all

Monday, March 18, 2013

వడదెబ్బవేడి దాడి

 

ఒక్కో సీజన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మానవ మనుగడకు సీజన్‌లు మారడం ఎంతో అవసరం. కానీ... మనుగడకు తోడ్పడే ఆ అంశమే కొన్ని ప్రతికూలతలనూ కలిగి ఉంటుంది. వేసవి ప్రతికూలతల్లో ముఖ్యమైనది... వడదెబ్బ. శరీర ఉష్ణోగ్రత అదేపనిగా పెరుగుతూ పోయే ఈ కండిషన్ ఒక్కోసారి ప్రాణాంతకమవుతుంది. కేవలం ఎండలో కాస్తంత ఎక్కువగా తిరగడమే ప్రాణాపాయానికి ఎందుకు దారితీస్తుంది? దానిని నివారించుకోవడం ఎలా? వేసవి తాపం నుంచి రక్షణచర్యలేమిటి? ఈ సీజన్‌కు అనువైన ఆహారాలేమిటి? వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఇవ్వాళ్టి సమగ్ర కథనం.

శంకర్ పూర్తిగా ఆరోగ్యవంతుడు. మంచి ఫిట్‌నెస్ కూడా ఉంది. అయితే... తన జీవనోపాధి కోసం ప్రతిరోజూ కనీసం 60 కి.మీ. టూవీలర్‌పైన తిరగాల్సి ఉంటుంది. ఎప్పటిలాగే ఈ సీజన్‌లోనూ డ్యూటీకి వెళ్లాడు. కానీ వడదెబ్బ తగిలి ఆ సాయంత్రానికే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. శంకర్‌ను సకాలంలో ఆసుపత్రికి తీసుకొచ్చినందువల్ల గండం గడిచిందనీ, ఏమాత్రం ఆలస్యం జరిగి ఉన్నా పరిస్థితి వేరేలా ఉండేదని డాక్టర్ చెప్పాక ఆ కుటుంబ సభ్యులు ఆందోళన పడుతూనే, ప్రమాదం తప్పిపోయినందుకు తేలిగ్గా నిట్టూర్చారు. శంకర్‌లాంటి ఎందరో వ్యక్తులు ఎండల్లోకి వెళ్లక తప్పదు. అలాంటివారే గాక ఎండలో తిరిగేవారు, కొద్దిరోజుల్లో పిల్లలు ఎండలోకి వెళ్తుంటే ఆపాల్సిన తల్లిదండ్రులంతా... ఈ సీజన్‌లో వేసవి అనర్థాలు ఎన్నిరకాలుగా వస్తాయి? ఎందుకలా జరుగుతుంది? వాటిని నివారించడానికి ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత కూడా వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వంటివి తప్పక తెలుసుకుంటే మంచిది.

జ్వరం అంటే ఏమిటి...?
వదదెబ్బ, దాని దుష్ర్పభావాల గురించి తెలుసుకునే ముందుగా జ్వరం అంటే ఏమిటో చూద్దాం. మానవుల సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.4 ఫారన్‌హీట్ డిగ్రీలన్న విషయం తెలిసిందే. అంటే... ఆ శరీర ఉష్ణోగ్రత వద్ద మన శరీరంలో జరగాల్సిన జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతుంటాయన్నమాట. చలికాలంలో బయటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నా మన శరీర ఉష్ణోగ్రత స్థిరంగా 98.4 ఫారన్‌హీట్ ఉంటుంది. అలాగే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా మన ఒంటి వేడి అంతే ఉంటుంది. ఇలా ఏ సీజన్‌లోనైనా మన శరీర ఉష్ణోగ్రత ఒకేలా ఉంచే బాధ్యతలను మనమెదడులోని కీలకభాగమైన హైపోథాలమస్ నిర్వహిస్తుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఉంటుంది కాబట్టి ఆ ప్రభావంతో పొద్దున్న సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 98.9 డిగ్రీల ఫారన్‌హీట్ ఉన్నప్పటికీ ఎండ పెరుగుతూ పోతున్నకొద్దీ ఇది కూడా పెరిగి 99.9 డిగ్రీల ఫారన్‌హీట్‌కు చేరే అవకాశం ఉంది. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత నుంచి కాస్త అటూయిటూగా ఉన్నా... అది 99.9 డిగ్రీల ఫారన్‌హీట్‌కు మించితే దాన్ని జ్వరంగా పరిగణిస్తుంటారు.

వడదెబ్బ... రకాలు
వడదెబ్బలో అనేక రకాలు ఉంటాయి. అవి హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జషన్, హీట్ సింకోప్. అన్నిటికంటే తీవ్రమైనది మనం వడదెబ్బగా పరిగణించే హీట్‌స్ట్ట్రోక్.

హీట్ క్రాంప్స్ : తక్కువ తీవ్రత ఉన్న వడదెబ్బగా దీన్ని పరిగణించవచ్చు. ఇందులో ఎండ తీవ్రత వల్ల శరీరంలోని ద్రవాలు తగ్గి తీవ్రమైన నొప్పి బాధతో కండరాలు (ప్రధానంగా పిక్కలు) పట్టేస్తుంటాయి.

హీట్ ఎగ్సషన్: ఎండలోకి వెళ్లి వచ్చాక కళ్లు తిరగడం, నీరసంగా ఉంటుంది.

హీట్ సింకోప్ : చాలాసేపు ఎండలోకి వెళ్లివచ్చాక ఇంట్లో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా కాసేపు సొమ్మసిల్లి పడిపోయినట్లుగా అవుతారు. హీట్ ఎగ్జషన్, హీట్ సింకోప్‌లో పైన పేర్కొన్న లక్షణాలు మనలో చాలామందికి కనిపించి, ఒకటి రెండు రోజులు ఎండపట్టున ఉంటే మళ్లీ మామూలైపోవడం చూస్తూనే ఉంటాం.

ఎగ్జషనల్ హీట్‌స్ట్రోక్: ఇది ఎక్కువసేపు ఎండలో ఉండి, ఎండలో శ్రమతో పనిచేసేవారిలో ఎక్కువగా వస్తుంది. అంటే సాధారణంగా సైనికులు, అథ్లెట్స్, ఫుట్‌బాల్ ఆటగాళ్లు, మారథాన్ రన్నర్స్, కూలీలు వంటి వారిలో ఇది ఎక్కువ.

నాన్ ఎగ్జషనల్ హీట్ స్ట్రోక్: (క్లాసిక్ హీట్ స్ట్రోక్): నేరుగా ఎండలో లేకపోయినా వాతావరణంలోని వేడి వల్ల ఈ వడదెబ్బ తగులుతుంది. వడగాడ్పులు ఎక్కువగా ఉన్న సమయంలో దీనికి గురవుతుంటారు. ఇండ్లలో ఉండే పెద్దవయసువారు, చిన్నపిల్లలు దీనికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఏసీ సౌకర్యాలు లేని వాళ్లకు, సరిగా గాలి సోకని ప్రదేశాల్లో (వెంటిలేషన్ సరిగా లేని నివాసాల్లో) ఉండేవారికి ఇది తగిలే అవకాశం ఎక్కువ.

హైపర్‌థెర్మియా: శరీరపు ఉష్ణోగ్రత 105 ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా ఉంటే ఆ కండిషన్‌ను ‘హైపర్‌థెర్మియా’ అంటారు. శరీర ఉష్ణోగ్రత ఈ స్థాయికి పెరగడం అన్నది సాధారణంగా వడదెబ్బతో వచ్చే జ్వరంలోనే ఉంటుంది. ఇలా మన శరీరంలోని ఉష్ణోగ్రత అనియంత్రితంగా పెరుగుతూ ఉండటాన్ని ‘థర్మోరెగ్యులేటరీ ఫెయిల్యూర్’ అంటారు. శరీర జీవక్రియలు (మెటబాలిక్ యాక్టివిటీస్) అన్నీ ఒక నిర్ణీత ఉష్ణోగ్రత వద్దనే సక్రమంగా జరుగుతుంటాయన్న విషయం తెలిసిందే. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత అనియంత్రితంగా పెరిగిపోయినప్పుడు ఈ జీవక్రియలన్నీ దెబ్బతింటాయి. దాంతో వడదెబ్బ తగిలినప్పుడు అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అయితే చిన్న చిన్న జాగ్రత్తలతోనే ఆ పరిస్థితి రాకుండా కాపాడుకోవచ్చు.

వడదెబ్బ అంటే ఏమిటి..?
ఎంత ఎండలోనైనా మన శరీర ఉష్ణోగ్రత నార్మల్‌గానే ఉంటుంది. మహా అయితే ఎండవేళల్లో బయట తిరిగితే 99.9 ఫారన్‌హీట్ వరకు పెరిగి, మళ్లీ నీడకు లేదా చల్లటి ప్రదేశానికి రాగానే నార్మల్‌కు వచ్చేస్తుంది. అయితే వడదెబ్బ తగిలినప్పుడు మాత్రం శరీర ఉష్ణోగ్రత నార్మల్‌కు రాకుండా బయటి ఉష్ణోగ్రత ఎంత ఉందో అంతకు చేరిపోతుంది. ఇలా ఉష్ణోగ్రత నార్మల్‌కు తీసుకువచ్చే పరిస్థితిని శరీరం కోల్పోవడాన్నే వడదెబ్బ అంటారు.

శరీర ఉష్ణోగ్రత నార్మల్‌కు రాలేని పరిస్థితి ఎందుకు...?
మన శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేలా నియంత్రించే బాధ్యత మెదడులోని హైపోథాలమస్‌ది. బయట ఉష్ణోగ్రత పెరుగుతున్నకొద్దీ... శరీరానికి చెమట పట్టేలా చేస్తుందది. దాంతో చెమట పట్టినప్పుడు... శరీరం నుంచి ఉష్ణోగ్రతను సంగ్రహిస్తూ అది ఆవిరైపోతుంది. శరీరం నుంచి ఉష్ణోగ్రతను సంగ్రహించడం వల్ల దేహం చల్లబడుతుంది. శరీరాన్ని చల్లగా చేయడం కోసమే చెమట పడుతుంది. అయితే ఎండవేడికి శరీర ఉష్ణోగ్రత పెరిగే క్రమంలో దాన్ని ఒక నిర్ణీతస్థాయి కంటే దాటకుండా చూసేందుకు హైపోథాలమస్ కృషి చేస్తుంటుంది. ఆ స్థాయిని ‘హైపోథాలమస్ సెట్ పాయింట్’ అని చెబుతారు. బయటి ఉష్ణోగ్రత ఎంతగా పెరిగినా శరీర ఉష్ణోగ్రత మాత్రం ఆ నిర్ణీత ‘సెట్ పాయింట్’ను దాటకుండా హైపోథాలమస్ చూస్తుంటుంది. కానీ ఎండవల్ల శరీర ఉష్ణోగ్రత అదేపనిగా పెరుగుతూపోతే ఇక ఒకదశలో హైపోథాలమస్ దాన్ని నియంత్రించలేని పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు బయటి ఉష్ణోగ్రతకు తగినట్లుగా శరీర ఉష్ణోగ్రత అనియంత్రితంగా పెరిగిపోతూ ఉంటుంది. వడదెబ్బ తగిలిన సందర్భంలో అసలు చెమటపట్టకుండా పోయినప్పుడు ఒక దశలో ఇది జరుగుతుంది. ఈ దశలోని స్థితినే ‘వడదెబ్బ’ తగిలిన కండిషన్‌గా పేర్కొంటారు.

తగిలే అవకాశాలు ఎవరిలో ఎక్కువ...
చిన్నపిల్లలు, వృద్ధులు

దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నవారు (క్రానిక్ పేషెంట్స్)

ఆరుబయట పనిచేయాల్సి ఉన్న పోలీసు వంటి వృత్తుల్లో ఉన్నవారు

క్రీడాకారులు

స్థూలకాయులు

మద్యం తీసుకునేవాళ్లు, డ్రగ్స్ అలవాటు ఉన్నవాళ్లు

మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారు... ఉదాహరణకు కొకైన్, యాంఫిటమిన్స్, ఎల్‌ఎస్‌డీ, ఎఫిడ్రిన్ వంటివి తీసుకునేవాళ్లు.

కొన్ని మందులు వాడేవారు... ఉదాహరణకు దాహాన్ని తగ్గించే హ్యాలోపెరిడాల్ మందులు తీసుకునేవారిలో...

స్వేదాన్ని తగ్గించే మందులైన యాంటీహిస్టమైన్స్, యాంటీకోలినెర్జిక్, ఫీనోథయజైన్స్, బీటాబ్లాకర్స్ తీసుకునేవాళ్లలో

పొడి చర్మం ఉన్నవాళ్లు, వేడి చర్మం ఉన్నవాళ్లు

స్వేదరంధ్రాలు తక్కువగా ఉండేవారిలో వడదెబ్బ తగిలేందుకు అవకాశాలు ఎక్కువ.

వడదెబ్బలో ప్రమాదకరమైన పరిస్థితిని గుర్తించడం ఎలా...
శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫారన్‌హీట్ (40.6 సెంటీగ్రేడ్) కంటే ఎక్కువ పెరుగుతుంది.

ముఖంలోకి రక్తం చిమ్ముకొచ్చినట్లుగా ఎర్రగా మారుతుంది (ఫ్లషింగ్)

చాలా వేగంగా శ్వాస తీసుకోవడం

ఒంట్లోని చివరి భాగాల్లో తిమ్మిరి, స్పర్శ తెలియకపోవడం

అయోమయం

ఒక్కోసారి ఫిట్స్ రావడం

మానసికంగా సాధారణ స్థితిలో లేకపోవడం (అబ్‌నార్మల్ మెంటల్ స్టేటస్)... అంటే... కోమాలోకి వెళ్లడం, కన్ఫ్యూజన్‌లో ఉండటం, భ్రాంతులకు గురికావడం, చికాకు, కోపం వంటి భావోద్వేగాలకు గురికావడం కనిపిస్తాయి.

ఇతర కాంప్లికేషన్లు...
మూత్రపిండాల వైఫల్యం (కిడ్నీ ఫెయిల్యూర్)

బీపీ తగ్గడం

శరీరంలోని కొన్ని భాగాల్లో రక్తస్రావం (ఉదాహరణకు ముక్కురంధ్రాల వంటి భాగాల నుంచి)

అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం (కార్డియాక్ అరెస్ట్)

ఇలాంటి అన్ని పరిస్థితుల్లో వెన్వెంటనే ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది.

చికిత్స ఇదీ...
వడదెబ్బ తగిలినప్పుడు అత్యవసరంగా వైద్యచికిత్స అందించాలి. దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణిస్తారు. అలాంటి సమయాల్లో చికిత్స పరంగా అనుసరించే ప్రక్రియలివి...

శరీరం వెంటనే చల్లబడేలా చేస్తారు. ఐస్ వాటర్ టబ్‌లో తల, చేతులు, మోకాళ్ల కిందభాగం ఉండేలా చేయాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారన్‌హీట్‌కు తగ్గిన వెంటనే ఇలా నేరుగా ఐస్‌తో చల్లబరిచే ప్రక్రియను ఆపాలి. అయితే ప్రతి 5 నిమిషాలకు ఓసారి శరీర ఉష్ణోగ్రతను చెక్ చేస్తూ ఉండాలి.

శరీరానికి చల్లటి గాలి తగిలేలా ఫ్యాన్ చేయడం వంటివి చేయాలి.

ఐస్‌ప్యాక్ ఉపయోగించాలి.

శరీరాన్ని తడిగుడ్డతో కప్పి ఉంచాలి.

సాధారణంగా జ్వరానికి ఉపయోగపడే పారాసిటమాల్ వడదెబ్బకు ఉపయోగపడదు.

శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందేలా సెలైన్ (ఐవీ ఫ్లూయిడ్స్) ఇవ్వాలి.

అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది.

వడదెబ్బ ... సాధారణ లక్షణాలు...
చర్మం స్వేదాన్ని ఇక స్రవించలేని పరిస్థితికి రావడం

తలనొప్పి

వికారం, కండరాలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్) ముఖ్యంగా పిక్కలు పట్టేయడం (క్రాంప్స్ ఇన్ కాఫ్ మజిల్స్)

వాంతులు

కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వడదెబ్బ తీవ్రతను సరిగా అంచనా వేయడంలో లోపం లేదా గుర్తించాక సకాలంలో ఆసుపత్రికి తరలించడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.

కీలక అవయవాలపై దుష్ర్పభావాలు...
వడదెబ్బ ప్రభావం అన్ని కీలకమైన అవయవాలపై పడుతుంది. గుండె, మూత్రపిండాలు, కండరాలు, కాలేయం, రక్తం గడ్డకట్టే వ్యవస్థ (కోయాగ్యులేషన్ సిస్టమ్)... ఇలా వీటన్నింటిపై వడదెబ్బ దుష్ర్పభావాలు ఉంటాయి. అయితే సరైన సమయంలో వడదెబ్బ లక్షణాలను గుర్తిస్తే ఆ దుష్ర్పభావాలను నివారించవచ్చు.

పోల్చుకోవద్దు... పొరపడవద్దు...
వేసవిలో వచ్చే ప్రతి జ్వరం వడదెబ్బ కానక్కర్లేదు. కొన్ని ఇతర ప్రాణాంతకమైన జబ్బుల లక్షణాలు కూడా వడదెబ్బ లక్షణాల్లాగే ఉంటాయి. ఉదాహరణకు మెదడువాపు (మెనింజైటిస్), సెరిబ్రల్ మలేరియా, థైరాయిడ్ స్టార్మ్, న్యూరోలెప్టిక్ మాలిగ్నెంట్ సిండ్రోమ్, మాలిగ్నెంట్ హైపర్‌థెర్మియా, డెంగ్యూ జ్వరం వంటి సందర్భాల్లోనూ వడదెబ్బ లక్షణాలతో కొన్ని పోలికలు కనిపిస్తాయి.

నివారణ...
సాధ్యమైనంత మట్టుకు నీడలోనే ఉండాలి.

బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉదయం 10 గంటలకు ముందు గాని... సాయంత్రం చల్లబడ్డ తర్వాత గాని బయటిపనులు చూసుకోవాలి.

ఇంటి కిటికీలను తెరచి... గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. అయితే వేడిగాలి రాకుండా, గది చల్లగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎండలోకి వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకువెళ్లడం, వెడల్పు అంచులున్న హ్యాట్, కూలింగ్ గ్లాసెస్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

వీలైనంతగా మంచినీళ్లు తాగుతూ ఉండాలి.

శరీరం లవణాలను కోల్పోకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు వేసిన ద్రవాలు ఇవ్వాలి.

చెమటను గ్రహించే, చల్లగా ఉంచే వదులైన కాటన్ దుస్తులు ధరించాలి.

వడదెబ్బకు దోహదం చేసే మందులు డాక్టర్ సలహామేరకు మోతాదు తగ్గించడం గాని ఆపేయడం గాని చేయాలి.

వడదెబ్బ నివారణ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి.

ఈ వేసవిలో శీతలపానీయాలు (ఏరేటెడ్ కూల్‌డ్రింక్స్) అంత మంచిది కాదు. వాటికి బదులు కొబ్బరిబొండం, మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరం కోల్పోయే లవణాలను భర్తీ చేయడం సాధ్యమవుతుంది.
 

No comments: