all

Thursday, May 30, 2013

అతిథి మర్యాదలో దైవప్రస్నత...

 

దైవాలజీ
తమ అవసరాలకంటే, ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత నివ్వడం, వారి కష్టసుఖాలలో పాలు పంచుకోవడం, అతిథులను గౌరవించడం అత్యున్నతమైన పుణ్యకార్యాలు.

పూర్వం మానవుల మధ్య సత్సంబంధాలు, ఆప్యాయతానురాగాలు, త్యాగం, పరోపకార గుణాలు మెండుగా ఉండేవి. ఇప్పుడు బొత్తిగా లేవని కాదు గాని, గతంతో పోల్చుకుంటే ఈనాడు మానవుల మధ్య ఆత్మీయ సంబంధాలు బాగా సన్నగిల్లాయని చెప్పవచ్చు. ఆ రోజుల్లో ఎవరైనా తమ ఇంటికి వస్తే, ఆ ఇంటివారు ఎంతో సంతోషించేవారు. అతిథి మర్యాదలో ఎలాంటి లోటూ రానిచ్చేవారు కాదు. వారికి ఎలాంటి ఇబ్బందీ, అసౌకర్యమూ కలుగకుండా చూసుకునేవారు. ఉన్నంతలోనే అతిథి మర్యాదలో ఎలాంటి లోపమూ లేకుండా జాగ్రత్త పడేవారు. వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడేవారు. అతిథి మర్యాద ఇస్లామీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన అంశం. అతిథి మర్యాదకు, త్యాగగుణానికి అద్దం పట్టే ఒక సంఘటన చూడండి.

ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ (స) సన్నిధిలో ఒక వ్యక్తి హాజరై, ‘‘అయ్యా! నేను చాలా బాధల్లో ఉన్న నిరుపేదను. ఆకలి దహించి వేస్తోంది’’అని వేడుకున్నాడు. ఆ రోజు ప్రవక్త మహనీయుల వారి ఇంట కూడా పచ్చిమంచినీళ్లు తప్ప మరే పదార్థమూ లేదు. అప్పుడు ప్రవక్త మహనీయులు అక్కడున్న తన సహచరులతో ‘‘ఈ పూట ఇతనికి ఆతిథ్య ఇచ్చే వారైవరైనా ఉన్నారా?’’ అని అడిగారు. వెంటనే ఓ వ్యక్తి లేచి నిలబడి ‘‘నేనిస్తాను’’ అన్నాడు. తరువాత అతిథిని వెంటబెట్టుకుని ఇంటికి వెళ్లాడు. ‘‘ఈరోజు మన ఇంటికి ఓ అతిథి వచ్చారు. తినడానికి ఏమైనా ఉందా?’’ అని శ్రీమతిని ప్రశ్నించాడు. ‘‘పిల్లల కోసమని ఉంచిన కాస్తంత భోజనమే తప్ప మరేమీ లేదు. వచ్చిన అతిథికి ఒక్కరికైతేనే అది కూడా సరిపోతుందేమో’’ అని బదులిప్పించాడు. అతిథిని గౌరవించడం మన విధి. అందులో ఎలాంటి లోటూ రానీయకూడదు. పిల్లలకు ఏదో ఒక సాకు చెప్పి నిద్రపుచ్చు. పిల్లలు నిద్రపోయిన తరువాత భోజనం వడ్డించు. అతిథి ఇంట్లోకొచ్చి భోజనం కోసం కూర్చోగానే మనమూ కూర్చుందాం. అతనికి వడ్డిస్తున్న సమయంలో దీపాన్ని సరిచేస్తున్నట్లు చేసి దాన్ని ఆర్పేసెయ్యి. చీకటిలో మనం తింటున్నదీ లేనిదీ అతనికి తెలియకుండా ఉంటుంది. మనం కూడా తింటున్నట్లు నటి ద్దాం’’ అని చెప్పారాయన.

అనుకున్నట్లుగానే ఆ ఇల్లాలు పిల్లలను నిద్రపుచ్చింది. అతిథికి అన్నం వడ్డించి అందరూ కూర్చున్నారు. కాని అతిథి మాత్రమే భోజనం చేశాడు. తామూ తిన్నట్లు నటించిన ఆ దంపతులిద్దరూ పిల్లలతో సహా పస్తులున్నారు. పిల్లల నోటిదగ్గర అన్నాన్ని కూడా త్యాగం చేసి ఆకలితో బాధపడుతున్న ఆ అపరిచిత అతిథి క్షుద్బాధను తీర్చారు.

మరునాడు ఉదయం ఆ ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి ప్రవక్త వారి సన్నిధిలో హాజరైనప్పుడు, ప్రవక్త మహనీయులు ‘అబూ తల్లాహ’ అంటూ ఆయన పేరునూ, ఆయన శ్రీమతి పేరునూ ఉచ్చరిస్తూ, ‘దైవానికి తన ఫలానా భక్తుడు, భక్తురాలి తీరు ఎంతగానో నచ్చింది. అతిథి పట్ల వారు చూపిన మర్యాద, త్యాగభావనకు అల్లాహ్ అమితంగా సంతోషించాడు’ అని శుభవార్త అందజేశారు. ‘వారు స్వయంగా అగత్యపరులైనప్పటికీ, తమకంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు’ అని పవిత్ర ఖురాన్ ఈ త్యాగగుణాన్ని అభివర్ణించింది.

తమ అవసరాలకంటే, ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత నివ్వడం, వారి కష్టసుఖాలలో పాలు పంచుకోవడం, అతిథులను గౌరవించడం అత్యున్నతమైన పుణ్యకార్యాలు. అప్పుడే సమాజంలో సామరస్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుంది. జీవితాలు శాంతిమయమవుతాయి. దైవప్రసన్నత ప్రాప్తమవుతుంది.
 

అందంగా... హుందాగా!

 

ఇంటిరియం
‘‘రాత్రి కర్టెన్లు వే సి, దీపాలు వెలిగించగానే నా పుస్తకాలకి ఒక గౌరవం వచ్చినట్లు భావిస్తాను’’ అంటాడు ఇంగ్లీష్ నవలారచయిత ఇ.ఎం. ఫాస్టర్. కర్టెన్ అనేది గదికి అందాన్ని ఇవ్వడంతో పాటు, హుందాతనాన్ని తీసుకువస్తుంది. కర్టెన్లకు శబ్దాన్ని నియంత్రించే గుణం ఉంది. కొన్నిరంగులు గదికి వెలుగును కూడా తీసుకువస్తాయి. అలాగే కర్టెన్ రాడ్‌లు కూడా కర్టెన్లకు సరికొత్త అందాన్ని సంతరిస్తాయి. రెండుమూడు రంగుల కర్టెన్లను పక్కపక్కన అమర్చడం లేటెస్ట్ ఫ్యాషన్. అటువంటప్పుడు కూడా కాంబినేషన్‌ల విషయంగా జాగ్రత్తపడాలి.

గదిలోని వస్తువులు, గోడల రంగులు, కర్టెన్లు, రాడ్‌లు అన్నీ ఒకదానితో ఒకటి కలిస్తేనే అందం. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ చిత్రంలో ఒక గదిని బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉండే వస్తువులతో డెకొరేట్ చేశారు. ఆ గది అందరి మనసుల్లోనూ నిలిచిపోయింది. మన ఇల్లు కూడా ఇలా సర్దుకుంటే బాగుంటుందనే భావన కలిగేలా ఉంటుంది ఆ గది అమరిక.ఇక్కడ ఇచ్చిన కర్టెన్‌ల ధర సుమారు 3000 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది.