all

Thursday, January 24, 2013

ఈ కష్టాలు ఏపాటివి? -నిత్య సందేశం

 
 
ధర్మరాజు జూదమాడి, రాజ్యాన్ని కోల్పోయి, కట్టుబట్టలతో అరణ్యంలోకి ప్రవేశించాడు తల్లీ, తమ్ములతో, ధర్మపత్నితో. తననుంచి తన వారంతా ఎన్నో కష్టాలను అనుభ వించవలసి వచ్చిందని బాధపడ్డాడు. ఒకనాడు ఆయన దగ్గరకు బృహదశ్వుడనే ముని వచ్చాడు. ఆయనతో ధర్మరాజు ‘‘ఓ మునీంద్రా! రాజ్యాన్ని కోల్పోయి, బంధువులను వీడి, వనములలో మృగాలతో కలిసి మాలాగా కష్టించిన పాపాత్ములు ఏ కాలంలోనైనా ఉన్నారా?’ అని ప్రశ్నించాడు వారి కష్టాలన్నింటినీ ఏకరువు పెట్టి.

బృహదశ్వుడు చిరునవ్వు నవ్వి, తన వారందరూ ఉండి ఒకరికొకరు తోడ్పడుతూ ఉన్న ఈ ధర్మరాజు పడుతున్న కష్టాలు ఏ పాటివి అని మనసులో అనుకుని ఇలా అన్నాడు- ‘‘ధర్మరాజా! విను... నిషధదేశానికి రాజైన నలుడనేవాడు తన రాజ్యాన్ని జూదంలో ఓడి, భార్యతోకలసి అడవిలో అనేక బాధలు పడ్డాడు. అప్పుడు వానికి బంధువులుగాని, అన్నదమ్ములుగాని, భృత్యులుగాని ఎవరూ తోడులేరు. నీవు అట్లా కాదు. నీ వెంట మహాబలపరాక్రమశాలురైన తమ్ములు, బ్రహ్మర్షులైన విప్రోత్తములు, భృత్యులు, రథాలు ఈ అరణ్యవాసంలో నీకు తోడుగా ఉన్నాయి. ఇక నీకు బాధ దేనికి?’’అన్నాడు. (అరణ్యపర్వం: ప్రథమాశ్వాసం).

అప్పుడు ధర్మరాజు ఆ విషయమేమిటో వివరంగా చెప్పమని మునీశ్వరుని కోరాడు. బృహదశ్వుడు ఇలా చెప్పాడు- పూర్వం నిషధ దేశాన్ని నలుడనే రాజు పాలించేవాడు. అతడు విదర్భరాజు కూతురైన దమయంతిని స్వయంవరంద్వారా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత శనిప్రభావంతో జూదమాడి సర్వసంపదలను, రాజ్యాన్ని కోల్పోయి భార్యయైన దమయంతితో సహా అడ వికెళ్లాడు. నిద్రాహారాలు లేవతనికి. చివరకు కట్టుకోవడానికి వస్త్రం కూడా కరువైంది. దాంతో తనపక్కనే నిద్రిస్తున్న దమయంతి చీరను సగం చించుకుని దాన్ని కట్టుకుని దమయంతిని వదిలి అడవిలో ఇంకో దిక్కుకు వెళ్లిపోయాడు.

దమయంతి లేచి తన భర్తను వెదుకుతూ ముళ్లను తొక్కుతూ, సూదుల్లాంటి పదునైన రాళ్లపై నడుస్తూ పోయి పోయి ఒక కొండ చిలువకు చిక్కింది. ఎవడో ఒక కిరాతుడు ఆ కొండచిలువను చంపి దమయంతిని కాపాడాడు. అయితే వాడు దమయంతి రూపలావణ్యాలను చూసి ఆమెను కామించాడు. అయితే దమయంతి పాతివ్రత్య ప్రభావం వల్ల వాడామెను తాకలేకపోయాడు. దమయంతి తన నడకను కొనసాగించి చేదిరాజ్యాన్ని పాలించే సుబాహుడనే రాజు వద్దకెళ్లి రాజమాత దృష్టిలో పడింది. రాజమాత తన కూతురు సునందకు ఆమెను సైరంధ్రిగా నియమించింది.

ఇంకోవైపు నలుడు అడవిలో కార్చిచ్చులో చిక్కుకున్న కర్కోటకుడనే విషసర్పాన్ని రక్షించి ఆ కర్కోటకుడి కాటుకు గురయ్యాడు. ఆ విషప్రభావంతో నలుడు తన సుందరరూపాన్ని కోల్పోయాడు- అని చెబుతూ బృహదశ్వ మహర్షి నలదమయంతులిద్దరూ విడిపోయి, ఒకరి అండ మరొకరికి లేక ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారో పూసగుచ్చినట్లు వివరించాడు ధర్మరాజుకు. ఆ కథ విన్న ధర్మరాజుకు దుఃఖభారం తగ్గింది. మనసు తేలికపడింది. కర్తవ్యం బోధపడింది.

- రాచమడుగు శ్రీనివాసులు

No comments: