all

Thursday, January 24, 2013

పరదేశీ... పరదేశీ... జానా నహీ హమే ఛోడ్‌కే...

 
అజ్ఞాతవాసం
ఒక హిట్ సినిమాకు సంబంధించి ప్రేక్షకుల జ్ఞాపకాలు ఎవరి ఆలోచనను బట్టి వారికి ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలని కొందరు, రొమాంటిక్ దృశ్యాల్ని కొందరు... ఇలా ఎవరి ఆలోచనను బట్టి వారు మెచ్చుకుంటూ సదరు సినిమాను నెమరేసుకుంటారు. అలాగే... ఆమిర్‌ఖాన్ నటించిన ఓ హిట్ సినిమాను గుర్తు తెచ్చుకునేటప్పుడు కొందరు తప్పనిసరిగా ఆ పాటని స్మరించుకుంటారు. ఆ పాటలో నర్తించిన అందాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. తనని వదిలి వెళ్లొద్దంటూ ఓ సూపర్ హిట్‌సాంగ్ ద్వారా హీరోని వేడుకున్న ఆ అందం ఎందుకనో అకస్మాత్తుగా ప్రేక్షకుల్ని, సినీ పరిశ్రమనీ కంబైన్డ్‌గా వదిలేసి తెరమరుగైంది. ఒకనాటి సూపర్ హీరోయిన్ వారసురాలిగా వచ్చినా... ప్రేక్షకులు తనను ఆదరించి మెచ్చినా... ఎందుకలా చేసింది? ప్రస్తుతం ఏ రంగంలో తన ‘ప్రతిభ’ను ప్రదర్శిస్తోంది?

మాలాసిన్హా కేవలం భారతదేశపు దర్శక, నిర్మాతలు, ప్రేక్షకులకే కాదు, నేపాలీయులకు కూడా ఆరాధ్య నటి. 1950-1970 ప్రాంతంలో కుర్రకారు కలలరాణిగా కల్పవృక్షంగా అవతరించిన అందాల అభినేత్రి. అంతటి నటికి వారసురాలిగా సినీరంగ ప్రవేశం చేయడం సులభం మాత్రమే కాదు, సాహసం కూడా. అలాంటి సాహసికురాలు ప్రతిభాసిన్హా. తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్న ఈ సుందరి 1992లో చాలా తేలిగ్గా హీరోయినైపోయింది. కల్‌కీ ఆవాజ్, మెహబూబ్ మేరీ మెహబూబ్, దిల్ హై బేతాబ్... ఇలా పలు హిందీ సినిమాల్లో నటించింది. అయితే ఏ సినిమా కూడా ఆమెకు చెప్పుకోదగ్గ విజయాన్ని అందివ్వలేదు.

హీరోయిన్‌గా సరైన బ్రేక్ రాక అవస్థలు పడుతున్న ఆమెను ‘రాజా హిందూస్థానీ’ కరుణించాడు. ఆ సినిమాలో ‘పరదేశీ పరదేశీ’ అంటూ సాగే పాటని అతిధి నర్తకిగా అద్భుతంగా రక్తికట్టించింది. ఆ నృత్య ‘ప్రతిభ’తో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ ఊపులో కేవలం ఒకటిన్నరేళ్ల వ్యవధిలోనే ఏక్‌థా రాజా, గుడ్ గుడీ, కోయీ కిసీసే కమ్‌నహీ, దీవానా మస్తానా సినిమాల్లో నటించింది. జంజీర్, మిలటరీ రాజ్‌ల వరకూ ఆ ఊపు కొనసాగినా, వీటిలో ఏవీ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మళ్లీ కెరీర్ మసక బారింది. మధ్యలో ‘పోకిరి రాజా’తో మన తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరించి, దక్షిణాదిలోనూ మెరుద్దామని విఫల యత్నం చేసింది. 1998 తర్వాత ‘లే చల్ అప్నే సంగ్’లో తప్ప మరే సినిమాలోనూ ఆమె కనిపించలేదు. దాదాపు 15 యేళ్లుగా ఆమె సినీసీమ వైపు చూపు తిప్పలేదు. చూడ చక్కని రూపానికి, కనువిందైన నృత్యానికి కేరాఫ్‌లాంటి ఈ నాట్య బ్యూటీ ఇప్పుడెక్కడుంది? ఎందుకు వెండితెరకు దూరమైంది?

దోషం నాది కాదు పరిశ్రమదే...
ఈ మాట అనేయగలరు ప్రతిభాసిన్హా. అనే శారు కూడా. సినిమా పరిశ్రమకు మీరెందుకు దూరంగా ఉన్నారనే ప్రశ్నకు ఆమె నుంచి వచ్చిన సమాధానం ఇది. ‘దోషం నాది కాదు పరిశ్రమది. ఆ మాటకి వస్తే ప్రేక్షకులది కూడా’ అన్నారామె. ప్రస్తుతం 43 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని అందంతో మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ, ముంబైలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. ‘‘ఇప్పుడు వస్తున్న హిందీ సినిమాలు చూడడం అంటే ఒక శిక్ష’’ అని స్పష్టం చేస్తున్నారు. అలా పరోక్షంగా తానెందుకు సినిమా పరిశ్రమకు దూరమయ్యానో ఆమె చెప్పకనే చెప్తున్నారు.

‘‘నేను నటించిన ‘మిలటరీ రాజ్’ ఎంత మంచి సినిమా? అలాంటి కధలు, చక్కని సామాజిక సందేశాన్నందించే సినిమాలు తీసే దమ్ము ఇప్పుడు ఏ నిర్మాతకు ఉంది? రాసే దమ్ము ఏ రచయితకుంది?’’ అంటూ ఆవేశంగా కాకుండా ఆవేదనగా ప్రశ్నిస్తారు ప్రతిభా. అలాగని తానేమీ మసాలా దృశ్యాలకు, కమర్షియల్ సినిమాలకూ వ్యతిరేకం కాదని, ‘మిలటరీ రాజ్’లో కూడా అలాంటి కొన్ని సన్నివేశాలున్నాయని గుర్తు చేస్తారు.

చక్కని కధాంశం, పకడ్బందీ చిత్రీకరణ... ఇత్యాది వనరులతో ప్రేక్షకుల్ని అలరించిన లమ్హే, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, కభీ కభీ వంటి సినిమాలు తీసే ఓపిక ఇప్పటివారికి లేదని, చూసే ఓపికా ప్రేక్షకులకు లేదని ఆమె అభిప్రాయ పడతారు. ఏ పని చేసినా దానితో తొలుత మనం సంతృప్తి చెందాలి. అప్పుడే మిగిలిన వారిని సంతృప్తి పరచగలం అంటున్న ప్రతిభ... కేవలం జనాల్ని ఆనందపెట్టడమే లక్ష్యంగా పనిచేసేందుకు తానేమీ రోడ్డుమీద గారడీ చేసే వ్యక్తిని కానని తేల్చి చెప్పారు.

సినిమా పరిశ్రమ గురించి మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు ఆమె అదుపు తప్పుతారు. ‘మనవాళ్లు పిచ్చివాళ్లు. ప్రేక్షకులతో సహా. ఇక్కడున్నదంతా చెత్త’ అనేస్తారు. ఆమె తల్లి అద్భుతమైన నటనతో అందర్నీ అలరించారు. అలాంటి గొప్ప నటికి వారసురాలిగా వచ్చినా, సరైన సినీ భవిష్యత్తును పొందలేకపోయిన ప్రతిభ, చిన్నితెరనూ చిన్నచూపే చూస్తున్నారు. ‘‘టీవీ ఒత్తిడి నుంచి దూరం చేసే సాధనమే. అయితే అందులోనూ సినిమా ప్రోమోలు ఎక్కువై పోయాయి. అవి భరించడం నా వల్ల కాదు’’ అంటున్నారు. ఆమె ‘రంగుల లోకాన్ని ద్వేషిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ ద్వేషాన్ని ఓ అద్భుతమైన అవకాశంతో చిత్రపరిశ్రమ పోగొడు తుందని ఆశిద్దాం. వెండితెరపై ఆమె మరోసారి ప్రకాశించాలని కోరుకుందాం.
- ఎస్.సత్యబాబు

No comments: