all

Monday, March 18, 2013

గుప్పెడు వేపాకులు, గంధం కలిపి నూరి, అందులో చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పొక్కులు, మచ్చలు తగ్గి, ముఖం మెరుపును సంతరించుకుంటుంది. దీనిని చెమట కాయలున్న చోట పూస్తే చల్లగా, హాయిగా ఉంటుంది

మనది కానిది మనదవడం దౌర్భాగ్యం-కోట శ్రీనివాసరావు.

 

అదర్‌సైడ్
‘జైహింద్’ అంటాం.
హిందూస్థాన్ అని మాత్రం ఒప్పుకోం!
పోరాడి ఫ్రీడమ్ సంపాదించుకున్నాం.
ఐనా, వాళ్లనే ఇమిటేట్ చేస్తుంటాం!
ఆడామగా సమానం అంటుంటాం.
33 పర్సెంట్ మాత్రమే అడుగుతాం!
తెలుగుపలుకు తియ్యనిదంటాం.
మాట్లాడ్డానికి చేదుముఖం పెడతాం!
కోట శ్రీనివాసరావును కదిలిస్తే...ఇదిగో ఇలాగే... కుండ బద్దలౌతుంది.
నోటి దురుసు అనండి, ముక్కుసూటి అనండి ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్డమే...
ఇంతవరకు ఆయనకు తోడుగా ఉన్నది,నీడగా వచ్చిందీ!
డెబ్బై ఏళ్లకు దగ్గరిదగ్గరిగా ఉన్న ఈ ఆర్టిస్టు
ముఖానికి రంగేసుకున్నారు కానీ, ఏనాడూ మనసుకు ముసుగేసుకోలేదు!
ఇప్పుడూ అంతే! నిక్కచ్చిగా మాట్లాడిన ఆయన ప్రతి మాటా ఈవారం మన అదర్ సైడ్!


మీ చిన్నప్పటి విశేషాలేమైనా చెబుతారా?
కోట : నేను పుట్టి, పెరిగింది కంకిపాడులో. మా అమ్మానాన్నలకు మేం మొత్తం పదమూడు మంది సంతానం. మా నాన్నగారు డాక్టర్. మామూలుగా పల్లెటూళ్లల్లో డాక్టర్‌గారి పిల్లలను, కరణంగారబ్బాయిలను, ప్రెసిడెంటుగారి పిల్లలను టీచర్లు కొట్టరు.. తిట్టరు. ఆ విధంగా మమ్మల్ని చూసీ చూడనట్టు వదిలేసేవాళ్లు. అలా మా అన్నయ్యను ఎక్కువగా గారాబం చేయడంవల్ల ఆయన చదువు ఇంటర్మీడియట్‌తో ఆగిపోయింది. నేను కూడా అలా తయారైపోతానేమోనని నన్ను మా అక్కయ్యవాళ్లింటికి పంపించారు. మా బావగారు కేఆర్‌కే శర్మగారని గవర్నమెంట్ డాక్టర్. వాళ్ల దగ్గర ఐదారేళ్లు, ఆ తర్వాత మా ఇంట్లో ఉండి చదువుకున్నాను. నాన్నగారు నన్ను డాక్టర్ చేయాలనుకునేవారు.

మీ నాన్నగారు డాక్టర్ చేయాలనుకుంటే మీరేమో యాక్టరయ్యారు...?
కోట : యూనివర్శిటీలో నాకు ఫస్ట్‌క్లాస్ రెండు మార్కుల్లో తగ్గింది. దాంతో నాకు మెడిసిన్‌లో సీటు రాలేదు. ఒకే ఒక్క కాలేజీలో మాత్రం డొనేషన్ కడితే చేర్చుకుంటామన్నారు. కానీ మా నాన్నగారు డొనేషన్ కట్టనన్నారు. ఆయన మెరిట్‌లో పాస్ అయ్యారు. చెన్నపట్నం యూనివర్శిటీలో ఆయన స్టేట్ ఫస్ట్. నాన్నగారు అంత బ్రిలియంట్. ఫస్ట్‌క్లాస్‌కి రెండే రెండు మార్కులు తగ్గినా అది ఫస్ట్ క్లాస్ కింద రాదు. ఎక్కడా సీటు రాకపోవడంతో బి.ఎస్‌సీ.లో చేరాను. అంతకుముందే నాటకాలంటే ఇష్టం. కాలేజీలో చేరిన తర్వాత ఇష్టం పెరిగిపోయింది.

మరి నాటకాల్లో నటిస్తుంటే మీ ఇంట్లో ఏమీ అనేవారు కాదా?
కోట : కొట్టేవాళ్లు. మా స్కూల్ వార్షికోత్సవ వేడుక కోసం పినిశెట్టి శ్రీరామూర్తి అని రవిరాజా పినిశెట్టి తండ్రి రాసిన ‘ఆడది’ నాటకంలో శతభిషం అనే వంటవాడి వేషం వేశాను. శతభిషం అనే వేషంతో నాటకాల్లో నా కెరీర్ ఆరంభమైంది. నా నక్షత్రం కూడా శతభిషమే కావడం విశేషం.

డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఏం చేశారు?
కోట : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయినయ్యాను. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన తర్వాత నాటకాల మీద విపరీతంగా పిచ్చి ఏర్పడిపోయింది. వారంలో ఓ నాటిక కానీ నాటకం కానీ ఆడాల్సిందే. అప్పటికి పెళ్లి కూడా అయ్యింది. మాతో పాటు మా మామగారు కూడా ఉండేవారు. ‘ఏదో బ్యాంక్‌లో ఆఫీసర్ అవుతారనుకుంటే ఈ నాటకాలేంటండి బాబు’ అనేవారాయన. నాటకాల కోసం ప్రమోషన్ వదిలేసుకున్నాను. ఆ తర్వాత ఉద్యోగం కూడా వదిలేసుకుని, ఇలా సెటిలయ్యా.

సో.. రెండు మార్కులు తగ్గడం మంచిదే అనుకుంటున్నారా?
కోట : ఆ భగవంతుడు మనకిక్కడ (సినిమా రంగం) నూకలు రాసిపెట్టాడని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. దేవుడి దయతో పాటు ఇంకోటి కూడా ఉండాలి. అదేంటంటే భార్యాబిడ్డల దంత సిరి బాగుంటే మగాడికి అన్నీ బాగా జరుగుతాయనేది నా నమ్మకం. అందుకనే ముందు జన్మనిచ్చిన తల్లీతండ్రి, ఆ తర్వాత భార్యాబిడ్డలపై మమకారంతో ఉండాలి. ‘కార్యేషు దాసి.. కరణేషు మంత్రి... భోజ్యేషు మాతా.. శయనేషు రంభ.. క్షమయా ధరిత్రి...’ అంటారు. ఎదుగుతున్నకొద్దీ మన సంస్కృతీ సంప్రదాయాలంటే నాకు విపరీతమైన గౌరవం ఏర్పడింది. మన సంస్కృతిలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలున్నాయి.

మన సంస్కృతీ సంప్రదాయాల విలువ నేటి తరానికి తెలుస్తుందంటారా?
కోట :మన ఇండియన్స్ అమెరికన్లను ఇమిటేట్ చేస్తారు. వాళ్లనుంచి మనం ‘వేలంటైన్స్ డే’ అనేదాన్ని ఇమిటేట్ చేస్తున్నాం. కానీ తండ్రికి తద్దినం పెట్టమంటేనే పెట్టడంలేదు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాదనుకుని వేరే దేన్నో ఫాలో అవ్వడమెందుకు? మీరూ మేం వేరు అంటూ ఇంగ్లిష్‌వాళ్లతో పోరాడి మనం స్వాతంత్య్రం తెచ్చుకున్నాం. అలాంటప్పుడు వాళ్లని ఇమిటేట్ చేయాలనుకోవడం ఎందుకు?

ఆడవాళ్ల వస్త్రధారణలో కూడా చాలా మార్పొచ్చింది. అత్యాచారాలు జరగడానికి అదీ ఓ కారణమంటున్నారు. దీని గురించి మీరేమంటారు?
కోట : మొన్న ఎవరో ఓ వ్యక్తి ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండటం మంచిదన్నాడు. అతను చెడ్డవాడో, మంచివాడో మనకనవసరం. కానీ అతను చెప్పిన మాటలకు భావం నన్నడిగితే చెప్పేవాడ్ని. అసలు భావం అర్థం చేసుకోకుండా అతన్ని నానా దుర్భాషలాడారు. ఆడది అంటే అట్రాక్ట్ చేసేది. అందువల్లే మన పురాణాల్లో విశ్వామిత్రుడు సైతం రంభ కనిపించగానే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టాడు. ఎక్కడ అట్రాక్ట్ అయిపోతానేమోనని భయం. అట్రాక్ట్ చేయడం, అట్రాక్ట్ అవ్వడం అనేది ఆడ, మగ లక్షణాలు. ఆడపిల్లలకు అట్రాక్ట్ చేసే గుణం నేచర్‌లోనే ఉంది కాబట్టి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు ఒద్దికగా ఉంటే... ఎదుటివ్యక్తిలో ధైర్యం తగ్గుతుంది. అలా తిట్టే బదులు వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇన్ని సమస్యలు రావు. అసలు ఆడవాళ్ల వేషధారణ అనే కాదు.. మగవాళ్లు కూడా చెవులకు పోగులు పెట్టుకోవడం, పోనీటైల్ వేసుకోవడం, అక్కడక్కడా చిరుగులున్న ప్యాంట్లు వేసుకుని హైటెక్ అనడం కామన్ అయ్యింది. ఇదేం హైటెక్ అండి.

ఆడవాళ్లకి సమాన హక్కులనే విషయంపై మీ అభిప్రాయం?
కోట : మగవాళ్లు, ఆడవాళ్లు సమానం అని అంటున్నారు. అలాంటప్పుడు 33 శాతం రిజర్వేషన్ మాత్రమే ఎందుకడుగుతున్నారు. 50 శాతం అని మీరెందుకడగరు? ఎప్పుడైతే మీరు 33 శాతం అడిగారో అప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్లే. ఆడవాళ్లతో పోల్చితే మగవాళ్లు శారీరకంగా చాలా బలవంతులు. అది సృష్టి. అంతమాత్రాన ఆడవాళ్లు తక్కువనడానికి లేదు. అసలు ఆడవాళ్ల గొప్పతనం గురించి వాళ్లే అర్థం చేసుకోవడంలేదు. మన హిందూ సంప్రదాయంలో స్త్రీకిఇచ్చిన గౌరవం చాలా గొప్పది. పురాణాలను తీసుకుంటే హోమ్ మినిస్టర్ ‘ఆదిశక్తి’, ఫైనాన్స్ మినిస్టర్ ‘లక్ష్మి’, ఫుడ్ మినిస్టర్ ‘అన్నపూర్ణ’, ఎడ్యుకేషన్ మినిస్టర్ ‘సరస్వతి’... వీళ్లంతా ఆడవాళ్లే కదా. సో.. అన్ని ముఖ్యశాఖలూ ఇచ్చినది స్త్రీలకే. అంత గొప్పదనం సొంతం చేసుకుని, ఆ విలువ తెలుసుకోలేక వేస్ట్‌మాటలు మాట్లాడుకుని, పిచ్చిపనులు చేసుకోవడమెందుకు? స్త్రీలను రాజకీయాల్లోకి వద్దన్నారా? మిలటరీలో అడుగుపెట్టొద్దన్నారా? ఎందులోకి వద్దన్నారు? ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటే ఎంత బాగుంటుంది?

మన మాతృభాషను మాట్లాడానికి కూడా చాలామంది నామోషీగా భావిస్తున్నారు. మన భాషను కాపాడుకోవడానికి మనమేం చేయాలి?
కోట : ఏమీ చేయలేం. ఎందుకంటే నవమాసాలు మోసి, బిడ్డను కన్నతల్లే ‘అమ్మా’ అని పిలిపించుకోవడానికి ఇష్టపడటంలేదు. ‘మమ్మీ’ అనిపించుకుంటోంది. జన్మనిచ్చిన తల్లే తెలుగులో పిలిపించుకోకపోతే ఇక మాతృభాషను ఎలా కాపాడుకోగలం. మన బతుకుతెరువు కోసం పరభాష మాట్లాడటం తప్పు కాదు. కానీ పరభాషే మన భాష అవ్వడం దౌర్భాగ్యం.

స్కూల్స్‌లో కూడా ఇంగ్లిష్‌నే ప్రోత్సహిస్తున్నారు?
కోట : ప్రస్తుతం చదువనేది చాలా ఖరీదైపోయింది. స్కూల్స్‌కి వెళ్లి ‘ఏంటండి.. ఫీజులు ఇంత ఎక్కువగా ఉన్నాయి’ అనడిగితే, ‘అవర్ టీచర్స్ ఆర్ వెల్ ట్రైన్డ్’ అంటారు. వెల్ ట్రైన్డ్ అంటే.. అమెరికాలోనో ఎక్కడో పీజీ చేసి ఉంటాడా టీచర్. ఇక్కడికొచ్చి కేజీ పిల్లలకు పాఠాలు చెబుతాడు. ఆ పీజీ టీచర్ చెప్పేది కేజీ పిల్లాడికి ఏం అర్థం అవుతుంది? అసలిప్పుడు ‘ఉప్పు కప్పురంబు...’ పద్యం చెబుతున్నారా? ‘రైమ్స్’ చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా మావాడు బాగా రైమ్స్ చెబుతున్నాడని చెప్పి మురిసిపోతున్నారు. అంతేకానీ ఉప్పు కప్పురంబు తెలియడంలేదని బాధపడటంలేదు. చిన్నప్పుడు నేర్పించాల్సివన్నీ వదిలేస్తున్నారు. పీజీ టీచర్ ఏది చెబితే అదే నెత్తికెక్కించుకుంటున్నారు. ఇప్పుడంతా కంప్యూటర్‌మయం అయిపోయింది. స్పీడు యుగం అయ్యింది. అసలు సిస్టమ్ అంతా రివర్స్‌లోనే ఉంది. ఉదాహరణకు.. ఒకప్పుడు రోలు వాడేవాళ్లు. ఇప్పుడు గ్రైండర్లు. రోటిని ఎడం చేత్తో తిప్పుతూ సునాయాసంగా పిండి రుబ్బేసేవాళ్లు. రోట్లో పొత్రం తిరుగుతుంది. కానీ గ్రైండర్ అంటే.. పొత్రం చుట్టూ రోలు తిరుగుతుంది. భగవంతుడి సృష్టించినదానికి వ్యతిరేకంగా వెళుతున్నాం. ఓ అపార్ట్‌మెంట్‌లో 150 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి ఉదయం మిక్సీలు, గ్రైండర్లు భయ్‌మని మోగుతుంటాయి. కరెంట్ లోడ్ సరిపోవడం లేదంటారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ని తిట్టుకుంటారు. 25 ఇళ్లల్లో అన్ని మిక్సీలు, గ్రైండర్లు మోగుతుంటే లోడ్ ఎట్టా సరిపోద్ది?

మీరిలా ఓపెన్‌గా మాట్లాడటంవల్ల ‘కోటకి నోటి దురుసుతనం’ అని సినిమా పరిశ్రమలో అంటుంటారు. ఈ విధంగా మాట్లాడటంవల్ల వివాదాలువస్తాయి కదా?
కోట : విమర్శలు చాలా వచ్చాయి. ఇప్పుడొచ్చినా రానివ్వండి. అసలు విమర్శించేది ఎవరో తెలుసా? నేను చెప్పేది నిజం అని ఒప్పుకోలేక బతుకుతున్నవాళ్లు విమర్శిస్తారు. అయినా నన్నేం చేయగలుగుతారు? నేను ఎవడి సొమ్మూ తినడంలేదు. టీవీల్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్లందర్నీ ఏం చేయగలిగారు? నేను మాట్లాడుతున్నది తప్పయితే... కొందరు రాజ్యసభ మెంబర్లు, పార్లమెంట్ మెంబర్లు వాళ్ల అమ్మల్ని, అక్కల్ని తప్ప మిగతావన్నీ తిట్టుకుంటున్నారు. అంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? ఒకవేళ గవర్నర్ ప్రసంగం నచ్చకపోతే బాయ్‌కాట్ చేయాలి. పిల్లలు విసురుకున్నట్లు కాగితపు బాణాలు విసరడం ఏంటి? పైగా విసిరినది ఎవరు? చదువుకున్న వ్యక్తే కదా. నలుగురికి మంచి అనిపించేది చెబుతాను. ఇష్టం ఉన్నవాళ్లు తీసుకుంటారు. లేకపోతే లేదు.

మీ ముక్కుసూటితనం సినిమా పరిశ్రమలో మీకు ప్లస్ అయ్యిందా? మైనస్సా?
కోట : నెగటివ్ అయితే జరగలేదు. ఒకవేళ నెగటివ్ జరిగి ఉంటే నా ప్రొఫెషన్ దెబ్బతినాలిగా. అలా జరగలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎమ్మెల్యే అయిన నాలుగేళ్లు సినిమాల సంఖ్య తగ్గింది. ఆ సమయంలో ఏడాదికి పది సినిమాలు మాత్రమే చేయగలిగాను. ఎమ్మెల్యే అయ్యాడు కదా. చిన్న చిన్న పాత్రలిస్తే చేయడేమోనని కొంతమంది అడగడానికి జంకారు. ఆ విధంగా సంఖ్య తగ్గింది.

బీజేపీలో నాలుగేళ్ల పాటు ఉండి.. ఆ తర్వాత రాజకీయాలకు ఎందుకు పూర్తిగా దూరమయ్యారు?
కోట : నేను చేసినప్పుడు ఉన్నవి ‘పాలిటిక్స్’. ఇప్పుడు ‘పాలిట్రిక్స్’ మాత్రమే ఉన్నాయి. ఆ ట్రిక్స్ నాకు తెలియవు. అందుకే దూరంగా ఉంటున్నాను. మొహానికి రంగేసుకుని కష్టపడి సంపాదించుకుంటున్నాను. హీరోని, కమెడియన్‌ని, విలన్‌ని కాదు. అన్ని రకాలూ చేస్తున్నాను. టక్కున ఎవరైనా పిలిచి, ‘కోటా సినిమాలు మానేయవయ్యా’ అన్నా నో ప్రాబ్లమ్. బతకగలను. కాకపోతే ఇప్పుడు రెండు కార్లు వాడితే అప్పుడు ఒక కారు వాడతానేమో!

రాజకీయాల్లో ఉన్నప్పుడు మినహా బిజీగా సినిమాలు చేశానన్నారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి?
కోట : నేనా భగవంతుడ్ని ఎప్పుడూ కోరుకునేది ఒక్కటే. భగవంతుడా... నాకు నాలుగు మెతుకులు ఇప్పించు. ఆ నాలుగు మెతుకుల్లో నలుగురికీ నాకు చేతనైనంత సాయం చేస్తానని. చిన్నా పెద్దా తేడా లేకుండా సహాయం చేస్తాను. కానీ ప్రెస్‌మీట్స్ పెట్టను. నా వయసు ఈ జూలైకి 70. ఇప్పటికీ అవకాశాలు నా గుమ్మం దగ్గరకే వస్తున్నాయి. నైన్ టు సిక్స్ మాత్రమే చేయగలను అని చెప్పినా.. ‘ఓకె... మీరు చేస్తే చాలు’ అనిపించుకోగలుగుతున్నానంటే నాలో కల్మషం లేనట్లేగా.

పరభాషా నటులను తీసుకురావడం పట్ల కూడా మీరు అడపా దడపా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు...
కోట: తెలుగువారిని ప్రోత్సహించాలని నేను మొత్తుకుంటుంటే కొంతమంది నవ్వుకుంటున్నారు. పిచ్చి అని కూడా అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. మనవాళ్లను మనం గుర్తించకపోతే ఎలా? పరభాష నుంచి దమ్మున్న నటులను తీసుకొస్తే ఎందుకు తిడతాను? మీకు దమ్ముంటే నసీరుద్దీన్ షాని, నానా పటేకర్‌ని తీసుకు రండి. నేను అమితాబ్‌బచ్చన్‌తో ‘సర్కార్’ సినిమాలో కలిసి నటించాను. చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. ఆయన్ను తీసుకొచ్చి చేయించమనండి. ఎందుకు కాదంటాను? ముంబయ్‌లో రోజుకి మూడు నాలుగు వేలు తీసుకుని టీవీ సీరియల్స్‌లో యాక్ట్ చేసేవాళ్లని ఇక్కడికి తీసుకొచ్చి లక్షలకు లక్షలు ఇస్తున్నారు. అది అవసరమా? సరే.. ప్రకాష్‌రాజ్‌లాంటివాళ్లంటే ఓకే. అతను ఆర్టిస్టు. నాకింకా కోపం తెప్పించే విషయం ఏంటంటే... రాముడు, కృష్ణుడు, భీముడు, దుర్యోధనుడు, యమధర్మరాజు... ఇలాంటి పాత్రలకు మన తెలుగువారి మైండ్‌లో ఒక ‘రూపం’ ిఫిక్స్ అయిపోయింది. రామారావుగారు, రంగారావుగారు, సత్యనారాయణగారు, గుమ్మడిగారిలాంటివాళ్లు ఈ పాత్రలు చేయాలి. కానీ తెలుగువారు ఎవ్వరూ లేనట్టుగా మొన్నీమధ్య ఓ సినిమాలో ఒక ముంబై యాక్టర్‌కి యముడి పాత్ర ఇచ్చారు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అయినా అసలు తెలుగువాళ్లని ప్రోత్సహించమంటే తప్పేంటండి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. తెలుగు సినిమాల్లో నూటికి నూరు శాతం తెలుగు నటీనటులు, కళాకారులు ఉంటేనే రాయితీ ఇస్తాం, నంది అవార్డులు కూడా అప్పుడే లభ్యం అవుతాయని ఓ జీవో పాస్ చేయమని ప్రభుత్వాన్ని కోరాలనుకుంటున్నాను.

తెలుగువాళ్లకి అవకాశం ఇచ్చినందువల్ల సినిమాలు చెడిపోతాయేమోననే ఫీలింగ్ ఉందంటారా?
కోట : పోనీ అలాంటి ఫీలింగే ఉందనుకుందాం. తెలుగువాళ్లకి మెయిన్ కేరక్టర్లు ఇచ్చిన సినిమాలు చెడిపోయాయని, అందుకే బయటికి వాళ్లను తీసుకుంటున్నాం అని చెప్పమనండి. నాలాంటివాళ్లకి తప్ప మిగతావాళ్లకి మెయిన్ కేరక్టర్లు ఎవరిచ్చారు? నేను ‘మా’ అసోసియేషన్ వారికి ప్రతి మీటింగులోనూ తెలుగువాళ్లను ప్రోత్సహించమనండంటూ మొరపెట్టుకుంటుంటాను. ‘మా’ అసోసియేషన్ ఉన్నది అందుకే కదా. అడగండని అంటుంటాను. అడగరు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికలకు నామినేషన్స్ మొదలయ్యాయి. నన్ను నామినేషన్ వెయ్యమంటే నేను వెయ్యలేదు. ఎందుకెయ్యాలని ఫీలింగ్? ప్రభుత్వమే దిగి వచ్చి, కోర్టులో జడ్జిమెంటు తెలుగులో ఉండాలని, పాఠశాలల్లో తెలుగు కంపల్సరీ అని ఇలా నిర్ణయాలు తీసుకుంటోంది. మరి మనకేం మాయరోగం. అరవయ్యేళ్లు దాటినవాళ్లకి పెన్షన్ ఇస్తున్నామంటున్నారు. కానీ వేషాల్లేక అవస్థలు పడుతున్న కుర్రాళ్ల సంగతేంటి? మన తెలుగువాళ్లకి నెలకి ఓ ఇరవై రోజులు పని ఉండేలా చెయ్యి తండ్రీ అని ఆ మధ్య తిరుమల వెళ్లినప్పుడు ఏడుకొండలవాడికి మొరపెట్టుకున్నాను.

మరి... మీరు కూడా పరభాషల్లో నటిస్తున్నారుగా?
కోట : కరెక్ట్‌గా అడిగారు. ఇక్కడ మీకో చిన్న ఉదాహరణ చెప్పాలి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చాలా భాషల్లో పాటలు పాడతాడు. ఏ భాషలో పాడితే అది ఆయన మాతృభాషలా ఉంటుంది. అలాగే నేను కూడా. నన్ను ఏ భాషలో తీసుకుంటే ఆ భాష నాది అన్నట్లుగా ఒదిగిపోతాను. అలాంటి వాళ్లని తీసుకురమ్మంటున్నాను. అంతే తప్ప పరభాషల మీద నాకెలాంటి ఆగ్రహం లేదు.

మీ అబ్బాయి ప్రసాద్ ఉండి ఉంటే.. నటుడిగా మంచి భవిష్యత్తు ఉండేదేమో?
కోట : అవును. తను ఉండి ఉంటే నాకింకా బాగుండి ఉండేది. రాత్రి ఏడున్నర అవుతుందంటే ‘ఎక్కడున్నారు’ అంటూ ఫోన్ చేసి, ఇంటికి తీసుకువచ్చేసేవాడు. డ్రింక్ చేస్తానేమోనని భయపడేవాడు. ఉదయం షూటింగ్స్ ఉంటే తనే నిద్రలేపేవాడు. నా ఆరోగ్యం గురించి పట్టించుకునేవాడు. తను మంచి బ్యాడ్‌మింటన్ ప్లేయర్. పుల్లెల గోపిచంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. తన కొడుకులిద్దర్నీ కూడా అక్కడే చేర్చాడు. అభిరుచికి తగ్గట్టు ఇల్లు కట్టించుకున్నాడు. కానీ అనుభవించలేకపోయాడు. మేం మిగిలిపోయాం. తినలేం.. తినకుండా ఉండలేం.

‘గాయం-2’లో ప్రసాద్ చనిపోయే సీన్‌ని తీయొద్దని, చూడలేనని అన్నారట. మరి... నిజంగా అది జరిగినప్పుడు ఎలా తట్టుకోగలిగారు?
కోట: ప్రసాద్‌కి అది ఫస్‌‌టిసినిమా. ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం. ప్రసాద్ చనిపోయే నాలుగురోజుల ముందు ఆ సీన్ ప్లాన్ చేశారు. ‘నేను చెయ్యలేనండి. ఏమీ అనుకోవద్దు’ అన్నాను. జగపతిబాబు అర్థం చేసుకుని, డూప్‌తో చేయించాడు. ఆ సీన్‌లో యాక్ట్ చేసి ఉంటే దిష్టి పోయేదేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది (చెమర్చిన కళ్లతో). చనిపోయే రోజు పన్నెండున్నర గంటల ప్రాంతంలో నాతో మాట్లాడాడు. ఫ్యామిలీ అంతా కారులో , తను బైక్ మీద వెళుతున్నాడు. కారు 80 స్పీడులో, బైక్ 100లో వెళుతోంది. ఆ రోడ్డులో 100 స్పీడ్ అంటే ఈజీయే. వాడి తప్పేం లేదు. అలా రాసిపెట్టి ఉంది. భగవంతుడు ఓ పక్క అంత పెద్ద శిక్ష వేసి, మరోపక్క దాన్ని ఓర్చుకునే స్థైర్యం కూడా ఇచ్చాడు. మా అబ్బాయి చనిపోయిన రోజున మా పెద్దక్క పుట్టెడు దుఃఖంతో వచ్చింది. తనకి 86 ఏళ్లు. గుమ్మం దగ్గర అలా నిలబడిపోయింది. ‘గుండె పగిలి చచ్చిపోయి ఉంటావనుకున్నాను రా’ అంటూ ఏడ్చింది. తట్టుకోలేకపోయాను.

ప్రసాద్‌కి ఎంతమంది పిల్లలు... ఆయన భార్యా పిల్లలు మీతోపాటే ఉంటారా?
కోట : వాడికి ఇద్దరు కొడుకులు. ఇప్పుడు వాళ్లిద్దరూ (రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో) పుల్లెల గోపీచంద్ దగ్గర్నుంచే వస్తున్నారు. మా కోడలు చాలామంచి అమ్మాయి. వెల్ ఎడ్యుకేటెడ్. వాడి లేని లోటు తప్ప ఆ అమ్మాయి మాతో బాగా కలిసిపోయింది. మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ.. ‘మీరు మంచి కొడుకుని మాత్రమే కాదు, మేం మంచి మిత్రుడ్ని కోల్పోయాం’ అన్నారు. అందరితో అంత బాగుండేవాడు. ఫైనల్‌గా ఒక్కటి చెబుతాను.. ‘చిల్డ్రన్ ఆర్ బార్న్ టు అజ్... నాట్ బిలాంగ్స్ టు అజ్’ అనేది తెలుసుకున్నాను (గద్గద స్వరంతో... తడి నిండిన కళ్లతో).

-సంభాషణ: డి.జి. భవాని

కోట్లమందిని రంజింపచేస్తున్న కళాకారులకు ప్రైవసీ అవసరం కాబట్టి, వాళ్లంతా ఒకేచోట ఉంటే గౌరవంగా ఉంటుందనే సద్దుదేశంతో ప్రభుత్వం ఫిలింనగర్ సొసైటీ ఇచ్చింది. ఇరవయ్యేళ్లుగా సొసైటీ వ్యవహరిస్తున్న తీరుని చూసి, అంతా కరప్టడే అని, ఉన్న కమిటీని డిసాల్వ్ చేసి, ప్రభుత్వం ఓ స్పెషల్ ఆఫీసర్‌ని నియమించింది. కమిటీలో ఉన్నవాళ్లెవరూ అంటే.. సినిమా ఇండస్ట్రీలో పెద్దపెద్దవాళ్లు, మాజీ ఎంపీలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులు. ఇంతమంది గొప్పవాళ్లున్న సొసైటీలో అవకతవకలు జరిగాయంటే ఎంత సిగ్గు చేటు! ఎవరి తప్పో తెలియదు కానీ ఎనభై శాతం మంది బయటివారికి ఎనిమిది శాతం మంది సినిమావారికి స్థలం కేటాయించారు. మరోవైపు చిత్రపురి కాలనీ గురించి చెప్పాలంటే.. అక్కడి పరిస్థితీ అగమ్యగోచరమే. భవిష్యత్తులో ప్రభుత్వం స్థలం ఇవ్వదు, ఇళ్లు ఇవ్వదు. మరి... నేటి తరానికి సినిమాల్లో అవకాశాలైనా ఇవ్వకపోతే వాళ్లెలా బతుకుతారు? ఇది అడిగితే తప్పా? మనం సెటిలయ్యాం కదా... తర్వాత తరానికి దారి చూపించాలిగా...

*******

అప్పట్లో వస్తు మార్పిడి ఎక్కువగా ఉండేది. మా నాన్నగారి దగ్గర వైద్యం చేయించుకుని కూరగాయలు, కందులు, మినుములు... ఒక్క ఉప్పు, నూనె తప్ప రైతులు అన్నీ ఇచ్చేవాళ్లు. ఉద్యోగాలు చేసుకునేవాళ్లయితే రూపాయి, రెండ్రూపాయలు ఇచ్చేవాళ్లు. అప్పట్లో మా నాన్నగారు ఒక నెల ఆంధ్రా బ్యాంకులో పాతిక రూపాయలు డిపాజిట్ చేశారు. పెద్ద డిపాజిటర్ వచ్చాడనే ఆనందంతో ఆ బ్యాంక్ మేనేజర్ మా నాన్నగారికి దండ వేసి, దండం పెట్టారట. ఆయనకేంట్రా లక్షాధికారి అనేవాళ్లు. ఇప్పుడు లక్ష అంటే నథింగ్. మినిమమ్ కోటి అయినా ఉండాలి.
 

వెన్నెల్లో బూచమ్మ

 

అమావాస్య, అర్ధరాత్రి...అంటూ హారర్ కథలు మొదలవుతాయి.కానీ ఈ కథ మాత్రం వెన్నెల రాత్రులలో మొదలవుతుంది. ఎందుకంటే లా ల్యోనాకు వెన్నెల అంటే ఇష్టం. ఆ వెన్నెల్లో శోకగీతాలు ఆలపించడం అంటే ఇష్టం. ఎవరు ఆమె? ‘బూచాడు వస్తున్నాడు’ అని మనం భయపెడతాం. అమెరికాలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మాత్రం ‘అదిగో లా ల్యోనా వస్తోంది’ అని భయపెడతారు. ఆమె... కథ కాదు వాస్తవం అంటారు కొందరు. వాస్తవం కాదు కథ అంటారు ఇంకొందరు... ఇంతకీ ఈ బూచమ్మ ఎవరు?

కాలిఫోర్నియాలోని సాన్ పెడ్రో నగరంలో ఒకరోజు...
విన్సెంట్ థామస్ బ్రిడ్జి. పొద్దంతా కష్టపడి రాత్రి గుర్రుపెట్టి నిద్రపోతున్న శ్రామికుడిలా ఉంది. ఒక మూలన కొందరు తాగుబోతులు ప్రపంచాన్ని మరిచి మందు కొడుతున్నారు. దూరంనుంచి అడుగుల సవ్వడి వినిపించింది. తాగుబోతులు తలెత్తి చూశారు.
ఒక అందమైన అమ్మాయి....

‘‘ఒంటరిగా ఈ రాత్రి ఎటు వెళుతోంది?’’ తమలో తాము గుసగుసగా అనుకున్నారు వాళ్లు.
ఆమె ఆ మందుబాబులను దాటుతూ వెళ్లింది. వారిని చూసి నవ్వింది కూడా!
వాళ్లు ఆ అందాలరాశిని అనుసరిస్తూ వెళ్లారు.
కొద్దిసేపటి తరువాత ఆమె వెనక్కితిరిగి చూసింది.
ఈసారి మరింత అందంగా నవ్వింది. ఆ నవ్వులో నుంచి ఏ శక్తి పుట్టిందో ఏమోగానీ ఆ యువకులు అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోయారు... ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి సాన్ పెడ్రో నగరం మొత్తం వ్యాపించింది. ఆ తాగుబోతులు తాగిన మత్తులో ఒకరినొకరు హత్య చేసుకున్నారని కొందరు, శత్రుమూకలు వచ్చి వారిని హత్య చేశాయని కొందరు నమ్మారు.
తరువాత కొన్ని నిజాలు తెలిశాయి...
వాళ్లు ప్రాణస్నేహితులు. ఎప్పుడూ చిన్నపాటి గొడవ కూడా పడలేదు. కాబట్టి వారు ఒకరినొకరు చంపుకునే ఛాన్సే లేదు.
వాళ్లు అజాతశత్రువులు. భూతద్దం వేసి వెదికినా ఒక్క శత్రువు కూడా కనిపించడు. కాబట్టి శత్రువులు చంపే ఛాన్సే లేదు.
మరి ఎవరు చేసారు ఈ పని?
సమాధానం కోసం జుట్టు పీక్కునేలోపే ఎవరో అరిచారు ‘‘బ్రిడ్డి దగ్గర హత్య జరిగిందంటే... ఆ మహాతల్లే చేసి ఉంటుంది... ఇలాంటివి ఎన్ని చూడలేదు. ఆ ల్యోనా గురించి ఎన్ని భయానక కథలు వినలేదు’’ అని.
లా ల్యోనా ఎవరు? రాత్రి వేళల్లో ఎందుకు ఒంటరిగా వెళుతుంది? నవ్వుతో చంపేసే శక్తి ఎలా వచ్చింది?

‘లా ల్యోనా’ అనే పేరుకు అర్థం ‘ఏడ్చే స్త్రీ’ అని.
వెన్నెల్లా అందంగా ఉంటే ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఉన్మాదంగా ఎందుకు మారుతోంది? మనుషులను నవ్వుతో ఎందుకు చంపుతుంది? అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? లా ల్యోనా గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో కొన్ని...

మొదటి కథ:
ల్యోనాను వాళ్ల అత్తయ్య మనిషిలా చూసేది కాదు. ఎప్పుడూ ఏవో సూటిపోటి మాటలు అంటూనే ఉండేది. ఒకరోజు అత్తకు ఎదురుతిరిగింది ల్యోనా. అత్త కోపంతో ఊగిపోతూ ఆ రాత్రి ల్యోనాను మెడపట్టి గెంటేసింది. ఎటుపోవాలో తెలియదు. ఎక్కడ ఉండాలో తెలియదు. ఈ అయోమయంలో ఉండగానే ఆమె ప్రమాదానికి గురై చనిపోయింది. అందుకే ఎప్పుడూ రోడ్లమీద కనిపిస్తుంటుంది. సమాజం మీద తనకు గల కోపాన్ని రకరకాల పద్ధతుల్లో తీర్చుకుంటుంది.

రెండో కథ:
అందమైన అమ్మాయి మారియ(ల్యోనా) ఒక ధనవంతుడిని వివాహం చేసుకుంది. కొంతకాలం తరువాత ఆ సంపన్నుడు ఆమెను పట్టించుకోవడం మానేశాడు. మారియ వేరే యువకుడి ప్రేమలో పడుతుంది. పెళ్లి కూడా చేసుకుంటుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. విషయం తెలిసిన మారియ భర్త ఆ పిల్లలను మెక్సికోలోని ఒక నదిలో వేసి పైశాచికానందాన్ని పొందుతాడు. బిడ్డల మరణాన్ని తట్టుకోలేక మారియ గుండె ఆగి చనిపోతుంది. ఆ క్షణం నుంచి తన పిల్లల కోసం నది పరిసర ప్రాంతాల్లో వెదుకుతూనే ఉంటుంది. ఒక పెద్ద రాయిపై కూర్చొని తన పిల్లలను తలుచుకొని ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. అందుకే ఆమెకు ‘ఏడ్చే స్త్రీ’ అని పేరు వచ్చింది.

పిల్లలు ఎవరైనా నది సమీపంలోకి వస్తే తన పిల్లలే కావచ్చుననే ఆశతో వారిని వెంబడిస్తుంది. కొద్దిసేపటి తరువాత వాళ్లు తన బిడ్డలు కాదనే నిజం తెలుసుకుంటుంది. కోపం, ద్వేషంతో రగిలిపోతుంది. ఆ పిల్లలను సమీపంలోని అడవికి తీసుకెళ్లి చంపేస్తుంది లేదా దాచేస్తుంది.

వెన్నెలరాత్రులు అంటే ఎవరికైనా ఇష్టమే కదా!
సాంట ఫె నది పరిసర ప్రాంతాల్లో మాత్రం వెన్నెల రాత్రులు వచ్చాయంటే ఎటు చూసినా భయమే. ఎందుకంటే వెన్నెల అంటే ల్యోనాకు ఇష్టం. వెన్నెలరాత్రులలో ఆమె శోకగీతాలు ఆలపిస్తుంటుంది. ఆ గొంతు వినడానికి భయానకంగా ఉండేది. ఎవరైనా ఆమెను చూసిన వెంటనే పాట ఆపేది. నవ్వుముఖంతో తన దగ్గరకు ఆహ్వానించేది. తనను చూసిన వ్యక్తికి సంబంధించిన రక్తసంబంధీకులలో ఎవరిదో ఒకరి రూపం ధరించేది. ‘‘నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి?’’ అని అతడు అమాయకంగా వచ్చాడా... ఇక చచ్చినట్లే! అలా బలై పోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. కొందరిని మాత్రం గుహల్లో దాచేసేది.

ఒకసారి ఒక పిల్లాడు పొదల్లో పడిపోయి కనిపించాడు.

‘‘ఇక్కడ నిన్ను ఎవరు పడేశారు?’’ అని అడిగితే జరిగిందంతా చెప్పాడు. తాను ఒక స్త్రీ నుంచి తప్పించుకొని వచ్చానన్నాడు. చిత్రమేమిటంటే ఈ సంఘటన జరిగిన కొన్నిరోజులకు ఆ పిల్లాడు మూగవాడైపోయాడు. ల్యోనా నుంచి తప్పించుకున్నవాళ్లలో కొందరు జబ్బుపడ్డారు. కొందరు చనిపోయారు.

దారిన పోతున్నప్పుడు తనకు ఎదురుపడిన యువకులను రకరకాల చేష్టలతో ఆకర్షించేది ల్యోనా. వాళ్లు తనతోపాటు రాగానే ఒక నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి తన పొడవాటి వెంట్రుకలతో వారిని ఉరితీసి చంపేసేది. కొన్ని సందర్భాలలోనైతే పామురూపం ధరించి కాటేసి చంపేసేది.

ల్యోలా నుంచి తప్పించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి అని చెబుతుంటారు.

నాకు ఆపద తలపెట్టవద్దు అని ప్రార్థిస్తే చాలు వదిలేస్తుంది.

టార్చ్‌ను ఆమె కళ్లలోకి సూటిగా కొడితే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

*******

న్యూ మెక్సికోలోని సంట ఫే నది దగ్గరే కాదు నార్త్, సౌత్ అమెరికాలోని ఎన్నో నదుల దగ్గర ల్యోనా గురించి వింత విషయాలు కథలు కథలుగా వినిపించేవి. నదుల దగ్గరే కాదు పెర బిల్డింగ్(పబ్లిక్ ఎంప్లాయిస్ రిటైర్‌మెంట్ అసోసియేషన్) దగ్గర తరచుగా ల్యోనా కనిపించేదట. నిజానికి ఆ భవనాన్ని ఒకప్పటి శ్మశానంలో నిర్మించారట. తమకు ఎన్నోసార్లు అరుపులు వినిపించాయని, అదృశ్యహస్తాలు కనిపించాయని ఆ బిల్డింగ్‌లో పనిచేసిన ఉద్యోగులు చెప్పారు. మెట్లు ఎక్కుతుంటే కొన్నిసార్లు ఎవరో వెనక నుంచి లాగుతున్నట్లుగా అనిపించేదట. టెక్సాస్‌లోని సాన్ బెర్నార్డ్ రివర్ బ్రిడ్జి దగ్గర కూడా ల్యోనా ఎక్కువగా కనిపించేదట. చాలా సంవత్సరాల క్రితం సాంచెజ్ అనే వైద్యుడు బ్రిడ్జి మీదినుంచి వెళుతుండగా నల్లని దుస్తుల్లో ఒక అమ్మాయి కనిపించింది. ఆమెను చూస్తే మనిషిని చూసినట్లు కాదు ఏదో ప్రేతాత్మను చూసినట్లు అనిపించిందట. వెంటనే తన నడక వేగాన్ని పెంచాడు. పరుగెత్తాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూశాడు. ఆమె కనిపించలేదు! సాంచెజ్ ఇప్పటికి ఆముఖాన్ని మరిపోలేదు.

లా ల్యోనాను అమెరికాలో అత్యంత పురాతన దెయ్యంగా చెబుతారు. చిత్రమేమిటంటే ఆ దెయ్యాన్ని చూశామని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. నిజం ఎంత ఉందోగానీ ఈ లెజెండ్ ఘోస్ట్ పుణ్యమా అని రచయితలకు, దర్శకులకు చేతినిండా పని దొరికింది. దొరుకుతూనే ఉంది!

1933లో ‘లా ల్యోనా’ పేరుతో మెక్సికన్ సినిమా ఒకటి వచ్చింది. ఆడ్రిన లామర్ ప్రధాన పాత్ర పోషించారు.

స్టిఫెన్ కార్పెంటర్ రచనతో హాలి డేల్ దర్వకత్వంలొ ‘లా ల్యోనా’ అనే టీవి సీరియల్ వచ్చింది.


*************

కెయమ్ 31 పేరుతో 2006లో రిగోబెర్టో దర్శకత్వంలో లా ల్యోనా కథ స్ఫూర్తితో ఒక సినిమా వచ్చింది.

లా ల్యోనా పై ఎన్నో పుస్తకాలు వచ్చాయి. విషయంలో ఒక పుస్తకానికి మరో పుస్తకానికి సంబంధం లేకపోయినప్పటికి అవి చదివించేలా ఉంటాయి.

పుస్తకాలు రాయడానికి కొందరు రచయితలు పాత పుస్తకాలను నమ్ముకున్నారు. కొందరు మాత్రం ‘ల్యోనాను నేను చూశాను’ అనే వాళ్ల దగ్గరికి కాలికి బలపం కట్టుకొని వెళ్లారు.
 

mail పొందికగా ఉండాలంటే...

 

మెయిల్ చెక్ చేసుకోకుండా రోజు గడవని పరిస్థితి మనది... ఆఫీసు కావచ్చు.. వ్యక్తిగత పనులు కావచ్చు.. బంధుమిత్రుల క్షేమ సమాచారం తెలుసుకోవడం కావచ్చు.. అన్నింటికీ ఈమెయిలే కేంద్రమైపోయింది. దీంతో ఇన్‌బాక్స్‌లో రోజురోజుకూ ఇన్‌బాక్స్‌లో మెయిళ్ల సంఖ్య పెరిగిపోతూంటుంది. అవసరమైనవి ఏవో, చెత్తబుట్టలోకి పడేయాల్సినవి ఏవో కూడా తెలియని గందరగోళం. కొంచెం శ్రమకోరిస్తే ఈ సమస్యలను తప్పించుకోవడం సులువే. పైగా ఒకసారి శ్రమతో భవిష్యత్తులో ఎంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు కూడా. అదెలాగో చూద్దామా...?

స్పామ్‌మెయిల్స్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల నోటిఫికేషన్లు.. వాటి మధ్యలో అవసరమైన ఆఫీసు మెయిళ్లు. మనలో చాలామంది తరచూ పడే ఇబ్బందే ఇది. వచ్చిన ప్రతిమెయిల్‌నూ చూడటం.. అలా వదిలేయడంతో ఇది మరింత పెరుగుతూంటుంది. మన అలవాట్లను కొద్దిగా మార్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని నిపుణులు చెబుతారు. ప్రతిరోజు నిర్ణీత సమయంలో మాత్రమే ఒకటిరెండుసార్లు మాత్రమే మెయిళ్లు చూసుకోవడం దీనికి ఒక ఉదాహరణ. తద్వారా మనం నిర్దేశించుకున్న సమయంలోనే మెయిళ్లు చూడటం పూర్తి చేసుకునే వీలు ఏర్పడుతుంది. అయితే ఈ పద్ధతి అందరికీ సరిపోకపోవచ్చు. ఇటువంటివారు... గంటలో కొంతభాగాన్ని మెయిళ్లు చూసేందుకు కేటాయించి.. ఉదయం, సాయంత్రాలు అనవసరమైన వాటిని తొలగించేందుకు కేటాయించుకుంటే బాగుంటుంది. తద్వారా సమయం వృథా కాదు.

చూడకుండానే తొలగించవచ్చు

స్పామ్, మరికొన్ని ఇతర అనవసర మెయిళ్లను సబ్జెక్ట్‌లైన్ ద్వారానే గుర్తించవచ్చు. అటువంటివాటిని ఓపెన్ చేసి డిలీట్ చేయడం కంటే నేరుగా డిలీట్ చేయడం మంచిది. హాట్‌మెయిల్ వంటి మెయిల్ సర్వీసుల్లో ఈ సదుపాయం ఉంది. ఒక మెయిల్‌ను చదవడం పూర్తయిందనుకోండి. అవసరాన్ని బట్టి దాన్ని వెంటనే డిలీట్ చేయడమో లేదా ఆర్కైవ్స్‌లోకి పంపడమో మంచిది. లేదంటే నిర్ణీత సమయం తరువాత దానంతట అదే ట్రాష్‌బిన్‌లోకి వెళ్లేలా మీ మెయిల్ సర్వీస్ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు.

ఫిల్టర్లు లేబుళ్లతో అందంగా...

వచ్చిన అన్ని మెయిళ్లనూ ఇన్‌బాక్స్‌లో పెట్టుకోవడం చాలామందికి ఉన్న అలవాటు. దీనివల్ల సమయానికి కావాల్సిన మెయిల్ కంటికి చిక్కకుండా పోయే ప్రమాదముంది. దీన్ని అధిగమించేందుకు వీలైనంతవరకూ మెయిళ్లను లేబుల్ చేసుకోవడం మంచిది. బంధుమిత్రుల సంభాషణలన్నీ ఒకచోట, ఆఫీసు పనులకు సంబంధించినవి, సోషల్ నెట్‌వర్కింగ్ కామెంట్లు, మీ ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్లు వేర్వేరుగా అన్నమాట. ప్రతిమెయిల్‌కూ లేబుల్ ఇవ్వడం కష్టమనుకుంటే.. మీకు తరచూ వచ్చే మెయిళ్లను ఆటోమెటిక్‌గా ఒక ఫోల్డర్‌లోకి పంపేందుకు ఫిల్టర్లను ఏర్పాటు చేసుకోవచ్చు కూడా. కొంచెం నిశితంగా పరిశీలిస్తే మీ మెయిల్‌బాక్స్‌లోకి తరచూ వచ్చే మెయిళ్లు ఎలాంటివి? వాటి అవసరమేమిటన్నది మీరు ఇట్టే గమనించవచ్చు. మీకు అవసరం లేదనుకున్న మెయిళ్లు ఇన్‌బాక్స్‌లోకి రాకుండా చర్యలు తీసుకుంటే చాలావరకూ సమస్యలు తీరిపోతాయి. ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ అనవసరమైనవాటిని అన్‌సబ్‌స్రై ్కబ్ చేసుకోవడం మంచిది.

కీబోర్డు షార్ట్‌కట్‌లను ఉపయోగించండి..

మెయిల్‌ను ఆర్కైవ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా మనలో చాలామంది మౌస్‌ను ఉపయోగిస్తూంటారు. దీనివల్ల కొంత సమయం వృథా అవుతూంటుంది. బదులుగా కీబోర్డు షార్ట్‌కట్‌లు ఉపయోగించండి. జీమెయిల్ సెట్టింగ్స్‌లో ‘కీబోర్డ్ షార్ట్‌కట్స్’ ఆన్ చేసుకోవడం ద్వారా అనేక షార్ట్‌కట్‌లను ఉపయోగించుకునే వీలు ఉంటుంది. ఉదాహరణకు షిఫ్ట్+ 3 కొడితే మెయిల్ డిలీట్ అయిపోతుంది. కొత్తమెయిల్ టైప్ చేయాలనుకోండి నేరుగా సీ అక్షరాన్ని టైప్ చేస్తే చాలు. వీటిని ఉపయోగిస్తే మెయిల్ కంపోజింగ్‌లో ఎంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
 

U.S.A అగ్రరాజ్యం

 

ఈ దేశానికి తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్...
ఈ పేరునే రాజధానికి నామకరణం చేసుకుందీ దేశం.
పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్‌కింగ్ ఇక్కడి వాడే.
పౌరపాలన విధానాన్ని చెప్పిన ఉడ్రోవిల్సన్...
ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పిన అబ్రహాంలింకన్...
లిటిల్‌బాయ్‌తో విధ్వంసం సృష్టించిన ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్...
ఇండియాతో ఐటి వారధి వేసిన బిల్‌క్లింటన్...
మన డ్వాక్రా మహిళలిచ్చిన గుమ్మడి పండుతో మురిసిన బుష్...
భారతీయ పక్షపాతిగా నిష్టూరాలెదుర్కొన్న బరాక్ ఒబామా...
ఈ దేశానికి అధ్యక్షులు....
యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా... ఈ వారం గ్రేట్‌కంట్రీ!!


రెండు వందల ముప్పై సంవత్సరాల కాలం. ఒక దేశ చరిత్ర అధ్యయనం చేసేటప్పుడు దీనిని చాలా కొద్దికాలంగానే పరిగణించాలి. ఈ కొలమానాన్ని తప్పంటోంది అమెరికా. అభివృద్ధిపథంలో దూసుకుపోవడానికి ఇది చాలా ఎక్కువంటోంది ఈ అగ్రరాజ్యం. యుకె నుంచి స్వాతంత్య్రం పొందిన అమెరికా ఆ వారసత్వాన్ని యథాతథంగా పుణికిపుచ్చుకోకుండా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల ప్రోగ్రెసివ్ సిస్టమ్‌ను కూడా అనుసరించింది. ఈ నేపథ్యంలో యునెటైడ్ స్టేట్స్ ప్రభుత్వం పటిష్టమైన పాలన విధానాన్ని ఏర్పాటు చేసుకుంది. దాంతో సామాన్యుడి జీవితం కూడా ప్రణాళికబద్ధంగానే నడుస్తుంటుంది. ఇక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా, ఓపెన్‌గా ఉంటారు. ప్రొఫెసర్‌తో స్టూడెంట్స్ అందరూ అవసరమైన విషయాన్ని ధైర్యంగా ప్రస్తావించే పరిస్థితి ఉంది. ప్రొఫెసర్‌లు అందరితో ఒకేరకంగా ఉంటారు. ఇక్కడ పనికి, డబ్బుకి విలువ ఉంది. డాలర్‌కు కొనుగోలు శక్తి ఎక్కువ. మన దగ్గర పైస, పది, ఇరవై పైసలు చలామణిలోనే లేవు. పావలా, అర్ధరూపాయిలున్నా షాపుల్లో ఆ చిల్లర ఇవ్వరు. ఇక్కడ ఒక సెంట్ చిల్లర కూడా తిరిగి ఇస్తారు.

ఉద్యోగం ఇవ్వడం... తొలగించడం!!

యుఎస్‌లో మనకు పూర్తి భిన్నంగా, ఆశ్చర్యంగా కనిపించేది వర్క్ కల్చర్. ప్రభుత్వ కార్యాలయాల్లో పని కాదనే భయం ఉండదు. ఒకసారి వెళ్లినప్పుడు అవసరమైన డాక్యుమెంట్ల జాబితా చెప్తారు. వాటిని తీసుకెళ్తే పని అయిపోతుంది. రేపు రండి, ఎల్లుండి రండి... అని తిప్పరు. ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ పని చేయదు. సిస్టమ్‌ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. పని విధానం మొత్తం పారదర్శకంగా ఉంటుంది. ఈ సిస్టమ్‌లో ఎవరికీ పెద్దగా ఆలోచించి పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తయితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. చాలా వరకు ఇలాంటి రొటీన్ జాబ్స్ చేసే వాళ్లే ఉంటారు. ఇక్కడ ఉద్యోగం ఎంత సులభంగా దొరుకుతుందో, ఒక ఉద్యోగిని తొలగించడం కూడా అంతే సులభం. ప్రతి కంపెనీ ప్రభుత్వానికి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్సూరెన్స్ కట్టాలి. ఉద్యోగులు సరిగా పనిచేయకపోయినా, ఇంతమంది అవసరం లేదని సంస్థ భావించినా అదే కారణం చూపించి తొలగించవచ్చు. నిరుద్యోగులకు ప్రభుత్వం 6 నెలల పాటు నిరుద్యోగభృతి ఇస్తుంది. అప్పటికీ మరో ఉద్యోగంలో చేరకపోతే ఫుడ్ కూపన్లు ఇస్తుంది.

కుటుంబ వ్యవస్థ ఉంది కానీ...

యుఎస్ సమాజంలో కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఉంది, కానీ మన కుటుంబ వ్యవస్థకు భిన్నం. వివాహం చేసుకుంటారు కానీ తప్పనిసరి కాదు. పెళ్లి చేసుకోకుండా కమిట్‌మెంట్‌తో జీవించేవాళ్లూ ఉంటారు. ఇక్కడ విడాకులు పొందడం సులభమే, అలాగని వివాహబంధానికి విలువ లేదనుకుంటే పొరపాటే. తల్లిదండ్రులు పిల్లలతో గడిపే టైమ్ తక్కువే కానీ క్వాలిటీ టైమ్ గడుపుతారు. ఉద్యోగంతోపాటు ఇది ఫ్రెండ్స్‌తో గడిపే టైమ్, ఇది పిల్లలతో గడిపే టైమ్ అని స్లాట్‌లు కేటాయించుకుంటారు. పదహారేళ్లు వచ్చేసరికి బయట వెళ్లిపోవడానికి మానసికంగా సిద్ధమవుతుంటారు పిల్లలు. ఇక్కడ పదహారేళ్లకే ఉద్యోగాలు వస్తాయి, లెర్నర్ డ్రైవింగ్ లెసైన్స్ ఇస్తుంది ప్రభుత్వం. దాంతో ఇండిపెండెంట్‌గా జీవించడానికి రంగం సిద్ధం చేసుకుంటారు. 12వ తరగతి వరకు ప్రభుత్వం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది.

ఉన్నత విద్యకోసం లోన్...

ఇక్కడ కాలేజ్ ఎడ్యుకేషన్ చాలా ఖరీదు. హయ్యర్ ఎడ్యుకేషన్‌కి లోన్ సౌకర్యం ఉంటుంది. బ్యాంకు లోన్ తీర్చడానికి చదువు పూర్తయి ఉద్యోగంలో చేరేవరకు తగినంత టైమ్ ఇస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాన్సెప్ట్ వైజ్‌గా స్టిక్టుగా ఉంటుంది. చదువుకునే సౌలభ్యం సరళంగా ఉంటుంది. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ నాలుగేళ్ల్ల కోర్సు పదేళ్లు చదివే వాళ్లూ ఉంటారు. ఇక్కడ టీచర్లు విద్యాసంవత్సరం మధ్యలో స్కూలు మారరు. ఒక టీచరు సెలవు పెడితే మరో టీచరు సిలబస్ ప్రకారం ఆ రోజు పాఠాన్ని పూర్తి చేస్తారు. యుఎస్‌లో దాదాపుగా ప్రతి నగరంలో డౌన్‌టౌన్ ఉంటుంది. అది కమర్షియల్ జోన్. వీటి పరిసరాల్లో అల్పాదాయవర్గాల నివాస ప్రాంతాలుంటాయి. చిల్లర నేరాలు ఎక్కువ ఈ ప్రదేశాల్లోనే ఉండడంతో భారతీయులు ఈ ఏరియాల్లో నివసించడానికి పెద్దగా ఇష్టపడరు.

ఇండియన్ యుఎస్!

యుఎస్ సమాజం... 20 వ శతాబ్దం చివరి దశకం - 21వ శతాబ్దం తొలి దశకానికి మధ్య మార్పుకు లోనయింది. యుఎస్ సమాజంలో వచ్చిన ఈ మార్పు భారతీయత. 1991లో ఇండియన్ హోటల్ లేని ప్రదేశాల్లో ఇప్పుడు ఐదారు ఉన్నాయి. పప్పు, చోళే, బెండకాయ కూర వంటివి ‘రెడీ టు ఈట్’ ప్యాక్‌లు వచ్చేశాయి. ఐటి బూమ్ మెక్‌డి బర్గర్, కెఎఫ్‌సి చికెన్ బకెట్‌లతో హైదరాబాద్ వంటి నగరాల జీవనాన్ని అమెరికనైజ్ చేసినట్లు అనిపిస్తుంది. ఇదే ఐటి అమెరికాని కూడా మార్చేసింది. ఇప్పుడు అమెరికన్లలో భారతీయ వంటకాలపై అవగాహన వచ్చింది, రైస్ తినడం అలవాటైంది. స్పానిష్, చైనా, ఇండియన్‌ల వలసల ప్రభావం ఈ దేశం మీద బాగా ఉందనే చెప్పాలి. అమెరికన్‌ల ప్రధాన ఆహారం మీట్, పొటాటో, బ్రెడ్, సలాడ్ మాత్రమే. క్రమంగా వంటకాల్లో రకరకాల ఫ్లేవర్లు చేరాయి. యుఎస్‌లో మన ఆలయాలు పెద్ద సంఖ్యలో వెలసిందీ ఈ సమయంలోనే. భారతీయ ఆలయాల్లో బాలవిహార్‌లుంటాయి. పిల్లలకు తెలుగు రాయడం, సంస్కృత శ్లోకాలు నేర్పిస్తారు. పురాణాలు చెప్తారు.

మన బంతి పూస్తుంది!

యుఎస్ ఇళ్ల నిర్మాణం రాంచ్, కలోనియల్ అని రెండు రకాలుగా ఉంటుంది. రాంచ్ అంటే ఒకటే ఫ్లోర్ ఇల్లు. కలోనియల్‌లో కింద ఫ్లోర్‌లో కిచెన్, హాల్, సిటవుట్, పై ఫ్లోర్‌లో బెడ్‌రూమ్ ఉంటాయి. ఇక్కడి వాతావరణంలో వెచ్చదనాన్ని కాపాడుకోవడం ప్రధానం. దాంతో ఉడెన్ హౌస్‌లు ఎక్కువ. కార్పెట్ వాడకం తప్పనిసరి. ఇళ్లన్నింటికీ సెంట్రల్లీ ఏసీ, రూమ్ హీటర్స్ ఉంటాయి.టెక్సాస్, ఫ్లోరిడా వంటి చోట్ల భారతీయ వాతావరణమే ఉంటుంది. గన్నేరు, బంతి చెట్లు పెరుగుతాయి, మన కూరగాయలు పండుతాయి. వీళ్ల ఫుడ్ హ్యాబిట్... హెవీ బ్రేక్‌ఫాస్ట్, లైట్ లంచ్, ఎర్లీ సప్పర్. సాయంత్రం ఆరు- ఏడు గంటలకు భోజనం పూర్తి చేస్తారు.

దేశంలో బ్లాక్ మనీ లేదు. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్‌క్లాస్ పీపుల్ ఎక్కువ. ఇక్కడ బ్యాంకు లోన్లు సులభంగా వస్తాయి. వడ్డీ తక్కువ. ఇంటి నిర్మాణానికి లోన్ తీసుకుంటే బ్యాంకులకు కట్టాల్సిన ఇఎంఐలు అద్దె కంటే తక్కువగా ఉంటాయి. ఇక్కడ గ్రామాల్లో వందల ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఒకటి - రెండు ఇళ్లు ఉంటాయి. భూస్వాములు అందరూ సాగు చేయరు. సాగు చేసే వారికి వ్యవసాయానికి అవసరమైన ఇన్‌పుట్స్ ఇస్తారు. దిగుబడిని పంచుకుంటారు. మన దగ్గర పాలికివ్వడం అనే పద్ధతిలాగ.

న్యాయం- వైద్యం

యుఎస్‌లో పోలీస్‌కు సాధికారత ఎక్కువ. ఏ ప్రభావానికీ లొంగరు. ఇక్కడ కోర్టుల్లో చిన్న నేరాలకు సింగిల్ హియరింగ్‌తో తీర్పు చెబుతారు. ఆ హియరింగ్‌కు పోలీస్ హాజరు కాకపోతే కేసు కొట్టేస్తారు. ఇక్కడ వైద్యసేవలు చాలా ఖరీదు. దారిద్య్రరేఖకు దిగువన జీవించే వారికి వైద్యం ఉచితం. సంపన్న దేశంగా భావించే అమెరికాలో దారిద్య్రం ఉంటుందా అంటే... పనిచేయని వాళ్లతోపాటు పేదరికం కూడా ఉంది కానీ తక్కువ. పన్నులు పోను రెండువేల డాలర్లు సంపాదించుకోగలిగితే ఇక్కడ నలుగురు మనుషుల కుటుంబం సౌకర్యంగా జీవించవచ్చు.

జీవనశైలి! టీవీ- మూవీ!!

వారాంతాల్లో పబ్‌లు జనసమ్మర్ధం ఎక్కువే కానీ అందరూ పబ్‌కెళ్లరు. అలాగే మద్యం తీసుకోవడం కూడ. వీళ్లకు కాలక్షేపం, వినోదం టీవీ, మూవీ. క్రీడాసక్తి కూడా ఎక్కువే. హైస్కూల్‌లో స్పోర్ట్స్ అవర్‌కి ఆ ఏరియా వాళ్లు స్కూల్‌కి చేరతారు. వీళ్లకు అలంకరణ మీద మోజు ఉంటుంది కానీ ఆభరణాల మీద తక్కువ. ఖరీదైన దుస్తులు, మేకప్, రకరకాల షూస్ కోసం బాగా ఖర్చు చేస్తారు. మగవాళ్లు, ఆడవాళ్లు అందరూ వివాహచిహ్నంగా బంగారు లేదా వజ్రపుటుంగరం ధరిస్తారు.

చూడాల్సినవాటిలో కొన్ని...
వైట్‌హౌస్... అమెరికాకు వచ్చిన మనవాళ్లు మొదటగా చూడాలనుకునే ప్రదేశం ఇది. రాజధాని వాషింగ్టన్‌డిసిలో ఉంది. అగ్రరాజ్యం అనే ట్యాగ్‌లైన్‌తో అమెరికా ప్రత్యేక గౌరవం అందుకుంటున్న నేపథ్యంలో అధ్యక్షుడి అధికార నివాసం కూడా అంతే ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో వైట్‌హౌస్‌లో కొంతభాగం వరకు పర్యాటకులను అనుమతించే వారు, కానీ వరల్డ్ ట్రేడ్‌సెంటర్ కూల్చివేత తర్వాత నిబంధనలు కట్టుదిట్టం అయ్యాయి.

డేనాలి నేషనల్ పార్కు... ఇందులో మెక్‌కిన్లే శిఖరాన్ని చూసి తీరాలి. ఇది నార్త్ అమెరికా ఖండంలో ఎత్తై శిఖరం.

లాస్‌వేగాస్ స్ట్రిప్... ఈ ప్రదేశం మొత్తం కాసినోలమయం. మాయా ప్రపంచాన్ని తలపించే గాంబ్లింగ్ జోన్ ఇది. రొమాన్స్, మిస్టరీ ఇలా ఒక్కో కాసినో ఒక్కో థీమ్‌తో ఉంటాయి. ఖరీదైన విలాసవంతమైన టైమ్‌పాస్ జోన్.

నయాగారా జలపాతం... న్యూయార్క్- ఒంటారియోల మధ్య ఉంది. ఇది అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వియెల్‌ఫాల్స్, హార్స్‌షూ ఫాల్స్ అని మూడు జలపాతాల సమూహం. హార్స్‌షూ కెనడాలో ఉంది.

గోల్డెన్ గేట్ బ్రిడ్జి... శాన్‌ఫ్రాన్సిస్కో - మెరిన్ కాంటీలను కలిపే వంతెన ఇది. మంచు దట్టంగా కురిసినప్పుడు కూడా స్పష్టంగా కనిపించడానికి దీనికి ఎరుపు పసుపు కలగలిసిన రంగు వేశారు. కాలిఫోర్నియా రాష్ట్రానికి చిహ్నంగా మారింది.

ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్... ఇందులో ఉష్ణగుండాలుంటాయి. మనం చిన్నప్పుడు కథల్లో విన్న ఎలుగుబంటి, జింక, దుప్పి, జడలబర్రె, తోడేళ్లు... వంటి వన్యప్రాణులను చూడవచ్చు.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ... ఈ విగ్రహం దేశానికి చిహ్నం. అమెరికాకు ఫ్రాన్సు ఇచ్చిన బహుమతి ఈ విగ్రహం. న్యూయార్క్ నగరంలో ఎలిస్ దీవిలో ఉంది. ఇక్కడ హోటల్ అద్దె అందుబాటులోనే ఉంటుంది.

టులిప్స్ బాగా పెరుగుతాయి...
ఇక్కడ వర్షాకాలం రెండు నెలలు ఉంటుంది. నార్త్ జోన్, ఈస్ట్ జోన్‌లో మంచుకురుస్తుంది. సౌత్, వెస్ట్‌కు వెళ్లే కొద్దీ స్నోఫాల్ తగ్గుతూ మంచు కరిగి వర్షం పడుతుంది. ఈ వాతావరణంలో టులిప్స్ బాగా పెరుగుతాయి. మొక్కలను బాగా పెంచుతారు కూడ. ఇక్కడి వారికి పెట్‌ని పెంచుకోవడం కూడా బాగా ఇష్టం. పెట్ వ్యాపారం కూడా ఎక్కువ. ఇక్కడ ఏ వ్యాపారమైనా సరే అది రైట్ బిజినెస్ అయితే అనుమతులు సులభంగా వస్తాయి, త్వరగా అభివృద్ధి అవుతాయి కూడ!

అవీ-ఇవీ...
యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాభై రాష్ట్రాల సముదాయం. రాజధాని వాషింగ్టన్‌డిసి.

అమెరికా కరెన్సీ యుఎస్ డాలర్. ఒక యుఎస్ డాలర్ దాదాపుగా 54 రూపాయలు.

యునెటైడ్ కింగ్‌డమ్‌తో 1782-1783 చర్చలు, ఒప్పందాల తర్వాత ఏర్పడిన స్వతంత్ర దేశం యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.

అమెరికాలో సమయంలో దేశమంతటా ఒకేరకంగా ఉండదు. కాలిఫోర్నియాలో సమయం మనకంటే పన్నెండున్నర గంటల వెనుక ఉంటుంది. మనకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కాలిఫోర్నియాలో అర్ధరాత్రి ఒకటిన్నర. ఇదే సమయంలో న్యూయార్క్‌లో తెల్లవారుజాము నాలుగన్నర, అలాస్కాలో అర్ధరాత్రి పన్నెండున్నర.

యుఎస్ ఎల్లలు... పసిఫిక్ మహాసముద్రం, మెక్సికో, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, నార్త్ అట్లాంటిక్ మహాసముద్రం, కెనడా.

- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
(యుఎస్‌లో నివసించిన చిర్రా సురేంద్రరెడ్డి, హిమబిందు దంపతులు చెప్పిన వివరాల ఆధారంగా)
greatcountries.sakshi@gmail.com
 

కష్టాలకు, కన్నీళ్లకు ఎదురీదిన శర్మిష్ఠ

 

పురాణ స్త్రీ - శర్మిష్ఠ
వృషపర్వుడనే రాక్షసరాజు కుమార్తె శర్మిష్ఠ. రాజగురువైన శుక్రాచార్యుని కూతురు దేవయాని ఈమెకు అనుంగు నెచ్చలి. దేవయాని, శర్మిష్ఠలు ఒకరోజు వనవిహారం కోసమని బయలుదేరుతారు. దారిలో జలపాతం కనిపిస్తుంది. అందులో తడిసి ఆటలాడతారు. జలకేళి పూర్తయ్యాక ముందుగా ఒడ్డుకుచేరిన శర్మిష్ఠ పొరపాటున దేవయాని వస్త్రాలను తనవిగా తలచి ధరిస్తుంది. దేవయాని ఈ సంగతి తెలుసుకుని కోపోద్రిక్తురాలవుతుంది. తెలియక చేసిన తప్పును మన్నించమని శర్మిష్ఠ కాళ్లావేళ్లాపడినా వినిపించుకోదు.

దేవయాని ఎప్పటికీ శాంతించకపోవడంతో శర్మిష్ఠలో సహనం చచ్చిపోతుంది. తన తండ్రి రాజ్యాధిపతి అని, తమ వద్ద శుక్రాచార్యులవారు పనిచేస్తున్నారన్న సంగతి మరువవద్దని మాటకి మాటగా అంటుంది. ఈ దెబ్బకి దేవయాని అహం పూర్తిగా దెబ్బతినిపోతుంది. స్నేహితురాళ్లిద్దరూ బాహాబాహీకి దిగుతారు. కోపం కట్టలుతెంచుకోగా శర్మిష్ఠ దేవయానిని పక్కనే ఉన్న దిగుడుబావిలోకి నెట్టివేసి అంతఃపురానికి వెళ్లిపోతుంది.

తీగల సాయంతో బావినుంచి బయటపడ్డ దేవయాని పడుతూలేస్తూ ఇంటికి చేరుతుంది. విషయమంతా తండ్రికి రోదిస్తూ చెబుతుంది. శుక్రుడు తల్లడిల్లిపోతాడు. ఆమెను ఓదార్చేందుకుగాను ఆ రాజ్యాన్నే వదిలిపెట్టి వెళ్లిపోదామంటాడు. గురుదేవుడు సకుటుంబంగా తమనుంచి దూరమవుతున్నందుకు వృషపర్వుడు కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. తరుణోపాయం చెప్పమంటూ శుక్రాచార్యులవారినే శరణువేడుకుంటాడు. ఆయనకు జాలికలుగుతుంది. కానీ దేవయానిని కాదని ఏమీ చేయలేని పితృప్రేమ శుక్రునిది. కుమార్తెకు ఈ సమాచారమంతా విపులీకరిస్తాడు. బెట్టు వీడాలంటాడు. అప్పటికీ కోపం తీరని ఆ పిల్ల శర్మిష్ఠ తనకు దాసీగా పనిచేస్తే రాజ్యంలోనే ఉండగలనని నిష్కర్షగా చెబుతుంది.

గురువు పట్ల అభిమానంతో చేసేది లేక వృషపర్వుడు కుమార్తెను దాసీత్వానికి అప్పగిస్తాడు. ఆ సమయంలో శర్మిష్ఠ మనోవ్యథ అంతా ఇంతా కాదు. ఏళ్లు గడిచాక యయాతి మహారాజుతో దేవయాని వివాహం జరుగుతుంది. యయాతి పత్నిగా ఆమె అత్తవారింటికి వెళ్లేటప్పుడు తనతో పాటు దాసిగా శర్మిష్ఠను కూడా తీసుకువెళుతుంది. శర్మిష్ఠ అందచందాలకు యయాతి ముగ్ధుడైపోతాడు. ఒకానొక సమయంలో శర్మిష్ఠను సమీపించిన యయాతి తన ప్రేమను వెల్లడిస్తాడు. వధూజన సంగమం విషయంలో మహారాజుకు సర్వహక్కులూ ఉంటాయని బోధపరుస్తాడు. రాజ్యాధిపతే ఒత్తిడి చేస్తుంటే అడ్డుచెప్పలేని శర్మిష్ఠ ఆయన వశమవుతుంది.

యయాతివల్ల ఆమెకి పూరుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. బిడ్డను రహస్యంగా ప్రసవించవలసి రావడమే కాకుండా, ఆ పిల్లాణ్ణి దేవయానికి తెలియకుండా పెంచడం శర్మిష్ఠను కఠిన పరీక్షలకు గురిచేస్తుంది. గుట్టుతెలిస్తే అటు రాజుగారి పరువు, ఇటు తన పరువూ గంగపాలవుతుందని భయాందోళనలకు గురవుతుంటుంది. చాన్నాళ్లు గడిచాక యయాతి శర్మిష్ఠల బంధం పదుగురికీ విశదమవుతుంది. పూరుణ్ణి తనబిడ్డగానే దేవయాని కూడా అంగీకరించే సమయం వస్తుంది.

వృద్ధుడైనా యయాతికి దేహాభిమానం పోదు. కుమారుడు గనుక తన ముసలితనాన్ని తీసుకుని, ఆతని యవ్వనాన్ని దానం చేస్తే ఆనందాల అంతు చూస్తానని ప్రకటిస్తాడు. వెనువెంటనే శర్మిష్ఠ కుమారుడైన పూరుడు జనకుని కోర్కెను మన్నించి తన యవ్వనాన్ని కానుక చేస్తాడు. తండ్రి వృద్ధాప్యాన్ని తను తీసుకుంటాడు. కొడుకు దాతృత్వాన్ని మెచ్చుకుని రాజ్యాధికారం ఆతనికే కట్టబెడతాడు యయాతి.

వీరకుమారునికి జన్మనిస్తుంది శర్మిష్ఠ. పెద్దింట పుట్టి సేవికగా మరొకరింట పేదరాలై కాలం గడుపుతుంది. జీవితంలో ఎదురైన ఎన్నో చిక్కులను ఓపికతో పరిష్కరించుకుంటూ వస్తుంది. ఆందుకే ఆమె పురాణాలున్నంత కాలమూ యశోచంద్రికలతో వర్థిల్లుతూనే ఉంటుంది.

- డా. చింతకింది శ్రీనివాసరావు