all

Tuesday, December 11, 2012

చారులత ఓ ఛాలెంజ్

 

 
దక్షిణాది భాషలలో కథానాయికల వరుసలో ప్రియమణి గూర్చి పరిచయం చేయవలసిన అవసరంలేదు. పరుత్తివీరన్ వంటి తొలినాళ్ళ చిత్రాలతోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న ఆమె ఆ తర్వాత కమర్షియల్ చిత్రాలలో కూడా
తన సత్తా నిరూపించుకున్నారు. ప్రస్తుతం కన్నడ చిత్రాలలో నటిస్తున్న ఆమె చారులత చిత్రంతో తెలుగులో మళ్లీ కనిపించబోతున్నారు.
అవిభక్త కవలల పాత్రను తొలిసారి తెరపై ఆమె సవాల్‌గా తీసుకుని చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెతో ఇంటర్వ్యూ.
* సయామీ కవలల పాత్ర ఎలా వుంది?
- మన భారతదేశంలోనే ఇటువంటి కథతో ఇంతవరకూ చిత్రం నిర్మించలేదు. తొలిసారిగా అటువంటి అవకాశం నాకు వచ్చినందుకు సంతోషంగా ఉన్నా, ఓ రకంగా ఇది ఛాలెంజ్! దర్శకుడు సహకారంతో ఈ పాత్రలను ఛాలెంజ్‌గా తీసుకుని నటించాను.
* రెండు పాత్రలలో ఏ పాత్ర నచ్చింది?
- ఒకే స్క్రీన్‌పై ఇద్దరు ప్రియమణులను ప్రేక్షకులు చూస్తారు. ఒక పాత్ర పాజిటివ్ థింకింగ్‌తో వుంటే, మరో పాత్ర దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ రెండు పాత్రలు నాకిష్టమైనవే!
* రెండు పాత్రలు ఎలా చేశారు?
- నా డూప్‌గా నటించిన దీపికకు ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాలి. ఏ ఎమోషన్ అయినా సరే ఆమె నాకు సహకరించి ఉండకపోతే రెండు పాత్రలలో నా నటన పండేది కాదు. ఇద్దరం ఎంతో అవగాహనతో ఈ పాత్రల్లో జీవించాం. అయితే దీపిక కనపడకపోయినా ఆమె కష్టం మాత్రం కనిపిస్తుంది.
* సయామీ కవలల జీవితాన్ని ఎలా ఆవిష్కరించారు?
- ఇద్దరి శరీర భాగాలు కలిసి ఉండడంతో వారి సమస్యలు వేరుగా ఉంటాయి. వాళ్లు అందరిలా బ్రతకవచ్చన్న ఓ విషయాన్ని దర్శకుడు చాలా చక్కని స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. వారి జీవితంలో ఓ అబ్బాయి ప్రేమించానంటూ ప్రవేశిస్తే వారి మనోభావాలు ఎలా ఉంటాయి? వారి భావోద్వేగాలను ఒకే స్క్రీన్‌పే పండించడం అనేది ఓ రకంగా సవాల్ లాంటిదే. అది చిత్రం చూసి మీరే చెప్పాలి.
* చిత్రానికి ఎలోన్ ప్రేరణా?
- అలాంటిదేం లేదు. జస్ట్ ఓ ఆలోచన తీసుకుని మన కథలా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందించారు.
* ప్రేమకథేనా?
- ప్రేమకథతోపాటు క్లాసికల్ వైలెన్స్ కూడా చిత్రంలో ఉంటుంది.
* సూర్య ‘మ్యాట్రన్’ ఇదే కథ కదా?
- కవలల కథ అయినా కానీ అందులో ఉన్న ఐడియా వేరు. ఇందులో ఉన్న కథ సరికొత్తగా ఉంటుంది.
* మళ్లీ జాతీయ అవార్డుకోసమా?
- అవార్డు ఆశించి ఆనాడు పరుత్తివీరన్‌లో నటించలేదు. ఇప్పుడు కూడా అటువంటి ఆలోచన కూడా లేదు. వచ్చింది అంటే మొదట వచ్చినదానికి మరో బోనస్ వచ్చిందనుకుంటా అంతే.
* తెలుగులో చేయడంలేదూ?
- ప్రస్తుతం తెలుగులో ఏ చిత్రంలో చేయడంలేదు. కథలు వింటున్నాను. నచ్చిన కథ దొరికితే తప్పక నటిస్తాను.
* ప్రయోగాలు చేయడం ఇష్టమా?
- అందరికీ నచ్చే విధంగా ప్రయోగాలు చేస్తే
ఆ సినిమాలు విజయం పొందుతాయన్న నమ్మకం నాకుంది. అందుకే సరికొత్తగా ప్రయోగాలు చేయడమంటే ఇష్టం. ప్రస్తుతం చేస్తున్న సయామీ కవలల కథ ప్రయోగమే కదా!
* కెరీర్ ఒక్కసారిగా ఆగిపోయినట్లు లేదా?
- తెలుగులో నటించకపోయినా కన్నడ, మలయాళ చిత్రాలలో బిజీగా ఉండడంతో అటువంటి భావం ఏనాడూ రాలేదు. చారులత చిత్రంతో మళ్లీ తప్పక తెలుగులో బిజీ అవుతానన్న నమ్మకం వుంది.

పిల్లలు తమ ఆనందం, దుఃఖం, ప్రేమ, కోపం వంటి భావోద్వేగాలను దాచుకునే అమూల్యమైన బ్యాంకే అమ్మ ఒడి.


అందమె ఆనందం

కీరా రసంలో రోజ్‌వాటర్, నిమ్మరసం కలపాలి. రాత్రి పడుకోబోయేముందు ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ముఖానికి రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా కనిపిస్తుంది.

ఒకచోట శిక్షలు, ఒకచోట రక్షణ: యు.ఎస్ రాష్ట్రాల ‘వైవిధ్యం!’.....డైలీ ఫీచర్

 
 
ఇళ్ళ దగ్గర, స్కూళ్లలోను పిల్లల్ని దండించిన వాళ్ళని జైళ్ళకి పంపే చట్టాన్ని ఇటీవల అమెరికాలోని డెలావేర్ రాష్ట్రం చేసిన వైనాన్ని ‘హలో అమెరికా’లో నిన్న మనం తెలుసుకున్నాం. కాగా, బడిలో క్రమశిక్షణ పేరిట చిన్నారుల్ని కొట్టి, బాధించే ‘కార్పొరల్ పనిష్మెంట్’ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో ఇంకా అమలులో ఉండడం అమెరికాను మానవ నాగరికతకు శిఖరంగా అభివర్ణించే వారికి మింగుడుపడని విషయమే!

ఒక్లహామా, జార్జియా, టెక్సాస్, అలబామా, టెన్నిసీ, లూజియానా, అర్కాన్సా, మిసిసిపి లాంటి రాష్ట్రాలలో ఇది క్రమేపీ తగ్గుముఖం పడుతున్నా ఎక్కువచోట్ల ఇంకా అమలులోనే ఉంది. అమెరికా దక్షిణాది రాష్ట్రాలలోనే కాక ఉత్తరాదిన కూడా కొన్నిచోట్ల ఇది కొనసాగుతుండడం వల్ల ఆయా రాష్ట్రాలలో సకుటుంబంగా కొంతకాలం ఉండడానికి వెళ్ళే నాన్-ఇమిగ్రెంట్లు తమ పిల్లల్ని చేర్పించే స్కూల్ హాండ్ బుక్ నుంచి సమగ్రంగా వివరాలు తెలుసుకోవాలి.

ఇండియా నుంచి విదేశాలకు ఉద్యోగం సద్యోగం కోసం పిల్లాపాపలతో వెళ్ళే పిల్లల్ని అల్లారుముద్దుగా, అపురూపంగా చూసుకునేవాళ్ళు; పిల్లలు ఎంత విసికించినా తమ జీవితకాలంలో వాళ్ళ ఒంటి మీద ఒక్క దెబ్బ అయినా వెయ్యనివాళ్ళే ఎక్కువ. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తమ పిల్లల్ని అక్కడ స్కూళ్ళలో నిబంధనల ప్రకారం ‘స్పాంకింగ్’ చేస్తే (వెనక్కి తిప్పి దెబ్బలు వేస్తే) తట్టుకోవడం అటువంటివారికి చాలా కష్టం.

అమెరికా అనేక వైవిధ్యాల దేశం ‘భిన్నత్వంలో ఏకత్వం’ ఇండియా ప్రత్యేకత అయితే ‘వైవిధ్యంతోనే ఐక్యత’ అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రత్యేకత. అక్కడ కేంద్రం కొన్ని కీలకరంగాల మీద మాత్రమే అజమాయిషీ చేస్తుంది. మిగతా విషయాలలో రాష్ట్రాలదే స్వయం నిర్ణయాధికారం. యు.ఎస్.లో రాష్ట్రాలకు ఉన్న విశేష అధికారాల వల్లనే అక్కడ కార్పొరల్ పనిష్మెంట్ పైన దేశవ్యాప్తంగా ఒకేరకమైన చట్టాలు లేవు. పిల్లల్ని చక్కదిద్దే మిషమీద మొగ్గల్లాంటి ఆ చిన్నారుల్ని పృష్టభాగంలో ఇన్ని దెబ్బలు అని లెక్కపెట్టి ఒక చెక్కబద్దతో కొట్టే ‘స్పాంకింగ్’ ఇంకా అక్కడ కొన్ని రాష్ట్రాలలో కొనసాగుతుండగానే బాలల మీద చెయ్యి చేసుకునే వాళ్లని జైళ్ళలో వేసే చట్టాల్ని మరికొన్ని రాష్ట్రాలు చెయ్యడంలోని ‘అమెరికన్ వైవిధ్యాన్ని’ అక్కడికి చేరుకునే నాన్- ఇమిగ్రెంట్లు అందరూ గమనించాలి.

పిల్లల్ని స్కూళ్ళలో కొరతవేసే ‘కార్పొరల్ పనిష్మెంట్’ని అమెరికాలో మొదటిసారిగా ఒక రాష్ట్రం (న్యూజెర్సీ) 1867 రద్దు చేసిన తర్వాత ఇంకొక రాష్ట్రం (మసాచుసెట్స్) దానిని నిషేధించడానికి మళ్ళీ 104 ఏళ్ళు పట్టింది. (1971). తిరిగి మరొక రాష్ట్రం (న్యూ మెక్సికో) ఈసారి 40 సంవత్సరాలలోనే (2011) అలాంటి చర్య తీసుకుంది. అటుపిమ్మట ఒక ఏడాదిలోనే (2012 సెప్టెంబరు) డెలావేర్ రాష్ట్రం ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ దిశగా దేశంలోనే తొలి చట్టాన్ని తెచ్చింది. ఈ ముఖ్యమైన అంశం మీద అమెరికాలో ధోరణులు మారడం ఊపందుకున్న దనడానికి ఈ టైమ్ లైన్ ఒక సూచన.

ఇలా ఉండగా, మాట వినని పిల్లల్ని అదుపులో పెట్టడానికి వాళ్ళని అప్పుడప్పుడు కొట్టడం తమ సంస్కృతిలో భాగంగా, సాంఘికంగా ఆమోదించిన చర్యగా ఉన్న దేశాల నుంచి అమెరికా వెళ్లి అక్కడ ఉంటున్న కొందరు విదేశీయులు యు.ఎస్. చట్టాలలో పిల్లలకు ఉన్న రక్షణ వల్ల పిల్లల్ని కొట్టడం మాట అటుంచి, గొంతెత్తి వారిని గట్టిగా ఒక్క మాట కూడా అనలేని పరిస్థితిలో ఉన్నారు. దీనివల్ల తమ పిల్లలు ఇంటిలోని పెద్దలను గౌరవించకపోవడం, తమ కుటుంబ సంప్రదాయాలను విస్మరించి పెడదారిన పడడం జరుగుతోందని వారు వాపోతున్నారు.

వెన్నెల మీద మోజుతో చంద్రుడి మీదికి వెళితే అక్కడ చంద్రుడు చేతికి అందినా ప్రాణావసరమైన ఆక్సిజన్ మాత్రం దొరకనట్టయింది వీరి పరిస్థితి! చట్టాలు కఠినంగా అమలు జరగని దేశాల నుంచి వెళ్ళినవారు అమెరికాలో ఇలా ఎక్కువగా ఉక్కిరిబిక్కిరవుతుంటారు.
అలాంటి వారిలో ఒక తండ్రి ఆవేదనని, కన్న కూతురిని సరిదిద్దడానికి ఆమె మీద చెయ్యి చేసుకుని జైలు పాలైన ఒక నిస్సహాయుడి హృదయఘోష

రేపటి ఫ్యామిలీలో....
ప్రతిరోజూ అమెరికా చదువుల / వీసాల సమాచారం

చిన్నారులకు క్రమ‘శిక్షలు’. అమెరికా ఏమంటోంది?,,,,డైలీ ఫీచర్

 
 
‘హలో అమెరికా’లో మనం నిన్న చెప్పుకున్నట్టుగా యు.ఎస్.లో కొన్నాళ్ళు ఉండడానికి ఫ్యామిలితో వెళ్ళేవారు అక్కడ వివిధ రాష్ట్రాలలో కొన్ని ముఖ్యమైన అంశాలలో అమలు చేసే నిబంధనలని ముందుగానే తెలుసుకుని వెళ్ళడం మంచిది. యు.ఎస్.లో చాలా విషయాలలో ఏ రాష్ట్రం నిబంధనలు ఆ రాష్ట్రానికే కనుక తాము నివసించే రాష్ట్రంలోని రూల్స్‌ని ప్రత్యేకంగా తెలుసుకుని వెళ్ళడం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చైల్డ్ అబ్యూజ్ (చిన్నారుల్ని హింసించడం), మహిళలపై గృహ హింస (డొమెస్టిక్ వయోలెన్స్) లాంటి వాటిలో యు.ఎస్. చట్టాల నిర్వచనం, అమలు ఎలా ఉన్నదో కూలంకషంగా అర్థం చేసుకోవాలి.

సరిగా చదవడం లేదని పిల్లవాడికి కర్ర కాల్చి వాత పెట్టడం, పప్పులో ఉప్పు ఎక్కువైందని భార్యని లెంప పగలగొట్టడం లాంటివి అనేక దేశాలలో ఇప్పటికీ ఏమంత పెద్దవిషయాలు కాక పోయినా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రం అవి చెల్లవి. అయితే ఇలాంటివి జరిగినప్పుడు అమెరికాలో పరిస్థితి నార్వే దేశంలో అయినట్టుగా ఒక్కసారే సీరియస్ అవ్వకపోయినా అక్కడ ఇండియాలో ఉన్నంత ఉదాశీనత ఉండదని మాత్రం గ్యారంటీగా చెప్పొచ్చు. యు.ఎస్.లో చాలా సందర్భాలలో పోలీసులు మొదట హెచ్చరించి ఆతర్వాత మాత్రమే కేసులు పెడతారు. అలాగే ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులు హింస పెడుతుంటే దానిని గురించి ఎవరికీ, ఎలా ఫోన్ చెయ్యాలో స్కూళ్ళలోను, బయట పిల్లలకి నేర్పుతుంటారు కూడా. అందువల్లనే అక్కడ అనేక ‘చైల్డ్‌అబ్యూజ్’ కేసులు పిల్లలు నేరుగా తమ తల్లిదండ్రుల మీద చేసిన ఫిర్యాదులు ఆధారంగా విచారణకి వచ్చినవే అయి ఉంటాయి.

డేలావేర్ రాష్ట్రం నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తని అక్కడి నుంచి అమెరికా వెళ్ళే వారందరూ శ్రద్ధగా గమనించాలి. ఎందుకంటే, ఇవాళ కాకపోతే రేపు అయినా అమెరికాలోని మిగతా అన్ని రాష్ట్రాలు ఈ బాట పట్టక తప్పదు. పిల్లల మీద పేరెంట్స్ చెయ్యి చేసుకోవడాన్ని పూర్తిగా నిషేదిస్తూ అమెరికాలో మొట్టమొదటిసారిగా డేలావేర్ ఈ ఏడాది సెప్టెంబరులో చట్టం చేసింది. రాష్ట్ర సెనేట్ ఆమోదించిన ఈ బిల్లు గవర్నర్ సంతకంతో చట్టం అయింది. చిన్నారులకి శారీరక బాధని (‘పెయిన్’) కలిగించే ఏ చర్య అయినా సరే ఇప్పుడు డేలావేర్ రాష్ట్రంలో ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. తల్లిదండ్రులు 18 ఏళ్ళ లోపు వయసున్న తమ పిల్లలకి శారీరక గాయం లేదా బాధ కలిగిస్తే ఈ చట్టం కింద ఒక ఏడాది వరకు జైలు శిక్ష విధించవచ్చు. అదే మూడేళ్ళలోపు వయసుగల పిల్లలకి బాధ కలిగిస్తే రెండేళ్ళ వరకు శిక్ష పడుతుంది.

ఈ బిల్లు చట్టంగా మారడానికి ఆ రాష్ర్ట అటార్నీ జనరల్ బ్యూ బిడెన్ చాలా కృషి చేశారు. ఆయన అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ కుమారుడు. ‘అమెరికాలో ఏటా 30 లక్షల మందికి పైగా చిన్నారులు హింస లేదా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. చైల్డ్ అబ్యూజ్ వల్ల ఇక్కడ చనిపోతున్నంత మంది పిల్లలు మరి ఏ ఇతర పారిశ్రామిక దేశంలోనూ చనిపోవడంలేదు’ అని బ్యూ బిడెన్ బాధపడినట్టు మీడియా కథనాలు వచ్చాయి. అయితే తగుమాత్రంగా పిల్లల్ని దండించి వారు గాడి తప్పకుండా చూడడానికి తమకి చాలా కాలంగా ఉన్న అవకాశాన్ని ఈ చట్టం హరించి వేసిందని, ఇది తమ హక్కులకి భంగం కలిగించిందని కొన్ని స్కూళ్ళసంఘాలు, పేరెంట్స్ సమాఖ్యలు ధ్వజమెత్తాయి. ‘స్పాంకింగ్’ని కూడా ఈ చట్టం పూర్తిగా నిషేధించడం పిల్లల్ని దండించడం ద్వారా దారికి తేవచ్చునని నమ్మే చాలా మందికి మింగుడు పడడం లేదు.

‘స్పాంకింగ్’ అంటే చిన్నారుల్ని వెనక్కి తిప్పి వాళ్ళ నడుము కింద పృష్ట భాగంలో ఒక బద్దలాంటి చెక్క వస్తువుతో కొట్టడం. అమెరికాలో అనేక రాష్ట్రాలలో ఇది కాలక్రమంలో అదృశ్యమైనా ఇంకా కొన్ని రాష్ట్రాలలోని కొన్నిస్కూళ్ళలో కొన్ని పరిమితుల మేరకు కొన్ని ‘జాగ్రత్తల’ మధ్య ఇంకా అమలు జరుగుతూనే ఉంది. పిల్లల మీద ‘శిక్ష’ అమలు చేయవలసి వచ్చినప్పుడు కొందరు ప్రొఫెషనల్ సాక్షులని దగ్గర పెట్టుకుంటారు. మూడు దెబ్బల కంటే ఎక్కువ కొట్టరు. పబ్లిక్‌గా ‘స్పాంకింగ్’ చెయ్యకుండా ప్రిన్సిపాల్‌రూమ్‌లో కొడతారు. ప్యాంటు, లేదా స్కర్టుమీదనే కొడతారు. ఆడపిల్లల్ని మహిళాప్రిన్సిపాల్, మగపిల్లల్ని మగ ప్రిన్సిపాల్ ‘స్పాంకింగ్’ చేస్తారు.

మిగతా... రేపటి ఫ్యామిలీలో...

మాగంటి
నవలా రచయిత, యుఎస్ కాన్సులేట్ పూర్వ మీడియా అడ్వయిజర్


ప్రతిరోజూ అమెరికా చదువుల / వీసాల సమాచారం

responsevisa@gmail.com

అమెరికాలో మీరు, మీ పిల్లలు: కొన్ని ముందస్తు జాగ్రత్తలు,,,,,,,,డైలీ ఫీచర్

 
 
తెలుగు నాన్-ఇమ్మిగ్రెంట్లు మిగతా అన్ని దేశాల కంటే యు.ఎస్.కే ఎక్కువగా వెళ్లి వస్తుంటారు. ఒక విదేశంలో (నార్వేలో) ఒక తెలుగు కుటుంబానికి వచ్చిన కష్టం గురించి ఇండియా అంతటా చర్చ జరుగుతున్న సమయంలో వీరు సహజంగానే కొంత ఆందోళన చెందుతారు. ముక్కూ మొహం తెలియని దేశంలో ‘నా’ అనేవాడు కనిపించని చోట ఇలాంటి సమస్య వస్తే ఏమిటని ఇప్పుడు లోలోపల చాలామంది బిక్కుబిక్కుమంటూనే ఉంటారు.

ఇక్కడి నుంచి భార్యా పిల్లలతో అమెరికా వెళ్లేవాళ్లు కూడా ఎక్కువే. అందులో టూరిజం కోసం వెళ్లేవాళ్లు, అయినవాళ్లతో కొన్నాళ్లు గడిపి రావడానికి చుట్టం చూపుగా వెళ్లేవారు, బిజినెస్ పనుల మీద వెళ్లేవాళ్లు, చదువులు, ఉద్యోగాల కోసం కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉండి రావడానికి వెళ్లేవాళ్లు ఉంటారు. రెండు మూడు నెలల ట్రిప్ మీద అమెరికా వెళ్లినా, రెండు మూడేళ్ల ఉద్యోగానికి అక్కడికి చేరుకున్నా విదేశాల నుండి వెళ్లిన నాన్-ఇమ్మిగ్రెంట్‌లు యు.ఎస్.లో దిగినప్పటి నుంచి ప్రతినిమిషం గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది.

నాన్-ఇమ్మిగ్రెంట్‌లకి అనేక అంశాలలో అమెరికాలో స్థిరపడిన ఇమ్మిగ్రెంట్‌లు, సిటిజన్లు, గ్రీన్ కార్డ్ హోల్డర్‌లతో సమానమైన హక్కులు లేదా సదుపాయాలు ఉండవు గాని చట్టాలని పాటించడంలో మాత్రం ప్రతి అంశంలోను అక్కడి స్థానికులతో సరిసమానమైన బాధ్యత ఉంటుంది. విదేశీయులే అని వీరికి అక్కడి రూల్స్‌లో రాయితీలు ఏమీ లభించవు. అలాగే, వారు వారే దేశాలకి చెందిన వారు కాబట్టి వారికి అమెరికాలో చట్టాలు వర్తించవని కాని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారిని వారి వారి దేశాల చట్టాల ప్రకారం మాత్రమే విచారించాలి గాని, స్థానిక చట్టాల ప్రకారం విచారించ కూడదని గాని నియమం లేదు (డిప్లొమాటిక్ హోదా ఉన్న విదేశీయులను మినహాయించి).

ఇలాగే మనకి చాలా చిన్నవి, అప్రాధాన్యమైనవి అనిపించే సంఘటనలు కూడా అక్కడ ఒక్కోసారి పోలీసుల వరకు వెళతాయి. వాటికి కోర్టుల్లో శిక్షలూ పడతాయి. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. అక్కడ మధ్యతరగతి ఇళ్లలో ఎక్కువభాగం చెక్కలతో కడతారు. పై అంతస్తులో చెక్క ఫ్లోరు మీద పిల్లలు అటు ఇటు పరుగులు తీస్తే క్రింది ఫ్లోర్‌లోని వాళ్లకి ఆ శబ్దాలకి నిద్ర పట్టదు. క్రింద, పైన అమెరికన్‌లే నివసించేటప్పుడు మాత్రం పెద్దగా సమస్య ఉండదు. అమెరికన్లు వాళ్ల పిల్లలకి ఈ విషయంలో అవసరమైన ట్రైనింగ్‌ని చిన్నతనం నుంచి ఇస్తారు కాబట్టి! ఎటొచ్చీ కొత్తగా అమెరికాకు చేరుకున్న నాన్-ఇమ్మిగ్రెంట్లు పిల్లా పాపలతో పైఅంతస్తులో ఉన్నప్పుడే ఒక్కోసారి ఇబ్బంది వచ్చి పడుతుంది. టాప్‌ఫ్లోర్‌లోని విదేశీ బాలనటరాజులు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా చేసే తకిట తథిమ శబ్దాలకు కింది వాళ్లు ఒక్కోసారి పోలీసుల్ని కూడా పిలిచేస్తారు. ‘‘ఓర్నీ, ఈ మాత్రానికేనా? మా ఊళ్లో ఇంతకంటే సందడిగా ఉంటే మాత్రం మేం పోలీసుల్ని పిలుస్తామా?’’ (పిలిస్తే మాత్రం వాళ్లు వస్తారా) అంటే కుదరదు! ఈ బెడద లేకుండా ఉండడానికి పిల్లా పాపలు ఎక్కువగా ఉన్న విదేశీ నాన్-ఇమ్మిగ్రెంట్‌లు అమెరికాలో కొన్ని చోట్ల గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్‌లను ప్రిఫర్ చేయడం నేను గమనించాను.

ఇటీవల ‘సాక్షి’లోని తమ వ్యాసంలో ప్రముఖ న్యాయశాస్త్ర నిపుణులు, ఒక పత్రికలో నా పూర్వ సహచరులు ఆచార్య మాడభూషి శ్రీధర్ నార్వే ఉదంతం గురించి రాస్తూ ఎంతో ప్రభావశీలమైన వాక్యం రాశారు. ‘‘నార్వే చట్టాలు మనదేశ శాసనాల కన్నా కఠినంగా ఉన్నాయన్న వ్యాఖ్యల్లో నిజం నిండు సున్నా. ఓస్లో కోర్టు నేరం మన దేశ న్యాయస్థానాల్లో విచారణ జరిగి ఉంటే మూడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది... అక్కడ చట్టాలు అమలవుతాయి, ఇక్కడ కావు’’.

ఇరుగు వాడిని పొరుగువాడి న్యూసెన్స్ నుంచి రక్షించే చట్టాలు ఇండియాలో కూడా ఉన్నప్పటికీ అవి ఇక్కడ సరిగా అమలుకావు కాబట్టి... వాటిని తు.చ. తప్పకుండా అమలు చేసే అమెరికాలో ‘చిన్న’ సమస్యకే వచ్చి పడే పోలీసులు కాస్త విచిత్రంగా కనిపించినా అది అక్కడ ఒక గ్రౌండ్ రియాలిటీ. అక్కడ అలాగే జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు అక్కడ అలాగే ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక హైపోథటికల్ సిట్యుయేషన్. అలా జరగకూడదనే కోరుకుంటున్నాను కాని.... ఒకవేళ జరిగితే ఏమవుతోంది చెప్పండి.

ఇక్కడ స్కూలులో ఒక పిల్లాడిని మరో పిల్లాడు కొడితే తల్లిదండ్రులు ఏదో రకంగా సర్ది చెప్పుకుంటారు. అదే అమెరికాలో జరిగితే ఏమవుతుంది? ఊహించలేకపోతున్నారా? ఆ బాలుడి మానసికస్థితిని సవరించడానికి కొన్ని నెలలపాటు ఆ పసివాడిని ఏదైనా కరెక్షన్‌సెంటర్‌కి పంపించే అవకాశం కూడా ఉంటుంది! మరి తల్లిదండ్రులు అటువంటి దానిని భరించగలరా? మీకోసం ఇంకో సిట్యుయేషన్; అమెరికాలో ఒక పార్కులో వెళుతూ ఒక తల్లిపక్కన ఉన్న ఒక పసిపాప ముద్దుగా బొద్దుగా ఉందని ఆమె బుగ్గలు పుణికారనుకోండి లేదా ఆ పాపని వాత్సల్యంతో ముద్దు పెట్టుకున్నారనుకోండి (ఇక్కడి లాగా!). ఆ మదర్ అప్పుడు ఎలా రియాక్టవుతారని మీరు అనుకుంటున్నారు? కచ్చితంగా ఆమెకి అలాంటివి నచ్చవు. మీరు ఆమె అనుమతి లేకుండా తన పాపని తాకితే ఆమె అభ్యంతరం వ్యక్తం చేసి తీరుతుంది.

అమెరికాలో ప్రతిదీ అదోలా ఉంటుందని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. అలా అన్నిటిలో ఖరాఖండీగా ఉండడం వాళ్లు అలవాటు చేసుకున్నారు. వాళ్ల మధ్యలో పిల్లాపాపలతో ఉండి ఎలాంటి సమస్యలు లేకుండా నాన్-ఇమ్మిగ్రెంట్లు తమ పనులు తాము సాఫీగా చక్కబెట్టుకుని తిరిగి రావాలనుకుంటే అక్కడి నిబంధనలని, సాంస్కృతిక నేపథ్యాన్ని ముందుగానే అర్థం చేసుకోవాలి. తమ పిల్లలని కూడా అక్కడి వాతావరణానికి అనుగుణంగా ట్యూన్ చేసుకోవాలి. విదేశాలలోని నాన్-ఇమ్మిగ్రెంట్లకి సమస్య వచ్చినప్పుడు వారి తరపున నిలిచే ఇక్కడి ప్రజలు, ప్రజానాయకులు, ఇక్కడి వారి ఆవేదనని అక్కడి ప్రభుత్వానికి చేరవేసినా ఆ ప్రభుత్వాలు మళ్లీ దానిని తమ కోర్టులకి చేరవేయలేవని అందరూ గమనించాలి.

అమెరికా స్కూళ్లలో పిల్లల్ని శిక్షిస్తారా? రేపటి ఫ్యామిలీలో.

మాగంటి
నవలా రచయిత, యుఎస్ కాన్సులేట్ పూర్వ మీడియా అడ్వయిజర్


ప్రతిరోజూ అమెరికా చదువుల / వీసాల సమాచారం

responsevisa@gmail.com

భక్తుణ్ణి భగవంతునిగా మార్చే మాసం!--నిత్య సందేశం

 
 
గీతలో కృష్ణుడు తానే మార్గశిర మాసం అని చెప్పాడు. అయితే కార్తికం మాట ఏమిటి? అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన మాసం. భక్తుణ్ని భగవంతునిగా మార్చే మాసం. అంటే కార్తికంలో భక్తుని హృదయంలో నివాసం ఉండి, మార్గశిరం వచ్చేసరికి వారు చేసిన సాధనను బట్టి తనవారిగా మార్చుకొంటాడట స్వామి. కృత్తికానక్షత్రంలో పున్నమి ఏర్పడుతుంది కనుక దీన్ని కార్తికం అంటారు.ఈ మాసంలో మనం తప్పకుండా చెయ్యవలసినవాటిని ఇలా వివరించారు...

సర్వేషామేవ సేవ్యాని కార్తికే వనభోజనమ్
బిల్వం స్నానం చ దీపం చ శ్రద్ధయా శివకేశవౌ॥

వనభోజనం, మారేడు దళాలతో పూజ, దీపారాధన, హరిహరుల్ని సేవించడం, నదీస్నానం...ఈ ఐదు చాలా ముఖ్యం. మారేడులోని ఔషధగుణాలు... కుష్ఠు, క్షయ మున్నగు రోగాల్ని ఛేదిస్తాయి. (బిల: ఛేదనేః బిల్వం. కనుక దీనిని బిల్వం అన్నారు), దేహానికి రోగనిరోధకశక్తి పెంచుతాయి, వాతావరణ కాలుష్యాన్ని హరిస్తాయి, సూర్యుని అతి నీలలోహిత కిరణాన్ని అడ్డుకొంటాయి, అత్యంత ప్రాణశక్తిని ఉత్పత్తి చేస్తాయి. అందుకే లక్షపత్రిపూజ అయిన మర్నాడు గుడితలుపులు తీసిన వెంటనే స్వామిని దర్శించాలన్నారు. గుండె నిండుగా ఊపిరి పీల్చాలి. రాత్రంతా గుడిలో మాగి ఉన్న మారేడు పత్రి వాసన ప్రొద్దుటే చాలాసేపు పీలిస్తే ప్రతిప్రాణికీ చాలా శక్తినిస్తుంది.

ఒకసారి తల్లులందరూ కలసి కుమారస్వామికి క్షీరసారాన్ని ప్రసాదించారట. చైతన్యం కవోష్ణంగా ఉంటుంది. ప్రతిప్రాణి దేహంలోనూ ఉష్ణశక్తిలేకపోతే జీవనం లేదు. ఈ గోరువెచ్చని ఉష్ణశక్తి లేకపోతే జీవనం లేదు. ఆ గోరువెచ్చని ఉష్ణశక్తి కార్తికంలో నదీనదాల్లో ఉంటుంది. అందుకే నదీస్నానం తప్పనిసరి అన్నారు. కుమారస్వామికి క్షీరాన్ని ఇచ్చిన ఆ తల్లుల గుంపునే కృత్తికా నక్షత్రంగా వర్ణిస్తారు. కృత్తిక అంటే విశ్వాసాన్ని, మాతృచైతన్యాన్ని ప్రసాదించే నక్షత్రరాశి.

వనంలో సమూహంగా భోజనం చెయ్యడం కార్తికంలో చాలా ముఖ్యం. అయితే ఆ వనంలో మారేడు చెట్టు తప్పక ఉండాలి. వంటలు కూడా అక్కడే చేయాలి. మూతలు తీసి కాస్తసేపు ఉంచాలి. ఆ ఉద్యానవనంలో ఉన్న అన్ని వృక్షాల గాలులూ ఆ వంటలకి సోకాలి. మనం కూడా పీల్చాలి. మామిడి, వేప, తులసి, జమ్మి, అనేక పూలమొక్కలూ మనం భుజించే వనంలో ఉండేలా చూసుకోవాలి. మనం తినగా మిగిలింది అనేక ప్రాణులకి ఆహారం కూడా అవుతుంది. ఈ వనభోజనం ఒక విధంగా వన విహారం. ఈ కార్తికంలో ఆవునేతితో దీపం పెట్టడం తప్పనిసరి. ఆవునెయ్యి వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. వాతావరణ కాలుష్యం తొలగి కంటికి మంచి శక్తి వస్తుంది.

శివకేశవులనిద్దరినీ భేదం లేకుండా ఈ నెలలో పూజించాలి. అందుకే పైశ్లోకంలో ఇద్దరినీ ఒక్కరిగానే చెప్పబడ్డారు. మనకు ఏదో కావాలనీ, నేను కనుక ఇంత బాగా చేస్తున్నాననీ, పక్కవాళ్లు ఏమీ చెయ్యడం లేదనీ... భావన చెయ్యకూడదు. అహంకారం, ఆర్భాటం పనికిరావు. హృదయం పెట్టి చేసేది ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఇద్దరిలో ఒకరు అహితాన్ని నాశనం చేసేవారైతే (రుద్ర) మరొకరు మంచిని పోషించేవారు. ఆ పని ఎవరు ఈ సమాజానికి చేస్తున్నా వారు హరిహరుల వంటివారే.
- డా. ధూళిపాళ మహాదేవమణి

అబ్బాయి బరువు పెరుగుతున్నాడు... ఏం చేయాలి?(డాక్టర్‌ని అడగండి: స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్)

 
 
మా అబ్బాయికి 13 ఏళ్లు. ఈ వయసులోనే వాడు పెద్దవాళ్లు ఉండేంత బరువున్నాడు. వాడిలా బరువు పెరుగుతూ పోవడం మమ్మల్ని ఆందోళన పరుస్తోంది. దయచేసి వాడి బరువు తగ్గించడానికి నాకు తగిన సూచనలు ఇవ్వండి.
- ధరణి ఎస్., కోదాడ

ఈ టీనేజ్‌లో పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు బరువు పెరిగే అవకాశం ఉంది. మీ అబ్బాయికీ ఇది వర్తిస్తుంది. మీరు ముందుగా అతడికి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పాలి.

స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్, జామ్ వంటి వాటితో అతడు మరింత బరువు పెరిగేందుకు అవకాశం ఉంది. వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను మరింత దూరం ఉంచడం మంచిది.

వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు.

పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు.

తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది.

పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనా పాలన, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది.

పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పరీక్షలు చేయించి రూల్ అవుట్ చేసుకోవడం అవసరం.

ఆటలాడుతున్నప్పుడు, ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి షూ వాడాలి? స్పోర్ట్స్ షూ ఎంపిక విషయంలో పాటించాల్సి జాగ్రత్తలు ఏమిటో చెప్పండి.
- సుధాకర్, నెల్లూరు

మీరు స్పోర్ట్స్‌లో పాల్గొంటున్నప్పుడు వాడే షూకు ఈ కింది క్వాలిటీస్ ఉండేలా చూసుకోండి.
అది ఎటుపడితే అటు వంగేలా (ఫ్లెక్సిబుల్‌గా) ఉండాలి.
దానికి తగినంత హీల్ ఉండాలి. మీ కాలికి ఆ హీల్ సపోర్ట్ అందాలి.
స్పోర్ట్స్ షూ వేసుకున్నప్పుడు దాని సైజ్ మీకు సౌకర్యంగా ఉండాలి.
మీరు దాంతో చేసే వ్యాయామాల తీవ్రత లేదా ఆటలాడే వ్యవధిని బట్టి మూడు నెలల నుంచి ఏడాది వరకు దాన్ని వాడవచ్చు.
దాని అరుగుదలను గమనించడానికి క్రమం తప్పకుండా అడుగుభాగాన్ని తరచూ చెక్ చేయండి.
ఏదో నిర్దిష్టమైన బ్రాండ్ కంటే దానివల్ల మీకు కలిగే సౌకర్యానికే ప్రాధాన్యం ఇవ్వండి. ఏ బ్రాండ్ సౌకర్యంగా ఉంటుందన్నది నిర్ణయించుకోండి.

12.12.12...........అంకెల వింత తప్పితే అంత ప్రాధాన్యత లేదు!

12.12.12 తేదీలో అంకెల గారడీ తప్ప వింత కానీ ప్రత్యేకత కానీ లేదు. కేవలం గుర్తు పెట్టుకోవడానికి మాత్రం పనికొస్తుంది. ఈ తేదీ శుభప్రదమని, ఇవ్వాళ సిజేరియన్ చేయించుకుంటే పుట్టబోయేపిల్లలు అదృష్టవంతులవుతారని, ఇవ్వాళ పెళ్లి చేసుకుంటే మంచిదని, ఈ రోజున ఏవైనా పనులు తలపెడితే దిగ్విజయంగా జరుగుతాయని నమ్మి చాలామంది ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు దృష్టికొచ్చింది. ఆపరేషన్లు తప్పనివారు, జన్మ, నామనక్షత్రాలకు అనుగుణంగా ఈ తేదీన వివాహాది శుభముహూర్తాలు కుదిరినవారు తప్పించి మిగిలినవారు మోజుపడవలసిన పనిలేదని తెలియజెప్పేందుకే ఈ వివరణ.

ఈ తేదీన ఎవరైనా పుడితే వారి డేటాఫ్ బర్త్‌లో 3 ఒకట్లు ఉంటాయి కాబట్టి వారికి మంచి నాయకత్వ లక్షణాలుంటాయి. ఆలోచనలు ఉన్నతస్థాయిలో ఉంటాయి. ఎంత అభివృద్ధి సాధించినా తృప్తి ఉండదు. డెస్టినీ నంబర్ 11 అవుతుంది. ఇది మాస్టర్‌నంబర్. ఇది చంద్రుడికి ప్రతీక. వీరు జీవితంలో ఎంతో సంపాదించాలనుకుంటారు. అయితే ఒడిదొడుకులు తప్పవు.

పాశ్చాత్య జ్యోతిశ్శాస్త్రం ప్రకారం 12.12.12న ధనురాశి వస్తుంది. ఈ రాశిలో ఉన్న వారికి టెన్షన్ ఎక్కువ. ఉన్నతస్థానాన్ని పొందాలని ఆశిస్తారు, జీవితంలో పైకి ఎదగాలని ఆకాంక్షిస్తారు. ఈ తేదీన పుట్టిన వారి నంబర్‌లో 4 రెండ్లు వస్తాయి. అందులో 2 పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే చంద్రుడి ప్రభావం వల్ల వీరికి సృజనాత్మకత, ఊహాశక్తి ఎక్కువ. ఈ తేదీన పుట్టినవారిలో కవులు, రచయితలు, భావుకులు అధికంగా ఉంటారు. అయితే చంద్ర కళల్లాగే వీరికి కూడా జీవితంలో వృద్ధి క్షయలు ఎక్కువగా ఉంటాయి.

సంప్రదాయ జ్యోతిశ్శాస్త్రం ప్రకారం... ఈ వేళ అనురాధ నక్షత్రం వస్తుంది. ఈ నక్షత్రంలో చండ్రుదు నీచపడతాడు. ఈ వేళ పుట్టినవారిపై చంద్ర , బుధ, సూర్య, శుక్ర, రాహుగ్రహాల ప్రభావం ఉంటుంది. అందువల్ల అది అంత మంచిది కాదు. వివాహాది ముహూర్తాల విషయానికొస్తే- అమావాస్యకు ముందు శుభముహూర్తాలు అంతగా ఉండవు. కాబట్టి మరోసారి స్పష్టం చేస్తున్నదేమంటే - ఈ మూడు పన్నెండ్ల మీద మోజుతో ఇది దివ్యమైన రోజనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. జన్మ, నామనక్షత్రాలకు అనుగుణంగా కాకతాళీయంగా ముహూర్తాలు కుదిరితే అందులో తప్పులేదు కానీ పట్టుబట్టి, ఈవేళ ముహూర్తాలు పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు. వైద్యులు ఈరోజున సిజేరియన్ తప్పదంటే తప్ప అంకెల గారడీలో చిక్కుకోవద్దని సలహా.
- మహమ్మద్ దావూద్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్

డబుల్ జాయ్...........సింగిల్ పేరెంటింగ్

 
 
మృణాళిని అంటే తామరపూల గుచ్ఛం అని అర్థం. వ్యవస్థలోని పరిస్థితులు బురదలా ఊపిరిని పట్టేసినా తామరాకులా చెక్కుచెదరకుండా... తన పిల్లల్ని పెంచింది.ఆ కుసుమాలు పరిమళాలు వెదజల్లుతున్నాయి. మనందరికీ ఒక మధురమైన సందేశాన్ని అందిస్తున్నాయి. కంటికి ఇంపుగా కనపడే కమలం వెనకాల కన్నీరు ఎవరికీ కనపడదు. ‘నాకు అస్సలు కష్టమే అనిపించలేదు...’ అంటారు మృణాళిని.సింగిల్ పేరెంటింగ్ ఈజ్ ఎ డబుల్ జాయ్!.. అన్నమాట! అందుకే ఇది గాథ కాదు... స్ఫూర్తినిచ్చే ఒక సున్నితమైన కథ!


మా చిన్నప్పుడు మేం పెరిగాం. అమ్మ, నాన్న మమ్మల్ని కష్టపడి పెంచినట్లు నాకేం గుర్తులేదు. గత మూడు దశాబ్దాలుగా మాత్రం మనం కష్టపడి పెంచుతున్నాం. ఉన్నది ఒకరో, ఇద్దరో కాబట్టి పెంచడం ఒక కళగా, ఒక అభ్యాసంగా మార్చుకున్నాం. నేను మా అమ్మానాన్నల్లా నా పిల్లల్ని ఎక్కువ కష్టపడకుండానే పెంచానని ఇప్పుడు వెనక్కి చూసుకుంటే అనిపిస్తుంది.

దీనికి నేను కొంతవరకూ కారణమైతే, నా పిల్లలే ఎక్కువ కారకులు. అన్నం తినడానికి మారాం లేదు; స్కూలుకు వెళ్లడానికి ఏడుపు లేదు; అది కావాలి, ఇది కావాలి అని పేచీ లేదు. ఇంట్లో విధ్వంసకాండలు లేవు. ఇలాంటి పిల్లలు అదృష్టవంతులకి పుడతారు. నేను చాలా అదృష్టవంతురాలిని. పిల్లల్ని మనం పెంచనక్కర్లేదు. వారితో కలిసి జీవించాలి అని చాలాకాలం క్రితమే అర్థం చేసుకున్నాను.

పాపకూ, బాబుకూ మధ్య అయిదేళ్ల తేడా ఉంది. బాబుకు ఏడేళ్లు, పాపకు పన్నెండేళ్లు ఉన్నప్పుడు ఒక అవాంతరం. కొన్ని పరిస్థితుల వల్ల నేను సింగిల్ పేరెంట్‌ని అయ్యాను. అదివాళ్లకు బహుశా బాధ కలిగించే ఉంటుంది. బహుశా అని ఎందుకంటున్నానంటే, వాళ్లిద్దరూ అప్పుడుగానీ, ఇప్పుడుగానీ ఏరోజూ నన్ను దేని గురించీ ప్రశ్నించలేదు; నిలదీయలేదు. ‘దుఃఖితమతులై’ రోదించలేదు. నేను కూడా ‘సింగిల్ పేరెంట్’ని అని ఏనాడూ భయపడలేదు; బాధపడలేదు. జీవితంలో అన్నీ లభించవు. లభించిన వాటికి ఆనందించాలి. దొరకని వాటి గురించి ఆలోచించడం మానేయాలని ఏనాడో నిశ్చయించుకున్నాను. వాళ్లని పెంచడం ఒక బాధ్యతగా, ఏదో మిన్ను విరిగి మీద పడ్డట్టుగా నేనెప్పుడూ భావించలేదు.

పిల్లలతో సమయం గడపడంలో ఎంత ఆనందం ఉందో, అదంతా నాకే లభించినందుకు ఇంకా ఎక్కువ సంతోషించాను. పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో వాతావరణం ఉల్లాసంగా, సంతోషంగా ఉండాలని నేను నమ్ముతాను. తల్లిదండ్రులిద్దరూ కలిసి ఉన్నంతమాత్రాన వాతావరణం బాగుంటుందని నమ్మకం ఏమీ లేదు. సింగిల్ పేరెంట్ ఉన్నచోట విషాదం ఉంటుందనీ, పిల్లలు క్రమశిక్షణ లేకుండా పెరుగుతారనీ, మానసికంగా దెబ్బతింటారనీ చాటింపు వేసే పురజనుల నమ్మకానికి నేను పెద్దవిఘాతాన్నే కలిగించాను. ఇంట్లో అందరం (నాతో చాలాకాలం ఉన్న అత్తగారితో సహా) ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉండేవాళ్లం. ఇక క్రమశిక్షణ అంటారా? అది మనకు ఉంటే పిల్లలకు సహజంగానే వస్తుంది.

బహుశా, నేను చేసిన ఒక్క మంచిపని ఏమిటంటే, పిల్లలకు, వాళ్ల తండ్రితో సహజమైన సంబంధం చెదరకుండా చూసుకోవడం. వాళ్లని తరచు తండ్రి దగ్గరకు పంపేదాన్ని. వినాయక చవితి, దీపావళి పండగలు తండ్రితోనే జరుపుకునేవారు. ఇప్పటికీ జరుపుకుంటారు. వాళ్ల నాన్న కూడా అవసరమైనప్పుడల్లా వాళ్లకి అందుబాటులో ఉంటారు కనక, తండ్రితో వాళ్ల అనుబంధం సహజంగా, సంతోషంగానే ఉంటుంది. పిల్లలు మంచిగా ఉండాలనుకునే ముందు, మనం అలా ఉన్నామా అని ఆలోచించుకోవాలనుకుంటాను. మనం చేసి చూపించలేని మంచిని, ఆదర్శాన్ని వారిలో ఆశించడం అన్యాయం.

అయితే, పిల్లల్ని పెంచడంలో ఏ కష్టమూ రాలేదా? అంటే రాలేదని చెప్పలేను. వచ్చినవి తట్టుకోలేని కష్టాలేమీ కావు. పిల్లల చదువు విషయంలో, హాబీల విషయంలో అభిప్రాయాలు పంచుకోడానికి మనిషి లేకపోవడం ఒక్కటే బాధ కలిగించేది. అయితే అదృష్టవశాత్తు ఆ సమస్యలన్నిటినీ సులువుగానే పరిష్కరించుకోగలిగాను. ఇలా పరిష్కరించుకోగలగడానికి ముఖ్యకారణం నాలో స్వీయకరుణ (సెల్ఫ్ పిటీ) ఏ మాత్రం లేకపోవడం, పరనింద నా చేత కాకపోవడం అనుకుంటా. ఎంత ప్రయత్నించినా నా మీద నాకు జాలి కలగదు. ప్చ్. నా స్థితికి మరొకర్ని నిందిద్దామంటే, వాళ్లెవరు నా జీవితాన్ని నాశనం చేయడానికి అని ఉక్రోషం వస్తుంది కనక, నా స్థితికి నేనే కారణం అనుకుంటే హాయి. అన్నింటికీ మించి నా పిల్లలు నేను ఏ మాత్రం బాధపడే అవసరం రాకుండా చూసుకోగల సమర్థులు.

మామధ్య తల్లీపిల్లల అనుబంధం కంటే స్నేహబంధమే ఎక్కువ. ఇప్పుడు ఇద్దరూ పెద్దవాళ్లయ్యాక ఈ మాట అనడం కాదు. చిన్నప్పటి నుంచీ కూడా వాళ్లతో ప్రతిదీ పంచుకునే అలవాటు నాకుంది. మా అబ్బాయితో కూర్చుని టీవీలో నాకేమాత్రం ఇష్టంలేని డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఫైటింగులు చూశాను. వాడితో నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆడాను. తను కూడా తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాతో కచేరీలు వినడానికి వచ్చేవాడు. మా అబ్బాయి గిటార్ వాయిస్తూ, పాడుతూంటే, వాడికి యుగళంగా నేను కూడా ఆ రాక్ పాటలు లిరిక్స్ నేర్చుకుని పాడాను.

మా అమ్మాయి సలహాలేనిదే ఇంటికి ఏ వస్తువూ రానంతగా తన ఎంపిక మీద నాకు నమ్మకం. ఇద్దరం టీవీలో వంటల కార్యక్రమాలు చూసి, ప్రయోగాలు కూడా చేస్తాం. పాత హిందీ సినిమా పాటలు వింటూ, వాటి మీద విశ్లేషణ చేస్తూ ఆస్వాదిస్తాం. వాళ్లిద్దరూ నన్ను, నా వ్యాపకాలనూ వెక్కిరిస్తారు. నేనూ వాళ్లని ఆటపట్టిస్తాను. పిల్లల్ని కొట్టకుండా, తిట్టకుండా పెంచడం అసాధ్యమని చాలామంది అంటూంటారు. ఎందుకో... నేను ఇద్దరిమీదా ఒక్క దెబ్బా వేయలేదు, గొంతు పెంచిన సన్నివేశాలు కూడా దాదాపు లేవు. అంతకంటే ముఖ్యంగా పిల్లలకు ఎప్పుడూ వాస్తవం చెప్పడానికి వెనకాడలేదు. ఫలానా వస్తువు కొనడానికి డబ్బు లేకపోతే ఆ విషయం వాళ్లకు స్పష్టంగానే చెప్పేదాన్ని. వాళ్లూ అర్థం చేసుకునేవారు.

కానీ అతి త్వరలోనే ఏదో పని చేసి (ఎక్కువగా టీవీ షోలు, లేదా అనువాదాలో చేసి) డబ్బు తెచ్చి ఆ వస్తువు కొనడానికి ప్రయత్నించేదాన్ని. తీసుకురాకపోతే వాళ్లు ఏమీ అనరని తెలుసు. అందుకే తేవడం. బహుశా మా మధ్య ఉన్న ఈ స్నేహం వల్లనేనేమో ఇంటర్ ఫస్టియర్‌లో ఉండగా తనకు ఒక ఆడపిల్ల నుంచి వచ్చిన ప్రేమలేఖను మావాడు తన స్నేహితులకు కాక, ముందుగా నాకే చూపించాడు. అలాగే మా అమ్మాయి డిగ్రీలో ఉన్నప్పుడు స్నేహితులు కాలేజీ ఎగ్గొట్టి సినిమాకు వెళ్దామంటే ‘‘మా అమ్మకు ఫోన్ చేసి సినిమాకు వెళ్తున్నట్టు చెప్తానని’’ అలాగే చేసి, స్నేహితులను ఆశ్చర్యపరిచింది. అమ్మకు చెప్పకుండా దొంగతనంగా, సినిమా చూసే అవసరం నాకు లేదని చెప్పింది. ఇవి చాలా చిన్న ఉదాహరణలు మాత్రమే.

నేను అనేక కారణాల వల్ల అలవిమాలిన పనులు పెట్టుకుని చాలా బిజీగా జీవితం గడిపాను. ఆ రకంగా చూస్తే, నా ప్రయాణాలు, సాహిత్య సమావేశాలు, టీవీ షూటింగులతో వాళ్ల చిన్నప్పుడు తగినంత సమయం వాళ్లకు కేటాయించానా అని అపుడప్పుడూ అపరాధ భావన నాకు కలగకపోలేదు. కానీ రోజులో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం నుంచి రాత్రి లోపల రెండుగంటలు ప్రతిరోజూ వాళ్లిద్దరితో గడపాలన్న నియమాన్ని పాటించాను. క్వాంటిటీ టైమ్ కాకపోయినా, క్వాలిటీటైమ్ వాళ్లతో గడిపానన్న తృప్తి నాకుంది. నేను ఎంత బిజీగా ఉన్నా, వాళ్లిద్దరి నుంచి వచ్చే ఫోన్ మాత్రం తప్పక తీస్తాను. పిల్లలు ఏ విషయమైనా, ఎలాంటి సమస్య అయినా ఇంట్లో చెప్పుకోవచ్చు. ఓదార్పుకు, పరిష్కారానికీ బయటివాళ్ల మీద ఆధారపడనక్కర్లేదు అని చెప్పడంలో బహుశా నేను సఫలమయ్యాను.

ఇంతా చేసి, ఇంతా చెప్పి చిట్టచివరగా నా అభిప్రాయం ఏమిటంటే, నేను మంచి అమ్మను అవునో కానో నాకు తెలీదు. (అది నా పిల్లలనే అడగాలి) కానీ, నా పిల్లలు, మృదుల, తేజ మాత్రం అచ్చ బంగారాలే.
- మృణాళిని

ఉద్యోగ వేటా... ప్రాణాలకు చేటా?

 
అది పరుగు కాని పరుగు. ప్రాణాలను పందెంగా కాసే పోటీ పరుగు. అల్లంత దూరంలో జీవనోపాధి కళ్లకు కనిపిస్తూ ఊరిస్తూ ఉండగా ఉరికే పరుగు. ఆశగా ఉద్యోగాన్ని అందుకోబోతున్న సమయంలో అశనిపాతంలా మారే పరుగు. అభ్యర్థిని నేలకు ఒరగదీసే పరుగు. ఉద్యోగం అల్లంత దూరంలో కనిపిస్తుండగా గుండె మెలిపెట్టినట్టు అవుతుంది. మెలిపెట్టిన గుండె కాళ్లలో మెలికవుతుంది.

నేల మీద మొదలైన పరుగు కాస్తా ఉద్యోగస్థానం వద్ద ఆగక... నేరుగా పరలోకానికే దారితీస్తుంది. ప్రాణాన్నీ తీస్తుంది. ఎస్సై, కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న అనేక పరుగుల పోటీల్లో జరిగేది ప్రమాదం లేని పరుగులా కాకుండా... వెనక మృత్యువు తరుముకొస్తుండగా ఉరికే పరుగులా సాగుతున్న నేపథ్యంలో ఆ సమస్యలను ఎలా అధిగమించవచ్చో, అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో సూచించేందుకే ఈ కథనం.

మొన్నటికి మొన్న సోమవారంనాడు ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న పరుగులపోటీలో ఏకబిగిన 4 కి.మీ. పరుగెత్తలేక ఒకరు మృత్యువాత పడ్డారు. సరిగ్గా సగం దూరం పరుగెత్తాక గుండెపట్టుకుపోయి కుప్పకూలిపోయి సంజీవ అనే యువకుడు విగతజీవుడయ్యాడు. ఇది కేవలం సంజీవకే పరిమితం కాదు. ఇటీవల పోలీస్ నియామకాల కోసం నిర్వహిస్తున్న ఎన్నో పరుగుల పోటీల్లో ఇదే సంఘటన పునరావృతమవుతోంది. ఇలా పరుగుల పోటీలో పాల్గొని మరణించినవారెవరూ రోగులు కాదు. అంతకు ముందు షుగరూ, బీపీ, గుండెపోటులాంటి వ్యాధులు ఉన్న దాఖలాలు లేవు. అంతా యుక్తవయస్కులే. ఆ వయసులో మరణిస్తారని ఆశించడానికీ వీల్లేనివారే. అయినా ఇలా ఎందుకు జరుగుతోందో

తెలుసుకుందాం...
మృత్యుప్రమాదాలు ఎవరెవరిలో...
సాధారణంగా ఉద్యోగ నియామకాల కోసం పోటీలో పాల్గొనే 20 - 25 ఏళ్ల వయసున్నవారు ఒక వర్గం కాగా... ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతో వ్యాయామంలో భాగంగా ఉదయాన్నే లేదా సాయంత్రాన పరుగులు తీసే 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యవయస్కులు మరో వర్గం. ఇలాంటి మరణాలకు గురైన వారిని పరిశీలిస్తే 95 శాతం పురుషులే ఉంటారు.

తీవ్ర వ్యాయామం కొందరిలో ప్రమాదకరం...
ఆరోగ్యం కోసం చేసే వ్యాయామం చాలా తక్కువమందిలో ఒక్కోసారి వికటించి ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీయవచ్చు. సాధారణంగా తీవ్రంగా పరుగెత్తుతూ శ్రమించాల్సిన రన్నింగ్, ఫుట్‌బాల్ క్రీడలలో ఈ తరహా ప్రమాదాలు ఎక్కువ. దీనికి కారణం... అలవాటు లేకుండా ఒకేసారి ఒళ్లు తట్టుకోలేనంతటి తీవ్రంగా శ్రమ చేయాల్సి రావడమే. అందుకే ఇలాంటి పోటీల్లో పాల్గొనేవారు క్రమబద్ధమైన పద్ధతిలో క్రమంగా తాము పరుగుతీసే దూరాన్ని, వేగాన్ని దీర్ఘకాల వ్యవధిలో... కొద్దికొద్దిగా మాత్రమే పెంచుకుంటూ పోవాలి. స్వల్పవ్యవధిలోనే ఎక్కువ లక్ష్యాలను నిర్ణయించుకోవడం సరికాదని గుర్తుంచుకోవాలి.

లోపల జబ్బులు ఉండవచ్చా?
ఇలా మృతిచెందేవారి వివరాలను పరిశీలిస్తే... ఈ అభ్యర్థులకు వాళ్లకు తెలియకుండానే అంతర్గతంగా జబ్బులుండే అవకాశాలున్నాయేమోనని చూస్తే... దాదాపు 40 శాతం మందిలో ఎలాంటి వ్యాధులు ఉండటానికి ఆస్కారం లేదని తెలుస్తోంది. అయితే పది శాతం మందిలో మాత్రం గుండెకండరం పెరిగే హైపర్‌ట్రాఫిక్ కార్డియోమయోపతి అనే వ్యాధి ఉండేందుకు అవకాశం ఉంది. మిగతా సగం మందిలో కొద్దిమందిలో హార్ట్‌ఎటాక్ ఉండే అవకాశాలున్నా వారి శాతం స్వల్పం. అయితే 35 నుంచి 50 ఏళ్ల మధ్యనున్న వారిలో చూస్తే 20 శాతం మందిలో మాత్రం గుండెలో ఏర్పడ్డ రక్తనాళాల్లో ఏర్పడ్డ అడ్డంకుల వల్ల హార్ట్‌ఎటాక్ సంభవించి మృతిచెందే అవకాశం ఉంది. ఇక మిగతావారిలోనూ కొందరిలో గుండె విద్యుత్ ప్రసరణలో మార్పులు ఉండవచ్చు. ఇవన్నీ మరణించిన వారిని పరిశీలించగా తేలిన ఉజ్జాయింపు అంచనాలు మాత్రమే. కానీ... పరుగులో పాల్గొనే 80 శాతం మందిలో మాత్రం ఎలాంటి జబ్బులూ, వ్యాధులూ ఉండేందుకు అవకాశం లేదు.

అభ్యర్థుల ప్రాణాలను కాపాడేదెలా?
క్రీడాప్రాంగణంలో పరుగు పోటీలో పాల్గొనే అభ్యర్థి అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు వెనువెంటనే అతడికి ఎలక్ట్రిక్ షాక్ ద్వారా గుండెను మళ్లీ మామూలుగా కొట్టుకునేలా చేసే ఉపకరణాలను ఉపయోగిస్తే చాలావరకు ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తూ మనదేశంలోని దాదాపు అన్ని క్రీడాప్రాంగణాలలో ఇలాంటి పరికరాలు ఉండేందుకు అవకాశమే లేదు.

ఒకవేళ ఈ పరికరాలు ఉంచితే వాటిని ఎలా ఉపయోగించాలన్న అవగాహన ఉన్న సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలి. అందుకే ఈ తరహా ఉపకరణాలను అందుబాటులో ఉంచడం అవసరం. ఈ ఉపకరణాలను అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో ఉంచితే... ఒకవైపు ప్రథమచికిత్సతో పాటు షాక్‌చికిత్స చేస్తూనే ఆసుపత్రికి తరలించవచ్చు.

స్పోర్ట్స్ కార్డియాలజిస్టుల సూచనలేమిటి?
క్లిష్టమైన పరుగుల పోటీల్లో పాల్గొనే ముందు అభ్యర్థులందరికీ ఈసీజీ తప్పనిసరి

ఈసీజీ పరీక్షలో ఎలాంటి లోపాలను కనుగొన్నా ఎకో, ఎమ్మారై పరీక్షలు తప్పనిసరి

పోటీలో పాల్గొనే అభ్యర్థుల కుటుంబాల్లో ఎవరైనా చిన్న వయసులోనే అకస్మాత్తుగా మరణించిన కుటుంబచరిత్ర ఉంటే... ఆ అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పనిసరిగా వైద్యులకు తెలియజేసి తమ ‘జన్యుపరీక్ష’ నిర్వహించాకే పోటీలో పాల్గొనాలి

శరీరదారుఢ్య పరీక్షలు జరిపే స్థలంలో గుండెపట్టేసి కుప్పకూలే అభ్యర్థులకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడానికి ‘డీ-ఫిబ్రిలేటర్’ అనే ఉపకరణాన్ని సిద్ధంగా ఉంచాలి. దానిని ఉపయోగించేవారు సైతం ప్రత్యేక తర్ఫీదు పొంది, నిపుణులైన వారు ఉండాలి.


ఇతర దేశాల్లోని మార్గదర్శకాలేమిటి?
అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహించడానికి ముందు తప్పనిసరిగా ఈసీజీ నిర్వహిస్తారు. ప్రపంచ ఒలింపిక్ సంస్థ సైతం ఈసీజీ పరీక్ష చేయించకుండా అభ్యర్థులను పోటీలో పాల్గొననివ్వబోమంటూ ఇటీవలే తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మన దేశంలోనూ ఇలాంటి నిబంధనలే పాటించడం వల్ల ఇలాంటి ప్రమాదాలను చాలావరకు నివారించవచ్చు.

అభ్యర్థులే ప్రమాదాలను నివారించుకోవచ్చా?
తప్పకుండా! ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... కొన్ని ఉద్యోగాలకు శరీరదారుఢ్యం అవసరం. దాన్ని తెలుసుకోడం కోసమే ఈ తరహా పరీక్ష. అందుకే ఈ తరహా పరీక్షల్లో పాల్గొనేవారు క్రమంగా సామర్థ్యం పెంచుకోవాలి. వీళ్లంతా నేరుగా పోటీలో పాల్గొనేలా చేయడానికి బదులుగా... ముందుగా వీళ్లకు ఒకసారి ఈసీజీ తీయించి, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే పోటీలో పాల్గొననివ్వాలి.

ఈసీజీలో అత్యంత సూక్ష్మమైన మార్పులు నమోదవుతాయి కాబట్టి చాలామేరకు ఇలాంటి ప్రమాదం ఉండే అవకాశాలున్నవారిని ముందుగానే గుర్తించి, పోటీకి దూరంగా ఉంచడం సాధ్యపడుతుంది. కొన్నిచోట్ల ఇలాంటి ప్రమాదం ఉన్న అభ్యర్థులను కనుగొనేందుకు ఇటీవల ‘స్పోర్ట్స్ కార్డియాలజీ’ అనే ఉపవిభాగం ఆవిర్భవించింది. కానీ ఇది అందుబాటులో ఉన్న కేంద్రాలు తక్కువ. ఇక ఈసీజీ లో మార్పులు ఉన్నట్లు గమనిస్తే వెంటనే సదరు అభ్యర్థికి తదుపరి ఎకో పరీక్షను నిర్వహించాలి. ఆ తర్వాత దశలో చాలా కొద్దిమందిలో గుండెకు ఎమ్మారై పరీక్షలు, చివరగా జన్యుపరీక్షలు చేయించాల్సి రావచ్చు.

మామోగ్రామ్ ఏ వయసు నుంచి...?......పరీక్షా సమయం.

 
 
రొమ్ముక్యాన్సర్‌ను నిర్ధారణ చేసే పరీక్ష అయిన మామోగ్రామ్‌ను ఏ వయసు నుంచి చేయించాలనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. రొమ్ముక్యాన్సర్‌ను ముందుగానే కనుక్కోవడం ద్వారా ఎలాంటి ప్రమాదం లేకుండా చూసేందుకు, రొమ్ము తొలగించాల్సిన అవసరం కూడా లేకుండా చేసేందుకు దీన్ని 40వ ఏట నుంచి చేయించాలంటూ చాలామంది డాక్టర్లు సలహా ఇస్తుండగా మరికొంతమంది మాత్రం దీన్ని 50 తర్వాత నుంచి చేయించవచ్చని చెబుతుంటారు.

ఈ విషయాన్ని నిర్ధారణ చేసేందుకు అమెరికాలోని ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ దాదాపు 66 అధ్యయనాలను నిర్వహించింది. రెండురకాల రిస్క్‌లు ఉన్న మహిళల్లో దీన్ని నలభై దాటిననాటి నుంచే ఈ పరీక్షను రొటీన్‌గా తరచూ చేయించడం మంచిదని అవి పేర్కొంటున్నాయి. ఆ రిస్క్‌లు ఏమిటంటే...

సమీప బంధువుల్లో ఎవరికైనా బ్రెస్ట్‌క్యాన్సర్ కుటుంబచరిత్ర ఉండటం ముందుగా చేయించిన మామోగ్రామ్‌లో బ్రెస్ట్‌టిష్యూ చాలా మందంగా ఉన్నదనే ఫలితం వచ్చి ఉండటం.

పై రిస్క్‌లతో పాటు...
దూరపు బంధువుల్లో రొమ్ము బయాప్సీలో హానికరంకాని (బినైన్) గడ్డలు ఉన్నట్లు తేలినా లేదా అలాంటి బయాప్సీ పరీక్షలో రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తేలినా అంతకు ముందు గర్భనిరోధకమాత్రలు వాడే అలవాటు ఉండటం లేదా పిల్లలు లేకపోవడం లేదా 30 ఏళ్ల తర్వాతే తొలిచూలు గర్భం రావడం లాంటి కేసుల్లో రొమ్ము టిష్యూ మందం మరీ ఎక్కువగా లేకుండా ఒక మోస్తరుగా ఉన్నా 40 ఏళ్ల నుంచే మామోగ్రామ్ చేయిస్తుండటం మంచిదని ఆ అధ్యయనాలు చెబుతున్నాయి.

ఏయే వ్యాయామాలతో ఎన్నెన్ని క్యాలరీల ఖర్చు...?..................క్యాలరీ చార్ట్.

 
 
మహిళలు చేసే ఏయే వ్యాయామాల వల్ల ఎన్నెన్ని క్యాలరీలు ఖర్చవుతాయనే అంశం అనేక ఇతర విషయాలపై ఆధారపడుతుంది. అయితే దాదాపు 75 కిలోల బరువున్న ఒక మహిళ చేసే కొన్ని వ్యాయామాలతో ఉజ్జాయింపుగా ఎన్నెన్ని క్యాలరీలు ఖర్చవుతాయనే వివరాలు ఈ కింద...

వ్యాయామం తర్వాత ఏ ఆహారం?..................ఎక్సర్‌సైజ్ డైట్

 
 
వ్యాయామం పూర్తయ్యాక మన కండరాలు శక్తిని కోల్పోతాయి. ప్రధాన ఆహారం తీసుకునేలోపు అలసిన మన కండరాలకు తక్షణ శక్తిని అందించడానికి ‘పెరుగు’ ఉత్తమమైన ఆహారం అని గుర్తుంచుకోండి. అందులో తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అలాగే వ్యాయామ ప్రక్రియలో దెబ్బతిన్న కండరాలను రిపేర్ చేసే ప్రోటీన్లు ఉంటాయి.

అంతేకాదు... చాలా కొద్దిపాళ్లలో అంటే హానికరం కానంత, మరీ చెప్పాలంటే ఆరోగ్యకరమైన స్వల్ప మోతాదులో కొవ్వులూ ఉంటాయి. పైగా పెరుగు వెన్వెంటనే జీర్ణం కాకుండా మెల్లగా జీర్ణమవుతూ ఉంటుంది. ఫలితంగా రక్తంలో ఒకేసారి బ్లడ్‌షుగర్ వెలువడకుండా మెల్లగా వెలువడుతుంది. వీటన్నింటికీ మించి పెరుగులో పేగుల ఆరోగ్యాన్ని కాపాడే మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్ బ్యాక్టీరియా) ఉంటుంది. ఇలాంటి అన్నీ ఉన్నందు వల్ల వ్యాయామం తర్వాత పెరుగు ఉత్తమ ఆహారం.

యూత్‌ మెయిల్‌



ఇటీవల దినపత్రికలో రెండు వార్తలు చూశాను. యువతకు సంబంధించిన వార్తలవి. చాలా బాధ కలిగింది. విలాసాలకు అలవాటుపడి, చెడుమార్గంపట్టి జైలుపాలైన యువకులు ఉదంతాలవి.
ఐదుగురు కుర్రాళ్లు. అందరూ బీటెక్‌ చదివేవాళ్లే. ఎక్కడి నుంచో వచ్చి అద్దె గదిలో ఉంటూ చదువుకుంటున్నారు. ఆ కుర్రాళ్లు ఉంటున్న ప్రైవేట్‌ హాస్టల్‌లో చాలా మంది బీటెక్‌ విద్యార్థులున్నారు. విద్యార్థులు తాము ఉపయోగించే లాప్‌టాప్స్‌ అవసరం లేనపుడు గదుల్లో పెట్టి తరగతులకు వెళతారు. ఆ మధ్య వరుసగా మూడు నాలుగు పర్యాయాలు గదుల్లోని లాప్‌టాప్‌లు చోరీ అయ్యాయి. విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిఘా పెట్టారు. లాప్‌టాప్‌లు చోరీ చేస్తున్నవారు దొరికారు. ఎవరో కాదు...ఆ గదుల్లో ఉంటున్న తోటి విద్యార్థులే లాప్‌టాప్స్‌ దొంగిలించారు. పోలీసులు ఈ విషయం చెప్పగానే అందరూ షాక్‌కు గురయ్యారు. 'బుద్ధిగా చదువుకోకుండా ఇలా దొంగతనాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది' అని పోలీసులు అడిగితే ఆ విద్యార్థులు చెప్పింది ఒకటే...సినిమాలకెళ్లడానికి, షికార్లు తిరగడానికి, ఖరీదైన సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు కొనుక్కోవడానికే తాము ఈ దొంగతనానికి పాల్పడినట్లు చెప్పారు.
ఇలాంటి ఉదంతమే మరొకటి...ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఓ ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. పట్టుబడినవారంతా బాగా చదువుకున్న, చదువుకుంటున్న విద్యార్థులు. బీటెక్‌ విద్యార్థుల్లాగే...వీరూ విలాసాలకు అలవాటుపడి, డబ్బు సంపాదించడం కోసం ద్విచక్ర వాహనాల దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నారు.
ఈ రెండు ఉదంతాలు చెబుతున్నది ఒక్కటే...చదువుకుని జీవితాన్ని చక్కదిద్దుకోవాల్సిన వయసులో విలాసాలకు అలవాటుపడుతున్నారు. వ్యసనాలకు లోనవుతున్నారు. యువతలో పెరుగుతున్న వస్తు వ్యామోహాన్నీ ఈ ఘటనలు వెల్లడిస్తున్నాయి. ప్రత్యేకించి ఖరీదైన సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాల కోసం వెంపర్లాడుతున్నారు. చిన్న వయసులోనే మద్యానికి బానిసలువుతున్నారు. ఇదే సమయంలో ఎంతో బాధ్యతగా ఉంటూ, కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్న యువతా ఉన్నారు. ఇలాంటివారు అలాంటివారికి కనువిప్పు కావాలి.
- వి.అశోక్‌ కుమార్‌, మదనపల్లె

ఆసనం



ఆధునిక ఆహార అలవాట్ల నేపథ్యంలో శరీరంలో, నడుము దగ్గర కొవ్వు పేరుకుపోయి చాలా మంది అవస్థ పడుతున్నారు. ఆ కొవ్వును కరిగించేందుకు నానా అవస్థలు పడుతుంటారు. అలాంటి వారికి ఈ తిర్యక్‌ తాడాసనం ఉత్తమమైన ఫలితాలనిస్తుంది.
చేసే విధానం :
రెండు పాదాలను దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి. గాలిని తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతులను పైకి లేపాలి. తర్వాత చేతి వేళ్లను ఒక దానితో ఒకటి చొప్పించి తాడాసనంలో లాగా నిలబడాలి. గాలిని వదులుతూ కాళ్లను కదపకుండా నెమ్మదిగా నడుం నుంచి పైభాగాన్ని కుడివైపుకు తిప్పాలి. ఈ స్థితిలో కొద్ది సేపు ఉన్న తర్వాత గాలిని తీసుకుంటూ నెమ్మదిగా తాడాసనంలోకి వచ్చి తర్వాత సాధారణ స్థితికి వచ్చి నిలబడి రిలాక్స్‌ అవ్వాలి. ఇదే విధంగా ఎడమ వైపు కూడా చెయ్యాలి.
ప్రయోజనాలు :
నడుం దగ్గర ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. కాళ్లలోని కండరాల నొప్పులు తగ్గుతాయి. శ్వాసక్రియ మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థపై ఈ ఆసనం చక్కని ప్రభావం చూపుతుంది. మలబద్దకం, కిడ్నీ వ్యాధులు, గ్యాస్‌ ట్రబుల్‌, డయాబెటిస్‌లను ఈ ఆసనం తగ్గిస్తుంది.
డాక్టర్‌ రాచుమల్ల రంగనాథ్‌రెడ్డి
మిత్ర యోగ సెంటర్‌, కడప
సెల్‌ : 9440074773

కూల్ సైట్స్

నోటి మాటను రాతగా మారుస్తుంది!
మొబైల్‌లో టైపింగ్ అవసరం లేకుండా, కేవలం వాయిస్ కమాండ్స్ ద్వారా టైప్ చేయడం! ఆండ్రాయిడ్ ఫోన్లనో ఉన్న అధునాతన సదుపాయమిది. దీన్ని గూగుల్ ‘లిస్ట్ నోట్’ ఆకర్షణీయంగా మారుస్తోంది. ఇది ఇతర వాయిస్ కమాండ్స్ కన్నా చాలా సౌకర్యవంతమైనదట. నోట్ ప్యాడ్ విత్ స్పీచ్ టూ టెక్ట్స్ అంటూ గూగుల్ ఈ అప్లికేషన్ గురించి వివరించింది. ఎలాంటి టైపింగ్ ఇబ్బంది లేకుండా కేవలం మాటల ద్వారానే టెక్ట్స్‌ను పూరించేయవచ్చు. మన మాటలే టెక్ట్స్‌గా సేవ్ అవుతాయి. ఒక్క సారి స్పీచ్ రిక గ్నైజేషన్ బటన్ నొక్కి, మాట్లాడుతుంటే చాలు! నోట్‌ప్యాడ్‌పైన, ఈ మెయిల్, ఫేస్‌బుక్ పోస్టులు, ట్వీట్ల విషయంలో కూడా ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. అద్భుతమైన, ఉపయోగవంతమైన ఈ టూల్ కోసం... https://play.google. com/store/apps/ details?idcom. khymaera. android.listnotefreeవెబ్‌సైట్ క్లిక్ చేయవచ్చు.

ఆన్‌లైన్ షాపింగ్ గైడ్...

‘షాపింగ్ అసిస్టెన్స్’ ఇది గూగుల్ క్రోమ్‌కు ఎక్స్‌టెన్షన్. ఆన్‌లైన్ షాపింగ్‌కు చక్కటి సదుపాయం. ఒకే వస్తువుకు సంబంధించి వేరు వేరు చోట్ల ఉండే ప్రైస్ లిస్ట్‌ను ఇది అందిస్తుంది. పాపులర్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్...ఈబే, బెస్ట్‌బయ్, వాల్‌మార్ట్, న్యూఎగ్, బయ్.కామ్, స్లిస్క్‌డీల్స్, ఫ్యాట్‌వ్యాలెట్ వంటి వాటిన్నింటినీ ఇది కూర్చి ఒకే క్లిక్‌తో అందుబాటులోకి తెస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఒక్కో వస్తువు కోసం ఒక్కో వైబ్‌సైట్‌నూ క్లిక్ చేసుకొంటూ ఉండే బదులూ...ఒకేసారి అన్నింటినీ స్క్రీన్ మీదకు తెచ్చే ఈ ఎక్స్‌టెన్షన్ టూల్ ఉపయోగం గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. మరి ఉచితంగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి... https://chrome. google.com/ webstore/detail /keigpnkjljkelclbjbe kcfnaomfodamjద్వారా అవకాశం ఉంది.

యాస్పిరిన్‌తో మరో లాభం................దివ్యౌషధం

 
 
యాస్పిరిన్ వల్ల మరో ప్రయోజనం ఉందంటున్నారు మసాచుసెట్స్‌కు చెందిన పరిశోధకులు. ఇది బారెట్స్ ఈసోఫేగస్ అనే ఒక రకం రుగ్మతనూ నివారిస్తుంది.

ప్రాణాధార ఔషధంగా ఇప్పటికే యాస్పిరిన్‌కు చాలా కీర్తి ఉంది. గుండెలో కాస్త నొప్పిగా ఉన్నా, ఛాతీలో ఇబ్బందిగా ఉన్నా ముందూవెనకా చూసుకోకుండా యాస్పిరిన్ వేసుకోమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. రక్తనాళాల్లోని రక్తాన్ని పలచబార్చే గుణంతో ఇది ఎన్నో గుండెపోట్లను నివారించి, మరెన్నో కుటుంబాలు ఆటుపోట్లకు గురికాకుండా కాపాడుతుంటుంది. అలాగే దీనివల్ల పక్షవాతాన్ని కూడా నివారించవచ్చన్న విషయం కూడా తెలిసిందే.

తాజాగా ఇప్పుడు యాస్పిరిన్ వల్ల మరో ప్రయోజనాన్ని కనుగొన్నారు మసాచుసెట్స్‌కు చెందిన పరిశోధకులు. వాళ్లు చెప్పేదాన్ని బట్టి... బారెట్స్ ఈసోఫేగస్ అనే ఒక రకం రుగ్మతను యాస్పిరిన్ నివారిస్తుంది. జీర్ణకోశవ్యవస్థకు సంబంధించిన ఈ కండిషన్ గొంతులోని కణాలను దెబ్బతీసి గొంతు, ఆహారనాళ క్యాన్సర్ (ఈసోఫేజియల్ క్యాన్సర్) కు కారణమవుతుంటుంది. అయితే యాస్పిరిన్‌కు ఈ గుణం ఉన్నప్పటికీ అత్యధిక మోతాదుల్లో విచక్షణరహితంగా వాడవద్దని ఈ పరిశోధకులు హెచ్చరిక చేస్తున్నారు.

గంట ముందుగా నిద్రపోండి... రక్తపోటును నియంత్రించండి-కొత్త పరిశోధన

 
 
పెరుగుతున్న రక్తపోటు, ప్రి డయాబెటిస్ మిమ్మల్ని ఆందోళన పరుస్తుంటే మీరు చేయాల్సిందల్లా రోజూ ఒక గంట ముందుగా నిద్రకు ఉపక్రమించడమే. కంటినిండా కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రించడమే. దీనితో రక్తపోటు, చక్కెర పాళ్లు స్వాభావికంగానే నియంత్రణలోకి వస్తాయని చెబుతున్నారు బోస్టన్‌లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు. వారు ప్రీ-డయాబెటిక్, ప్రీ-హైపర్‌టెన్షన్ కండిషన్స్ ఉన్న 22 మంది మధ్యవయస్కులను ఎంపిక చేసుకున్నారు.

వారంతా ఏడు గంటల వ్యవధి కంటే తక్కువగా నిద్రపోయేవారే. వారిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారిని ఒక గంట ముందుగా నిద్రకు ఉపక్రమించేలా చూశారు. తద్వారా వారు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోయేలా ఏర్పాటు చేశారు. ఈ రెండు గ్రూపులకూ తరచూ బీపీ, రక్త, మూత్ర, ఇతరత్రా పరీక్షలు నిర్వహిస్తూపోయారు. కేవలం ఆరువారాల వ్యవధి తర్వాత ఈ రెండు గ్రూపుల్లోనూ ఒక గంట ముందుగా నిద్రకు ఉపక్రమిస్తూ, ఎనిమిది గంటల పాటు నిద్రపోయిన వారి బీపీ, షుగర్ పాళ్లు నిలకడగానూ, నియంత్రణలోనూ ఉన్నట్లుగా తేలింది.

ఏడిహెచ్‌డి చురుకు కాదది చురుక్కు!!

 
ఏదైనా అంశంపై దృష్టి కేంద్రీకరించే శక్తి పిల్లల్లో ఎక్కువ. ఆ శక్తి లోపించడానికి కారణమయ్యే రుగ్మతలు ప్రస్తుతం చిన్నారుల్లో ఎక్కువయ్యాయి. ఈ పరిణామం చిన్నారులకే కాదు... ఆ తల్లిదండ్రులకూ, స్కూళ్లలోని టీచర్లకూ భారమవుతోంది. ఇలాంటి చిన్నారుల తల్లిదండ్రులు తమ దినచర్యలన్నీ వదిలేసి రోజంతా పిల్లలతోనే గడపాల్సిన స్థితి. దాంతో పిల్లాడితో పాటు తల్లిదండ్రులపైనా తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. నార్వేలో జరిగిన ఘటన ఇలాంటి కండిషన్ ఉన్న పిల్లాడికి సంబంధించినదే. మిగతా పిల్లలకు, ఇంటిపనులకు కేటాయించాల్సిన సమయాన్ని ఒకే పిల్లాడికి వెచ్చించాల్సి ఉంటుంది. దృష్టి కేంద్రీకరణ లోపాల కారణంగా కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి రుగ్మతల్లో ప్రధానమైన ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్’ పై అవగాహన కోసం ఈ కథనం.


కొందరు పిల్లల్లో ఏదైనా అంశంపై దృష్టి కేంద్రీకరించే శక్తియుక్తులు ఉండవు. ఇలాంటి పిల్లల్లో దృష్టి కేంద్రీకరణ లోపాలతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. అవి... మతిమరపు ఆజ్ఞలను సరిగా స్వీకరించలేకపోవడం నిర్ణీత వ్యవధిలోపు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చలేకపోవడం స్పెల్లింగ్స్ చక్కగా చెప్పలేక సిల్లీ తప్పులు చేయడం క్లాస్‌రూ మ్‌లో జరుగుతున్న అంశంపై నుంచి త్వరగా దృష్టి మరల్చడం ఎక్కువగా మాట్లాడుతుండటం పగటికలలు కనడం ఇంట్లోంచి తీసుకెళ్లిన వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయడం.

ఇక కొందరిలో దృష్టికేంద్రీకరణ లోపాల తో పాటు అతిచురుకుదనం ఉంటే అలాంటి పిల్లలను ఏడీహెచ్‌డీ సమస్య ఉన్న పిల్లలుగా పరిగణించవచ్చు.

ఏడీహెచ్‌డీ వ్యాప్తి, విస్తృతి...

ప్రస్తుతం దీన్ని మానసిక వైద్యశాస్త్రంలోని ఒక రుగ్మతగా పరిగణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 5 శాతం పిల్లల్లో ఇది కనిపిస్తోంది. స్కూలుకెళ్లే వారిలో 2 నుంచి 16 శాతం పిల్లల్లో ఇది ఉంటోంది. దీన్ని దీర్ఘకాలిక సమస్యగా ఎంచుతున్నారు. పిల్లలుగా ఉన్నప్పుడు బయటపడ్డ ఈ రుగ్మత 30 నుంచి 50 శాతం మందిలో యుక్తవయసుకు వచ్చాక కూడా కొనసాగుతోంది. ఏడీహెచ్‌డీలో సైతం అనేక రకాలున్నాయి. బాల్యంలోని ఏడీహెచ్‌డీ లక్షణాలు యుక్తవయసు వచ్చాక కూడా ఎంతమందిలో ఇలా కొనసాగుతాయనే అంశం... బాల్యంలోని వారి ఏడీహెచ్‌డీ తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.

ఏడీహెచ్‌డీకి కారణాలు:

ఈ రుగ్మతకు కారణాలు ఇప్పటికీ ఇదమిత్థంగా తెలియదు. అయినప్పటికీ జన్యుపరమైన, వాతావరణపరమైన, ఆహారపరమైన, సామాజిక, భౌతిక అంశాలు కొన్ని ఈ రుగ్మతకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

జన్యుపరమైనవి: వీటిని పెట్ స్కాన్ ద్వారా గుర్తిస్తారు. ఇలాంటి పిల్లల మెదడులో లోపమైన ట్రాన్స్‌పోర్టర్స్ తక్కువస్థాయిలో జరుగుతుందని గుర్తిస్తారు. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఏడీహెచ్‌డీ లక్షణాలు ఉంటే పిల్లలకు ఇది వచ్చే అవకాశాలు జన్యుపరంగా చాలా ఎక్కువ.

వాతావరణపరంగా: ఆల్కహాల్, పొగాకుల వాడకం ఉన్న వాతావరణ నేపథ్యంలో పెరిగే పిల్లల్లో ఈ తరహా రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి తోడు వాతావరణంలో సీసం (లెడ్) కాలుష్యం ఎక్కువగా ఉండేచోట ఉన్న పిల్లల్లోనూ ఇది ఎక్కువే. గర్భంలో ఉన్నప్పుడు తల్లి సమస్యలు ఎదుర్కోవడం లేదా నెలలు నిండకముందే పుట్టడం వంటి కేసుల్లోనూ ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ప్రసవ సమయంలో తలకు గాయం అయినవారు ఏడీహెచ్‌డీకి గురయ్యే అవకాశం ఉంది. చాలా ఎక్కువగా టీవీ చూసే పిల్లలు, ఇంటర్‌నెట్, వీడియోగేమ్స్ ఆడే పిల్లల్లో ఏడీహెచ్‌డీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి పిల్లలు చదువులపై, లక్ష్యసాధనపై మనసు లగ్నం చేయలేక త్వరగా తమ దృష్టిని వేరే అంశాల వైపునకు మళ్లిస్తారు.

ఆహారం:స్వాభావిక ఆహారంపై పెరగకుండా, కృత్రిమరంగులు వేసే ఆహారం, దీర్ఘకాలం నిల్వ ఉంచేలా ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహారం తినే పిల్లలకు చక్కెర ఎక్కువగా విడుదలయ్యే ‘హై గ్లైసీమిక్ ఇండెక్స్’ ఉన్న ఆహారం అంటే స్వీట్లు, చాక్లెట్లు తినే పిల్లలకు జంక్‌ఫుడ్, ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం తినే పిల్లలకు... ఈ రుగ్మత వచ్చే అవకాశాలు ఎక్కువ.

సామాజిక అంశాలు: తగినంత విద్య లేని, కుటుంబ బాంధవ్యాలు సక్రమంగా లేని, తగినంత శ్రద్ధ చూపని, సమస్యాత్మక కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లల్లో ఈ రుగ్మత ఎక్కువ. ఇటీవల చేసిన పరిశోధనల ప్రకారం... కుటుంబంలో శ్రద్ధ తీసుకునేవారు, మంచి తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మ, నాయనమ్మలతో మంచి సంబంధాలున్న పిల్లల్లో స్వయంసంయమనం ఎక్కువని తెలిసింది. ఇలా చాలామంది కుటుంబ సభ్యులుండే నేపథ్యంలోని పిల్లలు బాంధవ్యాల చిక్కదనాన్ని తెలుసుకుని అందరితో చక్కగా మసలడం అలవాటైతే ఏడీహెచ్‌డీ తీవ్రత తగ్గుతుందని తెలుస్తోంది.

ఏడీహెచ్‌డీకి, ఆటిజమ్‌కు తేడా...

ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు, ఆటిజమ్ అనే తరహా రుగ్మత ఉన్న చిన్నారులు... ఈ రెండు కండిషన్స్ ఉన్న వారిలోనూ పిల్లలు అతి చురుగ్గా ఉంటారు. ఏడీహెచ్‌డీ ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు తరచూ చెప్పే మాట ఏమిటంటే ‘మా పిల్లవాడు చాలా చురుగ్గా ఉంటాడు. ఏదైనా అంశాన్ని వేగంగా నేర్చుకుంటాడు. అయితే స్కూల్లో చెప్పిన అంశాలను మాత్రం వాడు గుర్తుంచుకోవడం లేదు’ అని అంటుంటారు. వీళ్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇది జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్య కాదు. స్కూలు లాంటి సమూహాల్లో వ్యవహరించే చోట ఒక అంశంపై నిర్దిష్టంగా దృష్టిని కేంద్రీకరించలేకపోవడంతో స్కూల్లో ఏడీహెచ్‌డీ పిల్లలకు ఈ సమస్య వస్తుంటుంది. అదే ఇంట్లోనైతే సమూహం గొడవ లేకుండా పిల్లలకూ తల్లిదండ్రులకూ మధ్య నేరుగా (ఒన్ టు ఒన్) సంబంధం ఉంటుంది. కాబట్టి ఇంట్లో నేర్చుకునే అంశాల్లో అలాంటి సమస్య రాదు.

ఇక ఆటిజమ్ ఉన్న పిల్లల్లోనూ అతిచురుకుదనం ఉన్నప్పటికీ వారి చురుకుదనం నిర్దిష్టంగా ఒక లక్ష్యం లేకుండా ఉంటుంది. ఆటిజమ్ ఉన్న పిల్లలు తమదైన ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంటారు. నేరుగా కళ్లలో కళ్లు కలిపి మాట్లాడలేరు. పైగా వారికి మాట్లాడటంలో సమస్యలు (స్పీచ్ ప్రాబ్లమ్స్) ఉంటాయి. తమ చుట్టూ ఉన్న మనుష్యులూ, వాళ్ల వ్యవహారాలపై ఎలాంటి ఆసక్తీ ఉండదు.

ఏడీహెచ్‌డీ, ఆటిజమ్ లలో తేడా:

ఏడీహెచ్‌డీ ఉన్నవారికి ఆటిజమ్ కూడా ఉంటుందన్న అపోహ ఒకటి ఉంది. కొందరి విషయంలో ఇది వాస్తవమే అయినా అది ఎల్లప్పుడూ నిజం కాదు. ఏడీహెచ్‌డీ ఉన్న ప్రతి పిల్లవాడికీ ఆటిజమ్ ఉండదు. అయితే అలా ఉందేమోనని ఒకసారి వైద్యనిపుణుల చేత పరీక్షింపజేసి, ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల వీలైనంత త్వరగా సమస్యలకు తగిన చికిత్స చేయించే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్లో మెరుగుదలకూ అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అంటే...
ఇది పిల్లల వికాసంలో కనిపించే లోపంతో కూడిన రుగ్మత. ఇందులో పిల్లలకు ఏదైనా అంశంపై దృష్టి కేంద్రీకరణలో లోపంతో పాటు, ప్రమాదకరంగా పరిణమించే అతిచురుకుదనం ఉంటుంది. ఈ రెండు లక్షణాల్లో ఒక్కోసారీ ఒక్కొక్కటీ బయటపడుతుంటుంది. దీనికి సంబంధించిన లక్షణాలు ఏడేళ్ల వయసు తర్వాతే బయటపడతాయి. అయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో దీని లక్షణాలు ఇంకా ముందే అంటే... నాలుగేళ్లకే కనిపిస్తున్నాయి. ఇది ఇంత త్వరగా ఎందుకు కనిపిస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.

సరిదిద్దడం (మేనేజ్‌మెంట్) ఎలా...
ఈ రుగ్మత ఉన్న పిల్లలను సరిదిద్దడం అన్నది ఇటు ఇంట్లో, అటు స్కూల్లో జరగాల్సిన ప్రక్రియ. జీవనశైలిలో మార్పులు, కౌన్సెలింగ్, ధ్యానం వంటి వాటి ద్వారా ఏడీహెచ్‌డీని చక్కదిద్దవచ్చు.

ఇలాంటి పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తించే తీరు పిల్లల్లో ఎంతో మార్పు తీసుకుని వస్తుంది. ఈ పిల్లల పట్ల కఠినవైఖరితో ప్రవర్తించినా, వారిని శిక్షించినా... వారిలో తక్షణం కొంత మెరుగుదల ఉన్నట్లు కనిపించినా దీర్ఘకాలిక ఫలితాలు తక్కువ. శాశ్వత మెరుగుదల కోసం ఓపిక, సంయమనం, పిల్లల పట్ల శ్రద్ధ చాలా అవసరం.

మెరుగుదలకు మార్గాలు...
శారీరక వ్యాయామం: రోజూ కనీస 30 నిమిషాలు వ్యాయామంలో పాల్గొనేలా చూడటం.

కథలు చెప్పడం: పిల్లల మనసులకు హత్తుకునేలా నీతికథలు చెప్పి, ఆ కథల్లోంచి సందేహాలను అడిగి, వాటిని ఓపిగ్గా నివృత్తి చేయడం.

దైనందిన అంశాలను అడిగి తెలుసుకోవడం: పిల్లల దైనందిన కార్యక్రమాలు ఒక క్రమపద్ధతిలో జరిగేలా టైమ్‌టేబుల్ రూపొందించి, ఆ రోజు చేసిన తప్పుడుపనుల వల్ల కలిగే అనర్థాలు వివరించి, మర్నాడు తప్పులు జరగకుండా చూడటం, పిల్లల్లోని మంచి విషయాలను మెచ్చుకుంటూ అవి పెంపొందించుకునేలా ప్రోత్సహించడం. దుష్టప్రవర్తనకు, దుశ్చేష్టలకు అవకాశం లేకుండా బిజీగా ఉంచడం. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు తగినంత శ్రద్ధ తీసుకోవడం.

మందులు: ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలకు ఇచ్చే మందుల్లో స్టిమ్యులెంట్స్, నాన్‌స్టిమ్యులెంట్స్‌లను ఉపయోగిస్తారు. ఈ తరహా మందులను ఆరేళ్లకు పైబడిన వారిలో ఉపయోగించవచ్చు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయిస్తూ మందులతో పాటు ఫిష్ ఆయిల్, ప్రోబయోటిక్ తరహా సప్లిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

మాంసం ముక్క గట్టిగా ఉండటం వల్ల కూరగాయలు, ఆకుకూరలతో పోలిస్తే దాన్ని ఎక్కువసేపు నమలాల్సి వస్తుందనేది చాలామందిలో ఒక అపోహ. నిజానికి పీచు ఎక్కువగా ఉండటం వల్ల కూరగాయలనే ఎక్కువగా నమలాల్సి ఉంటుంది. చిన్న సెల్ఫ్ చెక్ ద్వారా దీన్ని నిరూపించవచ్చు కూడా. మీరు ఒకసారి క్యారట్‌ను నమిలి తిని చూడండి. కాసేపటికే... క్యారట్ తినడం పూర్తికాకముందే బుగ్గలు నొప్పెడతాయి. దోసకాయ కూడా అంతే. సలాడ్స్‌లో ఉండే చాలా కూరగాయల ముక్కలు ఈ వాస్తవాన్ని తెలియజెపుతాయి. ఇలా చాలాసేపు నమలాల్సిరావడం మనకు మేలు చేస్తుంది.

నోటి, దవడ కండరాలకు వ్యాయామాన్నిస్తుంది. దాంతోపాటు ఆహారంలో లాలాజలం కలవడానికి దోహదపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగి, జీర్ణవ్యవస్థపై భారం తగ్గేందుకు, ఆహారం తేలిగ్గా ఒంట పట్టేందుకు ఇలా దీర్ఘకాలంపాటు నమలడానికి సహాయం చేస్తుంది. కాబట్టి పై అంశాలను పరిశీలిస్తే కూరగాయలు, ఆకుకూరలు ఎంత మేలుచేస్తాయో తేలిగ్గా తెలుసుకోవచ్చు.

 

శాంతి అనేది ఆకాశం నుంచి ఊడిపడదు. మన మనసుల్లోనుంచే పుట్టుకురావాలి

 

అందమె ఆనందం

పసుపులో చెరుకు రసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.