పురాణ స్త్రీ - శర్మిష్ఠ
వృషపర్వుడనే రాక్షసరాజు కుమార్తె శర్మిష్ఠ. రాజగురువైన శుక్రాచార్యుని కూతురు దేవయాని ఈమెకు అనుంగు నెచ్చలి. దేవయాని, శర్మిష్ఠలు ఒకరోజు వనవిహారం కోసమని బయలుదేరుతారు. దారిలో జలపాతం కనిపిస్తుంది. అందులో తడిసి ఆటలాడతారు. జలకేళి పూర్తయ్యాక ముందుగా ఒడ్డుకుచేరిన శర్మిష్ఠ పొరపాటున దేవయాని వస్త్రాలను తనవిగా తలచి ధరిస్తుంది. దేవయాని ఈ సంగతి తెలుసుకుని కోపోద్రిక్తురాలవుతుంది. తెలియక చేసిన తప్పును మన్నించమని శర్మిష్ఠ కాళ్లావేళ్లాపడినా వినిపించుకోదు.
దేవయాని ఎప్పటికీ శాంతించకపోవడంతో శర్మిష్ఠలో సహనం చచ్చిపోతుంది. తన తండ్రి రాజ్యాధిపతి అని, తమ వద్ద శుక్రాచార్యులవారు పనిచేస్తున్నారన్న సంగతి మరువవద్దని మాటకి మాటగా అంటుంది. ఈ దెబ్బకి దేవయాని అహం పూర్తిగా దెబ్బతినిపోతుంది. స్నేహితురాళ్లిద్దరూ బాహాబాహీకి దిగుతారు. కోపం కట్టలుతెంచుకోగా శర్మిష్ఠ దేవయానిని పక్కనే ఉన్న దిగుడుబావిలోకి నెట్టివేసి అంతఃపురానికి వెళ్లిపోతుంది. తీగల సాయంతో బావినుంచి బయటపడ్డ దేవయాని పడుతూలేస్తూ ఇంటికి చేరుతుంది. విషయమంతా తండ్రికి రోదిస్తూ చెబుతుంది. శుక్రుడు తల్లడిల్లిపోతాడు. ఆమెను ఓదార్చేందుకుగాను ఆ రాజ్యాన్నే వదిలిపెట్టి వెళ్లిపోదామంటాడు. గురుదేవుడు సకుటుంబంగా తమనుంచి దూరమవుతున్నందుకు వృషపర్వుడు కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. తరుణోపాయం చెప్పమంటూ శుక్రాచార్యులవారినే శరణువేడుకుంటాడు. ఆయనకు జాలికలుగుతుంది. కానీ దేవయానిని కాదని ఏమీ చేయలేని పితృప్రేమ శుక్రునిది. కుమార్తెకు ఈ సమాచారమంతా విపులీకరిస్తాడు. బెట్టు వీడాలంటాడు. అప్పటికీ కోపం తీరని ఆ పిల్ల శర్మిష్ఠ తనకు దాసీగా పనిచేస్తే రాజ్యంలోనే ఉండగలనని నిష్కర్షగా చెబుతుంది. గురువు పట్ల అభిమానంతో చేసేది లేక వృషపర్వుడు కుమార్తెను దాసీత్వానికి అప్పగిస్తాడు. ఆ సమయంలో శర్మిష్ఠ మనోవ్యథ అంతా ఇంతా కాదు. ఏళ్లు గడిచాక యయాతి మహారాజుతో దేవయాని వివాహం జరుగుతుంది. యయాతి పత్నిగా ఆమె అత్తవారింటికి వెళ్లేటప్పుడు తనతో పాటు దాసిగా శర్మిష్ఠను కూడా తీసుకువెళుతుంది. శర్మిష్ఠ అందచందాలకు యయాతి ముగ్ధుడైపోతాడు. ఒకానొక సమయంలో శర్మిష్ఠను సమీపించిన యయాతి తన ప్రేమను వెల్లడిస్తాడు. వధూజన సంగమం విషయంలో మహారాజుకు సర్వహక్కులూ ఉంటాయని బోధపరుస్తాడు. రాజ్యాధిపతే ఒత్తిడి చేస్తుంటే అడ్డుచెప్పలేని శర్మిష్ఠ ఆయన వశమవుతుంది. యయాతివల్ల ఆమెకి పూరుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. బిడ్డను రహస్యంగా ప్రసవించవలసి రావడమే కాకుండా, ఆ పిల్లాణ్ణి దేవయానికి తెలియకుండా పెంచడం శర్మిష్ఠను కఠిన పరీక్షలకు గురిచేస్తుంది. గుట్టుతెలిస్తే అటు రాజుగారి పరువు, ఇటు తన పరువూ గంగపాలవుతుందని భయాందోళనలకు గురవుతుంటుంది. చాన్నాళ్లు గడిచాక యయాతి శర్మిష్ఠల బంధం పదుగురికీ విశదమవుతుంది. పూరుణ్ణి తనబిడ్డగానే దేవయాని కూడా అంగీకరించే సమయం వస్తుంది. వృద్ధుడైనా యయాతికి దేహాభిమానం పోదు. కుమారుడు గనుక తన ముసలితనాన్ని తీసుకుని, ఆతని యవ్వనాన్ని దానం చేస్తే ఆనందాల అంతు చూస్తానని ప్రకటిస్తాడు. వెనువెంటనే శర్మిష్ఠ కుమారుడైన పూరుడు జనకుని కోర్కెను మన్నించి తన యవ్వనాన్ని కానుక చేస్తాడు. తండ్రి వృద్ధాప్యాన్ని తను తీసుకుంటాడు. కొడుకు దాతృత్వాన్ని మెచ్చుకుని రాజ్యాధికారం ఆతనికే కట్టబెడతాడు యయాతి. వీరకుమారునికి జన్మనిస్తుంది శర్మిష్ఠ. పెద్దింట పుట్టి సేవికగా మరొకరింట పేదరాలై కాలం గడుపుతుంది. జీవితంలో ఎదురైన ఎన్నో చిక్కులను ఓపికతో పరిష్కరించుకుంటూ వస్తుంది. ఆందుకే ఆమె పురాణాలున్నంత కాలమూ యశోచంద్రికలతో వర్థిల్లుతూనే ఉంటుంది. - డా. చింతకింది శ్రీనివాసరావు |
No comments:
Post a Comment