all

Monday, March 18, 2013

మంచి నటుడు... మంచి దర్శకుడూ కాగలడు!

 

ఇంటర్వ్యూ
డాక్టర్ కాబోయి యాక్టర్ కాలేదు చక్రి. బిజినెస్‌మ్యాన్ అయ్యాక నటుడయ్యారు. అయితే నటన కోసం వ్యాపారాన్ని వదులుకున్నారు. ఇప్పుడు నటనే లోకంగా, నటనే ప్రాణంగా బతుకుతున్నారు. ఆటోభారతి సీరియల్ ద్వారా ప్రతిరోజూ పలకరిస్తున్నారు. టాప్ 10 సీరియల్ నటుల్లో ఒకరైన చక్రి మనసులోని మాటలివి...

నటనవైపు అడుగులు ఎలా పడ్డాయి?
మాది పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం. బీఎస్సీ చేశాక వ్యాపారంలోకి దిగిపోయాను. అప్పట్లో తెలంగాణ జిల్లాలోని కుమార్ షర్ట్స్ బ్రాంచులన్నీ మావే. ఆర్డర్స్ కోసం అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి పోతుండేవాడిని. ఓసారి నటుడిగా ప్రయత్నిస్తోన్న మా అన్నయ్య ఫ్రెండ్, నన్ను కూడా ట్రై చేయమన్నాడు. కాదనడమెందుకని చేశాను. సక్సెస్ అయ్యాను.

బాగా పేరు తెచ్చిన పాత్ర ఏది?
‘ప్రియాంక’లో సిద్ధార్థ. ఓ పాత్ర ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతగా ఉంటుందనేది, అది చేశాకే అర్థమయ్యింది నాకు. ఎక్కడికైనా వెళ్తే అందరూ చుట్టుముట్టేసేవాళ్లు. నా వయసు కుర్రాళ్లు వచ్చి, వాళ్ల అమ్మలు నన్ను చూపించి, నాలా ఉండమంటున్నారని చెప్పేవారు. నాలాంటి కొడుకు ఉంటే బాగుండేదని అంటున్నారని అనేవారు.

అది పేరు తెచ్చింది. మరి నటుడిగా మీకు తృప్తినిచ్చిందేది?
‘శుక్లాం బరధరమ్’ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. అమెరికాలో పుట్టి పెరిగిన కుర్రాడి కథ. అతణ్ని తల్లిదండ్రులు బాగా పెంచుతారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఒంటబట్టిస్తారు. దాంతో వయసు వచ్చాక, ఎంతో గొప్పదైన తన దేశాన్ని చూడాలని ఇక్కడికొస్తాడు. కానీ ఇక్కడున్న అవినీతి, అరాచకాలను చూసి అల్లాడిపోతాడు. ఎలాగైనా ఈ పరిస్థితిని మార్చాలని ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. అద్భుతమైన ఫిల్మ్! అందులోని పాత్రకి అవార్డు కూడా తీసుకున్నాను.

ఇన్నేళ్ల కెరీర్‌లో... నటుడైనందుకు ఎప్పుడైనా బాధపడ్డారా?
లేదు. కాకపోతే వ్యక్తిగత జీవితాన్ని చాలావరకూ కోల్పోతుంటాం. పొద్దున్నే లేచి పరుగులు. రాత్రి ఎప్పటికో ఇంటికి చేరతాం. అవుట్ డోర్ అయితే రోజుల తరబడి ఇంటి ముఖం చూడం. అదే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

ఇండస్ట్రీలో మీకు నచ్చేది/నచ్చనిది?
ఎంతమంది వచ్చినా ఇక్కడ పని దొరకుతుంది. పైగా దాదాపు అందరూ కలసిమెలిసే ఉంటారు. కానీ నాకు నచ్చనిది ఒకటుంది. ఏమాత్రం అవగాహన లేకుండా, ఏది ఎలా చేయాలో తెలీకుండా చాలామంది సీరియల్ తీయాలని వచ్చేస్తుంటారు. వాళ్ల అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని, ఇక్కడున్న కొంతమంది మాయ చేస్తూ ఉంటారు. అంతా నష్టపోయాకగానీ వాళ్లకా విషయం అర్థం కాదు. పైగా బయటికెళ్లి ఇండస్ట్రీలో అందరూ మోసగాళ్లే అని చెప్తారు. ఇది నాకు బాధ కలిగిస్తుంది. ఏదైనా చేయాలనుకున్నప్పుడు సరైన అవగాహనతో రావాలి కదా! అలాగే ఇక్కడివాళ్లు కూడా కొత్తవాళ్లను అలా మోసం చేయకూడదు. ఒక సీరియల్ మీద నలభై యాభై కుటుంబాలు బతుకుతాయి. కాబట్టి ఒకరికొకరు సహకరించుకుని, నమ్మకంతో ముందుకు వెళ్తే ఎవరూ నష్టపోరు. ఎంతోమంది కడుపులు నిండుతాయి కూడా!

సినిమాల మీద ఆసక్తి లేదా?
ఉంది. కొన్ని సినిమాలు చేశాను. ‘నీ సుఖమే నే కోరుకున్నా’లో చాలా మంచి పాత్ర చేశాను. అలాంటి మంచి అవకాశాలు చాలా వచ్చాయి కానీ, సమయం లేక వదులుకోవాల్సి వచ్చింది.

నటన కాకుండా ఇంకేమైనా...?
కొందరు ఫ్రెండ్స్‌తో కలిసి ‘మెగా మీడియా ఈవెంట్స్’ పెట్టాను. ఆడియో రిలీజులు, పెద్ద పెద్ద కంపెనీల ప్రోగ్రాములు చేస్తున్నాం. అలాగే కొందరు నటీనటులం కలిసి ‘స్టార్ క్రికెట్ లీగ్’ పెట్టాం. ముందు ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడికి వెళ్లి, నాలుగు గ్రూపులుగా విడిపోయి మ్యాచులు ఆడతాం. వచ్చిన డబ్బును చారిటీస్‌కి ఇచ్చేస్తాం.

భవిష్యత్ ప్రణాళికలేంటి?
నటుడిగా ఎలాంటి అవరోధాలూ లేకుండా సాగిపోవాలి. అలాగే డెరైక్షన్ చేయాలని అనుకుంటున్నాను. సీరియల్, సినిమా స్క్రిప్టులు రెడీ చేసుకున్నాను. ముందు సీరియల్ తీయాలనుకుంటున్నాను. మంచి నటుడు మంచి దర్శకుడు కూడా కాగలడని నా నమ్మకం. సినిమాల్లో కమల్ హాసన్‌ని, సీరియల్స్‌లో అశోక్‌రావు, ప్రభాకర్ లాంటి వాళ్లను చూశాం కదా! నేనూ అలాంటి మంచి డెరైక్టర్‌ని కాగలనని అనుకుంటున్నాను.

- సమీర నేలపూడి
 

No comments: