all

Monday, December 17, 2012

తొందరపాటు తగదు-కథ

 
 
ఒక ఊళ్లో చంద్రాచారి అనే వైద్యుడు ఉండేవాడు. అతని దగ్గరికి అనంతు అనే కుర్రాడు వైద్యం నేర్చుకోవడానికి చేరాడు. చంద్రాచారి తన శిష్యుడి తెలివి, పట్టుదల మెచ్చి అనేక వైద్యరహస్యాలు చెపుతూండేవాడు. ఒకరోజు అనంతు తన అనుమానం గురువుకి తెలియజేశాడు.. ‘‘మనిషికి ఎక్కిళ్లు వస్తే తగ్గించేందుకు ఎలాంటి మందూ లేదుగదా, వాటిని వెంటనే తగ్గించాలంటే ఏం చేయాలి? అనడిగాడు. ‘‘ఎక్కిళ్లు ఆగిపోవాలంటే చెంపమీద ఒక్క దెబ్బ కొడితే చాలు- వెంటనే తగ్గిపోతాయన్నాడు.

మర్నాడు ఒక లావుపాటి వ్యక్తి చంద్రాచారి దగ్గరికి వచ్చి ‘‘అయ్యా! నిన్న రాత్రి నుంచి ఒకటే ఎక్కిళ్లు. ఎంతకీ తగ్గడం లేదు, మీరే ఏదయినా మందివ్వాలి...’’ అని ఇంకా ఏదో చె ప్పబోయాడు. అప్పుడే అనంతు వారి దగ్గరికి వచ్చి ఎక్కిళ్లతో బాధపడుతున్నానన్నది విని ఆ వచ్చిన వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించాడు. ఆ లావుపాటి వ్యక్తి చెంప పట్టుకుని ‘‘ఎక్కిళ్ల బాధ నాకు కాదు, అదుగో రిక్షాలో కూర్చున్న ఆ వ్యకికి’’ అని అన్నాడు. చంద్రాచారికి కోపం వచ్చింది. శిష్యుడిని దగ్గరికి పిలిచి తిట్టాడు. ‘‘తొందర దేనికి? ఆయన చెప్పేది పూర్తిగా వినకుండానే ఎందుకు కొట్టావు? ఇలాగయితే నువ్వు వైద్యం చేయలేవు. వైద్యంలో తొందరపాటు అస్సలు తగదు’’ అంటూ చెంప దెబ్బతిన్న వ్యక్తికి క్షమాపణలు చెప్పించాడు. అనంతు తన తప్పు తెలుసుకున్నాడు.

తోడుదొంగలు

 
కృష్ణాపురంలో జమీందారుగారి మామిడితోట విరగకాసింది. చెట్లన్నీ మామిడి పండ్లతో నిండి ఉన్నాయి. అయితే వాటిని కాపాడుకోవడం ఇబ్బందిగా మారింది. చుట్టుపక్కల మామిడిపండ్ల దొంగలు ఎక్కువైపోయారు. పంటను కాపాడుకోవడానికి జమీందారు కొందరు కాపలావాళ్లను నియమించాడు. దొంగల బెడద కాస్తంత తగ్గింది.

ఒకరోజు ఒక పిల్లవాడు కాపలావాళ్లకు తెలియకుండా తోటలోకి వచ్చి పది కాయలు కోశాడు. వెంటనే పారిపో కుండా, చెట్టు మీదనే కూచుని ఒకటి తినడం మొదలెట్టాడు. సరిగ్గా అపుడే ఒక కావలివాడు ఆ పిల్లాడిని చూశాడు.

వాడు కిందికి దిగి రాగానే చెవిపట్టుకున్నాడు కావలివాడు. ‘‘నువ్వు వెంకటయ్య కొడుకువి కదూ? ఎన్ని రోజుల నుంచి దొంగతనం చేస్తున్నావు? నన్ను తన్నమంటావా? మీ నాన్నచేత తన్నించనా?’ అన్నాడు.
‘‘నేను ఇవాళే వచ్చాను. నాలుగే కోశాను. నువ్వు కొట్టవద్దు. మా నాన్ననే కొట్టమనండి’’ అన్నాడు. కాపలా వాడు కర్ర ఎత్తాడు. ఆ పిల్లవాడు, ‘నాన్నా.. నాన్నా...’ అని అరిచాడు.

అప్పటికే ఒక పెద్ద సంచినిండా మామిడికాయలతో వాడి తండ్రి ఆ వెనగ్గా ఉన్న చెట్టు మీది నించి కిందకి దిగాడు.
అంతే... కావలివాళ్లంతా ఆశ్చర్యపోయారు

అందమె ఆనందం

 
రెండు స్పూన్ల ఓట్లను తగిన ంత నీటిలో మరిగించి, చల్లారిన తర్వాత మెత్తగా మెదపాలి. దానిలో స్పూన్ తేనె కలిపి, ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా ముఖచర్మాన్ని చలిబాధలనుంచి కాపాడుకోవచ్చు

అసహనం, అశ్రద్ధ, తొందరపాటు, నీ లక్ష్యాన్ని దెబ్బతీసే ప్రధాన శత్రువులు


అదర్ సైడ్.....తనికెళ్ల భరణి

 
పరమశివుణ్ని ఫ్రెండ్లీ గాడ్ అంటారు భరణి.
భరణి - మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడేమో శివుడు!
చెంబుడు నీళ్లు, చిటికెడు బూడిద చాలు..
ముక్కంటి ఫ్లాట్ ఐపోతాడని భరణి ధీమా.
‘అవి మాత్రం ఎందుకయ్యా’ అంటాడేమో ఆ భోళాశంకరుడు!
అంతటి మహా శివభక్తుడు భరణి!!
శివ శివా.. మహా శివభక్తుణ్ని కాదు,‘మహాశివ’ భక్తుణ్ని మాత్రమే నేను అంటారు భరణి మళ్లీ.
బహుశా ముక్కంటి భక్తుడైనందుకేమో..
భరణి కూడా వెరీమచ్ ఫ్రెండ్లీ.
చాయ్‌కప్పుడు సాహిత్యానికీ..
ట్రెడిషన్‌ని ఎవరో నిలబెడుతున్నారంటే అక్కడికీ..
మనతో ఎంతదూరమైనా ఆయన నడిచొస్తారు!
కారు దిగి, కొండలెక్కి వచ్చేస్తారు!!
అప్పుడు కనిపించేదే... భరణి అదర్‌సైడ్.


‘నాలోన శివుడు గలడు’ అంటూ ఎప్పుడూ శివస్తుతి చేస్తుంటారు. ఎందుకు శివుణ్ని మీ లోపలే పెట్టుకున్నారు?

తనికెళ్ల: ‘సర్వం శివమయం జగత్’ అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. నా లోపలే కాదు... శివుణ్ణి మీలోపల కూడా పెట్టా. యాక్చువల్‌గా నేను పెద్ద వీర శివభక్తుణ్ణేం కాదు. ‘మీరు మహా శివభక్తులు సార్...’ అంటారు నాతో కొంతమంది. ‘మహా’ శబ్దం నాకు కలపొద్దు. నేను మహాభక్తుణ్ణి కాదు. ఆ మహాశివుడికి భక్తుణ్ణి మాత్రమే అని చెబుతుంటాను. ఎందుకంటే చాలామంది ఈ భక్తి తత్వంలో కూడా సాత్వికాహంకారం చూపించేస్తుంటారు. చూశావా... నేనెంత పూజ చేస్తున్నానో! చూశావా... నేను ఆ గుడి ఎలా కట్టించానో! పూజ చేయడం, గుడి కట్టించడం వరకూ ఓకే. దాన్ని బయటివారికి ప్రదర్శించే గుణమే సాత్వికాహంకారం. అందుచేత నేను మహాశివభక్తుణ్ణి అనరాదు. ‘మహాశివ’... భక్తుణ్ణి అంటే సంతోషిస్తా. కాకా హోటల్‌కి వెళ్లి నిలబడి ఓ ఛాయ్ తాగొచ్చినంత ఈజీగా శివాలయంలో దర్శనం అయిపోతుంది. సింప్లిసిటీకి చిహ్నం శివుడు. కొంచెం వేరే ఆలయానికి వెళితే హడావిడి, గొడవ ఎక్కువ ఉంటాయ్. మాదయ్యగారి మల్లన్న రాసిన ‘రాజశేఖర
చరిత్రం’లో...
‘నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి
పత్రి నెవ్వాడు ఇసుమంత పారవేచు
కామధేనువు వానింటి గాడి పసరము
అల్ల సురశాఖి వాడింటి మల్లె చెట్టు
అని రాశారు. శివపూజను కఠోరమైన నిష్టాగరిష్టంతో ఏం చేయక్కర్లేదు. శివుడు భోళాశంకరుడు. ఊరికే నాలుగు మారేడాకులు అలా విసిరేస్తే చాలు... ఓ చెంబుడు నీళ్లు అలా పోసేస్తే చాలు... శివుడు ఖుష్ అయిపోతాడు. నేను రాసిన ‘శబ్బాష్ రా శంకరా’ పుస్తకంలో ‘చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్... చిటికెడు బూడిద పోస్తే బస్... వట్టి పుణ్యానికి మోక్షమిస్తవు గదా శబ్బాష్‌రా శంకరా...’ అన్నాను. నేను గ్రహించిన శివ ఫిలాసఫీ ఇదే.

అసలు దేవుడే లేడనే వారున్నారు!

తనికెళ్ల: నేను అలాంటివాళ్లనీ గౌరవిస్తాను. ఎందుకంటే మనం దేవుడున్నాడని ఎందుకంటాం. దేవుడంటే ఓ నమ్మకం, ఓ శక్తి, ఓ ధైర్యం. దేవుడు లేడనేవాడికి వాడి మీద వాడికి నమ్మకం ఉండాలి. అదీ గొప్ప విషయమే కదా. దేవుడు లేడూ అన్నాడంటే, దేవుడు చేసే గొప్ప పనులు కూడా వీడు చేసేయ్యాలి. నాకింతవరకూ ఎక్కడా పరిపూర్ణమైన భక్తుడు, పరిపూర్ణమైన నాస్తికుడు కనబడలేదు. దేవుడికి దణ్ణం పెడితే నష్టమేముందిలే అనుకునే భక్తులు, మా ఆవిడ గోల పడలేక సత్యనారాయణ వ్రతంలో పక్కన కూర్చున్నా అని చెప్పే నాస్తికులే నాకు ఎక్కువ కనబడ్డారు. ‘నాస్తికుడంటే దేవుడు మీద నమ్మకం లేనివాడు కాదు. వాడి మీద వాడికి నమ్మకం లేనివాడు’ అని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు.

అయినా ఈ రోజుల్లో దైవభక్తి కూడా ఓ వ్యాపారం అయిపోయింది...

తనికెళ్ల: నిజమే. గుళ్లో దేవుడు భక్తులంతా వెళ్లిపోయాక వస్తాడని నా సందేహం. ఈ పూజారులు, ఈ వ్యాపారులు, ఈ దళారులు, ఈ భక్తులు... వీళ్లందరూ వెళ్లిపోయాక తలుపులు వేసేస్తారుగా. అప్పుడు దేవుడు గుళ్లోకి ఎంటరవుతాడేమోననిపిస్తుంది.

ఆన్‌లైన్ పూజలు కూడా వచ్చేశాయి. ఇలాంటివి చూస్తే మీకేమనిపిస్తుంది?

తనికెళ్ల: హడావిడి ఎక్కువైన కొద్దీ అక్కడ భక్తి లుప్తమైపోతోంది. భక్తి అంటే విభక్తము కానిది. అంటే... మన నుంచి దూరంగా పోనిది. భక్తి అంటే టోటల్‌గా కాన్‌సన్‌ట్రేషన్ ఆన్ పర్టిక్యులర్ యాస్పెక్ట్. ఇప్పుడస్సలు అది లేదు. ఒక్క భక్తి అనేమిటి అన్నిటికీ ఆన్‌లైన్‌నే కల్చర్‌గా చేసుకుంటున్న ఒక కొత్త తరం బయల్దేరింది!

ఒకప్పుడు తెలుగువారంటే గోంగూర పచ్చడి, ఆవకాయ్ పెరుగన్నం, పంచెకట్టు, పురాణ కాలక్షేపాలు గుర్తుకొచ్చేవి. ఇప్పుడంతా పిజ్జా బర్గర్లమయమైపోయింది. ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్‌లు సరేసరి. ఈ అభివృద్ధిని మీరు అంగీకరిస్తారా?

తనికెళ్ల భరణి: ఇది అభివృద్ధి కాదు. విస్మృతి. మనకు బామ్మ అక్కర్లేదు. ఆవిడ భారతం అక్కర్లేదు. తాత అక్కర్లేదు. ఆయన కూర్చున్న పడక్కుర్చీ అక్కర్లేదు. కానీ బామ్మగారి బంగారు దుద్దులు కావాలి. తాతగారి పొలాలు కావాలి. ఎప్పుడన్నా సెలవులకు వెళ్తే మామ్మ చేసే వంకాయ పచ్చడి కావాలి. అక్కడి పూతరేకులు కావాలి. ఒక జాతికి కొన్ని ముద్రలు ఉంటాయ్. మలయాళీ అనగానే కథాకళి గుర్తుకొస్తుంది. తెలుగువారంటే ఓ కూచిపూడి నాట్యం, కొన్ని పిండివంటలు, భాష, కొంత సంస్కారం, సంగీతం.. గుర్తుకు రావాలి. వీటన్నిటినీ ఇవాళ వదిలేశాం. ఇప్పుడు సమస్తమూ ఆన్‌లైనే. సమస్తమూ అక్కడే. సూర్యోదయం చూడవు. సూర్యాస్తమయం చూడవు. ఆకాశంలో ఎన్ని వేల నక్షత్రాలుంటాయో తెలీదు. ఏం వేస్తే బియ్యం వచ్చి అన్నం తయారవుతుందో తెలీదు. ఒక కోడికి గింజలు వేయడం ఎరుగవు. పక్కన ఉన్న ప్రకృతినే పట్టించుకోకుండా, కంప్యూటర్ దగ్గరకు వెళ్లడం ఎంత దురన్యాయం! నిధిని పక్కన పెట్టుకుని చెయ్యి చాస్తున్నాం మనం.

ప్రపంచమంతా ముందుకు దూసుకెళ్తుంటే మమ్మల్ని వెనక్కు లాగేస్తున్నారని ఇప్పటి తరం ఆక్షేపిస్తోంది?

తనికెళ్ల: ముందుకు వెళ్లొద్దనడంలేదు. ముందూ వెనకా చూసుకోమంటున్నానంతే. అసలు మనం అలా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాం? బాగా సంపాదించేసి, రిటైరయ్యాక ఓ చిన్న రిసార్ట్, నాలుగు చెట్లు వేసుకుని, హాయిగా బతకాలని అందరూ కలలు కంటారు. అందరికీ సక్సెసయిపోవాలనే ఆరాటం. వందకి వంద మార్కులు వచ్చేశాయని విద్యా సంస్థలు తెగ ప్రచారాలు చేసేస్తుంటాయి! ఓకే.. వీళ్లంతా సక్సెస్‌ఫుల్ పీపులే. కానీ ‘దే ఆర్ నాట్ హ్యాపీ’. జీవితానికి పరమార్థం ఆనందమా? విజయమా? సక్సెస్ అయిన ప్రతివాడూ ఆనందంగా ఉన్నట్టు కాదు. కానీ ఆనందంగా ఉన్నవాడు సక్సెసైనట్టే లెక్క. ఒక హడావిడిలో లేచి, ఒక హడావిడిలో పని ముగించుకుని, హడావిడిలో ఇంటికొచ్చేసరికి అందరూ నిద్రపోతుంటారు. అంతేనా జీవితం ఇంక. జ్వరమొచ్చినప్పుడు సెలవు పెడతాం. అసలు సెలవనేది ఇంట్లో వాళ్లను సరదాగా బయటికి తీసుకెళ్లడానికి ఉండాలి కానీ, ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సెలవైతే అదేం దరిద్రం!? ఇంతకన్నా భిన్నంగా ఎవరి జీవితమైనా ఉందా?

ఇప్పుడే ఇలా ఉంటే, భవిష్యత్ సమాజం ఎలా ఉంటుందంటారు?

తనికెళ్ల: బావుంటుందనే ఆశ ఉంది. పెద్ద చెట్టు కూలిపోయి నాశనమైతే, మళ్లీ చిగురు మొలుస్తుంది. అది లేతగా, స్వచ్ఛంగా ఉంటుంది. పులులు అంతరించినట్టు, సంస్కృతి అంతరించిపోతోంది. పులుల్ని కాపాడ్డానికి ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటున్నట్టే, సంస్కృతీ పరిరక్షణకు అలాంటి ప్రాజెక్టులు పెట్టుకోవాలి. ఈ మధ్య ఓ ఇన్సిడెంట్ తెలుసుకుని చాలా ముచ్చటేసింది. లండన్‌లో స్థిరపడిన ఓ తెలుగాయన వాళ్లమ్మాయికి ఆరు నెలలు సెలవులొచ్చాయని ఇక్కడకు తీసుకొచ్చి వాళ్ల అమ్మమ్మ ఇంట్లో పెట్టేశాడు. ఆ అమ్మాయికి ఇంగ్లీషు తప్ప ఏమీరాదు. ఈ ఆరు నెలల్లో ఆ అమ్మాయి తెలుగు నేర్చుకోవాలి. నేర్చుకుంది కూడా. నాతో ‘మా అమ్మాయిని గర్వంగా, ఆనందంగా లండన్ తీసుకెళ్తున్నాన’ని చెప్పాడాయన. నాకు వళ్లు పులకరించింది. ఇలా స్ట్రాంగ్‌గా మరో ఇద్దరు, ముగ్గురు చేస్తే మిగతావాళ్లు కూడా అనుసరిస్తారు. మన భాష మాట్లాడ్డానికి ఏం తక్కువొచ్చింది? 11వ శతాబ్దంలోనే కావ్యాలు రాసిన జాతి మనది.

ఇప్పటి జనరేషన్‌కి తెలుగే కాదు... రామాయణ, భారత, భాగవతాల గురించి కూడా తెలియదు. రాముడు, కృష్ణుడు, దర్మరాజు... లాంటి పురాణ పురుషుల గురించి తెలియదు. దీని గురించి ఏమంటారు?

తనికెళ్ల: అంతదాకా ఎందుకు? మీ తాత పేరు ఏంటని అడగండి ఎవరినైనా, తాత పేరు తెలియదు. మామ్మ పేరు తెలియదు. ఇంకా విచిత్రం చెప్పనా, చాలామందికి వాళ్ల పేరుకున్న అర్థమే తెలీదు. ‘విష్వక్’ అంటాడు అర్ధమేంటని అడిగితే తెలీదు. ఇప్పుడు జనరేషన్‌లో అందరికీ మూడక్షరాల పేర్లే. లేకపోతే రెండక్షరాలు. అందులో 99 శాతం సంస్కృతం పేర్లే అయ్యుంటాయి. అది సంస్కృతమనీ తెలీదు, దాని అర్థం కూడా తెలీదు. ‘నిర్యాణ్’ బావుందని పెట్టేసుకుంటారు. నిర్యాణమంటే చావు. ‘పిండక్’లాంటి పేర్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మరో వైరుధ్యం కూడా ఉంది. ఇప్పుడంతా బాగా చదువుతున్నారు. బాగా సంపాదిస్తున్నారు. ఓకే... కానీ చిన్న చిన్న విషయాలకే డిప్రెస్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?!

తనికెళ్ల: ఆత్మహత్యల నేపథ్యంలోనే ‘సిరా’ పేరుతో ఓ లఘుచిత్రం చేశా. చనిపోతున్నవాడికి మృత్యువు ఎదురై వెయ్యి చావులకన్నా ఓ బతుకు గొప్పది అని చెబుతుంది. అదీ కథ. ఈ లఘుచిత్రం చూసి దిలీప్ అనే ఒకతను నాకు ఫోన్ చేశాడు. సార్... నేను వారం క్రితం ఆత్మహత్యయత్నం చేసుకున్నా. కానీ బతికాను. మీ సినిమా చూశాక నాకు బ్రతకాలనే ఆశ రెట్టింపైంది’’ అని చెప్పాడు. ఇంతకన్నా అవార్డు ఏముంటుంది? అతని పెళ్లికి కూడా నేను వెళ్లా. అతని మొబైల్‌లో నా పేరు ‘ప్రాణం’ అని పెట్టుకున్నాడు. జీవితం పట్ల ఓ అభిరుచి, సంస్కారం కావాలి. జీవితమొక వరం అనే విషయం అందరూ తెలుసుకోవాలి.

విపరీతమైనపోయిన సాంకేతికాభివృద్ధి గురించి?

తనికెళ్ల: ఒక్క అన్నం తినే పనితప్ప మిగతావన్నీ మెషీన్లే చేసేస్తున్నాయి. ఇక ప్రతివాడికీ శంఖుచక్రాల్లాగా బీపీ, షుగరూ రమ్మంటే ఎందుకు రావు? ఇప్పుడు ప్రతిదానికీ స్విచ్. ఆ స్విచ్‌లు పనిచేయడానికి రిమోట్ స్విచ్. శరీరం ఎప్పుడైతే పనిచేయడం మానేసిందో, అప్పుడు జబ్బులు హాయిగా మనలోకి ఎంటరైపోతాయి. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది. అయినా మేం కింద కూర్చునే భోంచేస్తాం. కొన్నింటిని అలంకారాలుగానే ఉంచేయాలి. మన అలవాట్లు మాత్రం ఆరోగ్యకరంగా ఉండేలా చేసుకోవాలి. ఇవన్నీ వదిలేసి పొద్దున్నే బూట్లేసుకుని కిలోమీటర్ల కొద్దీ రన్నింగులూ, జాగింగ్‌లూనూ. ఈ జిమ్ సెంటర్లన్నీ ఎందుకు వెలిశాయి? పనంతా పనిమనిషికప్పగించి, నువ్వు యోగా చేస్తే ఎట్లా? పని కూడా ఓ యోగానే కదా.

పల్లెటూళ్లలో కూడా మట్టి వాసనే లేకుండా పోయింది. అన్నీ బోన్సాయ్ సిటీల్లా తయారయ్యాయి!

తనికెళ్ల: అవును. ప్రతివాడూ హైద్రాబాద్ వచ్చేయవలసిందే. హైదరాబాద్ నుండి వెళ్లేటప్పుడు ఈ కల్చర్ పట్టుకుపోతున్నాడు. వంశీ సినిమా కోసం గతంలో ఓ సారెప్పుడో పోలవరానికి దూరంగా ఓ పల్లెటూరికి వెళ్తే అడవిపూలు పెట్టుకుని కోకా రైక కట్టుకుని కడవలతో నీళ్ల కోసం గోదావరి ఒడ్డుకొచ్చే ఆడవాళ్లనూ చూస్తే ఓ దివ్యమైన సౌందర్య సాక్ష్యాత్కారం. మొన్నీ మధ్య వెళ్తే అంతా నైటీల్లో కనిపించారు. అసలు పెళ్లి మంటపాల్లో సిగ్గుపడ్డ అమ్మాయిలను నేనీ దశాబ్దంలోనే చూడలేదు. పెళ్లికొడుక్కే తన బాయ్‌ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తున్నారు అమ్మాయిలు!

సినిమా అంటే అందరికీ క్రేజే. కానీ పిల్లనివ్వడానికి, ఇల్లు అద్దెకివ్వడానికి మాత్రం ఇప్పటికీ సినిమా వాళ్లంటే ఓ వివక్ష ఉంది. ఎందుకంటారు?

తనికెళ్ల: సినిమావాళ్లంటే అదేదో సెపరేటనే ముద్ర ఉంది. అన్ని రకాలుగా చెడిపోయినవాళ్లు అనే ఫీలింగ్ కొందరిది. దానికి కారణం గ్లామరస్ ఫీల్డ్ కావడం. ‘మిథునం’ సినిమా ఆఫీసు కోసం ఎన్ని చోట్ల వెతికినా నాకే ఇవ్వలేదు. చివరకు మా ఇంట్లోనే ఆఫీసు పెట్టుకోవాల్సి వచ్చింది. పూర్వం నటుల్ని పంక్తి బాహ్యులు అనేవారు. నటులకు పంక్తిలో భోజనం పెట్టేవారు కాదు. ప్రపంచంలో సర్వదుర్మార్గాలు చేస్తున్నవాళ్లు బయట ఉన్నారు. బయటి వాళ్లయితే గ్లామర్ ఉండదు కాబట్టి, సినిమా వాళ్ల మీద పడతారు.

మిమ్మల్ని పూర్తిగా సినిమా మనిషి అనుకోలేం. నటనకు దీటుగా మీలో కవిత్వమూ కనిపిస్తుంటుంది. ఎప్పుడైనా ప్రేమ కవిత్వం రాశారా? ఎందుకంటే ‘ప్రేమలేఖలు’ అనేవి ఎవ్వరికైనా తీపి అనుభవాలు. ఈ జనరేషన్ వాటిని కోల్పోతున్నట్లుంది?

తనికెళ్ల: అసలు ప్రేమ ఉంటే కదా లేఖ. ఇప్పుడంతా వ్యాపారమే. వాడు మనకు వర్కవుట్ అవుతాడా అని ఆమె, దీన్ని ఎంతలోపు ట్రాప్ చేయొచ్చని వాడు... ఇలా ఏడ్చి చచ్చాయి ప్రేమలు. అమాయకత్వాలు, గౌరవాలు అన్నీ సినిమాల్లోనే. అందుకే సినిమాను గౌరవిస్తాను నేను. సినిమా ఈజ్ ప్రొటెక్టింగ్ పాస్ట్ కల్చర్. కార్తీక దీపాలు, అద్భుతమైన సాహిత్యాలు ఇవన్నీ ఏమైనా ఉన్నాయీ అంటే సినిమాల్లోనే. నిజజీవితంలో ఏమీ లేవు. బయట చిన్న నిక్కరు వేసుకుని తిరిగే హీరోయిన్ సినిమాలో చీర కట్టుకునే గుడికి వెళ్తుంది. నాకు తెలిసి ఈ రోజుల్లో ఎక్కువ కల్చరల్ ప్రొటెక్షన్ చేస్తుంది సినిమానే. భర్త కాళ్లకు భార్య దణ్ణం పెట్టడమనేది సినిమాల్లోనే సాధ్యం. మా ఆవిడెప్పుడు నా కాళ్లకు దణ్ణం పెట్టలేదు (నవ్వేస్తూ).

మీరెన్ని ప్రేమలేఖలు రాసి ఉంటారు?

తనికెళ్ల: నేను రాయడం తక్కువే. కానీ అందుకున్నవి ఎక్కువ. కవిని కాబట్టి నాకు కొంచెం క్రేజ్ ఉండేది. ప్రేమలేఖలు రాయడం, అందుకోవడం అదొక మధురమైన భావన. ఆ వయసులో, ఆ యౌవనంలో అదొక మజా. ఇప్పుడేమో ప్రేమలేఖల స్థానంలో ఎస్సెమ్మెస్‌లు, చాటింగులొచ్చాయి. మాధ్యమం ఏదైతేనేం అనుభూతి మాత్రం అదే. వేళాకోళానికి అన్నా అస్సలు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది. అయితే సినిమాలు, టీవీల వల్ల ప్రేమ పక్కా కమర్షియల్ అయిపోతోంది. దాంతో అంతా ఓ అనుమానంతో ప్రేమిస్తున్నారు.

ప్రేమను అనుమానిస్తూ, డబ్బును ప్రేమిస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లుంది?

తనికెళ్ల: ‘ధనం మూలం ఇదం జగత్’ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడది 100% కరెక్ట్. చిన్నప్పుడు మా ఇంట్లో ఏడుగురు ఉండేవాళ్లం. ఒక్కటే బాత్‌రూమ్. ఇప్పుడు మా ఇంట్లో ఏడు బాత్‌రూమ్‌లు ఉన్నాయి. అన్నింట్లో స్నానం చేయలేంగా. ‘ఇడ్లీ వడ ఆకాశం’ పుస్తకంలో కామత్ ఓ మంచి మాట చెబుతాడు. ఓ చిన్న కారులో మేం చాలామందిమి వెళ్లేవాళ్లం. మేమంతా ఇరుకుగా కాకుండా చాలా దగ్గరగా ఉన్నామన్న భావన కలిగేది. ఆ దగ్గరితనాన్ని మనం ఫీలవ్వాలి.

సంపాదించినంతకాలం సంపాదించేసి, ఎంజాయ్ చేసినంతకాలం ఎంజాయ్ చేసేసి, చివరాఖరున మాత్రం దాన ధర్మాలు చేసేసి మంచి పేరుని, పుణ్యాన్ని మూట కట్టేసుకోవాలనుకుంటారు చాలామంది. సబబేనా?

తనికెళ్ల: నేనెప్పుడూ ఓ జోక్ చెబుతుంటా. ఒకడు నవరత్నాల ఉంగరం చేయించుకుని వేలికి పెట్టుకుంటే, అది కాస్తా బాగా బిగిసిపోయి వేలు వాసింది. ఎంతకూ తగ్గలేదు. డాక్టరు దగ్గరకు వెళ్లినా ఫలితం దక్కలేదు. చివరకు వెంకటేశ్వరస్వామికి మొక్కుకుని వేలు వాపు తగ్గిస్తే, ఉంగరం హుండీలో వేస్తానన్నాడు. వేలువాపు వెంటనే తగ్గిపోయింది. సరిగ్గా అదే సమయానికి బంగారం రేటు ఆరు రెట్లు పెరిగిపోయింది. దాంతో వీడిలో మళ్లీ అంతర్మథనం మొదలైంది. స్వామితో ఇంకో బేరం పెట్టాడు. ‘‘నీకు ఫలానా రేటు ఉన్నప్పుడు మొక్కుకున్నా కాబట్టి, ఆ సమానమైన డబ్బులు హుండీలో వేసేస్తా’’ అని ఆ డబ్బు హుండీలో వేసేశాడు. ఆ డబ్బుతో పాటు ఉంగరం కాస్తా జారి హుండీలో పడిపోయింది. ఎందుకంటే వెంకటేశ్వరుడు వడ్డీకాసులవాడు కదా. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే నువ్వు బిజినెస్ చేయదలుచుకుంటే అమాయకుడుతో చెయ్. దేవుడు చాలా తెలివైనవాడు.

మళ్లీ మీకు బాల్యంలోకి వెళ్లే అవకాశం వస్తే?

తనికెళ్ల: బాల్యం అనేది ఓ అవస్థ. ఐస్‌క్రీమ్‌ని ఫస్ట్ టైమ్ చూసినపుడు ఎంత థ్రిల్ ఫీలయ్యామో, ఆ థ్రిల్‌ని ఇవ్వాళ కూడా ఫీలయ్యితే అదే బాల్యం. ఆ బాల్యాన్ని మళ్లీ తెచ్చుకోవడం కోసమే దేవుడు వార్థక్యాన్ని పెట్టాడు. మనమేమో వార్థక్యాన్ని ఓ అవస్థగా ఫీలవుతున్నాం.

‘ఆదిత్య 369’లో టైమ్ మెషీన్ తరహాలో శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్లే అవకాశమొస్తే?


తనికెళ్ల: ఏ కాలమైనా సరే ముందు మనలో ఆ రసజ్ఞత ఉండాలి. రజ్ఞమైన హృదయం ఉంటే ఇప్పుడు హంపి వెళ్లినా కృష్ణదేవరాయల కాలాన్ని ఊహించుకోవచ్చు. రసహృదయం ఉంటే ముందుకూ వెళ్లనవసరం లేదు. వెనక్కూ వెళ్లక్కర్లేదు.

దేవుడు ప్రత్యక్షమై మీకు ఫలానా వారిలా పుట్టే అవకాశమిస్తే ఏం చేస్తారు?

తనికెళ్ల: అమాయకుడిగా పుట్టించమని అడుగుతాను. ప్రతిదానికీ ఆశ్చర్యపోతూ... ప్రతీదీ ప్రశ్నిస్తూ...ఓ నిండైన అమాయత్వంతో బతికే జీవితం కావాలి.

ఆత్మకథ రాసే యోచనలో ఉన్నారని...

తనికెళ్ల: ‘నలుపు... తెలుపు... కొంచెం కలరూ’ పేరుతో ఆత్మకథ రాద్దామన్న ఆలోచన ఉంది. కొంత ప్రిపరేషనైతే జరుగుతోంది. చూద్దాం... షష్టిపూర్తి సమయానికైనా రెడీ అవుతుందేమో! ఎవర్నీ హర్ట్ చేయని నిజాలు అందులో ఉంటాయి. ఎదుటివారిలో నెగటివ్ గుణాలు చెప్పడం మంచి లక్షణం కాదు. నాలో అవి లేకపోతే కదా. నిజాలైతే చెబ్తా. నేను బాధపడ్డవి, గాయపడ్డవి, కన్నీరు పెట్టుకున్నవి రాస్తా. ఎదుటి వాళ్ల దుర్మార్గాల గురించి నేను రాయదలచుకోలేదు.

సంభాషణ: పులగం చిన్నారాయణ

‘‘కదలిపోతోంది... భావన వదిలి పోతోంది.
వెళ్లలేక వెళ్లలేక ఒదిగిపోతోంది.
ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను.
కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను.
కవితలను రాసి రాసి అలసిపోయాను.
అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది.
తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి.
బాధలో నా భావనలను చెదరగొట్టాను.
వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయాయి.
భావనలు వెళ్లిపోయాయి
నన్ను వదిలి వెళ్లిపోయాయి’’.
(తనికెళ్ల భరణి ఇంటర్ ఫస్టియర్‌లో ఉండగా రాసిన తొలి కవిత)

‘ఆట కదరా శివా’
ఆట కదరా శివా
ఆట కద కేశవా
ఆట కదరా నీకు
అమ్మ తోడు

ఆట కద జననాలు
ఆట కద మరణాలు
మధ్యలో ప్రణయాలు
ఆట నీకు

ఆట కద భూమిపై
మూడు వంతులు నీరు
మిగతాది కన్నీరు
ఆట నీకు

ఏ తండ్రి అయినా తన పిల్లల కోసం చేయదగిన అతి గొప్ప ఆలోచన, వారి తల్లిని ప్రేమించడం.


ఫ్యాటీ లివర్...
హోమియో
కాలేయం సాధారణ పరిమాణం కంటే పెద్దదిగా ఉండి, అందులో కొవ్వు పదార్థాల నిల్వ ఎక్కువగా ఉంటే... ఆ కండిషన్‌ను ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ఈ కండిషన్ ఉన్నప్పుడు సాధారణంగా బయటకు ఎలాంటి లక్షణాలూ కనపడవు. ఏవైనా ఆరోగ్యపరీక్షలు చేయిస్తున్నప్పుడు ఈ కండిషన్ బయట పడుతుంది. ఈ కండిషన్ ఉన్నవారిలో కాలేయంలో ఉండే ట్రాన్స్‌ఎమైనేజెస్ సంఖ్య కూడా పెరుగుతుంది.

కారణాలు :
అధిక బరువు
శరీరంలో కొవ్వు ఎక్కువగా చేరడం
శారీరక శ్రమ తక్కువగా ఉండే జీవనశైలి లేదా ఒకేచోట స్థిరంగా కూర్చుని పనిచేసే వృత్తిలో ఉండటం
మత్తుపానీయాలు సేవించడం
డయాబెటిస్
పైన పేర్కొన్న పరిస్థితుల్లో తనలోకి చేరుకునే అధిక కొవ్వును కాలేయం అదుపులో ఉంచలేదు. దాంతో కాలేయంలో కొవ్వుపదార్థాల నిల్వలు పెరుగుతాయి. ఫలితంగా కాలేయ సామర్థ్యం తగ్గడం, వాపు రావడం, గట్టిదనాన్ని సంతరించుకోవడం జరగవచ్చు.

నిర్ధారణ పరీక్షలు :
పూర్తి రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ పిక్చర్-సీబీపీ) కాలేయ పనితీరు పరీక్ష (లివర్ ఫంక్షన్ టెస్ట్-ఎల్‌ఎఫ్‌టీ) సీటీ లివర్ అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామిన్ లివర్ బయాప్సీ లిపిడ్ ప్రొఫైల్ ఎఫ్‌బీఎస్, పీఎల్‌బీఎస్, ఆర్‌బీఎస్ వంటి పరీక్షలు.

వ్యాధి వచ్చేందుకు అవకాశం (రిస్క్) ఉన్నవారు:చక్కెరవ్యాధి (డయాబెటిస్) ఉన్నవారికి
స్థూలకాయం / అధిక బరువు ఉన్నవారికి

రక్తంలో కొన్ని కొవ్వుపదార్థాలు (హైపర్‌ట్రైగ్లిజరిడిమియా వంటివి) ఉన్నవారికి

ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి

నివారణ :
బరువు పెరగకుండా చూసుకోవడం

వ్యాయామం చేయడం

పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం

ఆహారంలో కొవ్వులు తగ్గించడం.

చికిత్స :
దీనికి ప్రత్యేకంగా మందులు ఉండవు. అయితే వ్యాధి వచ్చిన కారణాన్ని కనుగొని ఆ పరిస్థితిని నివారించేలా చికిత్స చేయడం వల్ల ఈ కండిషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్య స్వల్పంగానే ఉంటే దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. దీర్ఘకాలంగా ఉంటే అది ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి కండిషన్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది. లక్షణాలను బట్టి... కార్డస్ మరైనస్, చెలిడోనియమ్, సియోనాంథస్, లైకోపోడియమ్, కాల్కేరియా కార్బ్, మెర్క్‌సాల్, మాగ్‌మూర్, నక్స్‌వామికా, ఫాస్ఫరస్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది.

- డాక్టర్ ఎం. శ్రీకాంత్
సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్

అందమె ఆనందం

 
పెరుగు, ఆవనూనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని శిరోజాలకు పట్టించి, అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల శిరోజాల అందం మెరుగవుతుంది.

అడుగు వేస్తే ఆలోచించకు.............(నిత్య సందేశం)

 
 
మన బుద్ధే మన కర్మల్ని నడిపిస్తుంది... అంటారు పెద్దలు. ఏది మంచో? ఏది చెడో? తెలిసిన బుద్ధి వల్ల మన వ్యవహారం సఫలం అవుతుందన్నది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని విషయాల్లో మనం అనుభవించవలసిన కర్మలు మన బుద్ధిని నడిపిస్తాయంటారు వేదాంతులు. ఇది కూడా అందరికీ తెలిసిన సత్యమే. ఎందుకంటే మనం ఎంతటి మంచి ముహూర్తాలు పెట్టించి సశాస్త్రీయంగా పెళ్లిళ్లు జరిపించినా అందులో కొన్ని విఫలం అవుతూనే ఉంటాయి. ఒకే ముహూర్తానికి పెళ్లి అయిన ఒక జంట సకల భోగాలూ అనుభవిస్తూ ఉంటే, మరో జంట అష్టకష్టాలూ పడటం చూస్తూనే ఉంటాం. ఏమిటి కారణం? అని ఆలోచిస్తే అటు బుద్ధికీ, ఇటు కర్మకీ రెండింటికీ ప్రాధాన్యం కనబడుతోంది ఈ లోకంలో. అయితే మనం దేనికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్రశ్న. కనిపించని కర్మఫలం కంటే బుద్ధికే మొదటిస్థానం ఇవ్వాలంటోంది సంప్రదాయం.

బుద్ధ్యాచరణమాధత్స్వ! మా శంకయ గతే పదే
బాగా ఆలోచించి మాత్రమే అడుగు వెయ్యి. అడుగు పడిందా ఇంక ఆలోచించకు. ఆత్మవిశ్వాసంతో ముందుకి నడుస్తూనే ఉండు... అని అర్థం. నీ ధైర్యం వల్ల ఒకసారి ఎదుటివారికి అధైర్యం కలిగి నీ పని సానుకూలం అవుతుంది కూడా. ఆలోచించకుండా అడుగువేస్తే మాత్రం అడుగడుగునా ప్రమాదాలు వస్తూనే ఉంటాయి. ఆలోచన కూడా చాలా దూరంగా ఆలోచించాలి.

ఒక పక్షి జంట ఒక చెట్టుపై నివసిస్తోంది. అవి ఎప్పుడు పిల్లల్ని పెడుతున్నా ఆ క్రింద పుట్టలో ఉన్న పాము తినేస్తూ ఉంది. ఇంక పాముని చంపితే తప్ప లాభం లేదనుకొని చిన్నచిన్న ఎండు చేపల్ని తెచ్చి, పాముకి శత్రువైన ముంగిస పుట్ట నుండి పాము పుట్టవరకూ వేసుకొంటూ వచ్చాయి. తాము ప్రొద్దుటే ఆహారానికి వెళ్లాయి. ముంగిస ఆ చేప పిల్లల్ని భక్షిస్తూ వచ్చి పుట్టలో పాముని చంపి చెట్టుపై గూడులో ఉన్న పక్షి పిల్లల్ని కూడా భక్షించి వెళ్లింది. ముంగిస కూడా తమ పిల్లల్ని భక్షిస్తుందేమోనన్న దూరాలోచన చెయ్యక నష్టపోయాయి పక్షులు. భారతంలో ఉత్తరుడు ఏమీ ఆలోచన లేకుండా కౌరవులతో యుద్ధానికి బయలుదేరాడు. అడుగువేస్తే ఇంక ఆలోచించకూడదని అర్జునుడు ఒంటరిగానైనా భీష్మాది యోధులతో యుద్ధం చేసి గోవుల్ని విడిపించాడు. మోహనాస్త్రమనే మంచి ఉపాయంతో ఎవ్వర్నీ చంపకుండానే విజయం సాధించి ఘనుడయ్యాడు. కిరాత వేషంలో వచ్చిన శివుని చేతిలో తన దగ్గర ఉన్న బాణాలన్నీ కోల్పోయినా ధైర్యం విడువకుండా గాండీవంతోనే మోదడానికి సిద్ధపడ్డాడు తప్ప వెనుకంజ వెయ్యలేదు. ఫలితంగా పాశుపతాస్త్రాన్ని పొందగలిగాడు.

నేటి సమాజంలో ప్రతిఒక్కరూ దీన్ని గుర్తించాలి. ఎంత కష్టమైన ఫలితమైనా ఎందుకు సాధింపలే మనే పట్టుదల ఉండాలి. విజ్ఞాన శాస్త్రవేత్తలు నిజంగా మహర్షుల వంటివారు. వారు సాధించిన శాస్త్రపురోగతికి వారి పట్టుదలే కారణం. ఫలితంగా మనం అనేక సౌకర్యాలు అనుభవించగలుగుతున్నాం. ధైర్యవంతుణ్ని సంపదలు అనుగ్రహిస్తాయి అన్నది పరమ సత్యం.

ఆలినీకు దండమే!---బెటర్‌హాఫ్

 
 
అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే...ఆ పల్లెటూళ్లో ఆమెను చూసినప్పుడు గుండె ఒక పట్టాన కుదురుగా లేదు. అవును. కవిగారు ప్రేమలో పడిపోయారు! దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే.... కాస్త లేటుగానైనా దేవుడు వరం ఇచ్చాడు. హమ్మయ్య! ప్రేమించిన అమ్మాయితో పెళ్లయిపోయింది!! నింబోలిగడ్డలో... మూడు వైపులా రేకులు ఒకవైపు మాత్రమే గోడ ఉన్న షెడ్డులో కాపురం. కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఆప్యాయంగా వచ్చి పలకరిస్తున్నాయి. ఆమె బెదరలేదు. నేనున్నాను... అంటూ భర్తకు అండగా నిలిచింది. పాటల తోటకు పరిమళాలు అద్దింది. ఆమెను ఎలా మరిచిపోగలడు? ఆలి నీకు దండమే అర్ధాంగి నీకు దండమే! సుద్దాల అశోక్‌తేజ-నిర్మల దాంపత్య జీవితంలోని వెలుగునీడల సవ్వడులు, స్వరమాధుర్యాలు ఈవారం...

హైదరాబాద్ ఉప్పల్‌లో నివాసం ఉంటున్న సుద్దాల అశోక్‌తేజ దంపతులను కలుసుకుని, వారి జీవితంలోని మధురిమలను తెలుసుకోవాలని బయల్దేరాం. ‘పాట కుటీరం’లోకి అడుగుపెట్టినప్పుడు చిరునగవుల తోరణాలతో ఆహ్వానం పలికారు సుద్దాల అశోక్‌తేజ, నిర్మల దంపతులు. చక్కని లొకేషన్ ఉంటే ఎంచక్కని కబుర్లు పంచుకోవచ్చంటూ వారింటి పైఅంతస్తుకు చేరే మెట్లమీదకు దారితీశారు.

‘మా ఇద్దరిలో నేను ఓ మెట్టు పైన ఉన్నట్టు లోకమంతా అనుకుంటారు. నా దృష్టిలో నా శ్రీమతి నిర్మలే ఓ మెట్టు పైన ఉంది’ అని ఆప్యాయంగా ఆమెకు పెమైట్టు ఆఫర్ చేసి, తను కిందిమెట్టు మీద కూర్చున్నారు అశోక్‌తేజ. శ్రీవారి మాటలకు శ్రీమతి ముఖంలోని ఆనందం ముద్దబంతిలా విచ్చుకుంది. ఈ ఒక్క సందర్భం చాలనిపించింది రాజ్యాలేలే మహరాజైనా ఇంటిని ఏలే మహరాణికి హృదయస్థానంలో ఇచ్చే ‘పెమైట్టు’ ఆ బంధాన్ని పదిలం చేస్తుందని.

అశోక్‌తేజ స్వస్థలం నల్లగొండజిల్లా సుద్దాల గ్రామం, నిర్మల పుట్టిన ఊరు వరంగల్ జిల్లా. ముప్పై మూడేళ్ల క్రితం (1979లో) మూడుముళ్లు పడిన ఈ అనుబంధం గురించి తెలియజేయమని కోరితే, నాటి జ్ఞాపకాల్లోకి ఆనందంగా వెళ్లారు ఈ దంపతులు.

తొలిప్రేమ...

‘ఇంటర్మీడియట్ పూర్తయ్యాక కరీంనగర్ జిల్లా, బొమ్మర మేడిపల్లిలో ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తుండేవాణ్ణి. ఒకసారి సెలవుల్లో వరంగల్‌లోని మా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను. నాకు పెళ్లి చేయాలని మా అమ్మమ్మ పెళ్లి చూపుల పేరుతో ఇల్లిల్లూ తిప్పింది. ఆమె మాట కాదనలేక ఒకేరోజు పదమూడు మంది అమ్మాయిలను పెళ్లిచూపుల పేరుతో చూశాను. అంతమందిలో చివరగా పేరుకు తగ్గట్టే నిర్మలంగా ఉన్న ఈమే నా బెటర్‌హాఫ్ అనిపించింది. అప్పుడు ఈమె వయసు పదహారు’ అని తమ తొలిచూపుల ప్రణయాన్ని చెప్పుకుపోతున్న శ్రీవారి మాటలకు బ్రేక్‌వేస్తూ నిర్మల - ‘ఈయన అప్పుడు పెద్ద జులపాలజుట్టు, గుబురుమీసాలు, బెల్‌బాటం ప్యాంటు... రౌడీలాగే ఉన్నారు’ అని ఆమె చిరునవ్వులు చిందిస్తుంటే ‘పరమసాత్వికుడిని పట్టుకొని రౌడీ అంటావా...?!’ అన్నారు సుద్దాల. వారిద్దరి నవ్వులు ఆ ఇంట్లో సరిగమల స్వరాలయ్యాయి.


అశోక్‌తేజ కొనసాగిస్తూ - ‘నాకు నిర్మల నచ్చిన విషయం చెప్పగానే మా అమ్మమ్మ ఈమె అమ్మనాన్నలను అడిగింది. వాళ్లు... ఇంకో ఏడాది వరకు పెళ్లి చేయమన్నారు. నా అహం దెబ్బతింది. పంతానికి పోయి పక్క ఊళ్లో ఓ సంబంధాన్ని ఖాయం చేసుకున్నాను. మూడు రోజుల్లో పెళ్లి... నాలో గుబులు మొదలైంది. ఈ పెళ్లి చేసుకోను అన్నాను. పెళ్లి ఆగిపోయింది. నా ఇష్టాన్ని గమనించి మా అమ్మమ్మ మళ్లీ వీళ్ల ఇంట్లో వాళ్లను అడిగింది. తొమ్మిది నెలలు ఆగమన్నారు’ పెళ్లినాటి విశేషాలు ఇప్పుడే జరిగాయా అన్నట్టు చెప్పారు అశోక్‌తేజ.

ప్రేమలేఖలతో చేరిక...

‘పెళ్లికి గ్యాప్ ఉండటంతో విపరీతంగా ఉత్తరాలు రాసుకునేవాళ్లం. ఆ ఉత్తరాలలో మా ప్రేమంతా కనిపించేది’ అన్నారు నిర్మల సిగ్గుపడుతూ. దంపతులను దగ్గర చేసేది అరమరికలు లేని స్నేహం. ఆ ప్రేమలేఖల్లో వారి స్నేహాన్ని మానసికంగా మరింత చేరువ చేసింది.

అత్తింటి మన్ననలు...

సుద్దాల అశోక్‌తేజకు తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. పదిమంది తోబుట్టువుల్లో చిన్నమ్మాయి నిర్మల. ‘మెట్టినింట పెద్దకోడలిగా అడుగుపెట్టాను. మరుసటి రోజు మా మామగారు నా చేత పప్పు, పచ్చిపులుసు చేయించమన్నారు. పుట్టింట్లో అమ్మ, వదినలు ఉండటంతో పొయ్యి దగ్గరకు వెళ్లే అవసరమే రాలేదు. ఎలా, అని భయపడుతూనే పాలకూరపప్పు, పచ్చిపులుసు చేశాను. మా మామగారు బ్రహ్మాండం అని మెచ్చుకున్నారు. నా వంట ఎలా ఉన్నా ఇంట్లో అందరూ బాగుందన్నారంటే వారి మనసుల్లో నాకు ఎంతటి స్థానం ఇచ్చారో అర్థ్ధమైంది. దాంతో భయం పోయింది. ఈయనైతే మా అన్నదమ్ముల్లో ఒకరిగా కలిసిపోయారు’’ అంటూ ఇరువైపు కుటుంబాల్లో తాము ఎంతగా అల్లుకుపోయారో తెలిపారు నిర్మల.

పాటల తోటలో...

పాటల కూర్పులో శ్రీమతి చోటుచేసుకున్న సందర్భా లు అని అడిగితే - ‘పెళ్లయ్యాక నా భావాలను పదాలుగా కూర్చి, పాటలుగా ఈవిడకు వినిపిస్తే చక్కగా నిద్రపోయేది. ఇదేంట్రా భగవంతుడా నా కవిత్వానికి ముచ్చట పడుతుందనుకుంటే, ఇలా నిద్రపోతోందని నిట్టూర్చేవాడిని’ అని అశోక్‌తేజ చెబుతుంటే ‘మీ ఊయల పాటల్లోని హాయిదనం అది’ అన్నారు నిర్మల నవ్వుతూ. ఇప్పుడైతే శ్రీవారు అల్లే పాటల్లో ఎక్కడైనా అమరని పదాలను చెబితే, ఆ పదాలను ఆనందంగా స్వీకరిస్తారట సుద్దాల. ఏడవతరగతి వరకే చదివినా తన శ్రీమతికి లోకజ్ఞానం ఎక్కువే అన్నారాయన.

కష్టమైనా సుఖమే...

ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఏనాడూ అవి తమను నిరాశపరచలేదు... అన్నారు ఈ దంపతులు. కష్టాలు పలకరించిన సందర్భాలను ఇష్టంగా ఎలా ఎదుర్కొన్నామో అశోక్‌తేజ వివరిస్తూ- ‘పెళ్లయ్యాక విశాలాంధ్ర పత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేరాను. ఈమెను ఊళ్లోనే ఉంచి, నేను డ్యూటీకి వచ్చేవాడిని. శని, ఆదివారాలు ఊరికి వెళ్లి, సోమవారం డ్యూటీకి వచ్చేవాడిని. ఒకసారి ఏ మత్తులో ఉన్నానో.. చేస్తున్న పనిలో పొరపాటు జరిగింది. ఫలితంగా ఉద్యోగం పోయింది. నా పరిస్థితి అర్థం చేసుకున్న మా నాన్న అమ్మాయిని నా కూడా తీసుకెళ్లమన్నారు. ఉద్యోగం లేదు. నాన్న, స్నేహితుల సాయంతో హైదరాబాద్‌లోని నింబోలిగడ్డకు వచ్చాం. మూడువైపుల రేకు లు, ఒకవైపు మాత్రమే గోడ ఉన్న ఆ గది అద్దె 25 రూ. మనిషి పొడవు కూడా లేని ఆ ఇంటిలో ఏడాది పాటు ఉన్నాం’ అని అశోక్ తేజ చెబుతుంటే ‘ఉన్నవే రెండు చిన్న గిన్నెలు. ఇంటికి ఎవరైనా వస్తే అన్నం వండి, పళ్లెంలో పోసి, మళ్లీ వండి, వడ్డించేదాన్ని. పెద్ద అమ్మాయి పుట్టింది ఆ రేకుల షెడ్డులోనే’ అని తెలిపారు నిర్మల. ‘ఇలా ఎన్నాళ్లని తనను తిప్పలు పెట్టను అని ఆలోచించి, టీచర్‌గానే స్థిరపడటం మేలనుకునుకుని కరీంనగర్‌కి బయలుదేరాం. అక్కడ స్నేహితుడు ఒక గది చూపించాడు. నాకు సాయపడటానికి నిర్మల బీడీలు చుట్టేది’.. అని అశోక్‌తేజ వివరిస్తుంటే ... కష్టాలలో ఒకరికొకరు తోడుగా ఉండటంలోనే వైవాహిక జీవితం సంపూర్ణమవుతుందనిపించింది.

సహనంతో కోపానికి చెక్...

కోపతాపాల విషయంలో అశోక్‌తేజ తన శ్రీమతికి ‘సహని’ అనే బిరుదును ఇచ్చేశారు. ‘రోజంతా బయట ఎన్నో చికాకులు అణుచుకుంటూ ఉంటానేమో ఇంట్లో చాలా త్వరగా కోపం తెచ్చుకుంటాను. ఆ స్వభావం మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కూడా కోపం వస్తే ఈవిడతో మాట్లాడను’ అని అశోక్‌తేజ చెబుతుంటే ‘నేనదే భరించలేను’ అన్నారు నిర్మల. దంపతుల మధ్య కోపతాపాలు బంధం ముందు బలాదూర్ అని వీరిని చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.

పాటకు భరోసా!

‘టీచర్ ఉద్యోగాన్ని వదులుకొని సినిమాలకు పాటలు రాయడానికి వె ళ్లాలనుకున్నప్పుడు నిర్మలకు పరిస్థితి తెలియజేశాను. మూడు నెలల టైమ్ ఇవ్వమన్నా ను. అప్పుడు నిర్మల ‘ఆరు నెలల టైమ్ తీసుకోండి. నేను బీడీలు చేసి, మిషన్ కుట్టి మన బిడ్డలను చూసుకుంటాను. ఆరు నెలలు దాటినా అవకాశం రాకపోతే ఇక్కడికే వచ్చేయండి’ అని ఆమె ఇచ్చిన ధైర్యంతో వెళ్లాను. నెలరోజుల్లోనే ‘అద్దింటి బాగోతం’ సినిమాకు మాటలు రాసి ఐదు వేల రూపాయలు ఇంటికి పంపించాను. మరోసారి సినిమాకు పాటలు రాయడానికి మద్రాసు వెళ్లాను. అక్కడ డెరైక్టర్ ‘500 పల్లవులు రాసి తీసుకురా.. ఒకటి ఓకే చేస్తా’ అన్నారు. ఆ రోజు చిన్నపిల్లవాడిలా ఏడ్చేశాను! అప్పుడు ఈవిడ ‘ఆ డెరైక్టర్ నీ పాట విని అన్నాడా, వినక అన్నాడా ఆ మాట!’ అంది. ‘వినలేదు’ అన్నాను. ఎవరి మాటలో పట్టుకొని బాధపడటం కన్నా, అతనికి వినిపించండి, అంది. వెంటనే వెళ్లి పాట వినిపించాను. ఓకే అయింది. నిర్మల ఇచ్చిన ధైర్యమే నా చేత వేల పాటలు రాయించింది’ అన్నారు గొప్పగా.

వ్యక్తి ఎదుగుదలకు పెళ్లి ఓ అడ్డంకి అంటుంటారు. సంసారనావను ఈదే క్రమంలో ఎన్నో ఇష్టాలు, మరెన్నో కలలను త్యాగం చేసేయాల్సిందే అంటారు. కాని సుద్దాల అశోకతేజ.. వివాహం అయిన తర్వాతే పై చదువులు చదివారు. కవిగా ఎదిగారు. ఈ దంపతులతో మాట్లాడుతు న్నంతసేపూ అశోక్‌తేజ జీవితపు పాటకు నిర్మల ప్రాణమై నిలిచారనిపించింది. ఆయన ఎదుగుదలలో ప్రతి మెట్టూ ఆమే అయ్యారని అర్థమైంది. పాటకు పల్లవి, చరణంలా సాగిన వారి వైవాహిక జీవితం నేటి నవదంపతులకు ఆదర్శం అనిపించింది.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

జీవితమంతా నా క్షేమాన్ని కోరిన నా శ్రీమతి గొప్పదనాన్ని కీర్తిస్తూ - ‘ఆలి నీకు దండమే...’ అని పాటగా రూపుకట్టాను.
- అశోక్‌తేజ

మావారు పంచిన ప్రేమకు జీవితంలో ఎన్నడూ ‘ఏమిటీ కష్టం’ అనుకున్న సంఘటన నాకు ఒక్కటీ కనిపించలేదు.
- నిర్మల

అందరినీ ప్రేమించటం, అందరి ప్రేమనూ పొందటాన్ని మించిన ఆనందం జీవితంలో మరొకటి ఉండదు.


పురాణ స్త్రీలు - తార

 
సౌమిత్రి రాకలోని ఆంతర్యాన్ని, సుగ్రీవునికి ఎదురుకానున్న ప్రమాదాన్ని గ్రహించింది తార. వెనువెంటనే రంగంలోకి దిగి లక్ష్మణునికి సమ్మతిపూర్వకంగా సమస్యను పరిష్కరించింది.

నీతి... రాజనీతి... రెండింటికీ దర్పణం పడుతుంది తార జీవితం. రామాయణంలో గొప్ప పాత్రత దక్కించుకున్న స్త్రీగా తారను చెప్పుకోవాలి. వాలి సుగ్రీవుల మధ్య, వారి మాత్సర్యాల నడుమ నలిగిపోతుంది తార.

తారుని కుమార్తె తార. అరివీరభయంకరుడు, వానర ప్రభువు, కిష్కింధ ఏలిక అయిన వాలిని భర్తగా పొందుతుంది. వీరికి బలాఢ్యుడైన అంగదుడు జన్మిస్తాడు. ఇంతలోనే ఉపద్రవం! మాయావి అనే రాక్షసుని రూపంలో వస్తుంది. వాలి, మాయావి తలపడతారు. గుహ నుంచి మాయావిరక్తం వరదలై వనాల్లో పారుతుంది. ఆ నెత్తురు వాలిదే అనుకుని, వాలి చనిపోయాడన్న నిర్ణయానికి వస్తారు తార, సుగ్రీవుడు. పాషాణాన్ని బిలానికి అడ్డంగా ఉంచి కిష్కింధకు వెళ్లిపోతారు.

వాలి స్థానంలో రాజ్యపాలన పగ్గాలను అందుకుంటాడు సుగ్రీవుడు. అప్పటి కొన్ని ధర్మాల ప్రకారం, దేవరన్యాయానికి అనుగుణంగా భర్త సహోదరుడైన సుగ్రీవునికి భార్య అవుతుంది తార. కొన్ని రోజులకు గుహముఖద్వారానికి అడ్డంగా నిలిచిన రాయిని తొలగించుకుని వాలి బయటకు వస్తాడు. సింహాసనంపై ఆసీనుడైన సుగ్రీవుని చూసి ఉగ్రుడవుతాడు. బుద్ధిపూర్వకంగానేతనను గుహనుంచి బయటకు రాకుండా చేసి, తన భార్యను చేపట్టాడని సుగ్రీవుడిని చిత్తుగా ఓడించి రాజ్యం నుంచి తరిమివేస్తాడు వాలి. కిరీటాన్ని, తారను తిరిగి వశం చేసుకుంటాడు. ఇలా అన్నదమ్ముల చేతుల్లో కీలుబొమ్మ అవుతుంది తార.

వాలి చేతిలో చావుదెబ్బలు తిన్న సుగ్రీవుడు రుష్యమూక పర్వతం మీదికి చేరుకుంటాడు. సీతాన్వేషణలో అటుగా వచ్చిన రామలక్ష్మణుల ప్రాపకం సంపాదిస్తాడు. రాముని అండతో వాలిని యుద్ధానికి పిలుస్తాడు. వాలి క్రోధం కట్టలు తెంచుకుంటుంది. ఈ సమయంలో తార సమయోచితంగా వ్యవహరిస్తుంది. పరారయిన సుగ్రీవుడు, వెనువెంటనే కయ్యానికి సమకడుతున్నాడంటే... కారణాన్ని యోచించమని వాలిని హెచ్చరిస్తుంది. సుగ్రీవునికి వెనుబలమై ఇద్దరు మానవులెవరో నిలిచిఉన్నట్టుగా వేగుల ద్వారా విన్న సంగతినీ విన్నవిస్తుంది. గొడవకు ఇది సమయం కాదని కాళ్లావేళ్లా పడుతుంది. వాలి ఇదేమీ పట్టకుండా సుగ్రీవుని పొగరణుస్తానంటూ బాహాబాహీకి దిగుతాడు. శ్రీరాముడు వేసిన బాణం గుండెను చీల్చగా విలవిల్లాడిపోతున్న వాలిని చూసి తార కన్నీరుమున్నీరవుతుంది. దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తుంది. చాటునుంచి చంపడం ధర్మమా? అంటూ రాముడిని నిలదీస్తుంది. తార మాటల్లో వేదన ఉంది, ధర్మం ఉంది. అందుకే ఆమెను పల్లెత్తు మాట అనలేకపోతాడు రామయ్య.

ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా రాజనీతిని వదిలిపెట్టదు తార. వాలి పుత్రుడు అంగదునికి పట్టాభిషేకం జరిపించమని కోరుతుంది. రాముని సమక్షంలోనే సుగ్రీవుని నుంచి ప్రమాణవచనాన్ని తీసుకుంటుంది. తార దూరదష్టికి మెచ్చిన వాలి సంతోషంగా తుదిశ్వాస విడుస్తాడు.

తారాసుగ్రీవులు మళ్లీ సతీపతులవుతారు. కిష్కింధ చిక్కిన ఆనందంలో సుగ్రీవుడు మధుపానాసక్తుడవుతాడు. సీతమ్మను వెతుకుతానని రామునికిచ్చిన మాటను దాదాపుగా మరచిపోతాడు. సుగ్రీవుని తాత్సారానికి కౌసల్యాసుతుడు ఖేదపడతాడు. లక్ష్మణుడు రౌద్రమూర్తిగా రుష్యమూకం నుంచి సుగ్రీవుని అంతఃపురానికి చేరుకుంటాడు. కోదండపాణికిచ్చిన మాట ఎప్పటికీ తప్పబోమని, ఆలస్యమైన మాట వాస్తవేమనని, అది కోరి చేసింది కాదని వినమ్రంగా వివరిస్తుంది తార.

సమయానికి తగినవిధంగా ప్రవర్తించగల బుద్ధికుశలత తారమ్మదే. ఎన్ని కష్టాలెదురైనా ఓర్పుతో వ్యవహరించగల మహామహిళ, రాజనీతిజ్ఞురాలు, ధర్మవర్తనలో మేటి. ఇందువల్లనే వాడని సుమసుగంధమై పురాణాల పూదోటలో శాశ్వతకీర్తిని ఆర్జించుకోగలుగుతుంది.

- డా. చింతకింది శ్రీనివాసరావు

More Headlines

అందమె ఆనందం

 
బంగాళదుంప, రెండు టేబుల్ స్పూన్ల యాపిల్‌సాస్ కలిపి గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం సహజకాంతితో మెరుస్తుంది