నిజాలు దేవుడికెరుక : క్రైమ్
చేసిన తప్పులు వెంటాడి చంపుతాయంటారు.
కానీ ఆమె ఏ తప్పూ చేయలేదు. ఎవరికీ ఏ ద్రోహమూ చేయలేదు. అయినా ప్రాణాలు కోల్పోయింది. తను ఎందుకు చనిపోతుందో కూడా తెలీకుండానే అనంత లోకాలకు సాగిపోయింది. అంతులేని విషాదాన్ని తనవారి జీవితాల్లో చిమ్మేసి పోయింది. అమెరికాలో సంచలనం సృష్టించిన నటి షారన్ టేట్ మరణోదంతం... ఈవారం నిజాలు దేవుడికెరుకలో! 1969, లాస్ ఏంజిల్స్ (అమెరికా). ‘‘సర్’’ అన్న పిలుపు విని తలెత్తి చూశాడు జైలర్. గుమ్మం బయట ఖైదీ దుస్తుల్లో ఉన్న వర్జీనియా కనిపించింది. ఆమెకిరువైపులా ఇద్దరు లేడీ పోలీసులు. ‘‘ఏమైంది’’ అన్నాడు ఫైలుని పక్కన పెడుతూ. ‘‘ఈమె మీతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంటోంది సర్’’... చెప్పింది ఓ సెంట్రీ. లోపలికి తీసుకు రమ్మన్నట్టు సైగ చేశారు. తీసుకొచ్చారు. ‘‘చెప్పు... ఏం చెప్పాలి?’’ అన్నాడు భృకుటి ముడివేస్తూ. ‘‘నాలుగు రోజుల క్రితం అరెస్టు చేశారే సూజన్... తనని మీరెందుకు అరెస్టు చేశారు సర్?’’ అది నీకు అవసరమా అనబోయాడు. కానీ ఆమె ఎందుకు అడుగుతోందో తెలుసుకోవాలి కదా! అందుకే అన్నాడు... ‘‘తను ‘మ్యాన్షన్’ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. క్షుద్రపూజల్లాంటివి చేస్తుంటే అరెస్ట్ చేశాం.’’ వర్జీనియా క్షణంసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత అంది... ‘‘వాళ్లు క్షుద్రపూజలు చేసేవాళ్లు మాత్రమే కాదు సర్. హంతకులు...’’ చురుక్కున చూశాడు జైలర్. ‘‘హంతకులా?’’ అన్నాడు ఆశ్చర్యంగా. ‘‘అవున్సార్. పోయిన నెలలో ఎవరో షారన్ అనే ఆవిడని చంపేశారట.’’ బుర్ర గిర్రున తిరిగింది జైలర్‌కి. ఎక్కడెక్కడో వెతికిన హంతకులు కాళ్ల దగ్గరకే వచ్చారా! ‘‘నీకెలా తెలుసు?’’ అన్నాడు ఆతృతగా. ‘‘తనే చెప్పింది సర్. ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్స్‌ని కూడా చంపేశారట.’’ ఎక్కడో ఏదో ముడి విడుతున్నట్ట య్యింది జైలర్‌కి. ఏం చెయ్యాలో డిసైడ్ చేసుకుని ఫోన్‌ని చేతిలోకి తీసుకున్నాడు. ‘‘నిన్నే అడిగేది. మాట్లాడవే’’... జుట్టు పట్టుకుంది లేడీ కానిస్టేబుల్. సూజన్ మాట్లాడలేదు. కొరకొరా చూసింది కానిస్టేబుల్ వైపు. ‘‘ఏంటా చూపు?’’ గర్జించిందామె. ‘‘అలా వినదు. పోలీసు పద్ధతిని ఉపయోగించాల్సిందే’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. పది నిమిషాల పాటు థర్‌డ డిగ్రీ రుచి చూసిన తర్వాత నోరు విప్పింది సూజన్. ‘‘అవును. షారన్ టేట్‌ని, ఆమె ఫ్రెండ్స్‌ని చంపింది మా ఫ్యామిలీనే.’’ రక్తం మరిగిపోయింది ఇన్‌స్పెక్టర్‌కి. ఆమెను అక్కడే చంపేయాలన్నంత కసి పుట్టింది మిగతావారికి. ఒక్కసారిగా అందరి కళ్లముందూ షారన్ మృతదేహం కదలాడింది. రక్తపు మడుగులో... తూట్లు పడిన దేహంతో... లివింగ్ రూమ్‌లో వెల్లకిల్లా పడివున్న ఎనిమిదిన్నర నెలల గర్భవతి... షారన్ టేట్! ఇక ఆలస్యం చేయలేదు పోలీసులు. ఆ రోజు జరిగిన ఘాతుకాన్ని సూజన్ నోటివెంట కక్కించారు. ఆగస్టు 8, 1969... షారన్ టేట్ ఇల్లు. పడుకుని ఏదో పుస్తకం చదువు కుంటోంది షారన్. రాత్రి పదకొండు కావస్తున్నా నిద్ర రావడం లేదు. అందుకే అంతగా పుస్తకంలో తల దూర్చింది. అంతలో పక్కనే ఉన్న ఫోన్ రింగయ్యింది. హుషారుగా లేచి ఫోన్ దగ్గరకు వెళ్లింది. ఆమెకు తెలుసు ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో! ‘‘హాయ్ రోమ్’’ అంది సంబరంగా. ‘‘ఓ డియర్... నీకెలా తెలిసిపోతుంది నేనే ఫోన్ చేశానని’’... మురిసిపోతూ అడిగాడు రోమన్ పొలాన్స్‌కీ... షారన్ భర్త! ‘‘ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుం టాను కాబట్టి తెలిసిపోతుందిలే. ఏంటి విశేషాలు!’’ ‘‘నీకు చెప్పను. అయినా నేను నా బేబీతో మాట్లాడ్డానికి చేశాను.’’ సిగ్గుతో షారన్ ముఖం ఎర్రబడింది. ప్రేమగా పొట్టను తడుముకుంది. ‘‘మరో రెండు వారాలు ఆగు బాబూ... నీ కూతురితో డెరైక్ట్‌గా మాట్లాడు దువుగాని’’ అంది గోముగా. రోమన్ ఏదో అనబోతుంటే ఫోన్ టక్కున కట్టయ్యింది. నిరాశగా అనిపించింది షారన్‌కి. భర్త లండన్ వెళ్లి చాలా రోజులయ్యింది. అత డెప్పుడొస్తాడా అని ఆశగా చూస్తోంది. ఈ రోజు రావాలి కానీ సడెన్‌గా ఆగిపోవాల్సి వచ్చింది. అందుకే బెంగగా ఉందామెకి. మంచమ్మీద కూర్చుని, అతడు మళ్లీ ఫోన్ చేస్తాడేమోనని ఎదురు చూడ సాగింది. ఫోన్ రాలేదు. కానీ ఎవరో అపరిచిత స్త్రీ హఠాత్తుగా గదిలోనికి దూసుకొచ్చింది. ఆమె చేతిలో కత్తి ఉంది. ‘‘ఏయ్... ఎవరు నువ్వు’’... భయంగా అంది షారన్. మాట్లాడవద్ద న్నట్టుగా ‘హుష్’ అందా ఆగంతకురాలు. షారన్ భయంగా చూస్తోంది. ఆమె వేగంగా వచ్చి షారన్ జుట్టు పట్టుకుంది. హాల్లోకి ఈడ్చుకొచ్చి సోఫాలోకి తోసింది. అక్కడి దృశ్యం చూసి కొయ్యబారి పోయింది షారన్. తన ఇంటికి గెస్టులుగా వచ్చి, తనకు తోడుగా ఉండిపోయిన ముగ్గురు స్నేహి తులనూ చిత్రహింసలు పెడ్తున్నారు ముగ్గురు వ్యక్తులు. వాళ్ల దగ్గరకు వెళ్ల బోయింది. కానీ పక్కనే ఉన్న స్త్రీ తనను కదలనివ్వలేదు. వాళ్లు తన స్నేహితులను కొడుతున్నారు. వెంటబడి కత్తులతో పొడు స్తున్నారు. ఓ ఇద్దరు గార్డెన్‌లోకి పరుగు తీశారు. మరో స్నేహితుడు జే మాత్రం తన కళ్లముందే కుప్పకూలిపోయాడు. ఆ ఆగంతకుల్లో ఒకడు కత్తితో నిర్దాక్షిణ్యంగా జేని పొడుస్తున్నాడు. కాళ్లతో తన్ను తున్నాడు. ఎముకలు ఫెళ్లున విరిగి పోతున్న చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. గార్డెన్‌లోంచి మిగతా ఇద్దరు స్నేహితుల ఆర్తనాదాలు! కాసేపటికి అవి కూడా ఆగిపోయాయి. అంటే వాళ్లు... వాళ్లు...! బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది షారన్. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వాళ్లెవరో తమను ఎందుకిలా హింసి స్తున్నారో, చంపేస్తున్నారో అంతుపట్టడం లేదామెకి. భర్త గుర్తుకొచ్చాడు. అతడు ఉంటే తనను కాపాడేవాడు అనుకుంది. కానీ ఒకవేళ అతణ్ని కూడా చంపేసే వారేమో! కన్నీళ్లు ఆగడం లేదు. కడుపులో బిడ్డ కూడా కేర్ కేర్‌మంటున్నట్టుగా అనిపిస్తోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన షారన్, మెల్లగా హాలీవుడ్‌లో ప్రవేశించింది. చిన్న చిన్న పాత్రలతో ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేసింది. కామెడీని అద్భుతంగా పండించగలదనే పేరు తెచ్చుకుంది. ఆ సమయంలోనే ప్రముఖ దర్శకుడు రోమన్ పొలాన్‌సకీని ప్రేమించి పెళ్లాడింది. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం వారిది. అతడి బిడ్డకు తల్లి కాబోతోందని తెలిసి మురిసి పోయింది షారన్. కానీ ఆ బిడ్డను కళ్లతో చూసుకోకుండానే కన్ను మూసింది! ‘‘ఏయ్ సూజన్... ఇంకేంటి ఆలస్యం. దాన్ని కూడా లేపెయ్’’... గార్డెన్లోంచి వస్తూ అన్నాడొకడు. ‘‘కడుపుతో ఉందని జాలిపడుతోం దేమో. ఆడది కదా’’ అన్నాడు ఇంకొకడు. ‘‘చాల్లే ఆపండి. జాలా ఇంకే మన్నానా’’ అంటూ షారన్ జుట్టు గట్టిగా పట్టుకుందామె. తలలో నరాలు చిట్లి పోతున్నట్టు అనిపించింది షారన్‌కి. ‘‘ప్లీజ్... నన్ను వదిలేయండి. నాకు చావాలని లేదు. నన్ను చంపొద్దు. నేను నా బిడ్డను చూసుకోవాలి. ఒక్కసారి తనని చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలి. నన్నేమీ చేయొద్దు. నన్ను చంపొద్దు’’ కన్నీళ్లతో వేడుకుంటోంది షారన్. ‘‘నువ్వు కడుపుతో ఉంటే మాకేంటి’’ అంటూ చేతిలో ఉన్న కత్తితో షారన్ బట్టల్ని కోసి పారేసింది సూజన్. లో దుస్తులతో ఉన్న ఆమెను చూసి నలుగురూ పగలబడి నవ్వారు. సూజన్ తన కత్తిని మరోసారి పైకి లేపింది. అది పదహారు సార్లు షారన్ తనువుని తూట్లు పొడిచింది. క్షణాల్లో రక్తం ఏరులై పారింది. తాను ఎందుకు చనిపోతోందో తెలియకుండానే, షారన్ తుదిశ్వాస విడిచింది. ‘‘ఛీ... నువ్వూ ఒక ఆడదానివేగా? నిండు గర్భిణిని చంపడానికి నీకు చేతులెలా వచ్చాయ్?’’... అసహ్యంగా చూశాడు ఇన్‌స్పెక్టర్. ‘‘మాకు అవన్నీ అనవసరం. ఈ ప్రపంచంలో ఉండే అర్హత వాళ్లకు లేదు. అందుకే చంపేశాం. ఇంకా ఈ లోకంలో చాలామంది పాపాత్ములున్నారు. వాళ్లనీ వదలం’’.. అప్పటికీ సూజన్ మాటల్లో అదే కాఠిన్యం. కళ్లలో అంతులేని క్రౌర్యం. పేద కుటుంబంలో పుట్టిన చార్లెస్ మ్యాన్షన్, చిన్న వయసు లోనే నేరాలకు అలవాటు పడ్డాడు. తరచూ జైలుకు వెళ్లేవాడు. తన పేదరికంపై విసుగుతో ధనికులు, సెలెబ్రిటీల మీద కక్ష పెంచుకున్నాడు. వారందరినీ చంపేయాలనుకున్నాడు. తాను దైవాంశ సంభూతుడినని చెప్పి, కొందరిని ఆకర్షించి, ఒక బృందాన్ని తయారు చేశాడు. ‘మ్యాన్షన్ ఫ్యామిలీ’ అని పేరు పెట్టాడు. ఈ భూమి మీద బతికే హక్కు ఉత్తములమైన తమకే ఉందని, పాపాత్ములందరినీ చంపేయాలని వారికి చెప్పాడు. అలా అతని దుర్మార్గానికి బలైపోయినవాళ్లు చాలా మంది ఉన్నారు. నిండు చూలాలైన షారన్ టేట్ హత్యతో అతడి పాపం పండింది. ఇప్పటికీ జైలులో మగ్గుతున్నాడు. బయటపడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ రక్తపిపాసిని చూసి జుగుప్స కలిగింది పోలీసులకు. ఆమెతో పాటు హత్యలకు పాల్పడిన మిగతా ముగ్గురినీ కనిపెట్టారు పోలీసులు. ఆ హత్యలకు సూత్రధారి అయిన చార్లెస్ మ్యాన్షన్‌ని కూడా కోర్టుకు లాక్కెళ్లారు. వాళ్లు చేసిన ఘాతుకం గురించి విని అందరూ అవాక్క య్యారు. ప్రజలంతా భయంతో బిక్కచచ్చి పోయారు. షారన్ టేట్ ని ఆమె స్నేహి తులని చంపిన తర్వాత, మ్యాన్షన్ ఫ్యామిలీ మరికొందరిని పొట్టనబెట్టుకున్నా రని విచారణలో తేలింది. నేరం నిరూపణ అయ్యింది. బతికినన్నాళ్లూ జైల్లోనే ఉండా లంటూ తీర్పు వెలువడింది. ఓ అమాయకురాలిని, రెండు వారాల్లో ఓ బిడ్డకు జన్మనివ్వనున్న నిండు గర్భిణిని దారుణాతి దారుణంగా చంపినవాళ్లకి ఆ శిక్ష సరిపోతుందా! భక్తి పేరుతో క్షుద్రభావాల్ని మనసుల్లో నింపుకుని, అమాయకుల ఉసురు తీసిన రాక్షసుల ప్రాణాలను హరించే శక్తి చట్టానికి లేదా! - సమీర నేలపూడి |
No comments:
Post a Comment