అందం, అభినయం,అంకితభావం, ఆత్మగౌరవం...ఈ సుగుణాల కలబోతే ఆంధ్రుల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారక రామారావు. తెలుగింటి సాంప్రదాయాల ప్రతిరూపం ఆయన. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఎన్నో విజయాలను చవిచూసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. తండ్రికి తగ్గ కుమార్తెగా అచిర కాలంలోనే జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ దగ్గుబాటి పురందేశ్వరి. తండ్రితో తన అనుబంధాన్ని, ఆయన తీపి జ్ఞాపకాలను 'నవ్య'తో పంచుకున్నారు ఆమె.
"నాన్నగారు సినీ పరిశ్రమలోకి వచ్చి మద్రాసులో స్థిరపడడంతో నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా అక్కడే. నాకు పెళ్లయ్యేంతవరకు మద్రాసులోనే ఉన్నాను. నాన్నగారి దృష్టిలో ఆడపిల్లలు సూర్యోదయాన్ని చూడాలి కాని ఆడపిల్లలు నిద్రలేవడాన్ని సూర్యుడు చూడకూడదు. ఈ కారణంగా చిన్నప్పటి నుంచే తెల్లవారుజామునే నిద్రలేవడం, స్నానం చేసి పూజ చేయడం నాకు అలవాటైపోయింది. నాన్నగారికి దైవభక్తి ఎక్కువ.
ఉదయం ఆరుగంటలకల్లా పూజ గంట గణగణలు ఆయన ఆఫీసు గదికి వినిపించాల్సిందే. ఆయన రోజూ పూజలు చేసేవారు కాదు కాని శనివారం వెంకటేశ్వరస్వామికి, సోమవారం శివుడికి మాత్రం ఎంతో నిష్ఠగా పూజ చేసేవారు. ఆయన గంభీర కంఠం నుంచి "ఓం నమఃశివాయః'' అన్న మంత్రోచ్ఛారణ విన్నపుడు పక్కనే హాల్లో చదువుకుంటున్న నాకు మేను భక్తిభావంతో పులకించిపోయేది. ఆ శబ్ద తరంగాలకు తెలియకుండానే రోమాలు నిక్కబొడుచుకునేవి.
సెలవులొస్తే హాయ్ హాయ్
మా చిన్నపుడు మా కుటుంబంలో కొంతమంది మద్రాసులో, కొందరు హైదరాబాద్‌లో ఉండేవాళ్లం. హైదరాబాద్‌లో నాన్నగారు ఎన్టీఆర్ ఎస్టేట్స్, ఇల్లు కట్టాక మా పెద్దన్నయ్య, రెండో అన్నయ్య ఇక్కడ ఉండేవారు. నా చెల్లెళ్లు భువనేశ్వరి, మహేశ్వరి కొంతకాలం మద్రాసులో, కొంతకాలం హైదరాబాద్‌లో ఉండేవారు. సెలవులు వస్తున్నాయంటే భలే ఆనందంగా ఉండేది. హైదరాబాద్‌కు వచ్చి, అందరినీ కలవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసేవాళ్లం. వచ్చిన రెండు రోజులకే నాన్నగారు "పెద్దమ్మను చూసొచ్చారా?'' అని అడిగేవారు.
నాన్నగారికి పెద్దమ్మ అంటే అక్కినేని నాగేశ్వరరావుగారి తల్లిగారు. ఆ రకమైన ఆప్యాయత, అనుబంధం వారిద్దరి మధ్య ఉండేది. నాగేశ్వరరావుగారి తల్లిగారు కూడా నాన్నగారిని పెద్దబ్బాయి అని పిలిచేవారు. ఆ రోజుల్లో సినిమా పరిశ్రమ ఎంతో ఆరోగ్యకరంగా, ఒకే కుటుంబంలా ఉండేది. సావిత్రిగారు బొమ్మలకొలువు పెట్టేవారు. మేము వెళ్లందే కొలువు మొదలయ్యేది కాదు. మా కారు వారి ఇంట్లోకి ప్రవేశిస్తుండగానే జెమినీగణేశన్‌గారు "అమ్మాయిలొస్తున్నారు'' అంటూ అరిచేవారు. అలాగే భానుమతిగారి ఇంటికి బొమ్మలకొలువుకు వెళ్లడం ఇప్పటికీ కళ్ల ముందు సజీవంగా కదలాడుతోంది. సినిమా పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా 'అన్నా' అంటూ నాన్నగారి దగ్గరకే వచ్చేవారు.
పాత్రలో లీనమై...
నాన్నగారు తన వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో ఉండేవారు. ఆయన కృష్ణుడు వేషం వేశారంటే ఆ పాత్ర నటించినన్ని రోజులు మేము ఎంత అల్లరి చేసినా పట్టించుకునేవారు కాదు. ఆయన కూడా ఒక్కోసారి అంతే చిలిపిగా మాతో కలసి కొంటె పనులు చేసేవారు. అయితే ఆయన దుర్యోధనుడిగానో, రావణాసురుడిగానో నటిస్తున్నారంటే ఆయన గది దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడేవాళ్లం. ఆయన ఆ పాత్రలో అంతలా లీనమైపోయేవారు. అలాంటి పాత్రలు ధరించినన్ని రోజులు ఆయన ఎంతో గంభీరంగా ఉండేవారు
. దేవుని పాత్రలు వేస్తున్నప్పుడుల్లా ఆయన ఎంతో నియమనిష్ఠలతో ఉండేవారు, ఎంత చలికాలమైనా చన్నీళ్లతోనే స్నానం చేసేవారు. రాత్రిళ్లు కటిక నేల మీద నిద్రించేవారు. మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండేవారు. తాను పవిత్రంగా ఉంటేనే ఆ పాత్రలకు పవిత్రత తీసుకురాగలనని నాన్నగారి నమ్మకం. తన వల్ల ఇతరులు నష్టపోకూడదన్నది నాన్నగారికున్న మరో సిద్ధాంతం. 'నిన్నే పెళ్లాడుతా' సినిమాలో నటిస్తున్నపుడు ఒక సంఘటన జరిగింది.
నాన్నగారు బంతిని నేలమీద కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నపుడు ఆ బంతి చప్పుడుకు భయపడి అక్కడే ఉన్న ఆల్సేషన్ డాగ్ నాన్నగారి మీద పడి తొడను కొరికేసింది. దాంతో కండ బయటకు వచ్చేసింది. నాన్నగారు ఇంజెక్షన్ తీసుకున్నారు కాని హై టెంపరేచర్ వచ్చేసింది. అయినా షూటింగ్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. అప్పుడు నేనే "నాన్నగారూ ఒకటి, రెండు రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా'' అన్నాను. దానికి "లేదమ్మా...నన్ను నమ్మి నిర్మాతకు ఇంత డబ్బు ఖర్చుపెడుతున్నారు. నా వల్ల నిర్మాత ఎటువంటి నష్టం రాకూడదు. నాకు చేతనైనంతవరకుషూటింగ్‌కు మాత్రం అంతరాయం కలిగించను'' అన్నారాయన.
అన్నం... పరబ్రహ్మం
నాన్నగారు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించేవారు. నాన్నగారు అన్నం తినేటప్పుడు ఒక్క మెతుకు కూడా కిందపడనిచ్చేవారు కాదు. పొరపాటున మెతుకు కింద పడితే దాన్ని తినే చేతులతోనే నేలమీద నుంచి తీసుకుని కళ్ల కద్దుకుని నోట్లో పెట్టుకునే వారు. ఎప్పుడైనా మేము "అదేమిటి నాన్నగారూ! ఒక్క మెతుకే కదా! దాన్ని అలా వదిలేయకుండా ఎందుకు తింటున్నారు'' అనంటే "మనం కష్టపడేది ఈ మెతుకు కోసమే కదమ్మా'' అనేవారు.
ఏదీ అయాచితంగా రాదు! కష్టపడితేనే ఏదైనా దక్కేది అన్న సత్యాన్ని నాన్నగారు మాకు అనుభవపూర్వకంగా నేర్పించారు. నాన్నగారి భోజన అలవాట్లు చాలా భిన్నంగా ఉండేవి. ఒక్కోసారి వరుసగా 2, 3 నెలల పాటు చికెన్ మాత్రమే తినేవారు. తర్వాత హఠాత్తుగా భోజనం దగ్గర కూర్చున్నాక 'నాకు ఇక కోడి వద్దు' అనేవారు. వెంటనే అమ్మ అప్పటికప్పుడు తోటకూర, వెల్లుల్లిపాయతో కూర వండి నాన్నగారికి వడ్డించేది. నాన్నగారు నాకు ఇది వండి పెట్టు అని చెప్పడం మేమెరుగము. అమ్మే తనకు తాను నాన్నగారి ఇష్టాయిష్టాలను గ్రహించుకుని ఆయనకు అనుగుణంగా అమర్చిపెట్టేది. నాన్నగారు సాయంత్రాలు షూటింగ్ నుంచి ఇంటికి రాగానే రాగి చెంబుతో నీళ్లు తాగేవారు.
నాన్న ఇంటికి వస్తున్నారన్న కబురు రాగానే తలుపు దగ్గర రాగి చెంబు పట్టుకుని అమ్మ ఎదురుచూస్తూ నిలబడి ఉండేది. నాన్నగారు స్వతహాగా భోజన ప్రియులు. ఆయన తినడమే కాదు ఇతరులకు తినిపించడాన్ని కూడా అంతగానే ఇష్టపడేవారు. బంధువులు ఇంటికి వస్తే నాన్న చేసే హడావుడికి వచ్చిన వాళ్లు హడలిపోవాల్సిందే! మా హరన్న(హరికృష్ణ) అయితే "నాన్నా ఫుడ్డుతో హింసించకండి వాళ్లను'' అని నవ్వేవాడు. అయితే నాన్నగారు మాత్రం భోజనం పెట్టడంలోనే తన ప్రేమాభిమానాలను వ్యక్తపరిచేవారు. నాన్నకు ఇష్టమైన స్లోగన్ ఒకటుంది. "తినాలి కాబట్టి తినడం కాదు..తినడం కోసమే బ్రతకాలి''.
నాన్నకు కోపమొస్తే...
అప్పట్లో నాన్నగారు మూడు షిఫ్టులు కూడా పనిచేసేవారు. మేము నిద్రలేవకముందే నాన్నగారు షూటింగ్‌కు వెళ్లిపోయేవారు. ఆయన షూటింగ్ పూర్తిచేసుకుని ఇంటికి తిరిగివచ్చేసరికి మేము నిద్రలో ఉండేవాళ్లం. అయితే నాన్నగారు మాతో ఎక్కువసేపు గడపకపోవడం అనే అగాధాన్ని మా అమ్మ మాకు ఎన్నడూ కలగనిచ్చేవారు కాదు. నాన్నగారు పైకి ఎంత గంభీరంగా కనిపిస్తారో అంతలా జోకులు కూడా వేసేవారు. నాన్నగారు వేసే జోకులకు మేము పడీపడీ నవ్వేవాళ్లం కాని..ఆయన మాత్రం నవ్వేవారు కాదు. నాన్నగారికి కోపం వచ్చినపుడు దాన్ని ప్రదర్శించే తీరు కూడా భిన్నంగా ఉండేది.
"మనకు మతిపోయింది'' అని ఒకే ఒక్క మాట అనేవారు. నాన్నగారి నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే ఆయన చాలా కోపంగా ఉన్నారని మాకు అర్థమైపోయేది. వెంటనే మేము ఏం తప్పు చేశామా అని ఆత్మపరిశీలన చేసుకునేవాళ్లం. నాన్నగారు క్రమశిక్షణకు ప్రాణమిచ్చేవారు. ఇంట్లో అనవసరంగా ఫ్యాన్లు, లైట్లు వేసి ఉంచడం ఆయనకు ఇష్టం ఉండదు. మేము గదిలో ఫ్యానో లైటో వేసి వెళ్లిపోతే మా కళ్లముందే తనే వెళ్లి అవి ఆర్పి వచ్చేవారు. మమ్మల్ని పన్నెత్తి ఒక్క మాటైనా అనేవారు కాదు. అప్పుడు మాకు వెంటనే అర్థమైపోయేది మేము తప్పుచేశామని.
స్థితప్రజ్ఞతకు నిర్వచనమంటే నాన్నగారే. విమర్శలకు, ప్రశంసలకు ఆయన అతీతంగా ఉండేవారు. ఒక సందర్భంలో నాన్నగారి గురించి కొందరు చేసిన విమర్శలను ఆయన దగ్గర ప్రస్తావిస్తూ "మీరు వారిని ఎంతగానో ఆదరించారు. అయినా కూడా వాళ్లు మిమల్ని విమర్శిస్తున్నారు'' అని నేను అన్నపుడు "నేను తప్పు చేశానా, లేదా అన్నది నాకు తెలుసు. నేను తప్పు చేయనంతవరకు ఎవరు నా గురించి ఎన్ని విమర్శలు చేసినా ఖాతరు చేయను. అయినా నా గురించి ఎవరో ఏదో అంటే నువ్వెందుకు బాధపడతావు. వాళ్లకు నా చర్యలు నచ్చకపోయి ఉండవచ్చు. అంతమాత్రాన మనం ఎందుకు బాధపడాలి? మనం ఎంతవరకు నిజాయితీగా ఉన్నామని మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకుంటే చాలు'' అన్నారు నాన్నగారు.
నాన్న కష్టం..అమ్మ దుఃఖం
నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే అమ్మకు కేన్సర్ ఉందన్న సంగతి బయటపడింది. అమ్మకు నడవడం చాలా కష్టంగా ఉండేది. అప్పటో మొబైల్ ఫోన్లు లేవు. కింద హాల్లో ఫోను ఉండేది. నాన్నగారు ఫోన్ చేస్తారేమోనని అమ్మ అలాగే నొప్పిగా ఉన్నా కాళ్లు ఈడ్చుకుంటూ మెట్లు దిగి హాల్లోకి వచ్చి నాన్న ఫోన్ కోసం ఎదురుచూస్తూ నేలమీదే నిద్రపోయేది. పార్టీ పెట్టిన కొత్తలో ఎన్నికల ప్రచారం కోసం నాన్నగారు నెల్లూరుకు వచ్చారు. నాన్నగారు, అమ్మ ఒకరినొకరు చూసుకోకుండా, మాట్లాడుకోకుండా అన్ని రోజులు ఉండింది ఎప్పుడూ లేదు.
అమ్మ ఇక ఉండబట్టలేక నాన్నను నేను చూడాల్సిందే అని పట్టుపట్టడంతో అమ్మను తీసుకుని మద్రాసు నుంచి నెల్లూరుకు వెళ్లాను. సాయంత్రానికి నెల్లూరు చేరుకోవలసిన ఆయన అర్ధరాత్రి దాటాక గాని రాలేదు. ఎంతో అందంగా ఉండే నాన్న నల్లగా కమిలిపోయి, లైట్ల వెలుగును చూడలేక కళ్లకు చేతులు అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి కారులో నుంచి దిగడం చూసిన మాకు కన్నీళ్లాగలేదు. అమ్మయితే వలవలా ఏడ్చేసింది. "నాన్నను ఇక తిరగొద్దని చెప్పు. మనతో కారెక్కి ఇంటికి వచ్చెయ్యమను'' అంటూ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆమెను ఓదార్చడం నా వల్ల కాలేదు.
నాన్నను అంతలా ప్రేమించేది అమ్మ. నాన్నకు ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు ఆమె హృదయం. రెండు సందర్భాలలోనే నేను నాన్న కంట్లో నీళ్లు చూశాను. ఒకటి నానమ్మ చనిపోయినపుడు..రెండు అమ్మ కన్నుమూసినపుడు. "నా జీవితాంతం నన్ను కనిపెట్టుకుని, నా చేయిపట్టుకుని నడిచిందమ్మా మీ అమ్మ. ఈ వయసులో నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు?'' అని నాన్నగారు కుమిలిపోయారు. సహధర్మచారిణికి సంపూర్ణ, సమగ్ర నిర్వచనం మా అమ్మ. నాన్నగారికి బ్రహ్మముహూర్తమంటే ఎంతో నమ్మకం. ఆయన ఆ ఘడియలలోనే నిద్రలేచేవారు. యాదృచ్ఛికంగా ఆయన మరణం కూడా బ్రహ్మ ముహూర్తంలోనే జరిగిపోయింది.''
బంధువులు ఇంటికి వస్తే నాన్న చేసే హడావుడికి వచ్చిన వాళ్లు హడలిపోవాల్సిందే! మా హరన్న(హరికృష్ణ) అయితే "నాన్నా ఫుడ్డుతో హింసించకండి వాళ్లను'' అని నవ్వేవాడు. అయితే నాన్నగారు మాత్రం భోజనం పెట్టడంలోనే తన ప్రేమాభిమానాలను వ్యక్తపరిచేవారు.
- టి.సుధాకర్