పనీ పాట లేకుండా అడ్డగాడిదలా ఊరి మీద పడి
తిరుగుతున్నావ్.. అని తిడుతుంటాం కానీ, గాడిదలు పనీపాటా లేకుండా ఎప్పుడూ లేవు.
ఇప్పుడవి ఎక్కడున్నాయో పట్టుకునేందుకు జనాలే ఊరిమీద పడి తెగ గాలించేస్తున్నారు!
ఎందుకంటే గాడిద పాలు, మాంసం అన్నీ చాలా విలువైనవిగా మారిపోవడమే కారణం. వాటి
గురించే ఈ వారం.. 'పాలండీ పాలు. గాడిద పాలు. ఉబసం, నరాల వీకునెసు,
పచ్చవాతం.. అన్నిట్నీ పోగొట్టే పాలు. సర్వరోగ నివారిణి పాలు..' అంటూ విజయనగరం
వీధుల్లో అరుస్తూ వెళుతున్నాడు రజకుడు సత్యారావు. చంటి బిడ్డను ఒళ్లో పెట్టుకుని
అతని కోసమే ఎదురుచూస్తోంది జంప పద్మ. వీ«ధి గుమ్మాల దగ్గర నిల్చున్న కొత్తతరానికి ఈ
దృశ్యం అబ్బురంగా ఉంది. పిల్లలేమో 'అయ్..గాడిదలొచ్చాయ్' అంటూ గంతులేస్తున్నారు.
సత్యారావు పితికిన పాలను బిడ్డకు తాపించింది పద్మ. అదేమీ పట్టించుకోకుండా "పిల్లలు
పుట్టగానే గాడిదపాలు పట్టేస్తామండీ. ఉబసాన్ని డాటర్లే తగ్గించలేక గింజుకుంటన్నారు.
గాడిద పాలు పొయ్యమని వారే చెప్పిపంపిత్తన్నారు. మా బిడ్డకు టీ గలాసు పాలు
పట్టేసినామండీ. నా చిన్నప్పుడు మా అమ్మ నాకు తాగించింది. ఇప్పుడు నేను నా బాబుకు
పట్టిస్తున్నాను. పల్లెల్లో ఎవరికైనా అమ్మ చెప్పిందే వైద్యం కదండీ..'' అని
గుక్కతిప్పుకోకుండా చెప్పుకొచ్చింది పద్మ. అయితే ఆవు పాల లాగా, గేదె పాల లాగా
రోజుకు పదిసార్లు తాగే పాలు కావు ఇవి. జీవిత కాలంలో రెండు మూడుసార్లు తాగిస్తారంతే.
అదీ నెలల ప్రాయంలోనే. ఉబ్బసంలాంటి సమస్యలుంటే మాత్రం అప్పుడప్పుడు
తాగిస్తారు.
విజయనగరంలోని పైడితల్లి గుడి పక్కనున్న నక్కావీధిలో ఉంటాడు
కోనాడ సత్యారావు. "నాలుగు తరాల నుంచి గాడిద పాలు అమ్ముతున్నామండి. ఇవేమీ అల్లాటప్పా
పాలు కాదండి. పట్నె వెంట్నే రిజల్టు వొచ్చేత్త్తాది. గిరాకీని బట్టి రేటు ఉంటాది.
టీ గలాసుకు మూడొందలు తీసుకుంటాను. శ్రీకాకుళం, వైజాగు, రాజమండ్రి.. నుంచి కూడా
గాడిద పాలు కావాలని నా వొద్దకు వచ్చీత్తుంటారండీ..'' అన్నాడు. మళ్లీ అతనే "గాడిదను
ఊరికే చిన్నచూపు చూత్తాముకానండీ, అది మనకంటే నిష్టగలదండీ. నీచు ముట్టదు. ఆ వాసన
తగిలితే దూరం జరిగిపోద్ది. ఒక చోట కట్టేసి మేపుదామనుకుంటే కుదరదు. బంధిస్తే గాడిద
ఎప్పుడూ బతకదండీ. ఊరి మీద పడి తిరిగితేనే బతుకుతాది. చాకిరీ చేయిత్తేనే ఆరోగ్యంగా
ఉంటాది.
దాని సొబావం తెల్సుకోకుండా మనం దాన్ని అపార్థం చేసుకుని పనీపాటా
లేనోళ్లను 'అడ్డగాడిదలా ఊరి మీద పడి తిరుగుతున్నావేంట్రా' అని తిడుతుంటాం.
సోంబేర్లను తిట్టేందుకు గాడిదను వాడుకోవడం తప్పండీ. గాడిద చేసే చాకిరీ మనిషి
చేత్తాడటండీ?'' జీవిత సత్యాన్ని పిండి చేతుల్లో పెట్టినట్లు చెప్పాడు సత్యారావు.
ఆవుపాలు, గేదె పాలకంటే గాడిద పాలకే ఇప్పుడు పెద్ద డిమాండు ఉంది. అతనొక్కనికే కాదు.
గాడిద పాలను అమ్ముకునే వాళ్లందరికీ అదిప్పుడు పుష్టికరమైన ఉపాధి అయిపోయింది. లీటరు
ఆవు పాలు రూ.40, గేదె పాలు రూ.50 పలుకుతుంటే... గాడిదే కదా అనుకునే గాడిద పాలు ధర
లీటకు రూ.4 నుంచి రూ.5 వేలు!!
'గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైన
నేమి ఖరము పాలు' అన్న వేమన పద్యం మనందరికీ గుర్తుంది. ఆ పద్యాన్నే తిరగేసి
'గరిటెడైన చాలు గాడిద పాలు' అని పాడుకోవాల్సి వస్తోందంటున్నారు గాడిద పాల కోసం
వెదికే తల్లిదండ్రులు.
గాడిద చౌక రవాణా సాధనం. పల్లెల్లో బస్సులు, ఆటోలు,
బైకులు లేని కాలంలో.. అవే దిక్కు. చాకిరేవు నుంచి బట్టలు మోసేవి. అడవుల నుంచి
కట్టెలు మోసుకొచ్చేవి. కొండలు, గుట్టలు, ఎత్తయిన ప్రాంతాల్లోని నివాసాలకు సరుకులను
తీసుకెళ్లడంలో గాడిదలను మించిన వాహనాలు ఉండేవి కావు. కాలం మారింది. గాడిదలు చేసే
పనిని ఇప్పుడు ఆటోలు చేస్తున్నాయి. మోపెడ్లు చేస్తున్నాయి. ఎర్రబస్సులు ఊరూరా
వచ్చేశాయి. ప్రజారవాణా సులువైంది. దీనికి తోడు "ఇప్పుడు వాగులు వంకల్లో నీళ్లు
ఎక్కడుండాయి? ఊళ్లలో గుడ్డలు ఉతికే వాళ్లే లేరు. పల్లెల్లో చాకిరేవులు పోతున్నట్లే,
పట్నాల్లో దోభీగాట్లు కూడా మాయమైపోతున్నాయి.
అందరి ఇళ్లలో గిరగిరా తిప్పే
వాషింగ్ మిషన్లు వచ్చాయిప్పుడు. మా కులపోళ్లు బతుకుదెరువును వదిలేసి.. ఏదో ఒక పనిలో
స్థిరపడుతున్నారు. ఆ వృత్తిలో ఉన్నవాళ్లేమో.. గాడిదలను పోషించే పరిస్థితిలో లేరు.
ఎనిమిది వేలు పెడితేకాని గట్టి గాడిద దొరకడం లేదు. దాన్ని ఊరి మీదికి వదిలితే మళ్లీ
ఇంటికొస్తుందో రాదో తెలీదు. ఈ మధ్య గాడిదల్ని ఎత్తుకుపోయే గాడిద నాకొడుకులు కూడా
ఎక్కువైపోయినారు..'' అని మారిన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు కర్నూలు జిల్లా
డోన్ తాలూకాలోని బేతంచర్లకు చెందిన రజకుడు కృష్ణ.. గాడిద పాలకు గిరాకీ
పెరిగిందంటూనే "బాపనోళ్లు, కోమటోళ్లు, ఆచార్లు.. ఈ మూడు కులపోళ్లు మాత్రమే గాడిద
పాలను తాగరు. మిగిలిన అన్ని కులపోళ్లు వెతుక్కుని మరీ వాళ్ల పిల్లలకు
తాగిస్తున్నారు'' అని చెప్పాడు కృష్ణ .
రాష్ట్రంలో 49 వేలు.. గాడిదలు అంతరించి పోతున్న రాష్ట్రాల
జాబితాలో మనమెప్పుడో చేరిపోయాం. ఏ జిల్లాలో ఎన్ని గాడిదలు ఉన్నాయో 2007లో లెక్క
తీసింది పశుసంవర్ధక శాఖ. రాష్ట్రం మొత్తం మీద 49 వేలు ఉన్నట్లు తేలింది.
కోస్తాంధ్రలో 24 వేలు, రాయలసీమలో 15 వేలు, తెలంగాణలో 9 వేలు
ఉన్నాయివి.
వీటిలో ఆడ గాడిదలు ముప్పయి శాతం ఉంటాయేమో అంతే! వీటిలో మళ్లీ
పాలు ఇచ్చేవి చాలా తక్కువ. "ఒక్కో గాడిద పావు లీటరు పాలు ఇవ్వటమే గగనం. అవి కూడా
పొద్దున్నే పిండుకుంటేనే ఇస్తుంది. పాలు ఇవ్వడం దానికి ఇష్టం లేకపోతే.. వెనక
కాళ్లతో తంతుంది. అప్పుడు చేతులు కాళ్లు విరుగుతుంటాయి..'' అని చెప్పాడు తణుకుకు
చెందిన రజకుడు ఉప్పాడ భీమేశ్వరరావు.
గాడిద పాలకు ఇంత ధర పలకడానికి కారణం?
రాష్ట్రంలో ఏటా ఏడు లక్షల మంది పిల్లలు పుట్టడమే. వీరిలో సగానికి పైగా పిల్లలకు
గాడిదపాలు పట్టిస్తుంటారు వాళ్ల తల్లిదండ్రులు. అందుకే ఈ పాలు దొరకడం
అపురూపమైపోతోంది. " మాది మహబూబ్‌నగర్ జిల్లా. తాపీమేస్త్రీ పని చేస్తాను.
హైదరాబాద్‌లోని పటాన్‌చెరువులో ఉంటాము మేము. మూడ్నెల్ల కిందట మాకు పాప పుట్టింది.
ఊర్లోని మా అత్త ఫోన్ చేసి.. ఎంత కష్టమైనా సరే బిడ్డకుగాడిదపాలు పట్టించమంది.
సిటీలో రెండ్రోజులు తిరిగాను. గాడిదలు ఎక్కడా కనిపించలేదు. ఒక కిరాణాకొట్టు అతని
దగ్గర ఫోను నెంబర్ తీసుకుని.. గాడిద పాలను అమ్మే అతనికి ఫోను చేశాను.
అతను
చార్మినారుకు దగ్గర్లోని ఉప్పగూడలో ఉంటాడు. ఎనిమిది వందలు ఇస్తే తప్ప రాలేనన్నాడు.
దాంతో నేనే పొద్దున్నే అతని దగ్గరకు వెళ్లి గాడిద పాలను పిండించుకుని.. నాలుగు
వందలు చేతిలో పెట్టి వొచ్చాను..'' అని తన పాలవేట గురించి చెప్పాడు బీరపు రాజన్న.
కొన్ని ప్రాంతాలలో గరిటెడు పాలు రెండొందల నుంచి మూడొందలు తీసుకుంటున్నారు.
మరికొన్ని చోట్ల ఉచితంగా పోస్తున్నారు. హైదరాబాదులోని నీలోఫర్ ఆస్పత్రికి వచ్చిన
చామరపాడు మండలం యాదాసుపల్లికి చెందిన పెంటమ్మ కూడా తన మనవరాలికి గాడిద పాలు
పోసింది. "పిల్లలకు మొగుళ్లు (కడుపు ఎగదోయడం) వొత్తయి. ఈ పాలు పోత్తే అయి పోతయి. నా
ముగ్గురు పిలగాళ్లకు పోశాను. వాళ్ల పిల్లలకూ పోశాము'' అంది. పట్నంలో లాగే
పల్లెల్లోనూ గాడిద పాలకు ఇబ్బంది పడుతున్నట్లు ఆమె చెప్పింది.
పేదల
ఔషధం.. పిల్లలకు గాడిద
పాలు తాపితే- ఉబ్బసం దరి చేరదని, పక్షవాతం రాదని, నరాల జబ్బులు రావన్నది పల్లెవాసుల
గట్టి నమ్మకం. వీటికి ఎటువంటి శాస్త్రీయత లేదు. అలాగని మంచిది కాదనీ ఏ శాస్త్రమూ
చెప్పలేదు. "దీని మీద వైద్యరంగంలో పెద్ద పరిశోధనలేవీ జరగలేదు. గాడిద పాలలోని
గుణాలకు తల్లి పాలలోని గుణాలకు కాస్త పోలిక ఉందని చెబుతారు. గాడిద పాలలో అత్యధిక
లాక్టోజ్ ఉంటుంది. తక్కువ ప్రొటీన్లు, తక్కువ కొవ్వులు ఉంటాయి. వీటిలోని అమినో
ఆసిడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి..'' అంటున్నారు సోమాజిగూడలోని యశోద
హాస్పిటల్‌లో పనిచేస్తున్న సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ శశికిరణ్. ఆయుర్వేదంలోనూ
గాడిద పాల ప్రస్తావన ఉంది.
దాని గురించి రిటైర్డు ఆయుర్వేద వైద్యుడైన
విఠల్‌రావును అడిగితే "ఏ జంతువు పాలలో ఎలాంటి విశిష్టత ఉందనేది ఆయుర్వేదం
చర్చిస్తుంది. కాని గాడిద పాలను తాగితే కొన్ని వ్యాధులు నయం అవుతాయని మాత్రం ఎక్కడా
చెప్పలేదు. పిల్లలకు గాడిద పాలను పట్టివ్వడం అనేది కొన్ని తరాల నుంచి వస్తున్న
సంప్రదాయం. ఈ పాలలో ఉన్న కొన్ని ఎంజైములు జీర్ణప్రక్రియను శుద్ధి చేస్తాయి.
ఆరోగ్యకరమైన, శుభ్రమైన గాడిద పాలు పిల్లలకు మంచివే. తల్లి పాలకు ప్రత్యామ్నాయం
మాత్రం కాదు'' అని వివరించారాయన. 'గాడిద పాలు మనిషికి హానికరమైతే కాదు. పైగా ఆవు
పాలలో లేని కొన్ని విశిష్ట లక్షణాలు వీటిలో ఉన్నాయి' అని అమెరికన్ డైరీ సైన్సు
అసోసియేషన్ వెలువరించే డైరీ సైన్స్ జర్నల్ కూడా
పేర్కొంది.
మీట్..హాంఫట్..!మాంసం రుచి మరిగిన వారు గాడిదల్నీ
వదలడం లేదు. ఈ మాంసం తింటే శరీరానికి కండపుష్టి, ధాతుపుష్టి కలుగుతుందని
నమ్మేవాళ్లున్నారు. పక్షవాతం దరి చేరదని విశ్వసించేవాళ్లూ లేకపోలేదు. గాడిద
నెత్తురును తాగి.. కాసేపు పరిగెత్తితే కండరాల క్షీణత తగ్గుతుందనేది మరో విశ్వాసం.
"తాడేపల్లి (కృష్ణా జిల్లా)లోని ఉండవల్లి సెంటర్‌కు ఈ పని మీదే చాలామంది
వస్తుంటారు. అక్కడ గాడిదల మాంసాన్ని అమ్ముతుంటారు. ఆ నెత్తురును తాగి
పరిగెత్తుతుంటారు కొందరు. కోస్తా ప్రాంతంలోని కొన్ని కులాల్లో మాత్రమే ఈ నమ్మకం
ఉంది'' అని చెప్పారు అదే ఊరికి చెందిన రేషన్ డీలర్ కంప శివనాగేశ్వరరావు. గాడిద
పాలకు లాగా మాంసానికీ డిమాండ్ పెరగడంతో.. కిలో రూ.500 పెడితే కాని దొరకడం లేదు.
గుంటూరు, విజయవాడ, ప్రకాశం, బాపట్ల, చీరాల ప్రాంతాలలో కొన్ని వర్గాలవారికి గాడిద
మాంసం ఇష్టమైన ఆహారం.
"కర్నూలు జిల్లాలో సగం గాడిదల్ని ఇప్పటికే తినేశారు.
లారీలు, ఆటోలు తీసుకొచ్చి గాడిదల్ని ఎత్తుకుపోయే ముఠాలు పెరిగాయి. మేము పోలీసు
స్టేషన్లలో చాలా కేసులు పెట్టాం. గాడిదల్ని చిన్నచూపు చూసినట్లే ఈ కేసుల్ని కూడా
చిన్నచూపు చూస్తున్నారు పోలీసులు. రజకులకు గాడిదలే ఆధారం. అవిపోతే ఎలా బతకాలి?''
అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రజక ఐక్య సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాంబాబు. మాంసాహారుల వల్లే అయిదు వేలు ఉన్న గాడిదల రేటు.. పది వేలకు వెళ్లింది.
తెల్ల గాడిదలకైతే మరీ రేటుంది. అవి పాతిక వేలు పెడితే కాని దొరకడం లేదు. పూర్వం
మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి దిగుమతి అయ్యాయవి. సాధారణ గాడిద యాభై కిలోల
బరువు మోస్తే, తెల్లగాడిదలు వంద కిలోల బరువు మోస్తాయి. అయితే కొన్నేళ్లలో ఇవి కూడా
కనుమరుగయ్యే పరిస్థితి రాబోతోంది.
డాంకీ కాస్మొటిక్స్.. మన దగ్గర గాడిదపాలు ఎంత అపురూపమో..
విదేశాల్లోనూ అంతే. ప్రాచీన కాలంలో రాజులు, రాణులు చర్మసౌందర్యం కోసం గాడిద పాలను,
వాటితో తయారు చేసిన ఉత్పత్తులను బాగా వాడేవారు. ఇప్పుడు కూడా చాలా దేశాల్లో 'డాంకీ
కాస్మొటిక్స్' పేరుతో రకరకాల బ్రాండ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి సాధారణ
సబ్బులు, ముఖానికి రాసుకునే క్రీముల కంటే ఖరీదైనవి. ఛీజ్ విషయానికొస్తే.. గాడిద
పాలతో చేసిన ఛీజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఛీజ్.. అని ప్రకటించింది సెర్బియాకు
చెందిన ఒక సంస్థ. గాడిదల్లో అత్యంత శ్రేష్టమైన జాతి 'బాల్కన్'. ఈ జాతి గాడిద పాల
నుంచే ఛీజ్‌ను తయారు చేస్తారు. పాతిక లీటర్ల పాలు వాడితే కిలో ఛీజ్ తయారవుతుంది. ఈ
లెక్కన కిలో ఛీజ్ రూ.75 వేలు పలికినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ముందస్తు ఆర్డరు
ఇచ్చిన వాళ్లకే బాల్కన్ డాంకీ ఛీజ్ అందుతుంది.
గాడిద పాలు, ఛీజ్, మాంసం
ఉత్పత్తులకు గిరాకీ పెరిగేకొద్దీ.. కోళ్లఫారాలు, పందులఫారాలు ఉన్నట్లే గాడిదలకు
కొన్నిచోట్ల ఫాంహౌస్‌లు వెలిశాయి. ఫ్రాన్స్‌లో గాడిదల్ని విక్రయించడమే కాకుండా..
వాటి పాలను సన్నటి సీసాల్లో పోసి.. పట్నాలకు పంపిస్తోంది. 'ద డాంకీ కంపెనీ' అనే మరో
సంస్థ గుబాళించే సబ్బుల్ని, క్రీముల్ని తయారు చేస్తోంది.
గాడిదలకు ఎంత
ప్రాముఖ్యముందో అర్థమయ్యింది కదా! అందుకే ఇక నుంచి ఎవరినీ 'అడ్డ గాడిద.. ఊర గాడిద'
అని తిట్టిపోయకండి. గాడిదలకూ ఒక రోజు వచ్చింది మరి!!
"దీని మీద వైద్యరంగంలో పెద్ద పరిశోధనలేవీ
జరగలేదు. గాడిద పాలలోని గుణాలకు తల్లి పాలలోని గుణాలకు కాస్త పోలిక ఉందని చెబుతారు.
గాడిద పాలలో అత్యధిక లాక్టోజ్ ఉంటుంది. తక్కువ ప్రొటీన్లు, తక్కువ కొవ్వులు ఉంటాయి.
వీటిలోని అమినో ఆసిడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి..''
- డాక్టర్ శశికిరణ్,
సీనియర్ ఫిజీషియన్,యశోద హాస్పిటల్.వీర్యాన్ని
భద్రపరచండి..
జీవవైవిధ్యంలో గాడిదలూ ముఖ్యమైనవే. ఒకప్పుడు పులులు, చిరుతలు గాడిదల్ని తిని
బతికేవి. ఇప్పుడవి దొరక్కపోవడంతో అవి ఊళ్ల మీద పడాల్సి వస్తోంది. గాడిద పాలలో మంచి
ఔషధ గుణాలు ఉండటమే కాదు. అవి చక్కటి రవాణా సాధనాలు కూడా. మన రాష్ట్రంలో పరిస్థితి
మరీ అన్యాయంగా ఉంది. గాడిదలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యన
హైదరాబాద్‌లో జరిగిన జీవవైవిధ్య సదస్సులో 'అగ్రికల్చర్ బయో డైవర్సిటీ' అనే అంశం
కింద గాడిదల గురించి చర్చ జరిగింది. ఇందులో ప్రస్తావించిన విషయాలను 'నేషనల్ బ్యూరో
ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్'కు నివేదించాము. ఈ సంస్థ జంతువుల వీర్యాన్ని
భద్రపరుస్తుంది. గాడిదల వీర్యాన్ని కూడా దాస్తే, భవిష్యత్తులో వీటి ఉనికికి ప్రమాదం
వాటిల్లదని మేము ఆ సంస్థకు చెప్పాము. గాడిదలు, గుర్రాల ప్రాముఖ్యతను మరింత
వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ తిరుపతిలోని 'వెటర్నరీ యూనివర్శిటీ'కి ఒక ఉత్తరం
రాయబోతున్నాము.
- డాక్టర్ హంపయ్య, జీవవైవిధ్యమండలిగాడిదలకో
సేవా సంస్థ : ఎస్ఆర్ఇడి
"ఆ పని మీదే పోతాండ. గాడిదలకు షెల్టర్లను కట్టిచ్చినాము. అవి ఎట్ల పనిచేస్తాండాయో
తెలుసుకునేదానికి పోతాండ. అంతలోనే మీరు కరెక్టుగా ఫోన్ జేస్తిరి..'' అంటున్న
దామోదర్‌రెడ్డి 'సొసైటీ ఫర్ రూరల్ ఎకో డెవలప్‌మెంట్' (ఎస్ఆర్ఇడి) అనే స్వచ్ఛంద
సంస్థకు ప్రాజెక్ట్ డైరెక్టర్. పల్లెల్లో తిరిగి తిరిగి గ్రామీణ మాండలికం బాగా
అబ్బినట్లుంది. రాష్ట్రంలో గాడిదల కోసం పనిచేస్తున్న సంస్థ ఇదొక్కటే. ఈ సంస్థ
పెట్టడానికి మునుపు ప్రముఖ సినీనటి అమల కర్నూలులో గాడిదలకు వైద్యచికిత్స
అందించేవారు. ఇప్పుడు ఆ బాధ్యతల్ని ఎస్ఆర్ఇడికి అప్పగించింది ఆమె. "గాడిదలు,
గుర్రాల కోసం పనిచేస్తున్నానని చెబితే.. నా బంధువులు, స్నేహితులు నవ్వుతాంటారు.
వాళ్లకే కాదు, గాడిదలంటే చానామందికి చిన్నచూపు'' అన్నాడాయన నవ్వుతూ.
"మా
సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాను
ఎంచుకున్నారు. ఈడ ఉన్నన్ని గాడిదలు యాడా లేవు. మేము ఊరూరా తిరిగి వివరాలు
సేకరించినాము. కర్నూలు చుట్టుపక్కల నల్లమల అటవీప్రాంతం ఎక్కువ. గిరిజనులు కట్టెలు
కొట్టుకుని బతుకుతాంటారు. వారికి చౌక రవాణా సాధనం గాడిదలే. బరువు బాగా మోస్తాయవి.
అదే పనిగా మేపాల్సిన పనిలేదు. ఆడా ఈడా తిని బతుకుతాంటాయి. కొండల మీదున్న గుడులకు
కూడా గాడిదల మీదనే సరుకుల్ని మోసుకెళతారు. అడవుల్లో నాటుసారా కాసేందుకు కూడా గాడిదల
మీదే సరంజామాను తీసుకెళతారు.రజకులకైతే గాడిదలు లేకపోతే పని జరగదు. కర్నూలు,
నంద్యాల, బనగానపల్లిలలో ఎక్కువ ఉండాయివి..'' అన్నారు.
గాడిదలకు అత్యవసర
వైద్య చికిత్స చేసేందుకు ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది ఈ సంస్థ. మెడికల్
ల్యాబ్ కూడా ఉంది. పశుసంవర్థక శాఖకు చెందిన గోపాలమిత్రలకు, లోకల్ హెల్త్
ప్రొవైడర్స్‌కు శిక్షణ ఇస్తుండటం వల్ల గాడిదలను కొంతవరకైనా కాపాడగలుగుతున్నారు
వాళ్లు. "వైద్యం ఒక్కటే కాదు. దొంగలబారి నుంచి కూడా గాడిదల్ని రక్షిస్తున్నాం.
కర్నూలు జిల్లాలోనే ఎనిమిది 'కమ్యూనిటీ షెల్టర్లు'ను ఏర్పాటు చేసినాము. ఇదొక కొత్త
ప్రయోగం. అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది..'' అన్నారు
దామోదర్‌రెడ్డి.
చరిత్రలో ఖరము ఎట్టిదనిన...నిత్యయవ్వనం కోసం
ఈజిప్టు రాణి క్లియోపాత్ర గాడిద పాలతో స్నానమాడేదనేది జగత్ప్రసిద్ధం. దాని కోసమే
రాణిగారి కోటలో ఎప్పుడూ ఏడొందల గాడిదలు ఉండేవట.
రోమన్ రాజు నీరో రెండో భార్య
పోపియా సబీనాకు చర్మ సౌందర్యం మీద మహా ప్రీతి. స్నానవాటికకు వెళ్లిందంటే గాడిద పాలు
ఉండాల్సిందే! కోట నుండి రాణిగారు బయటికి వెళ్లినప్పుడల్లా.. ఆమె వెనక ఒక గాడిదల మంద
బయలుదేరేది.
నెపోలియన్ చెల్లెలు నిగనిగలాడే చర్మం కోసం ఆయుర్వేద వైద్య
చిట్కాలన్నీ వాడేది. అందులో భాగంగానే గాడిదపాలను కాస్మొటిక్స్‌గా
ఉపయోగించేదట.
వైద్య పితామహుడైన హిప్పోక్రటిస్ కొన్ని వ్యాధులకు మందుల
స్థానంలో గాడిద పాలను వాడమని సూచించేవారట. నరాల బలహీనత, కాలేయం జబ్బులు, జ్వరం,
ఎడీమా, ముక్కు నుంచి రక్తస్రావం, శరీరం మీది గాయాలు నయమవుతాయని
విశ్వసించేవారు.
ప్రాచీన రోమన్ రచయిత, నాచురలిస్ట్ అయిన ప్లిని ద ఎల్డర్
రాసిన 'నాచురల్ హిస్టరీ' లో గాడిద పాల ప్రస్తావన ఉంది. విషం మీద పోరాడే గుణం గాడిద
పాలకు ఎక్కువని, జ్వరం, కంటి జబ్బులు, ఆస్త్మా, స్త్రీ సంబంధ వ్యాధులకు కూడా ఔషధంగా
పనికొస్తుందని ఆయన చెప్పారు. వయసుతోపాటు ముఖం మీద వచ్చే ముడుతల్ని నిలువరించే
స్వభావమూ ఈ పాలకు ఉందన్నారు.