all

Thursday, January 24, 2013

వైరాగ్యమే ఆధ్యాత్మికతకు మార్గం

 
నిత్య సందేశం
మనిషి వైరాగ్యాన్ని పెంపొందించుకోకపోతే మాయ నుండి ఎప్పటికీ బంధవిముక్తుడు కాలేడు, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టలేడు... అని శాస్త్రం చెబుతోంది. అంటే ఇంటినీ, సంసారాన్నీ వదలిపెట్టి, ప్రాపంచిక విషయాలన్నింటితోనూ తెగతెంపులు చేసుకుని సన్యాసి జీవితం గడపమని కాదు. అలా బలవంతంగా తెచ్చి పెట్టుకున్న వైరాగ్యం సరైనది కూడా కాదు. మనం బాహ్యంగా అన్నింటితోనూ బంధాలను తెంచుకున్నప్పటికీ లోలోపల మనస్సు వాటిని అంటిపెట్టుకునే ఉంటుంది.

గృహస్థుగా మనం అనేక విషయాలను చూసుకోవాలి. కుటుంబాన్ని పోషించుకోవాలి. పిల్లల చదువులు, వాళ్ల కోరికలు, ఇతర అవసరాలూ తీర్చాలి. ఈ అవసరాల కోసం డబ్బు సంపాదించడం తప్పనిసరి. గృహస్థాశ్రమంలో సంపదలూ, ప్రాపంచిక బంధాలూ అనివార్యం. అయితే ప్రతిదీ మన ధర్మం, మన కర్తవ్యం అనుకుని వాటిపట్ల ఎలాంటి రాగద్వేషాలూ లేకుండా జీవితంలో అన్నిపనులూ చేసుకుపోగలిగితే ఒకవిధంగా ఈ ప్రాపంచిక బంధాల నుండి బయటపడినట్లే.

మన అధీనంలో గల ప్రతి ఒక్కటీ ఆ పరమాత్మ మనకు అప్పగించిన పవిత్రబాధ్యత అనీ, మనం వాటికి ధర్మకర్తలమనీ, కేవలం మనం ఆ బాధ్యతలను మాత్రమే నెరవేరుస్తున్నామనీ అనుకోవాలి. నిజానికి వైరాగ్యమనేది ఒక మానసిక స్థితి. కనిపించేవన్నీ భ్రమలనీ, అంతా శాశ్వతమనీ, బుద్బుద ప్రాయమనీ తెలియచేస్తూ ఎటువంటి బంధాలనూ ఏర్పరచుకోనివ్వదు. వాటిపై వ్యామోహం పెంచుకోనివ్వదు. అప్పుడు శాశ్వతమైనదీ, స్థిరమైనదీ అయిన సత్యతత్వం పైనే మన దృష్టి కేంద్రీకరించి ఉంటుంది. మనం రాగద్వేషాలకు అతీతులమై ఉంటాం.

అటువంటి మానసికస్థితిని సాధించిన తర్వాత మనకు కోరికలుండవు. మనకున్న దానితోనే సంతృప్తి చెందుతాం. కోరికలు అంతమైతే మనలో సంస్కారాలు ఏర్పడ్డం ఆగిపోతాయి. ఇక ఇప్పుడు ఉన్నవల్లా ఇంతకుముందే ఏర్పడిన సంస్కారాలు. వీటిని మన జీవితకాలంలోనే పోగొట్టుకోగలుగుతాం. ఇందుకు ప్రకృతికూడా సహకరిస్తుంది. అంటే, మిగిలి ఉన్న సంస్కారాలను అనుభవించడానికి తగిన పరిస్థితులను కల్పించి, తద్వారా మన కారణ శరీరంలోని ఆలోచనల, చర్యల ముద్రలను తుడిచివేస్తుంది. ఈ పొరలు అనబడే ఆవరణలు కరిగిపోతే మనం సూక్ష్మతరమైన ఉనికిని పొందుతాం. మనకు అన్నీ ఉన్నా, అందులో మనం చాలావాటిని ఉపయోగించుకుంటున్నా వాటిపై అనుబంధం, ఆపేక్ష లేనప్పుడు ఈ ప్రపంచాన్ని నిజంగా త్యజించినట్లే.

అప్పుడు మనం ఇల్లు వదిలిపెట్టి, ఏ అడవికో పోయి తపస్సు చేసుకోవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం ఒకదాని సరసన ఇంకొకటి సమాన కాంతిలో వెలిగిపోతూంటే ఆ కాంతిలో హాయిగా ముందుకు సాగిపోవచ్చు. ఈ స్థితికి చేరాలంటే మనకు సంబంధించిన వాటన్నింటిపైనా ఎటువంటి వ్యామోహం పెంచుకోకూడదు. మనమీద పట్టు కలిగి ఉన్న వాటి నుండి మనం విముక్తులం కావడమే నిజమైన వైరాగ్యం. వైరాగ్యమే ఆధ్యాత్మికతకు మార్గం.

- చోడిశెట్టి శ్రీనివాసరావు

No comments: