మృణాళిని అంటే తామరపూల గుచ్ఛం అని అర్థం. వ్యవస్థలోని పరిస్థితులు బురదలా ఊపిరిని పట్టేసినా తామరాకులా చెక్కుచెదరకుండా... తన పిల్లల్ని పెంచింది.ఆ కుసుమాలు పరిమళాలు వెదజల్లుతున్నాయి. మనందరికీ ఒక మధురమైన సందేశాన్ని అందిస్తున్నాయి. కంటికి ఇంపుగా కనపడే కమలం వెనకాల కన్నీరు ఎవరికీ కనపడదు. ‘నాకు అస్సలు కష్టమే అనిపించలేదు...’ అంటారు మృణాళిని.సింగిల్ పేరెంటింగ్ ఈజ్ ఎ డబుల్ జాయ్!.. అన్నమాట! అందుకే ఇది గాథ కాదు... స్ఫూర్తినిచ్చే ఒక సున్నితమైన కథ! మా చిన్నప్పుడు మేం పెరిగాం. అమ్మ, నాన్న మమ్మల్ని కష్టపడి పెంచినట్లు నాకేం గుర్తులేదు. గత మూడు దశాబ్దాలుగా మాత్రం మనం కష్టపడి పెంచుతున్నాం. ఉన్నది ఒకరో, ఇద్దరో కాబట్టి పెంచడం ఒక కళగా, ఒక అభ్యాసంగా మార్చుకున్నాం. నేను మా అమ్మానాన్నల్లా నా పిల్లల్ని ఎక్కువ కష్టపడకుండానే పెంచానని ఇప్పుడు వెనక్కి చూసుకుంటే అనిపిస్తుంది.
దీనికి నేను కొంతవరకూ కారణమైతే, నా పిల్లలే ఎక్కువ కారకులు. అన్నం తినడానికి మారాం లేదు; స్కూలుకు వెళ్లడానికి ఏడుపు లేదు; అది కావాలి, ఇది కావాలి అని పేచీ లేదు. ఇంట్లో విధ్వంసకాండలు లేవు. ఇలాంటి పిల్లలు అదృష్టవంతులకి పుడతారు. నేను చాలా అదృష్టవంతురాలిని. పిల్లల్ని మనం పెంచనక్కర్లేదు. వారితో కలిసి జీవించాలి అని చాలాకాలం క్రితమే అర్థం చేసుకున్నాను.
పాపకూ, బాబుకూ మధ్య అయిదేళ్ల తేడా ఉంది. బాబుకు ఏడేళ్లు, పాపకు పన్నెండేళ్లు ఉన్నప్పుడు ఒక అవాంతరం. కొన్ని పరిస్థితుల వల్ల నేను సింగిల్ పేరెంట్‌ని అయ్యాను. అదివాళ్లకు బహుశా బాధ కలిగించే ఉంటుంది. బహుశా అని ఎందుకంటున్నానంటే, వాళ్లిద్దరూ అప్పుడుగానీ, ఇప్పుడుగానీ ఏరోజూ నన్ను దేని గురించీ ప్రశ్నించలేదు; నిలదీయలేదు. ‘దుఃఖితమతులై’ రోదించలేదు. నేను కూడా ‘సింగిల్ పేరెంట్’ని అని ఏనాడూ భయపడలేదు; బాధపడలేదు. జీవితంలో అన్నీ లభించవు. లభించిన వాటికి ఆనందించాలి. దొరకని వాటి గురించి ఆలోచించడం మానేయాలని ఏనాడో నిశ్చయించుకున్నాను. వాళ్లని పెంచడం ఒక బాధ్యతగా, ఏదో మిన్ను విరిగి మీద పడ్డట్టుగా నేనెప్పుడూ భావించలేదు.
పిల్లలతో సమయం గడపడంలో ఎంత ఆనందం ఉందో, అదంతా నాకే లభించినందుకు ఇంకా ఎక్కువ సంతోషించాను. పిల్లలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో వాతావరణం ఉల్లాసంగా, సంతోషంగా ఉండాలని నేను నమ్ముతాను. తల్లిదండ్రులిద్దరూ కలిసి ఉన్నంతమాత్రాన వాతావరణం బాగుంటుందని నమ్మకం ఏమీ లేదు. సింగిల్ పేరెంట్ ఉన్నచోట విషాదం ఉంటుందనీ, పిల్లలు క్రమశిక్షణ లేకుండా పెరుగుతారనీ, మానసికంగా దెబ్బతింటారనీ చాటింపు వేసే పురజనుల నమ్మకానికి నేను పెద్దవిఘాతాన్నే కలిగించాను. ఇంట్లో అందరం (నాతో చాలాకాలం ఉన్న అత్తగారితో సహా) ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉండేవాళ్లం. ఇక క్రమశిక్షణ అంటారా? అది మనకు ఉంటే పిల్లలకు సహజంగానే వస్తుంది.
బహుశా, నేను చేసిన ఒక్క మంచిపని ఏమిటంటే, పిల్లలకు, వాళ్ల తండ్రితో సహజమైన సంబంధం చెదరకుండా చూసుకోవడం. వాళ్లని తరచు తండ్రి దగ్గరకు పంపేదాన్ని. వినాయక చవితి, దీపావళి పండగలు తండ్రితోనే జరుపుకునేవారు. ఇప్పటికీ జరుపుకుంటారు. వాళ్ల నాన్న కూడా అవసరమైనప్పుడల్లా వాళ్లకి అందుబాటులో ఉంటారు కనక, తండ్రితో వాళ్ల అనుబంధం సహజంగా, సంతోషంగానే ఉంటుంది. పిల్లలు మంచిగా ఉండాలనుకునే ముందు, మనం అలా ఉన్నామా అని ఆలోచించుకోవాలనుకుంటాను. మనం చేసి చూపించలేని మంచిని, ఆదర్శాన్ని వారిలో ఆశించడం అన్యాయం.
అయితే, పిల్లల్ని పెంచడంలో ఏ కష్టమూ రాలేదా? అంటే రాలేదని చెప్పలేను. వచ్చినవి తట్టుకోలేని కష్టాలేమీ కావు. పిల్లల చదువు విషయంలో, హాబీల విషయంలో అభిప్రాయాలు పంచుకోడానికి మనిషి లేకపోవడం ఒక్కటే బాధ కలిగించేది. అయితే అదృష్టవశాత్తు ఆ సమస్యలన్నిటినీ సులువుగానే పరిష్కరించుకోగలిగాను. ఇలా పరిష్కరించుకోగలగడానికి ముఖ్యకారణం నాలో స్వీయకరుణ (సెల్ఫ్ పిటీ) ఏ మాత్రం లేకపోవడం, పరనింద నా చేత కాకపోవడం అనుకుంటా. ఎంత ప్రయత్నించినా నా మీద నాకు జాలి కలగదు. ప్చ్. నా స్థితికి మరొకర్ని నిందిద్దామంటే, వాళ్లెవరు నా జీవితాన్ని నాశనం చేయడానికి అని ఉక్రోషం వస్తుంది కనక, నా స్థితికి నేనే కారణం అనుకుంటే హాయి. అన్నింటికీ మించి నా పిల్లలు నేను ఏ మాత్రం బాధపడే అవసరం రాకుండా చూసుకోగల సమర్థులు.
మామధ్య తల్లీపిల్లల అనుబంధం కంటే స్నేహబంధమే ఎక్కువ. ఇప్పుడు ఇద్దరూ పెద్దవాళ్లయ్యాక ఈ మాట అనడం కాదు. చిన్నప్పటి నుంచీ కూడా వాళ్లతో ప్రతిదీ పంచుకునే అలవాటు నాకుంది. మా అబ్బాయితో కూర్చుని టీవీలో నాకేమాత్రం ఇష్టంలేని డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఫైటింగులు చూశాను. వాడితో నాకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆడాను. తను కూడా తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాతో కచేరీలు వినడానికి వచ్చేవాడు. మా అబ్బాయి గిటార్ వాయిస్తూ, పాడుతూంటే, వాడికి యుగళంగా నేను కూడా ఆ రాక్ పాటలు లిరిక్స్ నేర్చుకుని పాడాను.
మా అమ్మాయి సలహాలేనిదే ఇంటికి ఏ వస్తువూ రానంతగా తన ఎంపిక మీద నాకు నమ్మకం. ఇద్దరం టీవీలో వంటల కార్యక్రమాలు చూసి, ప్రయోగాలు కూడా చేస్తాం. పాత హిందీ సినిమా పాటలు వింటూ, వాటి మీద విశ్లేషణ చేస్తూ ఆస్వాదిస్తాం. వాళ్లిద్దరూ నన్ను, నా వ్యాపకాలనూ వెక్కిరిస్తారు. నేనూ వాళ్లని ఆటపట్టిస్తాను. పిల్లల్ని కొట్టకుండా, తిట్టకుండా పెంచడం అసాధ్యమని చాలామంది అంటూంటారు. ఎందుకో... నేను ఇద్దరిమీదా ఒక్క దెబ్బా వేయలేదు, గొంతు పెంచిన సన్నివేశాలు కూడా దాదాపు లేవు. అంతకంటే ముఖ్యంగా పిల్లలకు ఎప్పుడూ వాస్తవం చెప్పడానికి వెనకాడలేదు. ఫలానా వస్తువు కొనడానికి డబ్బు లేకపోతే ఆ విషయం వాళ్లకు స్పష్టంగానే చెప్పేదాన్ని. వాళ్లూ అర్థం చేసుకునేవారు.
కానీ అతి త్వరలోనే ఏదో పని చేసి (ఎక్కువగా టీవీ షోలు, లేదా అనువాదాలో చేసి) డబ్బు తెచ్చి ఆ వస్తువు కొనడానికి ప్రయత్నించేదాన్ని. తీసుకురాకపోతే వాళ్లు ఏమీ అనరని తెలుసు. అందుకే తేవడం. బహుశా మా మధ్య ఉన్న ఈ స్నేహం వల్లనేనేమో ఇంటర్ ఫస్టియర్‌లో ఉండగా తనకు ఒక ఆడపిల్ల నుంచి వచ్చిన ప్రేమలేఖను మావాడు తన స్నేహితులకు కాక, ముందుగా నాకే చూపించాడు. అలాగే మా అమ్మాయి డిగ్రీలో ఉన్నప్పుడు స్నేహితులు కాలేజీ ఎగ్గొట్టి సినిమాకు వెళ్దామంటే ‘‘మా అమ్మకు ఫోన్ చేసి సినిమాకు వెళ్తున్నట్టు చెప్తానని’’ అలాగే చేసి, స్నేహితులను ఆశ్చర్యపరిచింది. అమ్మకు చెప్పకుండా దొంగతనంగా, సినిమా చూసే అవసరం నాకు లేదని చెప్పింది. ఇవి చాలా చిన్న ఉదాహరణలు మాత్రమే.
నేను అనేక కారణాల వల్ల అలవిమాలిన పనులు పెట్టుకుని చాలా బిజీగా జీవితం గడిపాను. ఆ రకంగా చూస్తే, నా ప్రయాణాలు, సాహిత్య సమావేశాలు, టీవీ షూటింగులతో వాళ్ల చిన్నప్పుడు తగినంత సమయం వాళ్లకు కేటాయించానా అని అపుడప్పుడూ అపరాధ భావన నాకు కలగకపోలేదు. కానీ రోజులో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం నుంచి రాత్రి లోపల రెండుగంటలు ప్రతిరోజూ వాళ్లిద్దరితో గడపాలన్న నియమాన్ని పాటించాను. క్వాంటిటీ టైమ్ కాకపోయినా, క్వాలిటీటైమ్ వాళ్లతో గడిపానన్న తృప్తి నాకుంది. నేను ఎంత బిజీగా ఉన్నా, వాళ్లిద్దరి నుంచి వచ్చే ఫోన్ మాత్రం తప్పక తీస్తాను. పిల్లలు ఏ విషయమైనా, ఎలాంటి సమస్య అయినా ఇంట్లో చెప్పుకోవచ్చు. ఓదార్పుకు, పరిష్కారానికీ బయటివాళ్ల మీద ఆధారపడనక్కర్లేదు అని చెప్పడంలో బహుశా నేను సఫలమయ్యాను.
ఇంతా చేసి, ఇంతా చెప్పి చిట్టచివరగా నా అభిప్రాయం ఏమిటంటే, నేను మంచి అమ్మను అవునో కానో నాకు తెలీదు. (అది నా పిల్లలనే అడగాలి) కానీ, నా పిల్లలు, మృదుల, తేజ మాత్రం అచ్చ బంగారాలే.
- మృణాళిని
No comments:
Post a Comment