all

Thursday, January 24, 2013

చిన్న వయసులోనే పళ్లు వదులవుతున్నాయి..? (డాక్టర్‌ని అడగండి - డెంటల్)

 
 
నా వయసు 26. నా ముందుపన్ను ఒకటి ఈ మధ్య సడన్‌గా వదులయినట్లు అనిపించింది. డాక్టర్‌ను కలిస్తే ఎక్స్‌రే తీసి, ఈ జబ్బు మూలంగా భవిష్యత్తులో అన్ని పళ్లూ ఊడిపోతాయన్నారు. వదులైన పన్నును తొలగించేశారు. తీసేసిన పన్ను స్థానంలో కొత్త పన్నును పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందేమోనని భయంగా ఉంది.
- పి. పవిత్ర, అనకాపల్లి


చిన్నవయస్సులో పళ్లు వదులైపోవడానికి చిగుళ్ల జబ్బులే కారణం. ఈ జబ్బుల వల్ల చిన్న వయసులోనే పంటికి ఆధారంగా ఉన్న ఎముక పాడై, కొన్ని పళ్లు వదులైపోతుంటాయి. వీటిని సరైన సమయంలో గుర్తించగలిగితే చిన్నవయసులో పళ్లు పోగొట్టుకోకుండా కాపాడుకోవచ్చు. కొన్ని ప్రత్యేక చికిత్సావిధానాల ద్వారా జబ్బు ముదరకుండా చేయచ్చు. దురదృష్టవశాత్తూ ఇటువంటి జబ్బుల్లో నొప్పి, బాధ లేకపోవడం వల్ల దీనిని తమకు తాముగా గుర్తించే అవకాశం తక్కువ. వీటిల్లో నిర్లక్ష్యంతోపాటుగా వంశపారర పర్యమైన లేదా జన్యుపరమైన కారణాలు కూడా ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా చిన్న వయసులోనే పళ్లూడిపోయిన చరిత్ర ఉంటే పిల్లలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా డెంటిస్ట్‌ను కలుస్తూ ఎక్స్‌రేల సాయంతో వ్యాధిని సరైన సమయంలో గుర్తించగలిగితే చికిత్స ఎంతో సులువైపోతుంది. మీరు ఒక పన్ను పోగొట్టుకున్నారు కాబట్టి నోటిలోని మిగిలిన పళ్లు కూడా వదులైపోకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఊడిన పంటిస్థానంలో కృత్రిమ దంతాన్ని అమర్చడం గురించి భయపడాల్సిన పనిలేదు. కృత్రిమ దంతాల అమరికలో మంచి టెక్నాలజీ అందుబాటులో ఉంది. కంగారు పడాల్సిన పనిలేదు. మంచి స్పెషలిస్టు దగ్గర చికిత్స తీసుకోండి.

మా పాపకు ఐదేళ్లు. పంటినొప్పితో తరచు బాధపడుతుంటుంది. చిట్కావైద్యం చేస్తున్నాం కాని, ప్రయోజనం లేదు. ఏం చేయమంటారో చెప్పగలరు.
- రమణకుమారి, గుంటూరు


చాలామంది తల్లిదండ్రులు పిల్లల పాలపళ్లపై శ్రద్ధపెట్టడం లేదు. ‘ఎలాగూ ఊడిపోతాయి కదా, వచ్చే శాశ్వత దంతాలను జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందిలే, పాలపళ్లకు చికిత్స అవసరం లేదులే’ అనుకుంటారు. కాని, పాలపళ్లు ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వతదంతాలు ఆరోగ్యంగా వస్తాయి. వీటిని ఊడిపోయే వయసు వచ్చేదాకా కాపాడుకోవాలి. పళ్లలో రంధ్రాలుంటే పిల్లలు నమిలి తినడానికి చాలా ఇబ్బందిపడతారు. దానిమూలంగా పౌష్టికాహార లోపాలు వస్తాయి. శారీరక పెరుగుదలలో సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు వెంటనే చికిత్స చేయించండి. దంత సమస్యలు మందులతో నయం కావు.

No comments: