all

Tuesday, December 11, 2012

12.12.12...........అంకెల వింత తప్పితే అంత ప్రాధాన్యత లేదు!

12.12.12 తేదీలో అంకెల గారడీ తప్ప వింత కానీ ప్రత్యేకత కానీ లేదు. కేవలం గుర్తు పెట్టుకోవడానికి మాత్రం పనికొస్తుంది. ఈ తేదీ శుభప్రదమని, ఇవ్వాళ సిజేరియన్ చేయించుకుంటే పుట్టబోయేపిల్లలు అదృష్టవంతులవుతారని, ఇవ్వాళ పెళ్లి చేసుకుంటే మంచిదని, ఈ రోజున ఏవైనా పనులు తలపెడితే దిగ్విజయంగా జరుగుతాయని నమ్మి చాలామంది ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు దృష్టికొచ్చింది. ఆపరేషన్లు తప్పనివారు, జన్మ, నామనక్షత్రాలకు అనుగుణంగా ఈ తేదీన వివాహాది శుభముహూర్తాలు కుదిరినవారు తప్పించి మిగిలినవారు మోజుపడవలసిన పనిలేదని తెలియజెప్పేందుకే ఈ వివరణ.

ఈ తేదీన ఎవరైనా పుడితే వారి డేటాఫ్ బర్త్‌లో 3 ఒకట్లు ఉంటాయి కాబట్టి వారికి మంచి నాయకత్వ లక్షణాలుంటాయి. ఆలోచనలు ఉన్నతస్థాయిలో ఉంటాయి. ఎంత అభివృద్ధి సాధించినా తృప్తి ఉండదు. డెస్టినీ నంబర్ 11 అవుతుంది. ఇది మాస్టర్‌నంబర్. ఇది చంద్రుడికి ప్రతీక. వీరు జీవితంలో ఎంతో సంపాదించాలనుకుంటారు. అయితే ఒడిదొడుకులు తప్పవు.

పాశ్చాత్య జ్యోతిశ్శాస్త్రం ప్రకారం 12.12.12న ధనురాశి వస్తుంది. ఈ రాశిలో ఉన్న వారికి టెన్షన్ ఎక్కువ. ఉన్నతస్థానాన్ని పొందాలని ఆశిస్తారు, జీవితంలో పైకి ఎదగాలని ఆకాంక్షిస్తారు. ఈ తేదీన పుట్టిన వారి నంబర్‌లో 4 రెండ్లు వస్తాయి. అందులో 2 పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే చంద్రుడి ప్రభావం వల్ల వీరికి సృజనాత్మకత, ఊహాశక్తి ఎక్కువ. ఈ తేదీన పుట్టినవారిలో కవులు, రచయితలు, భావుకులు అధికంగా ఉంటారు. అయితే చంద్ర కళల్లాగే వీరికి కూడా జీవితంలో వృద్ధి క్షయలు ఎక్కువగా ఉంటాయి.

సంప్రదాయ జ్యోతిశ్శాస్త్రం ప్రకారం... ఈ వేళ అనురాధ నక్షత్రం వస్తుంది. ఈ నక్షత్రంలో చండ్రుదు నీచపడతాడు. ఈ వేళ పుట్టినవారిపై చంద్ర , బుధ, సూర్య, శుక్ర, రాహుగ్రహాల ప్రభావం ఉంటుంది. అందువల్ల అది అంత మంచిది కాదు. వివాహాది ముహూర్తాల విషయానికొస్తే- అమావాస్యకు ముందు శుభముహూర్తాలు అంతగా ఉండవు. కాబట్టి మరోసారి స్పష్టం చేస్తున్నదేమంటే - ఈ మూడు పన్నెండ్ల మీద మోజుతో ఇది దివ్యమైన రోజనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. జన్మ, నామనక్షత్రాలకు అనుగుణంగా కాకతాళీయంగా ముహూర్తాలు కుదిరితే అందులో తప్పులేదు కానీ పట్టుబట్టి, ఈవేళ ముహూర్తాలు పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు. వైద్యులు ఈరోజున సిజేరియన్ తప్పదంటే తప్ప అంకెల గారడీలో చిక్కుకోవద్దని సలహా.
- మహమ్మద్ దావూద్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్

No comments: