all

Monday, March 18, 2013

వెన్నెల్లో బూచమ్మ

 

అమావాస్య, అర్ధరాత్రి...అంటూ హారర్ కథలు మొదలవుతాయి.కానీ ఈ కథ మాత్రం వెన్నెల రాత్రులలో మొదలవుతుంది. ఎందుకంటే లా ల్యోనాకు వెన్నెల అంటే ఇష్టం. ఆ వెన్నెల్లో శోకగీతాలు ఆలపించడం అంటే ఇష్టం. ఎవరు ఆమె? ‘బూచాడు వస్తున్నాడు’ అని మనం భయపెడతాం. అమెరికాలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మాత్రం ‘అదిగో లా ల్యోనా వస్తోంది’ అని భయపెడతారు. ఆమె... కథ కాదు వాస్తవం అంటారు కొందరు. వాస్తవం కాదు కథ అంటారు ఇంకొందరు... ఇంతకీ ఈ బూచమ్మ ఎవరు?

కాలిఫోర్నియాలోని సాన్ పెడ్రో నగరంలో ఒకరోజు...
విన్సెంట్ థామస్ బ్రిడ్జి. పొద్దంతా కష్టపడి రాత్రి గుర్రుపెట్టి నిద్రపోతున్న శ్రామికుడిలా ఉంది. ఒక మూలన కొందరు తాగుబోతులు ప్రపంచాన్ని మరిచి మందు కొడుతున్నారు. దూరంనుంచి అడుగుల సవ్వడి వినిపించింది. తాగుబోతులు తలెత్తి చూశారు.
ఒక అందమైన అమ్మాయి....

‘‘ఒంటరిగా ఈ రాత్రి ఎటు వెళుతోంది?’’ తమలో తాము గుసగుసగా అనుకున్నారు వాళ్లు.
ఆమె ఆ మందుబాబులను దాటుతూ వెళ్లింది. వారిని చూసి నవ్వింది కూడా!
వాళ్లు ఆ అందాలరాశిని అనుసరిస్తూ వెళ్లారు.
కొద్దిసేపటి తరువాత ఆమె వెనక్కితిరిగి చూసింది.
ఈసారి మరింత అందంగా నవ్వింది. ఆ నవ్వులో నుంచి ఏ శక్తి పుట్టిందో ఏమోగానీ ఆ యువకులు అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోయారు... ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి సాన్ పెడ్రో నగరం మొత్తం వ్యాపించింది. ఆ తాగుబోతులు తాగిన మత్తులో ఒకరినొకరు హత్య చేసుకున్నారని కొందరు, శత్రుమూకలు వచ్చి వారిని హత్య చేశాయని కొందరు నమ్మారు.
తరువాత కొన్ని నిజాలు తెలిశాయి...
వాళ్లు ప్రాణస్నేహితులు. ఎప్పుడూ చిన్నపాటి గొడవ కూడా పడలేదు. కాబట్టి వారు ఒకరినొకరు చంపుకునే ఛాన్సే లేదు.
వాళ్లు అజాతశత్రువులు. భూతద్దం వేసి వెదికినా ఒక్క శత్రువు కూడా కనిపించడు. కాబట్టి శత్రువులు చంపే ఛాన్సే లేదు.
మరి ఎవరు చేసారు ఈ పని?
సమాధానం కోసం జుట్టు పీక్కునేలోపే ఎవరో అరిచారు ‘‘బ్రిడ్డి దగ్గర హత్య జరిగిందంటే... ఆ మహాతల్లే చేసి ఉంటుంది... ఇలాంటివి ఎన్ని చూడలేదు. ఆ ల్యోనా గురించి ఎన్ని భయానక కథలు వినలేదు’’ అని.
లా ల్యోనా ఎవరు? రాత్రి వేళల్లో ఎందుకు ఒంటరిగా వెళుతుంది? నవ్వుతో చంపేసే శక్తి ఎలా వచ్చింది?

‘లా ల్యోనా’ అనే పేరుకు అర్థం ‘ఏడ్చే స్త్రీ’ అని.
వెన్నెల్లా అందంగా ఉంటే ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఉన్మాదంగా ఎందుకు మారుతోంది? మనుషులను నవ్వుతో ఎందుకు చంపుతుంది? అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? లా ల్యోనా గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో కొన్ని...

మొదటి కథ:
ల్యోనాను వాళ్ల అత్తయ్య మనిషిలా చూసేది కాదు. ఎప్పుడూ ఏవో సూటిపోటి మాటలు అంటూనే ఉండేది. ఒకరోజు అత్తకు ఎదురుతిరిగింది ల్యోనా. అత్త కోపంతో ఊగిపోతూ ఆ రాత్రి ల్యోనాను మెడపట్టి గెంటేసింది. ఎటుపోవాలో తెలియదు. ఎక్కడ ఉండాలో తెలియదు. ఈ అయోమయంలో ఉండగానే ఆమె ప్రమాదానికి గురై చనిపోయింది. అందుకే ఎప్పుడూ రోడ్లమీద కనిపిస్తుంటుంది. సమాజం మీద తనకు గల కోపాన్ని రకరకాల పద్ధతుల్లో తీర్చుకుంటుంది.

రెండో కథ:
అందమైన అమ్మాయి మారియ(ల్యోనా) ఒక ధనవంతుడిని వివాహం చేసుకుంది. కొంతకాలం తరువాత ఆ సంపన్నుడు ఆమెను పట్టించుకోవడం మానేశాడు. మారియ వేరే యువకుడి ప్రేమలో పడుతుంది. పెళ్లి కూడా చేసుకుంటుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. విషయం తెలిసిన మారియ భర్త ఆ పిల్లలను మెక్సికోలోని ఒక నదిలో వేసి పైశాచికానందాన్ని పొందుతాడు. బిడ్డల మరణాన్ని తట్టుకోలేక మారియ గుండె ఆగి చనిపోతుంది. ఆ క్షణం నుంచి తన పిల్లల కోసం నది పరిసర ప్రాంతాల్లో వెదుకుతూనే ఉంటుంది. ఒక పెద్ద రాయిపై కూర్చొని తన పిల్లలను తలుచుకొని ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. అందుకే ఆమెకు ‘ఏడ్చే స్త్రీ’ అని పేరు వచ్చింది.

పిల్లలు ఎవరైనా నది సమీపంలోకి వస్తే తన పిల్లలే కావచ్చుననే ఆశతో వారిని వెంబడిస్తుంది. కొద్దిసేపటి తరువాత వాళ్లు తన బిడ్డలు కాదనే నిజం తెలుసుకుంటుంది. కోపం, ద్వేషంతో రగిలిపోతుంది. ఆ పిల్లలను సమీపంలోని అడవికి తీసుకెళ్లి చంపేస్తుంది లేదా దాచేస్తుంది.

వెన్నెలరాత్రులు అంటే ఎవరికైనా ఇష్టమే కదా!
సాంట ఫె నది పరిసర ప్రాంతాల్లో మాత్రం వెన్నెల రాత్రులు వచ్చాయంటే ఎటు చూసినా భయమే. ఎందుకంటే వెన్నెల అంటే ల్యోనాకు ఇష్టం. వెన్నెలరాత్రులలో ఆమె శోకగీతాలు ఆలపిస్తుంటుంది. ఆ గొంతు వినడానికి భయానకంగా ఉండేది. ఎవరైనా ఆమెను చూసిన వెంటనే పాట ఆపేది. నవ్వుముఖంతో తన దగ్గరకు ఆహ్వానించేది. తనను చూసిన వ్యక్తికి సంబంధించిన రక్తసంబంధీకులలో ఎవరిదో ఒకరి రూపం ధరించేది. ‘‘నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి?’’ అని అతడు అమాయకంగా వచ్చాడా... ఇక చచ్చినట్లే! అలా బలై పోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. కొందరిని మాత్రం గుహల్లో దాచేసేది.

ఒకసారి ఒక పిల్లాడు పొదల్లో పడిపోయి కనిపించాడు.

‘‘ఇక్కడ నిన్ను ఎవరు పడేశారు?’’ అని అడిగితే జరిగిందంతా చెప్పాడు. తాను ఒక స్త్రీ నుంచి తప్పించుకొని వచ్చానన్నాడు. చిత్రమేమిటంటే ఈ సంఘటన జరిగిన కొన్నిరోజులకు ఆ పిల్లాడు మూగవాడైపోయాడు. ల్యోనా నుంచి తప్పించుకున్నవాళ్లలో కొందరు జబ్బుపడ్డారు. కొందరు చనిపోయారు.

దారిన పోతున్నప్పుడు తనకు ఎదురుపడిన యువకులను రకరకాల చేష్టలతో ఆకర్షించేది ల్యోనా. వాళ్లు తనతోపాటు రాగానే ఒక నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి తన పొడవాటి వెంట్రుకలతో వారిని ఉరితీసి చంపేసేది. కొన్ని సందర్భాలలోనైతే పామురూపం ధరించి కాటేసి చంపేసేది.

ల్యోలా నుంచి తప్పించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి అని చెబుతుంటారు.

నాకు ఆపద తలపెట్టవద్దు అని ప్రార్థిస్తే చాలు వదిలేస్తుంది.

టార్చ్‌ను ఆమె కళ్లలోకి సూటిగా కొడితే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

*******

న్యూ మెక్సికోలోని సంట ఫే నది దగ్గరే కాదు నార్త్, సౌత్ అమెరికాలోని ఎన్నో నదుల దగ్గర ల్యోనా గురించి వింత విషయాలు కథలు కథలుగా వినిపించేవి. నదుల దగ్గరే కాదు పెర బిల్డింగ్(పబ్లిక్ ఎంప్లాయిస్ రిటైర్‌మెంట్ అసోసియేషన్) దగ్గర తరచుగా ల్యోనా కనిపించేదట. నిజానికి ఆ భవనాన్ని ఒకప్పటి శ్మశానంలో నిర్మించారట. తమకు ఎన్నోసార్లు అరుపులు వినిపించాయని, అదృశ్యహస్తాలు కనిపించాయని ఆ బిల్డింగ్‌లో పనిచేసిన ఉద్యోగులు చెప్పారు. మెట్లు ఎక్కుతుంటే కొన్నిసార్లు ఎవరో వెనక నుంచి లాగుతున్నట్లుగా అనిపించేదట. టెక్సాస్‌లోని సాన్ బెర్నార్డ్ రివర్ బ్రిడ్జి దగ్గర కూడా ల్యోనా ఎక్కువగా కనిపించేదట. చాలా సంవత్సరాల క్రితం సాంచెజ్ అనే వైద్యుడు బ్రిడ్జి మీదినుంచి వెళుతుండగా నల్లని దుస్తుల్లో ఒక అమ్మాయి కనిపించింది. ఆమెను చూస్తే మనిషిని చూసినట్లు కాదు ఏదో ప్రేతాత్మను చూసినట్లు అనిపించిందట. వెంటనే తన నడక వేగాన్ని పెంచాడు. పరుగెత్తాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూశాడు. ఆమె కనిపించలేదు! సాంచెజ్ ఇప్పటికి ఆముఖాన్ని మరిపోలేదు.

లా ల్యోనాను అమెరికాలో అత్యంత పురాతన దెయ్యంగా చెబుతారు. చిత్రమేమిటంటే ఆ దెయ్యాన్ని చూశామని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. నిజం ఎంత ఉందోగానీ ఈ లెజెండ్ ఘోస్ట్ పుణ్యమా అని రచయితలకు, దర్శకులకు చేతినిండా పని దొరికింది. దొరుకుతూనే ఉంది!

1933లో ‘లా ల్యోనా’ పేరుతో మెక్సికన్ సినిమా ఒకటి వచ్చింది. ఆడ్రిన లామర్ ప్రధాన పాత్ర పోషించారు.

స్టిఫెన్ కార్పెంటర్ రచనతో హాలి డేల్ దర్వకత్వంలొ ‘లా ల్యోనా’ అనే టీవి సీరియల్ వచ్చింది.


*************

కెయమ్ 31 పేరుతో 2006లో రిగోబెర్టో దర్శకత్వంలో లా ల్యోనా కథ స్ఫూర్తితో ఒక సినిమా వచ్చింది.

లా ల్యోనా పై ఎన్నో పుస్తకాలు వచ్చాయి. విషయంలో ఒక పుస్తకానికి మరో పుస్తకానికి సంబంధం లేకపోయినప్పటికి అవి చదివించేలా ఉంటాయి.

పుస్తకాలు రాయడానికి కొందరు రచయితలు పాత పుస్తకాలను నమ్ముకున్నారు. కొందరు మాత్రం ‘ల్యోనాను నేను చూశాను’ అనే వాళ్ల దగ్గరికి కాలికి బలపం కట్టుకొని వెళ్లారు.
 

No comments: