all

Monday, March 18, 2013

U.S.A అగ్రరాజ్యం

 

ఈ దేశానికి తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్...
ఈ పేరునే రాజధానికి నామకరణం చేసుకుందీ దేశం.
పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్‌కింగ్ ఇక్కడి వాడే.
పౌరపాలన విధానాన్ని చెప్పిన ఉడ్రోవిల్సన్...
ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పిన అబ్రహాంలింకన్...
లిటిల్‌బాయ్‌తో విధ్వంసం సృష్టించిన ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్...
ఇండియాతో ఐటి వారధి వేసిన బిల్‌క్లింటన్...
మన డ్వాక్రా మహిళలిచ్చిన గుమ్మడి పండుతో మురిసిన బుష్...
భారతీయ పక్షపాతిగా నిష్టూరాలెదుర్కొన్న బరాక్ ఒబామా...
ఈ దేశానికి అధ్యక్షులు....
యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా... ఈ వారం గ్రేట్‌కంట్రీ!!


రెండు వందల ముప్పై సంవత్సరాల కాలం. ఒక దేశ చరిత్ర అధ్యయనం చేసేటప్పుడు దీనిని చాలా కొద్దికాలంగానే పరిగణించాలి. ఈ కొలమానాన్ని తప్పంటోంది అమెరికా. అభివృద్ధిపథంలో దూసుకుపోవడానికి ఇది చాలా ఎక్కువంటోంది ఈ అగ్రరాజ్యం. యుకె నుంచి స్వాతంత్య్రం పొందిన అమెరికా ఆ వారసత్వాన్ని యథాతథంగా పుణికిపుచ్చుకోకుండా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల ప్రోగ్రెసివ్ సిస్టమ్‌ను కూడా అనుసరించింది. ఈ నేపథ్యంలో యునెటైడ్ స్టేట్స్ ప్రభుత్వం పటిష్టమైన పాలన విధానాన్ని ఏర్పాటు చేసుకుంది. దాంతో సామాన్యుడి జీవితం కూడా ప్రణాళికబద్ధంగానే నడుస్తుంటుంది. ఇక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా, ఓపెన్‌గా ఉంటారు. ప్రొఫెసర్‌తో స్టూడెంట్స్ అందరూ అవసరమైన విషయాన్ని ధైర్యంగా ప్రస్తావించే పరిస్థితి ఉంది. ప్రొఫెసర్‌లు అందరితో ఒకేరకంగా ఉంటారు. ఇక్కడ పనికి, డబ్బుకి విలువ ఉంది. డాలర్‌కు కొనుగోలు శక్తి ఎక్కువ. మన దగ్గర పైస, పది, ఇరవై పైసలు చలామణిలోనే లేవు. పావలా, అర్ధరూపాయిలున్నా షాపుల్లో ఆ చిల్లర ఇవ్వరు. ఇక్కడ ఒక సెంట్ చిల్లర కూడా తిరిగి ఇస్తారు.

ఉద్యోగం ఇవ్వడం... తొలగించడం!!

యుఎస్‌లో మనకు పూర్తి భిన్నంగా, ఆశ్చర్యంగా కనిపించేది వర్క్ కల్చర్. ప్రభుత్వ కార్యాలయాల్లో పని కాదనే భయం ఉండదు. ఒకసారి వెళ్లినప్పుడు అవసరమైన డాక్యుమెంట్ల జాబితా చెప్తారు. వాటిని తీసుకెళ్తే పని అయిపోతుంది. రేపు రండి, ఎల్లుండి రండి... అని తిప్పరు. ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ పని చేయదు. సిస్టమ్‌ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. పని విధానం మొత్తం పారదర్శకంగా ఉంటుంది. ఈ సిస్టమ్‌లో ఎవరికీ పెద్దగా ఆలోచించి పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తయితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. చాలా వరకు ఇలాంటి రొటీన్ జాబ్స్ చేసే వాళ్లే ఉంటారు. ఇక్కడ ఉద్యోగం ఎంత సులభంగా దొరుకుతుందో, ఒక ఉద్యోగిని తొలగించడం కూడా అంతే సులభం. ప్రతి కంపెనీ ప్రభుత్వానికి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్సూరెన్స్ కట్టాలి. ఉద్యోగులు సరిగా పనిచేయకపోయినా, ఇంతమంది అవసరం లేదని సంస్థ భావించినా అదే కారణం చూపించి తొలగించవచ్చు. నిరుద్యోగులకు ప్రభుత్వం 6 నెలల పాటు నిరుద్యోగభృతి ఇస్తుంది. అప్పటికీ మరో ఉద్యోగంలో చేరకపోతే ఫుడ్ కూపన్లు ఇస్తుంది.

కుటుంబ వ్యవస్థ ఉంది కానీ...

యుఎస్ సమాజంలో కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఉంది, కానీ మన కుటుంబ వ్యవస్థకు భిన్నం. వివాహం చేసుకుంటారు కానీ తప్పనిసరి కాదు. పెళ్లి చేసుకోకుండా కమిట్‌మెంట్‌తో జీవించేవాళ్లూ ఉంటారు. ఇక్కడ విడాకులు పొందడం సులభమే, అలాగని వివాహబంధానికి విలువ లేదనుకుంటే పొరపాటే. తల్లిదండ్రులు పిల్లలతో గడిపే టైమ్ తక్కువే కానీ క్వాలిటీ టైమ్ గడుపుతారు. ఉద్యోగంతోపాటు ఇది ఫ్రెండ్స్‌తో గడిపే టైమ్, ఇది పిల్లలతో గడిపే టైమ్ అని స్లాట్‌లు కేటాయించుకుంటారు. పదహారేళ్లు వచ్చేసరికి బయట వెళ్లిపోవడానికి మానసికంగా సిద్ధమవుతుంటారు పిల్లలు. ఇక్కడ పదహారేళ్లకే ఉద్యోగాలు వస్తాయి, లెర్నర్ డ్రైవింగ్ లెసైన్స్ ఇస్తుంది ప్రభుత్వం. దాంతో ఇండిపెండెంట్‌గా జీవించడానికి రంగం సిద్ధం చేసుకుంటారు. 12వ తరగతి వరకు ప్రభుత్వం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది.

ఉన్నత విద్యకోసం లోన్...

ఇక్కడ కాలేజ్ ఎడ్యుకేషన్ చాలా ఖరీదు. హయ్యర్ ఎడ్యుకేషన్‌కి లోన్ సౌకర్యం ఉంటుంది. బ్యాంకు లోన్ తీర్చడానికి చదువు పూర్తయి ఉద్యోగంలో చేరేవరకు తగినంత టైమ్ ఇస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాన్సెప్ట్ వైజ్‌గా స్టిక్టుగా ఉంటుంది. చదువుకునే సౌలభ్యం సరళంగా ఉంటుంది. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ నాలుగేళ్ల్ల కోర్సు పదేళ్లు చదివే వాళ్లూ ఉంటారు. ఇక్కడ టీచర్లు విద్యాసంవత్సరం మధ్యలో స్కూలు మారరు. ఒక టీచరు సెలవు పెడితే మరో టీచరు సిలబస్ ప్రకారం ఆ రోజు పాఠాన్ని పూర్తి చేస్తారు. యుఎస్‌లో దాదాపుగా ప్రతి నగరంలో డౌన్‌టౌన్ ఉంటుంది. అది కమర్షియల్ జోన్. వీటి పరిసరాల్లో అల్పాదాయవర్గాల నివాస ప్రాంతాలుంటాయి. చిల్లర నేరాలు ఎక్కువ ఈ ప్రదేశాల్లోనే ఉండడంతో భారతీయులు ఈ ఏరియాల్లో నివసించడానికి పెద్దగా ఇష్టపడరు.

ఇండియన్ యుఎస్!

యుఎస్ సమాజం... 20 వ శతాబ్దం చివరి దశకం - 21వ శతాబ్దం తొలి దశకానికి మధ్య మార్పుకు లోనయింది. యుఎస్ సమాజంలో వచ్చిన ఈ మార్పు భారతీయత. 1991లో ఇండియన్ హోటల్ లేని ప్రదేశాల్లో ఇప్పుడు ఐదారు ఉన్నాయి. పప్పు, చోళే, బెండకాయ కూర వంటివి ‘రెడీ టు ఈట్’ ప్యాక్‌లు వచ్చేశాయి. ఐటి బూమ్ మెక్‌డి బర్గర్, కెఎఫ్‌సి చికెన్ బకెట్‌లతో హైదరాబాద్ వంటి నగరాల జీవనాన్ని అమెరికనైజ్ చేసినట్లు అనిపిస్తుంది. ఇదే ఐటి అమెరికాని కూడా మార్చేసింది. ఇప్పుడు అమెరికన్లలో భారతీయ వంటకాలపై అవగాహన వచ్చింది, రైస్ తినడం అలవాటైంది. స్పానిష్, చైనా, ఇండియన్‌ల వలసల ప్రభావం ఈ దేశం మీద బాగా ఉందనే చెప్పాలి. అమెరికన్‌ల ప్రధాన ఆహారం మీట్, పొటాటో, బ్రెడ్, సలాడ్ మాత్రమే. క్రమంగా వంటకాల్లో రకరకాల ఫ్లేవర్లు చేరాయి. యుఎస్‌లో మన ఆలయాలు పెద్ద సంఖ్యలో వెలసిందీ ఈ సమయంలోనే. భారతీయ ఆలయాల్లో బాలవిహార్‌లుంటాయి. పిల్లలకు తెలుగు రాయడం, సంస్కృత శ్లోకాలు నేర్పిస్తారు. పురాణాలు చెప్తారు.

మన బంతి పూస్తుంది!

యుఎస్ ఇళ్ల నిర్మాణం రాంచ్, కలోనియల్ అని రెండు రకాలుగా ఉంటుంది. రాంచ్ అంటే ఒకటే ఫ్లోర్ ఇల్లు. కలోనియల్‌లో కింద ఫ్లోర్‌లో కిచెన్, హాల్, సిటవుట్, పై ఫ్లోర్‌లో బెడ్‌రూమ్ ఉంటాయి. ఇక్కడి వాతావరణంలో వెచ్చదనాన్ని కాపాడుకోవడం ప్రధానం. దాంతో ఉడెన్ హౌస్‌లు ఎక్కువ. కార్పెట్ వాడకం తప్పనిసరి. ఇళ్లన్నింటికీ సెంట్రల్లీ ఏసీ, రూమ్ హీటర్స్ ఉంటాయి.టెక్సాస్, ఫ్లోరిడా వంటి చోట్ల భారతీయ వాతావరణమే ఉంటుంది. గన్నేరు, బంతి చెట్లు పెరుగుతాయి, మన కూరగాయలు పండుతాయి. వీళ్ల ఫుడ్ హ్యాబిట్... హెవీ బ్రేక్‌ఫాస్ట్, లైట్ లంచ్, ఎర్లీ సప్పర్. సాయంత్రం ఆరు- ఏడు గంటలకు భోజనం పూర్తి చేస్తారు.

దేశంలో బ్లాక్ మనీ లేదు. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్‌క్లాస్ పీపుల్ ఎక్కువ. ఇక్కడ బ్యాంకు లోన్లు సులభంగా వస్తాయి. వడ్డీ తక్కువ. ఇంటి నిర్మాణానికి లోన్ తీసుకుంటే బ్యాంకులకు కట్టాల్సిన ఇఎంఐలు అద్దె కంటే తక్కువగా ఉంటాయి. ఇక్కడ గ్రామాల్లో వందల ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఒకటి - రెండు ఇళ్లు ఉంటాయి. భూస్వాములు అందరూ సాగు చేయరు. సాగు చేసే వారికి వ్యవసాయానికి అవసరమైన ఇన్‌పుట్స్ ఇస్తారు. దిగుబడిని పంచుకుంటారు. మన దగ్గర పాలికివ్వడం అనే పద్ధతిలాగ.

