all

Monday, March 18, 2013

అందరూ సమానమే! .......... చిట్టికథ

 

 
ఒక ఇంటి పెరట్లో ఒక పెద్ద కొబ్బరిచెట్టు ఉండేది. దానికి చాలా కాయలు కాసేవి. ఆ చెట్టు చుట్టూ రకరకాల పూలమొక్కలు ఉండేవి. వాటికి కూడా చాలా అందమైన పూలు పూసేవి.

ఒకసారి పూలమొక్కలన్నీ కొబ్బరిచెట్టును చూస్తూ, ‘‘ఎంత పెద్ద చెట్టు! ఆకాశానికి నిచ్చెనలా ఉంది. తన కాయల తోటి అందరి దాహాన్నీ తీరుస్తుంది. అందుకేనేమో, మన యజమాని దృష్టంతా ఆ చెట్టు మీదే ఉంటుంది’’ అని చర్చించుకోసాగాయి.

కొబ్బరిచెట్టు ఆ మాటలు విన్నది. వెంటనే వాటితో, ‘‘అదేమీ లేదు మిత్రులారా! మీరు కూడా తక్కువేమీ కాదు. చిన్నవయసులోనే మంచి పుష్పాలను ఇస్తున్నారు. మీ పువ్వుల పరిమళం నాకే కాదు, ఈ లోకానికే ఎంతో ఆనందాన్నిస్తుంది’’ అన్నది ఎంతో ఆప్యాయంగా.

ఆ మాటలు వాటికి సంతృప్తినివ్వలేదు. ఇంతలో ఆ ఇంటి ఇల్లాలు గుడికి వెళ్లటానికి ఒక పళ్లెంలో కొబ్బరికాయ, కర్పూరం మొదలైనవాటిని తీసుకొని పెరట్లోకి వచ్చింది. కొన్ని పూలను కోసుకుని, గుడికి వెళ్లిపోయింది.
అప్పుడు కొబ్బరిచెట్టు, ‘‘చూశారా, ఆ ఇల్లాలు గుడికెళుతూ నా కాయని, మీ పువ్వులను తీసుకుపోయింది. గమనించారా?’’ అని అడిగింది.

పూలమొక్కలు ముఖాలు చూసుకున్నాయి. ‘‘అవును సుమా! మేమిప్పుడే గ్రహించాం. ఈ లోకంలో ఎవరి ప్రాముఖ్యం వారికి. ఎవరూ తక్కువ కాదు’’ అంటూ ఆనందపడ్డాయి. వాటికి విషయం అర్థమైనందుకు కొబ్బరిచెట్టు కూడా ఎంతో సంతోషపడింది.

నీతి: ఈ సృష్టిలో చిన్నా పెద్దా, ఎక్కువా తక్కువా అనే భేదం లేదు. ఎవరి ప్రాముఖ్యత వారిదే. ఎవరి గొప్పతనం వారిదే.

- కొరబండి శ్రీనివాసరావు
 

No comments: