all

Thursday, January 24, 2013

వసంతపంచమి

 
(జనవరి 28న)
సకల విద్యాస్వరూపిణి, సమస్త వాఙ్మయానికీ మూలకారకురాలు, భాష, లిపి, కళలకు అధిదేవత సరస్వతీమాత. పలుకు తేనెల బంగరు తల్లి, వేదాలకు జనయిత్రి, వీణాపుస్తకధారిణి అయిన ఆ తల్లి దయ ఉంటే వెర్రిబాగులవాడు వేదవేదాంగవేత్త అవుతాడు, పరమ మూర్ఖుడు కూడా మహావిద్వాంసుడుగా మారిపోతాడు. అందుకు మహాకవి కాళిదాసే మంచి ఉదాహరణ. ఆమెను తృణీకరిస్తే మహాపండితుడు కూడా వివేకం కోల్పోయి మతిహీనుడై సర్వం పోగొట్టుకుంటాడు. అభ్యసించే విద్య, చేసే వృత్తి, చేపట్టిన పని... ఇలా ప్రతిదానిలోనూ ప్రావీణ్యం సంపాదించాలంటే కృషి, పట్టుదలతోపాటు సరస్వతీదేవి అనుగ్రహమూ అవసరం. అందుకే ఆ చల్లని తల్లి కరుణ కోసం తహతహలాడనివారుండరు.

ఆమె ప్రాదుర్భవించిన పరమ పవిత్రమైన మాఘపంచమి పర్వదినాన ఆమెను పుస్తకాది రూపాలలో, విగ్రహంలో ఆవాహన చేసి అర్చన, పూజ, వ్రతోత్సవాలు చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. సరస్వతీ దేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెకు తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రాలతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వుల ఉండలు, చెరకురసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపండు వంటి వాటిని నివేదిస్తే ప్రసన్నురాలవుతుందని శాస్త్రోక్తి.

సరస్వతి అంటే కేవలం చదువు మాత్రమే కాదు. సంస్కారం, విచక్షణాజ్ఞానం, వినయం, వివేకం, లోకజ్ఞానం, వృత్తి నైపుణ్యం కూడా సరస్వతే! చదువులు నేర్పే గురువులందరూ ఆ తల్లికి ప్రతిరూపాలే! కాబట్టి శారదాదేవి జన్మదినాన ఆమెను పూజించడంతో పాటు వేదపండితులు, గురువులు, విద్యావంతులు, వృత్తి నిపుణులు, సంగీత, నృత్య కళాకారులు... మనకు విద్య గరిపిన గురువుని, వివేకజ్ఞానాన్ని ఇచ్చినవారిని మనకు చేతనైనంతలో సత్కరించడం, చేతకాకపోతే చేతులెత్తి నమస్కరించడం సంస్కారం.

లోలా మాంటెజ్ లౌల్య లావణ్యం

 
రాలిన మొగ్గలు
ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకోగల దిట్ట ఆమె. జీవితమంతా అన్వేషణ యాత్రే ఆమెకు. ప్రతి మజిలీలోనూ దుస్సాహస సంబంధమే. అది ఆమెకు ఉన్నతి. అవతలి పురుషుడికి కైవల్య ప్రాప్తి. బతికినన్నాళ్లూ మోహ దాహాలతో కీర్తి, కాసుల వెంట పరిగెత్తి, అలసి సొలసి, చివరకు సన్యాసం తీసుకుందామె. లౌల్యానికి మారుపేరైన ఆమె పేరు... లోలా మాంటెజ్. అందరికీ తెలిసిన పేరు కాదది. కానీ అందరూ తెలుసుకోవాల్సిన కథ ఆమెది.

లోలా పుట్టింది 1821 ఫిబ్రవరి 17న ఐర్లాండ్‌లో. అసలు పేరు ఎలీజా రోసన్నా గిల్బర్ట్. తల్లి ఎలిజబెత్ ఆలివర్. తండ్రి ఎన్‌సైన్ ఎడ్వర్డ్ బ్రిటిష్ సైన్యంలో లెఫ్ట్‌నెంట్. లోలా పుట్టిన రెండేళ్లకు సైనిక విధులరీత్యా ఆ కుటుంబం భారతదేశానికి వచ్చింది. కానీ కొన్ని రోజులకే ఎడ్వర్డ్ మరణించాడు - కలరాతో. అప్పటికి లోలాకి మూడేళ్లే. తల్లి ఎలిజబెత్ ఏడాది తిరక్కుండానే మరో లెఫ్ట్‌నెంట్ పాట్రిక్ క్రైజ్‌ని పెళ్లి చేసుకుంది.

వీరిద్దరూ లోలాను బాగానే చూసు కునేవారు. అయినా లోలా కొత్త నాన్నతో ఇమడలేకపోయింది. చిన్నపిల్లే అయినా ఎందుకో కొత్తగా ఏర్పడిన ఇంటి వాతా వరణం వింతగా అనిపించింది. క్రమంగా అల్లరిపిల్లయింది. అది ముద్దుగా ఉండే, భరించే చిలిపితనం కాదు. మొండిగా మొరటుగా ఉండే పెంకితనం. అడిగిందల్లా ఇవ్వాల్సిందే. అందరినీ కొట్టడమే. రోజూ గొడవలే.

గాలి మార్పు కోసం కలకత్తాకి కూతుర్ని తీసుకొచ్చింది ఎలిజబెత్. ఫలితం లేదు. ఇక లాభం లేదని ఏడేళ్ల లోలాను ఇంగ్లండ్‌లోని సుందర్ లాండ్‌కి పంపించే సింది. అక్కడి స్కూల్లో చేర్పించింది. భరించలేనంత క్రమశిక్షణ. తట్టుకోలేక పోయింది లోలా. ఆమెలో మరింత తిరుగుబాటు తత్త్వం పొడసూపింది. వయసు పెరిగేకొద్దీ తెంపరితనం మరీ ఎక్కువైంది. జైలులాంటి స్కూల్లోంచి పారిపోవా లనుకుంది. థామస్ జేమ్స్ అనే సైనికుడికి సన్నిహితమైంది. 16 యేళ్ల ప్రాయం. అగ్ని కీలల వాంఛలతో దేహం. జేమ్స్‌తో పారి పోయి భారత్ వచ్చింది. రహస్యంగా పెళ్లయ్యింది. కలకత్తాలో కొత్త కాపురం.

తెలిసీ తెలియని వయసులో, చిన్నప్పటినుంచీ ప్రేమంటే ఏమిటో తెలీని మనసుతో ఆమె ఎన్ని కలలు కన్నదో. మొగుడంటే స్వర్గద్వారపు ముత్యాల వాకిలిలోంచి లోలోపలకు మోసుకెళ్లి, తాదాత్మ్యతామృతంలో ముంచెత్తే మొన గాడని ఊహించుకుంది. తన దేహాన్ని, మనసుని, హృదయాన్ని, ఆత్మని ఏక కాలంలో బంధించి ఉంచగల మంత్ర గాడని అనుకుంది.

కొన్నాళ్లకే అది భ్రమ అని తేలిపోయింది. పూలరేకుని ముద్దాడి నంత మృదువుగా, గువ్వ పిల్లని పొదివి పుచ్చుకున్నంత లలితంగా, తేనె ధారని ఆస్వాదించినంత మార్దవంగా స్త్రీని చూసుకోవడం ఈ పురుషుడికెన్నటికీ రాదని ఆమెకు అర్థమైపోయింది. తాగొచ్చి కొట్టే జేమ్స్ భర్త కాడని నిర్ధారించుకుంది. అసలు మగాళ్ల లోకం పైనే తిరుగుబాటు బావుటా ఎగరేయా లనుకుంది. 1843లో భర్తను వదిలి భారత్ నుంచి ఇంగ్లండ్ వెళ్లిపోయింది లోలా.

తనకెవ్వరూ లేరు. సాదాసీదాగా బతక్కూడదు. కరెన్సీ కట్టల మధ్య ఈదాలి. చుట్టూ పరివార జనం ఉండాలి. సెలబ్రిటీ అవ్వాలి. వేలల్లో లక్షల్లో అభిమాన సందోహం సాగాలి. అదీ ఆమె కోరిక. లండన్‌లోని స్థానిక డ్యాన్సు కంపెనీల్లో చేరింది. నాట్యం రాదు. నటన అంత కన్నా రాదు. అయినా వచ్చని అబద్ధ మాడింది. ఆడక తప్పదు. ప్రతిభ ఉన్నవాడు పని చేసుకుంటూ ఉంటాడు. మరి లేనివాడు? హడావిడి చేస్తాడు. ఆమె అదే చేసింది.

మగాళ్లతో చనువుగా ఉండేది. మిగిలిన వారితో కలిసిపోయేది. అలా ఆ కంపెనీల్లో కీలక పాత్రలు పొందే నటి అయ్యింది. అలా ఓసారి 1848లో లోలాకు బంగారం లాంటి అవకాశం వచ్చింది. షేక్‌స్పియర్ ‘మాక్‌బెత్’ నాటక ప్రదర్శనలో. అదీ ఆనాటి నటుడు చార్లెస్ జాన్ కీన్‌తో కలిసి నటించే రోజు. అందునా సాక్షాత్తూ విక్టోరియా మహారాణి సమక్షంలో! లోలా జాతకాన్ని మార్చేసే సంఘటన అది. అవును మార్చేసింది... ఎటొచ్చీ పాతాళానికి!

త్రిపురనేని గోపీచంద్ రచించిన ‘మెరుపుల మరకలు’ నవలలోని ఉషారాణి పాత్రతో పోల్చవచ్చు లోలా మాంటెజ్‌ని. ఉచ్చ నీచ అంతస్థుల్ని, ఉత్తిష్టము పతితము అనే మెట్లను, పాకుడు రాళ్లను ఎక్కుతూ దిగుతూ పడిపోతూ సాగిన లోలా... ఎవరో తెలియక్కర్లేదు. ఏం చెబుతోందో అర్థం చేసుకుంటే చాలు.

ఆ రోజు ప్రదర్శన ప్రారంభానికి అన్ని ఏర్పాట్లూ అయ్యాయి. వేలల్లో జనం. అందరూ సంపన్నులే. మహారాణికై ఎదురుచూపులు. హాలులో దీపాలకాంతి కాస్త తగ్గుతూండగా దేదీప్యమానంగా ధవళ కాంతులతో వజ్రాల తాపడం పెట్టిన దుస్తులతో మెరిసిపోతూ మహారాణి నడుచుకుంటూ వచ్చింది. సింహాసనంపై కూచుంది. ఇక ప్రదర్శన ప్రారంభమవ డమే తరువాయి.

అంతలో రంగస్థలం నుంచి తెరను తొలగించుకుంటూ ఓ అందాల భామ. సొగసైన నడకతో వయ్యారంగా వజ్రాల్లాంటి జిగేల్ జిగేల్‌మనే దుస్తులతో, కట్టలు ఒరుసుకుని విరిగిపడుతున్న సముద్రం లాంటి సౌందర్యంతో మహారాణి వైపు నడుస్తూ వచ్చింది. నువ్వా నేనా అన్నట్టుగా! ఆమె ఎవరో కాదు... లోలా మాంటెజ్. అలా చేస్తే... ఒక్క దెబ్బతో రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోవచ్చని ఆశపడింది. కాని రాణికి చిర్రెత్తుకొచ్చింది. ప్రదర్శన రద్దయింది. లోలా జాతకం సెకన్లలో మారిపోయింది. ఆ దెబ్బతో ప్యారిస్‌కి పారిపోవాల్సి వచ్చింది.

ఇప్పుడు ప్యారిస్‌లో తన ప్రతాపం చూపాలి. ఎలా? ఆలోచించింది లోలా. స్థానికంగా బాగా సంపద, పలుకుబడి కలిగిన వ్యక్తి ఎవరాని ఆరా తీసింది. అలెగ్జాండర్ డుజారియర్ అనే మీడియా అధినేత అని తెలిసింది. అతణ్ని కలవడం ఎలా? అతని అలవాట్లేమిటో రహస్యంగా తెలుసుకుంది. రోజూ ఉదయం అలెగ్జాండర్ ప్యారిస్‌కు దూరంగా మైదానాల్లో గుర్రపు స్వారీ చేస్తాడు.

లోలా వెంటనే గుర్రపు స్వారీ నేర్చు కుంది. ఆ మైదానాలకు పయనమైంది. అతని దృష్టిని ఆకర్షించేలా బిగుతైన దుస్తుల్లో భయంగా స్వారీ చేస్తున్నట్లు నటిస్తూ అతని చూపుల్లో పడింది. అంతే! ఆ క్షణం నుంచి అలెగ్జాండర్ ఉన్మత్తు డయ్యాడు. ఆమె గుర్రంపై నుంచి పడింది. అతను ఆమె ప్రేమలో పడ్డాడు. ఒకే ఒక్క బలహీన క్షణంలో ఆమెకు వశుడై పోయాడు, పరవశుడై పోయాడు.

ఆమె సకల భోగాలూ అనుభ వించింది. ఎన్నాళ్ల నుంచో కన్న కలల్ని, కోరికల్ని తీర్చుకుంది. ఇంతకన్నా సుఖం లేదు అన్నంతగా వారిద్దరూ తిరిగారు, ఆమెకు బానిసైపోయాడు అలెగ్జాండర్. ఎంతటి పిచ్చి అంటే... లోలాను ఎవరైనా పల్లెత్తు మాటంటే చంపేసేంత! బెవాలెన్ అనే స్నేహితుడు లోలాను ఓ మాట అన్నాడని, అలెగ్జాండర్ అతనిపై తగాదాకి దిగాడు. బెవాలెన్ తుపాకీ పేల్చడంలో సాటి లేని షూటర్. అంతే! అలెగ్జాండర్ డుజారియర్‌ని కాల్చి పారేశాడు పిట్టలా!
లోలా లౌల్యంలో అలెగ్జాండర్ ప్రాణం కోల్పోయాడు. అండగా ఉన్న ప్రియుడి మరణంతో లోలా రోడ్డున పడింది. ప్యారిస్‌నే వదిలి వెళ్లిపోయింది.

కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈసారి లోలా జర్మనీలోని మ్యూనిచ్‌కి వెళ్లింది. అక్కడి బవారియా రాజు లుడ్విన్‌పై కన్నే సింది. చక్రవర్తికి సన్నిహితమవ్వాలంటే ఆషామాషీ విషయం కాదు. మహారాజుకి సన్నిహితుడైన రిచ్‌బర్గ్‌ని కలవాలనుకుంది. ఓ రోజు అతను ఓ హోటల్లో అల్పాహారం సేవిస్తుండగా అటుగా గుర్రంపై వెళ్తూ కావాలని కిందపడింది లోలా. పరిగెత్తు కొచ్చి కాపాడాడు రిచ్‌బర్గ్. లోలాను స్పృశించిన తొలి క్షణంలోనే అతడి దేహ కణాలు ప్రజ్వరిల్లాయి. అలా జరుగు తుందని ముందే తెలుసామెకు. చక్రవర్తిని లోలాకు పరిచయం చేస్తానని రిచ్‌బర్గ్ వాగ్దానం చేసేలా కులుకులొలక బోసింది.

చక్రవర్తి సమక్షంలో లోలా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు రిచ్‌బర్గ్. నిజానికి ఆమెకు డ్యాన్స్ రాదు. కళతో అయితే రాజుని కట్టి పడేయలేదు. వేరే కళలేవైనా పనికొస్తా యేమో ఆరా తీసింది. అంతా అర్థమైంది. ప్రదర్శన ప్రారంభమైంది. రాజు ఇంకో క్షణంలోనో, అరక్షణంలోనో రావాల్సి ఉంది.
రంగస్థలం మీద నుంచి పరిగెత్తు కుంటూ వచ్చేసింది లోలా. నేరుగా రాజ భవంతిలోకి వెళ్లింది... భటులను తోసు కుంటూ! ఆ తోపులాటలో ఆమె ఒంటి పైవస్త్రం చిరిగిపోయింది. కాదు... ఆమె చింపేసుకుంది. అర్ధనగ్నంగా దూసు కుంటూ వెళ్లి వెళ్లి రాజు లుడ్విగ్‌పై పడింది. రాజుని జీవితాంతం కట్టిపడేసే, పాద దాసుడిగా మార్చేసే భంగిమగా అతని దేహంపై వాలింది.

లుడ్విగ్ చిత్తుగా ఓడిపోయాడు - ఆమె ఒడిలో!
ఆమెను లాన్స్‌ఫీల్డ్ ప్రాంతానికి యువరాణిని చేశాడు. పగలంతా ఆమె పక్కన ఉండాలి - రాజుకి - ఎక్కడికెళ్లినా! ఆమె రాజ్య నిర్వహణ వ్యవహారాల్లో తలదూర్చింది. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తలెత్తింది. ఇక లాభం లేదని 1848 ఫిబ్రవరిలో లోలాను తక్షణమే దేశం విడిచి వెళ్లమన్నాడు. అపార ధనరాశితో ఆమె తిరిగి ఇంగ్లండ్ వెళ్లింది.

లండన్‌లో తన కన్నా పదేళ్ల చిన్న వాడు అయిన జార్జి ట్రాఫెల్డ్ హీల్డ్ అనే సైనికుడితో సహజీవనం చేసింది. పైగా 1849లో అతణ్ని పెళ్లి చేసుకుంది. కాని అప్పటికామె మొదటి భర్త జేమ్స్‌కు విడాకులివ్వలేదు. దాంతో అప్పటి బ్రిటిష్ చట్టాల మేరకు ద్వంద్వ వివాహం నేరం. అరెస్టు నుంచి తప్పించుకుని ఇద్దరూ స్పెయిన్‌కి పారిపోయారు.

కొన్నాళ్ల కాపురం తర్వాత విడిపో యారు. ఆమె బానే ఉంది. ఆ కుర్ర సైనికుడికి మాత్రం ఉద్యోగం పోయింది. తినడానికి తిండి లేదు. పిచ్చెక్కిపోయాడు. లోలా అతణ్ని వదిలేసి, అమెరికా పారిపోయింది. కాలిఫోర్నియాలో పాట్ హల్ అనే జర్నలిస్టుని పెళ్లి చేసుకుంది. ఎప్పటిలాగే... మూణ్నాళ్ల ముచ్చటైంది.

1859. లోలాకు 39 యేళ్ల వయసొ చ్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే స్వేచ్ఛా ప్రవృత్తి, లైంగిక ప్రవృత్తి, వెంపర్లాట, తోపులాట. ఇంతేనా! తనపై తనకే అసహ్యమేసింది. చేతిలోని డబ్బులన్నీ అయిపోయాయి. తిందామంటే ఏమీ లేదు. పస్తులతో పది రోజులుంది. తత్త్వం బోధపడింది. ఇక పరుగు చాలు అను కుంది. మొదట బోధకురాలైంది. ఆపై సన్యాసిని అయ్యింది.

తన అనుభవసారాన్ని జీవిత సత్యాలుగా చెప్పాలనుకుంది. దీపం బాగుంటుంది. కాని ప్రేమించి అందులోకి దూకితే బూడిదైపోతాం. భోగత్వమంతా పిడికిలి లాంటిది. మూసి ఉన్నంతవరకూ ఏదో ఉందనిపిస్తుంది. తీరా తెరిచాక అంతా తెలిశాక, అనుభవించాక, శూన్యమని అర్థమవుతుంది. ఈ జీవిత సత్యం బోధించేందుకు లోలా పయనమైంది. కానీ ఏడాది కాకుండానే 1861 జనవరి 17న 39 యేళ్ల వయసులో గుండెపోటుతో మరణించింది. అయితేనేం... ఆమె కథ చాలా విషయాలు చెబుతోంది.

- ఆకెళ్ల రాఘవేంద్ర

అక్బర్ - బీర్బల్ కథ

 
బీర్బల్ తెలివి
బీర్బల్ చాలా తెలివైనవాడు. అతడిని ఎలాగైనా దెబ్బ తీయాలని అక్బర్ చక్రవర్తి ప్రయత్నించేవాడు కానీ కుదిరేది కాదు. దాంతో ఓసారి ఓ అమోఘమైన ప్రణాళిక రచించాడు.

బీర్బల్‌ని పిలిచి... ‘‘బీర్బల్... నేను నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను. దాన్ని నువ్వు తింటావా?’’ అని అడిగాడు.

‘‘తింటాను ప్రభూ’’ అన్నాడు బీర్బల్ వినయంగా.
‘‘ముందే ఆలోచించుకో. తర్వాత తిననంటే కుదరదు’’... అన్నాడు అక్బర్ నవ్వునాపుకుంటూ.

‘‘మీ చేతితో విషమిచ్చినా తింటాను ప్రభూ’’... అంతే వినయంగా అన్నాడు బీర్బల్.
వెంటనే అక్బర్ ఓ కోడిని తెప్పించాడు. దాన్ని బీర్బల్ చేతిలో పెట్టి... ‘‘ఇప్పుడు చెప్పు. దీన్ని తింటావా, నువ్వు శాఖాహారివి కదా’’ అన్నాడు నవ్వుతూ, తన గెలుపు ఖాయమన్న నమ్మకంతో.

బీర్బల్ మెల్లగా నవ్వి అన్నాడు. ‘‘మీరు దాన్ని తినాలి అన్నారే కానీ ఎలా తినాలో చెప్పలేదు. కాబట్టి నేను ఈ కోడిని అమ్మి, ఆ వచ్చినదాంతో ఏదైనా కొనుక్కుని తింటాను’’ అన్నాడు తెలివిగా.

ఢంగైపోయాడు అక్బర్. తర్వాత నవ్వేశాడు. తాను మరోసారి ఓడిపోయానని ఒప్పుకుంటూ బీర్బల్‌కి కానుకలిచ్చి సత్కరించి పంపాడు.

పరదేశీ... పరదేశీ... జానా నహీ హమే ఛోడ్‌కే...

 
అజ్ఞాతవాసం
ఒక హిట్ సినిమాకు సంబంధించి ప్రేక్షకుల జ్ఞాపకాలు ఎవరి ఆలోచనను బట్టి వారికి ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలని కొందరు, రొమాంటిక్ దృశ్యాల్ని కొందరు... ఇలా ఎవరి ఆలోచనను బట్టి వారు మెచ్చుకుంటూ సదరు సినిమాను నెమరేసుకుంటారు. అలాగే... ఆమిర్‌ఖాన్ నటించిన ఓ హిట్ సినిమాను గుర్తు తెచ్చుకునేటప్పుడు కొందరు తప్పనిసరిగా ఆ పాటని స్మరించుకుంటారు. ఆ పాటలో నర్తించిన అందాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. తనని వదిలి వెళ్లొద్దంటూ ఓ సూపర్ హిట్‌సాంగ్ ద్వారా హీరోని వేడుకున్న ఆ అందం ఎందుకనో అకస్మాత్తుగా ప్రేక్షకుల్ని, సినీ పరిశ్రమనీ కంబైన్డ్‌గా వదిలేసి తెరమరుగైంది. ఒకనాటి సూపర్ హీరోయిన్ వారసురాలిగా వచ్చినా... ప్రేక్షకులు తనను ఆదరించి మెచ్చినా... ఎందుకలా చేసింది? ప్రస్తుతం ఏ రంగంలో తన ‘ప్రతిభ’ను ప్రదర్శిస్తోంది?

మాలాసిన్హా కేవలం భారతదేశపు దర్శక, నిర్మాతలు, ప్రేక్షకులకే కాదు, నేపాలీయులకు కూడా ఆరాధ్య నటి. 1950-1970 ప్రాంతంలో కుర్రకారు కలలరాణిగా కల్పవృక్షంగా అవతరించిన అందాల అభినేత్రి. అంతటి నటికి వారసురాలిగా సినీరంగ ప్రవేశం చేయడం సులభం మాత్రమే కాదు, సాహసం కూడా. అలాంటి సాహసికురాలు ప్రతిభాసిన్హా. తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్న ఈ సుందరి 1992లో చాలా తేలిగ్గా హీరోయినైపోయింది. కల్‌కీ ఆవాజ్, మెహబూబ్ మేరీ మెహబూబ్, దిల్ హై బేతాబ్... ఇలా పలు హిందీ సినిమాల్లో నటించింది. అయితే ఏ సినిమా కూడా ఆమెకు చెప్పుకోదగ్గ విజయాన్ని అందివ్వలేదు.

హీరోయిన్‌గా సరైన బ్రేక్ రాక అవస్థలు పడుతున్న ఆమెను ‘రాజా హిందూస్థానీ’ కరుణించాడు. ఆ సినిమాలో ‘పరదేశీ పరదేశీ’ అంటూ సాగే పాటని అతిధి నర్తకిగా అద్భుతంగా రక్తికట్టించింది. ఆ నృత్య ‘ప్రతిభ’తో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ ఊపులో కేవలం ఒకటిన్నరేళ్ల వ్యవధిలోనే ఏక్‌థా రాజా, గుడ్ గుడీ, కోయీ కిసీసే కమ్‌నహీ, దీవానా మస్తానా సినిమాల్లో నటించింది. జంజీర్, మిలటరీ రాజ్‌ల వరకూ ఆ ఊపు కొనసాగినా, వీటిలో ఏవీ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మళ్లీ కెరీర్ మసక బారింది. మధ్యలో ‘పోకిరి రాజా’తో మన తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరించి, దక్షిణాదిలోనూ మెరుద్దామని విఫల యత్నం చేసింది. 1998 తర్వాత ‘లే చల్ అప్నే సంగ్’లో తప్ప మరే సినిమాలోనూ ఆమె కనిపించలేదు. దాదాపు 15 యేళ్లుగా ఆమె సినీసీమ వైపు చూపు తిప్పలేదు. చూడ చక్కని రూపానికి, కనువిందైన నృత్యానికి కేరాఫ్‌లాంటి ఈ నాట్య బ్యూటీ ఇప్పుడెక్కడుంది? ఎందుకు వెండితెరకు దూరమైంది?

దోషం నాది కాదు పరిశ్రమదే...
ఈ మాట అనేయగలరు ప్రతిభాసిన్హా. అనే శారు కూడా. సినిమా పరిశ్రమకు మీరెందుకు దూరంగా ఉన్నారనే ప్రశ్నకు ఆమె నుంచి వచ్చిన సమాధానం ఇది. ‘దోషం నాది కాదు పరిశ్రమది. ఆ మాటకి వస్తే ప్రేక్షకులది కూడా’ అన్నారామె. ప్రస్తుతం 43 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని అందంతో మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ, ముంబైలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. ‘‘ఇప్పుడు వస్తున్న హిందీ సినిమాలు చూడడం అంటే ఒక శిక్ష’’ అని స్పష్టం చేస్తున్నారు. అలా పరోక్షంగా తానెందుకు సినిమా పరిశ్రమకు దూరమయ్యానో ఆమె చెప్పకనే చెప్తున్నారు.

‘‘నేను నటించిన ‘మిలటరీ రాజ్’ ఎంత మంచి సినిమా? అలాంటి కధలు, చక్కని సామాజిక సందేశాన్నందించే సినిమాలు తీసే దమ్ము ఇప్పుడు ఏ నిర్మాతకు ఉంది? రాసే దమ్ము ఏ రచయితకుంది?’’ అంటూ ఆవేశంగా కాకుండా ఆవేదనగా ప్రశ్నిస్తారు ప్రతిభా. అలాగని తానేమీ మసాలా దృశ్యాలకు, కమర్షియల్ సినిమాలకూ వ్యతిరేకం కాదని, ‘మిలటరీ రాజ్’లో కూడా అలాంటి కొన్ని సన్నివేశాలున్నాయని గుర్తు చేస్తారు.

చక్కని కధాంశం, పకడ్బందీ చిత్రీకరణ... ఇత్యాది వనరులతో ప్రేక్షకుల్ని అలరించిన లమ్హే, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, కభీ కభీ వంటి సినిమాలు తీసే ఓపిక ఇప్పటివారికి లేదని, చూసే ఓపికా ప్రేక్షకులకు లేదని ఆమె అభిప్రాయ పడతారు. ఏ పని చేసినా దానితో తొలుత మనం సంతృప్తి చెందాలి. అప్పుడే మిగిలిన వారిని సంతృప్తి పరచగలం అంటున్న ప్రతిభ... కేవలం జనాల్ని ఆనందపెట్టడమే లక్ష్యంగా పనిచేసేందుకు తానేమీ రోడ్డుమీద గారడీ చేసే వ్యక్తిని కానని తేల్చి చెప్పారు.

సినిమా పరిశ్రమ గురించి మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు ఆమె అదుపు తప్పుతారు. ‘మనవాళ్లు పిచ్చివాళ్లు. ప్రేక్షకులతో సహా. ఇక్కడున్నదంతా చెత్త’ అనేస్తారు. ఆమె తల్లి అద్భుతమైన నటనతో అందర్నీ అలరించారు. అలాంటి గొప్ప నటికి వారసురాలిగా వచ్చినా, సరైన సినీ భవిష్యత్తును పొందలేకపోయిన ప్రతిభ, చిన్నితెరనూ చిన్నచూపే చూస్తున్నారు. ‘‘టీవీ ఒత్తిడి నుంచి దూరం చేసే సాధనమే. అయితే అందులోనూ సినిమా ప్రోమోలు ఎక్కువై పోయాయి. అవి భరించడం నా వల్ల కాదు’’ అంటున్నారు. ఆమె ‘రంగుల లోకాన్ని ద్వేషిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ ద్వేషాన్ని ఓ అద్భుతమైన అవకాశంతో చిత్రపరిశ్రమ పోగొడు తుందని ఆశిద్దాం. వెండితెరపై ఆమె మరోసారి ప్రకాశించాలని కోరుకుందాం.
- ఎస్.సత్యబాబు

గర్వభంగం(kids story)

 
విక్రమనగరి సంస్థానంలో వీరభద్రుడనే కవి ఉండేవాడు. అతను మంచి పండితుడే గానీ గర్విష్టి కావడంతో ఇతర కవులను జయించి, వాళ్లను అవహేళన చేస్తుండేవాడు.
వీరభద్ర కవి దెబ్బకు ఇతర కవులంతా భయపడి పోయి అతను ఎక్కడ కనిపిస్తాడో, ఎక్కడ తమను ఎగతాళి చేస్తాడోనని నక్కి నక్కి ఉండేవాళ్లు.

వీరభద్ర కవి దేశాటనం ప్రారంభించాడు. అనేక రాజ్యాలను సందర్శించి అక్కడ మహారాజులచే పాద పూజలు చేయించుకుని, అంతులేని సంపదలు ఆర్జించడం ప్రారంభించాడు. కవిత్వంతో తనను ఓడించలేని పండితులను కారాగారాల్లో బంధించమని, హింసించమని రాజులను ఆజ్ఞాపించసాగాడు. రాను రాను కవి రాచరికాలు పెరిగిపోయాయి.

ఇలా ఉండగా వీరభద్ర కవి గర్వం గురించి విన్న జయసింహుడు అనే యువకుడు తమ రాజ్యాన్ని పాలిస్తున్న రాజేంద్రవర్మ వద్దకెళ్లి‘‘రాజా! వీరభద్రుణ్ణి కవితాగోష్ఠికి పిలిపించండి. అతని పొగరణుస్తాను’’ అని చెప్పాడు. జయసింహుని తెలివితేటలగురించి తెలిసిన రాజేంద్రవర్మ వీరభద్రుణ్ణి తన రాజ్యానికి ఆహ్వానించాడు.

వీరభద్రుడు తనకు పన్నెండు భాషలు వచ్చునని, తన మాతృభాష ఏదో కనిపెట్టాలని, ఒకవేళ కనిపెట్టలేకపోతే రాజు తన రాజ్యాన్ని తనకు ధారాదత్తం చేసి, ఆస్థాన కవులతో సహా రాజ్యం వదిలి వెళ్లిపోవాలని షరతు విధించాడు. జయసింహుడు వచ్చి వినయంగా ‘‘కవివరేణ్యా! ఇవ్వాల్టికి చీకటి పడిపోయింది. తమరు విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకోండి. కవితాగోష్ఠి రేపు కొనసాగించవచ్చు’’ అనడంతో వీరభద్రుడు మందిరానికి వెళ్లి నిద్రపోయాడు.

అర్ధరాత్రివేళ జయసింహుడు మారువేషంలో పెద్ద దుడ్డు కర్రతో వీరభద్రుని చావగొట్టసాగాడు. దాంతో వీరభద్రుడు ‘‘చచ్చాను దేవుడోయ్’’ అంటూ ఏడవసాగాడు. దాంతో జయసింహుడు ‘‘ఇదే నీ మాతృభాష - తక్షణం వెళ్లిపో’’ అనగానే వీరభద్రుడు పారిపోయాడు.
నీతి: ప్రతిభ ఉండవచ్చు కానీ గర్వం పనికిరాదు.

బాడీ బిల్డింగ్‌కు మూడు బీ లు

 
ఆకర్షణీయమైన శరీర సౌష్ఠవాన్నే ఇంగ్లిష్‌లో బాడీ బిల్డింగ్ అంటారు. ఈ బాడీబిల్డింగ్‌లో రెండు ‘బీ’ అనే అక్షరాలున్నాయి. అయితే మంచి బాడీ బిల్డింగ్ కోసం మరో మూడు ‘బీ’లను గుర్తుంచుకోవడం చాలా మేలు చేస్తుంది. ఈ మూడు ‘బీ’లు వెయిట్ లిఫ్టింగ్ ప్రక్రియలో ఉపయోగపడతాయి. అవే... బ్రీతింగ్, బ్యాలెన్స్, బడ్డీ (స్నేహితుడు).

బ్రీతింగ్:వెయిట్ లిఫ్టింగ్ చేసే సమయంలో బరువును ఒకేసారి పెకైత్తే వేళ కొందరు ఊపిరి బిగబట్టేస్తారు. ఇలా చేయడం వల్ల మన రక్తపోటు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. అందుకే బరువును ఎత్తే సమయంలో ఊపిరి బయటకు వదలాలి (ఎక్స్‌హేల్ చేయాలి). అలాగే బరువును కిందికి దించే సమయంలో ఊపిరి పీల్చుకోవాలి. (ఇన్‌హేల్ చేయాలి). వెయిట్ లిఫ్టింగ్‌లో ఇది ఎంతో కీలకం. దీనివల్లనే మన కండరాలన్నీ సమానంగా పనిచేయడంతో పాటు కండరాలన్నింటికీ సమానమైన వ్యాయామఫలితం ఒనగూరుతుంది.

బ్యాలెన్స్: వెయిట్‌లిఫ్టింగ్ సమయంలో మన రెండు చేతుల్లో ఇరువైపులా ఉన్న బరువును ఒకేసారి పెకైత్తాలి. అంతేగాని ఎక్కువ బలం ఉన్న కుడి చేతి బరువును కాస్తంత పైకి, ఎడమచేతిలో ఉన్న బరువును అంతకంటే కిందికి ఉండేలా బరువులెత్తకూడదు. ఇలా బ్యాలెన్స్ లేకుండా బరువులెత్తితే అది యాబ్స్, క్వాడ్స్, హ్యామ్‌స్ట్రింగ్స్, డెల్టాయిడ్స్, పెక్టోరల్ కండరాలు... ఇలా అన్ని కండరాలపైనా దుష్ర్పభావం చూపుతుంది. అందుకే మనం బాడీబిల్డింగ్ కోసం చేసే వెయిట్‌లిఫ్టింగ్‌ను చాలా తక్కువ బరువుతోనే మొదలుపెట్టడం మంచిది.

బడ్డీ (స్నేహితుడు లేదా తోడు): బాడీ బిల్డింగ్ కోసం బరువులు ఎత్తే సమయంలో ఒక స్నేహితుడు తోడుగా ఉండటం ఎంతైనా మంచిది... అవసరం కూడా. బరువులను ఒకరే ఎత్తలేని సమయంలో స్నేహితుడు సహాయపడతాడు. ఒకవేళ బరువు ఎక్కువై ఒకరే దించలేకపోతుంటే గాయపడకుండా కాపాడతాడు. అంతేకాదు... వ్యాయామంలో ఎవరైనా తోడు ఉండటం అటు హుషారుపరచడానికీ, ఇటు ఒకరి తర్వాత మరొకరు చేస్తున్నప్పుడు మధ్యలో కొద్దిపాటి విశ్రాంతినివ్వడానికి... ఇలా ఎవరైనా తోడుండటమన్నది అన్ని విధాలా ఉపయోగపడుతుంది.

జిమ్‌థాథాచకచకా

 
ఇప్పుడు మనందరికీ ఎక్సర్‌సైజ్ అవసరం ఎంతో ఉంది. గత రెండు దశాబ్దాలకు పైగా మన సమాజంలో మనం ఎక్సర్‌సైజ్‌కు తగిన విలువ ఇవ్వనందున డయాబెటిస్‌లూ, స్ట్రోక్‌లలో మన దేశమే ప్రథమంగా నిలిచింది. దాంతో ఇప్పుడు అకస్మాత్తుగా దాని అవసరాన్ని గుర్తెరగాల్సి వచ్చింది. చక్కెర అదుపు చేయాలన్నా, గుండెపోటు రాకుండా చూసుకోవాలనుకున్నా, కొవ్వులనూ, పొట్టలనూ తగ్గించుకోవాలనుకున్నా కావాల్సిందల్లా వ్యాయామం... వ్యాయామం... అంతే! వ్యాధులు వచ్చినవారికీ, రాకుండా చూసుకోవాలనుకున్నవారికీ, వచ్చాక అదుపు చేసుకోవాలనుకున్న వారికీ... అందరికీ వ్యాయామమే అందరి నిరంతర మంత్రం.ఇప్పుడు వ్యాయామం అన్నది ఒక సర్వరోగ నివారణి అనే హోదా పొందిన సాంత్వన ప్రక్రియ. ఈ కాలంలో ఇంతగా ప్రాచుర్యం పొందుతున్న వ్యాయామం గురించి అనేక విషయాలూ, అపోహలూ, వాస్తవాలూ... ఇలాంటివన్నీ ఇవాళ్టి కథనంలో.

నిన్నమొన్నటి వరకూ త్రీపీస్ సూట్ వేసుకునేవారు నేడు ట్రాక్‌సూట్ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారు? ఒకనాడు ఖరీదైన లెదర్ షూ మాత్రమే తొడిగేవారు నేడు క్యాన్వాస్ షూ లేసులెందుకు బిగిస్తున్నారు? అకస్మాత్తుగా అందరూ ఎందుకిలా కాన్ఫరెన్స్‌హాల్స్ వదిలి కార్పెట్‌గ్రాస్ మీదికి వెళ్తున్నారు? ఎందుకంటే వ్యాయామానికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే అది మననుంచి దాన్ని బలవంతంగా లాక్కుంటుంది. తనను గౌరవించేలా చేసుకుంటుంది. ఒక రెండున్నర దశాబ్దాల పాటు మనమంతా వ్యాయామానికి క్రమంగా దూరమైపోతూ చదువులకు దగ్గరయ్యాం. ఎలాగంటే... ఇప్పుడు నలభైల్లో ఉన్నవారు ఒక్కసారి పాతికేళ్ల క్రితం నాటి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే ... అప్పట్లో మన ఆటల్లోనే వ్యాయామం అంతర్భాగమై ఉండేది. ఉదా: కబడ్డీ, ఖోఖో, కోతికొమ్మచ్చి... ఇలా. ఇక చదువుల్లోనూ వ్యాయామం ఉండి తీరాల్సిందే!

అదెలాగంటే... పల్లె నుంచి దగ్గర్లోని పట్టణంలో స్కూల్‌కు వెళ్లాలంటే కనీసం మూడు నుంచి ఆరేడు కిలోమీటర్లు నడవాల్సిందే. ట్యూషన్లకు అంటూ రోజూ నడకో, సైకిలో తప్పదు. హాబీల్లోనూ వ్యాయామమే. ఉదాహరణకు ఈతకొట్టడం, చెట్లు ఎక్కడం. సంస్కృతిలోని వేడుకల్లో భాగంగా చేసే పనుల్లోనూ ఎంతో ఎక్సర్‌సైజ్. పండగలకు, శుభకార్యాలకు గుమ్మాలకు మామిడాకులు కట్టడం కోసం వాటిని సేకరించడం, కొబ్బరిమట్టలు, వేపమండలు కొట్టుకురావడం ఇలాగన్నమాట. అమ్మాయిలకూ - చెమ్మచెక్క, కుందుడుగుమ్మ, తొక్కుడుబిళ్ల, తాడాట... ఇలా ఏ ఆట తీసుకున్నా ఆటల్లో ఎక్సర్‌సైజ్ తప్పదు. పైగా అవి మనమంతా ఒక ఎక్సర్‌సైజ్‌లా భారంగా కాకుండా ఒక వినోదంగా, వేడుకగా, ఇష్టంగా చేసేవాళ్లం.

ఆ తర్వాత సంస్కృతిలోకి సైకిల్స్ వచ్చినా అవి వ్యాయామానికి అడ్డుకాలేదు సరికదా మరోరకంగా అదనపు వ్యాయామాన్నే సమకూర్చింది. అయితే క్రమంగా 80, 90ల నాటికి పరిస్థితిలో మార్పువచ్చింది. రోజులో ఆటపాటలకు కేటాయించే సమయం కంటే చదువులకు కేటాయించాల్సిన సమయం క్రమంగా పెరుగుతూ పోయింది. దాంతో 80, 90 సంవత్సరాలలో పుట్టినవారంతా రెండు దశాబ్దాల పాటు వ్యాయామానికి దూరమయ్యారు. దాని ఫలితం పాతికేళ్ల తర్వాత కనిపించింది. సరిగ్గా రెండున్నర దశాబ్దాల తర్వాత మన దేశం డయాబెటిస్, గుండెపోటు, హైపర్‌లిపిడేమియా వంటి వ్యాధుల్లో ప్రపంచంలోనే పెద్ద స్థానం సంపాదించింది. ఫలితంగా ఇప్పుడు ఆ రెండు దశాబ్దాల ఎక్సర్‌సైజ్ లోటును అధికమూల్యంతో భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు మళ్లీ టీనేజ్‌నుంచే మళ్లీ జిమ్, వ్యాయామాలను మన జీవనశైలిలో అంతర్భాగం చేసుకోవాల్సిన అవసరం పడింది.

టీనేజ్ పిల్లలూ... వ్యాయామం

టీనేజ్‌లోనే పిల్లలు తమకు ఇష్టమైన హీరో తాలూకు ఆకర్షణీయమైన సౌష్ఠవం చూసి వ్యాయామం పట్ల ఆకర్షితులవుతారు. అందుకే చాలా సమయాల్లో ఈ దశలో వారిలో పాదుకునే ఇష్టం... కాలక్రమేణా ఒక అలవాటుగా మారుతుంది. వాళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఈ దశలో టీనేజ్ పిల్లల వ్యాయామం... వాళ్ల తల్లిదండ్రులను కాస్త ఆందోళనకు గురిచేస్తుంది. సాధారణంగా ఎదిగే పిల్లలు ఎక్సర్‌సైజ్ చేస్తే అది వాళ్లలో ఎత్తుపెరిగే ప్రక్రియను అడ్డుకుంటుందన్నది ఒక సాధారణ అపోహ. ఇందులో కొంతే నిజం.

ఎత్తు పెరగడాన్ని ఎక్సర్‌సైజ్ అడ్డుకుంటుందా?

ముందుగా పిల్లల్లో ఎత్తు పెరిగే ప్రక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. సాధారణంగా పిల్లలు ఎంత ఎత్తు పెరుగుతారన్నది వాళ్ల జన్యువులపై ఆధారపడి ముందుగానే నిర్ణయమవుతుంది. అందుకే తల్లిదండ్రులు ఎత్తుగా ఉంటే వాళ్ల పిల్లలూ ఎత్తుగా పెరుగుతారు. పిల్లల పెరుగుదలలో రెండు దశలుంటాయి. వాటిని లాగ్ ఫేజ్ అనీ, ల్యాగ్ ఫేజ్ అంటారు. ఇందులో లాగ్ ఫేజ్‌లో పిల్లలు ఒక దశలో అంటే పన్నెండు నుంచి పద్నాలుగు, పదహారేళ్ల వయసు మధ్య అకస్మాత్తుగా ఎత్తుగా అవుతారు. ఆ తర్వాతి దశ ల్యాగ్ ఫేజ్. ఈ దశలో పెరుగుదల మందగించి... అది మందకొడిగా సాగుతూ మహా అయితే ఒకటి లేదా రెండు అంగుళాలు పెరిగి ఆగిపోతుంది. అది సాధారణంగా 18-21 ఏళ్ల మధ్య జరుగుతుంది. అంటే కొందరిలో అది 18 ఏళ్లకే ముగిస్తే... మరికొందరిలో ఆ గరిష్టపరిమితి 21 ఏళ్ల వరకు సాగుతుంది. అంటే... ఎవరిలోనైనా ఎత్తు పెరగడం అన్న ప్రక్రియ 21 ఏళ్లు వచ్చేసరికి ఎముక చివర ఫ్యూజ్ అయిపోయి పెరుగుదల ఆగిపోతుంది.

అందుకే సాధారణ ఆటపాటల్లో భాగంగా జరిగే వ్యాయామం వారిలోని ఎత్తుపెంచే ప్రక్రియను అడ్డుకోలేదు. పైగా సాగినట్లుగా, వేలాడబడుతూ చేసే స్ట్రెచింగ్ వ్యామాయాలు వాళ్ల లాగ్ ల్యాగ్ ఫేజ్‌లను కొంత ప్రభావితం చేస్తూ ఒకింత ఎత్తు పెంచేందుకు దోహదపడచ్చు కూడా. అయితే మన ఎముకల్లో పెరిగే భాగాలు ఎముక చివరన ఉంటాయి. వీటిని గ్రోత్ ప్లేట్స్ అంటారు. మనం ఎదిగే వయసులో ఎక్కువ బరువుతో విపరీతంగా వ్యాయామాలు చేస్తే అది గ్రోత్‌ప్లేట్స్‌ను దెబ్బతీయచ్చు. అలా గ్రోత్‌ప్లేట్స్ దెబ్బతింటే మాత్రం ఎత్తుపెరగడం ఆగిపోవచ్చు. అందుకే ఈ దశలో వ్యాయామం ఆటల్లో భాగంగా ఉండటం లేదా స్ట్రెచింగ్‌కు పరిమితం కావడం లేదా తక్కువ బరువులతో ఎక్కువ రిపిటీషన్స్‌తో చేస్తుండటం ఎత్తు పెరగడానికి ఎంతమాత్రం ప్రతిబంధకం కాబోదు.

నిర్వహణ: యాసీన్

మార్కెట్‌లో లభించే ప్రోటీన్ డైట్ అవసరమా?

కొత్తగా వ్యాయామం చేయదలచిన వారు తమ కండరాలు పెరగడానికి మార్కెట్‌లో లభ్యమయ్యే ప్రోటీన్ డైట్ తీసుకోడానికి మొగ్గుచూపుతుంటారు. మనకు ఒక రోజుకు ఒక గ్రాము కండరానికి 1.2 గ్రాముల ప్రోటీన్ అవసరం. అంటే 50 కిలోల వ్యక్తి వ్యాయామం చేస్తుంటే అతడికి రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ చాలు. ఒక పూట పుష్కలంగా చికెన్‌తో భోజనం చేస్తే అతడికి 35 గ్రాముల ప్రోటీన్ సమకూరుతుంది. అంటే రెండు పూటల భోజనంతోనే అతడికి అవసరమైన ప్రోటీన్ దొరుకుతుందన్నమాట. ఇంకా కావాలనుకుంటే చేపలు, గుడ్డు వంటి స్వాభావికమైన ప్రోటీన్‌నే తీసుకోవచ్చు. శాకాహారులైతే పప్పులు, చిక్కుళ్లు వంటి స్వాభావిక ప్రోటీన్ తీసుకుంటే మేలు. ఒకవేళ మార్కెట్‌లో దొరికే కృత్రిమ ప్రోటీన్ సప్లిమెంట్స్‌లో ఎలాంటి కల్తీలున్నాయో తెలియదు. అవి శరీరానికి మేలుకు బదులు కీడు చేస్తే జరిగే అనర్థాలతో మొత్తం ఆరోగ్యానికే చేటు.

టీనేజ్ పిల్లలూ... వ్యాయామం

టీనేజ్‌లోనే పిల్లలు తమకు ఇష్టమైన హీరో తాలూకు ఆకర్షణీయమైన సౌష్ఠవం చూసి వ్యాయామంపై మోజుపెంచుకుంటారు. అయితే ఈ దశలో టీనేజ్ పిల్లల వ్యాయామం... వాళ్ల తల్లిదండ్రులను కాస్త ఆందోళనకు గురిచేస్తుంది. సాధారణంగా ఎదిగే పిల్లలు ఎక్సర్‌సైజ్ చేస్తే అది వాళ్లలో ఎత్తుపెరిగే ప్రక్రియను అడ్డుకుంటుందన్నది ఒక సాధారణ అపోహ. నిజానికి ఇందులో కొంతమేరకే వాస్తవం ఉంది. ఎముకల చివరన ఉండే గ్రోత్ ప్లేట్స్ దెబ్బతినకుండా ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా ఎత్తు పెరగడానికి ప్రతిబంధకం ఉండదని గుర్తిస్తే ఎక్సర్‌సైజ్ - ఎత్తు పట్ల మనకున్న అపోహలన్నీ దూరమవుతాయి.

ఆరోగ్య ఖర్జూరాలు......(గుడ్ ఫుడ్)

 
...
ఖర్జూరాల్లో ఉండే క్యాల్షియమ్, మాంగనీస్, కాపర్, మెగ్నీషియమ్ పోషకాలు మనలోని ఎముకల, పంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. పైగా పై పోషకాలు మనలో కండరాల, నరాల శక్తిని పెంపొందిస్తాయి. ఎర్రరక్తకణాల ఉత్పత్తికి కాపర్ చాలా అవసరం. ఎముకలకు మెగ్నీషియమ్ చాలా మేలు.

పై పోషకాలతో పాటు ఖర్జూరాల్లో విటమిన్-బి కాంప్లెక్స్, విటమిన్-కె లభ్యమవుతాయి. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడేందుకు విటమిన్-కె చాలా అవసరమన్న విషయం తెలిసిందే. అందుకే పై సుగుణాలు ఉన్నందున రోజూ మనం తీసుకునే ఆహారంలో ఖర్జూరాలు ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది.

పొటాషియమ్ ప్రాధాన్యం తెలుసా...? (గుడ్ ఫుడ్)

 
 
మనకు అవసరమైన లవణాల్లో ఒకటైన పొటాషియమ్ శరీరంలో లోపించిందనుకోండి... ఏం జరుగుతుందో తెలుసా? అసలు గుండె కొట్టుకోవడమే జరగదు. కండరం బిగుసుకోవడం జరగదు. అంటే... మనం దేన్నీ పట్టుకోవడం జరగదు. అంతెందుకు... అసలు కదలడమే సాధ్యం కాదు. ఒకవేళ పొటాషియమ్ తక్కువగా ఉంటే మీరు చదువుతున్న మ్యాటర్ అసలు అర్థం కాదు కూడా! ఎందుకంటే... మెదడులోని కణాలు పనిచేయడానికి కూడా పొటాషియమ్ కావాల్సిందే.

పైగా రక్తపోటును క్రమబద్ధీకరించే గుణం దీనికి ఉంది. మరి పోషకంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ లవణం కోసం తీసుకోవాల్సిన ఆహారాలేమిటో తెలుసా? మనకు అందుబాటులో ఉండేది అరటిపండు. ఒక అరటిపండులో 400 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది. ఒక అవకాడోలో 500 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది. కానీ ఇది అందరికీ అంతగా అందుబాటులో ఉండదు. ఇక పై రెండూ అందుబాటులో లేకపోతే పొటాషియమ్ కోసం బంగాళాదుంప (ఆలుగడ్డ) మీద ఆధారపడండి. ఒక పెద్ద ఆలుగడ్డలో 1600 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది.

ప్రో-బయాటిక్స్ మజ్జిగే మందుగా........(వంటింటి ఔషధం)

 
 
రుక్మిణికి కడుపులో తెరలు తెరలుగా నొప్పి. దానికి తోడు బంక విరేచనాలు. ఎప్పట్లాగే విరేచనాలను ఆపే మందులను తీసుకుని వాడినా ప్రయోజనం కనిపించలేదు. డాక్టర్‌ను కలిస్తే ఆయన ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అని చెప్పారు. ఇది కేవలం రుక్మిణికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. చాలామందిలో కనిపించేదే. అప్పుడు వాళ్లు చేయాల్సిందేమిటి? చాలా సింపుల్. వీలైతే మజ్జిగ తాగడం లేదా... మజ్జిగలో ఉండే వాటినే మందుల రూపంలో తీసుకోవడం.

మజ్జిగే మందెలా అవుతుంది?

మన జీర్ణవ్యవస్థ పొడవునా అనేక కోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. అవి కొన్ని కొన్ని వ్యాధులనుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అంటే... పరోక్షంగా అవి మన రోగనిరోధకశక్తిని పెంపొంది స్తుంటాయి. అందుకే వాటిని ‘ప్రో-బయోటిక్’ అంటారు. మన సంప్రదాయంలో మనకు తెలియకుండానే మనం ప్రో-బయాటిక్స్‌ను తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఇడ్లీ పిండిని రాత్రి కలుపుకుని ఆ మర్నాడు ఇడ్లీ చేసుకుంటాం. అలాగే దోసె పిండి కలుపుకుని కాస్తంత పులిసిపోయాకే అట్లు వేసుకుంటాం. ఎండన పడి వచ్చిన వారికి మజ్జిగ ఇస్తాం. ఇలా మనం మజ్జిగను తాగినప్పుడు కూడా మనకు మేలు చేసే అనేక సూక్ష్మజీవులను మన కడుపులోకి తీసుకుని, ఆరోగ్యాన్ని పెంచుకుంటాం. అంటే మజ్జిగరూపంలో మనం ఒకవైపు ఎండ దెబ్బ వల్ల వచ్చే డీ-హైడ్రేషన్‌ను నిరోధించుకుని, మరోవైపు పేగులకు మేలు చేసే సూక్ష్మజీవులనూ సమకూర్చుకుంటామన్నమాట. ఇలా మనం మన సంస్కృతి సంప్రదాయాల్లో ‘ప్రో-బయాటిక్స్’ను తీసుకునే అలవాటు ఎప్పట్నుంచో మనకు ఉంది. మనం మజ్జిగలా తీసుకునేదాన్నే ఇప్పుడు చాలామంది మందులా కూడా ఉపయోగిస్తున్నారు.

ఏయే జబ్బులకు...

పైన పేర్కొన్నట్లుగా రుక్మిణికి కలిగిన సమస్య చాలామందిలో కనిపిస్తుంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటారు. ఇదిగాక అల్సరేటివ్ కొలైటిస్ అనే వ్యాధిలోనూ, క్రోన్స్ డిసీజ్‌లోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తుంటాయి. అల్సరేటివ్ కొలైటిస్‌లో పెద్దపేగు, రెక్టమ్ (మలద్వారం పై భాగం) వాపు, నొప్పి, మంట (ఇన్‌ఫ్లమేషన్)కు గురవుతాయి. ఇక క్రోన్స్ డిసీజ్ ఉన్నవారిలోనైతే జీర్ణవ్యవస్థ ఏ భాగంలోనైనా ఇన్‌ఫ్లమేషన్ కనిపిస్తుంది. ఈ రెండు వ్యాధులను కలిపి ‘ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్’గా వ్యవహరిస్తుంటారు.

ఎందుకొస్తాయి ఈ సమస్యలు...?

ఇరిటబుల్ బవెల్ డిసీజ్‌లు ఎందుకు వస్తాయన్న అంశంపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతా లేదు. కొంతమంది అయితే ఇవి మానసిక సమస్యల వల్ల కనిపించే శారీరక లక్షణాలని సిద్ధాంతీకరించారు. తీవ్రమైన ఒత్తిడితో పనిచేసే వారికి ఈ జబ్బులు వస్తుండటం గమనించారు.

తగ్గడానికి ఏం చేయాలి...?

ఉదయం తినే టిఫిన్లలో పాశ్చాత్య తరహా ఆహారాలు కాకుండా మన సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోసె వంటివాటిని తీసుకోవాలి. తరచూ తాజా మజ్జిగ తాగుతూ ఉండాలి. కాస్తంత పులిశాక తాగితే అందులో సూక్ష్మజీవులు పెరగవచ్చేమోగాని... అప్పటికే తాజా మజ్జిగ తన క్షారగుణాన్ని కోల్పోయి ఆమ్ల గుణాన్ని సంతరించుకుంటుంది. అప్పటికే మన జీర్ణవ్యవస్థలో అసిడిటీ ఉంటే... ఆ యాసిడ్‌కు... ఈ ఎసిడిక్ మజ్జిగ తోడై సమస్యను పెంచుతుంది. అందుకే తాజా మజ్జిగ తాగాలి. లేదా తియ్యటి పెరుగులోనూ ప్రో-బయాటిక్స్ ఎక్కువగానే ఉంటాయి. ఆహారంలో భాగంగా తీసుకునే రిఫైన్‌డ్ షుగర్స్, జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేయాలి. వీలుకాకపోతే గణనీయంగానైనా తగ్గించాలి. ఇక కార్బోహైడ్రేట్స్ కోసం పొట్టుతో ఉండే అన్ని ధాన్యాలనూ తీసుకోవచ్చు కానీ కొంతకాలం పాటు మొక్కజొన్న, గోధుమలనుంచి మాత్రం దూరంగా ఉండాలి. తాజా పండ్లు, ఆకుపచ్చటి ఆకుకూరలతో మన పేగుల్లోకి పుష్కలంగా పీచు వెళ్లేలా చేసుకోవాలి. అప్పటికీ గుణం కనిపించకపోతే డాక్టర్‌లను అడిగి ఇప్పుడు టాబ్లెట్లు, కాప్సూల్స్, పౌడర్లు, సోయాబీవరేజెస్ రూపంలో లభ్యమవుతున్న ప్రోబయాటిక్స్ మందులు వాడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవాలి.

జంక్అంటే జంకండి!

 
మీ ఇంట్లో పిజ్జా, బర్గర్, పఫ్, ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్ లాంటివి తినని పిల్లలు ఉన్నారా? వచ్చే సమాధానం లేరు అనే. ఇప్పుడు మనం పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లను నిరోధించలేం. సంప్రదాయ ఆహారాలను తయారు చేసుకోడానికి ఎంతో సమయం పడుతున్న వేళల్లో త్వరగా లభ్యమవుతున్నవాటిని రాకుండా అడ్డుకోలేం. కానీ అందులోని హానికరమైన అంశాలను గుర్తించి విచక్షణతో మెలగాలి. మనం ఆ ఆహార పదార్థాలను తీసుకుంటున్నప్పుడు వాటితో కలిగే హానిని కూడా గ్రహిస్తే వాటిని పరిమితం చేసుకోగలుగుతాం. అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటాం. అలాంటి విచక్షణను కలిగించేందుకే ఈ కథనం.

మనం ఆహారం కోసం ఏదో తింటుంటాం. అదే సమయంలో రుచిగా ఉండాలని కూడా కోరుకుంటాం. పిజ్జా, బర్గర్, పఫ్స్, చిప్స్ లాంటివి చాలా త్వరితంగా లభ్యమవుతున్నాయి. పైగా రుచి కూడా. అలాంటప్పుడు వాటిని తింటే తప్పేమిటి అనుకోకండి. వాటిని ప్రాసెస్‌డ్ ఫుడ్స్ అంటారు. ఏదైనా ఒక ఆహార పదార్థం దీర్ఘకాలం నిల్వ ఉండటానికీ, మరింత రుచిగా ఉండటానికి కొన్ని ప్రక్రియ (ప్రాసెస్)లను అనుసరిస్తాం. ఆ ప్రాసెస్‌ల వల్ల రుచి, చాలాకాలం నిల్వ ఉండే శక్తి (షెల్ఫ్‌లైఫ్) లభిస్తాయి. ఒక పదార్ధాన్ని నూనెతోనో, లేదా నేతితోనో చేస్తే త్వరగా చెడిపోవచ్చు. అందుకే అందులో దీర్ఘకాలం నిల్వ ఉంచే పదార్థాలు వాడతారు. వాటినే ప్రిజర్వేటివ్స్ అంటారు. ఇలా నిల్వ ఉంచేందుకు కొన్ని రసాయనాల మీద ఆధారపడాల్సి వస్తుంటుంది. నిజానికి మనం తీసుకునే ఆహారంలో అందులోని స్వాభావిక పోషకాలతో ఎలాంటి హానీ లేకపోయినా... ఈ రసాయనాలే ప్రమాదకారి. ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌లో చాలాకాలం నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ వాడతారు కాబట్టి వాటిని కాస్త ఆలోచించి తినాలని సూచిస్తుంటారు నిపుణులు.

ఆహారాన్ని నిల్వ ఉంచేలా చేసే ఆ నూనె ఏమిటి?

స్వాభావికమైన వెన్న వాడితే దానితో చేసిన పదార్థం చాలా రుచిగా ఉంటుంది. కానీ వెన్న త్వరగా చెడిపోతుంది. అలా చెడకుండా ఉండే పదార్థం ఏదైనా ఉండి, అది వెన్నలాంటి రుచి ఇస్తే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన నుంచి వచ్చిన పదార్థమే హైడ్రోజనేటెడ్ ఆయిల్. ఇందులో మామూలు వంటనూనె (వెజిటబుల్ ఆయిల్)ను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి, అందులోకి హైడ్రోజెన్‌ను పంపుతారు. దీన్నే హైడ్రేజనేషన్ అంటారు. దాంతో నూనె కాస్తా వెన్నలాంటి పదార్థంగా మారిపోతుంది. వెన్నలాంటి రుచే ఇస్తుంది. ఇక్కడ ఇది రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంటుంది. ఒకటి... నూనె ద్రవరూపంలో ఉంటే దాన్ని వాడుకోవడం ఒకింత కష్టం. దూరం తీసుకెళ్లాలంటే ఒలికిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇది ఘనరూపంలో ఉంది. కాబట్టి ఒలికిపోయే ప్రమాదం లేదు. ఫలితంగా నిల్వకూ, రవాణాకూ, వాడుకోడానికీ చాలా సులభం. ఇక రెండో ప్రయోజనం... ఇది స్వాభావికమైన దానికంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

వెన్నలో ఏముంది.. మరి వెన్నలాంటిదాంట్లో ఏముంది?

వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వీటితో పాటు బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) అనే పోషకాలు ఉన్నాయి. బ్యుటిరేట్ మానసిక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి పెంచుతుంది. తిన్న ఆహారమంతా ఒంటికి పట్టేలా చేస్తుంది. చిన్నపేగుల్లో వాపు, నొప్పి, మంటల (ఇన్‌ఫ్లమేషన్)ను తగ్గిస్తుంది. కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) గుండె ఆరోగ్యానికి మంచిది. వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు తగ్గుతుంది. పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న ఎంతో ఉపయోగం. అంటే బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వెన్నలో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి. మరి వెన్నలాంటి ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్‌లో పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఇచ్చే గుణాలున్నాయి. ఇది గుండెకు మంచిది కాదు, శరీరంలోని కొవ్వును పెంచుతుంది. ఫలితంగా స్థూలకాయాన్ని కలిగిస్తుంది. పైగా ఇది క్యాన్సర్ కారకం కూడా.

అలర్జీలూ... మానసిక వ్యాధులు

మనం ఆహారంలో ఉపయోగించే ప్రిజర్వేటివ్స్‌లో చాలా వరకు రసాయన పదార్థాలే కావడంతో ఒక్కోసారి అవి శరీరానికి సరిపడకపోవడం వల్ల అవి తీసుకున్న వారిలో అలర్జీలు కలగడం మామూలే. అంతేకాదు... షెల్ఫ్‌లైఫ్ ఎక్కువగా ఉండటానికి చేసే రకరకాల ఆహారాలతో పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అనే మానసిక వ్యాధి రావడం ఈ రోజుల్లో చాలా సాధారణంగా కనిపిస్తున్న అంశం.

ఎర్రగా ఊరిస్తోందా...? ఒక్క క్షణం ఆగండి...

మీరు ఏదైనా బేకరీలోకి వెళ్లినప్పుడు అందులో నిల్వ ఉన్న చికెన్ ఐటమ్ ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించిందా? అది మరీ ఎర్రగా ఉందంటే దానికి సోడియమ్ నైట్రేట్‌పాళ్లు ఉన్న ప్రిజర్వేటివ్ కలిపారని అర్థం. చికెన్ మంచి పోషకమే అయినా దాంతోపాటు జత కలిసి ఉన్న సోడియమ్ నైట్రేట్ కారణంగా అది కోలోరెక్టల్ క్యాన్సర్‌ను, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ల్యూకేమియాలను కలిగించే పదార్థంగా మారుతుంది. అందుకే ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించే మాంసాహార బేకరీ పదార్థాలను తక్కువగానే తీసుకోవాలి. ప్రత్యామ్నాయ ఆహారాలుంటే వాటిని మానేసి ఏ శాండ్‌విచ్‌వైపో మొగ్గుచూపాలి. (అప్పుడు శాండ్‌విచ్‌లలో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్‌కు బదులు స్వాభావికమైన వెన్న వాడిన వాటినే తీసుకోవాలని గుర్తుంచుకోండి).

కూల్‌డ్రింక్స్‌లోని కృత్రిమ రంగులు - ప్రిజర్వేటివ్స్

మనం కూల్‌డ్రింక్స్ తాగే సమయంలో వాటితో పాటు కొన్ని కృత్రిమ రంగులనూ బలవంతంగా శరీరంలోకి పంపుతాం. వాటిని అక్కడ ఉంచడానికి మన మూత్రపిండాలు అస్సలు ఒప్పుకోవు. అందుకే వీటిని బయటకు పంపేందుకు అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేస్తాయి. ఫలితంగా మూత్రపిండాల దెబ్బతింటాయి. ఇక కూల్‌డ్రింక్స్‌ను నిల్వ ఉంచేందుకు కొన్ని రసాయనాలు దోహదపడతాయి. అవే... సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్. కొన్ని సందర్భాల్లో సన్‌సెట్ ఎల్లో, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్, సోడియ మ్ బెంజోయేట్ వంటి అనేక రసాయనాల మిశ్రమాన్ని ఒకే ప్రిజర్వేటివ్స్‌గా కూడా వాడతారు. వీటివల్ల పిల్లలకు కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు.

ఉదాహరణకు... సోడియం బెంజోయేట్ అనే రసాయనం మనం తీసుకున్న విటమిన్ ‘సి’తో కలిసినప్పుడు ఇది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుంది. బాగా వయస్సు పైబడటం లేదా అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో సోడియమ్ బెంజోయేట్ తీసుకున్న వారిలోనూ అచ్చం అలాంటి దుష్పరిణామాలే కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్‌సన్ డిసీజ్‌లాంటి వాటికి దారితీస్తుందని ఇటీవలి కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోడియం బెంజోయేట్‌కు బదులుగా కొన్ని హెర్బల్ ప్రిజర్వేటివ్స్ వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని అమెరికన్ కంపెనీలు కూడా అదే పని చేస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యకరమైన ప్రిజర్వేటివ్స్‌ను రూపొందించడానికి విశేష పరిశోధనలు జరుగుతున్నాయి. అవి సఫలమైతే అప్పుడు ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు గణనీయంగా తగ్గవచ్చు. అప్పటివరకూ మనం ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకుంటున్నా, కూల్‌డ్రింక్స్ తాగుతున్నా అప్రమత్తంగా ఉంటూ పరిమితంగా తీసుకోవడం తప్పదు.

కూల్‌డ్రింక్‌లోని ఫాస్ఫారిక్ యాసిడ్‌తో: దీనివల్ల దంతాలపై ఉండే అనామెల్ పొరను దెబ్బతింటుంది. దాదాపు 15 శాతం మంది పిల్లల్లో ఈ పొర దెబ్బతినడం, పళ్లపై మరకలు, చారలు ఏర్పడటం ఇప్పటికే కనిపిస్తున్న అనారోగ్యకరమైన పరిణామం. కూల్‌డ్రింక్స్ కంపెనీలు మాత్రం తమ పానీయాల్లో ఫాస్ఫారిక్ యాసిడ్ కేవలం అనుమతించిన మోతాదుల (పర్మిసిబుల్ లిమిట్స్)కు మించకుండా వాడుతున్నామని చెబుతుంటాయి. ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ ఎక్కువ కావడం వల్ల అది క్యాల్షియం మెటబాలిజమ్‌ను దెబ్బతీస్తుంది. దాంతో ఎముకల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి.

అందుకే బేకరీలోకి ప్రవేశించే ముందు ఒక్కసారి ఈ అంశాలన్నీ గుర్తు తెచ్చుకుని మీరు తీసుకోబోయే ఆహారాన్ని వీలైనంతగా పరిమితం చేసుకోండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి.

ఉప్పు కూడా ఒక ప్రిజర్వేటివే...

మనం ఆహారంలో తీసుకునే ఉప్పు కూడా ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌లో ఒక ప్రిజర్వేటివ్‌గా వాడతారని మీకు తెలుసా? ఉప్పు వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఉదాహరణకు... మనకు బాగా తెలిసిన ఉదాహరణ రక్తపోటు మాత్రమే. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుందని చాలామందికి తెలుసు. కానీ ఉప్పు ఎక్కువగా వాడితే జీర్ణాశయం లోపలి గోడలపై ఉన్న పొరలు దెబ్బతింటాయి. ఫలితంగా అట్రోఫిక్ గ్యాస్ట్రయిటిస్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ వంటి జబ్బులూ రావచ్చు. మనం వాడే ప్రాసెస్‌డ్ ఫుడ్స్, అప్పడాలు, ఊరగాయలు (పచ్చళ్లు)... వీటన్నింటిలోనూ ఉప్పు ఎక్కువ. అందుకే వాటిని తక్కువగా తీసుకోవాలి.

కలుషితాహారం తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు

ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు అవుతుంటే మీరు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటమో లేదా ఓఆర్‌ఎస్ తీసుకుంటూ ఉండటమో చేస్తూ మీ శరీరం లవణాలనూ, నీటిని కోల్పోకుండా చూసుకోండి.

వాంతులు, విరేచనాలు మరీ ఎక్కువగా ఉంటే సాధారణంగా దొరికే యాంటీ-వామిటింగ్ అండ్ డయేరియా మందులను డాక్టర్ సలహా మేరకు వాడవచ్చు. ఆన్ కౌంటర్ మెడిసిన్ వద్దు.

వాంతులు, విరేచనాలు సాధారణ యాంటీ వామిటింగ్ అండ్ డయేరియా మందులతో తగ్గకపోతే తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ అవసరాన్ని బట్టి సెలైన్ ఎక్కించడం వంటివి చేస్తారు.

వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట లభించే పాల ఉత్పాదనలు వాడవద్దు.

నిర్వహణ: యాసీన్

అందమె ఆనందం

 
చిన్న సైజు బంగాళదుంప, రెండు టేబుల్ స్పూన్ల యాపిల్‌సాస్ కలిపి గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం సహజకాంతితో మెరుస్తుంది.

సంగీతం లేకుంటే పైసాకు పనికిరాను (అదర్‌సైడ్),,,,మణిశర్మ

 
 
ఏ హీరోకి ఆ మ్యూజిక్ కొట్టడం మణిశర్మ స్పెషాలిటీ!
బాక్స్ బద్దలవదా మరి!!
ఆయన బీజీఎం కొట్టినా అంతే.
ఏదో ఒకటి బద్దలవడం గ్యారెంటీ!
ఎమోషనల్‌లో గుండె బద్దల్.
యాక్షన్ సీన్‌లో సీట్లు బద్దల్.
మె-లో-డీ... లో?
బద్దల్ కాదు, మనసు పింజల్ పింజల్.
లేటెస్టుగా ‘సీతమ్మ వాకిట్లో...’ మణి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హాళ్లలో ఆహ్లాదాల పూలు పూయించింది!
ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఆయన్ని నిలబెడుతున్నది... ఇదిగో ఈ సంగీతమే.
‘సినిమాలొద్దు, దమ్మిడీ ఆదాయం ఉండదు’ అని తండ్రి ఆపడానికి ప్రయత్నిస్తే...
‘సంగీతం లేకుండా నయాపైసాకి పనికిరాను’
అని మొండిగా ఫీల్డులోకి వచ్చి, స్టార్ కంపోజర్ అయిన మణిశర్మ అదర్‌సైడే
ఈవారం మన ఇంటర్వ్యూ.


మీరు మొదటినుంచీ మీడియాకు చాలా దూరంగా ఉంటుంటారు. ప్రచారం ఇష్టం ఉండదా?

మణిశర్మ: అలా అని కాదు. మనం ఏం మాట్లాడినా ఓ సమయం... సందర్భం ఉండాలి. అందుకే అవసరమైనప్పుడే మాట్లాడ్తా. ఇప్పుడు చెప్పండి... మీకేం కావాలి?

మీ అదర్‌సైడ్ గురించి తెలుసుకోవాలని ఉంది?

మణిశర్మ: ఎవ్వరి అదర్‌సైడ్ అయినా తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ మాత్రం గౌరవమైనా మర్యాదైనా ఉంటుంది. నేనేదైనా దాపరికాల్లేకుండా మాట్లాడతా. కొంత మందికి నచ్చొచ్చు. ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. అయినా నా పద్ధతి మార్చుకోననుకోండి. చెన్నయ్ నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ కావడానికే ఇన్నేళ్లు పట్టింది. ఇక నా మనస్తత్వాన్ని మార్చుకోవాలంటే కుదరనే కుదరదు.

పుట్టి పెరిగిన మద్రాసు మెరీనా తీరాన్ని వదిలేసి హుస్సేన్ సాగర్ తీరం చేరారు కదా. ఎలా ఉంది ఇక్కడి జీవితం?

మణిశర్మ: ఇంకా ఇక్కడి జీవితానికి నేను అలవాటు పడలేదు. కాబట్టి పెద్దగా ఏం చెప్పలేను. మద్రాసు అనేది నా జీవితంలోని అనేక మజిలీలకు కేంద్రస్థానం. అక్కడి లైఫ్ స్టయిల్‌కి నేను బాగా మమేకం అయిపోయాను. తెల్లవారు జామున అయిదు గంటలకే అక్కడ జీవన ప్రయాణం మొదలైపోతుంది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటుంటారు. మా కాంపౌండ్‌లో ఐదు స్టూడియోలు ఉండేవి. 24 గంటలూ పని... పని... పని. డాక్టర్ రోజూ పేషెంట్ వార్డులకు వెళ్లి పర్యవేక్షించినట్టుగా, నేను ఆ అయిదు చోట్లకు వెళ్లి పనిని పర్యవేక్షిస్తుండేవాణ్ణి. ఈ స్టూడియోల మధ్యలో మా ఇల్లు. దాంతో రాత్రింబవళ్లూ ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ లైఫ్ మాత్రం మిస్సయ్యేవాణ్ని కాదు. అలా విచిత్రంగా కాలం గడిచిపోయింది. ఈ 14 ఏళ్లలో 150 సినిమాలు చేయగలిగాను. కీబోర్డ్ ప్లేయర్‌గా ఉన్నప్పుడు కూడా రోజుకి 18 గంటలు పనిచేసేవాడ్ని. అప్పట్లో నిద్రే సరిగ్గా పోయేవాణ్ణి కాదు. అబ్బో... ఇక్కడ పని ఒత్తిడి ఎక్కువైపోయింది, మ్యూజిక్ డెరైక్షన్ చేస్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చనుకున్నా. ఇక్కడ అంతకన్నా ఎక్కువ బిజీ అయిపోయాను. మార్చి, ఏప్రిల్ నెలల్లో మాత్రం ఊపిరి పీల్చుకోవడానిక్కూడా తీరిక ఉండేది కాదు. ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా మే నెలలో రిలీజవుతుండేవి. దాంతో వర్క్ అంతా మార్చి, ఏప్రిల్‌లోనే చేయాల్సి వచ్చేది.

మీ జీవితంలో సంగీతం అనేది లేకుండా ఉంటే మీరెలా ఉండేవారో ఎప్పుడైనా ఊహించారా?

మణిశర్మ: కలలో కూడా ఎప్పుడూ అలాంటి ఊహ రాలేదు. చిన్నప్పటి నుంచీ నాకు సంగీతమంటే పిచ్చి. ఇక నా 18వ ఏట నుంచే సంగీతంతో పూర్తిగా మమేకమైపోయాను. అప్పట్లో రేడియోలో ఉదయం ఒక గంట, రాత్రి ఒక గంట మాత్రమే పాటలు వచ్చేవి. రాత్రి 9 గంటలకు నాన్నగారు పడుకునేవారు. ఆయనకు ఇబ్బంది కలగకుండా చిన్న సౌండ్‌తో రేడియోను చెవి దగ్గర పెట్టుకుని వినేవాణ్ణి. అప్పట్లో టేప్ రికార్డర్ అంటే ఓ లగ్జరీ కింద లెక్క. మా ఇంట్లోకి టేప్‌రికార్డర్ ప్రవేశించాక దొంగ చాటుగా క్యాసెట్లు కొని నాన్నగారు ఇంట్లో లేనప్పుడు వింటుండేవాడ్ని.

దొంగచాటుగా ఎందుకు?

మణిశర్మ: మా నాన్నగారికి నేను సంగీతరంగంలోకి రావడం అస్సలు ఇష్టంలేదు. ‘‘నువ్వేదైనా వేరే పని చేస్కో. పాకీ పని చేసినా నాకు సంతోషమే. నెలకు కచ్చితంగా ఇంత అమౌంట్ వస్తుందని గ్యారంటీ ఉంటుంది. సినిమా ఫీల్డ్‌లో ఆ గ్యారంటీ లేదు. ఇక్కడకు వచ్చి నాలాగా కష్టాలు పడొద్దు’’ అని చెప్పేవారు. ఎందుకంటే ఆయన ఇక్కడ చాలా కష్టాలు పడ్డారు. అయితే నాకు ఇక్కడే రాసిపెట్టి ఉంటే ఇంకేం చేస్తాం!

సంగీతరంగంలోకి రాకుంటే మీరు ఏం అయ్యేవారు?

మణిశర్మ: ఏం అయ్యేవాణ్ణీ కాదు. సంగీతం లేకుంటే నేను నయాపైసాకు పనికిరాను. ఆ విషయం నాకు తెలుసు.

సంగీతం కాకుండా అసలు మీకేం వచ్చు?

మణిశర్మ: క్రికెట్ బాగా వచ్చు. బ్యాటింగ్ బాగా చేసేవాణ్ని. నిన్న మొన్నటివరకూ కూడా ఆడేవాడ్ని. మా ట్రూప్‌తో కలిసి తెల్లవారు జామునే లేచి ఆడేవాణ్ణి. మా గోలకి చుట్టుపక్కల వాళ్లు కూడా ఇబ్బంది పడేవారు.

ఇంతకూ మీరు ఎంతవరకూ చదువుకున్నారు?

మణిశర్మ: ప్లస్ టూ డిస్‌కంటిన్యూ చేశా. కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేస్తూనే చదువులో మంచి మార్కులు తెచ్చుకునేవాణ్ణి. ఓ దశలో ఇక్కడ బిజీ అయిపోయి, ప్లస్ టూతో చదువుకు మంగళం పాడేశా.

ప్రేమలో ఎప్పుడైనా పడ్డారా?

మణిశర్మ: సినిమాలు చూడ్డానికే ఖాళీ ఉండేది కాదంటే, ఇక ప్రేమ కూడానా? ఓన్లీ ఐ లవ్ మ్యూజిక్.

యూత్ లైఫ్ మిస్సయ్యానని ఎప్పుడైనా ఫీలయ్యారా?

మణిశర్మ: చాలాసార్లు. సినిమాల్లో కొన్ని సీన్లు చూసినప్పుడు అరె... నేను ఇలాంటివి మిస్సయ్యానే అనిపిస్తుంది. కానీ, ఈ సంగీతంతోనే ఆ ఎంజాయ్‌మెంట్ పొందుతున్నాను.

మీరూ, ఏ ఆర్ రెహమాన్ చాలా క్లోజ్ ఫ్రెండ్సట...

మణిశర్మ: ఇద్దరం మ్యుజీషియన్స్‌గా చాలాకాలం కలిసి పనిచేశాం. ఇద్దరికీ ‘ఓయ్ ఓయ్’ అని పిలుచుకునేంత చనువు ఉంది. నేను కీరవాణిగారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేస్తున్నపుడు, నాకెప్పుడైనా కుదరకపోతే నా స్థానంలో రెహమాన్‌ని పంపిస్తుండేవాణ్ణి. ‘ఘరానా మొగుడు’లో ‘పండు పండు’ పాట ఉంది కదా. ఆ పాటకు నా స్థానంలో తను కీబోర్డ్ ప్లే చేశాడు. తనకు మొదటి నుంచీ పనే ప్రపంచం. వేరే ఆలోచనలు ఉండేవి కావు. మేం అప్పుడప్పుడైనా రిలాక్స్ కావడం కోసం అటూ ఇటూ బయటకు వెళ్లేవాళ్లం కానీ, తను మాత్రం కూర్చున్న చోటు నుంచి కదిలేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఒక నోట్స్ రాసుకుంటూ కూర్చునేవాడు. నిజంగా వాడు పని రాక్షసుడే.

మిమ్మల్ని కూడా పని రాక్షసుడు అంటారు...

మణిశర్మ: వాడితో పోల్చుకుంటే తక్కువే. అసలు మనిషనేవాడు ఎవ్వడూ వాడితో పోల్చుకోకూడదు. ఆ విషయంలో వాడు 100 శాతం అయితే, నేను 60 శాతం అంతే.

రెహమాన్‌తో ఇప్పటికీ మీ సాన్నిహిత్యం కొనసాగుతోందా?

మణిశర్మ: ఇద్దరం ఎంత బిజీగా ఉన్నా కూడా మా కమ్యూనికేషన్ చెడిపోలేదు. తను అప్పుడెలా ఉన్నాడో, ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఇప్పటికీ ఇద్దరం ఫోన్‌లో టచ్‌లో ఉంటాం. నేను మెసేజ్ పెడితే, ఎక్కడ ఉన్నా రిప్లయ్ ఇస్తాడు. అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటాం కూడా. లాస్ట్ ఇయర్ రంజాన్‌కి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. నాకే వెళ్లడం కుదర్లేదు. ఆ మధ్య ఎవరో ఇంటర్‌నెట్‌లో నా పాట ఒకటి ప్రస్తావిస్తూ, దీనికి ఫలానాది ఇన్‌స్పిరేషన్ అని కామెంట్ చేశారట. అది చూసిన రెహమాన్ ‘‘కమర్షియల్ మ్యూజిక్‌లో వెరైటీ చేయడం అంత ఈజీ కాదు. ఓ రకంగా చాలా నరకం. మణి ఎప్పుడూ తన మ్యూజిక్‌లో వెరైటీ చూపించడానికే ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో ఇలాంటి ఇన్‌స్పిరేషన్లు సహజం’’ అని స్వయంగా కౌంటరిచ్చాడట. ఈ విషయం నాకు వేరే సింగర్ ద్వారా తెలిసింది.

ఇతర సంగీత దర్శకులతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది?

మణిశర్మ: నేను అందరితోనూ రిలేషన్ మెయింటెయిన్ చేస్తాను. కోటి, కీరవాణి, వాసూరావు... ఇలా అందరితోనూ టచ్‌లో ఉంటాను. నేను బయట ఫంక్షన్స్‌లోనూ, మీడియాలోనూ కనబడను కానీ, తెరవెనుక అందరితోనూ రిలేషన్స్ అయితే ఉంటాయి.

మీరు బావుంటారు కదా. ఆర్టిస్టుగా చేయమని ఎవరూ అడగలేదా?

మణిశర్మ: చాలామంది అడిగారు. తెలియని పని చేయడం మనకు చేతకాదు. ఈ మధ్య ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కూడా వచ్చి యాక్ట్ చేయొచ్చుగా అనడిగాడు. నాకు వేషాలు వేయడం రాదని చెప్పాను. (నవ్వుతూ) ఈ పరిశ్రమలో వేషాలు వేయడం రాకపోవడం కూడా ఓ సమస్యే.

‘జై చిరంజీవ’ సినిమాలో ఓ పాటలో కనిపించారుగా?

మణిశర్మ: లాస్ వెగాస్ రమ్మని ఫ్లయిట్‌లో ఫస్ట్‌క్లాస్ టిక్కెట్ ఇస్తే ఏదో సరదాగా వెళ్లా. తీరా అక్కడకు వెళ్లాక నాతో యాక్ట్ చేయించారు. వారం రోజులు అక్కడే ఉంచేశారు. చిన్న షాట్ కోసం గంటలు గంటలు వెయిట్ చేయడం... అమ్మో నా వల్ల కాదు.

మీరెప్పుడూ పాటలు కూడా పాడినట్టు లేదు?

మణిశర్మ: నాకు చేతకురాని పనులు చేయనని ముందే చెప్పాను కదా. అయినా బేసికల్‌గా నేను సింగర్‌ని కాదు.

మీరు ఏ ఇన్‌స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేస్తారు?

మణిశర్మ: మొదట్లో మ్యాండలిన్ వాయించేవాణ్ణి. తర్వాత వయొలిన్ నేర్చుకున్నా. కొన్నాళ్లు గిటార్, బేస్ గిటార్ కూడా వాయించా. ఇవన్నీ గిట్టుబాటు కావడం లేదని కాంబో ఆర్గాన్ నేర్చుకున్నా.

ఇన్‌స్ట్రుమెంట్లకు బాగా ఎక్కువ ఖర్చు పెడతారట?

మణిశర్మ: నేను ఎక్కడెక్కడి నుంచో ఇన్‌స్ట్రుమెంట్లు కొని తెప్పిస్తుంటాను. ఒక్కోసారి నాకు ఇచ్చిన పారితోషికం కన్నా ఎక్కువ ఖర్చు పెడుతుంటాను.

చెన్నైలో మీ ఇంటిని, స్టూడియోను బాగా డిజైన్ చేయించుకున్నారట?

మణిశర్మ: అవును. అసలు మాలాంటి కాంపౌండ్ చెన్నైలోనే ఎవ్వరికీ ఉండదు. టి.నగర్‌లాంటి రద్దీ ప్లేస్‌లో అంత గ్రీనరీతో ఉండే ఇల్లు ఎక్కడా కనబడదు. థాయ్‌లాండ్‌లో మసాజ్ ప్లేసెస్‌లో ఉండే ఒక రకమైన ఆర్కిటెక్చర్‌తో నా కంపోజింగ్ రూమ్‌ను డిజైన్ చేయించుకున్నా. ఫారిన్ డిజైనర్స్‌తో స్కై లైట్‌తో... సౌండ్ ప్రూఫ్‌తో నా స్టూడియో డిజైన్ చేయించుకున్నా. రెహమాన్ అది చూసి ఇంప్రెస్ అయ్యి ఆ డిజైనర్‌తోనే తన స్టూడియో డిజైన్ చేయించుకున్నాడు. ఇప్పుడు చెన్నైలో ప్రాపర్టీస్ ఏమీ లేవు. హైదరాబాద్‌లో డాలర్ హిల్స్‌లో నాకు నచ్చిన రీతిలో ఇల్లు కట్టుకోవాలి. ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉంటున్నా.

ఒక పాట సష్టికి ఇన్‌స్పిరేషన్ ఎక్కడినుంచీ వస్తుంది?

మణిశర్మ: సందర్భాన్ని, సన్నివేశాన్ని మించిన గొప్ప ఇన్‌స్పిరేషన్ ఏముంటుంది? అవి సరిగ్గా కుదరకపోతే ఎంత గొప్ప పాట అయినా మరుగున పడిపోతుందనడానికి తాజా ఉదాహరణ ‘ఖలేజా’లోని ‘సదా శివ సన్యాసి’ పాట. దాని తయారీకి రెండు, మూడు నెలలు పట్టింది. తీరా ఆ పాట ఆ సిట్యుయేషన్‌కి సరిగ్గా సెట్ కాలేకపోయింది. సినిమా ఫ్లాప్ అయితే పాటలు వినబడవు. కానీ, ‘ఖలేజా’ పాటలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి.

హీరోల్లో మీకు క్లోజ్ ఎవరు?

మణిశర్మ: మహేశ్‌బాబు బాగా క్లోజ్. మా ఆలోచనలు ఒకరికొకరం పంచుకుంటుంటాం. నేను మహేశ్ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తానని బయట ప్రచారం కూడా ఉంది. అయితే అదేం కాదు. నేను అందరికీ మంచి మ్యూజిక్ ఇచ్చా. ఇస్తా. ఇస్తున్నాను. నా స్పెషాల్టీ ఏమిటంటే ఏ హీరోకైనా వాళ్ల బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా మ్యూజిక్ ఇస్తా. ఖుషీ, గుడుంబా శంకర్, బాలు... వాటిలో మ్యూజిక్ వినండి. పవన్‌కల్యాణ్ కోసమే తయారైనట్టుగా ఉంటాయి పాటలు. చిరంజీవిగారు, బాలకష్ణగారు... ఇలా ఏ హీరో అయినా వాళ్ల బాడీ లాంగ్వేజ్‌కి పెర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా మ్యూజిక్ ఇస్తా.

మీరు దాదాపుగా అందరు హీరోలతోనూ చేశారు. ఫలానా హీరోతో పనిచేయలేకపోయాననే ఫీలింగ్ ఏమైనా ఉందా?

మణిశర్మ: కమల్‌హాసన్‌తో పూర్తి స్థాయిలో పని చేయలేకపోయాను. అప్పట్లో ‘ద్రోహి’కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశా. అందులో పాటలుండవు. దానికి ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ దర్శకుడు. ఆ నేపథ్య సంగీతానికి విదేశాల్లో ప్రాచుర్యం లభించింది. ఫస్ట్ డాల్బీ సినిమా అదే.

హిందీలో ఎప్పుడూ ప్రయత్నించలేదా?

మణిశర్మ: అక్కడంతా ఓ డిఫరెంట్ బాల్‌గేమ్. నేను అక్కడకు వెళ్తే మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టాలి. నేను తెలుగులో ఇన్ని సినిమాలు చేశానన్నది వాళ్లకు అనవసరం కదా. అనుకోకుండా ఈ మధ్య ఓ హిందీ సినిమా చేసే అవకాశమొచ్చింది. నా స్నేహితుడైన హేమంత్ మధుకర్ ‘ముంబై 125 కిలోమీటర్లు’ పేరుతో ఓ సినిమా డెరైక్ట్ చేస్తున్నాడు. పాకిస్తానీ నటి వీణామాలిక్ ముఖ్యతార. దానికి నేనే స్వరకర్తను. అంతేకాదు హేమంత్ మదుకర్‌తో కలిసి నేను కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాను.

తెలుగులో కూడా చిత్ర నిర్మాణం చేస్తారా?

మణిశర్మ: అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలు నిర్మించాలని ఉంది.

డైరక్షన్ చేసే ఆలోచన ఉందా?

మణిశర్మ: అస్సలు లేదు.

రీ రికార్డింగ్‌లో మిమ్మల్ని అధిగమించేవారు ఎవ్వరూ లేరని అంటారు?

మణిశర్మ: అలా నేను అనుకోవడం లేదు. కానీ నేను చాలా ఇన్‌వాల్వ్ అయి చేస్తాను. అందుకే అందరూ నా రీరికార్డింగ్ బాగుందని అంటుంటారు.

మీ అబ్బాయి మహతి స్వరసాగర్ హీరోగా వస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి?

మణిశర్మ: అదేం లేదు. ప్రస్తుతానికి తనకు ఆ ఆసక్తి కూడా లేదు. ప్రస్తుతం కీబోర్డ్ ప్లేయర్‌గా బిజీగా ఉన్నాడు. నా దగ్గర, కీరవాణిగారు, ఇంకొంతమంది దగ్గర పని చేస్తున్నాడు. ‘ఘరానా మొగుడు’లోని ‘బంగారు కోడిపెట్ట’ పాటకి నేను కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేశా. ఆ పాటను ‘మగధీర’ కోసం రీమిక్స్ చేసినపుడు మా అబ్బాయి కీబోర్డ్ ప్లే చేశాడు.

మీకంటూ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా?

మణిశర్మ: అస్సలు ఏ లక్ష్యమంటూ లేని మనిషి ఎవరైనా ఉంటే... అది నేనే. నాకెప్పుడూ ఎలాంటి లక్ష్యాలు లేవు. ఎలాంటి లక్ష్యమూ లేకుండానే ఈ స్థాయికి వచ్చానంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. నాకు వచ్చిన పనిని అద్భుతంగా ఎలా చేయాలి, ఏ ఇన్‌స్ట్రుమెంట్‌ని ఎక్కడ నుంచీ తీసుకురావాలి, రీ-రికార్డింగ్‌కి ఎవరెవరు సూటబుల్... ఎప్పుడూ ఇదే ఆలోచన నాలో.

పరిశ్రమలో జయాపజయాల ప్రభావం అధికం. సక్సెస్ ఉంటే ఒకలాగా, ఫెయిల్యూర్‌లో ఒకలాగా ఇక్కడ బిహేవ్ చేస్తుంటారు. వీటికి అతీతంగా తామరాకు మీది నీటిబొట్టులాగా మీ మనసుని తీర్చిదిద్దుకున్నారా? లేక అన్నింటికీ ఫీల్ అవుతుంటారా?

మణిశర్మ: ‘భగవద్గీత’లో శ్రీకష్ణ పరమాత్ముడు స్థితప్రజ్ఞత గురించి చెప్పాడు. అలాంటి స్థితప్రజ్ఞతను అలవాటు చేస్తూ మా తల్లిదండ్రులు మమ్మల్ని చిన్నతనం నుంచీ అలా పెంచారు. విజయమొస్తే పొంగిపోవడం, అపజయాలకు క్రుంగిపోవడమంటూ ప్రత్యేకంగా లేదు. మనకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందనేది నేను నమ్మిన సిద్ధాంతం.

మానవ ప్రయత్నం అంటే చేస్తేనేగా అవకాశాలు వచ్చేవి...

మణిశర్మ: నేను ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వచ్చినవన్నీ నాకు నేనుగా అడిగినవి కాదు. టైమ్ అంతే. నేనెప్పుడూ విజయం వెనుక తిరిగింది లేదు. సక్సెస్సే నా వెనుక తిరిగింది. అప్పుడు నేను పట్టించుకోలేదు. నాకు సక్సెస్ వచ్చి అయిదేళ్లవుతోంది. ఈ రోజు తెలుస్తోంది దాని విలువ. నేను రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తాను. అది ఓకే. కానీ సినిమా హిట్టు కావాలి కదా. ‘శక్తి’కి నేను తక్కువ చేశానా? ‘తీన్‌మార్’లో తక్కువ చేశానా? ‘ఖలేజా’లో తక్కువ చేశానా? అందులో నీచమైన పాటలు చేశానా చెప్పండి. ఆ సినిమాలు సక్సెస్ కాలేదు అంతే. ఈ ఆలోచనలతోనే నేను ఉక్కిరిబిక్కిరైపోతున్నా. ‘ఖుషీ’ సినిమా టైమ్‌లో నేను చాలా బిజీ. నేను ఆ సినిమా చేయలేనని చెప్పా. అయినా నిర్మాత ఏఎమ్ రత్నం వెంటబడ్డారు. రోజుకి రెండు గంటలు కేటాయిస్తా. మూడు రోజుల్లో పాటలు పూర్తి చేసిస్తానని నిబంధన పెట్టా. అలాగే చేశా. సినిమా సూపర్‌డూపర్ హిట్. అహోరాత్రులు కష్టించి పనిచేసిన ‘మగరాజు’ ఫ్లాప్. దానిని నేనెంత కష్టాపడ్డానో నాకే తెలుసు. అలాగే ‘దేవీపుత్రుడు’ అంతే. దీన్నిబట్టి ఎవరైనా టైమ్‌ని నమ్మాల్సిందే. నీ టైమ్ బాగుంటే, నువ్వడక్కపోయినా వస్తారు. టైమ్ బాగోకపోతే నువ్వెంత చేస్తానన్నా నీ దగ్గరకు రారు. ఆ విషయం నాకు బాగా తెలుసు.

మ్యూజిక్ ఇండస్ట్రీ పరంగా హైదరాబాద్ ఓకేనా?

మణిశర్మ: హైదరాబాద్‌లో ఏం లేదండీ. మొత్తం చెన్నై నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. మనకు ఇక్కడ ఇద్దరే కీబోర్డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకరేమో కీరవాణి దగ్గర, ఇంకొకరు నా దగ్గర బిజీ. మరి మిగతా వాళ్ల పరిస్థితి? సరే... మిగతా మ్యుజీషియన్స్ విషయానికొస్తే చాలామందికి పని మీద శ్రద్ధ లేదు. చెన్నైలో అయితే 24 గంటలూ శ్రద్ధగా చేయడానికి సిద్ధంగా ఉండే మ్యుజీషియన్స్ బోలెడుమంది ఉన్నారు. ఇక కోరస్ సింగర్స్ విషయానికొస్తే అదో పెద్ద కథ. అందరూ చాలా బిజీ. ఒక్కొక్కరి కోసం వారం రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొంచెం పేరు రాగానే ఏదో చేసేయాలి, చాలా సంపాదించేయాలనే తాపత్రయం చాలా మందిలో. కెరీర్ కన్నా టీవీ షోస్, యాంకరింగ్స్, ఇతర షోస్‌లలో చాలా బిజీగా ఉంటున్నారు. కేరళలో రోడ్డుకో ఏసుదాస్ అన్నట్టుగా ఉంటారు. ఇక్కడ అంతమంది లేకపోయినా, ఉన్నంతలో మనకూ మంచి సింగర్స్ ఉన్నారు. హేమచంద్ర, కారుణ్య, శ్రావణ భార్గవి, మాళవిక, చైత్రలాంటి వాళ్లు బాగా పాడుతున్నారు. చెన్నైలో సంగీతానికి సంబంధించి ఏదో ఒక కళ కనిపిస్తూ ఉంటుంది. డిసెంబరు వచ్చిందంటే చాలు, ఎక్కడ చూసినా సంగీత సభలే. జనాలు తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడ మచ్చుకు అలాంటిది ఒక్క సభ కూడా జరగదు. ఎవ్వరికీ ఆసక్తి ఉన్నట్టే అనిపించదు.

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి స్థాయిలో మళ్లీ ఎవరైనా వస్తారంటారా?

మణిశర్మ: లేదు. నాకెవ్వరూ కనిపించడం లేదు. అలాంటివాళ్లు మళ్లీ వస్తారన్న ఆశా లేదు. సింగర్స్ అనే కాదు. కంపోజర్స్ పరిస్థితీ అంతే. కీరవాణిలాగా ఒక తెలుగు పాటను కంపోజ్ చేయడానికి కనుచూపు మేరలో ఎవ్వరూ లేరు. ఇవన్నీ ఎందుకు? అసలు ఇప్పటి తెలుగు పాటల్లో తెలుగుదనం ఎక్కడైనా ఉందా? అందుకు ఆస్కారం ఉందా? నిజంగా మాతో అలాంటివి ఎవరైనా చేయించుకుంటున్నారా చెప్పండి. గుణశేఖర్, క్రిష్‌లాంటి కొంతమంది దర్శకులు తప్ప పాటల గురించి, విలువల గురించి పట్టించుకునే వారెవ్వరూ లేరు.

గాయనీ గాయకులను తయారు చేసుకుంటున్నట్టుగా, మంచి మ్యుజీషియన్స్‌ను తయారు చేయలేమంటారా?

మణిశర్మ: అదీ కష్టమే. నేను ఒకప్పుడు తయారు చేసుకున్న మ్యుజీషియన్సే నాకే దొరకడం లేదు. పరిస్థితి అలా ఉంది మరి. రెండు, మూడు సినిమాలకు పనిచేసేసరికే వాళ్లకు రెక్కలొచ్చేస్తున్నాయి. మేం చాలా ఏళ్లు ఒకే దగ్గర పని చేసేవాళ్లం. నేను కీరవాణిగారి దగ్గర ఆయన తొలి సినిమా దగ్గరనుంచీ ‘అల్లరి ప్రియుడు’ వరకూ ఏకధాటిగా పని చేశా.

భవిష్యత్తులో తెలుగు సినిమా పాట ఎలా ఉంటుందనుకుంటున్నారు?

మణిశర్మ: అశ్వనీదత్, ఎమ్మెస్ రాజులాంటి అభిరుచిగల నిర్మాతలు లేకపోతే తెలుగుపాట ఇంకా దారుణమైన స్థితిలో ఉండేది. కొంతమంది నిర్మాతలకు కలకాలం నిలిచే పాటలు అవసరం లేదు. ఏదో ఆ క్షణానికి దడదడలాడించేయండి చాలు అంటారు. ఇలాంటి వాళ్లుంటే, ఇంకా కొత్తగా ఏం చేయగలం చెప్పండి. మంచి ఆలోచనలు కూడా ఇలాంటివారి తొందర వల్ల మొగ్గ దశలోనే రాలిపోతున్నాయి. ఇంకొంతమందైతే అస్సలు కథ కూడా చెప్పరు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్, సెకండ్ సాంగ్, ఇంటర్వెల్ ముందరి సాంగ్, ఇంటర్వెల్ తర్వాత సాంగ్, ప్రీ కై ్లమాక్స్ సాంగ్, కై ్లమాక్స్ సాంగ్... ఇలా కొలతలు చెప్పేసి, పాటలు అదిరిపోవాలండీ అని ఓ మాట పడేస్తారు. మనిషి ఎలా ఉంటాడో తెలీయకుండా కొలతలతో బట్టలు కుట్టినట్టుగా మేం పాటలు ఇచ్చేసేయాలి. ఇలాంటి స్థితిలో ఇక మంచి పాటలు ఎక్కడ నుంచీ ఉత్పన్నమవుతాయి. అయినా కూడా మేం మంచి పాటలే ఇవ్వగలుగుతున్నాం. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఇలానే ఉండవు. నాకైతే కచ్చితంగా మళ్లీ మంచి రోజులొస్తాయనే ఉంది. నేనుండగానే ఆ వైభవం చూస్తాననే నమ్మకమూ ఉంది. ఏదైనా సరే పరాకాష్టకు అంటూ వెళ్లిపోయాక, మళ్లీ కొత్త ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఆ రోజు కోసం అందరం ఎదురు చూడాలి.

సంగీతానికి రాళ్లు కరుగుతాయంటారు. మరి మీరేమంటారు?

మణిశర్మ: రాళ్లు కరుగుతాయో లేదో తెలీదు కానీ, రాళ్ల కన్నా గట్టిగా మారిపోయిన మనుషుల మనసులు మాత్రం స్పందిస్తున్నాయి. అంటే సంగీతానికి ఆ శక్తి ఉన్నట్లేగా.

కొంతమందిని నమ్మి మోసపోయా

ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటివి నేనస్సలు ఫాలో కాను. వాటితో కూర్చుంటే పని కాదు. ఇప్పుడు చాలామంది సింగర్స్‌తో అదే సమస్య. ‘ఇప్పుడే స్టూడియోలో అడుగుపెట్టాం... ఈ పల్లవి పాడాం...’ అని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పెడుతుంటారు. అదేంటో నాకస్సలు అర్థం కాదు. అసలు పనికన్నా ఈ కొసరు పనే ఎక్కువ డామినేట్ చేసేస్తోంది. తమాషా ఏంటంటే నేనింత వరకూ కంప్యూటర్ మౌసే ముట్టుకోలేదు. రికార్డిస్ట్‌కి ఇలా చేయ్, అలా చేయ్ అనిచెబుతుంటాను కానీ, నేను మాత్రం టచ్ చేయను.

దాదాపుగా మొత్తం దేశాలన్నీ తిరిగేశా. ఇప్పటికి మూడు పాస్‌పోర్ట్ బుక్స్ అయిపోయాయి. మొదట్లో బాలుగారి ఆర్కెస్ట్రాలో ఉంటూ అయిదేళ్లు చాలా దేశాలు వెళ్లా. నేను మొదట వెళ్లిన విదేశం సింగపూర్. మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కొనుక్కోవడానికి నా డబ్బులతోనే వెళ్లా. ఐ లవ్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్. దేశాలన్నీ తిరుగుతూ ఉంటే అదో హాయి.

రోజుకో సినిమా తప్పక చూస్తా. ఉదయం రికార్డింగ్ థియేటర్‌కి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేస్తా. లంచ్ తర్వాత నా హోమ్ థియేటర్‌కి వెళ్లి సగం సినిమా చూసి ఓ ఇరవై నిమిషాలు కునుకు తీసి లేచాక మిగతా సినిమా చూసి, రికార్డింగ్ థియేటర్‌కెళ్తా. ఎక్కువగా ఇంగ్లీషు సినిమాలే చూస్తుంటా.

చెన్నైలో ఉండగా బయట థియేటర్లకు వెళ్లడం అస్సలు కుదిరేది కాదు. హైదరాబాద్ వచ్చాక ఫ్యామిలీతో కలిసి సరదాగా థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం చాలా థ్రిల్‌గా అనిపిస్తోంది.

నేను కోపిష్టిని కాదు. నాదంతా అలా మెరుపులా వచ్చి వెళ్లిపోయే కోపం. ఏదైనా పర్‌ఫెక్ట్‌గా చేయాలని కోరుకుంటాను. ఎవరైనా తప్పు చేస్తే మొదట వార్నింగిస్తా. అది మళ్లీ మళ్లీ రిపీటైతే, నాకే కాదు ఎవ్వరికైనా కోపం వస్తుంది. ఆ తర్వాత మళ్లీ జోక్ చెప్పి వాతావరణాన్ని కూల్ చేసేస్తాను.

మనీ మేనేజ్‌మెంట్‌లో చాలా పూర్. చెన్నైలో బిజీగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కొన్నిచోట్ల పెట్టుబడులు చేసి బాగా నష్టపోయా. హైదరాబాద్‌లో మంచి బూమ్ ఉన్నప్పుడు అప్పులు చేసి మరీ స్థలాలు కొన్నా. కొంతమంది స్నేహితుల్ని నమ్మి కూడా మోసపోయా. నా సక్సెస్ రేట్‌ని చూసి బాగా సంపాదించి ఉంటాననుకుంటారు. నిజమే. కానీ అంత లేదు. ఇంతకాలం డబ్బు గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మాత్రం ఆలోచించాల్సి వస్తోంది.

ప్రస్తుతం మహమ్మద్ రఫీ పాటలు ఎక్కువ వింటున్నా. మా ఆవిడ రఫీకి వీరాభిమాని. మూడు, నాలుగేళ్ల నుంచీ నేను కూడా బాగా వింటున్నా. ఆ పాటలు వింటుంటే ఇంకేమీ వినబుద్దేయడం లేదు. రఫీ కన్నా ముందు మా గురువుగారు ఇళయరాజా మ్యూజిక్ ఎక్కువ వినేవాణ్ణి.

ప్రస్తుతం సంగీత దర్శకుని స్థానం...

సంగీత దర్శకుణ్ణి ఓ కింగ్‌లాగా చూసిన కాలాన్ని చూశాను. మా గురువు ఇళయరాజా కోసం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఎంతమంది దర్శక నిర్మాతలు పడిగాపులు కాశారో ఈ కళ్లతో చూశాను. ఆయన ఒక్క క్షణం అపాయింట్‌మెంట్ ఇచ్చినా చాలనుకునేవారు. అంతటి వైభవం, ప్రాభవం చూసిన కళ్లతోనే ఇప్పుడు చాలా దారుణాలు చూడాల్సి వస్తోంది. సంగీత దర్శకునికి ఉన్న హోదాని, గౌరవాన్ని కొత్తగా వచ్చిన కొంతమంది సర్వనాశనం చేసి పారేస్తున్నారు. అవకాశాల కోసం వెంపర్లాటే తప్ప, ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామన్న తపనే కనిపించడం లేదు. పాటను ముక్కలు ముక్కలు చేసి సష్టిస్తున్నారు. పల్లవిని ఒకసారి, బీజియాన్ని ఇంకొకసారి, చరణాల్ని మరొకసారి... ఇలా ముక్కలు ముక్కలుగా పంపిస్తే ఇక ఆ పాట పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలా నేనెప్పుడూ చేయలేదు. ఎంత పని ఒత్తిడి ఉన్నా రాత్రింబవళ్లూ పని చేసి అవుట్‌పుట్ ఇచ్చేవాణ్ణి. నేను చేసిన 150 సినిమాల్లో నావల్ల ఒక్క రోజు ఆలస్యమైన సినిమా ఏదీ లేదు. నేనీ రోజు కరాఖండీగా చెబుతున్నా. నాకు డబ్బుతో పాటు మర్యాద కూడా కావాలి. మర్యాద దొరికే చోట ఎలాగైనా పనిచేయడానికి నేను సిద్ధం. ఎప్పటికీ ఈ మర్యాదను మాత్రం వదులుకోలేను.

వైరాగ్యమే ఆధ్యాత్మికతకు మార్గం

 
నిత్య సందేశం
మనిషి వైరాగ్యాన్ని పెంపొందించుకోకపోతే మాయ నుండి ఎప్పటికీ బంధవిముక్తుడు కాలేడు, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టలేడు... అని శాస్త్రం చెబుతోంది. అంటే ఇంటినీ, సంసారాన్నీ వదలిపెట్టి, ప్రాపంచిక విషయాలన్నింటితోనూ తెగతెంపులు చేసుకుని సన్యాసి జీవితం గడపమని కాదు. అలా బలవంతంగా తెచ్చి పెట్టుకున్న వైరాగ్యం సరైనది కూడా కాదు. మనం బాహ్యంగా అన్నింటితోనూ బంధాలను తెంచుకున్నప్పటికీ లోలోపల మనస్సు వాటిని అంటిపెట్టుకునే ఉంటుంది.

గృహస్థుగా మనం అనేక విషయాలను చూసుకోవాలి. కుటుంబాన్ని పోషించుకోవాలి. పిల్లల చదువులు, వాళ్ల కోరికలు, ఇతర అవసరాలూ తీర్చాలి. ఈ అవసరాల కోసం డబ్బు సంపాదించడం తప్పనిసరి. గృహస్థాశ్రమంలో సంపదలూ, ప్రాపంచిక బంధాలూ అనివార్యం. అయితే ప్రతిదీ మన ధర్మం, మన కర్తవ్యం అనుకుని వాటిపట్ల ఎలాంటి రాగద్వేషాలూ లేకుండా జీవితంలో అన్నిపనులూ చేసుకుపోగలిగితే ఒకవిధంగా ఈ ప్రాపంచిక బంధాల నుండి బయటపడినట్లే.

మన అధీనంలో గల ప్రతి ఒక్కటీ ఆ పరమాత్మ మనకు అప్పగించిన పవిత్రబాధ్యత అనీ, మనం వాటికి ధర్మకర్తలమనీ, కేవలం మనం ఆ బాధ్యతలను మాత్రమే నెరవేరుస్తున్నామనీ అనుకోవాలి. నిజానికి వైరాగ్యమనేది ఒక మానసిక స్థితి. కనిపించేవన్నీ భ్రమలనీ, అంతా శాశ్వతమనీ, బుద్బుద ప్రాయమనీ తెలియచేస్తూ ఎటువంటి బంధాలనూ ఏర్పరచుకోనివ్వదు. వాటిపై వ్యామోహం పెంచుకోనివ్వదు. అప్పుడు శాశ్వతమైనదీ, స్థిరమైనదీ అయిన సత్యతత్వం పైనే మన దృష్టి కేంద్రీకరించి ఉంటుంది. మనం రాగద్వేషాలకు అతీతులమై ఉంటాం.

అటువంటి మానసికస్థితిని సాధించిన తర్వాత మనకు కోరికలుండవు. మనకున్న దానితోనే సంతృప్తి చెందుతాం. కోరికలు అంతమైతే మనలో సంస్కారాలు ఏర్పడ్డం ఆగిపోతాయి. ఇక ఇప్పుడు ఉన్నవల్లా ఇంతకుముందే ఏర్పడిన సంస్కారాలు. వీటిని మన జీవితకాలంలోనే పోగొట్టుకోగలుగుతాం. ఇందుకు ప్రకృతికూడా సహకరిస్తుంది. అంటే, మిగిలి ఉన్న సంస్కారాలను అనుభవించడానికి తగిన పరిస్థితులను కల్పించి, తద్వారా మన కారణ శరీరంలోని ఆలోచనల, చర్యల ముద్రలను తుడిచివేస్తుంది. ఈ పొరలు అనబడే ఆవరణలు కరిగిపోతే మనం సూక్ష్మతరమైన ఉనికిని పొందుతాం. మనకు అన్నీ ఉన్నా, అందులో మనం చాలావాటిని ఉపయోగించుకుంటున్నా వాటిపై అనుబంధం, ఆపేక్ష లేనప్పుడు ఈ ప్రపంచాన్ని నిజంగా త్యజించినట్లే.

అప్పుడు మనం ఇల్లు వదిలిపెట్టి, ఏ అడవికో పోయి తపస్సు చేసుకోవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం ఒకదాని సరసన ఇంకొకటి సమాన కాంతిలో వెలిగిపోతూంటే ఆ కాంతిలో హాయిగా ముందుకు సాగిపోవచ్చు. ఈ స్థితికి చేరాలంటే మనకు సంబంధించిన వాటన్నింటిపైనా ఎటువంటి వ్యామోహం పెంచుకోకూడదు. మనమీద పట్టు కలిగి ఉన్న వాటి నుండి మనం విముక్తులం కావడమే నిజమైన వైరాగ్యం. వైరాగ్యమే ఆధ్యాత్మికతకు మార్గం.

- చోడిశెట్టి శ్రీనివాసరావు

చిన్న వయసులోనే పళ్లు వదులవుతున్నాయి..? (డాక్టర్‌ని అడగండి - డెంటల్)

 
 
నా వయసు 26. నా ముందుపన్ను ఒకటి ఈ మధ్య సడన్‌గా వదులయినట్లు అనిపించింది. డాక్టర్‌ను కలిస్తే ఎక్స్‌రే తీసి, ఈ జబ్బు మూలంగా భవిష్యత్తులో అన్ని పళ్లూ ఊడిపోతాయన్నారు. వదులైన పన్నును తొలగించేశారు. తీసేసిన పన్ను స్థానంలో కొత్త పన్నును పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందేమోనని భయంగా ఉంది.
- పి. పవిత్ర, అనకాపల్లి


చిన్నవయస్సులో పళ్లు వదులైపోవడానికి చిగుళ్ల జబ్బులే కారణం. ఈ జబ్బుల వల్ల చిన్న వయసులోనే పంటికి ఆధారంగా ఉన్న ఎముక పాడై, కొన్ని పళ్లు వదులైపోతుంటాయి. వీటిని సరైన సమయంలో గుర్తించగలిగితే చిన్నవయసులో పళ్లు పోగొట్టుకోకుండా కాపాడుకోవచ్చు. కొన్ని ప్రత్యేక చికిత్సావిధానాల ద్వారా జబ్బు ముదరకుండా చేయచ్చు. దురదృష్టవశాత్తూ ఇటువంటి జబ్బుల్లో నొప్పి, బాధ లేకపోవడం వల్ల దీనిని తమకు తాముగా గుర్తించే అవకాశం తక్కువ. వీటిల్లో నిర్లక్ష్యంతోపాటుగా వంశపారర పర్యమైన లేదా జన్యుపరమైన కారణాలు కూడా ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా చిన్న వయసులోనే పళ్లూడిపోయిన చరిత్ర ఉంటే పిల్లలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా డెంటిస్ట్‌ను కలుస్తూ ఎక్స్‌రేల సాయంతో వ్యాధిని సరైన సమయంలో గుర్తించగలిగితే చికిత్స ఎంతో సులువైపోతుంది. మీరు ఒక పన్ను పోగొట్టుకున్నారు కాబట్టి నోటిలోని మిగిలిన పళ్లు కూడా వదులైపోకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఊడిన పంటిస్థానంలో కృత్రిమ దంతాన్ని అమర్చడం గురించి భయపడాల్సిన పనిలేదు. కృత్రిమ దంతాల అమరికలో మంచి టెక్నాలజీ అందుబాటులో ఉంది. కంగారు పడాల్సిన పనిలేదు. మంచి స్పెషలిస్టు దగ్గర చికిత్స తీసుకోండి.

మా పాపకు ఐదేళ్లు. పంటినొప్పితో తరచు బాధపడుతుంటుంది. చిట్కావైద్యం చేస్తున్నాం కాని, ప్రయోజనం లేదు. ఏం చేయమంటారో చెప్పగలరు.
- రమణకుమారి, గుంటూరు


చాలామంది తల్లిదండ్రులు పిల్లల పాలపళ్లపై శ్రద్ధపెట్టడం లేదు. ‘ఎలాగూ ఊడిపోతాయి కదా, వచ్చే శాశ్వత దంతాలను జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందిలే, పాలపళ్లకు చికిత్స అవసరం లేదులే’ అనుకుంటారు. కాని, పాలపళ్లు ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వతదంతాలు ఆరోగ్యంగా వస్తాయి. వీటిని ఊడిపోయే వయసు వచ్చేదాకా కాపాడుకోవాలి. పళ్లలో రంధ్రాలుంటే పిల్లలు నమిలి తినడానికి చాలా ఇబ్బందిపడతారు. దానిమూలంగా పౌష్టికాహార లోపాలు వస్తాయి. శారీరక పెరుగుదలలో సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు వెంటనే చికిత్స చేయించండి. దంత సమస్యలు మందులతో నయం కావు.

ఎగ్‌స్ట్రార్డినరీ..........................వంటలు

 
 
గుడ్డును హిందీలో ‘అండ’ అంటారని మనందరికీ తెలుసు.
తెలుగులో ‘అండ’ అంటే ఆదరవు అని కూడా మనకు బాగా తెలుసు.
మనకు ఇంకా బాగా తెలియాల్సిన విషయం ఏంటంటే...
‘అండ’ అలియాస్ ‘గుడ్డు’ అలియాస్ ‘ఎగ్’
మన ఆరోగ్యానికి ఎప్పుడూ అండ దండగా ఉంటుంది.
అంతేనా!
బోలెడు టే స్ట్‌ను కూడా టైమ్ వేస్ట్ కాకుండా ఇచ్చేస్తుంది.
ఈ రోజే వేడి వేడిగా ఇలా వండండి అలా వడ్డించండి.
వెరీ గుడ్డు అనిపించుకోండి.


థాయ్ పంప్‌కిన్ కస్టర్డ్

కావలసినవి
చిన్న గుమ్మడికాయ - 1
కొబ్బరి పాలు - 1
గుడ్లు - 4
బెల్లం తరుగు - కప్పు
ఉప్పు - అర టీ స్పూన్
వెనీలా ఎసెన్స్ - టీ స్పూన్

తయారి
గుమ్మడికాయ పైన తొడిమ దగ్గర గుండ్రంగా కట్ చేసి, స్పూన్‌తో లోపలి గింజలను తీసేయాలి.

ఒక గిన్నెలో గుడ్లలోని సొన వేసి, బాగా గిలకొట్టాలి.

గుడ్ల మిశ్రమంలో కొబ్బరిపాలు పోసి, కలపాలి. దీంట్లోనే పంచదార, ఉప్పు, వెనిల్లా ఎసెన్స్ వేసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని గుమ్మడికాయలో పోయాలి. ఆవిరి మీద 45 నిమిషాలు ఉడికించి, తీయాలి.

సర్వ్ చేసేముందు కట్ చేసి, నచ్చిన పండ్లతో గార్నిష్ చేసుకోవాలి.

పుడ్డింగ్

కావలసినవి
గుడ్లు - 6, పంచదార - 6 టీ స్పూన్లు
ఏలకుల పొడి - టీ స్పూన్
చిక్కనిపాలు - గ్లాసు

తయారి
గిన్నెలో గుడ్లలోని సొన వేసి బాగా గిలకొట్టాలి.

దీంట్లో పంచదార, ఏలకుల పొడి వేసి బాగా కాలిపి ఒక టిఫిన్ బాక్స్‌లో పోసి మూత పెట్టాలి.

మరో పెద్ద గిన్నెలో అడుగున నీళ్లు పోసి, స్టౌ మీద పెట్టి మరిగించాలి. మరుగుతున్న నీళ్ల మీద టిఫిన్ బాక్స్‌ను పెట్టి, స్టౌ సిమ్ చేయాలి.

పదినిమిషాల సేపు ఉడికిన తర్వాత బయటకు తీయాలి. మూత తీసి ప్లేట్‌లోకి బోర్లించాలి.

మృదువుగా తయారైన పుడ్డింగ్ మీద నచ్చిన గార్నిష్ చేసుకోవాలి.

జుగల్‌బందీ

కావలసినవి
ఉడికించిన పచ్చ బఠాణీలు - అర కప్పు
ఉడికించిన క్యారెట్ ముక్కలు - అర కప్పు
ఉడికించిన గుడ్ల ముక్కలు (తెల్లసొన) - కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
కారం - కొద్దిగా
గ రం మసాలా - పావు టీ స్పూన్
మైదా - తగినంత

తయారి
స్టౌ పై పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లిపేస్ట్, కారం, గరం మసాలా వేసి 5 నిమిషాలు వేయించాలి. దీంట్లో గుడ్ల ముక్కలను వేసి 2 నిమిషాలు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారనివ్వాలి.

మైదాను ముద్దలా కలపాలి. అచ్చు పరికరంలో కొద్దిగా పిండి పెట్టి, వత్తి, కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇవి చిన్న చిన్న కప్పుల మాదిరిగా వస్తాయి. వీటిలో గుడ్లముక్కలు అందంగా సర్దుకొని, తయారుచేసుకున్న పచ్చిబఠాణీల మిశ్రమం వేసి స్టఫ్ చే సి, సర్వ్ చేయాలి.

స్పినాచ్ అండ్ కాటేజ్ చీజ్ రౌల్డ్

కావలసినవి
గుడ్లు - 4,
కాటేజ్ చీజ్ తరుగు - కప్పు
పాలు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - పావు టీ స్పూన్
మిరియాలపొడి - పావు టీ స్పూన్
పాలకూర తరుగు - కప్పు
క్యాప్సికమ్ (రెడ్ అండ్ ఎల్లో) తరుగు - అర కప్పు
పాలమీగడ - ముప్పావు కప్పు
చీజ్ తరుగు - అర కప్పు
ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత

తయారి
ముందుగా అవెన్‌ను 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి, పాన్ అడుగున బటర్‌పేపర్ సెట్ చేయాలి.

గిన్నెలో గుడ్ల సొన, పాలు, ఉప్పు, మిరియాల పోడి వేసి కలపాలి. దీంట్లో కాటేజ్ చీజ్ తరుగు కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేడెక్కిన పాన్‌లో పోసి 20 నిమిషాలు బేక్ చేయాలి.

స్టౌ పై మరొక పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి, వెలుల్లి వేగిన తర్వాత క్యాప్సికమ్ తరుగు వేసి ఉడికించాలి. తర్వాత పాలకూర తరుగు వేసి కలపాలి. కూర ఉడికిన తర్వాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. నీరంతా పోయే వరకు ఉడికించాలి.

అవెన్ నుంచి పాన్‌ను బయటకు తీసి పైనంతా పాలకూర, క్యాప్సికమ్ మిశ్రమాన్ని పరచాలి.

కావలసిన సైజులో పొడవుగా కట్ చేసి, చుట్టాలి.


ఇలా అన్నింటిని రోల్ చేసిన తర్వాత మరో పది నిమిషాలు అవెన్‌లో బేక్ చేసి, తీసి, సర్వ్ చేయాలి.

నిల్వ పచ్చడి

కావలసినవి
కోడిగుడ్లు - 12, కారం - పావు కేజీ, ఉప్పు - 200 గ్రా.
పసుపు - 2 టీ స్పూన్లు, మెంతులు - టీ స్పూన్
ఆవాలు - టీ స్పూన్, జీలకర్ర - టీ స్పూన్
ఎండుమిర్చి - 6, చింతపండు గుజ్జు - పావు కేజీ
నూనె - పావు కేజీ, వెల్లుల్లి - 2 పాయలు

తయారి
కోడిగుడ్లను ఉడకబెట్టి, పై పొట్టు తీయాలి.

గుడ్లను నూనెలో వేయించి, పక్కన పెట్టాలి.

ఒక గిన్నెలో కారం, పసుపు, ఉప్పు, చింతపండు పేస్ట్, ఆవాలు, మెంతులు, పిండి, నూనె వేసి కలపాలి. దీనిలో గుడ్లు వేసి కలపాలి.

మిగిలిన నూనెను వేడి చేసి, ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు వేసి పోపు పెట్టాలి.

వెల్లుల్లి పాయల పొట్టు ఒలిచి, రెబ్బలను పచ్చడిపైన గార్నిష్ చేయాలి.

రసమలై

కావలసినవి
పాలు(వెన్నశాతం ఉన్నవి) - లీటరు
పాలపొడి - 2 కప్పులు
గుడ్డు - 1
పంచదార - 100 గ్రా.
బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ - గార్నిష్ కోసం తగినన్ని

తయారి
ఒక వెడల్పాటి గిన్నెలో పాలు పోసి, అర లీటర్ అయ్యేంతవరకు సన్నని సెగ మీద మరిగించాలి.

మరొక గిన్నెలో గుడ్డు సొన వేసి, గిలకొట్టాలి. ఇందు లో పాల పొడి నెమ్మదిగా పోస్తూ బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు కట్టి, మరుగుతున్న పాలలో వేయాలి. కొన్ని నిమిషాలసేపు వేడి మీద ఉంచాలి.

మంట తీసేసి, చల్లారనివ్వాలి.

సర్వ్ చేసే ముందు వేయించిన బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో గార్నిష్ చేయాలి.

చిట్కాలు
గుడ్డు తాజాగా ఉన్నదా లేదా పరీక్షించడానికి నీళ్లలో వేసి చూడాలి. గుడ్డు అడుగు (వెడల్పాటి) భాగం నీళ్లలో ఉంటే తాజాగా ఉన్నదని నిర్ధారించుకోవాలి.

కోడిగుడ్డును తడిపాత్రలో పగలకొట్టి, వాడుకున్న తర్వాత శుభ్రపరచడం తేలికవుతుంది.

గుడ్డును ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు నీళ్లలో వేస్తే, త్వరగా ఉడుకుతుంది.

గుడ్డు ఉడికి, వేడిగా ఉన్నప్పుడే చల్లటి నీళ్లలో వే స్తే పై పెంకు త్వరగా వ స్తుంది. లోపలి పసుపు సొన రంగుమారకుండా ఉంటుంది.

ఉడకబెట్టిన గుడ్డు నిల్వ ఉండాలంటే చల్లటి నీటిలో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.

ఆమ్లెట్ మృదువుగా, రుచిగా రావాలంటే గుడ్డు సొనను గిలకొట్టేటప్పుడు స్పూన్ పాలు కలపాలి.

పెనంపై వెన్నరాసి, వేడెక్కెక ఆమ్లెట్ వస్తే పెనానికి అంటుకోదు.

గుడ్డు వాడకుండా పుడ్డింగ్ చేయాలంటే గుడ్డుకు బదులుగా పాలు, జెలటిన్ కలుపుకోవచ్చు.

గుడ్డు చేజారి కిందపడి పగిలినప్పుడు దాని మీద ఉప్పు చల్లి, కొద్దిసేపు వదిలేయాలి. మిశ్రమం గట్టిపడ్డాక టిష్యూపేపర్ లేదా గుడ్డతో తీసేయాలి.ఆ తర్వాత కొద్దిగా వెనిగర్ చల్లి తడిగడ్డతో తుడవాలి. ఇలా చేస్తే దుర్వాసన రాదు.
నీ పొరుగువారిని నేను ప్రేమిస్తా. ఇంతకూ నీ పొరుగు వారెవరో నీకు తెలుసా?
- మదర్ థెరిసా

అందమె ఆనందం

 
టీ స్పూన్ బటర్‌లో టీ స్పూన్ నీరు కలిపి ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.

ఈ కష్టాలు ఏపాటివి? -నిత్య సందేశం

 
 
ధర్మరాజు జూదమాడి, రాజ్యాన్ని కోల్పోయి, కట్టుబట్టలతో అరణ్యంలోకి ప్రవేశించాడు తల్లీ, తమ్ములతో, ధర్మపత్నితో. తననుంచి తన వారంతా ఎన్నో కష్టాలను అనుభ వించవలసి వచ్చిందని బాధపడ్డాడు. ఒకనాడు ఆయన దగ్గరకు బృహదశ్వుడనే ముని వచ్చాడు. ఆయనతో ధర్మరాజు ‘‘ఓ మునీంద్రా! రాజ్యాన్ని కోల్పోయి, బంధువులను వీడి, వనములలో మృగాలతో కలిసి మాలాగా కష్టించిన పాపాత్ములు ఏ కాలంలోనైనా ఉన్నారా?’ అని ప్రశ్నించాడు వారి కష్టాలన్నింటినీ ఏకరువు పెట్టి.

బృహదశ్వుడు చిరునవ్వు నవ్వి, తన వారందరూ ఉండి ఒకరికొకరు తోడ్పడుతూ ఉన్న ఈ ధర్మరాజు పడుతున్న కష్టాలు ఏ పాటివి అని మనసులో అనుకుని ఇలా అన్నాడు- ‘‘ధర్మరాజా! విను... నిషధదేశానికి రాజైన నలుడనేవాడు తన రాజ్యాన్ని జూదంలో ఓడి, భార్యతోకలసి అడవిలో అనేక బాధలు పడ్డాడు. అప్పుడు వానికి బంధువులుగాని, అన్నదమ్ములుగాని, భృత్యులుగాని ఎవరూ తోడులేరు. నీవు అట్లా కాదు. నీ వెంట మహాబలపరాక్రమశాలురైన తమ్ములు, బ్రహ్మర్షులైన విప్రోత్తములు, భృత్యులు, రథాలు ఈ అరణ్యవాసంలో నీకు తోడుగా ఉన్నాయి. ఇక నీకు బాధ దేనికి?’’అన్నాడు. (అరణ్యపర్వం: ప్రథమాశ్వాసం).

అప్పుడు ధర్మరాజు ఆ విషయమేమిటో వివరంగా చెప్పమని మునీశ్వరుని కోరాడు. బృహదశ్వుడు ఇలా చెప్పాడు- పూర్వం నిషధ దేశాన్ని నలుడనే రాజు పాలించేవాడు. అతడు విదర్భరాజు కూతురైన దమయంతిని స్వయంవరంద్వారా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత శనిప్రభావంతో జూదమాడి సర్వసంపదలను, రాజ్యాన్ని కోల్పోయి భార్యయైన దమయంతితో సహా అడ వికెళ్లాడు. నిద్రాహారాలు లేవతనికి. చివరకు కట్టుకోవడానికి వస్త్రం కూడా కరువైంది. దాంతో తనపక్కనే నిద్రిస్తున్న దమయంతి చీరను సగం చించుకుని దాన్ని కట్టుకుని దమయంతిని వదిలి అడవిలో ఇంకో దిక్కుకు వెళ్లిపోయాడు.

దమయంతి లేచి తన భర్తను వెదుకుతూ ముళ్లను తొక్కుతూ, సూదుల్లాంటి పదునైన రాళ్లపై నడుస్తూ పోయి పోయి ఒక కొండ చిలువకు చిక్కింది. ఎవడో ఒక కిరాతుడు ఆ కొండచిలువను చంపి దమయంతిని కాపాడాడు. అయితే వాడు దమయంతి రూపలావణ్యాలను చూసి ఆమెను కామించాడు. అయితే దమయంతి పాతివ్రత్య ప్రభావం వల్ల వాడామెను తాకలేకపోయాడు. దమయంతి తన నడకను కొనసాగించి చేదిరాజ్యాన్ని పాలించే సుబాహుడనే రాజు వద్దకెళ్లి రాజమాత దృష్టిలో పడింది. రాజమాత తన కూతురు సునందకు ఆమెను సైరంధ్రిగా నియమించింది.

ఇంకోవైపు నలుడు అడవిలో కార్చిచ్చులో చిక్కుకున్న కర్కోటకుడనే విషసర్పాన్ని రక్షించి ఆ కర్కోటకుడి కాటుకు గురయ్యాడు. ఆ విషప్రభావంతో నలుడు తన సుందరరూపాన్ని కోల్పోయాడు- అని చెబుతూ బృహదశ్వ మహర్షి నలదమయంతులిద్దరూ విడిపోయి, ఒకరి అండ మరొకరికి లేక ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారో పూసగుచ్చినట్లు వివరించాడు ధర్మరాజుకు. ఆ కథ విన్న ధర్మరాజుకు దుఃఖభారం తగ్గింది. మనసు తేలికపడింది. కర్తవ్యం బోధపడింది.

- రాచమడుగు శ్రీనివాసులు