న్యాయం- వైద్యం

యుఎస్‌లో పోలీస్‌కు సాధికారత ఎక్కువ. ఏ ప్రభావానికీ లొంగరు. ఇక్కడ కోర్టుల్లో చిన్న నేరాలకు సింగిల్ హియరింగ్‌తో తీర్పు చెబుతారు. ఆ హియరింగ్‌కు పోలీస్ హాజరు కాకపోతే కేసు కొట్టేస్తారు. ఇక్కడ వైద్యసేవలు చాలా ఖరీదు. దారిద్య్రరేఖకు దిగువన జీవించే వారికి వైద్యం ఉచితం. సంపన్న దేశంగా భావించే అమెరికాలో దారిద్య్రం ఉంటుందా అంటే... పనిచేయని వాళ్లతోపాటు పేదరికం కూడా ఉంది కానీ తక్కువ. పన్నులు పోను రెండువేల డాలర్లు సంపాదించుకోగలిగితే ఇక్కడ నలుగురు మనుషుల కుటుంబం సౌకర్యంగా జీవించవచ్చు.

జీవనశైలి! టీవీ- మూవీ!!

వారాంతాల్లో పబ్‌లు జనసమ్మర్ధం ఎక్కువే కానీ అందరూ పబ్‌కెళ్లరు. అలాగే మద్యం తీసుకోవడం కూడ. వీళ్లకు కాలక్షేపం, వినోదం టీవీ, మూవీ. క్రీడాసక్తి కూడా ఎక్కువే. హైస్కూల్‌లో స్పోర్ట్స్ అవర్‌కి ఆ ఏరియా వాళ్లు స్కూల్‌కి చేరతారు. వీళ్లకు అలంకరణ మీద మోజు ఉంటుంది కానీ ఆభరణాల మీద తక్కువ. ఖరీదైన దుస్తులు, మేకప్, రకరకాల షూస్ కోసం బాగా ఖర్చు చేస్తారు. మగవాళ్లు, ఆడవాళ్లు అందరూ వివాహచిహ్నంగా బంగారు లేదా వజ్రపుటుంగరం ధరిస్తారు.

చూడాల్సినవాటిలో కొన్ని...
వైట్‌హౌస్... అమెరికాకు వచ్చిన మనవాళ్లు మొదటగా చూడాలనుకునే ప్రదేశం ఇది. రాజధాని వాషింగ్టన్‌డిసిలో ఉంది. అగ్రరాజ్యం అనే ట్యాగ్‌లైన్‌తో అమెరికా ప్రత్యేక గౌరవం అందుకుంటున్న నేపథ్యంలో అధ్యక్షుడి అధికార నివాసం కూడా అంతే ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో వైట్‌హౌస్‌లో కొంతభాగం వరకు పర్యాటకులను అనుమతించే వారు, కానీ వరల్డ్ ట్రేడ్‌సెంటర్ కూల్చివేత తర్వాత నిబంధనలు కట్టుదిట్టం అయ్యాయి.

డేనాలి నేషనల్ పార్కు... ఇందులో మెక్‌కిన్లే శిఖరాన్ని చూసి తీరాలి. ఇది నార్త్ అమెరికా ఖండంలో ఎత్తై శిఖరం.

లాస్‌వేగాస్ స్ట్రిప్... ఈ ప్రదేశం మొత్తం కాసినోలమయం. మాయా ప్రపంచాన్ని తలపించే గాంబ్లింగ్ జోన్ ఇది. రొమాన్స్, మిస్టరీ ఇలా ఒక్కో కాసినో ఒక్కో థీమ్‌తో ఉంటాయి. ఖరీదైన విలాసవంతమైన టైమ్‌పాస్ జోన్.

నయాగారా జలపాతం... న్యూయార్క్- ఒంటారియోల మధ్య ఉంది. ఇది అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వియెల్‌ఫాల్స్, హార్స్‌షూ ఫాల్స్ అని మూడు జలపాతాల సమూహం. హార్స్‌షూ కెనడాలో ఉంది.

గోల్డెన్ గేట్ బ్రిడ్జి... శాన్‌ఫ్రాన్సిస్కో - మెరిన్ కాంటీలను కలిపే వంతెన ఇది. మంచు దట్టంగా కురిసినప్పుడు కూడా స్పష్టంగా కనిపించడానికి దీనికి ఎరుపు పసుపు కలగలిసిన రంగు వేశారు. కాలిఫోర్నియా రాష్ట్రానికి చిహ్నంగా మారింది.

ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్... ఇందులో ఉష్ణగుండాలుంటాయి. మనం చిన్నప్పుడు కథల్లో విన్న ఎలుగుబంటి, జింక, దుప్పి, జడలబర్రె, తోడేళ్లు... వంటి వన్యప్రాణులను చూడవచ్చు.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ... ఈ విగ్రహం దేశానికి చిహ్నం. అమెరికాకు ఫ్రాన్సు ఇచ్చిన బహుమతి ఈ విగ్రహం. న్యూయార్క్ నగరంలో ఎలిస్ దీవిలో ఉంది. ఇక్కడ హోటల్ అద్దె అందుబాటులోనే ఉంటుంది.

టులిప్స్ బాగా పెరుగుతాయి...
ఇక్కడ వర్షాకాలం రెండు నెలలు ఉంటుంది. నార్త్ జోన్, ఈస్ట్ జోన్‌లో మంచుకురుస్తుంది. సౌత్, వెస్ట్‌కు వెళ్లే కొద్దీ స్నోఫాల్ తగ్గుతూ మంచు కరిగి వర్షం పడుతుంది. ఈ వాతావరణంలో టులిప్స్ బాగా పెరుగుతాయి. మొక్కలను బాగా పెంచుతారు కూడ. ఇక్కడి వారికి పెట్‌ని పెంచుకోవడం కూడా బాగా ఇష్టం. పెట్ వ్యాపారం కూడా ఎక్కువ. ఇక్కడ ఏ వ్యాపారమైనా సరే అది రైట్ బిజినెస్ అయితే అనుమతులు సులభంగా వస్తాయి, త్వరగా అభివృద్ధి అవుతాయి కూడ!

అవీ-ఇవీ...
యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాభై రాష్ట్రాల సముదాయం. రాజధాని వాషింగ్టన్‌డిసి.

అమెరికా కరెన్సీ యుఎస్ డాలర్. ఒక యుఎస్ డాలర్ దాదాపుగా 54 రూపాయలు.

యునెటైడ్ కింగ్‌డమ్‌తో 1782-1783 చర్చలు, ఒప్పందాల తర్వాత ఏర్పడిన స్వతంత్ర దేశం యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.

అమెరికాలో సమయంలో దేశమంతటా ఒకేరకంగా ఉండదు. కాలిఫోర్నియాలో సమయం మనకంటే పన్నెండున్నర గంటల వెనుక ఉంటుంది. మనకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కాలిఫోర్నియాలో అర్ధరాత్రి ఒకటిన్నర. ఇదే సమయంలో న్యూయార్క్‌లో తెల్లవారుజాము నాలుగన్నర, అలాస్కాలో అర్ధరాత్రి పన్నెండున్నర.

యుఎస్ ఎల్లలు... పసిఫిక్ మహాసముద్రం, మెక్సికో, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, నార్త్ అట్లాంటిక్ మహాసముద్రం, కెనడా.

- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
(యుఎస్‌లో నివసించిన చిర్రా సురేంద్రరెడ్డి, హిమబిందు దంపతులు చెప్పిన వివరాల ఆధారంగా)
greatcountries.sakshi@gmail.com
 

No comments: