ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకోగల దిట్ట ఆమె. జీవితమంతా అన్వేషణ యాత్రే ఆమెకు. ప్రతి మజిలీలోనూ దుస్సాహస సంబంధమే. అది ఆమెకు ఉన్నతి. అవతలి పురుషుడికి కైవల్య ప్రాప్తి. బతికినన్నాళ్లూ మోహ దాహాలతో కీర్తి, కాసుల వెంట పరిగెత్తి, అలసి సొలసి, చివరకు సన్యాసం తీసుకుందామె. లౌల్యానికి మారుపేరైన ఆమె పేరు... లోలా మాంటెజ్. అందరికీ తెలిసిన పేరు కాదది. కానీ అందరూ తెలుసుకోవాల్సిన కథ ఆమెది. లోలా పుట్టింది 1821 ఫిబ్రవరి 17న ఐర్లాండ్‌లో. అసలు పేరు ఎలీజా రోసన్నా గిల్బర్ట్. తల్లి ఎలిజబెత్ ఆలివర్. తండ్రి ఎన్‌సైన్ ఎడ్వర్డ్ బ్రిటిష్ సైన్యంలో లెఫ్ట్‌నెంట్. లోలా పుట్టిన రెండేళ్లకు సైనిక విధులరీత్యా ఆ కుటుంబం భారతదేశానికి వచ్చింది. కానీ కొన్ని రోజులకే ఎడ్వర్డ్ మరణించాడు - కలరాతో. అప్పటికి లోలాకి మూడేళ్లే. తల్లి ఎలిజబెత్ ఏడాది తిరక్కుండానే మరో లెఫ్ట్‌నెంట్ పాట్రిక్ క్రైజ్‌ని పెళ్లి చేసుకుంది.
వీరిద్దరూ లోలాను బాగానే చూసు కునేవారు. అయినా లోలా కొత్త నాన్నతో ఇమడలేకపోయింది. చిన్నపిల్లే అయినా ఎందుకో కొత్తగా ఏర్పడిన ఇంటి వాతా వరణం వింతగా అనిపించింది. క్రమంగా అల్లరిపిల్లయింది. అది ముద్దుగా ఉండే, భరించే చిలిపితనం కాదు. మొండిగా మొరటుగా ఉండే పెంకితనం. అడిగిందల్లా ఇవ్వాల్సిందే. అందరినీ కొట్టడమే. రోజూ గొడవలే.
గాలి మార్పు కోసం కలకత్తాకి కూతుర్ని తీసుకొచ్చింది ఎలిజబెత్. ఫలితం లేదు. ఇక లాభం లేదని ఏడేళ్ల లోలాను ఇంగ్లండ్‌లోని సుందర్ లాండ్‌కి పంపించే సింది. అక్కడి స్కూల్లో చేర్పించింది. భరించలేనంత క్రమశిక్షణ. తట్టుకోలేక పోయింది లోలా. ఆమెలో మరింత తిరుగుబాటు తత్త్వం పొడసూపింది. వయసు పెరిగేకొద్దీ తెంపరితనం మరీ ఎక్కువైంది. జైలులాంటి స్కూల్లోంచి పారిపోవా లనుకుంది. థామస్ జేమ్స్ అనే సైనికుడికి సన్నిహితమైంది. 16 యేళ్ల ప్రాయం. అగ్ని కీలల వాంఛలతో దేహం. జేమ్స్‌తో పారి పోయి భారత్ వచ్చింది. రహస్యంగా పెళ్లయ్యింది. కలకత్తాలో కొత్త కాపురం.
తెలిసీ తెలియని వయసులో, చిన్నప్పటినుంచీ ప్రేమంటే ఏమిటో తెలీని మనసుతో ఆమె ఎన్ని కలలు కన్నదో. మొగుడంటే స్వర్గద్వారపు ముత్యాల వాకిలిలోంచి లోలోపలకు మోసుకెళ్లి, తాదాత్మ్యతామృతంలో ముంచెత్తే మొన గాడని ఊహించుకుంది. తన దేహాన్ని, మనసుని, హృదయాన్ని, ఆత్మని ఏక కాలంలో బంధించి ఉంచగల మంత్ర గాడని అనుకుంది.
కొన్నాళ్లకే అది భ్రమ అని తేలిపోయింది. పూలరేకుని ముద్దాడి నంత మృదువుగా, గువ్వ పిల్లని పొదివి పుచ్చుకున్నంత లలితంగా, తేనె ధారని ఆస్వాదించినంత మార్దవంగా స్త్రీని చూసుకోవడం ఈ పురుషుడికెన్నటికీ రాదని ఆమెకు అర్థమైపోయింది. తాగొచ్చి కొట్టే జేమ్స్ భర్త కాడని నిర్ధారించుకుంది. అసలు మగాళ్ల లోకం పైనే తిరుగుబాటు బావుటా ఎగరేయా లనుకుంది. 1843లో భర్తను వదిలి భారత్ నుంచి ఇంగ్లండ్ వెళ్లిపోయింది లోలా.
తనకెవ్వరూ లేరు. సాదాసీదాగా బతక్కూడదు. కరెన్సీ కట్టల మధ్య ఈదాలి. చుట్టూ పరివార జనం ఉండాలి. సెలబ్రిటీ అవ్వాలి. వేలల్లో లక్షల్లో అభిమాన సందోహం సాగాలి. అదీ ఆమె కోరిక. లండన్‌లోని స్థానిక డ్యాన్సు కంపెనీల్లో చేరింది. నాట్యం రాదు. నటన అంత కన్నా రాదు. అయినా వచ్చని అబద్ధ మాడింది. ఆడక తప్పదు. ప్రతిభ ఉన్నవాడు పని చేసుకుంటూ ఉంటాడు. మరి లేనివాడు? హడావిడి చేస్తాడు. ఆమె అదే చేసింది.
మగాళ్లతో చనువుగా ఉండేది. మిగిలిన వారితో కలిసిపోయేది. అలా ఆ కంపెనీల్లో కీలక పాత్రలు పొందే నటి అయ్యింది. అలా ఓసారి 1848లో లోలాకు బంగారం లాంటి అవకాశం వచ్చింది. షేక్‌స్పియర్ ‘మాక్‌బెత్’ నాటక ప్రదర్శనలో. అదీ ఆనాటి నటుడు చార్లెస్ జాన్ కీన్‌తో కలిసి నటించే రోజు. అందునా సాక్షాత్తూ విక్టోరియా మహారాణి సమక్షంలో! లోలా జాతకాన్ని మార్చేసే సంఘటన అది. అవును మార్చేసింది... ఎటొచ్చీ పాతాళానికి!
త్రిపురనేని గోపీచంద్ రచించిన ‘మెరుపుల మరకలు’ నవలలోని ఉషారాణి పాత్రతో పోల్చవచ్చు లోలా మాంటెజ్‌ని. ఉచ్చ నీచ అంతస్థుల్ని, ఉత్తిష్టము పతితము అనే మెట్లను, పాకుడు రాళ్లను ఎక్కుతూ దిగుతూ పడిపోతూ సాగిన లోలా... ఎవరో తెలియక్కర్లేదు. ఏం చెబుతోందో అర్థం చేసుకుంటే చాలు.
ఆ రోజు ప్రదర్శన ప్రారంభానికి అన్ని ఏర్పాట్లూ అయ్యాయి. వేలల్లో జనం. అందరూ సంపన్నులే. మహారాణికై ఎదురుచూపులు. హాలులో దీపాలకాంతి కాస్త తగ్గుతూండగా దేదీప్యమానంగా ధవళ కాంతులతో వజ్రాల తాపడం పెట్టిన దుస్తులతో మెరిసిపోతూ మహారాణి నడుచుకుంటూ వచ్చింది. సింహాసనంపై కూచుంది. ఇక ప్రదర్శన ప్రారంభమవ డమే తరువాయి.
అంతలో రంగస్థలం నుంచి తెరను తొలగించుకుంటూ ఓ అందాల భామ. సొగసైన నడకతో వయ్యారంగా వజ్రాల్లాంటి జిగేల్ జిగేల్‌మనే దుస్తులతో, కట్టలు ఒరుసుకుని విరిగిపడుతున్న సముద్రం లాంటి సౌందర్యంతో మహారాణి వైపు నడుస్తూ వచ్చింది. నువ్వా నేనా అన్నట్టుగా! ఆమె ఎవరో కాదు... లోలా మాంటెజ్. అలా చేస్తే... ఒక్క దెబ్బతో రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోవచ్చని ఆశపడింది. కాని రాణికి చిర్రెత్తుకొచ్చింది. ప్రదర్శన రద్దయింది. లోలా జాతకం సెకన్లలో మారిపోయింది. ఆ దెబ్బతో ప్యారిస్‌కి పారిపోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ప్యారిస్‌లో తన ప్రతాపం చూపాలి. ఎలా? ఆలోచించింది లోలా. స్థానికంగా బాగా సంపద, పలుకుబడి కలిగిన వ్యక్తి ఎవరాని ఆరా తీసింది. అలెగ్జాండర్ డుజారియర్ అనే మీడియా అధినేత అని తెలిసింది. అతణ్ని కలవడం ఎలా? అతని అలవాట్లేమిటో రహస్యంగా తెలుసుకుంది. రోజూ ఉదయం అలెగ్జాండర్ ప్యారిస్‌కు దూరంగా మైదానాల్లో గుర్రపు స్వారీ చేస్తాడు.
లోలా వెంటనే గుర్రపు స్వారీ నేర్చు కుంది. ఆ మైదానాలకు పయనమైంది. అతని దృష్టిని ఆకర్షించేలా బిగుతైన దుస్తుల్లో భయంగా స్వారీ చేస్తున్నట్లు నటిస్తూ అతని చూపుల్లో పడింది. అంతే! ఆ క్షణం నుంచి అలెగ్జాండర్ ఉన్మత్తు డయ్యాడు. ఆమె గుర్రంపై నుంచి పడింది. అతను ఆమె ప్రేమలో పడ్డాడు. ఒకే ఒక్క బలహీన క్షణంలో ఆమెకు వశుడై పోయాడు, పరవశుడై పోయాడు.
ఆమె సకల భోగాలూ అనుభ వించింది. ఎన్నాళ్ల నుంచో కన్న కలల్ని, కోరికల్ని తీర్చుకుంది. ఇంతకన్నా సుఖం లేదు అన్నంతగా వారిద్దరూ తిరిగారు, ఆమెకు బానిసైపోయాడు అలెగ్జాండర్. ఎంతటి పిచ్చి అంటే... లోలాను ఎవరైనా పల్లెత్తు మాటంటే చంపేసేంత! బెవాలెన్ అనే స్నేహితుడు లోలాను ఓ మాట అన్నాడని, అలెగ్జాండర్ అతనిపై తగాదాకి దిగాడు. బెవాలెన్ తుపాకీ పేల్చడంలో సాటి లేని షూటర్. అంతే! అలెగ్జాండర్ డుజారియర్‌ని కాల్చి పారేశాడు పిట్టలా!
లోలా లౌల్యంలో అలెగ్జాండర్ ప్రాణం కోల్పోయాడు. అండగా ఉన్న ప్రియుడి మరణంతో లోలా రోడ్డున పడింది. ప్యారిస్‌నే వదిలి వెళ్లిపోయింది.
కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈసారి లోలా జర్మనీలోని మ్యూనిచ్‌కి వెళ్లింది. అక్కడి బవారియా రాజు లుడ్విన్‌పై కన్నే సింది. చక్రవర్తికి సన్నిహితమవ్వాలంటే ఆషామాషీ విషయం కాదు. మహారాజుకి సన్నిహితుడైన రిచ్‌బర్గ్‌ని కలవాలనుకుంది. ఓ రోజు అతను ఓ హోటల్లో అల్పాహారం సేవిస్తుండగా అటుగా గుర్రంపై వెళ్తూ కావాలని కిందపడింది లోలా. పరిగెత్తు కొచ్చి కాపాడాడు రిచ్‌బర్గ్. లోలాను స్పృశించిన తొలి క్షణంలోనే అతడి దేహ కణాలు ప్రజ్వరిల్లాయి. అలా జరుగు తుందని ముందే తెలుసామెకు. చక్రవర్తిని లోలాకు పరిచయం చేస్తానని రిచ్‌బర్గ్ వాగ్దానం చేసేలా కులుకులొలక బోసింది.
చక్రవర్తి సమక్షంలో లోలా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు రిచ్‌బర్గ్. నిజానికి ఆమెకు డ్యాన్స్ రాదు. కళతో అయితే రాజుని కట్టి పడేయలేదు. వేరే కళలేవైనా పనికొస్తా యేమో ఆరా తీసింది. అంతా అర్థమైంది. ప్రదర్శన ప్రారంభమైంది. రాజు ఇంకో క్షణంలోనో, అరక్షణంలోనో రావాల్సి ఉంది.
రంగస్థలం మీద నుంచి పరిగెత్తు కుంటూ వచ్చేసింది లోలా. నేరుగా రాజ భవంతిలోకి వెళ్లింది... భటులను తోసు కుంటూ! ఆ తోపులాటలో ఆమె ఒంటి పైవస్త్రం చిరిగిపోయింది. కాదు... ఆమె చింపేసుకుంది. అర్ధనగ్నంగా దూసు కుంటూ వెళ్లి వెళ్లి రాజు లుడ్విగ్‌పై పడింది. రాజుని జీవితాంతం కట్టిపడేసే, పాద దాసుడిగా మార్చేసే భంగిమగా అతని దేహంపై వాలింది.
లుడ్విగ్ చిత్తుగా ఓడిపోయాడు - ఆమె ఒడిలో!
ఆమెను లాన్స్‌ఫీల్డ్ ప్రాంతానికి యువరాణిని చేశాడు. పగలంతా ఆమె పక్కన ఉండాలి - రాజుకి - ఎక్కడికెళ్లినా! ఆమె రాజ్య నిర్వహణ వ్యవహారాల్లో తలదూర్చింది. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తలెత్తింది. ఇక లాభం లేదని 1848 ఫిబ్రవరిలో లోలాను తక్షణమే దేశం విడిచి వెళ్లమన్నాడు. అపార ధనరాశితో ఆమె తిరిగి ఇంగ్లండ్ వెళ్లింది.
లండన్‌లో తన కన్నా పదేళ్ల చిన్న వాడు అయిన జార్జి ట్రాఫెల్డ్ హీల్డ్ అనే సైనికుడితో సహజీవనం చేసింది. పైగా 1849లో అతణ్ని పెళ్లి చేసుకుంది. కాని అప్పటికామె మొదటి భర్త జేమ్స్‌కు విడాకులివ్వలేదు. దాంతో అప్పటి బ్రిటిష్ చట్టాల మేరకు ద్వంద్వ వివాహం నేరం. అరెస్టు నుంచి తప్పించుకుని ఇద్దరూ స్పెయిన్‌కి పారిపోయారు.
కొన్నాళ్ల కాపురం తర్వాత విడిపో యారు. ఆమె బానే ఉంది. ఆ కుర్ర సైనికుడికి మాత్రం ఉద్యోగం పోయింది. తినడానికి తిండి లేదు. పిచ్చెక్కిపోయాడు. లోలా అతణ్ని వదిలేసి, అమెరికా పారిపోయింది. కాలిఫోర్నియాలో పాట్ హల్ అనే జర్నలిస్టుని పెళ్లి చేసుకుంది. ఎప్పటిలాగే... మూణ్నాళ్ల ముచ్చటైంది.
1859. లోలాకు 39 యేళ్ల వయసొ చ్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే స్వేచ్ఛా ప్రవృత్తి, లైంగిక ప్రవృత్తి, వెంపర్లాట, తోపులాట. ఇంతేనా! తనపై తనకే అసహ్యమేసింది. చేతిలోని డబ్బులన్నీ అయిపోయాయి. తిందామంటే ఏమీ లేదు. పస్తులతో పది రోజులుంది. తత్త్వం బోధపడింది. ఇక పరుగు చాలు అను కుంది. మొదట బోధకురాలైంది. ఆపై సన్యాసిని అయ్యింది.
తన అనుభవసారాన్ని జీవిత సత్యాలుగా చెప్పాలనుకుంది. దీపం బాగుంటుంది. కాని ప్రేమించి అందులోకి దూకితే బూడిదైపోతాం. భోగత్వమంతా పిడికిలి లాంటిది. మూసి ఉన్నంతవరకూ ఏదో ఉందనిపిస్తుంది. తీరా తెరిచాక అంతా తెలిశాక, అనుభవించాక, శూన్యమని అర్థమవుతుంది. ఈ జీవిత సత్యం బోధించేందుకు లోలా పయనమైంది. కానీ ఏడాది కాకుండానే 1861 జనవరి 17న 39 యేళ్ల వయసులో గుండెపోటుతో మరణించింది. అయితేనేం... ఆమె కథ చాలా విషయాలు చెబుతోంది.
- ఆకెళ్ల రాఘవేంద్ర
No comments:
Post a Comment