మా అబ్బాయికి 13 ఏళ్లు. ఈ వయసులోనే వాడు పెద్దవాళ్లు ఉండేంత బరువున్నాడు. వాడిలా బరువు పెరుగుతూ పోవడం మమ్మల్ని ఆందోళన పరుస్తోంది. దయచేసి వాడి బరువు తగ్గించడానికి నాకు తగిన సూచనలు ఇవ్వండి.
- ధరణి ఎస్., కోదాడ
ఈ టీనేజ్‌లో పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు బరువు పెరిగే అవకాశం ఉంది. మీ అబ్బాయికీ ఇది వర్తిస్తుంది. మీరు ముందుగా అతడికి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పాలి.
స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్, జామ్ వంటి వాటితో అతడు మరింత బరువు పెరిగేందుకు అవకాశం ఉంది. వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను మరింత దూరం ఉంచడం మంచిది.
వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు.
పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు.
తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది.
పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనా పాలన, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది.
పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పరీక్షలు చేయించి రూల్ అవుట్ చేసుకోవడం అవసరం.
ఆటలాడుతున్నప్పుడు, ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి షూ వాడాలి? స్పోర్ట్స్ షూ ఎంపిక విషయంలో పాటించాల్సి జాగ్రత్తలు ఏమిటో చెప్పండి.
- సుధాకర్, నెల్లూరు
మీరు స్పోర్ట్స్‌లో పాల్గొంటున్నప్పుడు వాడే షూకు ఈ కింది క్వాలిటీస్ ఉండేలా చూసుకోండి.
అది ఎటుపడితే అటు వంగేలా (ఫ్లెక్సిబుల్‌గా) ఉండాలి.
దానికి తగినంత హీల్ ఉండాలి. మీ కాలికి ఆ హీల్ సపోర్ట్ అందాలి.
స్పోర్ట్స్ షూ వేసుకున్నప్పుడు దాని సైజ్ మీకు సౌకర్యంగా ఉండాలి.
మీరు దాంతో చేసే వ్యాయామాల తీవ్రత లేదా ఆటలాడే వ్యవధిని బట్టి మూడు నెలల నుంచి ఏడాది వరకు దాన్ని వాడవచ్చు.
దాని అరుగుదలను గమనించడానికి క్రమం తప్పకుండా అడుగుభాగాన్ని తరచూ చెక్ చేయండి.
ఏదో నిర్దిష్టమైన బ్రాండ్ కంటే దానివల్ల మీకు కలిగే సౌకర్యానికే ప్రాధాన్యం ఇవ్వండి. ఏ బ్రాండ్ సౌకర్యంగా ఉంటుందన్నది నిర్ణయించుకోండి.
No comments:
Post a Comment