all

Monday, March 18, 2013

ఆదిగురువు జ్ఞానేశ్వర్

 

రాలిన మొగ్గలు
జ్ఞానేశ్వర్ జీవించింది 22 ఏళ్లే. అయినా మనిషి జన్మకు కావలసినంత జ్ఞానామృతాన్ని అందించాడు. మహారాష్ట్రలోని భక్తి సాంఘిక సంస్కరణోద్యమానికి ఆదిగురువు జ్ఞానేశ్వర్. ఆచారాల హడావిడితో, క్రతువు పటాటోపంతో సాగేది భక్తి కాదు. గుండె అంతరాంతరాల్లో దైవం సాక్షాత్కరమై, అది మానవత్వంగా బయటకు ప్రవహిస్తే - అదీ ఆధ్యాత్మికత అంటే. జ్ఞానేశ్వర్ బోధ ఇదే! నైతిక ప్రవర్తనే గీటురాయిగా ఉన్న వర్‌కారీ సంప్రదాయ ప్రారంభకారుడు జ్ఞానేశ్వర్. పాండురంగ విఠలనాథుడిని తన పద్యాలలో ఓలలాడించిన పరమ వైష్ణవ భక్తుడు జ్ఞానేశ్వర్. ఇతనే భక్త తుకారాంకి బాటలు వేశాడు.

జ్ఞానేశ్వర్‌కి ఆరేళ్లప్పుడు అమ్మనాన్నలు చనిపోయారు. తదనంతరం జ్ఞానేశ్వర్ సాధువుగా, సంత్‌గా, సద్గురువుగా, సంచారిగా మారడానికి బీజమిదే! అసలు సిసలు జీవిత సారాన్ని జ్ఞానేశ్వర్ చిన్న వయసులోనే ఒంటబట్టించుకోవడానికి మూలమిదే! జ్ఞానేశ్వర్ తండ్రి విఠల్ గోవింద్ కులకర్ణి. బ్రాహ్మణుడు. వేదాలు చదువుకున్నాడు. యాగాలు నిర్వహించే వాడు. అదీ భుక్తి కోసం.

నిజానికి విఠల్ గోవింద్‌కి వైదిక మతంలోని ఆర్భాటాలు ఇష్టం ఉండేవి కావు. ఆత్మశుద్ధి లేని పూజలెందుకు? చిత్తంలో శివుడు లేనప్పుడు ఒళ్లంతా విభూతి రాసుకోవడమెందుకు? ఇదీ కులకర్ణి ఆలోచన. వేదాలు ఇతరాలన్నీ పండితోత్తముల గుత్తాధిపత్యంలోనే ఎందుకుండాలి? సామాన్య నిమ్న వర్ణాలనెందుకు దూరముంచాలి? ఇదీ గోవింద్ వాదన. దీంతో సహజంగానే ఆయనకు స్వీయ బంధు జనమంతా శత్రువులయ్యారు.

విఠల్ గోవింద్‌కి ఈ కృత్రిమ బాహ్యాడంబరాల పట్ల వెగటు పెరిగింది. భార్య రుక్మిణితో రోజుకొకసారైనా అనే వాడు - తనకీ మేడిపండు సంఘంపై రోత పుడుతోందని! ఆమె కూడా భర్త లాంటిదే. కానీ అప్పటికే నలుగురు పిల్లలు - నివృత్, జ్ఞానేశ్వర్, సోపాన్‌దేవ్. నాలుగో సంతానం అమ్మాయి - ముక్తా బాయి. ఈ సంసారాన్ని నడపడం కోసమైనా సర్దుబాటు చేసుకోమనేది.

ఓరోజు విఠల్ కాశీ వెళ్లిపోయాడు - చెప్పాపెట్టకుండా. అక్కడ రామానంద స్వామి ఆశ్రయం పొందాడు. తన మనో వేదన వెలిగక్కాడు. సన్యాసం తీసుకుంటా నన్నాడు. స్వామీజీ వారించారు. గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూనే తామరాకుపై నీటి బొట్టులా బతకమని ఉపదేశించారు. వెనక్కి వచ్చేశాడు విఠల్. ఈ విషయం - విఠల్ నివసించే ఆలంది గ్రామమంతా పాకేసింది. అప్పటికే అతనిపై అక్కసుతో ఉన్న ఉద్ధండ బ్రాహ్మణులు గేలిచేశారు. అవమా నించారు. యాగాలకు రానివ్వలేదు. వ్రతాలు, పూజలు... ఎక్కడా విఠల్‌కి అవకాశమివ్వలేదు. దాంతో రాబడి పడి పోయింది. అవమాన భారం మిగిలింది. తినడానికి తిండి లేదు. గంపెడు సంతానం. ఇల్లంతా దరిద్రం. ఏం చేయాలో తోచలేదు ఆ దంప తులకు. పిల్లల్ని నాసిక్‌లో వదిలిపెట్టేశారు. ఇద్దరూ గంగ యమునల సంగమమైన ప్రయాగ వెళ్లారు. పవిత్ర జలాల్లోకి దూకేశారు. పిల్లలు అనాథలయ్యారు!

నాసికా త్య్రయంబకేశ్వరంలో నలుగురు పిల్లలదీ దిక్కుతోచని పరిస్థితి. నివృత్‌కి ఏడేళ్లే. మిగతావాళ్లింకా పసివాళ్లే. కనీసం గొంతు తడి చేసుకోవడానికి నీళ్లే దొరకని దుస్థితి. కన్నీళ్లు దిగమింగు కోవాల్సిన పరిస్థితి. నాసిక్‌లోని ఆశ్రమాల్లో చిన్న చిన్న పనులకు కుదిరాడు నివృత్. అలా ఓసారి గణినీనాథ్ అనే స్వామీజీ దృష్టిలో పడ్డాడు. భక్తితత్త్వంలోని నాథ సంప్రదాయ ప్రవర్తకుడు ఈయన. నవనాథుల్లో ఒకరు. ఆయన నివృత్‌ని చేరదీశారు. వేదం నేర్పారు. శుద్ధ భక్తితత్వ దర్శనం చేయిం చారు. పదేళ్ల వయసొచ్చేసరికి నివృత్‌నాథ్ బాల సన్యాసిగా పరిణమించాడు. అప్పటికి జ్ఞానేశ్వర్ ఎనిమిదేళ్ల బాలుడు. ఆకలి బాధ ఏమిటో రుచి చూసినవాడు. అమ్మ నాన్నల జాడ తెలీక అల్లాడినవాడు. ఆశ్రమాల్లోనూ ఆచారాల పేరిట కొందరిని వెలివేసిన వైనాన్ని కళ్లారా దర్శించినవాడు. స్థానిక సాధుసంతులతో సహజీవనం చేసినవాడు. వయసు తక్కువే అయినా అనుభవాలు మాత్రం ఆలోచించేలా చేశాయి.

నేటికీ మహారాష్ట్రలో జ్ఞానేశ్వర్ అందించిన వర్‌కారీ (యాత్రికుడు) సంప్రదాయం ఉంది. ఏటా అయిదు లక్షల మంది ఆళింది నుండి పండరీపురానికి 228 కిలోమీటర్ల పాటు జ్ఞానేశ్వర్ పాదుకల్ని శిరోధార్యం చేస్తూ ఆషాఢమాసంలో పాదయాత్ర చేస్తారు.

తన అన్ననే గురువుగా స్వీకరించాడు జ్ఞానేశ్వర్. నివృత్‌నాథ్ దగ్గరే వేదాల్ని, కుండలినీ యోగాన్ని నేర్చుకున్నాడు. కడుపుకి పట్టెడన్నం పెట్టని మతం మతం కాదని, సాటి మనిషిని మనిషిగా చూడని ఆచారం వృథా అని, మానవ జీవిత పరమార్థాన్ని ఆవిష్కరించని జ్ఞానం శుష్కకం అని - గ్రహించగలిగాడు. అదే అతని సిద్ధాంతంగా రూపుకట్టింది.
పదేళ్ల వయసులో జ్ఞానేశ్వర్ నాసిక్‌ని విడిచిపెట్టాడు. సంచార జీవనం మొదలు పెట్టాడు. చిన్నవాడే - వయసుకి మాత్రమే! పేరుకి తగ్గట్టు జ్ఞానేశ్వరుడే! తనతో పాటు తమ్ముడు సోపాన్‌దేవ్‌ని, చెల్లెలు ముక్తాబాయిని తీసుకెళ్లాడు. ఊరూ వాడా తిరిగేవారు. దరిద్ర భారతాన్ని కళ్లారా చూశాడు జ్ఞానేశ్వర్. ఆస్తులు, అంతస్తులు, ఆరోగ్యం... అన్నీ ఉన్నా ఏదో తెలీని వెంపర్లాటతో మనిషి బతకడం ఎంతటి విషాదం! దీన్ని వద్దన్నాడు జ్ఞానేశ్వర్.

భగవద్భక్తితో అచింత్యమైన ఏకాగ్ర చిత్తంతో పూజచేస్తే కలిగేది పుణ్యం కాదని, ఆనందమని, అదే పరమార్థమని బోధిం చాడు జ్ఞానేశ్వర్. అహ్మద్‌నగర్ జిల్లాలో ప్రవరా నదీ తీరాన జ్ఞానేశ్వర్ ఇచ్చిన అనుగ్రహ భాషణాలు ప్రధానమైనవి.
దాదాపు అయిదారేళ్ల పాటు జ్ఞానేశ్వర్ జీవనయానం ఇంతే! దొరికిన చోట బస, లభించినదే భోజనం, వచ్చినవారే ఆహూ తులు. వేదాంతాల్ని, భక్తిని మానవ మనసుల్లోని కల్మషాన్ని కడిగివేసేందుకు తీర్చిదిద్దుతూ ఉపన్యసించడమే విధి.
ఇదంతా ఒక ఎత్తు. భగవద్గీతపై జ్ఞానేశ్వర్ చేసిన వ్యాఖ్య ఒకటీ ఒక ఎత్తు. గీతలోని కర్మ జ్ఞాన యోగాల్ని మేళవించి ఆశువుగా అనర్గళంగా అర్థ వివరణలతో పాటు తనదైన అన్వయాల్ని మేళవిస్తూ జ్ఞానేశ్వర్ ఎన్నెన్ని ప్రసంగాలిచ్చాడో! ఎంతమంది మరాఠీయులు తమ యాసలో ఆ బాలవటువు చైతన్య స్ఫోరకంగా చెబుతుంటే ముగ్ధులై పోయారో! ఆ వ్యాఖ్యానాన్నంతటినీ సచ్చిదానంద్ అనే శిష్యుడు గ్రంథస్థం చేశాడు. నేటికీ మరాఠీలో గీతపై అంత కన్నా ప్రామాణికం లేదనిపించుకున్న ఆ వ్యాఖ్యే ‘భావార్థ దీపిక’!

జ్ఞానేశ్వర్ అత్యంత సంక్లిష్టమైన నిగూఢమైన తాత్త్విక వేదాంత రహస్యాన్ని సరళమైన భాషలో వివరించేవాడు. అంతే కాదు - ప్రజలు పాడుకునేందుకు వీలైన అభంగ్ ఛందస్సులో గేయాలుగా అల్లేవాడు. వేలకు వేల ఆ అభంగాలు నేటికీ భక్తి తత్వ ప్రవాహాలు. అన్నగారి సాంగత్యం వల్ల సోపాన్, ముక్తలు కూడా వేదాంత పరివ్రాజక బాటలోనే సాగారు.

జ్ఞానేశ్వర్ బృందం పయనంలోని కీలకమైన మజిలీ - పండరీపురం చేరడం. ఉత్తర భారతానికి సమాంతరంగా మహా రాష్ట్రలో సాగిన భక్తి ఉద్యమానికి కేంద్రం ఈ పురం. ఆ ఉద్యమానికి తొలి నాయ కుడు జ్ఞానేశ్వర్ కావడానికి కారణమే ఈ మజిలీ. సోలాపూర్ జిల్లాలో భీమానది ఒడ్డున ఉన్న ఈ పురంలో పాండురంగ విఠలనాథ ఆలయం ఉంది.
విష్ణుమూర్తి అవతారమైన పాండు రంగ విఠలనాథుణ్ని దర్శించేసరికి... బ్రహ్మానందం పొందాడు జ్ఞానేశ్వర్. అప్పటికే అక్కడ భక్తులు వందలకొద్దీ ఉండేవారు. వారికి తెలిసిందల్లా ఒకటే - అచ్చమైన భక్తి. కోరికలేమీ ఉండవు. భగవన్నామ స్మరణంతో ఉన్మత్తులవడం. వీధుల్లో తిరుగుతూ విఠలనాథుడి గేయాలు పాడుకుంటూ గడిపేవారు.

జ్ఞానేశ్వర్‌కి తానెంతో నేర్చుకోవాలని, వారికెంతో నేర్పాలని అర్థమైంది. వారితో కలిసిపోయాడు. అలా ఓసారి సాధువు లంతా ఓ చోట ఉండగా - జ్ఞానేశ్వర్, ముక్తాబాయి, సోపాన్‌దేవ్ వచ్చారు. అప్పటికి ముక్త వయసెంత? పన్నెండేళ్లు. అక్కడున్న ఓ యువకుడిని ఏడిపించా లనుకుంది. గోరా అనే వ్యక్తిని పిలిచి వీరిలో తెలివైనవారెవరో చెప్పు అంది. గోరా ఓ కర్ర తీసుకుని సాధువులందరి తలలపైనా అదుముతూ వచ్చాడు. ఓ యువకుడి దగ్గరకు వచ్చి ‘ఇది ఖాళీకుండ’ అని ఎద్దేవా చేశాడు. ఆ యువకుడు చిన్న బుచ్చుకున్నాడు. ఆ యువకుడు ఓ చిల్లర దొంగ. జ్ఞానేశ్వర్ అతణ్ని చేరదీశాడు. అతడే సంత్ నామ్‌దేవ్.

మరాఠీ భాషలో జ్ఞానేశ్వర్ తర్వాత అంతటి భక్తి సాహిత్యాన్ని పరివ్యాప్తం చేసినవాడు దర్జీ కులస్థుడైన నామ్‌దేవ్. జ్ఞానేశ్వర్‌కి అత్యంత సన్నిహితుడయ్యాడు. ఆపై ఇద్దరూ అనేకానేక అభిభాషణలు ఇచ్చారు. ఇద్దరూ 1275లోనే జన్మించడం యాదృచ్ఛికం. సమ వయస్కులు కావడం, సమ జ్ఞానులు కావడం, దర్శన తత్త్వంలో విశేషులు కావడం - వెరసి ఇద్దరూ ఉత్తర భారతదేశమంతటా ఎన్నెన్ని క్షేత్రాలు సందర్శించారో!

జ్ఞానేశ్వర్ కాలం నాటికి మన దేశంలో మతాలు అసంఖ్యాకం. వైదికం, దాన్ని వ్యతిరేకిస్తూ బౌద్ధ, జైనం; తిరిగి వైదికంలో శైవం, వైష్ణవమంటూ విభజన. వీటిలో అనేకానేక చీలికలు. బౌద్ధ జైనా ల్లోనూ చెప్పలేనన్ని పీలికలు. పరస్పరం కొట్లాటలు, పొట్లాటలు, రక్తపాతాలు.

వీటికి తోడు మతమౌఢ్యాలు. విగ్రహా రాధన వద్దన్న బుద్ధుడికే విగ్రహాన్ని పెట్టే శారు. ఆత్మావత్ సర్వభూతాని అని పలు కుతూనే కొన్ని కులాల వారిని దూరంగా నెట్టేశారు. కనిపించిన రాయీరప్పకూ పసుపు కుంకుమ. మొలిచిన ప్రతి మొక్కకూ అగరత్తూ హారతి. జంతు బలులు, నర బలులు లెక్కలేనన్ని. అవయవాల్ని కోసుకుని దేవుడికి సమర్పించుకునే మొక్కులు కావలసినన్ని.

వెరసి - బాహ్యాడంబరాలు, పటా టోప ఆచారాలు, పైపై మెరుగులు పెరిగి పోయి - అచ్చమైన భక్తి కనుమరుగైంది. ఆత్మశుద్ధి లేని ఆచారాలు, చిత్తశుద్ధి లేని శివపూజలు పెరిగాయి. శుద్ధమైన వేదాంతం, అచ్చమైన ఆధ్యాత్మికం, స్వచ్ఛమైన భక్తి కనుమరుగయ్యాయి. స్వర్గాలను అందుకోవాలని వడిగా గుడి మెట్లెక్కుతూ సాటి మనిషి వేదన చూడని శిల అయ్యాడు నాటి భారతీయుడు.

దీన్ని కాదన్నాడు జ్ఞానేశ్వర్. భక్తిని మానవతతో రంగరించాడు. తూతూ మంత్రం కాని భగవదారాధన గొప్పద న్నాడు. పాండు రంగ విఠలుడి కేంద్రంగా సర్వమానవ దర్శనం చేశాడు. మానవ జీవితంలో దుఃఖపు నదులుంటాయి. వాటిని ఆనంద సాగరంలోకి మళ్లించుకోవాలి. అదే జ్ఞానం. బతుకును విడి విడిగా చూస్తే భారంగా తోస్తుంది. ప్రతిదీ విషాదమే అనిపిస్తుంది. జీవితాన్ని పరిపూర్ణంగా చూడాలి. ముక్కలన్నీ కలిసి అందమైన అద్దమవుతుంది. ఇదీ దర్శనం. జ్ఞానేశ్వర్ బోధించింది ఇదే! ఈ బోధనలన్నీ ‘వర్‌కారీ సంప్రదాయం’గా భాసిల్లాయి.

తన 21వ యేట జ్ఞానేశ్వర్ స్వగ్రామం చేరుకున్నాడు. ఇక చాలు. జన్మ సార్థక్యం ముగిసింది అనుకున్నాడు. 1296లో కార్తీక త్రయోదశినాడు మహాసమాధి పొందాడు. జ్ఞానేశ్వర్ సమాధి అనంతరం నాసిక్‌లో నివృత్, సాస్వద్ గ్రామంలో సోపాన్ సమాధి అయ్యారు. పిడుగు పాటుకి తపతీ నదీ తీరాన ముక్త మరణిం చింది. అప్పటికే ఆమె తొలి మరాఠీ కవయిత్రిగా భక్తి తత్త్వాక కవితాగానం చేసింది. జీవితానుభవాలు, సమకాలీన స్థితిగతులు, మరాఠీయులకే కాదు - భారతీయులకే జ్ఞానేశ్వర్‌ను అలరించాయి
- ఆకెళ్ల రాఘవేంద్ర
 

No comments: