all

Monday, December 17, 2012

పురాణ స్త్రీలు - తార

 
సౌమిత్రి రాకలోని ఆంతర్యాన్ని, సుగ్రీవునికి ఎదురుకానున్న ప్రమాదాన్ని గ్రహించింది తార. వెనువెంటనే రంగంలోకి దిగి లక్ష్మణునికి సమ్మతిపూర్వకంగా సమస్యను పరిష్కరించింది.

నీతి... రాజనీతి... రెండింటికీ దర్పణం పడుతుంది తార జీవితం. రామాయణంలో గొప్ప పాత్రత దక్కించుకున్న స్త్రీగా తారను చెప్పుకోవాలి. వాలి సుగ్రీవుల మధ్య, వారి మాత్సర్యాల నడుమ నలిగిపోతుంది తార.

తారుని కుమార్తె తార. అరివీరభయంకరుడు, వానర ప్రభువు, కిష్కింధ ఏలిక అయిన వాలిని భర్తగా పొందుతుంది. వీరికి బలాఢ్యుడైన అంగదుడు జన్మిస్తాడు. ఇంతలోనే ఉపద్రవం! మాయావి అనే రాక్షసుని రూపంలో వస్తుంది. వాలి, మాయావి తలపడతారు. గుహ నుంచి మాయావిరక్తం వరదలై వనాల్లో పారుతుంది. ఆ నెత్తురు వాలిదే అనుకుని, వాలి చనిపోయాడన్న నిర్ణయానికి వస్తారు తార, సుగ్రీవుడు. పాషాణాన్ని బిలానికి అడ్డంగా ఉంచి కిష్కింధకు వెళ్లిపోతారు.

వాలి స్థానంలో రాజ్యపాలన పగ్గాలను అందుకుంటాడు సుగ్రీవుడు. అప్పటి కొన్ని ధర్మాల ప్రకారం, దేవరన్యాయానికి అనుగుణంగా భర్త సహోదరుడైన సుగ్రీవునికి భార్య అవుతుంది తార. కొన్ని రోజులకు గుహముఖద్వారానికి అడ్డంగా నిలిచిన రాయిని తొలగించుకుని వాలి బయటకు వస్తాడు. సింహాసనంపై ఆసీనుడైన సుగ్రీవుని చూసి ఉగ్రుడవుతాడు. బుద్ధిపూర్వకంగానేతనను గుహనుంచి బయటకు రాకుండా చేసి, తన భార్యను చేపట్టాడని సుగ్రీవుడిని చిత్తుగా ఓడించి రాజ్యం నుంచి తరిమివేస్తాడు వాలి. కిరీటాన్ని, తారను తిరిగి వశం చేసుకుంటాడు. ఇలా అన్నదమ్ముల చేతుల్లో కీలుబొమ్మ అవుతుంది తార.

వాలి చేతిలో చావుదెబ్బలు తిన్న సుగ్రీవుడు రుష్యమూక పర్వతం మీదికి చేరుకుంటాడు. సీతాన్వేషణలో అటుగా వచ్చిన రామలక్ష్మణుల ప్రాపకం సంపాదిస్తాడు. రాముని అండతో వాలిని యుద్ధానికి పిలుస్తాడు. వాలి క్రోధం కట్టలు తెంచుకుంటుంది. ఈ సమయంలో తార సమయోచితంగా వ్యవహరిస్తుంది. పరారయిన సుగ్రీవుడు, వెనువెంటనే కయ్యానికి సమకడుతున్నాడంటే... కారణాన్ని యోచించమని వాలిని హెచ్చరిస్తుంది. సుగ్రీవునికి వెనుబలమై ఇద్దరు మానవులెవరో నిలిచిఉన్నట్టుగా వేగుల ద్వారా విన్న సంగతినీ విన్నవిస్తుంది. గొడవకు ఇది సమయం కాదని కాళ్లావేళ్లా పడుతుంది. వాలి ఇదేమీ పట్టకుండా సుగ్రీవుని పొగరణుస్తానంటూ బాహాబాహీకి దిగుతాడు. శ్రీరాముడు వేసిన బాణం గుండెను చీల్చగా విలవిల్లాడిపోతున్న వాలిని చూసి తార కన్నీరుమున్నీరవుతుంది. దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తుంది. చాటునుంచి చంపడం ధర్మమా? అంటూ రాముడిని నిలదీస్తుంది. తార మాటల్లో వేదన ఉంది, ధర్మం ఉంది. అందుకే ఆమెను పల్లెత్తు మాట అనలేకపోతాడు రామయ్య.

ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా రాజనీతిని వదిలిపెట్టదు తార. వాలి పుత్రుడు అంగదునికి పట్టాభిషేకం జరిపించమని కోరుతుంది. రాముని సమక్షంలోనే సుగ్రీవుని నుంచి ప్రమాణవచనాన్ని తీసుకుంటుంది. తార దూరదష్టికి మెచ్చిన వాలి సంతోషంగా తుదిశ్వాస విడుస్తాడు.

తారాసుగ్రీవులు మళ్లీ సతీపతులవుతారు. కిష్కింధ చిక్కిన ఆనందంలో సుగ్రీవుడు మధుపానాసక్తుడవుతాడు. సీతమ్మను వెతుకుతానని రామునికిచ్చిన మాటను దాదాపుగా మరచిపోతాడు. సుగ్రీవుని తాత్సారానికి కౌసల్యాసుతుడు ఖేదపడతాడు. లక్ష్మణుడు రౌద్రమూర్తిగా రుష్యమూకం నుంచి సుగ్రీవుని అంతఃపురానికి చేరుకుంటాడు. కోదండపాణికిచ్చిన మాట ఎప్పటికీ తప్పబోమని, ఆలస్యమైన మాట వాస్తవేమనని, అది కోరి చేసింది కాదని వినమ్రంగా వివరిస్తుంది తార.

సమయానికి తగినవిధంగా ప్రవర్తించగల బుద్ధికుశలత తారమ్మదే. ఎన్ని కష్టాలెదురైనా ఓర్పుతో వ్యవహరించగల మహామహిళ, రాజనీతిజ్ఞురాలు, ధర్మవర్తనలో మేటి. ఇందువల్లనే వాడని సుమసుగంధమై పురాణాల పూదోటలో శాశ్వతకీర్తిని ఆర్జించుకోగలుగుతుంది.

- డా. చింతకింది శ్రీనివాసరావు

More Headlines

No comments: