అప్పుడు కలిగి ఉంటుందేమో...
శ్రుతిహాసన్: సంగీతం మీద ఎప్పుడు ఇంట్రస్ట్ కలిగిందో కరెక్ట్‌గా చెప్పలేను. కానీ చిన్నతనం నుంచీ ఎప్పుడూ ఏదో ఒక పాట హమ్ చేస్తుండేదాన్ని. కొంచెం ఊహ తెలిశాక ఓ పద్ధతి ప్రకారం నేర్చుకుంటే బాగుంటుందనిపించింది. అయిదేళ్లు హిందుస్తానీ మ్యూజిక్ నేర్చుకున్నాను. తర్వాత అమెరికాలో మ్యూజిక్‌లో డిగ్రీ పుచ్చుకున్నాను.

హీరోయిన్ అవ్వాలనే కోరిక చిన్నప్పట్నుంచీ ఉండేదా?
శ్రుతిహాసన్: సినిమా హీరోయిన్ అంటే అందంగా ఉండాలి. మనం అందంగా లేం కదా అనే ఫీలింగ్ ఉండేది. చిన్నప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని. సో, నీడపట్టున ఉన్నది తక్కువ, ఎండల్లో ఫ్రై అయినది ఎక్కువ (నవ్వుతూ). అందుకని రంగు తక్కువగా ఉండేదాన్ని. హీరోయిన్‌గా పనికి రాననుకునేదాన్ని. కానీ సినిమాలంటే ఇష్టం. అందుకని సింగర్‌గా అయినా ఈ ఫీల్డ్‌లో ఉండాలనుకున్నాను. పెద్దయిన తర్వాత అందం మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. దాంతో సినిమాల్లో ట్రై చేయొచ్చనుకున్నాను.

‘లక్’ చిత్రం ద్వారా సినిమాల్లోకొచ్చి, ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ‘అన్‌లక్కీ’ అనిపించుకున్నారు. దానికి తోడు వరుస ఫ్లాప్‌లతో మీ మీద ‘ఐరన్ లెగ్’ ట్యాగ్ పడింది...
శ్రుతిహాసన్: నిజాయితీగా చెప్పాలంటే.. ఓ సినిమా బాగా రావాలంటే మంచి హీరో, మంచి దర్శకుడు, మంచి బ్యానర్ చాలా ముఖ్యం. అలాగే హిట్ సినిమాకి కావల్సిన అంశాలన్నీ ఉండాలి. సినిమా ఎందుకు ఆడుతుంది? ఎందుకు ఆడలేదు? అని కారణాలు వెతకడం కష్టం. ఇక నా మీద వేసిన ట్యాగ్ గురించి అంటారా.. దాని గురించి పట్టించుకోలేదు. ఏదేదో మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకోలేం కదా. ఒక సినిమా వర్కవుట్ అవ్వడం... కాకపోవడం అనేది నా చేతుల్లో ఉండదు. కానీ హార్డ్‌వర్క్ చేయడం మాత్రం నా చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి.. నా పాత్రకు ఎంత న్యాయం చేయాలో అంతా చేస్తాను. ఒకవేళ శ్రుతి బాగా యాక్ట్ చేయలేదని ఎవరైనా అంటే.. అప్పుడు తప్పు నాది అవుతుంది. ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను.

హీరోలు వరుసగా ఫ్లాప్ సినిమాల్లో యాక్ట్ చేస్తే ‘ఐరన్ లెగ్’ అనరు. మరి.. హీరోయిన్లను మాత్రం ఎందుకు అలా అంటారో అని ఎప్పుడైనా ఆలోచించారా?
శ్రుతిహాసన్: ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే.. ఒక సినిమాకి హీరోయిన్ ఎంతో ఇంపార్టెంట్ కాబట్టే.. తననే టార్గెట్ చేస్తున్నారనిపిస్తోంది (నవ్వుతూ). సో.. హీరోయిన్స్‌ని అలా మాట్లాడటం మంచిదే.

కమల్‌హాసన్ కూతురు అనే ట్యాగ్ కొంత ప్లస్, కొంత మైనస్ కదా?
శ్రుతిహాసన్: నిజమే. ప్లస్ కొంతవరకు మైనస్ కొంతవరకు ఉంటుంది. కమల్‌హాసన్ కూతురినని అభిమానంగా చూస్తారు... అది ప్లస్! కానీ నాన్నతో నన్ను పోల్చినప్పుడు, మైనస్ అవుతుంది! ఆయన 50ఏళ్లుగా యాక్ట్ చేస్తున్నారు. నన్ను మాత్రమే కాదు ఎవర్నీ నాన్నతో పోల్చడం సరికాదు. నాన్న తెచ్చుకున్న పేరు, ప్రఖ్యాతులకు నాకు గర్వంగా ఉంటుంది. కానీ తనతో నన్ను పోల్చవద్దు. మొదట్లో ఆ పోలిక వచ్చింది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో నన్ను నన్నుగా చూడటం మొదలుపెట్టేశారు. అందుకు ఆనందంగా ఉంది.

దేశం గర్వించదగ్గ నటుడు కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ సినిమా అనుకున్న సమయంలో విడుదలవ్వకపోతే ఇక రోడ్డు మీదకొచ్చేస్తానని అన్నప్పుడు ఓ కూతురిగా మీకేమనిపించింది?
శ్రుతిహాసన్: నాన్నగారిలోని నటుణ్ణి నేను పూర్తిగా గౌరవిస్తా. ఓ ఆర్టిస్ట్‌గా నేను ఆయన్ను సపోర్ట్ చేస్తాను. ఇక ఓ సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టాలన్నది నిర్మాత వ్యక్తిగత విషయం. ఆ పరంగా ‘విశ్వరూపం’కి నాన్న పెట్టిన పెట్టుబడిని నేను గౌరవిస్తాను. మా ఇంట్లో సినిమాయే ముఖ్యం. సినిమాని ఉన్నత స్థాయిలో పెడతాం. కరెక్ట్‌గా చెప్పాలంటే ఆకాశమంత ఎత్తున పెడతాం. కాబట్టి సినిమా కోసం ఏమేం చేయాలో అంతా చేస్తాం.

నాన్నగారి ఆర్థిక స్థితి తెలుసుకున్న తర్వాత అభద్రతాభావానికి గురయ్యారా?
శ్రుతిహాసన్: లేదు. ఎందుకంటే నాకు ఆర్థిక స్వాతంత్య్రం ఉంది. నాన్న ఫైనాన్షియల్ స్టేటస్ వేరు. నాది వేరు. నా బిల్స్ నేనే పే చేసుకుంటాను. నా ఫైనాన్స్‌ని నేను మేనేజ్ చేసుకుంటాను.

మీ పేరెంట్స్‌తో మీ సంపాదన గురించి డిస్కస్ చేయరా?
శ్రుతిహాసన్: చెయ్యను. ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉంటాను. నా ఫస్ట్ సినిమా నుంచీ ఇలానే ఉన్నాను. డబ్బు సంపాదించుకుంటూ, ఆ డబ్బుని ప్రాపర్‌గా మేనేజ్ చేయడంలో ఓ కిక్ ఉంది. అలాగే బాధ్యత కూడా ఉంటుంది.

మరి.. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో మీరెంతవరకు సక్సెస్‌ఫుల్ అనుకుంటున్నారు?
శ్రుతిహాసన్: డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టకూడదనేది నా ఫిలాసఫీ. అంతా పోగొట్టుకుంటే ఎవరి దగ్గరైనా చేతులు చాపాల్సి వస్తుంది. ఆ పరిస్థితిని ఎప్పటికీ తెచ్చుకోకూడదనుకుంటాను. అందుకే సింపుల్‌గా ఉంటా. ఎక్కువ ఖర్చుపెట్టను.

ప్రస్తుతం మీరెక్కడ ఉంటున్నారు?
శ్రుతిహాసన్: ముంబయ్‌లో ఉంటున్నాను.

మీ అమ్మగారు, చెల్లెలు అక్షర కూడా ముంబయ్‌లోనే ఉంటారు కదా.. వాళ్లతో కలిసి ఉంటున్నారా?
శ్రుతిహాసన్: లేదు. నా ఇంటికీ మా అమ్మగారి ఇంటికీ మూడు వీధుల దూరం.

ఒకే ఊళ్లో ఉంటూ.. విడివిడిగా ఉండటమెందుకు?
శ్రుతిహాసన్: నా స్పేస్‌ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటాను. అందుకే విడిగా ఉంటున్నాను. షూటింగ్స్‌లో యాభై నుంచి వందమంది చుట్టూ ఉంటారు. అందుకని ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇష్టం. కవితలు, కథలు రాసుకోవడం, మ్యూజిక్ వినడం, సినిమాలు చూడటం.. ఇలా ఎంజాయ్ చేయడం ఇష్టం. అందుకే ముంబయ్‌లో ఒక్కదాన్నే ఉంటున్నాను.

మీ అమ్మగారు, చెల్లెల్ని ఎప్పుడెప్పుడు కలుస్తుంటారు?
శ్రుతిహాసన్: ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు కలుస్తుంటాము. ఒకట్రెండు రోజులు ఖాళీ వస్తే, వాళ్లతోనే స్పెండ్ చేస్తా.

అక్షర డెరైక్టర్ అవ్వాలనుకుంటున్నారట?
శ్రుతిహాసన్: తను ఏం అవ్వాలనుకుంటుందనేది తనే స్వయంగా చెబుతుంది. అయితే తను ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తాను. సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను.

మీరు మంచి పని చేసినప్పుడు ఎలా ఉన్నా.. తప్పు చేస్తే మాత్రం కమల్‌హాసన్ కూతురు అలా చేసిందా అంటారు. ముఖ్యంగా సినిమాల్లో బికినీ ధరించినప్పుడు, హద్దులు దాటి ఎక్స్‌పోజింగ్ చేసినప్పుడు, ఎఫైర్లు...?
శ్రుతిహాసన్: మీరన్నది కరెక్టే. కానీ అలా అనేవాళ్లకి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. ఒక ప్రొఫెషన్‌ని ఎంచుకున్న తర్వాత దానికి పూర్తిగా న్యాయం చేయాలనే ఎవరైనా అనుకుంటారు. మేం కూడా అంతే. ఏదైనా సీన్ డిమాండ్ చేసినప్పుడు బికినీ ధరించాల్సి ఉంటుంది. అలాగే సీన్ డిమాండ్ చేస్తే వంటి నిండా చీర కట్టుకుంటాం. మరి.. చీర కట్టుకున్నప్పుడు ఇష్యూ చేయనివాళ్లు బికినీ గురించి మాత్రం ఎందుకు మాట్లాడతారు? ఇక ఎఫైర్లు... మిగతా విషయాలంటే ఎవరికి తోచినది వాళ్లు మాట్లాడతారు. వాటి గురించి నేనెందుకు మాట్లాడాలి? నాన్న కూడా సినిమా ఫీల్డ్‌లోనే ఉన్నారు కాబట్టి.. ఇలాంటివి సహజం అని ఆయనకు తెలుసు.

సిద్దార్థ్‌తో సహజీవనం అంటూ వార్తల్లో నిలిచారు. దీనికి మీరిచ్చే సమాధానం?
శ్రుతిహాసన్: సెలబ్రిటీస్ గురించి ఏవేవో వార్తలు వస్తుంటాయి. నా గురించి వచ్చే వార్తలకు రియాక్ట్ అవ్వడం నా పని కాదు. సినిమాల్లో యాక్ట్ చేయడమే నా పని. ఏ పత్రికలో వచ్చిన వార్త అయినా కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ ఒక సినిమా డీవీడీ 20, 30, 50 ఏళ్లు... ఆ పైనే ఉంటుంది. సో.. నా ఫోకస్ నిరంతరం నిలిచే సినిమాలపైనే ఉంటుంది. నాపై వచ్చిన వార్తల మీద ఉండదు. నా గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు. నేనేంటో నాకు తెలుసు. నా పనేంటో ప్రేక్షకులకు తెలుసు. ఆ పనిలో నన్ను నేను నిరూపించుకోవాలన్నదే నా ప్రస్తుత కర్తవ్యం.

రజనీకాంత్ అల్లుడు ధనుష్‌తో కమల్‌హాసన్ కూతురు ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలకు మీ రియాక్షన్?
శ్రుతిహాసన్: ఈ వార్తలకు కూడా ఫీలవ్వలేదు. ధనుష్ మంచి కో-స్టార్. మంచి నటుడు. మళ్లీ అవకాశం వస్తే ధనుష్ సరసన తప్పకుండా నటిస్తాను. అది మినహా నాకు తన మీద వేరే ఏదీ లేదు.

ధనుష్ భార్య ఐశ్వర్యతో మీ అనుబంధం?
శ్రుతిహాసన్: తమిళంలో నేను చేసిన రెండో సినిమాకి తను డెరైక్టర్. నా ఫస్ట్ ఫీమేల్ డెరైక్టర్. తనతో నాకు మంచి ఈక్వేషన్ ఉంది.

ఇక ప్రస్తుతం మీ కెరీర్ విషయానికొస్తే... గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మీ చేతినిండా సినిమాలే. ఎలా అనిపిస్తోంది?
శ్రుతిహాసన్: ఆ దేవుడు నా మీద చాలా దయ చూపిస్తున్నాడనిపిస్తోంది. ఇటీవల ‘బలుపు’ విడుదలయ్యింది. హిందీలో చేస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’, ‘డీ-డే’ సినిమాలు వచ్చేనెల 19న విడుదలవుతాయి. ఇంకా తెలుగులో చేస్తున్న ‘ఎవడు’, ‘రామయ్యా వస్తావయ్యా’ ఈ ఏడాదే విడుదలవుతాయి. ఇలా ఒకే సంవత్సరం ఆరుసార్లు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడం ఓ మర్చిపోలేని అనుభూతి.

ఈ రెండేళ్లల్లో లేని విధంగా ఒకేసారి ఇన్ని సినిమాలు చేస్తున్నారు. ‘గబ్బర్‌సింగ్’ సక్సెస్ మీ కెరీర్‌ని మంచి మలుపు తిప్పిందనుకోవచ్చా?
శ్రుతిహాసన్: ఒక సినిమా సక్సెస్ ప్రభావం కొంతవరకు ఉంటుందేమో. ఆ విషయం నాకు తెలియదు. అయితే నా గత చిత్రాలకు ఎంత హార్డ్‌వర్క్ చేశానో ‘గబ్బర్‌సింగ్’కీ అలానే చేశాను. నా మొదటి రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోవడం దురదృష్టం. ఆ చిత్రాల ఫ్లాప్‌కి కారణాలు తెలియదు. జయాపజయాలు కామన్ కాబట్టి వాటి గురించి పెద్దగా ఆలోచించలేదు.

ఐదారు సినిమాలు చేస్తున్నప్పుడు ఎప్పుడెక్కడ ఉంటారో తెలియదు కాబట్టి ఎప్పుడూ సూట్‌కేస్ రెడీగా పెట్టుకోవాలేమో?
శ్రుతిహాసన్: అవును. యాక్చువల్‌గా ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్ పరమ బోర్. వారం రోజులు హైదరాబాద్ ఆ తర్వాత ఏడెనిమిది రోజులు మరో సిటీ.. ఆ తర్వాత ఇంకో సిటీ.. ఇలా ఉంటుంది. సూట్‌కేస్ ఇప్పుడే సర్దినట్లు ఉంటుంది. ఈలోపే వారం ముగుస్తుంది. అన్‌ప్యాక్ చేసి, మళ్లీ ప్యాక్ చేయడం పెద్ద యజ్ఞంలా ఫీలవుతా. ఈ రెండూ నాకు నచ్చని విషయాలు. ఈ ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్ లేకపోతే మన జీవితం ఎంత బాగుంటుందని అప్పుడప్పుడు అనుకుంటుంటాను.

ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘డి డే’ పోస్టర్ చూసినవాళ్లు, శ్రుతి విజృంభించింది అంటున్నారు. శ్రుతి ఈ సినిమా చేయడం అవసరమా అన్నది చాలామంది అభిప్రాయం?
శ్రుతిహాసన్: వేశ్యపాత్రను సవాల్‌గా తీసుకున్నాను కాబట్టే ఆ సినిమా ఒప్పుకున్నాను. సినిమా పోస్టర్‌ని దురుద్దేశంతో చూస్తే అది తప్పుగానే అనిపిస్తుంది. అదే కళాత్మక దృష్టితో చూశారనుకోండి అసభ్యం కనిపించదు. చూసేవాళ్ల దృష్టిని బట్టే ఏదైనా ఉంటుంది. నేను ప్రతి ఒక్కరి దృష్టినీ కంట్రోల్ చేయలేను. వాళ్ల అభిప్రాయాలను మార్చలేను. నా పనిని కంట్రోల్ చేయడమే నా పని. ఈ చిత్రంలో నేను చేసింది బోల్డ్ రోల్. అది కాదనను. కథానుగుణంగా చూస్తే ఆ పాత్ర నచ్చుతుంది. నాకు తెలిసి ఇలాంటి పాత్ర చేసే అవకాశం ఎవరికి వచ్చినా అంగీకరిస్తారు.

టబు, రాణి ముఖర్జీ, అనుష్క.. ఇలా చాలామంది తారలు వేశ్య పాత్రను అద్భుతంగా చేశారు.. వాళ్ల పాత్రలను ఆదర్శంగా తీసుకున్నారా?
శ్రుతిహాసన్: వాళ్లు చేసిన సినిమాలను నేను చూడలేదు. నా స్టయిల్‌లో చేస్తే బాగుంటుందనుకున్నాను. డెరైక్టర్ నా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేశారో అందుకు తగ్గట్టుగా యాక్ట్ చేశాను. నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. డెరైక్టర్ మనసులో అనుకున్నదాన్ని ఆవిష్కరించడానికి శాయశక్తులా కృషి చేస్తా.

తెలుగులో ‘గబ్బర్‌సింగ్’తో బ్రేక్ వచ్చినట్లు ‘డీ డే’, ‘రామయ్యా వస్తావయ్యా’తో హిందీలో కూడా బ్రేక్ వస్తుందనుకుంటున్నారా?
శ్రుతిహాసన్: ఒక సినిమా ఆడటం, ఆడకపోవడం అనేది మా చేతుల్లో ఉండదు. ఆ సినిమాకోసం పడే కష్టం మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. ‘డీ డే’పై అంచనాలు ఉన్నాయి. ‘రామయ్యా వస్తాయ్యా’ స్టిల్స్ బాగున్నాయంటున్నారు. లుక్ బాగుందని, పాటలు బాగున్నాయని చెబుతున్నారు. సో.. అంతా ఆ దేవుడి చేతిలోనే ఉంటుంది.

దేవుణ్ణి బాగా నమ్ముతారా?
శ్రుతిహాసన్: బాగా... బాగా నమ్మకం.

మీ నాన్నగారు నమ్మరేమో?
శ్రుతిహాసన్: నాన్నకి నమ్మకం లేదు. అది ఆయన వ్యక్తిగత ఫీలింగ్.

మరి మీ అమ్మగారి సంగతి?
శ్రుతిహాసన్: తను ఆధ్యాత్మిక బాటలో నడుస్తుంది. గుడికి వెళ్లదు కానీ దేవుణ్ణి నమ్ముతుంది.

మీరు గుడికి వెళ్తుంటారా?
శ్రుతిహాసన్: వీలు కుదిరినప్పుడల్లా గుడికి వెళుతుంటాను. గుడి అంటే కేవలం భక్తి అని మాత్రమే అనుకోను. చరిత్ర అనుకుంటాను. గుడికి వెళితే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతాను. ‘మురుగన్’ అంటే ఇష్టం.

ఏదైనా విషయంలో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఎవరి సలహా తీసుకుంటారు?
శ్రుతిహాసన్: నా పర్సనల్, ప్రొఫెషనల్ డెసిషన్స్‌ని నేనే తీసుకుంటాను. అది తప్పయినా, సరైనా ఏ నిర్ణయమైనా అది నాదే. దేవుడు ఉన్నాడు.. చూసుకుంటాడనే నమ్మకంతో నిర్ణయాలు తీసేసుకుంటాను. ఆ దేవుడు మంచే చేస్తాడని నమ్ముతాను.

మీ తోటి కథానాయికలు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసుకుంటుంటారా?
శ్రుతిహాసన్: ఎవరెవరు ఏయే సినిమాలు చేస్తున్నారో ఆరా తీయను. అలాగే పారితోషికం తెలుసుకోవడానికి కూడా ఆసక్తి చూపను. నేను నా జర్నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను.

క్రేజ్ ఉన్నప్పుడు ‘క్యాష్’ చేసుకోవాలనే సిద్ధాంతాన్ని నమ్ముతారా?
శ్రుతిహాసన్: నమ్ముతాను. కానీ కోట్లు కోట్లు పారితోషికం తీసుకోవాలనే లక్ష్యం నాకు లేదు. స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని కూడా లేదు. ఇప్పుడు నాకు క్రేజ్ ఉంది కాబట్టి.. మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. టైమ్ బాగున్నప్పుడు హార్డ్‌వర్క్ చేయాలి. ఆ భగవంతుడి దయ వల్లే ఇంత బిజీగా ఉన్నాను. షూటింగ్స్‌కి మించిన మంచి రిలాక్సేషన్ లేదు. పనిలోనే ఆనందాన్ని వెతుక్కునే టైప్ నేను. మరో ఏడాది వరకు నాకు తెలిసి వెకేషన్ తీసుకునే టైమ్ ఉండదు. నాక్కావల్సింది అదే.

అటు సీనియర్స్ ఇటు యువహీరోలతో నటిస్తున్నారు?
శ్రుతిహాసన్: ఓ సినిమా ఒప్పుకునేటప్పుడు ఆ హీరో ఏజ్ ఎంత అని ఆలోచించను. నాకు కథ, పాత్ర నచ్చితే సినిమా చేస్తాను. మిగతా విషయాలు నాకనవసరం.

ఓకే... కొంచెం సన్నబడినట్లున్నారు?
శ్రుతిహాసన్: ‘గబ్బర్‌సింగ్’కి కొంచెం సన్నబడితే బాగుంటుందన్నారు. ఆ సినిమా కోసం బరువు తగ్గాను. ఆ తర్వాత అంగీకరించిన ‘బలుపు, రామయ్యా వస్తావయ్యా, డీ డే’ చిత్రాల్లో కూడా సన్నగానే కనిపించాలి కాబట్టి, బరువు పెరగాలనుకోలేదు.

సన్నబడటానికి ఏం చేశారు?
శ్రుతిహాసన్: సహజంగానే తగ్గాను. ఎక్సర్‌సైజ్, డైట్ పరంగా కేర్ తీసుకున్నాను. ఫిట్‌నెస్ ట్రైనర్‌ని పెట్టుకుని, వర్కవుట్లు చేయడం మొదట్నుంచీ అలవాటు లేదు. ఏ వ్యాయామం చేస్తే ఎక్కడ తగ్గుతామనే విషయంలో నాకు అవగాహన ఉంది. నాకు ప్రత్యేకంగా డైటీషియన్ లేరు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో నాకు తెలుసు.

మీ లైఫ్‌స్టయిల్ గురించి?
శ్రుతిహాసన్: చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. షూటింగ్స్‌తోనే సరిపోతుంది. ఇక ప్రత్యేకంగా లైఫ్ స్టయిల్‌కి టైమ్ ఎక్కడుంటుంది? షూటింగ్స్ చేయడం, పేకప్ చెప్పగానే ఇంటికెళ్లిపోవడం, కాసేపు ఎక్సర్‌సైజ్ చేసి, హాయిగా నిద్రపోవడం .. ప్రస్తుతం నా లైఫ్ స్టయిల్ ఇలా ఉంది.

మీ హాబీస్ ఏంటి?
శ్రుతిహాసన్: ట్రావెల్ చేయడం ఇష్టం. వంట చేయడం ఇంకా ఇష్టం. రకరకాల వంటకాలు టేస్ట్ చేయడానికి ఇష్టపడతాను. బుక్స్ చదువుతాను. నా వయసులో ఉన్న అమ్మాయికి ఎలాంటి హాబీస్ ఉంటాయో అలాంటివే.

అయితే వంట చేయడం వచ్చన్నమాట.. ఎప్పుడు నేర్చుకున్నారు?
శ్రుతిహాసన్: యూఎస్‌లో స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అక్కడ వంట చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా అలవాటయ్యింది. ఖాళీ దొరికినప్పుడల్లా కిచెన్‌లో ప్రయోగాలు చేస్తుంటాను.

ఇప్పుడు యూత్ అంతా ‘పార్టీయింగ్’ అంటున్నారు. ఈ విషయంలో మీ ఒపీనియన్?
శ్రుతిహాసన్: పార్టీయింగ్ నాకు ఇంట్రస్ట్ లేదు. నాకు ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ లేరు. అందరూ బయట ఫ్రెండ్సే. వాళ్లతో వీలైనంత సమయం గడపాలనుకుంటాను. ఇంట్లో కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం... అలా ఎంజాయ్ చేస్తాను.

పబ్‌కి వెళతారా?
శ్రుతిహాసన్: ఒక్కోసారి వెళతాను. కానీ ఇప్పుడు టైమ్ లేదు.

ఎన్ని సంవత్సరాలు యాక్ట్ చేయాలనుకుంటున్నారు?
శ్రుతిహాసన్: యాక్టింగ్, రైటింగ్, సింగింగ్.. ఇలా ఏం చేసినా సినిమాకు అనుసంధానంగానే చేస్తాను. సినిమా మినహా నాకు వేరే తెలియదు. ఈ ఫీల్డ్‌ని వదిలే ప్రసక్తే లేదు. పెళ్లి చేసుకుని, బిడ్డలకు తల్లయిన తర్వాత కూడా సినిమాలను వదలను.

ఒకవేళ మీరు పెళ్లి చేసుకునే వ్యక్తి సినిమాలు వద్దంటే?
శ్రుతిహాసన్: అలాంటి వ్యక్తిని అస్సలు పెళ్లి చేసుకోను. పెళ్లి ప్రపోజల్ అప్పుడే సినిమాలు వదలనని కండీషన్ పెడతాను. అందుకు ఇష్టపడ్డ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను.

కొంతమంది ఆడవాళ్లు వైవాహిక జీవితం కోసం కెరీర్‌ని త్యాగం చేస్తుంటారు కదా?
శ్రుతిహాసన్: ఎందుకు చేయాలి? ఇష్టపూర్వకంగా చేసేవాళ్ల గురించి నేను మాట్లాడను. కానీ ఎవరో బలవంతం చేస్తే కెరీర్‌ని వదులుకోకూడదన్నది నా అభిప్రాయం. ఇంటిని చక్కబెట్టుకుంటూ కెరీర్‌ని ప్లాన్ చేసుకోవాలి. ఆడవాళ్లు వంటింటికే పరిమితం అనే రోజులు ఎప్పుడో పోయాయి.

పెళ్లెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు?
శ్రుతిహాసన్: జీవితంలో నేనేదీ ప్లాన్ చేయను. సో.. పెళ్లి గురించి ప్లాన్ చేయడంలేదు. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదనుకుంటున్నాను. ప్రస్తుతం నా ఫోకస్ వర్క్ మీదే.

- సంభాషణ: డి.జి.భవాని

మీ తల్లిదండ్రులు విడిపోయినప్పుడు ఏమనిపించింది?
శ్రుతిహాసన్: విడిపోవడం అనేది వారి వ్యక్తిగత విషయం. నా జీవితం కాని దాని గురించి నేనేం మాట్లాడను! మా అమ్మానాన్నల ఆనందమే నా ఆనందం. అందుకని వాళ్లు ఆనందంగా తీసుకున్న నిర్ణయాన్ని నేనెలా కాదనగలను.

అమ్మానాన్నల్లో మీరు ఎవరి దగ్గర ఎక్కువ పెరిగారు?
శ్రుతిహాసన్: అమ్మ దగ్గర పెరిగాను. నాన్న దగ్గరా పెరిగాను. ఎవరి దగ్గర ఎక్కువ అంటే చెప్పలేను. ఇద్దరితోనూ చాలా ఎటాచ్డ్‌గా ఉంటాను. అయితే అమ్మతో చనువు ఎక్కువ. ఎందుకంటే ఏ ఆడపిల్లయినా తల్లి దగ్గరే కదా అన్నీ చెప్పుకోగలిగేది!

ఎప్పుడైనా ఇద్దర్నీ కలపడానికి ట్రై చేశారా?
శ్రుతిహాసన్: ట్రై చేయలేదు. ఇక ఈ విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు.

మీ నాన్నగారి జీవితంలో కీలక వ్యక్తి అయిన గౌతమిని మీరెప్పుడైనా ‘అమ్మ’గా అనుకున్నారా?
శ్రుతిహాసన్: నాకు ఒక తల్లి ఉంది. తన పేరు ‘సారిక’. నాకు ఇంకో తల్లి అవసరం లేదు. అయితే నాన్న ఆనందాన్ని మాత్రం కాదనను.

*********

బ్రాండెడ్ వేర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వను. కంటికి నచ్చిన డ్రెస్సులు బ్రాండెడ్‌వి కాకపోయినా కొనుక్కుంటాను.

స్విమ్మింగ్ మంచి వ్యాయామం. ఇండియాలో ఉన్నప్పుడు కుదరదు. అందుకని షూటింగ్స్ కోసం విదేశాలు వెళ్లినప్పుడు అక్కడ స్విమ్మింగ్‌కి టైమ్ కేటాయిస్తా.

ఫేషియల్ చేయించుకోవడం ఇష్టం ఉండదు. రాత్రి నిద్రపోయే ముందు చక్కగా మొహం కడుక్కుని, నైట్ క్రీమ్ రాసుకుంటాను. అది మినహా పెద్దగా కేర్ తీసుకోను.

గతంలో ఆల్బమ్ చేశాను. ఇప్పుడు టైమ్ దొరకడంలేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా టైమ్ దొరికితే ఓ ఆల్బమ్ చేయాలని ఉంది.

ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో నాకు ‘గబ్బర్‌సింగ్’, ‘3’ ఇష్టం.

భవిష్యత్తులో సినిమాలు నిర్మించాలని ఉంది. మరి.. ఆ భగవంతుడు ఏం ప్లాన్ చేశాడో..

చిన్నప్పట్నుంచీ నాకు కథలు రాయడం ఇష్టం. అలాగే కవితలు రాస్తుంటాను. ఏదైనా ఆలోచన రాగానే ఐఫోన్‌లో టైప్ చేసుకుంటాను.

నా డ్రీమ్ రోల్‌ని ఇంకా ఎవరూ రాయలేదు. ఆ పాత్ర ఎవరైనా రాస్తే.. అప్పుడు దాని గురించి మాట్లాడతా.
  

No comments: