all

Thursday, January 24, 2013

జిమ్‌థాథాచకచకా

 
ఇప్పుడు మనందరికీ ఎక్సర్‌సైజ్ అవసరం ఎంతో ఉంది. గత రెండు దశాబ్దాలకు పైగా మన సమాజంలో మనం ఎక్సర్‌సైజ్‌కు తగిన విలువ ఇవ్వనందున డయాబెటిస్‌లూ, స్ట్రోక్‌లలో మన దేశమే ప్రథమంగా నిలిచింది. దాంతో ఇప్పుడు అకస్మాత్తుగా దాని అవసరాన్ని గుర్తెరగాల్సి వచ్చింది. చక్కెర అదుపు చేయాలన్నా, గుండెపోటు రాకుండా చూసుకోవాలనుకున్నా, కొవ్వులనూ, పొట్టలనూ తగ్గించుకోవాలనుకున్నా కావాల్సిందల్లా వ్యాయామం... వ్యాయామం... అంతే! వ్యాధులు వచ్చినవారికీ, రాకుండా చూసుకోవాలనుకున్నవారికీ, వచ్చాక అదుపు చేసుకోవాలనుకున్న వారికీ... అందరికీ వ్యాయామమే అందరి నిరంతర మంత్రం.ఇప్పుడు వ్యాయామం అన్నది ఒక సర్వరోగ నివారణి అనే హోదా పొందిన సాంత్వన ప్రక్రియ. ఈ కాలంలో ఇంతగా ప్రాచుర్యం పొందుతున్న వ్యాయామం గురించి అనేక విషయాలూ, అపోహలూ, వాస్తవాలూ... ఇలాంటివన్నీ ఇవాళ్టి కథనంలో.

నిన్నమొన్నటి వరకూ త్రీపీస్ సూట్ వేసుకునేవారు నేడు ట్రాక్‌సూట్ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారు? ఒకనాడు ఖరీదైన లెదర్ షూ మాత్రమే తొడిగేవారు నేడు క్యాన్వాస్ షూ లేసులెందుకు బిగిస్తున్నారు? అకస్మాత్తుగా అందరూ ఎందుకిలా కాన్ఫరెన్స్‌హాల్స్ వదిలి కార్పెట్‌గ్రాస్ మీదికి వెళ్తున్నారు? ఎందుకంటే వ్యాయామానికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే అది మననుంచి దాన్ని బలవంతంగా లాక్కుంటుంది. తనను గౌరవించేలా చేసుకుంటుంది. ఒక రెండున్నర దశాబ్దాల పాటు మనమంతా వ్యాయామానికి క్రమంగా దూరమైపోతూ చదువులకు దగ్గరయ్యాం. ఎలాగంటే... ఇప్పుడు నలభైల్లో ఉన్నవారు ఒక్కసారి పాతికేళ్ల క్రితం నాటి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే ... అప్పట్లో మన ఆటల్లోనే వ్యాయామం అంతర్భాగమై ఉండేది. ఉదా: కబడ్డీ, ఖోఖో, కోతికొమ్మచ్చి... ఇలా. ఇక చదువుల్లోనూ వ్యాయామం ఉండి తీరాల్సిందే!

అదెలాగంటే... పల్లె నుంచి దగ్గర్లోని పట్టణంలో స్కూల్‌కు వెళ్లాలంటే కనీసం మూడు నుంచి ఆరేడు కిలోమీటర్లు నడవాల్సిందే. ట్యూషన్లకు అంటూ రోజూ నడకో, సైకిలో తప్పదు. హాబీల్లోనూ వ్యాయామమే. ఉదాహరణకు ఈతకొట్టడం, చెట్లు ఎక్కడం. సంస్కృతిలోని వేడుకల్లో భాగంగా చేసే పనుల్లోనూ ఎంతో ఎక్సర్‌సైజ్. పండగలకు, శుభకార్యాలకు గుమ్మాలకు మామిడాకులు కట్టడం కోసం వాటిని సేకరించడం, కొబ్బరిమట్టలు, వేపమండలు కొట్టుకురావడం ఇలాగన్నమాట. అమ్మాయిలకూ - చెమ్మచెక్క, కుందుడుగుమ్మ, తొక్కుడుబిళ్ల, తాడాట... ఇలా ఏ ఆట తీసుకున్నా ఆటల్లో ఎక్సర్‌సైజ్ తప్పదు. పైగా అవి మనమంతా ఒక ఎక్సర్‌సైజ్‌లా భారంగా కాకుండా ఒక వినోదంగా, వేడుకగా, ఇష్టంగా చేసేవాళ్లం.

ఆ తర్వాత సంస్కృతిలోకి సైకిల్స్ వచ్చినా అవి వ్యాయామానికి అడ్డుకాలేదు సరికదా మరోరకంగా అదనపు వ్యాయామాన్నే సమకూర్చింది. అయితే క్రమంగా 80, 90ల నాటికి పరిస్థితిలో మార్పువచ్చింది. రోజులో ఆటపాటలకు కేటాయించే సమయం కంటే చదువులకు కేటాయించాల్సిన సమయం క్రమంగా పెరుగుతూ పోయింది. దాంతో 80, 90 సంవత్సరాలలో పుట్టినవారంతా రెండు దశాబ్దాల పాటు వ్యాయామానికి దూరమయ్యారు. దాని ఫలితం పాతికేళ్ల తర్వాత కనిపించింది. సరిగ్గా రెండున్నర దశాబ్దాల తర్వాత మన దేశం డయాబెటిస్, గుండెపోటు, హైపర్‌లిపిడేమియా వంటి వ్యాధుల్లో ప్రపంచంలోనే పెద్ద స్థానం సంపాదించింది. ఫలితంగా ఇప్పుడు ఆ రెండు దశాబ్దాల ఎక్సర్‌సైజ్ లోటును అధికమూల్యంతో భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు మళ్లీ టీనేజ్‌నుంచే మళ్లీ జిమ్, వ్యాయామాలను మన జీవనశైలిలో అంతర్భాగం చేసుకోవాల్సిన అవసరం పడింది.

టీనేజ్ పిల్లలూ... వ్యాయామం

టీనేజ్‌లోనే పిల్లలు తమకు ఇష్టమైన హీరో తాలూకు ఆకర్షణీయమైన సౌష్ఠవం చూసి వ్యాయామం పట్ల ఆకర్షితులవుతారు. అందుకే చాలా సమయాల్లో ఈ దశలో వారిలో పాదుకునే ఇష్టం... కాలక్రమేణా ఒక అలవాటుగా మారుతుంది. వాళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఈ దశలో టీనేజ్ పిల్లల వ్యాయామం... వాళ్ల తల్లిదండ్రులను కాస్త ఆందోళనకు గురిచేస్తుంది. సాధారణంగా ఎదిగే పిల్లలు ఎక్సర్‌సైజ్ చేస్తే అది వాళ్లలో ఎత్తుపెరిగే ప్రక్రియను అడ్డుకుంటుందన్నది ఒక సాధారణ అపోహ. ఇందులో కొంతే నిజం.

ఎత్తు పెరగడాన్ని ఎక్సర్‌సైజ్ అడ్డుకుంటుందా?

ముందుగా పిల్లల్లో ఎత్తు పెరిగే ప్రక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. సాధారణంగా పిల్లలు ఎంత ఎత్తు పెరుగుతారన్నది వాళ్ల జన్యువులపై ఆధారపడి ముందుగానే నిర్ణయమవుతుంది. అందుకే తల్లిదండ్రులు ఎత్తుగా ఉంటే వాళ్ల పిల్లలూ ఎత్తుగా పెరుగుతారు. పిల్లల పెరుగుదలలో రెండు దశలుంటాయి. వాటిని లాగ్ ఫేజ్ అనీ, ల్యాగ్ ఫేజ్ అంటారు. ఇందులో లాగ్ ఫేజ్‌లో పిల్లలు ఒక దశలో అంటే పన్నెండు నుంచి పద్నాలుగు, పదహారేళ్ల వయసు మధ్య అకస్మాత్తుగా ఎత్తుగా అవుతారు. ఆ తర్వాతి దశ ల్యాగ్ ఫేజ్. ఈ దశలో పెరుగుదల మందగించి... అది మందకొడిగా సాగుతూ మహా అయితే ఒకటి లేదా రెండు అంగుళాలు పెరిగి ఆగిపోతుంది. అది సాధారణంగా 18-21 ఏళ్ల మధ్య జరుగుతుంది. అంటే కొందరిలో అది 18 ఏళ్లకే ముగిస్తే... మరికొందరిలో ఆ గరిష్టపరిమితి 21 ఏళ్ల వరకు సాగుతుంది. అంటే... ఎవరిలోనైనా ఎత్తు పెరగడం అన్న ప్రక్రియ 21 ఏళ్లు వచ్చేసరికి ఎముక చివర ఫ్యూజ్ అయిపోయి పెరుగుదల ఆగిపోతుంది.

అందుకే సాధారణ ఆటపాటల్లో భాగంగా జరిగే వ్యాయామం వారిలోని ఎత్తుపెంచే ప్రక్రియను అడ్డుకోలేదు. పైగా సాగినట్లుగా, వేలాడబడుతూ చేసే స్ట్రెచింగ్ వ్యామాయాలు వాళ్ల లాగ్ ల్యాగ్ ఫేజ్‌లను కొంత ప్రభావితం చేస్తూ ఒకింత ఎత్తు పెంచేందుకు దోహదపడచ్చు కూడా. అయితే మన ఎముకల్లో పెరిగే భాగాలు ఎముక చివరన ఉంటాయి. వీటిని గ్రోత్ ప్లేట్స్ అంటారు. మనం ఎదిగే వయసులో ఎక్కువ బరువుతో విపరీతంగా వ్యాయామాలు చేస్తే అది గ్రోత్‌ప్లేట్స్‌ను దెబ్బతీయచ్చు. అలా గ్రోత్‌ప్లేట్స్ దెబ్బతింటే మాత్రం ఎత్తుపెరగడం ఆగిపోవచ్చు. అందుకే ఈ దశలో వ్యాయామం ఆటల్లో భాగంగా ఉండటం లేదా స్ట్రెచింగ్‌కు పరిమితం కావడం లేదా తక్కువ బరువులతో ఎక్కువ రిపిటీషన్స్‌తో చేస్తుండటం ఎత్తు పెరగడానికి ఎంతమాత్రం ప్రతిబంధకం కాబోదు.

నిర్వహణ: యాసీన్

మార్కెట్‌లో లభించే ప్రోటీన్ డైట్ అవసరమా?

కొత్తగా వ్యాయామం చేయదలచిన వారు తమ కండరాలు పెరగడానికి మార్కెట్‌లో లభ్యమయ్యే ప్రోటీన్ డైట్ తీసుకోడానికి మొగ్గుచూపుతుంటారు. మనకు ఒక రోజుకు ఒక గ్రాము కండరానికి 1.2 గ్రాముల ప్రోటీన్ అవసరం. అంటే 50 కిలోల వ్యక్తి వ్యాయామం చేస్తుంటే అతడికి రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ చాలు. ఒక పూట పుష్కలంగా చికెన్‌తో భోజనం చేస్తే అతడికి 35 గ్రాముల ప్రోటీన్ సమకూరుతుంది. అంటే రెండు పూటల భోజనంతోనే అతడికి అవసరమైన ప్రోటీన్ దొరుకుతుందన్నమాట. ఇంకా కావాలనుకుంటే చేపలు, గుడ్డు వంటి స్వాభావికమైన ప్రోటీన్‌నే తీసుకోవచ్చు. శాకాహారులైతే పప్పులు, చిక్కుళ్లు వంటి స్వాభావిక ప్రోటీన్ తీసుకుంటే మేలు. ఒకవేళ మార్కెట్‌లో దొరికే కృత్రిమ ప్రోటీన్ సప్లిమెంట్స్‌లో ఎలాంటి కల్తీలున్నాయో తెలియదు. అవి శరీరానికి మేలుకు బదులు కీడు చేస్తే జరిగే అనర్థాలతో మొత్తం ఆరోగ్యానికే చేటు.

టీనేజ్ పిల్లలూ... వ్యాయామం

టీనేజ్‌లోనే పిల్లలు తమకు ఇష్టమైన హీరో తాలూకు ఆకర్షణీయమైన సౌష్ఠవం చూసి వ్యాయామంపై మోజుపెంచుకుంటారు. అయితే ఈ దశలో టీనేజ్ పిల్లల వ్యాయామం... వాళ్ల తల్లిదండ్రులను కాస్త ఆందోళనకు గురిచేస్తుంది. సాధారణంగా ఎదిగే పిల్లలు ఎక్సర్‌సైజ్ చేస్తే అది వాళ్లలో ఎత్తుపెరిగే ప్రక్రియను అడ్డుకుంటుందన్నది ఒక సాధారణ అపోహ. నిజానికి ఇందులో కొంతమేరకే వాస్తవం ఉంది. ఎముకల చివరన ఉండే గ్రోత్ ప్లేట్స్ దెబ్బతినకుండా ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా ఎత్తు పెరగడానికి ప్రతిబంధకం ఉండదని గుర్తిస్తే ఎక్సర్‌సైజ్ - ఎత్తు పట్ల మనకున్న అపోహలన్నీ దూరమవుతాయి.

No comments: