all

Monday, December 17, 2012

ఆలినీకు దండమే!---బెటర్‌హాఫ్

 
 
అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే...ఆ పల్లెటూళ్లో ఆమెను చూసినప్పుడు గుండె ఒక పట్టాన కుదురుగా లేదు. అవును. కవిగారు ప్రేమలో పడిపోయారు! దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటానే.... కాస్త లేటుగానైనా దేవుడు వరం ఇచ్చాడు. హమ్మయ్య! ప్రేమించిన అమ్మాయితో పెళ్లయిపోయింది!! నింబోలిగడ్డలో... మూడు వైపులా రేకులు ఒకవైపు మాత్రమే గోడ ఉన్న షెడ్డులో కాపురం. కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఆప్యాయంగా వచ్చి పలకరిస్తున్నాయి. ఆమె బెదరలేదు. నేనున్నాను... అంటూ భర్తకు అండగా నిలిచింది. పాటల తోటకు పరిమళాలు అద్దింది. ఆమెను ఎలా మరిచిపోగలడు? ఆలి నీకు దండమే అర్ధాంగి నీకు దండమే! సుద్దాల అశోక్‌తేజ-నిర్మల దాంపత్య జీవితంలోని వెలుగునీడల సవ్వడులు, స్వరమాధుర్యాలు ఈవారం...

హైదరాబాద్ ఉప్పల్‌లో నివాసం ఉంటున్న సుద్దాల అశోక్‌తేజ దంపతులను కలుసుకుని, వారి జీవితంలోని మధురిమలను తెలుసుకోవాలని బయల్దేరాం. ‘పాట కుటీరం’లోకి అడుగుపెట్టినప్పుడు చిరునగవుల తోరణాలతో ఆహ్వానం పలికారు సుద్దాల అశోక్‌తేజ, నిర్మల దంపతులు. చక్కని లొకేషన్ ఉంటే ఎంచక్కని కబుర్లు పంచుకోవచ్చంటూ వారింటి పైఅంతస్తుకు చేరే మెట్లమీదకు దారితీశారు.

‘మా ఇద్దరిలో నేను ఓ మెట్టు పైన ఉన్నట్టు లోకమంతా అనుకుంటారు. నా దృష్టిలో నా శ్రీమతి నిర్మలే ఓ మెట్టు పైన ఉంది’ అని ఆప్యాయంగా ఆమెకు పెమైట్టు ఆఫర్ చేసి, తను కిందిమెట్టు మీద కూర్చున్నారు అశోక్‌తేజ. శ్రీవారి మాటలకు శ్రీమతి ముఖంలోని ఆనందం ముద్దబంతిలా విచ్చుకుంది. ఈ ఒక్క సందర్భం చాలనిపించింది రాజ్యాలేలే మహరాజైనా ఇంటిని ఏలే మహరాణికి హృదయస్థానంలో ఇచ్చే ‘పెమైట్టు’ ఆ బంధాన్ని పదిలం చేస్తుందని.

అశోక్‌తేజ స్వస్థలం నల్లగొండజిల్లా సుద్దాల గ్రామం, నిర్మల పుట్టిన ఊరు వరంగల్ జిల్లా. ముప్పై మూడేళ్ల క్రితం (1979లో) మూడుముళ్లు పడిన ఈ అనుబంధం గురించి తెలియజేయమని కోరితే, నాటి జ్ఞాపకాల్లోకి ఆనందంగా వెళ్లారు ఈ దంపతులు.

తొలిప్రేమ...

‘ఇంటర్మీడియట్ పూర్తయ్యాక కరీంనగర్ జిల్లా, బొమ్మర మేడిపల్లిలో ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తుండేవాణ్ణి. ఒకసారి సెలవుల్లో వరంగల్‌లోని మా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను. నాకు పెళ్లి చేయాలని మా అమ్మమ్మ పెళ్లి చూపుల పేరుతో ఇల్లిల్లూ తిప్పింది. ఆమె మాట కాదనలేక ఒకేరోజు పదమూడు మంది అమ్మాయిలను పెళ్లిచూపుల పేరుతో చూశాను. అంతమందిలో చివరగా పేరుకు తగ్గట్టే నిర్మలంగా ఉన్న ఈమే నా బెటర్‌హాఫ్ అనిపించింది. అప్పుడు ఈమె వయసు పదహారు’ అని తమ తొలిచూపుల ప్రణయాన్ని చెప్పుకుపోతున్న శ్రీవారి మాటలకు బ్రేక్‌వేస్తూ నిర్మల - ‘ఈయన అప్పుడు పెద్ద జులపాలజుట్టు, గుబురుమీసాలు, బెల్‌బాటం ప్యాంటు... రౌడీలాగే ఉన్నారు’ అని ఆమె చిరునవ్వులు చిందిస్తుంటే ‘పరమసాత్వికుడిని పట్టుకొని రౌడీ అంటావా...?!’ అన్నారు సుద్దాల. వారిద్దరి నవ్వులు ఆ ఇంట్లో సరిగమల స్వరాలయ్యాయి.


అశోక్‌తేజ కొనసాగిస్తూ - ‘నాకు నిర్మల నచ్చిన విషయం చెప్పగానే మా అమ్మమ్మ ఈమె అమ్మనాన్నలను అడిగింది. వాళ్లు... ఇంకో ఏడాది వరకు పెళ్లి చేయమన్నారు. నా అహం దెబ్బతింది. పంతానికి పోయి పక్క ఊళ్లో ఓ సంబంధాన్ని ఖాయం చేసుకున్నాను. మూడు రోజుల్లో పెళ్లి... నాలో గుబులు మొదలైంది. ఈ పెళ్లి చేసుకోను అన్నాను. పెళ్లి ఆగిపోయింది. నా ఇష్టాన్ని గమనించి మా అమ్మమ్మ మళ్లీ వీళ్ల ఇంట్లో వాళ్లను అడిగింది. తొమ్మిది నెలలు ఆగమన్నారు’ పెళ్లినాటి విశేషాలు ఇప్పుడే జరిగాయా అన్నట్టు చెప్పారు అశోక్‌తేజ.

ప్రేమలేఖలతో చేరిక...

‘పెళ్లికి గ్యాప్ ఉండటంతో విపరీతంగా ఉత్తరాలు రాసుకునేవాళ్లం. ఆ ఉత్తరాలలో మా ప్రేమంతా కనిపించేది’ అన్నారు నిర్మల సిగ్గుపడుతూ. దంపతులను దగ్గర చేసేది అరమరికలు లేని స్నేహం. ఆ ప్రేమలేఖల్లో వారి స్నేహాన్ని మానసికంగా మరింత చేరువ చేసింది.

అత్తింటి మన్ననలు...

సుద్దాల అశోక్‌తేజకు తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. పదిమంది తోబుట్టువుల్లో చిన్నమ్మాయి నిర్మల. ‘మెట్టినింట పెద్దకోడలిగా అడుగుపెట్టాను. మరుసటి రోజు మా మామగారు నా చేత పప్పు, పచ్చిపులుసు చేయించమన్నారు. పుట్టింట్లో అమ్మ, వదినలు ఉండటంతో పొయ్యి దగ్గరకు వెళ్లే అవసరమే రాలేదు. ఎలా, అని భయపడుతూనే పాలకూరపప్పు, పచ్చిపులుసు చేశాను. మా మామగారు బ్రహ్మాండం అని మెచ్చుకున్నారు. నా వంట ఎలా ఉన్నా ఇంట్లో అందరూ బాగుందన్నారంటే వారి మనసుల్లో నాకు ఎంతటి స్థానం ఇచ్చారో అర్థ్ధమైంది. దాంతో భయం పోయింది. ఈయనైతే మా అన్నదమ్ముల్లో ఒకరిగా కలిసిపోయారు’’ అంటూ ఇరువైపు కుటుంబాల్లో తాము ఎంతగా అల్లుకుపోయారో తెలిపారు నిర్మల.

పాటల తోటలో...

పాటల కూర్పులో శ్రీమతి చోటుచేసుకున్న సందర్భా లు అని అడిగితే - ‘పెళ్లయ్యాక నా భావాలను పదాలుగా కూర్చి, పాటలుగా ఈవిడకు వినిపిస్తే చక్కగా నిద్రపోయేది. ఇదేంట్రా భగవంతుడా నా కవిత్వానికి ముచ్చట పడుతుందనుకుంటే, ఇలా నిద్రపోతోందని నిట్టూర్చేవాడిని’ అని అశోక్‌తేజ చెబుతుంటే ‘మీ ఊయల పాటల్లోని హాయిదనం అది’ అన్నారు నిర్మల నవ్వుతూ. ఇప్పుడైతే శ్రీవారు అల్లే పాటల్లో ఎక్కడైనా అమరని పదాలను చెబితే, ఆ పదాలను ఆనందంగా స్వీకరిస్తారట సుద్దాల. ఏడవతరగతి వరకే చదివినా తన శ్రీమతికి లోకజ్ఞానం ఎక్కువే అన్నారాయన.

కష్టమైనా సుఖమే...

ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఏనాడూ అవి తమను నిరాశపరచలేదు... అన్నారు ఈ దంపతులు. కష్టాలు పలకరించిన సందర్భాలను ఇష్టంగా ఎలా ఎదుర్కొన్నామో అశోక్‌తేజ వివరిస్తూ- ‘పెళ్లయ్యాక విశాలాంధ్ర పత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేరాను. ఈమెను ఊళ్లోనే ఉంచి, నేను డ్యూటీకి వచ్చేవాడిని. శని, ఆదివారాలు ఊరికి వెళ్లి, సోమవారం డ్యూటీకి వచ్చేవాడిని. ఒకసారి ఏ మత్తులో ఉన్నానో.. చేస్తున్న పనిలో పొరపాటు జరిగింది. ఫలితంగా ఉద్యోగం పోయింది. నా పరిస్థితి అర్థం చేసుకున్న మా నాన్న అమ్మాయిని నా కూడా తీసుకెళ్లమన్నారు. ఉద్యోగం లేదు. నాన్న, స్నేహితుల సాయంతో హైదరాబాద్‌లోని నింబోలిగడ్డకు వచ్చాం. మూడువైపుల రేకు లు, ఒకవైపు మాత్రమే గోడ ఉన్న ఆ గది అద్దె 25 రూ. మనిషి పొడవు కూడా లేని ఆ ఇంటిలో ఏడాది పాటు ఉన్నాం’ అని అశోక్ తేజ చెబుతుంటే ‘ఉన్నవే రెండు చిన్న గిన్నెలు. ఇంటికి ఎవరైనా వస్తే అన్నం వండి, పళ్లెంలో పోసి, మళ్లీ వండి, వడ్డించేదాన్ని. పెద్ద అమ్మాయి పుట్టింది ఆ రేకుల షెడ్డులోనే’ అని తెలిపారు నిర్మల. ‘ఇలా ఎన్నాళ్లని తనను తిప్పలు పెట్టను అని ఆలోచించి, టీచర్‌గానే స్థిరపడటం మేలనుకునుకుని కరీంనగర్‌కి బయలుదేరాం. అక్కడ స్నేహితుడు ఒక గది చూపించాడు. నాకు సాయపడటానికి నిర్మల బీడీలు చుట్టేది’.. అని అశోక్‌తేజ వివరిస్తుంటే ... కష్టాలలో ఒకరికొకరు తోడుగా ఉండటంలోనే వైవాహిక జీవితం సంపూర్ణమవుతుందనిపించింది.

సహనంతో కోపానికి చెక్...

కోపతాపాల విషయంలో అశోక్‌తేజ తన శ్రీమతికి ‘సహని’ అనే బిరుదును ఇచ్చేశారు. ‘రోజంతా బయట ఎన్నో చికాకులు అణుచుకుంటూ ఉంటానేమో ఇంట్లో చాలా త్వరగా కోపం తెచ్చుకుంటాను. ఆ స్వభావం మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కూడా కోపం వస్తే ఈవిడతో మాట్లాడను’ అని అశోక్‌తేజ చెబుతుంటే ‘నేనదే భరించలేను’ అన్నారు నిర్మల. దంపతుల మధ్య కోపతాపాలు బంధం ముందు బలాదూర్ అని వీరిని చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.

పాటకు భరోసా!

‘టీచర్ ఉద్యోగాన్ని వదులుకొని సినిమాలకు పాటలు రాయడానికి వె ళ్లాలనుకున్నప్పుడు నిర్మలకు పరిస్థితి తెలియజేశాను. మూడు నెలల టైమ్ ఇవ్వమన్నా ను. అప్పుడు నిర్మల ‘ఆరు నెలల టైమ్ తీసుకోండి. నేను బీడీలు చేసి, మిషన్ కుట్టి మన బిడ్డలను చూసుకుంటాను. ఆరు నెలలు దాటినా అవకాశం రాకపోతే ఇక్కడికే వచ్చేయండి’ అని ఆమె ఇచ్చిన ధైర్యంతో వెళ్లాను. నెలరోజుల్లోనే ‘అద్దింటి బాగోతం’ సినిమాకు మాటలు రాసి ఐదు వేల రూపాయలు ఇంటికి పంపించాను. మరోసారి సినిమాకు పాటలు రాయడానికి మద్రాసు వెళ్లాను. అక్కడ డెరైక్టర్ ‘500 పల్లవులు రాసి తీసుకురా.. ఒకటి ఓకే చేస్తా’ అన్నారు. ఆ రోజు చిన్నపిల్లవాడిలా ఏడ్చేశాను! అప్పుడు ఈవిడ ‘ఆ డెరైక్టర్ నీ పాట విని అన్నాడా, వినక అన్నాడా ఆ మాట!’ అంది. ‘వినలేదు’ అన్నాను. ఎవరి మాటలో పట్టుకొని బాధపడటం కన్నా, అతనికి వినిపించండి, అంది. వెంటనే వెళ్లి పాట వినిపించాను. ఓకే అయింది. నిర్మల ఇచ్చిన ధైర్యమే నా చేత వేల పాటలు రాయించింది’ అన్నారు గొప్పగా.

వ్యక్తి ఎదుగుదలకు పెళ్లి ఓ అడ్డంకి అంటుంటారు. సంసారనావను ఈదే క్రమంలో ఎన్నో ఇష్టాలు, మరెన్నో కలలను త్యాగం చేసేయాల్సిందే అంటారు. కాని సుద్దాల అశోకతేజ.. వివాహం అయిన తర్వాతే పై చదువులు చదివారు. కవిగా ఎదిగారు. ఈ దంపతులతో మాట్లాడుతు న్నంతసేపూ అశోక్‌తేజ జీవితపు పాటకు నిర్మల ప్రాణమై నిలిచారనిపించింది. ఆయన ఎదుగుదలలో ప్రతి మెట్టూ ఆమే అయ్యారని అర్థమైంది. పాటకు పల్లవి, చరణంలా సాగిన వారి వైవాహిక జీవితం నేటి నవదంపతులకు ఆదర్శం అనిపించింది.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

జీవితమంతా నా క్షేమాన్ని కోరిన నా శ్రీమతి గొప్పదనాన్ని కీర్తిస్తూ - ‘ఆలి నీకు దండమే...’ అని పాటగా రూపుకట్టాను.
- అశోక్‌తేజ

మావారు పంచిన ప్రేమకు జీవితంలో ఎన్నడూ ‘ఏమిటీ కష్టం’ అనుకున్న సంఘటన నాకు ఒక్కటీ కనిపించలేదు.
- నిర్మల

No comments: