all

Monday, March 18, 2013

mail పొందికగా ఉండాలంటే...

 

మెయిల్ చెక్ చేసుకోకుండా రోజు గడవని పరిస్థితి మనది... ఆఫీసు కావచ్చు.. వ్యక్తిగత పనులు కావచ్చు.. బంధుమిత్రుల క్షేమ సమాచారం తెలుసుకోవడం కావచ్చు.. అన్నింటికీ ఈమెయిలే కేంద్రమైపోయింది. దీంతో ఇన్‌బాక్స్‌లో రోజురోజుకూ ఇన్‌బాక్స్‌లో మెయిళ్ల సంఖ్య పెరిగిపోతూంటుంది. అవసరమైనవి ఏవో, చెత్తబుట్టలోకి పడేయాల్సినవి ఏవో కూడా తెలియని గందరగోళం. కొంచెం శ్రమకోరిస్తే ఈ సమస్యలను తప్పించుకోవడం సులువే. పైగా ఒకసారి శ్రమతో భవిష్యత్తులో ఎంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు కూడా. అదెలాగో చూద్దామా...?

స్పామ్‌మెయిల్స్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల నోటిఫికేషన్లు.. వాటి మధ్యలో అవసరమైన ఆఫీసు మెయిళ్లు. మనలో చాలామంది తరచూ పడే ఇబ్బందే ఇది. వచ్చిన ప్రతిమెయిల్‌నూ చూడటం.. అలా వదిలేయడంతో ఇది మరింత పెరుగుతూంటుంది. మన అలవాట్లను కొద్దిగా మార్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని నిపుణులు చెబుతారు. ప్రతిరోజు నిర్ణీత సమయంలో మాత్రమే ఒకటిరెండుసార్లు మాత్రమే మెయిళ్లు చూసుకోవడం దీనికి ఒక ఉదాహరణ. తద్వారా మనం నిర్దేశించుకున్న సమయంలోనే మెయిళ్లు చూడటం పూర్తి చేసుకునే వీలు ఏర్పడుతుంది. అయితే ఈ పద్ధతి అందరికీ సరిపోకపోవచ్చు. ఇటువంటివారు... గంటలో కొంతభాగాన్ని మెయిళ్లు చూసేందుకు కేటాయించి.. ఉదయం, సాయంత్రాలు అనవసరమైన వాటిని తొలగించేందుకు కేటాయించుకుంటే బాగుంటుంది. తద్వారా సమయం వృథా కాదు.

చూడకుండానే తొలగించవచ్చు

స్పామ్, మరికొన్ని ఇతర అనవసర మెయిళ్లను సబ్జెక్ట్‌లైన్ ద్వారానే గుర్తించవచ్చు. అటువంటివాటిని ఓపెన్ చేసి డిలీట్ చేయడం కంటే నేరుగా డిలీట్ చేయడం మంచిది. హాట్‌మెయిల్ వంటి మెయిల్ సర్వీసుల్లో ఈ సదుపాయం ఉంది. ఒక మెయిల్‌ను చదవడం పూర్తయిందనుకోండి. అవసరాన్ని బట్టి దాన్ని వెంటనే డిలీట్ చేయడమో లేదా ఆర్కైవ్స్‌లోకి పంపడమో మంచిది. లేదంటే నిర్ణీత సమయం తరువాత దానంతట అదే ట్రాష్‌బిన్‌లోకి వెళ్లేలా మీ మెయిల్ సర్వీస్ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు.

ఫిల్టర్లు లేబుళ్లతో అందంగా...

వచ్చిన అన్ని మెయిళ్లనూ ఇన్‌బాక్స్‌లో పెట్టుకోవడం చాలామందికి ఉన్న అలవాటు. దీనివల్ల సమయానికి కావాల్సిన మెయిల్ కంటికి చిక్కకుండా పోయే ప్రమాదముంది. దీన్ని అధిగమించేందుకు వీలైనంతవరకూ మెయిళ్లను లేబుల్ చేసుకోవడం మంచిది. బంధుమిత్రుల సంభాషణలన్నీ ఒకచోట, ఆఫీసు పనులకు సంబంధించినవి, సోషల్ నెట్‌వర్కింగ్ కామెంట్లు, మీ ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్లు వేర్వేరుగా అన్నమాట. ప్రతిమెయిల్‌కూ లేబుల్ ఇవ్వడం కష్టమనుకుంటే.. మీకు తరచూ వచ్చే మెయిళ్లను ఆటోమెటిక్‌గా ఒక ఫోల్డర్‌లోకి పంపేందుకు ఫిల్టర్లను ఏర్పాటు చేసుకోవచ్చు కూడా. కొంచెం నిశితంగా పరిశీలిస్తే మీ మెయిల్‌బాక్స్‌లోకి తరచూ వచ్చే మెయిళ్లు ఎలాంటివి? వాటి అవసరమేమిటన్నది మీరు ఇట్టే గమనించవచ్చు. మీకు అవసరం లేదనుకున్న మెయిళ్లు ఇన్‌బాక్స్‌లోకి రాకుండా చర్యలు తీసుకుంటే చాలావరకూ సమస్యలు తీరిపోతాయి. ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ అనవసరమైనవాటిని అన్‌సబ్‌స్రై ్కబ్ చేసుకోవడం మంచిది.

కీబోర్డు షార్ట్‌కట్‌లను ఉపయోగించండి..

మెయిల్‌ను ఆర్కైవ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా మనలో చాలామంది మౌస్‌ను ఉపయోగిస్తూంటారు. దీనివల్ల కొంత సమయం వృథా అవుతూంటుంది. బదులుగా కీబోర్డు షార్ట్‌కట్‌లు ఉపయోగించండి. జీమెయిల్ సెట్టింగ్స్‌లో ‘కీబోర్డ్ షార్ట్‌కట్స్’ ఆన్ చేసుకోవడం ద్వారా అనేక షార్ట్‌కట్‌లను ఉపయోగించుకునే వీలు ఉంటుంది. ఉదాహరణకు షిఫ్ట్+ 3 కొడితే మెయిల్ డిలీట్ అయిపోతుంది. కొత్తమెయిల్ టైప్ చేయాలనుకోండి నేరుగా సీ అక్షరాన్ని టైప్ చేస్తే చాలు. వీటిని ఉపయోగిస్తే మెయిల్ కంపోజింగ్‌లో ఎంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
 

No comments: